June 14, 2024

సాంబే పరబ్రహ్మణి

రచన: రసజ్ఞ                                                                                                       

 shankaracharya_new

శ్రీ శంకరాచార్యుల గురించి తెలియని వారుండరు. భగవంతుని చేరుకునేందుకు ఎన్నో మార్గాలను చెప్పారు కనుకనే ఈయనని శంకర భగవత్పాదులు అని కూడా పిలుస్తారు. “మహేశ్వరః శంకర నారాయణః” అనగా మహేశ్వరుడే శంకరుడు, శంకరుడే నారాయణుడు అంటూ అద్వైతాన్ని ప్రబోధించిన మహనీయుడు శంకరాచార్యులు. ఈయనని ఈశ్వరుని అవతారంగా జనులు భావిస్తారు. వైష్ణవ, శాక్తేయ, గానాపత్య, సౌర, శైవ, కాపాలిక మతాలను సమన్వయించి షణ్మత స్థాపకులయ్యారు. బ్రహ్మ సూత్రాలకు భాష్యం వ్రాసిన మహానుభావులు. భగవంతుడు అవసరాన్ని బట్టీ ఒక్కో రూపంలో ఒక్కో పనిని చేస్తాడు కానీ ఈ సృష్టంతా ఒకే రూపంతో నిండి వుంది అని చెప్పిన ఈయన ఎన్నో ప్రబోధాలను చేశారు, ఎన్నో స్తుతులను, అష్టకాలను రచించారు. వాటిల్లో సాంబే పరబ్రహ్మణి అనే మకుటంతో వ్రాసిన “దశ శ్లోక స్తుతి”ని పరిచయం చేస్తున్నాను. అంబతో కూడిన పరమేశ్వరుడే సాంబుడు. సృష్టి స్థితి లయ కారకుడు, పరబ్రహ్మ అన్నీ ఈ సాంబమూర్తే. అటువంటి సాంబ మూర్తి రూపాన్ని హృదయంలో నిలుపుకుని మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ సుఖంగా వుందామని, ఆనంద పారవశ్యంలో మనం కూడా రమిద్దామని తెలియజేసే స్తుతే ఈ దశ శ్లోక స్తుతి.

 

సాంబో నః కులదైవతం పశుపతే సాంబ త్వదీయా వయం
సంబం స్తౌమి సురాసురోరగ గణాః సాంబేన సంతారితాః ।

సాంబాయాస్తు నమో మయా విరచితం సాంబాత్పరం నో భజే

సాంబస్యానుచరోఽస్మ్యహం మమ రతిః సాంబే పరబ్రహ్మణి ॥1

ప్రతీ కవీ ఒక శ్లోకాన్నో, శతకాన్నో, పుస్తకాన్నో వ్రాసే ముందు తన ఇష్టదైవాన్నో, విఘ్నాలు కలగకుండా పూర్తవ్వాలని వినాయకుడినో తలుచుకుని ప్రారంభించడం పరిపాటి. అదే బాటలో శంకరాచార్యుల వారు ఈ దశశ్లోకస్తుతి ని తన కులదైవాన్ని తలుచుకుంటూ మొదలుపెట్టారు. సాధారణంగా ఏ పూజ చేయాలన్నా ముందుగా కులదైవ పూజ చేసి కానీ మిగతావి మొదలుపెట్టరు, కులదైవానికి అంత ప్రాముఖ్యత కల మన భారత దేశంలో సాంబ శివుని గురించి వ్రాసే ఈ స్తుతికి ఆ పరమ శివుడే తన కులదైవం అని చెప్పి మొదలుపెట్టారు. శివుడే మన కులదైవం కాగా మనమంతా ఆయనకు సంబంధించిన వాళ్ళం, ఆయన పరిరక్షణలో వుండేవాళ్ళం. సురులు (దేవతలు), అసురులు (రాక్షసులు), ఉరగులు (నాగులు), మొదలగు అన్ని గణాల వాళ్ళూ ఆ సాంబుడిని పూజిస్తారు. ఇక్కడ గణాల ప్రసక్తి అంత ప్రత్యేకంగా చెప్పడానికి కారణం, కేవలం ఈశ్వరునికి మాత్రమే అన్ని గణాల వారూ పూజలు చేస్తారు కానీ మిగతా ఏ దైవ రూపానికీ (విష్ణువుతో సహా) అన్ని గణాల వాళ్ళూ పూజలు చేయరు. సాంబుడే నాకు సర్వస్వం, ఆయనకు మించినది ఏదీ లేదు కనుక నా ప్రేమ, పూజ, నమస్కారం అన్నీ ఆయనకే అని ఈ శ్లోకం ద్వారా చెప్పారు.

 

సాక్షాత్తు శ్రీహరే “ఏక ఏక హి విశ్వేశో ద్వితీయో నాస్తి కశ్చన” ఈ జగత్తు మొత్తానికి విశ్వేశ్వరుడు మాత్రమే దేవుడు తప్ప వేరొకడు లేడు అని అన్నట్టు శ్రీ స్కంద పురాణంలో వున్నది. మనం పరబ్రహ్మ అని ఎవరినయితే అంటామో ఆ పరబ్రహ్మ స్వరూపమే సాంబశివుడు. అటువంటి స్వామిని కొలుస్తూ ఆయన ధ్యానంలో నా మనసు లగ్నం చేసి ఆనందాన్ని, రసాస్వాదనను పొందుతాను అని చెప్పారు. ఈ మొదటి శ్లోకం తప్ప మిగతా తొమ్మిది శ్లోకాలకీ “తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి” అనే మకుటం వాడినా పది శ్లోకాలనీ పరిశీలించి “సాంబే పరబ్రహ్మణి” ని మాత్రమే మకుటముగా పరిగణించడం జరిగింది.

 విష్ణ్వాద్యాశ్చ పురత్రయం సురగణా జేతుం న శక్తాః స్వయం

యం శంభుం భగవన్వయం తు పశవోఽస్మాకం త్వమేవేశ్వరః ।

స్వస్వస్థాన నియోజితాః సుమనసః స్వస్థా బభూవుస్తత

స్తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి ॥2

మొదటి శ్లోకంలో సాంబుడే తన కులదైవమని చెప్పిన భగవత్పాదులు ఈ శ్లోకంలో ఆయనే పశుపతి అంటున్నారు. పశువులమయిన మాకందరికీ అధిపతివి కనుకనే పశుపతివయ్యావు. మేమంతా కూడా నీ చేత నియమింపబడ్డవాళ్ళం కనుక నువ్వు చెప్పినట్టు చేయడమే మా వంతు తప్ప నీ అనుమతి లేకుండా మేమేమీ చెయ్యలేము. అందువలననే విష్ణాది దేవతలంతా కూడా త్రిపురాసుర సంహార విషయంలో అశక్తులయిపోయారు అంటున్నారు. మరి త్రిపురాసుర సంహార విషయంలో శివుడు దేవతలందరికీ ఏ విధమయిన పనులను అప్పచెప్పి సంహారం చేశాడో తరువాతి శ్లోకంలో వివరించారు. ఇంచుమించుగా ఇదే భావాన్ని శివానందలహరిలో కూడా మనమందరం శివుని ఆట కోసం సృష్టించబడిన పావులం కనుక మనల్ని కాపాడవలసిన, జరపవలసిన బాధ్యత అంతా కూడా ఆ శివునిదే అని చెప్పటం జరిగింది.

 

ఈ శ్లోకం చదువుతుంటే మరొక అంతరార్థం తోస్తోంది. ఈశావాస్యోపనిషత్తులో “దంతిని దారు వికారే దారు తిరోభవతి సోఽపి తత్రైవ జగతి తథా పరమాత్మా పరమాత్మన్యపి జగతి తిరోధత్తే” అన్నట్టుగా దంతి అంటే ఏనుగు. ఒక కఱ్ఱతో చేసిన ఏనుగు బొమ్మని చూస్తే కొంతమందికి అది కేవలం (కొయ్య లేదా చెక్క లేదా) కఱ్ఱ గానూ, మరికొంతమందికి అది ఏనుగు గానూ కనిపిస్తాయి. కఱ్ఱ అనే ఆలోచనతో చూసేవారికి ఏనుగు, ఏనుగు అనే ఎరుకతో చూసేవారికి కఱ్ఱ కనిపించవు. అదే విధంగా, ఈ జగత్తు అంతటికీ మూలమయిన పంచభూతాలు అనే ఏనుగు పరమాత్మ అనే కొయ్యతో చేయబడినది కనుక మనం పంచభూతాలను చూస్తే పరమాత్మ, పరమాత్మను చూస్తే పంచభూతాలు కనిపించవు. అలా విడి విడిగా కాకుండా పంచభూతాలు పరమాత్మ స్వరూపాలు (ఇదే భావాన్ని అష్టమూర్తి నామం ద్వారా తొమ్మిదవ శ్లోకంలో వివరించారు), పరమాత్మ చేత చేయబడినవి అని చూడాలని చెప్తోంది. దేవతలంతా కూడా ఆ ఈశ్వరుడు నియమించిన వారే కనుక శంకరాచార్యుల వారు మేమంతా నీ చేత చేయబడిన వాళ్ళం, నీ చేత నియమింపబడిన వాళ్ళం అని వాడారనుకుంట. సమస్తము ఆ పరమేశ్వరుని నివాసమే అన్న అంతరార్థాన్ని ఈ శ్లోకం ప్రతిబింబిస్తోంది.

క్షోణీ యస్య రథో రథాంగ యుగళం చంద్రార్క బింబద్వయం

కోదండః కనకాచలో హరిరభూద్బాణో విధిః సారధిః ।

తూణీరో జలధిర్హయాః శ్రుతిచయో మౌర్వీ భుజంగాధిపః

తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి ॥3

“క్షోణీ క్షీణా లయే చయా” అని శ్రీ బ్రహ్మ వైవర్త పురాణంలో చెప్పినట్టుగా లయకాలమున క్షీణించేది కనుక భూమికి క్షోణి అనే పేరు వచ్చింది. అటువంటి భూమిని రథంగా మలిచాడు. ఇక్కడ భూమి అని చెప్పడానికి పృథ్వి, వసుధ, ఉర్వి, మహీ, విశ్వంభర, అచల, ఇజ్య, మొదలగు ఎన్నో నామాలుండగా క్షోణీ అనే నామాన్ని ఎంచుకోవడంలో మనం కవి భావాన్ని గమనించాలి. ఇక్కడ జరిగేది త్రిపురాసుర సంహారం కదా, త్రిపురాసురుడు లయకాలానికి దగ్గరగా వున్నాడు కనుక రెంటికీ సరిపడా భగవత్పాదుల వారు ఈ క్షోణీ అనే నామాన్ని ఎన్నుకోవటం జరిగిందని నా అనుకోలు. సరే మళ్ళీ యుద్ధ సన్నివేశం లోనికి వెళదాం. భూమిని రథంగా మలచి రథ చక్రాలుగా సూర్య చంద్రులను పెట్టాడుట. ఇహ యుద్ధం చేయడానికి కావలసిన ముఖ్యమయినది కోదండము అనగా ధనుస్సు. ఆ ధనస్సుగా కనకాచలాన్ని (కనక + అచలము అంటే బంగారు కొండ) అనగా మేరు పర్వతాన్ని పెట్టాడుట. హరిః అనగా విష్ణుమూర్తి బాణం అభూత్ అనగా బాణంగా మారాడు. రథానికి ఒక సారధి కావాలి కాబట్టి ఆ పదవిని విధి అనగా బ్రహ్మ గారు చేపట్టారు.

తూణీరం అనగా అంబుల పొది. ఆ అంబుల పొదిగా మారినది సముద్రుడు. పాల సముద్రంలోనే కదా శ్రీహరి వుండేది? అందుకనే ఏకంగా సాగరాన్ని అంబుల పొదిగా మార్చేసి శ్రీహరిని బాణంగా మలచాడు. శ్రుతులు అనగా వేదములు కనుక అవి గుఱ్ఱములుగా మారాయి. మనకు చతుర్వేదములు కనుక ఈ శ్లోకంలో ప్రత్యేకంగా తెలుపకపోయినా ఇక్కడున్న రథానికి నాలుగు గుఱ్ఱములు అని అనుకోవాలి. యుద్ధానికి కావలసినవి అన్నీ అమరాయి ఒక్క వింటినారి తప్ప, ఆ పనిని పాములకి రాజు అయినటువంటి వాసుకికి (లేదా ఆది శేషువు అని కూడా అనుకోవచ్చు) అప్పగించాడు. ఆ విధంగా వీరందరినీ తనకు కావలసినట్టు మలచుకుని తాను చేయవలసిన కార్యాన్ని పూర్తి చేశాడు సాంబుడు.

యేనాపాదితమంగజాంగభసితం దివ్యాంగరాగైః సమం

యేన స్వీకృతమబ్జసంభవశిరః సౌవర్ణపాత్రైః సమమ్ ।

యేనాంగీకృతమచ్యుతస్య నయనం పూజారవిందైః సమం

తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి ॥4

అంగజుడు అనగా మన్మధుడు. అటువంటి మన్మధుడిని భస్మం చేసిన శివుడే ఆ భస్మాన్ని అంగరాగం అనగా లేపనము లేదా పైపూత లాగా తన శరీరమంతా పూసుకున్నాడు. అబ్జము అనగా పద్మము కనుక అబ్జ సంభవుడు అనగా పద్మములో పుట్టినవాడు అంటే బ్రహ్మ. మన పురాణాల ప్రకారం విష్ణుమూర్తి నాభి నుండీ వచ్చిన పద్మము నుండీ ఉద్భవించినవాడే కదా బ్రహ్మ! మొదట్లో బ్రహ్మ గారికి అయిదు తలలుండేవనీ శివుడు ఒక తలను గిల్లేశాడనీ కథనం. ఆ విధంగా తీసేసిన తలకాయకు సంబంధించిన కపాలాన్నే తన భిక్షా పాత్రగా స్వీకరించాడు. అలా ఆది భిక్షువు అనే నామాన్ని సార్ధకం చేసుకున్నాడు. విష్ణుమూర్తి కన్నుని పూజా పుష్పంగా స్వీకరించినవాడు కూడా సాంబుడే కదా మరి! ఆయన కన్నుని ఈయన ఎందుకు తీసుకున్నాడో, ఏ సందర్భంలో తీసుకున్నాడో ఏడవ శ్లోకంలో వివరించారు.

 

మనమంతా శివుడిని ముక్కోపి అనీ, ప్రళయ కారుడు అనీ భయపడతాం కానీ శివ తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోము. పార్వతీ పరమేశ్వరులు మనకు తల్లిదండ్రులు కనుక శివుని పనులన్నిటినీ మనం ఒక తండ్రి చేసే పనులతో పోల్చుకోవాలి. పగలంతా ఎన్నో పనులు చేసి అలసి, సొలసి, విసిగిన శరీరం స్వాంతన పొందేది కేవలం నిద్రలోనే! దీనినే నిత్య ప్రళయం అంటారు. నిద్రనిచ్చేది శివుడే కదా? రోజంతా అలసిపోయిన పిల్లలని ఇక ఆటలాపి విశ్రాంతి తీసుకొమ్మని నిద్రపుచ్చే తండ్రిని చూసి ఏ విధముగా భయపడమో అదే విధంగా శివుని లాలిత్యాన్ని కూడా అనుభవపూర్వకంగా పొందిన నాడు మనం భయపడము. బిడ్డ మీద కోప్పడి అరచిన తండ్రి కొంతసమయం తరువాత బాధపడి తనే మళ్ళీ అక్కున చేర్చుకుని ఓదారుస్తాడు కదా, శివుడు కూడా అదే విధంగా మన్మధుడిని దహించి వేసినా ఎందుకూ పనికి రాని బూడిద అని వదిలెయ్యకుండా, ప్రేమగా తీసుకుని తన శరీరమంతా పులుముకుని ఆ బూడిదకి కూడా దివ్యమయిన స్థానాన్ని కలిగించాడు. అలాగే బ్రహ్మ కపాలాన్ని కూడా భిక్షా పాత్రగా తన వద్దే పదిల పరుచుకున్నాడు. ఈ విధంగా ఆయన చేసే ప్రతీ పనిలోనూ ఒక తండ్రి లాలన కనిపిస్తూనే వుంటుంది.

గోవిందాదధికం న దైవతమితి ప్రోన్చార్య హస్తావుభా

వుద్ధృత్యాథ శివస్య సంనిధిగతో వ్యాసో మునీనాం వరః ।

యస్య స్తంభితపాణిరానతి కృతా నందీశ్వరేణాభవ

త్తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి ॥5

మొత్తం దశ శ్లోకాలలోనూ ఒక సేవకుని స్వామి భక్తికి తార్కాణమయిన ఈ శ్లోకం నాకు బాగా నచ్చింది. శివుని పరమ భక్తుడు, నిత్యం సేవలు చేసుకునే మహద్భాగ్యం కలవాడు, సాక్షాత్తు పరమశివుని వాహనం అయినటువంటి నందీశ్వరుని మహిమ, భక్తి తెలియచేసే శ్లోకం యిది. మునులలో గొప్పవాడయినటువంటి వ్యాసుడు – విష్ణుమూర్తే గొప్పవాడు అని ఈశ్వర సాన్నిధ్యంలో చేతులు పైకెత్తి మరీ మ్రొక్కినవాడు కాస్తా తరువాత ఈశ్వరునికి భక్తుడయ్యాడు. ఇది చదవగానే సర్వం తెలిసిన వ్యాస మహర్షి, “వ్యాసాయ విష్ణు రూపాయ” అని స్తుతించబడిన వేద వ్యాసుడు హరిహరులకి భేదం చెప్పడమేమిటి? శివుని వద్ద విష్ణువుని పొగడటం ఏమిటి? వంటి ఆలోచనలు ఎన్నో కలుగుతాయి. ఈ సందేహాలు తీరాలంటే మనకి శ్రీ స్కాంద పురాణంలోని మూల కథ తెలియాలి.

 

ఒకసారి నైమిశారణ్యంలో శౌనకాది మునులందరి మధ్యా ముక్తిని ప్రసాదించేది శివుడా? విష్ణుమూర్తా? అనే అంశం మీద చర్చలు జరుగుతున్నాయిట. చివరికి ఆ మునులంతా ఈశ్వరుడే ముక్తిని ప్రసాదించేది అని ఒక నిర్ణయానికి వచ్చారుట. అదే సమయంలో అక్కడకి వచ్చిన వ్యాసుల వారిని చూసి, అతిధి మర్యాదలు చేసి, వేదాలు విభజించినవాడు, ఎన్నో పురాణాలు రచించినవాడు కనుక ఈయనని అడుగుదామని అడుగగా, వ్యాసుడు “వేదాలలోనూ, పురాణాలాలోనూ, ఇతిహాసాలలోనూ కూడా వర్ణింపబడినవాడు విష్ణుమూర్తి మాత్రమే కనుక ఆయనే సృష్టి స్థితి లయ కారకుడు, ఆది దేవుడు, మోక్ష దాత” అనేసరికి అక్కడి మునులంతా నిర్ఘాంతపోయి, మీకంటే తెలిసిన వారు వుండరు కానీ మా తృప్తి కోసం యిదే మాటని కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో చెప్పమని కోరారు. దానికి అంగీకరించిన వ్యాసుడు తన శిష్యులతో, మునులందరితో కలిసి కాశీకి వెళ్లి, పవిత్ర స్నానమాచరించి, మాధవుని ప్రార్ధించి, చేతులు రెండూ పైకి ఎత్తి మాధవుడే మోక్ష దాత అన్న వెంటనే ఆగ్రహించిన నందీశ్వరుడు వ్యాసుడు ఎత్తిన చేతులు ఎత్తినట్టే స్తంభించిపోయేలా, నోట మాట రాకుండా చేశాడు. గోవిందుడే గొప్పవాడు అని అంటుంటే శివుడు చిన్మందహాసంతో వింటూ గోవిందుడూ నేను వేరు కాదు కనుక వ్యాసుల వారు చెప్పినది నిజమే కదా అని వూరుకున్నారుట. స్వామి వూరుకున్నా సేవకుడు వూరుకోలేదు. వ్యాసులవారి భేద బుధ్ధి చూసి మిక్కిలి ఆగ్రహించాడు నందీశ్వరుడు. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి “ఈ విశ్వమంతటికీ కూడా ఈశ్వరుడే దేవుడు, ఆయన వలననే నేను సుదర్శన చక్రం, లక్ష్మీదేవిని పొందాను. ముల్లోకాలనీ రక్షించగల సామర్ధ్యం కూడా నాకు ఆయనే ఇచ్చాడు కనుక నీవు ఆయననే ప్రార్ధించు” అని చెప్పెను. అప్పుడు శివుని ప్రార్ధించగా సంతసించిన నందీశ్వరుని అనుగ్రహం వలన వ్యాసునికి మాట, చేతులు తిరిగి స్వాధీనంలోకి వచ్చాయి. ఆనాటి నుండీ వేద వ్యాసుడు “లింగే ష్వేకో హి విశ్వేష స్తీర్థేషు మణికర్ణికా” అని చాటుతూ అద్వైతామృతాన్ని పంచాడు. శంకరాచార్యుల వారు కూడా అద్వైతులే కనుక ఈ శ్లోకం ద్వారా మరొక్కసారి ఆ సన్నివేశాన్ని మనకు గుర్తు చేశారు.

 

శ్లోకం అంతటిలో కేవలం మూడవ పాదానికి నాకు మరొక అన్వయం తోస్తోంది. అదే కుమార సంభవంలోని ఘట్టం. తారకాసుర సంహారం కోసం జరగవలసిన ముఖ్యమయినవి శివపార్వతుల వివాహం, కుమారస్వామి జననం కనుక దేవతలందరూ మన్మధుడికి మలయమారుతాన్నిచ్చి తపస్సులో వున్న శివుని వద్దకు పంపారు. మన్మధుని ప్రభావం చేత ఆ ప్రదేశమంతా ఆహ్లాదకరంగా మారి వసంత ఋతువు వచ్చింది. అసందర్భంగా వచ్చిన వసంతాన్ని చూసి, ఆశ్చర్యపోయిన నంది శివుని ధ్యానానికి భంగం కలుగకుండా తన చేతి సైగతో శాసించడం వలన ప్రకృతంతా ఒక చిత్రం గీసినట్టు నిలిచిపోయింది. ఈ రెండు సందర్భాలలోనూ కూడా సాంబుని నిత్యం పూజించడం వలన నందీశ్వరునికి వచ్చిన మహిమలను, శివుని మీద నందికి వున్న ప్రేమను మన ముందుకు తెచ్చారు.

 

 ఆకాశశ్చికురాయతే దశదిశాభోగో దుకూలాయతే

శీతాంశుః ప్రసవాయతే స్థిరతరానందః స్వరూపాయతే ।

వేదాంతో నిలయాయతే సువినయో యస్య స్వభావాయతే

తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి ॥6

సాంబ మూర్తి రూపం మనకి యీ శ్లోకం ద్వారా తెలుస్తున్నది. ఆకాశమే ఆయనకు చికురములు అనగా కేశములు. శ్రీ శివాష్టోత్తర నామాలలో “ఓం వ్యోమ కేశాయ నమః” అనే నామము కూడా ఇదే విషయాన్ని తెలుపుతున్నది. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, వాయువ్యం, నైఋతి, ఈశాన్యం, ఆగ్నేయం, ఊర్ధ్వం, అథో అనే పది దిక్కులని తెల్లని పట్టు వస్త్రంగా ధరించాడు. ఆయన కేశపాశం చూస్తే ఆకాశం, ఆయన ధరించిన వస్త్రమేమో పది దిక్కులు. దానికి తోడు చల్లని కిరణములను ప్రసరింపచేయు చంద్రుడు ఆయన ఆభరణం. అల్లసాని పెద్దన గారు రచించిన మనుచరిత్రలో కూడా ఇదే భావాన్ని కొంచెం మార్చి శివుని జడ అనే తోటలో పూసిన అనావర్తం పువ్వు చంద్రుడు అని అభివర్ణించారు. ఇహ సాంబుని రూపమేమిటయ్యా అంటే స్థిరమయిన ఆనందం. “ఆనందో బ్రహ్మ” అన్నట్టుగా ఆనంద స్వరూపం సాంబశివుడు అని వర్ణన వున్నప్పటికీ యిక్కడ భగవత్పాదుల వారు స్థిరతరానందః అనగా స్థిరమయిన ఆనందమే ఆయన స్వరూపం అన్నారు. ఆశకు లొంగని, సమయముతో మారని (యివాళ వుండి రేపు పోయే ఆనందము కాదు), ఇంద్రియ వ్యాపారం వలన కలుగని ఆనందము కనుకనే స్థిరమయిన ఆనందమే సాంబశివుని రూపమని చెప్పారు. ముగ్ధ ముఖారవిందంతో, శాంతంగా, ఆనందంగా కనిపించే సాంబుని రూపమే దక్షిణామూర్తి.

 

ఎలా వుంటాడో చెప్పాక, యెక్కడ వుంటాడో కూడా చెప్పడం ముఖ్యం కనుక వేదాంతో నిలయాయతే అంటూ వేదాంతాలు అయినటువంటి ఉపనిషత్తులే ఆయన నివాసం అన్నారు. ఆకాశాన్ని కేశాలుగా, పది దిక్కులని దువ్వలువగా, చంద్రుడిని ఆభరణంగా లేదా అలంకారంగా చేసుకుని అక్కడెక్కడో వేదాంతాలలో ఆనందంగా వుండే ఆయన మనకి అంత సులభంగా దర్శనమిస్తాడా? అనే ఆలోచన రాకుండానే సువినయోయస్య స్వభావాయతే అంటూ సాంబునిది వినయంగా వుండే స్వభావమని వర్ణించారు. ఒక్క స్తోత్రం చేస్తే చాలు, ఒక్క నమస్కారం చేస్తే చాలు, జిల్లేడు, తుమ్మి మొదలైన పిచ్చి పూలతో పూజ చేసినా చాలు పరవశుడై అనుగ్రహాన్ని కుమ్మరించేస్తాడు. వినయ స్వభావుడు కనుకే ప్రేమగా, భక్తితో తిన్నడు మాంసం పెట్టినా స్వీకరించాడు, కాలితో తన్నినా నా బిడ్డే కదా అని ఆనందించాడు. ఈశ్వరానుగ్రహం పొందిన వారిలో చెప్పులు కుట్టేవాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు, మొదలైన వారే ఎక్కువ. అటువంటి సర్వజన సులభుడు కనుకనే ఆయనకు ఆశుతోషుడు, భోలా శంకరుడు అనే నామాలు వచ్చాయి.

విష్ణుర్యస్య సహస్రనామ నియమాదంభోరుహాణ్యర్చయ

న్నేకోనోపచితేషు నేత్రకమలం నైజం పదాబ్జద్వయే ।

సంపూజ్యాసుర సంహతిం విదలయంస్త్రైలోక్యపాలోఽభవ

త్తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి ॥7

విష్ణుమూర్తి శివుని భక్తుడని అందరికీ తెలిసినదే కదా! ఈ శ్లోకం ఆ భక్తిని వివరిస్తున్నది. విష్ణుమూర్తి నిత్యం శివ సహస్రనామ పారాయణం మానస సరోవరంలో వుండే సహస్ర కమలాలతో చేసేవాడుట. అలా చేస్తుండగా, ఒకానొక రోజున విష్ణువుని పరీక్షించదలచిన శివుడు ఒక కమలాన్ని తగ్గించి వేశాడుట. ఆఖరి నామానికి శివునిని పూజించడానికి కమలం లేనందున విష్ణువుకి వున్న రెండు కనులలో ఒక కన్నును తీసి అదే కమలముగా శివునికి అర్పించాడు. అప్పటినుండే విష్ణువుకి కమలాక్షుడు అనే పేరు వచ్చింది. అంతటి గొప్ప భక్తితో శివుడిని పూజించి ధ్యానించడం వలననే విష్ణుమూర్తి మిగతా దేవతలందరిలో కూడా గొప్పవాడయ్యి అందరితో పూజింపబడుతున్నాడు అని ఈ శ్లోకార్థం.

 

ఈ విషయాన్ని తెలియచేసే కథలు మనకెన్నో వున్నా ఇప్పటికీ చాలా మందికి ఇది కల్పితమో లేదా పుక్కిటి పురాణమో అనుకునే అవకాశం లేకపోలేదు. విష్ణుపురానికి సమీపంలో వుండే “తిరువీళిమిళలై” అనే క్షేత్రంలో కొలువున్న స్వామి పేరు నేత్రార్పణేశ్వరుడు అనీ, విష్ణుమూర్తి శివునికి తన కన్నును కమలముగా అర్పించిన ప్రదేశం ఇదే అనీ అక్కడి స్థల పురాణం. ఇప్పటికీ విష్ణుమూర్తి ఇక్కడ కొలువున్న స్వామిని నిత్యం పూజిస్తాడని నమ్మిక. లింగ పురాణంలోని శివ సహస్రనామ స్తోత్రంలోని ఫలశ్రుతిలో కూడా యిదే విషయం వుంది.

 శౌరిం సత్యగిరం వరాహవపుషం పాదాంబుజా దర్శనే

చక్రే యో దయయా సమస్త జగతాం నాథం శిరోదర్శనే ।

మిథ్యావాచమపూజ్యమేవ సతతం హంస స్వరూపం విధిం

తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి ॥8

ఈ శ్లోకం శివుని లింగోద్భవ కాలంలో ఆది, అంతము తెలుసుకోవాలని బయలుదేరిన బ్రహ్మ, విష్ణువుల గురించి తెలుపుతున్నది. లింగానికి ఆది ఎక్కడుందో తెలుసుకుని, లింగ పాద దర్శనం చేసుకుందామని శ్రీ హరి వరాహావతారం ఎత్తి భూమిలోనికి వెళ్ళాడుట. అదే సమయంలో బ్రహ్మ గారు లింగ శిరోదర్శనం చేసుకుందామని హంసలా మారి పైకి ఎగిరాడుట. విష్ణుమూర్తి మొదలు కనుక్కోలేకపోయిన విషయం నిజాయితీగా ఒప్పుకున్నా, బ్రహ్మ గారు మాత్రం శిరస్సు చూడలేదన్న నిజాన్ని ఒప్పుకోలేక మిథ్యా వాచం అనగా అబద్ధం చెప్పారుట. దానితో బ్రహ్మ మీద ఆగ్రహించిన శివుడు ఆయనకు అపూజ్యం అనగా పూజలు జరగకుండా శపించడం వలననే ఆయనకు ప్రత్యేక దేవాలయాలు లేవని అంటారు. నిజం ఒప్పుకున్న విష్ణువును మెచ్చిన శివుడు శ్రీహరికి పూజార్హతను, ఆలయాలను ఇచ్చాడుట. దీనిని మరింత లోతుగా ఆలోచిస్తే, పరమాత్మ వద్ద ఎన్నడూ అసత్యం ఆడకూడదు, నిజాయితీగా వుండాలి అని తెలుస్తుంది.

 

సాధారణంగా ఈశ్వరుని పరిపూర్ణ రూపానికి పరిమాణం లేదు కానీ లింగ రూపానికి మాత్రం ఒక పరిమాణం వుంది. “ఆపాతాళ సభ స్థలాంత భువన బ్రహ్మాండ మావి స్ఫురత్। జ్యోతి స్ఫాటిక లింగ మౌళి విలసత్ పూర్ణేందు వాతామృతైః॥” అనే శ్లోకం శివుని లింగ రూపాన్ని, పరిమాణాన్ని తెలియచేస్తున్నది. పాతాళం నుండీ ఆకాశం వరకూ సమస్తం ఒక లింగం. రూపం బ్రహ్మాండం (బ్రహ్మ + అండం) అనగా ఒక కోడి గుడ్డు లాగా వుంటుందిట. శుధ్ధమయిన స్ఫటికతో చేసిన జ్యోతిర్మయమయిన లింగం. మౌళి అంటే శిరస్సు కనుక ఆ శిరస్సు స్థానంలో చంద్రమండలం వుందిట. ఆ చంద్రమండలంలో అమృతం ఘనీభవమై వుంది, చంద్రుడే కదా మరి అమృతాన్నిచ్చేది! ఆ అమృతం శివలింగం శిరస్సు నుండీ క్రిందకి అభిషేకంలాగా జాలువారుతున్నది. ఆ విధంగా బ్రహ్మాండంలో వుండే భువనాలన్నిటికీ కూడా ఈ అమృత ధార వలన శీతలత్వం కలిగి చల్లబడుతోందిట! అందువలననే శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఈ శ్లోకం చదువుతూ ఈ సృష్టంతా వ్యాపించి వున్న ఆ మహాలింగానికి అభిషేకం చేస్తున్నామని భావించి చెయ్యాలి.

యస్యాసన్ధరణీ జలాగ్నిపవన వ్యోమార్క చంద్రాదయో

విఖ్యాతాస్తనవోఽష్టధా పరిణతా నాన్యత్తతో వర్తతే ।

ఓంకారార్థ వివేచనీ శ్రుతిరియం చాచష్ట తుర్యం శివం

తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి ॥9

ఈ సృష్టిలో ప్రతీదీ శివుడే అని తెలియచేస్తున్నదీ శ్లోకం. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనే పంచ భూతాలూ, చంద్రుడు, సూర్యుడు, బ్రహ్మ (జీవునిలో కొలువుండే బ్రహ్మ) మొత్తం కలిపి ఎనిమిది కూడా సాంబశివుని రూపాలే. అందువలననే ఆయనకి అష్టమూర్తి అనే నామము వచ్చింది. ఈ ఎనిమిది లేని సృష్టే లేనందున ఈశ్వరుడు లేని చోటు లేదని తెలుపకనే తెలుపుతున్నాడు. సృష్టికి మూలమయిన ఓం కారం నుండే వేదాలన్నీ పుట్టాయని నమ్మే మనకి ఓం కార రూపమే ఆ పరమేశ్వరుడు.

 

ఇదే విషయాన్ని శంకరాచార్యుల వారే శ్రీ దక్షిణామూర్తి శ్లోకంలో కూడా “భూరంభాంస్యనలోనిలోఽoబర మహర్నాధో హిమాంశుః పుమానిత్యాభాతి చరాచరాత్మిక మిదం యస్యైవమూర్త్యష్టకం” అని రచించారు. భూమి, నీరు (అంభాంసి), అగ్ని (అనల), గాలి (అనిల), ఆకాశం (అంబరం), సూర్యుడు (అహర్నాధ), చంద్రుడు (హిమాంశు) మరియు జ్ఞాన/కర్మ కాండలకు అధికారి అయినటువంటి జీవుడు (ఈయననే బ్రహ్మ అంటారు, అహం బ్రహ్మాస్మి అంటాం కదా) కూడినటువంటి సముదాయమే సచ్చిదానంద రూపుడయిన పరమశివుని అష్టమూర్తి రూపం అన్నారు. తాళ్ళపాక అన్నమాచార్యులు కూడా బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అన్నారు. శ్రీమద్భగవద్గీతలో కూడా “భూమిరాపోఽనలో వాయుఃఖం మనో బుద్ధి రేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా” అనే శ్లోకం ఇదే విషయానికి మరింత బలాన్ని చేకూరుస్తోంది.

 విష్ణుబ్రహ్మసురాధిప ప్రభృతయః సర్వేఽపి దేవా యదా

సంభూతాజ్జలధేర్విషాత్పరిభవం ప్రాప్తాస్తదా సత్వరం ।

తానార్తాంశరణాగతానితి సురాన్యోఽరక్ష దర్ధక్షణా

త్తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి ॥10

క్షీర సాగర మథన ఘట్టాన్ని వివరిస్తున్నదీ శ్లోకం. బ్రహ్మ, విష్ణు, మొదలయిన దేవతాధిపులందరూ కూడా నిన్నే ఆది దేవునిగా పూజించి విషాన్ని నీకు అర్పించారు. దానిని కూడా లోక రక్షణ కోసం స్వీకరించి అందరినీ కాపాడావు అని అర్థం. క్షీర సాగర మథనం జరిగినప్పుడు మొట్టమొదటగా వచ్చినది హాలాహల విషం. మనకున్న నవ విషాలయినటువంటి హాలాహల, కాలకూట, బచనాగ, శృంగక, ప్రదీపన, బ్రహ్మపుత్ర, హరిద్ర, సౌరాష్ట్రిక, సక్తక లలో అత్యంత భయంకరమయినది హాలాహల విషం. ఒప్పందం ప్రకారం ముందుగా వచ్చినది దేవతలకే చెందాలి కనుక ఈ విషాన్ని కూడా దేవతలే స్వీకరించాలి. ఆ విధంగా, దీనిని దేవతలంతా తీసుకెళ్ళి బ్రహ్మకు యిస్తారు. ఆయన విష్ణువు నాభి నుండీ పుట్టినవాడు కనుక ఆ విషాన్ని బ్రహ్మ గారు విష్ణువుకి యిస్తారు. విష్ణువు ఈశ్వర రూపమే కనుక ఆది దేవుడయిన శివునికి అగ్ర తాంబూలాన్ని స్వీకరించమని హాలాహలాన్ని యిస్తాడు. అది కఠినమయిన విషమని తెలిసినా లోకరక్షణ కోసం పార్వతీదేవి సమ్మతితో ఆ విషాన్ని సేవించి తన గరళంలో బంధించాడు పరమేశ్వరుడు. ఆ విష ప్రభావానికి శివుని కంఠం నీలంగా మారిపోయింది. అందువలననే ఆయనకి గరళ కంఠుడు, నీల కంఠుడు అనే నామాలు వచ్చాయి.

 

విష ప్రభావం వలన శివునిలోని వేడిని చల్లార్చేందుకే చల్లని కిరణాలను ప్రసరింప చేసే చంద్రుడిని, చల్లని గంగమ్మ తల్లిని తన తల మీద పెట్టుకున్నాడు. ఇన్ని వున్నా కూడా శివునికి వేడి భరించలేనంతగా వుందిట, అందుకనే శివలింగానికి నిత్యం ఉదకాభిషేకం చేస్తారు. అలా శివుడు అభిషేక ప్రియుడనమాట! ఈ క్షీరసాగర మథన సమయంలో శివుడు చంద్రుడిని నెత్తి మీద పెట్టుకున్న విషయాన్నే శ్రీనాథుడు తను రచించిన శృంగార నైషధంలో చెప్తూ చంద్రుడిని ధవళగరళం అని చమత్కరించారు. మరి విషానికి విరుగుడు విషమే కదా? ఆ విధంగా, హాలాహల ప్రభావం వలన కలిగిన తాపము ధవళ గరళము అయినటువంటి చంద్రుని వలన ఉపశమనం పొందుతోందనమాట!

 

వివిధ రూపాలలో ఆ మహాశివుని కొలుస్తూ రచించిన ఈ స్తవం అద్వైతానికి ఎలా సరిపోతుంది అనే ఆలోచన రావచ్చును. వైష్ణవులు విష్ణువుని, శైవులు శివుని గొప్పవానిగా చెప్పుకుంటారు. అద్వైతులు మాత్రం ఇద్దరూ ఒకటే అని నమ్ముతారు. మనకున్న రెండు నేత్రాలలో ఏది ముఖ్యం, ఏది గొప్పది అంటే ఏం చెప్తాం? అదే విధంగా శివకేశవులిరువురూ సమానులే. మనకున్న త్రిమూర్తులకి త్రిగుణాలను ఆపాదించినప్పుడు బ్రహ్మకు రజో గుణం, విష్ణువునకు సత్వ గుణం, శివునికి తామస గుణం చెప్తారు. బ్రహ్మ గారిని కాసేపు ప్రక్కకు పెడితే, శివుడు భస్మాన్ని పూసుకుంటాడు కనుక ఆయన రంగు తెలుపు, నివాసం కైలాసం కనుక అదీ తెలుపే, వాహనము నంది కనుక అదీ తెలుపే, ఆయన లింగం కూడా స్ఫటికం అని చెప్పుకున్నాం కనుక అదీ తెలుపే. ఇవన్నీ కూడా సత్వగుణ సూచకాలు. మరి శివుడు చేసేది ప్రళయం, సంహారం ఇవేమో తమోగుణ సూచకాలు. విష్ణువు రంగు నలుపు, స్థితి నిద్ర కనుక ఇవన్నీ తమోగుణ సూచకాలు. మరి ఆయన చేసే పని మాత్రం లోక రక్షణ, లోకపాలన ఇవేమో సత్వగుణ సూచకాలు. శివకేశవులిరువురూ సత్వ-తమో గుణములు రెండూ కలిగివున్నందున వీరిరువురూ సమానులే. శం కరోతీతి శంకరః అన్నారు అంటే సుఖమును కలిగించువాడు శంకరుడు. మన అద్వైత సిద్ధాంతం తెలియచేసేది మొక్షానందం గురించే కనుక భగవత్పాదుల వారు శంకర నామ వైభవం ద్వారా అపరోక్షానుభూతిని వ్యాపింపచేశారు.

నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ

 

6 thoughts on “సాంబే పరబ్రహ్మణి

  1. డియర్ రసజ్ఞా,
    సాంబే పరబ్రహ్మణి చాలా బాగుంది. చిన్నపిల్లవు, నిన్ను ప్రశంసించకూడదు. కాని ఇది ఒక పండితుడు వ్రాసినట్లు ఉంది. ఎవరి గైడెన్స్ లేకుండా నువ్వు చేస్తున్న కృషిని తప్పక అభినందించవలసిందే. నీవు మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తూ –
    డా. కామేశ్వర శర్మ .

  2. చాల బాగా రాసారు….ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాను…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *