April 27, 2024

మా వంశీ “మా పసలపూడి కథలు”

రచన :    లక్ష్మి మల్లాది హేమద్రిభోట్ల        

“వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే” అంటూ హాయిగా ఉంటాయి ఆయన తీసిన చిత్రాలు.  అందులో పాటలు శ్రావ్యం గా ఉంటాయి.  పాత్రలు కడుపుబ్బా నవ్విస్తాయి.  “దివాకరం”, “బట్టల సత్తి”, ఇలా ఆ పేర్లతో అందులోని నటులు పాపులర్ అయ్యేంతగా గుర్తుండి పోయాయి.  భుజానికి ఓ బ్యాగ్ తగిలించుకొని, చేతిలో ఓ మైకట్టుకుని అడివిలో చెట్టులు పుట్టలు తిరుగుతూ, పక్షుల పలుకులు రికార్డు చేస్తూ, సంగీతం మీద రిసెర్చ్ చేసే అమ్మాయి గుర్తుందా?,  అని ఆ మధ్య విడుదలైన సినిమాల గురించి అడిగితే, “అన్వేషణ లో భానుప్రియ” అని టకీ మని చెపుతారు.

అవును, ఈ వ్యాసం ఇలాంటి చిత్రాలు ఎన్నో తీసిన వంశీ గురించి.  కాకపోతే,  వంశీ లోని దర్శకుడి  గురించి కాదు.  అతనిలో ఉన్న రచయత గురించి, ఆయన రాసిన, నా కిష్టమైన పుస్తకం “మా పసలపూడి కథలు” గురించి. ఆ చిత్రాలు ఎంత బావుంటాయో, ఈ పుస్తకంలోని కథలు అంతకంటే బావుంటాయి.

సిటీలోని ఎడతెరిపిలేని ట్రాఫిక్ జామ్ లు  రణగొణ ధ్వనులు దాటుకుని, హైవేకి వచ్చి, దాని మీదుగా పసలపూడి చేరుకుంటే, అదిగో అక్కడ మీకు తారసపడుతాయి ఈ కథలు, ఇందులోని పాత్రలు

దారుణాలు, అరాచకాలు, కుట్రలు, కుతంత్రాలు ఓ మిక్సీ లో వేసి గిర్రున తిప్పి ఆ పేస్టు మనకి ప్రతీ రొజూ డోస్ లాగా పంచుతున్నారు కొంత మంది.  వాటినే మనం “డైలీ సీరియల్స్” అంటున్నాం.   వాతావరణంలో కాలుష్యంతో పాటు మనషులలోని కల్మషం కూడా ఇందులోని పాత్రలలో పుష్కలంగా ఉంటున్నాయి.  పైగా ప్రతీ డవిలాగు మూడు/నాలుగు సార్లు స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ తో ఉంటాయి కూడానూ.   ఒక అయిదు నిమిషాలు చూస్తే చాలు, రోజుకి సరిపడా నెగటివిటి ఉంటోంది వీటిల్లో.

ఇలాంటివి ఏవీ లేకుండా, పచ్చటి పంట పొలాల మీదుగా వచ్చే స్వచ్చ మైన గాలిలా ఉంటాయి వంశీ రచనల్లో కథలు, అందులోని పాత్రలు.  ఖరీదైన సెంట్లు, స్ప్రేలు ఎన్ని ఉన్నా తొలకరి పడినప్పుడు మట్టి నుంచి వచ్చే వాసనకి సాటి రావు.  అలా, ఆ మట్టిలోని, చెట్టులోని, అక్కడ వారు కట్టుకున్న గూటి లోని  పరిమళాలని మోసుకొస్తాయి ఈ కథలు.

ఎండలో నడిచి వచ్చిన వారికి కుండలోని చల్లటి నీరు ఇస్తే ఎలా వుంటుందో, వారు త్రాగి ఎలా సేద తీరుతారో, అలా ఉంటుంది ఈ పుస్తకం చదువుతుంటే.

కథ రాయడం అంటే స్టోరీలు చెప్పినంత వీజీ కాదు.  ఒక మూడు నాలుగు పేజీలలో కథ అయిపోవాలి.   ప్రతీ కథకీ ఒక బలమైన కధాంశం ఉండాలి.   మొదటి నుంచి చివరి వరకు ఆసక్తిగా చదివించేలా వ్రాయగలగాలి.  ఆ కథ సాగే తీరు “తరువాత ఏమవుతుందా” అనిపించేలా ఉండాలి.   ముగింపు మనల్ని ఆలోచింప చేసే విధంగా ఉండాలి.

ఈ పుస్తకం లో ఇలా చదివించే  72 అధ్భుతమైన కథలు ఉన్నాయి.

మట్టికి, మనిషికి, మనుగడకి దగ్గిరగా, కృత్రిమం లేకుండా ఉంటాయి ఇందులోని పాత్రలు.  ప్రతీ కథలోని ఇతివృత్తం ఇందుకు అద్దం పడుతుంది.   సహజం గా ఉండే సన్నివేశాలు, వాటిని వర్ణించే తీరు గమనిస్తే, వంశీకి చిత్రాలలో స్క్రీన్ ప్లే మీద ఉన్న పట్టు, ఇలా కథలు రాయడంలోనూ ఉంది అనిపిస్తుంది.  చదవడం మొదలు పెట్టినప్పటి నుంచి అందులో ఎప్పుడు లీనం అయిపోయామో మనకే తెలియకుండా పేజీలు తిప్పేలా చేస్తాయి ఈ కథలు.   ఆ గోదారి ఎలా అయితే మలుపులు తిరుగుతూ, అవసరమైన చోట తన దిశ మార్చుకుంటూ పరవళ్ళు తొక్కుతూ ఉంటుందో, ఇందులోని కథలు కూడా అలాగే మలుపులు తిరుగతూ సాగుతాయి.

ఈ 72 కథలలోని ముఖ్య పాత్రలు అతి సామాన్యంగా ఉంటూనే అత్యధ్భుతం గా మలచబడ్డాయి.  మనిషికి కావలసింది చదువు, డబ్బు – నిజమే.  కానీ వీటి కంటే ముఖ్యమయినది ఒకటుంది.  అదే సంస్కారం.  అది లేనప్పుడు మిగితావి ఎన్ని ఉన్నా లేనట్టే.  ఆ సంస్కారం ఉట్టి పడుతూ ఉంటాయి ఈ పాత్రలు.  వారు పెద్దగా చదువుకున్న వారో, బాగా డబ్బున్న వారో కాకపోవచ్చు, కానీ గొప్ప సంస్కారం ఉన్నవారు.

మనుషులు మంచితనం గురించి “రామభద్రం చాలా మంచోడు” లో చదువుతాం మనం.   అరవై ఏళ్ళ “రామభద్రం కథ ఇది.  కాలితో తొక్కే ట్రేడిల్ మిషన్ మీద శుభ లేఖలు, కార్డూలూ ప్రింట్ చేసే రామభద్రం, వడ్డీ వ్యాపారం కూడా చేస్తూ ఉంటాడు.  ఇందుకు నోట్ ఏమీ రాసుకోకుండా కేవలం నోటి మాట మీద, అతి తక్కువ వడ్డీకి అప్పు ఇస్తూ ఉంటాడు.  నలుగురికి వీలైన సాయం చేయాలి అనుకునే మనిషి రామభద్రం.  ఆ ఊళ్ళో ఒకరింట్లో చిన్న పిల్ల స్కూల్ కి వెళ్ళను అని మారం చేస్తుంటే, ఆ అమ్మాయిని తన బండి మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళి ఇస్ క్రీమ్ ఇప్పిస్తాడు.  పులిబొమ్మ కావలంటే  దానితో పాటు మేక బొమ్మ, కుక్క బొమ్మ కూడా కొనిపెడతాడు.   మరి ఇన్ని కొని పెట్టిన ఈ తాత మాట వింటావా?  అని అడుగుతాడు.  “ఓ వింటాను” అంటుంది.  “కాన్వెంట్ కి వెళ్దాం పదా” అంటాడు.  అమ్మో, “అరుణా మిస్సు కొడుతుంది”, అంటుంది.  నే చెప్తా గా అని తీసుకెళ్ళి, కాసేపు అక్కడున్న పిల్లలతో ఆడి ఆ అమ్మాయిని అక్కడ వదిలి వస్తాడు.  ఆ పిల్లలతో పాటు కలిసి పోయి ఆడుతున్న రామభద్రాన్ని చూసి, “ఇతని వయసేంటి, ఆ పిల్లల వయసేంటి” అని ఆశ్చర్య పోతారు టీచర్లు.  అలా వచ్చిన ఆ అమ్మాయి ఇంకెప్పుడు స్కూల్ మానదు.    ఇంకో సారి – పండక్కి పిల్ల అల్లుడు వస్తారు, బట్టలు కొనాలి, మర్యాదలు చేయాలి – అని దిగులుగా కూర్చున్న ఇంకొకరికి, తన కుటుంబంతో పాటు వాళ్ల అందరికి కూడా బట్టలు కొని, జేబులో అయిదు వందలు పెట్టి, “నువ్వు ఇవ్వ గలిగి నప్పుడు ఇవ్వు” అని చెప్పి పంపిస్తాడు.    కొడుకుల మీద అలిగి అన్నం తినకుండా పడుకున్న ఓ పెద్ద మనిషి దగ్గర కెళ్ళి, నేను అలాగే ఇంట్లో గొడవ పడి వచ్చాను, ఆకలేస్తోంది అని ఆ మాట ఈ మాట చెప్పి, ఇద్దరూ అన్నం తిన్న తరువాత ఆయన ఇంటికి తీసుకెళ్ళి ఆ పిల్లలకి మంచి చెప్పి, ఆయనను ఇంట్లో దింపి  వస్తాడు.  ఇదంతా చూసిన అతని దగ్గిర బంధువులు, “నీకూ పిల్లలున్నారు.  నీ జాగ్రత్త లో నువ్వు ఉండాలి, ఇలా పైసా కూడా దాయకుండా ఉండొద్దు” అంటే నవ్వేస్తాడు.  అలాంటి రామభద్రం మరణిస్తాడు.  అప్పటి ఖర్చుకి తలా కొంత వేసుకుని ఆయన పిల్లలకి సాయం చేస్తారు ఆ దగ్గిర బంధువులు.  ఇది అయిన కొన్ని రోజులకి ఆ పిల్లల దగ్గిరికి ఒకాయన వస్తాడు.   రామభద్రం గారు ఏ కాయతం రాయించు కోకుండా పాతిక వేలు ఇచ్చారు – ఇదిగోండి అసలు వడ్డీ అని.  ఒకావిడ లక్ష రూపాయిలు, వడ్డీ ఇచ్చి – “ఇదిగో బాబూ చింపేద్దావంటే నోటు రాయలేదు, ఆ మనిషి నిజంగా దేవుడు” అని వెళ్తుంది.  అలా వారం రోజుల పాటు జనం డబ్బిచ్చి వెళ్తూనే ఉంటారు.  “మంచితనానికి ఇంత విలువా ఉందా” అని ఆ బంధువులు అనుకుంటుండగా కథ ముగుస్తుంది.

కానీ ఇది కలికాలం కదా.  ఈ రోజుల్లో మంచితనాన్ని ఎలా వాడుకుంటారు అని కూడా చూపిస్తాడు వంశీ “మేట్టారు సుబ్బారావు”  కథలో.  తను చదువుకోక పోయినా నలుగురిని చదివించాలి, అందుకు సాయపడాలి అనుకునే పాత్ర ఇది.   ఎవ్వరు వచ్చి “మేము టెన్త్ పాస్ అయ్యాము, ఇంకా చదువుకుందాము అనుకుంటున్నాము, కానీ డబ్బులు లేవు” అనో లేక “పక్క ఊరి కెళ్ళి చదూకోవాలి, ఖర్చు భరించ లేము” అనో అంటే, “మీ చదువు ఆగకూడదు” అని అడిగిన వారికల్లా డబ్బులు ఇచ్చి పంపిస్తూ ఉంటాడు.  ఇది తెలిసి కొంత మంది – “చదువుకుంటున్నాము కానీ డబ్బులు లేక ఆపేస్తున్నాము” అని ఆయనని ఎలా మాయ చేసి, డబ్బులు తీసుకొని మోసం చేసారో చెప్తాడు వంశీ కథ చివర్లో.  ఇలా చేస్తున్నారు అని తెలిస్తే ఆ సుబ్బారావు ఏమయిపోతాడో అని బాధ పడుతాడు.  మనకీ అలాగే అనిపిస్తుంది ఆ కథ చదివితే.

ఇలా ప్రతీ కథలో ఒక వైవిధ్యాన్ని ప్రదర్శించారు వంశీ.  ఆ ఊరు, వాతావరణం, మనుషులు గురించి వివరిస్తూ, మధ్యలో అక్కడి విషయాలు, విశేషాలు చెప్తూ, కథ ముందుకు తీసుకు వెళతారు. అలా వెళుతూ, కథ చివరిలో అప్పటి జీవనానికి,  మారుతున్న పరీస్తుతలకి మధ్య వ్యత్యాసం ఎలా ఏర్పడుతోందో,  ఎలా అక్కడ కూడా  మార్పులు చోటు చేసుకుంటున్నాయో అద్దం పట్టి చూపిస్తారు.  చదివే వారిని కూడా ఆలోచింపజేస్తారు.

తెలుగు భాష లో రచన గ్రాంధికం నుంచి వచనం లోకి, వచనం నుంచి మాండలీకం లోకి మారుతూ వచ్చింది.  ఎలా రాసినా, ఆ భాష యొక్క తీయందనం ఎక్కడా తగ్గలేదు.  ఈ కథలు దిగువ గోదావరి ప్రాంతంలో, అక్కడి యాసలో రాయబడినవి.  ఆ భాష, అ యాస ఎంత అందంగా ఉంటాయో ఈ కథలు చదివితే మనకి తెలుస్తుంది.  ఇక్కడ మరొక మారు నేను చెప్ప దలుచుకున్నది, ఆ భాషతో ముడివడిన కథలలో కనపడే సహజత్వం, వాస్తవికత గురించి.  ఇవి మనల్ని కట్టి పడేస్తాయి.  మళ్ళీ మళ్ళీ చదివేలా చేస్తాయి.

ఇక వాడడం మర్చిపోయిన తెలుగు పదాలు,  అప్పటి వాడుక లో ఉన్న పదాలు ఇలా ఎన్నో ఇందులో ఉన్నాయి.  ఉదా:

చల్దిపోద్దు వేళ (అంటే ఉదయం చద్దన్నం తినే సమయం అన్నమాట); రొంపజొరం;  మెళ్ళగుళ్ళు;  గోరోజనం;  ఆనబగాయలు;  హరికెన్ లాంతరు;  అన్నపూర్ణ కావిడి;  రొట్టిబిస్కోతు బండి – ఇలా ఎన్నో పదాలు.  (నా చిన్నప్పుడు గంట కొట్టుకుంటూ, “మీనా బిస్కెట్లు” అని రాసి ఉన్న బండి రాగానే, మేమంతా పరిగెత్తి వెళ్ళి అవి కొనుక్కు తినేవాళ్ళం)

పాత్రల పేర్లు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.  ఎన్నో పాత్రలు, కథలో ఉన్న పాత్రలు, అవి ఇంకా ఎందరి గురించో చెప్పే ఎన్నెన్నో విశేషాలు, వీటన్నటికి ప్రాణం పోస్తాయి ఈ పేర్లు:  కర్రోరి సుబ్బులు, బ్రాకెట్టు ఆదిరెడ్డి, సొల్లు కిట్టయ్య, కుమ్మరి కోటయ్య, పర్లాకిమిడినాయుడు, రత్నేశ్వరరావు, మేర్నిడి సుర్రావు, గవళ్ళ అబ్బులు – ఎన్నో, ఇంకెన్నో.

చదవగానే చిరునవ్వు వచ్చే వాక్యాలు ఇందులో కోకొల్లలు:

“ఆ వార్త వినగానే రొట్టె ముక్కలో డబ్బాడు తేనేపాకం పోసినంత ఆనందం కలిగింది”

“కమలకి తెలుపురంగంటే ఇష్టం… ఆకు సంపెంగలంటే ఇష్టం… బిందెలకి బిందెలు నీళ్ళు వెత్తిపోసుకోవడం ఇష్టం…పూరీలు, బంగాళదుంపల కూరంటే ఇష్టం.  శారద సినేమాలోరేపల్లె వీచెను పాటంటే ఇష్టం”.

“వేసవి కాలం వచ్చేసింది.  లైఫ్ బోయ్ సబ్బు సగం అరిగేదాకా రుద్దుకుని రెమీటాల్కం పౌడరు డబ్బాలో పౌడరు జల్లుకుని బయటికొచ్చిన పావుగంటకి కారిపోతా చెమట్లు ఒకటే జిగట”.

అలా మనం నవ్వుతూ చదువుకుంటూ వెళుతుంటే ఉన్నట్టుండి అక్షరాలు ఎందుకు మసకగా ఉన్నాయా అని చూసుకుంటే – ఆ పాత్రలతో పాటు మనమూ అప్పటివరకు పయనం సాగించి, చివరిలో ఆ కథ ముగింపు చదువుతూ, గుండె బరువెక్కి వచ్చిన కన్నీళ్ళు అవి – అని అర్ధం అవుతుంది.  అంత అధ్బుతం గా రాసారు ప్రతీ కథని వంశీ.

స్వాతి వీక్లీలో 72 వారాలు ఈ కథలు ప్రచురితమైనప్పుడు ఒక్కో వారం ఒక ప్రముఖ వ్యక్తి వీటి మీద వారి అభిప్రాయాలు వ్యక్తం చేసే వారు (వంశీ ఈ పుస్తకం ఆ 72 మందికి ఈ పుస్తకాన్ని అంకితం ఇచ్చారు).  అందులో మచ్చుకి:

“అలనాటి శ్రీపాద, మల్లాది మరునాటి తిలక్, భరాగో ఈనాటి నామిని, ఖదీర్ బాబు, సోమరాజు సుశీలలకు సాటిగా తెలుగుదనపు అక్షరభావరూప దీపాలను వెలిగించి – శంకరమంచి అమరావతి కథలు, నారాయణ్ మాల్గుడి కథలు, చెస్టర్ టన్ “ఫైవ్ టౌన్స్” కథలు వంటి పల్లెపట్టు రసపట్టు సౌరభాలను మించి గుబాళించి రచించిన కథా వివరించి చిరంజీవి వంశీ “మా పసలపూడి కథలు”కి ముళ్ళపూడి జూహార్లు.

–      ముళ్ళపూడి వెంకట రమణ.

“మన కళ్ళముందు దృశ్యం మెదిలేట్టు చెప్పగలగడం వంశీ ప్రత్యేకత.  ఈ పసలపూడి కథలు ఆణిముత్యాలు”.

–      డా!! వేదగిరి రాంబాబు.

చిన్నప్పటి జ్ఞాపకాలు పెద్దయిన తరువాత తీపి గుర్తులుగా మిగిలిపోతాయి.  ఆ జ్ఞాపకాలను కథారూపంలో రాసుకోవడం ఎంతో ముచ్చటను కలిగించే విషయం.  ఎన్నో తియ్యటి జ్ఞాపకాలను కాగితం మీద పెట్టాలనుకుంటాం.  అది అందరికీ సాధ్యపడే విషయమా!  కొంతమందికే … వంశీ “మా పసలపూడి కథలు” చదువుతుంటే చదివినట్టుగా కాకుండా ఆ పాత్రలతో కలిసి ఆ ప్రాంతాల్లో మనం తిరుగుతున్నట్టుగా వుంటుంది.  కొత్త ఆవకాయలోని ఘాటు, పూతరేకులోని స్వీటు, వేపకాయలాంటి చేదు … కలగలిపితే ఉగాది పచ్చడి … వంశీ కథ.

–      బ్రహ్మానందం

ఇక ముందుమాటగా బాపు రమణల చిన్ని లేఖ తో పాటు వంశీ చిత్రరేఖ ఎంతో బావుంటుంది.  బాపు వేసిన అట్టమీద బొమ్మ, పుస్తకానికి ఇంకా అందం సంతరించి పెడితే, ఆయన కథలకి వేసిన బొమ్మలు ఆ పాత్రలలో భావం నింపి జీవం పోశాయి.

“ఒకసారి నెమరేసుకుందాం” అని ప్రముఖ సాహితీ వేత్త చినవీరభద్రుడుగారు ఈ పుస్తకం పై రాసిన అధ్భుతమైన విశ్లేషణ  కూడా ఇందులో పొందుపరిచారు.

ఇది, అందరూ మెచ్చిన, నాకు ఎంతో నచ్చిన – వంశీ “మా పసలపూడి కథలు”.

 

.

 

6 thoughts on “మా వంశీ “మా పసలపూడి కథలు”

  1. గోదావరి జిల్లాల వారినే కాకుండా అందరిని మైమరిపిస్తోంది ఈ కథల సంపుటి.
    చదివినంతసేపు ఎవరైనా ఒక రకమైన తన్మయత్వానికి గురవుతారు. ఆ మాండలికం,పాత్రల పేర్లు ,కథనం తీరూ అన్ని ఎవరైనా సరే ఓన్ చేసుకుంటారు చదువుతున్నంతసేపు.

  2. ఎన్ని సార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే కథలు ఇవి. గోదావరీ తీరాలని, వాటి అందాలనీ, అక్కడి జనాల బ్రతుకు విధానాన్నీ బాగా చూపిస్తారు. చదువుతున్న కొద్దీ ఆస్వాదిస్తూనే ఉంటాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *