April 27, 2024

సరస్వతీపుత్రుడు – రూ 500 బహుమతి!

 

రచన : ??? చెప్పుకోండి చూద్దాం…

ఈ రచనాశైలిని గుర్తుపట్టగలరా??   ఈ వ్యాసం రాసిన వ్యక్తిదే   ఈ సంచికలో మరో రచన ఉంది?? ఎవరో చెప్పుకోండి మరి.. రెంటినీ గుర్తుపట్టిన వారికి రూ 500 బహుమతి.. మీ సమాధానాలు పంపడానికి ఆఖరు తేదీ.. మే. 20..

 

 

ఒకదినము రాకుంటెఓరంత కన్నీళ్ళు

కన్నీటిలో చూపుకదలిపోయింది

ఒకదినము రానంటెఓరంత దుఃఖమ్ము

గద్గదికతో గుండెకమిలిపోయింది

ఒకదినము లేకుంటెమొకముపై చిరునవ్వు

నెకబొమ్మలో పెటలిచిటలిపోయింది

ఒకదినము నేనుంటెఒయ్యారముగా వచ్చి

మనసులో తొలివలపుపెనవేసుకుంది

ఆనాడు

ఈనాడొ!

 

తన కొప్పులో బొండుమల్లెలాటి కవితను బావ మనసునుండి రప్పించిన ఆ అమ్మడెవరో? ఆ వగలు,హొయలు చూస్తుంటే యెంకి గుర్తొస్తూంది కానీ యెంకి కన్నా చిన్నవయసు పిల్లలా అగుపిస్తూంది. పైకి అమాయికంగా ఉన్నా ఎదలో గుబులు రేకెత్తించే పిల్లలా ప్రమాదకరంగా, ప్రమోదకరంగానూ కనబడతా ఉంది. ఈవిడను పలకరించకుండా ఆగడం కష్టమేను.

 

ఇంతకూ ఎంకిని సృష్టించిన ఆ సుబ్బారావుగారికి ఎసరు పెట్టిన ఈ మనోజ్ఞకవనసీమావిహారి ఎవరు?

 

********************************************

 

లేవండోయీ

బానిసలాలా

లేవండోయీ

పీనుగులాలా

 

కళ్ళలొ నూతులు

కాలేకడుపూ

కూటికిమాడే

గువ్వల్లాలా

 

లేవండోయీ

బానిసలాలా

లేవండోయీ

పీనుగులాలా

 

ఎముకలు చీకిన

హిందువులాలా

ఇల్లులేని పసి

పిల్లల్లాలా

 

లేవండోయీ

బానిసలాలా

లేవండోయీ

పీనుగులాలా

 

చీకటులాడే

జీవములాలా

చింతాసర్ప వి

జీర్ణితులాలా

 

..

..

 

ఆకలిమంటల

హాహాకారము

బ్రదుకే చచ్చిన

బానిసలాలా

 

లెమ్ము, లెమ్మిదె లెమ్మని జాతిని ఉత్తేజపర్చడానికి ప్రయత్నిస్తున్న ఆ బాధాసర్పద్రష్టకంఠం బాధ హృదయాంతరాళాన్ని ఫెటిల్లుమని తాకుతూంది. ఏ పీడిత తాడిత వర్గహృదయ ఘోష ఇది?

 

ఈ అగ్నివీణ మీటిన అభినవకవనాసృజనధురీణవిరించి ఎవరో? శ్రీ ’ద్వయ’ మంత్రాన్ని తన హృదయకుహరంలో ప్రతిష్టించి కవిత ద్వారా ఆవిష్కరించిన ఈ శ్రీమాన్ విశిష్టాద్వైతి ఎవరు?

 

********************************************

 

గిల్లుకోవోయి మెలమెల్లగా చెయిజాచి

ఒరిగిపోతుందేమొ, సురిగిపోతుందేమొ,

పెరటిమంటలొ రాలి, పెటలిపోతుందేమొ,

కనులు విప్పని క్రొత్తకారు నవ్వులపంట

 

గిల్లుకోవోయి మెలమెల్లగా చెయిజాచి

తావి లేదంటావు తొలిప్రాయమంటావు,

రేకుల్లొ ఒకవింత రంగు లేదంటావు

రంగురాజ్యాలకేమీ గానీనీకయ్యె

కుంగిపోతున్నాది కొదవడ్డమనసుతో

 

గిల్లుకోవోయి

 

(పై కవిత గీతాంజలిలోని “Pluck the flower” కు కవి అనువాదం)

 

సిగ్గుతో, మోమాటంతో నిలబడ్డ భక్తుని ప్రార్థనకు మెత్తటిచిఱునవ్వుతో సమాధానం చెబుతున్న ఈ కవిత్వపు హృదయకుసుమం ఎవరిది?

 

రవీంద్రుని కవితాకుసుమపు తావికి తెలుగు బంగారపు జిలుగు నగిషీ సోకించిన వెంకటాచలం (తిరుమల) పేరు ఏ కవి ఇంటి పేరు?

 

********************************************

 

కొండలో, కోనలో,

క్రొందలిరుటాకులో

నీ నటన లేతోచు

నీ మాయ లేపూచు

మనసులో, తలపులో

మర్మరధ్వనులలో

నీ పాట లేతోచు

నీ మాట లేపూచు

రక్తబిందువులలో

రసిక గీతములలో

నీ విభ్రమమె తోచు

 

భావుకత్వం అరుణరాగంలా భాసిస్తూన్న ఆ రసికగీతం ఏ కృష్ణశబ్దపు మాధురీశకలం? కృష్ణావతారమెత్తిన ఆ నారాయణ మూర్తి ఎవ్వాడు?

 

********************************************

 

అల్లన లేతతీవెల యొయారముగానును వేపపూల పం

దిళ్ళను దీర్చినారు వనదేవత, లీ మహనీయ వాటిలో

చల్లని రాజు మాధవుడు సాక్షి పురోహితుడుండ, ప్రేమ సం

ఫుల్లములైన మా హృదయముల్ పెనవైతము రమ్ము నెచ్చెలీ!

 

అలసిన లేయెడంద గుదురై ప్రణయార్చన సేయజాలు ని

ర్మలమదిరా ప్రపూర్ణము కలారస పాత్రిక దెమ్ము, కన్నులన్

పలపలరాలు దుఃఖమయ భాష్పముల న్నులి వెచ్చ జేసి చె

క్కులు జిగురింపగా దడిపికొందును బీటలువడ్డ వాతెరన్.

 

 

కరుణశ్రీ గారి కవితలో కారుణ్యాన్ని తన కవితలో శ్రీకారంగా సాక్షాత్కారింపజేసిన ఆచార్యశ్రీ ఎవరు?

 

********************************************

 

ఒక శ్రీశ్రీని, ఒక చలాన్ని, ఒక నండూరి సుబ్బారావును, ఒక కృష్ణశాస్త్రిని, ఒక జంధ్యాల పాపయ్యశాస్త్రిని తన కవిత్వపు పార్శ్వాలుగా మలచి చూపెట్టిన ఆ కవి…కాదు కాదు నవనవోన్మేషప్రతిభాశాలి….కాదు కాదు పండితుడు…

మనస్వి, తపస్వి, సుమధురవచస్వి …………..

 

 

 

 

 

 

 

 

 

శ్రీమాన్ పుట్టపర్తి (తిరుమల) నారాయణాచార్యుల వారు.

 

ఆశ్చర్యంగా ఉండవచ్చు. ఈయన శివతాండవమే కాదు, కవిత్వంతో ప్రబంధాల్ని సృజించగలరు, మహాభారతవిమర్శనతో వ్యాసమహర్షి హృదయావిష్కరణ అనన్యసామాన్యంగా చేయగలరు, “మా తెలుగు తల్లి” ని ఆంగ్లంలో ఆశువుగా ఆలపించగలరు,ప్రబంధనాయికలతో గుజ్జనగూళ్ళు కట్టించగలరు, మేఘసందేశాన్ని నవ్యంగా వినిపించగలరు, అన్ని సార్లు అనేకులు చెప్పిన రామాయణాన్ని జనప్రియంగా గుబాళింపజేయగలరు…

అంతే కాదు భావకవితలను హృద్యంగా ఆవిష్కరించగలరు. అది ఒక్క సరస్వతీపుత్రునికి మాత్రమే సాధ్యం. పై కవితలన్నీ నారాయణాచార్యులవారి అగ్నివీణ అనే ఖండకావ్యం లోనివి.

 

********************************************

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *