May 2, 2024

కవయిత్రి మొల్ల

రచన: ఆదూరి హైమవతి

భారతదేశంలో రామాయణం సుప్రసిధ్ధం.ఎంతో మంది కవులు తమదైన శైలిలో వాల్మీకి విరచిత సంస్కృత రామాయణాన్నిహృద్యంగా తెనిగిం చారు. వారిలో కవయిత్రి మొల్ల సుప్రసిధ్ధురాలు.ఈమె రచించిన రామాయణం ఈమె పేరనే ‘మొల్లరామాయణం ‘గా ప్రసిధ్ధిచెందింది.కమ్మని తేట తెలుగుపద్యాలలో, సులభశైలిలో భక్తి భరితమైనది మొల్ల రచన.ఈమె శైలిచాలా సులువైనది, సర్వులకూ అర్ధమయ్యే విధంగా సాగిపోతుంది. ఈమె శ్రీకృష్ణదేవరాయల సమకాలీనురాలని కొన్ని ఆధారాలవలన తెలుస్తున్నది. మొల్ల రామాయణాన్నిఆరు కాండములలో పద్యరూపంలో రచించింది.ఈ కావ్యాన్నిఆమె కేవలము ఐదు రోజు ల్లోనే వ్రాసిందని చెప్తారు. మొల్ల రచన ఆనాటి గ్రంధరచనా విధానానికి వేరుగా అందరికీ సులువుగా అర్ధమయ్యేలా వాడుక భాషతో ఉంది. రాముని బలాన్ని తక్కువచేసి రావణుడు అన్నమాటలు ఈపద్యంలో చక్కగా సులభశైలిలో ఆమె వ్రాసింది.

జడలు దాలిచి తపసుల  చందమునను
తమ్ముడును తాను ఘోర దుర్గమ్ములందు
కూరగాయలు కూడుగా కుడుచునట్టి
రాముడేరీతి లంకకు రాగలండు!

తనకు శాస్త్రీయమైన కవిత్వజ్ఞానం లేదనీ, భగవద్దత్తమైన వరప్రసాదం వల్లనే కవిత్వం చెబుతున్నాననీ ఆమె అంటుంది. కాని ఆమె అనేక సంస్కృత, తెలుగు పూర్వకవులను స్తుతించిన విధం చూస్తే ఆమెకు వారి రచనలతో గణనీయమైన పరిచయం ఉండి ఉండాలనిపిస్తున్నది. మొల్ల రామాయణం, సంస్కృతంలో శ్రీ వాల్మీకి విరచిత మైన శ్రీమద్రామాయణాన్ని ఆధారంగా చేసుకొని, తేట తెలుగులో వ్రాయబడిన పద్య కావ్యం. మొల్ల రామాయణంలో కందపద్యాలు ఎక్కువగా ఉండడం వల్ల, కందరామాయణం అనడం కూడా కద్దు. కవయిత్రి మొల్ల పూర్తి పేరు ఆతుకూరి మొల్ల. ఈమె ఆంధ్రదేశములోని కడప జిల్లాలోని గోపవరం గ్రామంలో నివసించినదని చరిత్రకారుల అభిప్రాయం .మరొక గోపవరం నెల్లూరుజిల్లాలోనూ ఉండటాన మొల్ల పుట్టిన గ్రామం గురించీ కొంత వివాదం ఉంది. ఎక్కడ పుట్టినా ఆమె కావ్యం జగత్ర్పసిధ్ధం.

ఆ రోజుల్లో అనేకమంది  కవులు ధనము, కీర్తిని ఆశించి రాజులకు అంకితమిచ్చినట్లుగా కాక ఆమె తాను రచించిన రామాయణాన్ని ఏ రాజులకూ అంకితమివ్వలేదు. ఇది ఆమె యొక్క రామభక్తికి నిదర్శనం.. మొల్లరామాయణం ఆరు కాండములలో సుమారు 870 (పీఠికతో సహా) పద్యాలతో ఉన్నది. అంతకు ముందే అనేకమంది కవులు రామాయణాన్ని రచించిన  విషయాన్ని ప్రస్తావిస్తూ తన పద్యకావ్యములోని మొదటి పద్యాల్లో ఆమె ఇలా అంటున్నది.

రాజిత కీర్తియైన రఘురాము మున్ గవీశ్వరుల్
తేజ మెలర్ప చెప్పి రని తెల్సియు గ్రమ్మర జెప్పనేలనన్
భూజన కల్పకం బనుచు, భుక్తికి ముక్తికి మూలమంచు నా
రాజును దైవమైన రఘురాము నుతించిన దప్పు గల్గునే?—

ఎన్నిమార్లుఎందరు జపించినా రామనామ ,రామకధ కొత్తగానే ఉంటుంది కదా!

“గురులింగజంగమార్చనపరుడు, శివభక్తరతుడు, బాంధవహితుడు” — మహాశివభక్తుడూ, కవీ ఐన కేసనసెట్టి మొల్ల తండ్రి. ’కేసన సెట్టి తనయ నని’ ఆమె ప్రారంభంలో చెప్పుకుంది. ఆమె రచనలో చమత్కారాలూ, పాండిత్య ప్రకర్షా, పూర్వకవుల గ్రంథాల్లో భాషగురించి ఆమె చేసిన వ్యాఖ్యానా లు చూస్తే, ఆమె చాలా కావ్యాలూ, ప్రబంధాలూ చదువినట్లే అనిపిస్తుంది. అవతారికలో మొల్ల ఇలా అంటున్నది.

దేశీయపదములు దెనుగు సాంస్కృతుల్
సంధులు ప్రాజ్ఞుల శబ్దవితతి శయ్యలు రీతులుఁ జాటు
ప్రపంధము లాయా సమాసంబులర్థములును—-

అంటూ వ్యాకరణ ఛందోరీతులు, దేశీయాలూ, సంధులు, సమాసములు,మొదలైనవేవీ తనకు తెలియదన్నా అవన్నీ ఆమెకు బహుబాగా తెల్సని ఆమె కావ్యం చదివిన వారికి అర్ధమవుతుంది .

తేనె సోఁక నోరు తీయన యగురీతి
తోడ నర్థమెల్లఁ దోఁచకుండ
గూఢశబ్దములను గూర్చిన కావ్యమ్ము
మూగచెవిటివారి ముచ్చట యగును

చదివినవారికి అర్ధంకాని విధంగా ఉంటే లాభమేమని ఆమె భావన. పాఠకుల మనసులను అలరించే చమత్కారాలూ, సామెతలూచేర్చి అందంగా చెప్తే చదివిన వారికి మనోల్లాసం కలుగుతుందంటుంది మొల్ల.

కందువమాటలు సామెత
లందముగా గూర్చి చెప్ప నది తెలుగునకుం
బొందై రుచియై వీనుల
విందై మరి కానుపించు విబుధులమదికిన్ —- అంటుంది

హనుమంతుని చూసి అతడు నిజంగా రాముడు పంపగా వచ్చినవాడో కాదో, ఇదీనీ రావణ రాక్షసమాయేనేమోని సందేహంతో సీత రామ లక్ష్మణులను వర్ణించమంటుంది. అప్పుడు హనుమంతుడు ఇలా అంటాడు.

నీలమేఘచ్ఛాయఁ బోలు దేహము వాఁడు
ధవళాబ్దపత్రనేత్రములవాఁడు
కంబుసన్నిభమైన కంఠంబు గలవాఁడు
బాగైనయట్టి గుల్భములవాఁడు–

అని రాముని వర్ణించి,

ఇన్నిగుణముల రూపింప నెసఁగువాఁడు
వరుస సౌమిత్రి బంగారు వన్నెవాఁడు

అని లక్ష్మణుని గురించి చెప్పిస్తుంది

లక్ష్మణుడిని గురించి తిరిగి  చెప్పక్కర్లేదు. ఆయనకి కూడా ఈ వర్ణనంతా సరిపోతుంది, కేవలం రంగు మాత్రమే వేరు.

మొల్ల అంటే  గ్రామీణ భాషలో అర్థం  “మల్లె” అని. ఈమె తండ్రి  శివభక్తుడు. మొల్ల  పరమేశ్వరుడే  తన గురువని పేర్కొంది. ఈమెపై పోతన కవితాప్రభావం కూడా ఉన్నట్లు తోస్తుంది.పోతన లాగే ఈమె కూడా శైవురాలైనా విష్ణువును గూర్చి రచనలు చేసింది. ఈమె తన రచనలను పోతనలాగే  రాజులకు అంకితం ఇవ్వలేదు. తన రామాయణాన్ని మొల్ల శ్రీరామచంద్రునికి అంకితం చేసింది. ఈమెకు “ఆంధ్రభోజుడు” శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో తను రాసిన రామాయణాన్ని వర్ణించే అవకాశం వచ్చిందని  చెప్తారు. ఈమె అవసాన దశలో “శ్రీశైల మల్లిఖార్జును”ని సేవిస్తూ గడిపిందని భావిస్తున్నారు.                                                                                                                                                        రావణుని నిర్భంధంలో ఆశోకవనంలో ఉన్నసీత నిరంతరం నాధుని తలంచుతూ, రామనామ జపిస్తూ ‘ రాముడు ఎప్పుడు వచ్చి రావణ వధ గావించి తనను తీసుకెళ్తాడోని’ నిరీక్షిస్తుండగా, హనుమాన్ వచ్చి ఆమెను అనేక విధాల తాను రాకాసి మాయను కానని,  రామదూతననీ నమ్మించి సీతకు రాముని గురించిన ఆందోళన పోగొడతాడు. రాముని క్షేమసమాచారం తెలుపుతాడు. హనుమంతుడు  నవవ్యాకరణ పండితుడు, సమయము సందర్భం సరిగ్గా తెల్సుకుని మృధువుగా మాట్లాడే మేధావి. ఆయన మాటల్లో మొల్ల ఇలా సీతకు ధైర్యవచనాలు  చెప్తుంది  “నేను రాముని వద్ద నుంచీ నిన్నువెతుక్కుంటూ వచ్చాను అని చెప్పాలి  , కాని మొల్ల పాత్రౌచిత్యంతో ఇలా చెప్పిస్తుంది.

“ఉన్నాడు లెస్స రాఘవు
డున్నాడిదె కపుల గూడియురు గతిరానై
యున్నాడు నిన్ను గొనిపో
నున్నాడిది నిజము నమ్ముముర్వీతనయా!”

–ఈ పద్యం మొల్ల ప్రతిభకు గీటురాయి. ఆమె కవితా నైపుణ్యానికి నిదర్శనం .సీతను దర్శించి, లంక నుగాల్చి, రాముని బలాన్ని రావణునికి ఎరుకపరచి , తిరిగివెళ్ళి శ్రీరామునికి సీతమ్మ గురించీ చెప్పేప్పుడు కూడా,  హనుమంతుని నోట మొల్ల “కంటిన్ జానకిబూర్ణచంద్రవదనన్ గల్యాణినా లంకలో” అనిప్రారంభిస్తుంది. దీనిలో ఎంత ఔచిత్యం ఉందో మనకీ పద్యం వల్ల తెలుస్తున్నది.  హనుమంతుడు లంకలో సీతను చూసి, ఆమె భాధ గమనించి , రాముని దుఃఖాన్ని చూసి వచ్చినవాడు గనుక ఇద్దరి బాధనూ త్వరగా తీర్చాలన్న ఆతృతతో, సీతమ్మను తన భుజాలపై ఎక్కించుకుని తీసుకు వెళ్తానంటాడు ఆవేశంగా. హనుమంతుని ఆత్రుత అలాంటిది. కాని అది సముచితం కాదని చెప్తుంది సీత. అందుకే అలా తీసుకెళ్తే “రావణుకన్న మిక్కిలి భూవరుడే దొంగయండ్రు”అని చెప్పి, హనుమ ప్రయత్నాన్ని కాదంటుంది..మొల్లకి కవిత్వం  ఎలా చెప్పాలో, ఎలా చెప్పకూడదో బాగా తెల్సు.

“కందువమాటలు సామెత
లందముగా గూర్చి చెప్ప నది తెలుగునకుం
పొందై  రుచియై వీనుల
విందై మఱి కానిపించు విబుధుల ”

కని పేర్కొన్న మొల్ల ఆ పొందును, వీనుల విందును రామాయణం ద్వారా  తెలుగు వారికి రుచి చూపించింది. తెలుగు కవయిత్రులలో  అద్వితీయురాలు మొల్ల.

రాజులు కాంతియందు రతిరాజులు రూపమునందు వాహినీ
రాజులు దానమందు మృగరాజులు విక్రమకేళి యందు గో
రాజులు భోగమందు దినరాజులు సంతత తేజమందు రా
రాజులు మానమందు నగరమ్మున రాజకుమారులందరున్—

హృద్యమైనదీ పద్యం.అయోధ్యలోని రాజకుమారులందరూ కాంతిలో చంద్రునివంటివారు. రూపంలో మన్మథునివంటివారు. దానగుణంలో సముద్రుని వంటివారు పరాక్రమంలో సింహం వంటివారు. వైభోగంలో వృషభాల వంటివారు , నిరంతర తేజంలో సూర్యుని వంటివారు. అభిమానంలో సుయోధను డంతటివారు –అంటూ మొల్ల వర్ణిస్తుంది. ఈపద్యంలో మొదటి రాజు చంద్రుడు. రెండోరాజు మన్మథుడు. మూడోరాజు నదుల రాజైన సముద్రుడు. నాలుగో రాజు మృగరాజైన సింహం. ఐదో రాజు గోరాజైన వృషభుడు. ఆరోరాజు దినరాజు అయిన సూర్యుడు, ఆఖరి రాజు రారాజైన సుయోధనుడు.

ఈ పద్యం గురించీ కొంత — మొల్ల రామాయణంలో ఒక ముఖ్యమైన పద్యమిది. ఐతే మొల్ల వర్ణిస్తున్నది త్రేతాయుగం నాటి అయోధ్యా నగరపు రాకుమారులను. సుయోధనుడు ద్వాపర యుగంనాటి వాడు. అందుచేత ఈ వర్ణన సరైనది కాదేమో అనే మాట కూడా ఉంది. ఐతే ఆనాటి రాజులను గురించి ఈనాటి కవయిత్రి చెబుతున్నది కనుక ఔచిత్య భంగమేమీ కానరాదు. సాహిత్యంలో అంగీకరించబడిందే . మొల్ల అంటే మల్లెపూవు. కవయిత్రి మొల్లనూ, ఆమె రామాయణాన్నీ తలచుకోగానే మనసుకు ఒక కమ్మని మల్లెవాసన వేస్తుంది. ఆమె తన భక్తినీ, కవితాశక్తినీ కలబోసి క్లుప్తంగా ఓ మనోహరమైన రాయాయణాన్ని తెలుగు భాష కుప్రసాదించింది.  తెలుగు భాష ఉన్నంత వరకూ మొల్ల, ఆమె రామాయణము శాశ్వతాలు.

3 thoughts on “కవయిత్రి మొల్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *