May 6, 2024

నిజమే కల అయితే!!

పరిచయం: మణి వడ్లమాని

20150208_161540 (1)

 

చిరకాలంగా పాఠక లోకానికి పరిచయమున్న రచయత శ్రీ సత్యం మందపాటి గారు. వారు ఎన్నో కధలు, నవలలు, వ్యాసాలు ఇంకా అనేక రకాల సాహిత్య ప్రక్రియలలో సిద్ధహస్తులు. వారి రచనలలో ప్రముఖంగా, అమెరికా బేతాళుడి కధలు, తెలుగువాడు పైకొస్తున్నాడు తొక్కేయండి, చీకటిలో చందమామ, ఎన్నారై కబుర్లు, అమెరికా వంటింటి పద్యాలు ఇత్యాదివి. కిందటి నెల 24 వ తారీఖున వారివి  మరో రెండు పుస్తకాలు ఆవిష్కరించారు. సత్యం, శివం సుందరం అనే కధా సంకలనం, రెండవది నిజమే కల అయితే అనే నవల. ఈ నవల ఆంధ్రభూమి మాస పత్రికలో వచ్చింది. ఈ నవల ఆవిష్కరణ కర్త శ్రీ సుధామ.

నిజమే కల అయితే పేరే భలే థ్రిల్లింగ్  గా ఉంది అనుకున్నాను. నవల ఆసాంతం చదివిన తరువాత కలిగిన అనుభూతి గురించి మాటలలో వర్ణించడం కష్టం. అది పుస్తకం చదివినవాళ్ళకే అనుభవైకవేద్యం అవుతుంది.  గమ్మత్తుగా కధనం భూగోళానికి ఆవలవైపు, ఈవలవైపు ఒక దానితరువాత ఒకటి నడుస్తూనే ఉంటుంది.. ఎన్నో పాత్రలు వస్తాయి. ప్రతి పాత్ర కూడా కధతో ముడిపడి ఉన్నవే.

ఎక్కడ కూడా ఉన్న నమ్మకాలను పోగొట్టలేదు. అలాగే  నవలలో పాత్రలు చెప్పే విషయాలు కూడా నమ్మాలనిపించేలా చక్కగా మలిచారు. నవల ఆస్టిన్, టెక్సస్ నుంచి  మొదలయి వృత్తంలా మళ్ళీ అక్కడకే  వస్తుంది. మధ్యలో  కేరళ నుంచి ఆంధ్రదేశం లోని గుంటూరు, అమరావతి, చీరాల, పొన్నూరు, బాపట్ల ఇలా  కధ ఎన్నో వంపులు, మరెన్నో మలుపులు తిరుగుతుంది

ముఖ్యంగా రెండుకధలు చివరివరకు సమాంతరంగా నడుస్తూ ఉంటాయి. ఆ రెండు కధల్లో  ఒక పాత్రకి పూర్వజన్మ స్మృతులు కలలాగా వస్తుంటాయి. మరొక పాత్ర.

మనసు చేసే గారడీ వల్ల ,  తనకుండే భయాల మూలంగా విన్న విషయాలను మనసు నిండా ఆకళింపు చేసుకొని వాటితో  తన ఉనికేనే మరచి పోతుంటుంది.

ఇంకా ఎన్నో రకాలు పాత్రలు వచ్చి పాఠకుడిని పలకరించివెళుతూ ఉంటాయి.

ఇక  కధలోకి  వస్తే ఆస్టిన్ లోని హోటల్లో  యునివర్సిటీ టెక్సాస్  లోని సోషల్ ఆంత్రోపోలజీ, పారా సైకాలజీ డిపార్ట్మెంట్ ఆధ్యర్వ్యంలో ఇంటర్నేషనల్ సోషల్ సైన్సెస్ వాళ్ళ ఏర్పాటు చేసిన సదస్సులో  మానవాతీత శక్తులు ఉన్నాయా? ఉంటే వాటి ఆధారాలు ఏమిటి? అన్న దానిమీద మాట్లాడటానికి దేశదేశాలనుంచి ప్రతినిధులు వస్తారు అలా అక్కడ.. ఇంగ్లాండ్ నుంచి వచ్చిన ప్రొఫెసర్ డేవిడ్ మార్టిన్,ఆంధ్రా నుంచి వచ్చి న  ప్రొఫెసర్ శంకర్, ప్రొఫెసర్ నారాయణరావు మేనల్లుడు  ప్రహ్లాద్, ప్రొఫెసర్ ఆండ్రూ, వీరంతా కలిసి మానవతీత శక్తులున్నాయా? ఉంటే వాటి ఆధారాలు ఏవిటి అన్న దానిమీద పరిశోధన చేద్దామని, ఒకరి అనుభవాలు ఒకరు పంచుకుందామని   అనుకోవడంతో మొదలవుతుంది  వారి ప్రాజెక్ట్.                                                                                                                        ఒక్కొక్కరి  అనుభవాలు గురించి  చదువుతూ ఉంటే మనం కూడా ఆ పాత్రలలో లీనమై పోతాము. ఇలా వారి వారి పరిశోధనలలో  ఎన్నో విషయాల గురించి. మానసిక స్థితి గురించి , మతం గురించి శాస్త్రీయ విషయాల గురించి చర్చలు ఉంటాయి.

కేరళ నుంచి వచ్చిన మనోరమ అనే పాత్రకి గుంటూరు, అమరావతి  ప్రాంతాలు చూడగానే ఆ ప్రదేశాలు బాగా పరిచయం ఉన్నట్లుగాను, అలాగే మలయాళీ మాట్లాడే ఆ అమ్మాయి సడన్ గా తెలుగు మాట్లాడటం  చాల వింతగా అనిపిస్తుంది. ఆ మిస్టరీని చేధించిన ఆమె భర్త అప్పు స్నేహితుడు సాకేత్ రామ్ పరిశోధన చాలా ఇంటరెస్టింగ్ అనిపిస్తాయి.

అలాగే మెలిసా అనే హిప్నోటిస్టు పాత్ర  ద్వారా మనసు చేసే గారడీ నుంచి ఒక పన్నెండు ఏళ్ళ కుర్రాడి తనకు లేనిది తను పోగొట్టుకున్నది  తనకు తెలియకుండా తన స్నేహితుడు ద్వారా విన్న విషయాలను తనవిగా భ్రమిస్తూ  మనసు శరీరం రెండుగా విడిపోతూ మానసిక సంఘర్షణ  గురించి  చాల చక్కగా వివరించారు. ఇందులో చిన్న రొమాంటిక్  టచ్  కూడా ఉంది . కధ మొదట్లో  ప్రహ్లాద్ కి, మెలిసాకి  మధ్య చిగురించిన అనురాగం మధ్యలో మొగ్గ  తొడిగి చివరకు ప్రేమ పుష్పం గా మారుతుంది.

కధ చివరలో  సస్పెన్సు రివీల్ చేస్తారు. చాలా గ్రిప్పింగ్  గా ఉంది.

అప్పుడు  నారాయణరావు పాత్ర ద్వారా పునర్జన్మ జ్ఞాపకాలు గురించి ఇలా చెప్పిస్తారు “నా స్వంత అభిప్రాయం చెబుతాను. ఒక మనషి చనిపోగానే అతని శరీరాన్ని, అతన్ని మతాన్ని బట్టి తగలేయటమో పాతిపెట్టటం చేస్తాము. దానితో శరీరం తగలబడి బూడిద అవటమో, మట్టిలో కలవడమో జరుగుతుంది. శాస్త్ర ప్రకారం చూస్తే అతని మెదడుతో పాటు అతని జ్ఞాపకాలు కూడా బూడిదయిపోతాయి. పోనీ ఆత్మ సిద్దాంతం ప్రకారం చూద్దామంటే ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు, ఈ భౌతిక బంధాలన్నీ వదిలేసి , ఆ బంధాలనే కాకుండా ఆ జన్మ లోని జ్ఞాపకాలు కూడా వదిలేసి వెళ్ళిపోతుంది. మహా భారతంలో పద్మవ్యూహంలో చనిపోయిన అభిమన్యుడి ఆత్మ, ‘అభిమన్యు’ అని ఏడుస్తున్న తండ్రిని నువ్వు ఎవరు అని అడుగుతుంది. అలాంటప్పుడు శాస్త్రీయంగా చూసినా, ఆధ్యాత్మికంగా చూసిన పూర్వ జన్మ జ్ఞాపకాలు ఉండటానికి ఆస్కారం లేదు” అని ముగిస్తాడు.

నవల  కూడా ఇంతటి తో ముగుస్తుంది. చదువుతున్నంతసేపూ మనలని  ఒకేసారి అమెరికా, ఇండియాలలో తిప్పేస్తారు. నెక్స్ట్ ఏమవుతుందా? అనే కుతుహులం ప్రతి పేజిలోనూ ఉంటుంది.అడుగడుగునా అద్భుతంగా, ఆశ్చర్యంగా ఉంటుంది. చివరగా  నా అనుభూతి , నవల  చాలా  బాగుంది.

 

 

 

 

 

4 thoughts on “నిజమే కల అయితే!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *