April 27, 2024

ఇద్దరు మిత్రులు – 1 ( వెండితెర నవల )

రచన: ముళ్లపూడి వెంకటరమణ

హాసం ప్రచురణలు

హైదరాబాదు

అన్నపూర్ణవారి

ఇద్దరుమిత్రులు

Iddaru_mithrulu 

పైనున్న వాడు బహు కొంటెవాడు. పెద్దంత్రం, చిన్నంత్రం లేకుండా అందరినీ ఆడించి, ఆడుకుంటాడు. అరక్క వీడూ, దొరక్క వాడూ అవస్థపడగా, ‘వీడి’కి వజ్రాలూ, ‘వాడి’కి మరమరాలూ యిస్తాడు. ఉప్పుకి, కప్పురంలా గుబాళించాలన్న ఉబలాటం కలిగిస్తే, కప్పురానికి ఉప్పులా చవులూరాలన్న సరదా పుట్టించి తమాషా చూస్తాడు, జీవితం ఉప్పులా కరిగిపోయి, కప్పురంలా హరించిపోయేవరకు ఈ తీరని కోరికలతో కాలక్షేపం చేయించేస్తాడు. రామదాసు గారు (భద్రాచలం తాలూకా కాదు) అన్నట్టు, – అంతా ‘వాడి’లీల.

అజయ్‌బాబు స్థితి ఇలాటిదే. అనుభవించడానికి, అపేక్ష తప్ప మిగతావన్నీ వున్నాయి. అతను జాగీర్దార్ల బిడ్డ. తండ్రి ఇటీవలనే చనిపోవడంతో లక్షల ఆస్తికి అధిపతి అయ్యాడు. ఆస్తితో పాటు, అనేక సమస్యలూ బాధ్యతలూ వరించాయి, ప్రమాదాలు ఆవరించాయి. వారసులు కావాలనుకునే బేవారసులు చుట్టుముట్టారు. ఎవరి ప్రేమలో ఎంత విషం కల్తీ అయిందో తెలీదు. దోచేవారెవరో బ్రోచేవారెవరో తెలీదు. అందరినీ నమ్మరాదు అన్న వాక్యంలో మొదటి మాటకి చాలా విశాలమైన అర్థం ఉందనీ, అందరినీ అంటే చాలా మందిని అనేకాక ‘అందరినీ’  అని కూడా తాత్పర్యం ఉందని అజయ్‌బాబుకి అనుభవం మీద తెలిసింది.

దానితో మనుష్యులంతా దూరం అయిపోయారు. అందరి మీదా అపనమ్మకంలాటిది కలిగింది. క్రమంగా తనమీదా అలాటి భావమే కలగవచ్చు. నా అన్నవాడి చేయూత తీసుకుని, మెట్లు మెట్లుగా జీవితంలోకి దిగి ఓడువుగా నడవగల అవకాశం పోయి, తండ్రి మరణించడంతో సరాసరి అమెరికాలోంచి హైదరాబాద్‌లోని ఐశ్వర్యపు సుడిగుండంలోకి, జీవితంలోకి ఒక్కసారిగా దూకవలసి వచ్చింది. అజయ్‌బాబు ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు.

సమస్యలను, బాధలను ఎదుర్కోలేనివారు చాలమంది వాటిని జయించే పద్ధతి ఒకటే. అవి ఒడిసి పట్టుకునేవరకు పరుగెత్తి పారిపోవడం. ఆ పరుగెత్తే మార్గాలు రెండు. భ్రాంతి మొదటిది. ఇది కారుచౌక. గొప్పా బీదా అందరికి అందుబాటులో వుండేది. కానీ అట్టేసేపు మన్నదు. ఏ సమస్యో గుచ్చుకోగానే మెలకువ వస్తుంది. ఇది పోగానే మళ్ళీ వెంటనే మత్తు కావాలంటే, కొందరు బ్రాంది అనువైనదంటారు కాని భ్రాంతిలాగే ఇదీ కొద్దిసేపు నిలచేదే.

అజయ్ బాబుకి, మొదటిది చేతగాక, రెండోదాంట్లో పడిపోయాడు. ఇంటికి తనే పెద్దకాబట్టి అడిగేవారులేరు. డబ్బున్నవాడు గాబట్టి తప్పులు చూపేవారు లేరు. ఒక్క అత్తయ్య ఉంది తన స్థితి ‘చూసి’ బాధపడేందుకు, కాని అవిడకి చూపు పోయింది. లంకంత భవంతిలో ఆవిడ ఒక్కర్తే నా అన్న మనిషి, మరొక్క జీవి ఉన్నాడట-నౌకరు వెంకన్న. వాడు మూగవాడు. ఈ నాగరిక జనారణ్యంలో వాళ్ళే తన రక్షకులు. మిగతావాళ్ళు – మానేజరు భానోజీరావుగారితో సహా అంతా భక్షకులట. అజయ్‌బాబుకి ఈ భయంకర స్థితి ధుర్భరంగా వుంది. భయంకొద్దీ కాదు; అసహ్యంవేసి. అందుకనే అతను ఇంటినుంచి క్లబ్బుకో, హొటలుకో పారిపోతాడు; చింతలలోంచి, మద్యపానం ప్రసాదించే నిశ్చింతలోకి పారిపోతాడు. అది అలవాటయిపోయింది. అది బాగో కాదో  తేలీదు. తేల్చుకునే ఆసక్తి లేదు. ఆ శక్తీ వున్నట్టు లేదు.

క్లబ్బులో కొంత ‘నిశ్చింత’ సేవించి. రిట్జ్ హోటలుకు వచ్చాడు అజయ్-అక్కడింకాస్త సేవిస్తే, స్వప్నసీమ దాటి, సుషుప్తికి వెళ్ళి, ఆనందంలోకి తూలి పడిపోతాడు. మర్నాడు ఉదయం తన ఇంట్లో మంచం దిగేవరకూ ఇంటికెళ్ళిన వైనం కూడ తెలీదు….

హాలు దాటి, రెండో హాలులోకి ప్రవేశించాడు. ఇక్కడ మామూలుగా కుడి వేపు తిరగాలి ‘సేవా’ మందిరానికి.. ఇవాళ అది ఎడం వేపున వున్నట్టుంది ఏమో! తనకు కుడిఎడమలు తెలీవని అత్తయ్య అంటుంది. లేకపోతే తన కుడిచెయ్యి ఎడంవేపుకీ, ఎడంది కుడివేపుకీ మారాయేమో? కుడి ఎడమైతే పొరబాటు లేదన్నాడు ఎవడో. మార్పులు మామూలే. జరుగుతూనే వుంటాయి. జరగాలి… అజయ్ ఎడంవేపుకే తిరిగి ముందుకు సాగాడు.. అదిగో ! ఎవరో వస్తున్నారు… నిజంగానే దారి వుందన్నమాట. ఎవడో తనెక్కడో చూసినట్టే ఉందే! ఎవడు చూడొచ్చాడు మనుషుల్ని బోలిన మనుష్యులుంటారు. వాడు తనని గమనించాడు కాబోలు. గతుక్కుమన్నాడు. అజయ్ నవ్వుకుని ముందుకుసాగాడు….

అంతవరకు అతన్ని వంచిస్తున్న ఆ అద్దంలో భ్రాంతి, ‘ఢీ’ ఇచ్చి తాను పగిలి, అతన్ని పగలగొట్టబోయినంత పని చేసింది. ఎవరో వచ్చి ఇటు కాదు అని అజయ్ భుజాలు పట్టుకుని సరైన దారికి మళ్లించారు. దారి చూపారు.

‘యాష్, ఐ నో, ఐ నో’ అన్నాడు అజయ్.

వెధవ భ్రాంతి. ఎంత దగా చేసింది. భ్రాంతిని నమ్మరాదు…. బ్రాందిని నమ్మవలెను, ఇదీ దగా చేస్తుందిగాని, కొంచెం టైమిస్తుందేమో… చెప్పిచేస్తుంది.

ఎవరో మిత్రుడు చేయి పట్టుకుని కుర్చీలో కూర్చోపెట్టాడు. గది అంతా సిగరెట్ల పొగతో, అజయ్‌బాబు మనుసులా, చూపులా మసక మసగ్గావుంది.

గ్లాసులు ఇంట్లో షాండిలియర్‌లా, జాపనీస్ సంగీతంలా, డాన్సింగ్ గర్ల్ చేతి గాజుల్లా, కాలి గజ్జెల్లా, జేబులో చిల్లర డబ్బుల్లా లింగ్‌లింగ్‌మంటున్నాయి. గలగలమంటున్నాయి. ఎంత హాయి!… ఇంక పోయ్….

“టు ది హెల్త్ ఆఫ్ మిష్టర్ అజయ్‌బాబూ’ అన్నాడు ఒక మిత్రుడు ఉత్సాహంగా.

‘వాడి హెల్తుకేరా, అజయ్ బాబు కోటీశ్వరుడైతేనూ’ అన్నాడు సాటి జ్ఞాని.

‘ఇంకా ఎక్కువరా స్ట్యూపిడ్… లక్షాదికారి తెలుసా, కోటీశ్వరుడు కంటే ఎక్కువ’ అన్నాడు స్థాయి నందుకుంటున్న మహాజ్ఞాని.

‘కాదురా – జమీందారు బిడ్డ. ఇంటినిండా డబ్బు మూలుగుతుందిరా’ అని మిత్రుడి తప్పు సవరించాడు మొదటివాడు.

అజయ్ నవ్వాడు. డబ్బు పేరెత్తగానే నవ్వొచ్చింది. తెలివొచ్చింది. అదో పెద్ద జోకు. అదో పెద్ద భ్రాంతి. ‘డబ్బు! ఏదీ… లేదు.. గోదావరి మీద ప్రయాణం. తాగటానికి నీళ్ళు లేవు’ అన్నాడు చేదు చప్పరించి.

‘వహ్వా, చూడండోయ్ బ్రదర్!… డబ్బంటే లక్ష్మి బ్రదర్… లక్ష్మి, బంగారు గజ్జెల గలగల…’

‘జంగ్…జంగ్’ అంటూ ఆ వాక్యాన్ని తేలిక తెలుగులోకి అనువదించాడు ఒక భాషారథి.

‘నీ కార్లు, బంగళాలు, మేడలు,’

‘నీ ఫ్యాక్టరీలు.. లక్షలపై లాభాలూ’

‘ష్! లాభాలూ!? ఎక్కడ? అంతా నష్టమే. కట్టాలి.. లక్షాయాభై వేలు’ అన్నాడు అజయ్.

‘వాట్, వాట్, వాట్’ అన్నడో వాట్‌మన్ కంగరుగా.

‘ఇన్‌కంటాక్స్… ఎటుచూసిన బాకీలు. గజ్జెల గల గలలు లేవు బ్రదర్… అంతా స్సైలెంట్’ అన్నాడు అజయ్, సిగరెట్టు పొగా, చిరాకూ, విచారం కలిపి నిట్టూరుస్తూ.

‘లేకేం? గజ్జెల గలగలలే కదూ? ఉంది’ అన్నాడు ఒక దాట్ల తాతారావు.

‘ఎక్కడ?’ అన్నాడు అజయ్ ఉత్సాహంగా.

‘చూపిస్తాను పద. ఖమాన్.. దిలారాం డాన్సుకు పోదాం’ అంటూ లేచాడు ఒక మిత్రుడు.

‘దిలారాం అంటే?’ అన్నాడు అజయ్ – మత్తుతో వాలిన రెప్పలెత్తి, పత్తికాయల్లా తెల్లగా, విశాలంగా ఉన్న కళ్ళను ఇంకా ఇప్పార్చి.

ఆడపిల్లలకేకాక, మొగాళ్ళకు కూడా మరోసారి చూడాలనిపించేటంతటి చక్కటి కళ్లు అవి. చదువు, సంస్కారం, ధైర్యం, తెంపరితనం, కంపింపచేసే చురుకైన చూపులు, వర్చస్సుగల ముఖం, నిండుగా, నీటుగా, గోటుగా వుండే విగ్రహం. సహజంగా కనబడే దర్జా.

అజయ్‌బాబు విగ్రహస్పూర్తిని గమనించి, ఆనందించి, మెచ్చుకునే సమయం సందర్భం కావు అవి. ప్రేక్షక మిత్రులు ఆ ధోరణిలో లేరు. మరో కారణంవల్ల ‘ముగ్దుడు’ అయిపోయిన మిత్రుడు వేరే దృష్టిలో వున్నాడు.

‘బ్రదరూ – దిలారాం అంటే? ఏఁవిటంటే, దిల్ అరాం… హృదయానికి – విశ్రాంతి. దిలారాం డాన్సు చేస్తుంటే గజ్జెల గల గల…’ అన్నాడు మత్తుగా అజయ్ బుజంతట్టి.

‘జంగ్…జంగ్’ అన్నడో హుషారుద్దీన్ జంగ్ ఉత్సాహంగా.

‘ష్… పదండి’ అంటూ ముందుకు నడిచాడు అజయ్. మత్తుగా మెత్తగా..

హాలు దాటి, సింహద్వారం వైపు పోబోతూ, రిసెప్షన్ డెస్క్ దగ్గర హటాత్తుగా ఆగాడు అజయ్.

‘అన్నట్టు బంగళాకు ఫోన్ చేయ్యాలి. కొంచెం ఆగండి జెంటిల్‌మెన్!’ అన్నాడు ఫోన్ మీదకి తూలి.

‘జంగ్ జంగ్’ అంటున్నాడు వెనకాల జంగు. ఠంగ్ ఠంగ్ అంది గడియారం.

బంగళాలోని ఆఫీసు గదిలో గడియారం కూడా ఆ మాటే అంది.

‘అబ్బా! పదయింది’ అన్నాడు యజమాని రాకకోసం భయభక్తులతో ఎదురుచూస్తూ హుందాగా పచారు చేస్తున్న దివాన్‌జీ, భానోజి గారు

‘అయింది మరీ’ అనాడు వంతదారుడు రివాజు ప్రకారం.

భానోజీగారు ఇంకేదో అనబోయి, అవతారం వెంటనే ప్రతిధ్వనిస్తాడని భయపడి, అతనికేసి చిరాగ్గా చూసి పచారు కొనసాగించారు.

టెలిఫోన్ మొగింది. భవదీయుడే అందుకున్నాడు, ‘హలో.. నేను హెడ్ద్ గుమాస్తా, కిళాంబి శేషావతారం’ అన్నాడు, ఉన్న కాస్త చాతీ వీలైనంతగా దర్జాగా విరిచి.

‘హాల్లో! నాకు అజయ్ కావాలి’ అంది ఫోన్‌లో కంఠం తిక్కగా. “నువ్వేరా అజయ్’ అంటోంది మరో కంఠం. ‘ఎస్.ఎస్. ఐ నో… హలో’ అన్నాడు అజయ్.

శేషావతారం వినయావతారం ఎత్తి, చెవులు రిక్కించి, భక్తి శ్రద్దలకు అభినయం పట్టాడు.

‘చిత్తం. చెప్పండి మరీ’

‘వినరా రాస్కెల్, విను’

శేషావతారం అదిరిపడి, కుదురుపడి గుటక మింగి, ‘వింటున్నా మరి. ఏమిటి సెలవు?’ అన్నాడు.

‘వినరా రాస్కెల్, విను’ అన్నాడు అజయ్ – శ్రోత, వన్స్‌మోర్ అడక్కపోయినా.

‘ఓహో, అయితే ఉండండి’ అంటూ, భానోజీ గారికేసి చూసి ‘అయ్యా! తమర్నే పిలుస్తున్నట్టుంది. ఇందండి’ అన్నాడు హెడ్ గుమాస్తా ఫోన్ అందిస్తూ.

‘హల్లో, నేను భానోజీరావుని అజయ్ బాబు మేనేజర్ని. ఏం కావాలి మీకు?’ అన్నాడాయన హుందాగా, కొంచెం చిరాగ్గా.

‘వినరా రాస్కెల్, విను’

భానోజీ రావు గారికి భోజనం ముందు చిరుతిళ్ళు అలవాటు లేకపోయినా, ఓ గుటక మింగారు గుడ్లు మిటకరించి, గుమాస్తాకేసి చూసి ‘బాగుంది, బాగుంది.. ఆ పెద్ద మనిషి అంతా స్పష్టంగా నిన్ను పిలుస్తూంటే, నన్నంటావేమిటయ్యా. ఇవాళ నల్లమందు డోసు ఎక్కువైందా? సరిగ్గా విను నిన్నే’ అంటూ రిసీవరు శేషావతారం చేతిలో పెట్టేశారు దర్జాకి భంగం రానీకుండా.

శేషావతారం చెవులు రిక్కించి వినేవి, వినాలని ఉబలాటపడేవి ఎన్నో వున్నాయి గాని, వాటిలో ఇలాటి ఇష్టాగొష్టి ముఖ్యమైంది కాదు. అందుకని అతనూ గుటకమింగి, కళ్ళు చికిలించి తటపటాయించాడు. రిసీవర్ హలో అంటోంది. కొంచెం పైకెత్తాడు.

‘చాలు అజయ్ బాబు. అంతా చెప్పేశావుగా. వాళ్ళు వినేశారు. అయిపోయింది. పద పోదాం డాన్సుకి’ అంటున్నారెవరో. ఆ మాట విన్న మిత్రుడు అజయ్ భుజం మీద చేయ్యి వేసి బలవంతాన వెనక్కి మళ్ళించాడు.

‘అవునవును. డాన్సుకి కదూ! దిలారాం. దిల్ ఆరాం’ అంటూ రిసీవరు పడేసి, వీధివేపు తూలాడు అజయ్ బాబు.

 

***

ఇంకా ఉంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *