May 2, 2024

అవతలి వైపు…………

రచన :  స్వాతీ శ్రీపాద

 

ఖళ్ళు ఖళ్ళున దగ్గు.

దగ్గొచ్చినప్పుడల్లా ఊపిరాడక ప్రాణం పోయినట్టవుతోంది, కాని మళ్ళీ నెమ్మదిగా తేరుకోడానికి అరగంటైనా పడుతోంది. పక్కటెముకలు, పొట్ట కండరాలు దగ్గొస్తుదంటేనే నొప్పితో బిగదీస్తున్నాయి. దగ్గుమందు తీసుకుంటే ఒకటే మత్తు . చివరకు బాత్ రూమ్ కి వెళ్ళడానికి కూడా మెళుకువ రానంత మత్తు..

ఉక్కిరిబిక్కిరయ్యే ఆ క్షణాల్లోనూ చిత్రంగా కళ్ళ వెనుక కదులుతున్నది మాత్రం వసంత మొహం. జీవితమంతా ఆమెను ద్వేషించాడు… రకరకాలుగా హింసించాడు…చివరకు ఇల్లొదిలి వెళ్ళేవరకూ ఊరుకోలేదు… అలాంటిది ఇప్పుడు ఇన్నేళ్ల తరువాత క్షణక్షణం వెన్నాడుతుంది ఆమె.

ఎందుకు ఈ ఏకాంతం లో కూడా ఎందుకింత వంచన … నిజంగా ద్వేషించావా … ఒక్కసారి ఆలోచించుకో … మనస్సాక్షి నిలదీసినపుడు నన్ను నేను వంచించుకోలేకపోయాను.

తను రావడమే నా హృదయంలో ఓ పెద్ద సంచలనం.

“తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు …”ఆ పాట ఎవరు రాసారో కాని ఎంత అనుభవించి రాసారా అనిపించింది.

అసలు దురదృష్టం కాకపోతే ఆ బాపు బొమ్మలాంటి ముద్దు గుమ్మ నాకు దొరక్కుండా పప్పుసుద్ద లాంటి అన్నయ్యకు దొరకడం …. రెపరెపలాడే ఆ పెద్ద కళ్ళు ఎన్ని భావాలను ఒలకబొయ్యగలవు? మాట్లాడకుండానే రాయభారాలు జరపటం విద్య తనకొక్కదానికే తెలుసు…

అన్నయ్య పెళ్ళి చేసుకుని తనను ఇంటికి తీసుకు రావడమే ఒక గొప్ప  సంచలనం. చెప్పాపెట్టకుండా అంతపని … ఎవ్వరూ ఊహించనైనా లేదు. ఇంటికి పెద్దవాడై ఉండి…

నో ఆ పెద్దరికాన్ని కొన సాగనివ్వను… ఆ క్షణం నించే మొదలు … అమ్మానాన్నను నా చెప్పుచేతల్లో ఉంచుకుని నేను రంగం నడిపించాలి… ఏదో రకంగా నా అధీనంలోకి రావాలి అందరూ … చివరకు వసంతతో సహా…

కనీసం ఆ సాడిస్టిక్ ఆశైనా తీరాలి…

మొదటి రోజే అన్నయ్యకు ఆవిడంటే ఉన్న గౌరవమేమిటో తెలిసిపోయింది.. అందరికీ వరసగా పళ్ళాలు పెట్టి వడ్డిస్తోంది అమ్మ..

” ఇదేమిటి అమ్మా…” వంకాయ,రొయ్యల కూరవంక చూస్తూ అడిగాడు.

అదే చెప్పింది అమ్మ

“ఒద్దొద్దు ఆ పళ్ళెం తీసెయ్  తను తినదు నేనూను ” అంటూ రెండు పళ్ళాలు పక్కకు జరిపేసాడు. అంతే ఆ తరువాత తను పక్కా శాఖాహారిగా మారిపోతాడని ఎవరూ ఊహించలేదు.

నామనసు భగ్గుమంది. కారణం వసంత కళ్ళల్లో కనిపించిన కృతజ్ఞత. సరిగ్గా అలాంటి భావమే నాక్కావలసింది,  అది నాకు దక్కకుండా అన్నయ్యకు దక్కడం … ఇన్ టాలరెబుల్.

” ఈ ఇంటికి వచ్చాక ఈ పద్ధతులకు అలవాటు పడవలసిందే ” కొంచం కరుగ్గానే ధ్వనించాయి నా మాటలు, అయినా ఎవరూ పట్టించుకోలేదు.

అది మొదలు … ఈ ప్రచ్చన్న యుద్ధానికి సమాయత్తమవడం.

ఇద్దరూ ఇంట్లో లేనప్పుడు అమ్మనూ, నాన్ననూ వేడి మీద ఎంత వంచాలో అంతగానూ వంచాను.

“ఇంటికి పెద్దవాడై ఉండి మీ లెఖ్ఖలేదన్నట్టూ ఇలాగచెయ్యడం .. మీరెందుకు ఆయనకు పెద్దరికం అంటగట్టాలి” అంటూ మొదలు పెట్టి చివరకు అన్నయ్యకు బాధ్యతలే తప్ప హక్కులు లేవని తేల్చి చెప్పాను.

చదివినది మెడిసిన్ గనక నా అవసరం ఉండి తీరుతుంది గనక నామాట వింటేనే వారిని చూసేదనీ లేదంటే పట్టించుకోననీ చెప్పేశాను. ఇద్దరికీ దిగిరాక తప్పలేదు.

ఇహ నా యుగం ఆరంభమయింది.

అప్పుడప్పుడు ఒక్కసారి నన్ను నేను ప్రశ్నించుకుంటే అన్నయ్య పట్ల వున్న ఈర్ష్య, ఆవిడ పట్ల ద్వేషంగా మార్చుకున్నానని స్పష్టంగానే తెలిసేది. అయినా అదేమిటో ఆవిడ నాఎదుటపడితే చాలు .. ఒళ్ళు మండిపోయేది. అన్నయ్యలో ఏం చూసి వాడిని వరించింది. నెమ్మది నెమ్మదిగా ఆ కోపం ఆవిడమీదే కాకుండా అన్నయ్యన్నా కలగడం మొదలెట్టింది.

పెళ్ళి చేసుకున్నాను, బాగా డబ్బున్న వాళ్ళ పిల్లను , చూడ్డానికి పెళ్ళి చూపుల్లో పెళ్ళిలో బాగానే అనిపించినా ఇంట్లో ఉన్నప్పుడు చూడాలి అచ్చం యానాది వాళ్ళలానే ఉంటుంది.

అవును చెప్పలేదు కదూ … తనకు షెడ్యూల్డ్ ట్రైబ్స్ సర్టిఫికెట్ ఉంది. పెద్ద హోదా వుంది గనక అది సర్టిఫికెట్ అనే అంటారంతా … దూరం నుండి చేసుకున్నాం ఎవరనేది ఎవరికి తెలుస్తుంది.

ఇక్కడా ఇంత వైరుధ్యమా?తక్కువ కులమైనా అన్నయ్యను ఆవిడ వలచి వరించటం ఏమిటి నా విషయంలో ఇలాగా? అందుకే నా భార్య మాట వేదవాక్కు అనేలా ప్రవర్తించేవాడిని… ఆవిడ వంటిమీద ఈగవాలినా సహించేవాడిని కాదు. అయినా అనుమానమే… ఆవిడ కళ్ళలో ఎంత తృప్తి… ఒక్కరోజూ అసంతృప్తి కనబడదేం?

బాధ్యతలు అంటూ దాదాపు అన్నయ్యతో అన్ని అప్పులు చేయించి తీసుకున్నా, తనను ఇంట్లో మనిషిలా పరిగణించకపోయినా , చివరకు ఆ వదనంపై వెలుగులో ఇసుమంత లోటు రాదేం? అందుకే నా అసహనం కూడా పెరుగుతూ వచ్చింది.

అందుకే నాన్న పోయినప్పుడు , ఉద్యోగరీత్యా అన్నయ్య ఎక్కడో ఒరిస్సాలో ఉన్నా అడ్రస్  తెలిసీ టెలిగ్రాం ఇవ్వలేదు.. అయినా మరెవరో బంధువు ద్వారా సమాచారం అంది, ఇంట్లో అద్దెకున్న వారికి ఫోన్ చేసి చెప్పారు ఫ్లైట్ లో వస్తున్నామని. శతవిధాల ప్రయత్నించా వాడు రాకముందే అంత్యక్రియలు ముగించాలని, ఉహు, మిగతావారు పడనిస్తేగా…

నా దురదృష్టం కాకపోతే అన్నయ్యకు ఇద్దరూ కొడుకులే. మాకు మాత్రం ఇద్దరూ అమ్మాయిలు, ఇక్కడా ఆవిడకే గెలుపా..

పిల్లల చదువుల విషయంలోనూ అంతే !

మామూలు స్కూల్స్ లో చదువుకుని ఇద్దరూ ఒకరు ఇంజనీర్ అయితే మరొకడు డాక్టరయ్యాడు. మంచి పేరున్న కాన్వెంట్ లో చేర్చి, కాలేజీలు, కోచింగ్ లూ ఎన్ని సమకూర్చినా చివరకు ఎస్.టీ సర్టిఫికెట్ తోకూడా ప్రెప్ కోర్స్ లో తప్ప ఐఐటీ లో సీటు తెచ్చుకోలేకపోయారు నాపిల్లలు. నేను , నా భార్య, నా పిల్లలు ఎంత ఉన్నతంగా ఉండాలని చూశామో అంత అధోగతిలో ఉన్నాము. డబ్బు లేకున్నా , ఆదరణలేకున్నా అన్నయ్య కుటుంబం ఎందుకంత చిద్విలాసంగా ఆనందానికి ప్రతిరూపులా వుంటుంది. పంపకాల విషయంలోనూ అంతే అందినంత నొక్కేసినా ఎవ్వరూ మాట్లాడలేకపోయారు.

పిల్లల పెళ్ళి విషయంలోనైనా దిగి వస్తార్లే … నేను తప్ప మరెవరు గతి అనుకున్నా… ఉహు.. ఇద్దరికిద్దరూ తమ అభీష్టం ప్రకారం తామే ఎంచుకుని పెళ్ళిళ్ళు చేసుకున్నారు.

అన్నయ్య ఉన్నంతకాలం కాస్త అదుపులో వున్నా , ఆయన హఠాత్తుగా గుండె నొప్పి వచ్చి పోవడంతో మరింత విజృంభించా.. నాకు తెలుసు అన్నయ్యకు పెద్దగా ఏ అలవాట్లూ లేవని అయినా ప్రతివారికీ అతనో తాగుబోతు అని బిల్డప్ ఇచ్చి తాగి తాగి చచ్చి పోయిన ఫీలింగ్ కలిగించా …

అంతేనా ఆవిడమీద ద్వేషమంతా పన్నెండో రోజునే వెళ్ళగక్కా … ఆవిడ వింటోందని తెలిసే…

” ఒక్క మాటా వినదు… అన్నీ తన ఇష్టమే … ఎంతో ఓపిక పట్టా… ” అంటూ

వచ్చి నిలదియ్యనే తీసింది.

” ఎందుకు వినాలి… మా ఇద్దరి ఆదర్శాలు వేరు అయినా ఇంత వరకూ మీరేం చేసినా కాదనలేదు… తనకూ నాకూ నమ్మకాలు లేనప్పుడు మీ కోసం మేమెందుకు వినాలంటూ … ”

ఆ తరువాత మాత్రం ! ఒక్క విషయమైనా నన్ను సంప్రదిస్తుందా.. అన్నీ తనే చూసుకోగలదు… నా అహం దెబ్బతింది.

వీలైనన్ని సార్లు అవమానించాలనే చూశాను.

చివరకు ఆవిడ కొడుకు కోడలు వచ్చినప్పుడు కావాలనే వెళ్ళి నానా మాటలూ అని వచ్చా… ” నేను గనక ఇంట్లో ఉండనిస్తున్నానని కూడా అన్నాను” చెలరేగిపోయి మాట్లాడాక గాని నా అహం చల్లారలేదు.

ఫలితం… కొట్టకుండానే చెంప దెబ్బ కొట్టినట్టు వారం తిరక్కుండా ఎక్కడో ఇల్లు చుసుకుని వెళ్ళిపోయింది.

అప్పుడప్పుడు మనసులో ముల్లులా ఓ భావం సలుపుతూండేది”ఒంటరి మనిషిని అన్యాయంగా ఇల్లొదిలి వెళ్ళేలా చేశానా “అని. అంతలోనే అహం నా ఆలోచనను నొక్కేసేది.

“పోతే పోనీ నేను నా కుటుంబం ” అనుకునే వాడిని.

ఉహు.. ఒక్కసారైనా మర్యాద తప్పి మాట్లాడదే, ప్రతిసారీ నేనే దోషినవుతున్నా…

అందుకే నా పిల్లలు నా మాట జవదాటరని చూపేందుకు ఇద్దరికిద్దరికీ నాకు తోచిన సంబంధాలు కుదిర్చి పెళ్ళి చేశా. పెద్దది మహా మొండి ఘటం , అప్పటికే ఎవర్నో ఇష్టపడుతోందని చూచాయగా తెలిసింది. అయితే పిల్లాడు పెద్ద అందగాడు కాదు. అయినా కులం వాళ్ళు అమెరికాలో ఉద్యోగం అంటూ చేశేసా….. రెండో దానికీ అంతే …. పిల్లడు దీనికన్నా ఆర్నెల్లు చిన్నవాడు. సన్నగా, పీలగా స్కూల్ కుర్రాడిలా ఉంటాడు. “ఎలా కనబడితేనేం చదువుకోలేదా , ఉద్యోగం చెయ్యటం లేదా ” అంటూ నోరునొక్కి పెళ్ళి జరిపించా… నా పిల్లలు నామాట జవదాటలేదని గర్వపడ్డా .. కాని … ఆరేళ్ళ తరువాత పెద్దల్లుడి అధారిటీ భరించ లేక ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి కూతురు ఆత్మహత్య చేసుకుంటుందని కల్లో కూడా అనుకోలేదు. పెళ్ళై గట్టిగా మూడేళ్ళు కాక ముందే రెండోది మాతో మాటమాత్రం చెప్పకుండా అతనితో విడాకులు తీసుకుని అమెరికన్ ని పెళ్ళి చేసుకుంది. ఆ బెంగతో వాళ్ళమ్మ తీసుకు తీసుకు పోయింది. ఇప్పుడిక మిగిలినది కొట్టుకుపోయేంత ఆస్తి .. ఒంటినిండా రోగాలు.

ఎంత డాక్టర్ నైనా పరులకు సలహాలివ్వగలను, వైద్యం చెయ్యగలను గాని నా రోగాన్ని నేను తగ్గించుకోలేకపోయాను.

ఇప్పుడూ చిత్రంగా ఆవిడే మనసునిండా … నాకూ అలాంటి ప్రేమ మూర్తి దొరికితే జీవితం ఎలావుండేదా అనిపించింది. అంతలోనే అహం తెర కమ్మెయ్యబోయింది. కాని ” వైతరిణి దాటి అవతలి తీరానికి వెళ్ళే క్షణాల్లోనైనా మనిషిగా ఆలోచించలేవా ”  అన్న ఈ సడింపు ఏమూలనుండో వీపు చరిచింది.

నిజమే .. వసంత … కాదు కాదు వదిన ఎక్కడ వుందో తెలియదు… తెలుసుకుని ఒక్కసారి నా తప్పులు ఒప్పుకుంటే …

ఎదో మగత.

ఎక్కడో పడి దొర్లి దొర్లి చివరకు ఎవరి కాళ్ళవి… వదినవా

ఆ కాళ్ళను కన్నీళ్ళతో అభిషేలిస్తున్నాను… ” అమ్మా … అమ్మా…”

తల నిమురుతున్న ఆ చేతుల్లో ఎంత ప్రేమ!

ఎంత తేలిగ్గావుంది మనసు…

మెళుకువ వచ్చింది. ఈ మధ్య క్షణం మగత క్షణం మెళుకువ గా వుంటోంది.

ఆ మగతలో పశ్చాత్తాపానికే మనసింత తేలికైతే … నిజంగా ప్రతి రెండో నిమిషం చేసిన తప్పులను ఒప్పుకుని వుంటే … ఇన్నాళ్ళూ ఇవతలివైపే బ్రతికాను … అవతలి వైపు సూర్యోదయం ఇప్పుడిప్పుడే చూస్తున్నా జీవితం పొద్దు దాటాక.

 

*********************

 

 

 

2 thoughts on “అవతలి వైపు…………

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *