May 26, 2024

అక్షర పరిమళాల మమైకం – ఈ కవిత్వ “మరువం “

పుస్తక సమీక్ష: శైలజా మిత్ర sailaja mitra

 

 

 కొండ పాదాన పాకుడు రాళ్ళ సోపానం

నది పయనం శిఖరాగ్రానికి చేరేనా ?

సైకత మేతల్లో స్రవించే త్రుళ్లింత

రేయిలోను మెరిసేటి పాషాణపు చెమరింత “

ఇది కవయిత్రి ఉష గమకాల గమనం.

ప్రపంచపు నైరాశ్యపు నిశీధిలో కొలిచే కొలమానాలు రెండే రెండు.  ఒకటి అక్షరం మరొకటి ఆశయం . ఈ రెంటికీ ఒకదానిని అనుసరించి మరొకదానికి అనుసంధానం అనేది జరుగుతుంటుంది. మాట్లాడటానికి అక్షరం కావాలి . కవితా రచనకు అక్షరమే కావాలి . అంటే అను అనుసరించి అలాగే ను అనుసరించి ఉంటాయి. ఆశయ సిద్ధికి అక్షరం కావాలి. అలాగని అక్షరం ఒకటి ఉంటే సరిపోతుందా అంటే అందుకు ఆలంబనగా ఆశయం ఉండాలి. అలాంటి స్థితి ఉన్న కవిత్వం రాస్తున్న కవయిత్రి ఉష

 

 usha2

 

ఉష కవిత్వంలో వస్తువు బలంగా ఉంది . ఆకలికి ఇంకా ఆకలి తీరలేదుఅనడం లోనే కవిత్వం ఉంది . ఈ కవితలో అంటారు

ఆకలని వ్రాయను డు ము వు ల విభక్తులక్కరలేదు

ఆకలి ఆక్రందనకు శృతి లయ లవసరం లేదు

గాలికి మల్లె కంటికి ఆనదు. జటరాగ్నికి మాత్రం తానే ఆజ్యం

వయోబేధమెరుగదు రుచి శుచి చూడనీయదు “

అనడంలో సమాజంలో ఉన్న మొదటి సమస్య ఆకలిపై  ఏమాత్రం స్పందించని వ్యక్తులపై ఆవేదన ఎంత ఉంది? అనిపించక మానదు. కవి సమస్య ఏదైనా స్పందించక మానరు , కాని ఏ విధంగా స్పందిస్తారు అనేది ఆలోచించాల్సిన విషయం. కొందరు ఆకలికి పడుతున్న ఆవేదనను వివరిస్తారు , కొందరు ఆకలికి గల కారణాలను నినదిస్తారు . మరికొందరు ఆకలి ఎందుకు తీర్చలేక పోతున్నాము అనే ఆవేదన చెందుతారు . ఇక్కడ మూడో కోవకు చెందినా వారే కవులు గా మిగిలిపోతారు. ఎందుకంటే ఆకలి ఆవేదన అందరికీ తెలుసు.  ఆ ఆకలి ఎందుకు మనం ఎదురు చూస్తున్నామో అందుకు కారణాలు తెలుసు . కాని మనకు తెలియనిది ఒక్కటే మనం ఎందుకు తీర్చలేక పోతున్నాము అనేదే.  ఆ విషయం లో ఈ కవయిత్రి కృతకృత్యులయ్యారనే అనిపిస్తుంది.

కవి హృదయం ఎన్ని రకాలుగా స్పందనకు గురి అవుతుందో మనకు తెలుసు. ప్రకృతి , పక్షి , పల్లవి , పాత , పరుగు , నడక , చెట్టు, పుట్ట , గట్టు , పువ్వు , గవ్వ , ప్రతీదీ కవితా వస్తువులే కాకుంటే వాటికి భావమనే దారానికి గుచ్చితే కవితా మాలగా తయారవుతుంది. ఇక్కడ గమనించండి

కన్నె తూరుపు వెచ్చదనాల కావిళ్ళు

గడప గడపకీ పంచి

పడమర కాంత కవ్వింత కౌగిళ్ళకి

పరుగులు తీసి సూరీడు

 

జాజుల రాత్రులు జావళి పాటలు

జంట హృదయాల తుంటరి సరాగాలు

జాబిలీ నవ్వులు , వెన్నెల జాగారాలు

వేకువ కళలు , నిత్య జీవన రేయింబవళ్ళు

ఇలా హృద్యంగా సాగుతుంది వీరి కవిత.

ఉష  కలానికి కొత్తదనం ఉంది. అభివ్యక్తీకరణలో ఖచ్చితత్వం ఉంది. ఆలోచనల్లో సౌందర్యం ఉంది . శిల్పం అక్షరాలలో కనిపించాలంటే అక్కడ సౌందర్యం ఉండి తీరాలి.

ఇందులో శిల్పాన్ని గమనించండి

దృశ్యానికి, అదృశ్యానికి నడుమ విన్యాసం

సర్పంలా సాగిన నీడ

గోడ  మూలలో  పడగ విప్పింది

చీకటికి, దీపానికీ సమరం

నీడ రూపు మార్చింది

నేలబారున తాబేలు ఈ మారు

మూడో అడుగుకి కృంగి

దేహపు అరలోకి మటు మాయం “

ఈ వాక్యాలలో ఎంతటి సౌందర్యం దాగుందో గమనించండి. ఏ పదమైనా కాస్తంత విశ్రాంతి కోరుకుంటుంది  . కాని వీరి కవిత్వంలో పదాలు పరుగులు తీస్తాయి .

నీడ వెంట చూపులు

మలగని ఆలోచనల దీపాలు అంటూనే

కూలని గోడల కోట , గతం

చెదరని ఘరగని నీడలా అక్షయం”

అని ముగించడంలో ఎంత హృద్యంగా ఉంది అనిపించక మానదు .

ఆకాశం ఎవరికీ అర్థం కాని ఒక కావ్యం . అందులో ఎన్ని గోళాలు ఎందుకు తిరుగుతున్నాయో ? ఏ గోళం దేనికి సంకేతంగా నిలుస్తుందో కాని నిశ్శబ్ద కావ్యం అర్థం మాత్రం ఒకటే మనలోని అంచనా అంతే !

ఆ అంచనాలకు అక్షరాలూ తోడైతే ఎలా ఉంటుందో చూద్దాం!

రోజూ వస్తాననేమో

యిట్టే కరిగిపోయింది రాత్రి

నిద్ర ఖర్చుపెట్టి కొన్న కల

పగల్లోకి పరుచుకుంది

నింగి భరిణ లో నింపిన నిశీధి

కంటి కాటుకగా కరిగినట్లు

కాలాన్ని తవ్వితే కలల ఇందనం

కాలాల నడుమ బ్రతుక్కి ఆలంబనం “

రాత్రిలో ఎన్ని హావభావాలు ఉన్నా నిద్ర ఖర్చుపెట్టి కొన్న కల పగల్లోకి పరుచుకుంది ” అనడం మాత్రం ఒక ప్రత్యేకమైన ప్రకటన . ఆకాశాన్ని అందరు చూస్తారు . రాత్రిని అందరు అనుభవిస్తారు . కాని కలం, ఆ కాలాన్ని అనుసరించే హృదయం మాత్రం ఇలానే చూస్తారు .

ఇందులో 40 కవితలు ఉన్నాయి

ఇంకా ఇందులో పిచ్చుక , ఏకాకి, నిరీక్షణలో, అందమైన అతివ , ఆనందహేల, లెక్కలు , చీకటి-నిశ్శబ్దం , ఈ జాడలు , జన్మభూమి కవితలు ఎంతో అర్థవంతంగా సాగిపోయాయి. దానితో పాటు అందంగా నదీ మాత మోస్తున్న చిరు అలల్లా  కదిలిపోయాయి .

కవిత్వం కమనీయమైతే  ఉష కవిత్వం కమ్మనైనది

కవిత్వం ఆలోచనాత్మకమైతే ఉష కవిత్వం ఆచరణాత్మకం

కవిత్వం కవితత్వమైతే ఉష కవిత్వం కవితాత్మకం.

ఉష కవిత్వం “మరువం ” అక్షర పరిమళాల మమైకం !

అభినందనీయం !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *