May 6, 2024

చంపకమాలనుండి మత్తేభవిక్రీడితము – ఒక కేళిక

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు       j.k.mohanrao

 

పరిచయము – మేము చిన్నప్పుడు ఒక ఆట ఆడుకొనే వాళ్లము.  ఒక పదములో ఒక అక్షరం చొప్పున మార్చి, లేక తొలగించి, లేక అదనముగా తగిలించి మరొక పదముగా చేయాలి.  ఇది ఏ భాషలోనైనా, ఆంగ్లము కాని తెలుగు కాని, సాధ్యము.

ఆంగ్లములో ఉదాహరణ –

man to moon: man -> moan -> moon;

car to bus: car -> bar -> ban -> bun -> bus.

తెలుగులో ఉదాహరణ –

ద్వేషమునుండి ప్రేమ: ద్వేషము -> రోషము – రోమము – ప్రేమము -> ప్రేమ;

ఓడనుండి బండి: ఓడ -> బడ -> బండ -> బండి.

ఇట్టి ఆటలలో మనము చేసే మార్పులు మూడు విధములు – (1) మార్పు లేక బదులు (substitution), (2) తగిలించుట లేక దూర్చుట (insertion), (3) తొలగించుట లేక తీసివేయుట (deletion).  ఈ మూటిని మార్పు-తగులు-తొలగు లేక sub-in-del అని పిలువవచ్చును.  ఒక దాని క్రింద రెండు వరుసలను ఉంచి అందులోని మార్పులను గమనించ వచ్చును –

మ-న-ము-తి-న్నా-ము

మ-న-సు-ని-చ్చా-ము

ఇలా వ్రాస్తే ఇందులో మొదటి రెండు వరుసలలోని ఆఱు అక్షరాలలో మూడు ఒక్కటే (మొదటి రెండు – మ-న, చివరి ము). ఇలా ఈ రెండు వరుసలు సమానత్వము (alignment) కలిగి ఉంటాయి. ఇలాటి కార్యక్రమములు జీవరసాయన శాస్త్రములో (biochemistry) సాధారణము.  ప్రోటీనులు, డిఎన్ఏల ఆమ్లములను (amino acids and nucleotides) ఇలా పరీక్షిస్తారు.  వరుసలలో ఒక చోట మాత్రము (పైన వివరించిన మన ఆటలోని విధముగా) మార్పు చేస్తే దానిని ఏక పరివర్తనము (point mutation) అంటారు.  మన శరీరములోని ప్రోటీనులు, డీఎన్ఏలలో ఇలాటి ఏకపరివర్తనములు కొన్ని వేళలలో కేన్సరుకు కూడ దారి తీయవచ్చును.

ఇలాటి మార్పులను మనము ఛందశ్శాస్త్రములో కూడ చేయవచ్చును.  ఈ ఛందస్సు భాషలో రెండే అక్షరాలు – (1) గురువు (U), (2) లఘువు (I).  ఉదాహరణగా చంపకమాల వృత్తములో ప్రతి పాదములోని 21 అక్షరముల  గురు-లఘువుల క్రమము ఇలాగుంటుంది –

I I I I U I U I I I U I I U I I U I U I U

చంపకమాల మత్తేభవిక్రీడితములు – ఈ చిన్ని వ్యాసములో నా ఆట, ప్రయత్నము ఏమనగా, చంపకమాలలోని గురు లఘువులను ఒక్కొక్కటిగా మార్చి మత్తేభవిక్రీడిత వృత్తపు గురులఘువుల అమరికను  (I I U U I I U I U I I I U U U I U U I U) సాధించుట.  చంపకమాలకు 21 అక్షరాలు, మత్తేభవిక్రీడితమునకు 20 అక్షరాలు.  అందువలన చంపకమాలలోని ఒక అక్షరమును తప్పక తొలగించాలి, మిగిలిన వాటిని ఒక్కొక్కటిగా మార్చాలి.  ఈ పద్ధతిని మొదటి చిత్రములో చూపించినాను.  అలా చేసినప్పుడు ఒక పాదము ఏ విధముగా క్రమేణ మారుతుందో అన్నది రెండవ చిత్రములో చూడవచ్చును. ఇలా చేసినప్పుడు మనకు లభించిన క్రొత్త వృత్తములకు క్రొత్త పేరులను కల్పించినాను.  అట్టి వృత్తములను చదివినప్పుడు మనకు వాటి నడక ఏ విధముగా నుంటుందో అనే భావము కలుగవచ్చును.  అందువలన ప్రతి వృత్తమునకు ఒక ఉదాహరణమును ఇచ్చాను.

1

2

ఇక్కడ ఒక విషయమును గుర్తులో నుంచుకోవాలి.  వేయి సంవత్సరములుగా ఉపయోగించే చంపకోత్పలమాలలను మాత్రాబద్ధమైన తాళవృత్తములుగా (చ-పం-పం – చ-పం-పం) వ్రాయవచ్చునని పది సంవత్సరములకు ముందు కనుగొన్నాను (ఈమాట – చంపకోత్పలమాలల కథ – http://eemaata.com/em/issues/200709/1138.html?allinonepage=1 ).

అట్టి అమరిక ఈ క్రొత్త వృత్తములలో కూడ కొన్నింటికి ఉన్నది.

వృత్తములకు ఉదాహరణములు –

చంపకమాల – న/జ/భ/జ/జ/జ/ర, యతి (1, 11)

IIII UIU III – UII UII UIUIU

21 ప్రకృతి 711600

గగనము వెల్గెఁ దారకల – కాంతులతోడ విభిన్న రాశులన్

సొగసుగఁ బాలపుంత యది – సుందరమౌ నదివోలెఁ గన్పడెన్

నగరము నిద్ర వోయె నిల – నల్లని చీకటి యెందుఁ జూడఁగా

మిగిలిన రాత్రిలోన సుఖ – మీయగ రమ్ము మనమ్ము పొంగఁగా

చంపకమాల గణములతో (IIII UIU IIIU – IIU IIUI UIU)

సంపఁగి – (చ-పం-పం) (చ-పం-పం)

రసములు చిప్పిలన్ ద్వరగ నో – రసికా యొక గీతిఁ బాడవా

ముసిముసి నవ్వులన్ మురువుతో – మొగమున్ సఖ నీవు చూపవా

గుసగుస మాటలన్ బ్రియముగాఁ – గులుకుల్ విలసిల్ల నాడవా

అసదృశమైన యీ రజనిలో – నలరించుచు నన్ను గూడవా

కల – న/జ/భ/జ/జ/య/లగ, ప్రాసయతి (1, 8, 15)

IIIIUIU – IIIUIIU – IIUUIU

20 కృతి 318384

కలలను గొందువా – కలల నమ్మెద నేఁ – గల బంగారమే

వెల యది తక్కువే – విలువ లెక్కువగా – వెలుఁగై తోచుఁగా

మిలమిల తళ్కులో – మెలగి డెందములో – మిళిత మ్మౌనుగా

తలపుల వానలోఁ – దడియు ముత్తెములో – తలిరో పుష్పమో

మల్లియ – న/జ/భ/జ/య/య/లగ, యతి (1, 12)

(చ-పం-పం) (చ-పం-పం)

IIII UIU IIIU – IIU UIU UIU

20 కృతి 302000

మనసున మల్లియల్ విరిసెఁగా – మధురమ్మైన యీ రాత్రిలోఁ

దనువునఁ దావులే చెరలెఁగాఁ – దపనన్ వీచు యీ గాలిలోఁ

జినచిన యాశలే వఱలెఁగాఁ –  జెలువ మ్మీయ నీ మన్కికిన్

దెనుఁగునఁ బాడనా జెవులకున్ – దియగాఁ దేనెలే పారఁగా

తారళ్య – న/జ/భ/జ/మ/య/లగ, యతి (1, 13)

IIII UIU IIIUI – UU UIU UIU

20 కృతి 297904

అరుణ మహార్ణవమ్ముగను దోచె – నాకాశమ్ము భాసించుచున్

జిఱుచిఱు సవ్వడుల్ చెలఁగుచుండెఁ – జిత్రమ్మై ఖగోళమ్ములోఁ

దరగలు లేచె సైకతముఁ దాకి – తారళ్యమ్ముతో వెల్గెఁగా

వరుసగ మారుచుండె మెలమెల్ల – వర్ణమ్ముల్ గనన్ సంధ్యలో

మందార – న/జ/భ/న/మ/య/లగ, యతి (1, 13)

(చ-పం-పం) (చ-పం-పం)

IIII UIU IIIII – UU UIU UIU

20 కృతి 298928

మనసు వసంతమై యలరినది – మందారమ్ములే పూయఁగా

వినగను గోకిలల్ గళములను – విప్పన్ రాగముల్ లేవఁగాఁ

జినచిన చుక్కలై చినుకు పడ – శృంగమ్మందుఁ గార్మేఘముల్

నిను మదిఁ గోరుచున్ రస మొలికి – నృత్యమ్మాడె డెంద మ్మిటన్

మధు – న/జ/ర/న/మ/య/లగ, యతి (1, 13)

IIII UIUI UIII – UU UIU UIU

20 కృతి 298672

నను గన నేల రావు వేగముగ – నన్ నవ్వించి కవ్వించఁగా

మనసున దివ్వె వెల్గెఁ గోరికల – మాధుర్యమ్ము నన్ దాకఁగా

ప్రణయములోని హాయి దివ్య మధు – పాత్రమ్మై సుఖమ్మిచ్చునో

పనసలఁ బాడి ప్రేమమయ – స్వర్గమ్మందు జీవించఁగా

వలయ – న/న/ర/న/మ/య/లగ, యతి (1, 13)

(చ-పం-పం) (చ-పం-పం)

IIII IIUI UIII – UU UIU UIU

వలపుల చితిలోన మాడితిని – ప్రాణ మ్మేలకో పోవదే

తలపుల సెగలోన వాడితిని – త్రాణ మ్మీమదిన్ జావదే

కల లిఁకఁ గరువాయెఁ గన్నులకుఁ – గాలమ్మిందు నిద్రించఁగా

వెలుఁగుల వలయమ్ముఁ జూపగను – వేగమ్మిందు రా వంచకా

పన్నీరు – న/భ/ర/న/మ/య/లగ, యతి (1, 13)

IIIU IIUI UIIII – UU UIU UIU

20 కృతి 298680

చెలియ యెక్కడ వెళ్లెనో యెఱుఁగఁ – జిల్కా చూచితే చెప్పవే

పలుకు నొక్కటిఁ బల్కకన్ వెడలె – వద్దా నన్ గనన్ జెప్పవే

వెలుఁగు దోచకనుంటి నేనిచట – ప్రేమాంభోజముల్ వాడెఁగా

కలలు పండెడు కాల మేదినమొ – కన్నీ రౌనొ పన్నీరుగా

మత్తేభవిక్రీడితము – స/భ/ర/న/మ/య/లగ, యతి (1, 14)

IIUU IIUI UIIIU – UUI UUI U

20 కృతి 298676

కలలో నిల్చెను నాకు ముందుఁ జిలుకా – కంజాక్షు డందమ్ముగా

వలలోఁ జేఁపగ నైతిఁ జూడు చిలుకా – వాఁడొక్క ధూర్తుండుగా

కలయన్ వేళయు వచ్చు నెప్డు చిలుకా – కామమ్ము డెందమ్ములో-

పల నృత్యమ్మును జేసె నిప్డు చిలుకా – ప్రాణమ్ము వాఁడే గదా

ముగింపు – ఒక శాస్త్రవిభాగములో ఉండే ఒక పద్ధతిని మరొక శాస్త్రవిభాగమునకు కూడ మనము తీసికొని వెళ్ల వీలగునని నేను ఈ వ్యాసము ద్వారా నిరూపించినాను. కాని మన విద్యాక్షేత్రములో శాస్త్రవిభాగములను మూసిన గదులుగా భావించడము మానితే బాగుంటుందనుకొంటాను. అంతే కాక సాహిత్య క్షేత్రములో కూడ శాస్త్రీయ పద్ధతులను అనుసరించుటకు వీలగునని ఇక్కడ చూపినాను.

 

 

 

4 thoughts on “చంపకమాలనుండి మత్తేభవిక్రీడితము – ఒక కేళిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *