May 2, 2024

హాస్యం ప్రయోజనం హాసం

రచన : డి.వి.హనుమంత్ రావు

(ప్రాచీనం, ఆధునికం అయిన కొన్ని హాస్యరచనలలో విషయాలగురించి నాకు తెలిసినంతమేరకు మీతో పంచుకునే చిన్న ప్రయత్నం ఈ చిన్నవ్యాసం.. సమగ్రం ఎంతమాత్రం కాదు
……………….. డి.వి.హనుమంతరావు.)

“చంద్రశేఖరం ! – ఒరేయ్ – చంద్రం !”
“ఏమిటోయ్ .. ఏమిటి ఇలా వచ్చావు ?
“నీకేమైనా బాకీరా నేను ?”
“ఎబ్బే ! ఏమీ బాకీ లేదే ? ఎందుకు అల్లా అడిగావు ? పాత బాకీలన్నీ తీర్చేస్తున్నావా ఏమిట్రా ?”
“ఎబ్బే ! లేదురా. నేను ఎవరెవరి దగ్గర ఏమి పుచ్చుకున్నానో ? ఏమీ ఙ్ఞాపకం లేదు. నేను
ఇదివరలో పుచ్చుకొనని వాళ్ళెవరైనా ఉంటే వాళ్ళ దగ్గర ఏమైనా పుచ్చుకుందామని వచ్చా…
నీ దగ్గర రెండు రూపాయలు ఉంటే ఇస్తూ” అన్నాడు.. ………….(మునిమాణిక్యం వారి ‘కొత్త ఎత్తు’ అనే రచననుంచి)……….


చంద్రశేఖరానికి నవ్వువచ్చిందంటారు మునిమాణిక్యం … మనకైనా నవ్వు వస్తుంది ఈ గడుసుతనానికి.
నవ్వు అని తెలుగులోఅంటే – హాసం అని సంస్కృతంలో చెప్తారు .. హాస్యం అంటే హాసం కలిగించేది లేదా నవ్వు రప్పించేది ..అని చెప్తారు పెద్దలు.
శృంగారాది రసాల సరసన పీట వేసి హాస్యానికి ఉత్తమ గౌరవ మిచ్చారు ఆలంకారికులు.
“సహవికృతి వేషాలంకార ధార్ఘ్యలౌల్య కలహాసత్ప్రోలాష….” అంటూ శాస్త్రకారులు హాస్యానికి పెద్ద నిర్వచనం ఇచ్చారు.. దాని జోలి మనకేల ?
నవ్వించేది, నవ్వుపుట్టించేది -హాస్యం అని సింపుల్ గా చెప్పుకొందాం… తమ మాటల్లోనో చేష్టల్లోనో హాస్యాన్ని జోడించి చుట్టూ వార్ని నవ్వించి ఆనందింపజేయాలని చాలామంది ప్రయత్నిస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాము… మనం ఆనంద స్వరూపులం అనేది వేదాంతపరంగా చెప్పబడే నిజం. నీలోనూ నా లోనూ ఉన్న ఆ నైజమే అలా ఆనందింప జేసే ప్రయత్నం ::: అలా ఆనందించే లక్షణం.
విషయానికొస్తే … అసలు నవ్వు ఎలా వస్తుంది ? అదేమిటండీ ఎలాగైనా రావచ్చు.. కితకితలు పెట్తే రావచ్చు..జోకు చెప్తే రావచ్చు…
జోకరులా నటిస్తే రావచ్చు…ఆగండాగండి ! నేనడిగింది ‘అసలు’ నవ్వు ఎలా వస్తుంది అని.. అంతే కాని నవ్వు అసలు ఎలా వస్తుంది?
అని కాదు. అఫ్ కోర్స్ .మీరు చెప్పింది కూడా రైటే అనుకోండి… ఇప్పుడు మనం మాట్లాడేది రస స్థాయిలో ఉన్న హాస్యం గురించి
కాబట్టి నవ్వు గురించి కాకుండా ఆ అసలు నవ్వు గురించి ఆలోచిద్దాం..
ఉన్నది ఉన్నట్టు చెప్తే నవ్వు రావచ్చు. ఉన్నది లేనట్టు చెప్తే నవ్వు రావచ్చు.. సందర్బోచితమైన సంభాషణలవల్ల రావచ్చు…
అసందర్భ సంభాషణవల్ల రావచ్చు… పదాల విరుపువల్ల రావచ్చు… పదాల కూర్పువల్ల రావచ్చు…కొన్ని సమయాలలో కొన్ని ప్రదేశాలలో
మాత్రమే రావచ్చు అన్ని సమయాలలో అన్ని ప్రదేశాలలోనూ రావచ్చు..
…. ఇందు గలదు అందులేదని సందేహంబు వలదు నవ్వు ఎందెందు వెదికి చూసిన అందందే గలదు కుశాగ్ర బుద్ధి వింటే….
(ఛందస్సు వెతక్కండి – రసాభాసవుతుంది.). అయితే పై చెప్పిన తావులందు ఎక్కడైనా లైను దాటారో నవ్వు రాదు సరికదా ..
రివర్సవుతుంది… అంటే ప్రయోక్త నవ్వులపాలయ్యే ప్రమాదముంది.. బుక్స్ ఆఫ్ ది అవర్, బుక్స్ ఆఫ్ ఆల్ టైమ్స్ అని పుస్తకాలను
క్లాసిఫై చేస్తారు జాన్ రస్కిన్ అనే ప్రముఖ ఆంగ్లకవి. అలాగ్గానే కొన్ని కొన్ని విషయాలు ఎప్పుడు తలచుకున్నా నవ్వు కలిగిస్తాయి…
కొన్నింటి ప్రయోజనం ఆ సందర్భానికే పరిమితం…
ప్రాచీన తెలుగుకవులకు సంస్కృతాంధ్రాలలో సమానమైన ప్రావీణ్యం ఉండేది.. దానితో శబ్దాలతో చాలా చమత్కారాలు చేసేవారు.

చిన్న ఉదాహరణ….
“అంబలి ద్వేషిణం వందే
చింతకాయ శుభప్రదం……
అంబలి, చింతకాయ తెలుగుపదాలు.. కాని సంస్కృత పదాలుగా విభజించి అర్థం చెప్పారు.
అం అంటే విష్ణువట, బలి ద్వేషిణం = బలిని ద్వేషించినవిష్ణువుకు వందనం అనిఅర్థం చెప్పారు. అలాగే (పరమాత్మ) చింత (నతో కూడిన) కాయం శుభప్రదమైనది అని.
రెండు మూడు అర్థాలు గల పదాలతోనూ చమత్కారం చేసిన కవులున్నారు… ఆముక్తమాల్యద ప్రబంధంలో పూలుఅమ్ముకునే మహిళల
గడుసుతనం ఈ పద్యంలో చూద్దాం…

“వెలది యీనీ దండ వెల ఎంత ? నా దండ
కును వెలబెట్ట నెవ్వని తరంబు ?
కలువ తావులు గాన మలికదంబక వేణి
కలువ తావులుల్ వాడకయ కలుగునె.”

ఇంకొకటి::
గుహలలోన జొచ్చి గురువుల వెదకంగ
కౄరమృగ మొకండు తారసిలిన
ముక్తిమార్గ మదియె ముందుగా చూపురా
విశ్వదాభిరామ వినురవేమ…….. ఉన్నదే ఉన్నట్టు చెప్తే వచ్చే నవ్వుకు ఈ పద్యం ఓ ఉదాహరణ.

ఏమీనన తా బేలన
నాముంగిటి కేల రాడు నరహరి పిన్నా
రామల ముమ్మారంపిన
ప్రేమను మరి బుద్ధి సెప్పి పిలవవె కలికీ ! — పదాల కూర్పు వలన ఓ రకం హాస్యం..
మామూలుగా చూస్తే ఓ గడుసుపిల్ల తన స్నేహితురాలితో చెప్తోంది.. “ఓ కలికీ! ఆ నరహరి ఒట్టి బేలవాడు. పిన్నవాడు.. ముగ్గురు రామలను నాకోసం పంపాడు. నా ముందుకెందుకురాడు. నేను ఏమీ అనను. ప్రేమతో బుద్ధి చెప్పి తీసుకురా… అయితే ఇందులో చమత్కారం శ్రీ మహావిష్ణువుయొక్క దశావతారాలు పద్యంలో పెట్టాడు కవి… మీనము, తాబేలు, కిటి (వరాహ), నరహరి, పిన్న (వామన), రామలు ముమ్మారు అంటే పరశురామ, శ్రీరామ, బలరామ, బుద్ధి అంటే బుద్ధావతారం, కలికి….

తర్వాతి కాలంలో…. తెలుగు సాహిత్యంలో ఫూర్తి హాస్యరచనలు చేసినవారిలో కందుకూరి వీరేశలింగంగారు మొదటివారని చెప్తారు.. అప్పటి మూఢాచారాలను మూఢనమ్మకాలను పారద్రోలడానికి వీరు తమ ప్రహసనాలద్వారా వ్యంగ్యాత్మకమైన రచనలద్వారా ప్రయత్నం చేసారు.–
ఒక రచనలో భక్తుల బలహీనతను తన పొట్టకూటికోసం ఉపయోగించుకునే దొంగ పీఠాధిపతి గురించి …
ఒక సంపన్నుగృహస్థు ఇంటికి ఓ స్వామీజి చేరారు. పాదపూజలు, భిక్షలు అయ్యాయి. సుష్టుగా భుజించారు.. విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆ ఇంటి ఇల్లాలు ఏదైన మంచివిషయం స్వామీజీ ద్వారా వినాలని…”స్వామీజీ ! భగవద్గీత తెచ్చేదా ?” అందట. “అమ్మా ! చాలా ఆయాసంగా ఉంది..చాలా పెట్టావు.. అదేదో కాస్త విశ్రాంతి తీసుకున్న తర్వాత పుచ్చుకుంటాలే .” అన్నాడట. భగవద్గీత అంటే ఏదో తినే పదార్థమనుకున్నాడా స్వామి…

చిలకమర్తి వారు, పానుగంటివారు కూడా తర్వాత రోజుల్లో సమాజోద్ధరణకోసం వ్యంగ్యాన్నే అస్త్రంగా చేసుకున్నారు. పానుగంటివారి వ్యాసాల్లో….
అఖిలాంధ్రదేశములోని దోమలు తమ మత్కుణమశక మూషాకాది సభ జరుపుకుని దానికి ఒక మూషికరాజాన్ని అధ్యక్షస్థానంలో కూర్చుండబెట్టాయి.
అందులో నరులవలన తమజాతికి జరుగుతున్న దాడులగురించి ప్రస్తావిస్తాయి…
“నరజాతి యంతటి తుచ్ఛజాతి ప్రపంచమున మరియొకటిలేదు. నరుడు మనకు శత్రుడు…తానే మహావీరుడట ! వీరాధివీరుడట …వీని గర్వము కాలిపోను! పిరికిపందలలో అగ్రగణ్యుడెవ్వడు ? నరుడు. తెలిసినదా ? (సెబాస్,, సెబాస్ అని కేకలు.)….తేలుని జూచి భయమా ? జెర్రిని గాంచి యేడుపా ?
పామును జూచి పరుగా?..దోమ కరచిపోనేమోనని సాయంకాలమగుసరికి సన్నని గుడారములో దూరినవాడు వీరుడా ? మన నల్లిపోతులలో నొక్కటి ప్రక్కజేరి కటుక్కున నంటబొడిచిన యెడల కల్లుద్రావిన వానివలె తయితక్కలాడువాడు ధీరుడా ?…” ఇలా సాగుతుంది.
ఓ దోమ తన ఉపన్యాసంలో ఇంకా దారుణమైన విషయం చెప్తుంది…..దోమజాతిలో ఇంతకు పూర్వమంత స్త్రీ వాంఛలేదట. ఏదో ఆయా కాలాలలోనే ఉండేదట… ఇప్పుడు అలా కాలం పాడు ఏమీ లేదట.. ఎప్పుడూ అదే చింత…దీనికి కారణం మనుష్యుల రక్తం పానం చేయడం వలనట……(ఎంత వ్యంగ్యం)

మొక్కపాటి వారి పేరు చెప్పగానే బారిష్టర్ పార్వతీశం గుర్తుకొస్తాడు.. వారివి ఇతర రచనలు కూడా ఉన్నాయి.. ఒక అమాయకత్వంతో కూడిన గడుసుతనం .. గడుసుతనంతో కూడిన అమాయకత్వం.. పార్వతీశంలో చూస్తాం. ఈ కథ కొంతవరకు వ్రాసి గుంటూరులో సాహితీ సహచరులకు వినిపించారట.. బాగుందని చెప్పడమే కాకుండా ప్రఖ్యాత పండితులు శ్రీ శ్రీనివాస శిరోమణిగారు స్వయంగా ఈ కథను మొక్కపాటివారు చెప్తుంటే వ్రాసారట. “బారిష్టర్ పార్వతీశం” అని ఈ కథకు నామకరణం చేసింది లబ్ధప్రతిష్టులు శ్రీ తల్లావఝుల శివశంకరశాస్త్రిగారు….
పార్వతీశం మార్సెల్స్ నగరంలో ఒక పెద్దహోటల్ లో గది తీసుకునే సందర్భం….
“బంట్రోతు నా సామాను తీసుకువెళ్ళి అక్కడొక చిన్నగదిలో పెట్టాడు. ఆ గదిముందు ఇనుపకటకటాల తలుపులు ముడవడానికి వీలుగా ఉండేవి ఉన్నాయి. గది బొత్తిగా చిన్నదిగా ఉన్నది. అందులో చిన్నబల్ల ఒకటి ఉన్నది. ఇంత చిన్న గదిలో ఉండడమెలాగు? అనుకున్నాను. మంచము వేసుకోవడానికి స్థలము లేదు సరిగదా.. బల్ల మీద పడుకుందామనుకున్నాను పొడుగు సరిపోయేటట్టులేదు. గదిలో మట్టుకు దీపం వెలిగించారు. గాలి రావడానికి ఎక్కడా కిటికీ అయినా కనపడలేదు. ఇంత పెద్ద హోటల్ లో …….. ఒకవేళ నన్నుచూచి లోకువకట్టి ఇంకొకళ్ళకు పనికిరాని గది నాకు ఇచ్చాడేమో అనుకున్నాను. నా తక్కువ మట్టుకేమిటి ? ఈ గదిలోకి వెళ్ళకూడదనుకున్నాను. సామాను అందులో పెట్టి బంట్రోతు రమ్మన్నాడు. ….. వారి భాష నాకేమీ తెలియడంలేదు. ఏమయినాసరే, నేను రాను అని గట్టిగా చెప్పాను. గుమాస్తాకూడా లోపలికి వెళ్ళమన్నాడు. ఈ గది అయితే నాకక్కరలేదు. ఇంకొక హోటలుకు వెళ్తానన్నాను. వచ్చీరాని ఇంగ్లీషులో నన్ను లోపలికి దయచేయమన్నాడు. ఆ హోటలుకు వచ్చిన వాళ్ళెవళ్ళో దొరలు, దొరసానులూ నన్ను చూసి నవ్వడం మొదలుపెట్టారు. నాకా గది అక్కరలేదు. నా సామాను ఇవతల పడవేయమని మళ్ళి చెప్పాను గుమాస్తాతో. ఇంక వాదించి లాభము లేదనుకున్నాడు కాబోలు, నన్ను చేయి పట్టుకుని బలవంతంగా గదిలోకి తీసుకువెళ్ళి తలుపు వేశాడు. వేసీ వేయడంతో గదికి గదీ హఠాత్తుగా అంతరిక్ష మార్గంలోకి ఎగిరిపోయింది. నేను హడలి పోయి… కెవ్వు మన్నాను…..”—-
మీకు అర్థమయిపోయే ఉంటుంది..పార్వతీశంగారు హోటల్ గదిలా భ్రమపడింది లిఫ్టుని చూసని.

హాస్య బ్రహ్మ భమిడిపాటి కామేశ్వరరావుగారు , మునిమాణిక్యం నిత్యజీవితంలో జరిగే సంఘటనలను తమ రచనా వస్తువుగా తీసుకొనె మంచి రచనలనందించారు…ఎఫ్.ఏ వరకు చదివిన కామేశ్వరరావుగారు పై చదువులు చదువుకోడానికి రాజమండ్రిలోని ఓ నాటక సమాజం వారు ఆర్థిక సహాయం అందజేసినందుకు కృతఙ్ఞతగా నాటికలే ఎక్కువగా వ్రాసారు భ.కా.రా.. ఆయన నాటికలలో పాత్రల పేర్లు కూడా తమాషాగా…. తలుపులు, చెవలయ్య ఇలా వుంటాయి.. రంగస్థలమ్మీద రాణించే చాలామంది మన కళాకారులు వీరి నాటకాలతోనే అరంగేట్రం చేసారనడం అతిశయోక్తి కాదు.

వీరికుమారులు శ్రీ భమిడిపాటి రాధాకృష్ణగారు.. వారిని సన్మానించుకునే భాగ్యం మాచే నిర్వహింపబడుతున్న రాజమండ్రి హాసం క్లబ్ కు కలిగింది..

శ్రీ రాధాకృష్ణగారిది చిరునవ్వు ముహం.. కామేశ్వరరావుగారు చాలా సీరియస్ … రాధాకృష్ణగారోసారి చెప్పారు…రాధాకృష్ణగారికి కాలేజీ లో ఉన్నప్పుడే సిగరెట్ అలవాటు. ఇంట్లో తెలియకూడదని జామాకులు నమిలే వారట.. అది అలా ఉంచితే మునిమాణిక్యం రాజమండ్రిలో ఎల్.టి అంటే టీచర్ కోర్స్ చదివేవారు… వీరింటికి వస్తూ ఉండే వారట. అలా ఓ సారి వచ్చారు. ఆయనకీ సిగరెట్స్ అలవాటు. మాటల మధ్యలో ఆయన సిగరెట్స్ కోసం బయటికి వెళ్ళబోయారు.. కామేశ్వరరావుగారు ఆయన్ని ఆపి…” నరసింహరావుగారు, సిగరెట్స్ కోసమే కదా మీరు వెళ్ళేది..వద్దు వెళ్ళకండి.. మా వాడిదగ్గర ఉంటాయి.” అని..”ఒరేయ్ కృష్ణా ! మాష్టారికి నీదగ్గర సిగరెట్ ఒకటివ్వరా ” అన్నారు… పాపం మునిమాణిక్యం బాధపడి..” అదేమిటి మాష్టారు.. అతను ఇబ్బంది పడతాడేమో.. అలా అడిగేస్తారేమిటి? “..అంటే భ.కా.రా.గారు ” అదేమిటి మాష్టారూ ! ఎందుకు ఇబ్బంది పడడం.. వాడి జేబులో సిగరెట్ నా డబ్బులతో కొన్నదేకదా .. ఆమాత్రం నాకు అడిగే హక్కులేదా.. ఏం ఫర్వాలేదు.” అన్నారట… దీనికి కొసమెరుపు… రాధాకృష్ణగారు అప్పడినుంచి మానేసారట.. సిగరెట్….కాదు … కాల్చాక జామాకు తినడం.
భ.కా.రా గారి ఉద్దేశ్యంలో జోకు వేసేవాడు జోకువేస్తూ నవ్వకూడదు… మిఠాయి వడ్డిస్తున్నవాడు, మిఠాయి తాను తింటూ వడ్డిస్తే ఎలా ఉంటుందో జోకువేసేవాడు వాడి జోకుకి వాడే నవ్వేస్తూ చెప్తే అలా ఉంటుందట. భ.కా.రా గారు తమ నవ్వు అనే ఒక వ్యాసంలో .. ప్రకృతివల్ల వచ్చిన స్థితికి నవ్వవద్దంటారు.. అనగా…గుడ్డీ, కుంటీ, నత్తీ, చెవిటి, అవిటి వాళ్ళస్థితిని చూచి..అలాగే దీనులూ, హీనులూ, అర్భకులు, వృద్ధులూ…ఇలాంటివారిని ఉద్దేశించి నవ్వించడం అమానుషం అంటారు.. భ.కా.రా.

1962సంవత్సరంలో అనుకుంటాను… రాజమండ్రిలో ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో తెలుగు రచయితల మహాసభలు జరిగాయి… అప్పుడు మునిమాణిక్యం, మొక్కపాటి, నోరి నరసింహశాస్త్రి, భమిడిపాటి రాధాకృష్ణ మొ||న అనేకమంది రచయితలను చూసే భాగ్యం నాకు కలిగింది… మునిమాణిక్యం వారు ప్రసంగించారు… ప్రతి అక్షరం వివరించలేను కాని ఆయన మాట్లాడిన దాని సారాంశంగా— “….

ఈ నెల జీతం మా కాంతానికిచ్చాను…లెక్కెట్టుకుంది…
‘ఏమిటండీ జీతం తక్కువ ఉందేమిటే’ అంది.
‘వాళ్ళు తీసుకున్నారే’ అన్నాను.
‘వాళ్ళెవరు ?’ –
‘గవర్నమెంటోళ్ళు’ –
‘గవర్నమెంటోళ్ళా ? ఎందుకు ?’ –
‘వాళ్ళేదో యుద్ధం చేస్తున్నారట. అందుకని….’ అన్నాను.
‘యుద్ధమా ? ఎవరితోనూ ?’ అడిగింది కాంతం.
‘చైనా వాళ్ళతోటి మన గవర్నమెంటు వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. అందుకని మా ఉద్యోగస్థులందరి దగ్గర ఓ రోజు జీతం
విరాళంగా వసూలు చేసారు.. ఇలా ఇంకా కొన్నాళు చేస్తారట….’ అని వివరించా.
‘ఆ చీనీ వాళ్ళతో వీళ్ళు యుద్ధం చేస్తారా ? దానికి మీ అందరి దగ్గర డబ్బులు లాక్కుంటారా ? బాగుందండి…. నాకు తెలియక
అడుగుతాను… మీ డబ్బులూ, మీ డబ్బులూ పోగు చేసి ఇంతోటి వెర్రిముండా గవర్నమెంటూ ఇప్పుడు యుద్ధం చేయకపోతే
వచ్చే నష్టమేమిటి… అదేదో డబ్బులున్నప్పుడే ఏడవొచ్చుకదా ? ? ? ‘

సున్నితంగా చురకలంటించే మునిమాణిక్యంవారి హాస్యమది… ఆ సందర్భానికి తగ్గట్టు ఆ సమయంలో జరుగుతున్న చైనా వార్ నేపధ్యంలో చేసిన ఈ హాస్య ప్రసంగం ఎప్పుడు గుర్తొచ్చినా నవ్వుతెప్పిస్తుంది.

ప్రాచీనకాలంలో రాజాస్థానాల్లో విదూషకుల మొదలు నేటి సర్కస్సుల్లో బఫూన్ ల దాకా హాస్యాన్ని సృష్టి చేసే ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి.. నవ్వులు పండిస్తూనే ఉన్నాయి. సినీమాల్లో హాస్య నటులు, అష్టావధానాది ప్రక్రియల్లో అప్రస్తుత ప్రసంగాలు ఆశించే ప్రయోజనం హాసమే…..నవ్వే.
గురజాడ, భమిడిపాటి రాధాకృష్ణ, ముళ్ళపూడి, భరాగో, ఎమ్బీయస్ ..ఇలా చాలా చాలా మంది తమ హాస్యరచనలద్వారా తియ్యటి తెలుగు హాస్యాన్ని అందించారు. నవ్విస్తున్నారు. నవ్విస్తారు. ఐతే నవరసాల్లో రెండవస్థానంలో ఉన్న హాస్యరసానికి అంతస్థాయి ఇవ్వగలుగుతున్నామా… విఙ్ఞులు మీరే చెప్పగలరు..

5 thoughts on “హాస్యం ప్రయోజనం హాసం

  1. manchi hasya rachayitala gurinchi chepparu .. alaage vaaru raasina koni kathalu/pustkala list ivvgalaru.
    alage telugu lo manchi haasya rachanal telupaglaru

  2. ఎన్నెలగారూ ! ధన్యవాదాలు.

    బులుసువార్కి కూడా ధన్యవాదాలు.. మీ సూచన ప్రకారము ఈ సారి ప్రయత్నిస్తాను. విజయోస్తు అనండి.

  3. నవరసాల్లో రెండవ స్థానం ఇచ్చినా, నవ్వు నాలుగు విధాలా చేటు అని అంటారేమిటో?

    వ్యాసం చాలా బాగుంది. ముళ్ళపూడి వారి గురించి, జంధ్యాల వారి గురించి కూడా రెండు ముక్కలు చెపితే ఇంకా బాగుండేది. (సమగ్రం కాదు అని మీరు అన్నా కూడా)

  4. //మీ డబ్బులూ, మీ డబ్బులూ పోగు చేసి ఇంతోటి వెర్రిముండా గవర్నమెంటూ ఇప్పుడు యుద్ధం చేయకపోతే
    వచ్చే నష్టమేమిటి… అదేదో డబ్బులున్నప్పుడే ఏడవొచ్చుకదా ? ? ? // …..:)))))‘

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *