April 27, 2024

నెచ్చెలి…

రచన: బులుసు సరోజినీ దేవి

నెచ్చెలీ…. రమ్మంటే రానే లేదు నువ్వు.. చెమ్మచెక్కలాడే వేళ నీతో చెప్తే.. !

హిమగిరి శిఖరాన్నెక్కి మేఘాల దారుల్లో

అందాక పయనించి నీలాకాశం చిక్కపడ్దాక

పూసే చుక్కలన్నీ పోగేసి ఇంటి ముంగిట రంగవల్లులద్దుతుంటే..

మెరిసి మురిసే అమ్మమ్మ నవ్వుల్లోంచి

పాత జ్ఞాపకాల చిట్టిపొట్టి అద్దాల పరికిణీ ముచ్చట్లు వింటూ…

మనమెరుగని రాజకుమారిని మనలోనే చూసుకుందామని చెప్తే

రానే లేదు చెలి రమ్మంటే నువ్వు!

 

బాల్యం చివరి కంటితో చిలిపి గా చూస్తూ.. మనని దాటి వెళ్తుంటే—

మువ్వగోపాలుడు మురళి వాయిస్తున్నట్టు తోస్తోందనీ

సిరిమువ్వలు గలగల లాడే పాదాల్ని

జీరాడే తెల్లకలువల పావడా కుచ్చిళ్ళు మునివేళ్ళతో తాకుతుంటే

పెళ్ళికూతురుకి మల్లే యవ్వనపు జలతారు మేలిముసుగుసిగ్గుతెరలు

పసిడిబుగ్గల మీదకి పాకి వినీవినపడని ఊసులు పెదాల మీద నర్తిస్తుంటే

తొలిచిగురాకు ఊయలలూగుతున్నట్తు లేదూ? అంటే………

ఫక్కున నవ్విన బామ్మ తాతయ్య పెళ్ళిచూపులకొచ్ఛిన కబుర్లు చెప్తుందంటే

రానే లేదు చెలి… అలగనా నేను?

రామాయణం తలకెక్కించుకుని ముద్దుగుమ్మ సీతలా ఒద్దికగా నిలబడి

విల్లు విరిచిన రామచంద్రుణ్ణి ఓరగాచూస్తున్నట్లు…

వలపు వాకిళ్ళు తెరిస్తే… ఎదురుగా నిలబడ్డ కలికాలపు సరసాల పతి కళ్ళల్లో

నా ప్రతిబింబానికి బదులు నాలుగేసి పడుచుల ఒయ్యారాల్ని తిలకించి

కృష్ణుడి నోటిలో బ్రహ్మండాన్ని చూసినట్లు

కళ్ళముందు నిరంతరం ప్రసారమౌతూనే ఉంది!

గడుసు దానివి!

నువ్వెందుకు నాలోనే ఉంటూనే నాకు కనపడకుండా దాక్కున్నావో తెలిసింది.

ఎందుకు నెచ్చెలీ? రవ్వంత కనికరం లేకుండా నీకూ నాకు ఈ మధ్య దూరం?

ఆత్మంటే ఆయుష్షుతీరి సుదూరాలకు పయనించేవరకు

లౌకికప్రపంచంలో ఆత్మవిశ్వాసాన్నిచ్చే మహత్తర శక్తి కదా?

అక్కున చేర్చుకునే అమ్మ కదా?

రా సఖీ!నాలో ఇమిడిపో!

 

5 thoughts on “నెచ్చెలి…

Leave a Reply to రెడ్డి గారి అమ్మాయి Cancel reply

Your email address will not be published. Required fields are marked *