May 7, 2024

కాలాన్ని చేజారనివ్వకు…

రచన: అల్లూరి గౌరీలక్ష్మి

మనందరికీ ఉద్యోగస్తులైనా, మరే ఇతర వ్యాపకం ఉన్నవారైనా రోజువారీ శ్రమ మధ్య లేదా రాత్రి భోజనం చేశాక కాస్త ఆట విడుపుగా ఏదైనా రిలాక్సేషన్ కావాలని పిస్తుంది. అది టీ.వీ. అయితే శరీరానికి విశ్రాంతి, మనసుకు ఆహ్లాదం ఒకేసారి కలుగుతాయి. ఇది అందరికీ అందుబాటులో ఉండే వినోదం.
కొంతమంది ఇళ్ళలో టీ.వీ. నిరంతరం మోగుతూనే ఉంటుంది పైప్ లో నీళ్ళు వస్తునట్టు. ఇలా టీవీ చూడడం అనేది ఒక వ్యసనంగా మారకూడదు. గంటలు గంటలు అర్ధరహితమైన కార్య క్రమాలు చూడడం ఎంతవరకూ సమంజసమో మనమే ఆలోచించుకోవాలి. శరీరాన్ని కదలిక లేకుండా పెట్టడం వల్ల ఆరోగ్య హాని కూడా. ఆడ వాళ్ళే టీ.వీ ఎక్కువ చూస్తారనడం సత్యదూరం కాదు.

సాధారణంగా టీ.వీ.లో ఏ ప్రోగ్రాం చూసినా ఏమున్నది గర్వ కారణం? సమస్తం సినిమా ఆధారితం, సినిమా భరితం అన్నట్టుంటున్నాయి. లేకపోతే క్వాలిటీ లేని అపహాస్య కార్యక్రమాలు. చక్కని నాణ్యమైన వినోదం, విజ్ఞానం కలగలిపిన ప్రోగ్రాములు చాలా చాలా తక్కువ. టైం వేస్ట్ అనిపించేవే ఎక్కువ. ఇందులో కొన్ని స్త్రీ ప్రేక్షకులని పాల్గొననిచ్చేవి కూడా ఉంటాయి. చీరల, వస్తువుల రేట్లు సరిగ్గా చెబితే వేలకు వేలు బహుమతులు. నిజంగా అవన్నీ ఎవరికైనా వస్తున్నాయా అన్న అనుమానం కలగక మానదు. సినిమా విజ్ఞానం కావాల్సిన క్విజ్ లు కొన్ని. పిచ్చి పిచ్చి డాన్సులు కొన్ని.

ఇక ఈ మధ్య కార్యక్రమంలో కూర్చుని ఆటలాడే ప్రోగ్రాం లు వస్తున్నాయి. ఇందులో కొన్ని అపభ్రంస కార్యక్రమాలు. చీరలు ఇచ్చిన సమయంలో ఎన్ని ఎక్కువ మడత పెడతారు? ఎవరు బాక్స్ ల తాళాలు సరి చూసి తీస్తారు. ఎవరు గడిలో రింగ్ వేస్తారు ? ఇలాంటివి. వీటివల్ల ఏమైనా ఉపయోగం ఉందా ? మన విలువైన సమయం వృధా కావడం తప్ప! ఇంకా తల్లితండ్రుల ధనమూ, పిల్లల విలువైన కాలమూ వేస్ట్ చేసే పిల్లల ప్రోగ్రాంలుంటాయి. పసి పిల్లల్ని ఈ ప్రోగ్రాంలకు తిప్పడం వల్ల వారి దృష్టి చదువులపై తప్పి పోయే ప్రమాదం ఉంటుంది.

లోక జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం సముపార్జించవలసిన ఆవశ్యకత అన్ని వయసుల వారికీ ఉంది. అలాగే ఇల్లాళ్ళకు పిచ్చి పిచ్చి ఆటలు కాకుండా ఇంకా మంచి కార్యక్రమాలు సృజనాత్మకత పెంచేవీ జనరల్ నాలెడ్జి పెంచేవీ తలచుకుంటే తప్పక రూపొందించవచ్చు. ఇల్లాలి విజ్ఞానం ఇంటిల్లిపాదికీ విస్తరిస్తుంది. ఒక వైపు స్త్రీలు అన్నింటా పురుషులతో సమానం అని ఒప్పుకుంటూనే స్త్రీల కోసం ఇలాంటి నాసి రకం టైం పాస్ ప్రోగ్రాంలు చెయ్యడం వారిని తక్కువ చేయడమే కాక వారి అభిరుచి ఇంతకన్నా ఎదగనవసరం లేదని కించపరచడం కూడా !

ఒక ప్రోగ్రాం మీద వ్యంగ్యోక్తులతో మరో ప్రోగ్రాం. సినీ నటులను అనుకరిస్తూ, వెక్కిరిస్తూ మరొకటి. స్కిట్ ల పేరుతో ద్వంద్వార్ధాల మాటలు రాసి నవ్విస్తున్నామంటారు. మాజీ హీరో హీరోయిన్ లని కూర్చోబెట్టి వారికి డబ్బులిచ్చి నవ్వమని చెప్పి మనల్ని నవ్వమంటే ఏడుపొస్తుంది. హాస్యాన్నీ, అశ్లీలతనీ విడదీయలేని మన అసమర్ధత ని చూస్తే గుండెల్ని మెలి పెట్టినంత బాధేస్తుంది. నట్టింట్లో టీ.వీ. ముందు కుటుంబ సభ్యులంతా ఉంటారు. పిల్లల ముందు ఆ కార్యక్రమాలు పెద్దలకు అవమానకరం గా ఉంటాయి.
నిజమైన నాణ్యమైన హాస్యం అందిస్తూ ఉంటే చూడగల హాస్య రసికత మనందరికీ ఉంటుంది. ఆ విధంగా మన సమయాన్ని సద్వినియోగం చేసుకోగల విజ్ఞత మనకెప్పుడూ ఉంది. మనకు గొప్ప సాహిత్యం ఉంది. అధ్బుతమైన నాటికలున్నాయి. తలపండిన సాహిత్య కారులున్నారు. వారితో సాహిత్య కాలక్షేపం కార్యక్రమంగా చేయవచ్చు. ఎన్నో కళలున్నాయి. జీవితాన్ని మధించి సారాన్ని మనకందించిన కళాకారులున్నారు. వారిని గురించి చెబుతూ కార్యక్రమం చెయ్యొచ్చు. యువతకు స్ఫూర్తి దాయకమైన విషయాలు, వారిలో సామాజిక బాధ్యతను తట్టి లేపే సమస్యల సంగతులు అనేకం ఉంటాయి.

కష్టపడి పైకొచ్చిన వివిధ రంగాల్లోని ప్రముఖుల విజయ గాధల్ని కార్యక్రమాలుగా చెయ్యడానికి ఎవరికీ మనసొప్పదు. రేటింగ్ ఉండదంటారు. అసలు మంచిని ప్రేక్షకులకి అందిద్దామన్న చిత్తశుద్ధీ, ప్రయత్నం కనబడవు. మన అభిరుచిని వాళ్లే జమ కడతారు. మనకి ఎంచుకునే అవకాశం ఇవ్వరు. మనం ఏం చూడాలో వాళ్లే నిర్ణయిస్తారు. టీ.వీ ముందు ఒక గంట కూర్చుంటే మనకి ఉపయోగం ఉండక్కర్లేదా ? ఈ రోజుల్లో కాలం అందరికీ విలువయ్యిందే కదా

టీ.వీ.లో వచ్చే కార్యక్రమాలు మనకి నచ్చనంత మాత్రాన రావడం మానవు కదా అన్న నిరుత్సాహం వద్దు. అటువంటి నిర్వేదంతో చూడవద్దు. మన వరకూ మనం ఆ ప్రోగ్రాం కి విలువ ఉందనుకుంటేనే చూడాలి. మీరు చూస్తున్నారు గనుక మేం వేస్తున్నాం అన్న నెపం మన మీదికి నిర్వాహకులు నెట్టక ముందే మనం నిరసన ప్రకటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. భగవంతుని రూపాల్లో కాలం ఒకటట. అటువంటి కాలాన్ని సద్వినియోగం చెయ్యడం అంటే భగవంతుని పట్ల మనకున్న గౌరవాన్నీ, భక్తినీ చాటటం అవుతుందేమో కదా ! నాస్తికులైనా ధనంలాంటి కాలం విలువని కాదనగలరా !

ప్రతి రోజూ మన ఎకౌంటు లో 24 గంటలు పడతాయి. అవి రోజు పూర్తి కాగానే వాడకపోతే వృధా అవుతాయి. నీళ్ళు తెలీకుండా చేతిలోంచి జారిపోయినట్టు కాలం చూస్తుండగానే కరిగి పోతుంది. అర్ధం పర్ధం లేని ప్రోగ్రాంలు చూస్తూ మనం కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటుంటే వాటిని నిర్మించేవారూ, నిర్వహించేవారూ, అందులో నటించేవారూ తమ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అంటే వారు మనల్ని ఫూల్స్ చేస్తున్నట్టు కాదా ! ఇవన్నీ చూస్తూ మన బుర్రకి పని లేక, శరీరానికి వ్యాయామం లేక మనం మొద్దు బారి పోతున్నా మేమో ! ఆ సమయాన్ని మరో మంచి పనికి కేటాయిస్తే ఎంతో బావుంటుందేమో !

మనం కాస్త ఓపిక చేసుకుని మొక్కల్ని పెంచి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. పక్కింటి పిల్లలకి ఉచితంగా ట్యూషన్లు చెప్పొచ్చు. ఇరుగు పొరుగుకి అవసరం అయితే మాట సాయం చేస్తూ, సమస్య ఉంటే సలహా చెప్పడం ద్వారా మన చుట్టూ ఉన్న సమాజంలో మనమొక బాధ్యత గల పౌరునిగా మెలగచ్చు.

తీరిక సమయాల్లో చూద్దామని పెట్టించుకున్న కేబుల్ టీ.వీ. కాస్తా ముఖ్యమైన పనుల నుంచి మనల్ని మరల్చి తన వైపు తిప్పుకుంటోంది. మనల్ని సోమరుల్ని, బద్ధకిష్టుల్నీ చేస్తూ తినే టైములో ఏం తింటున్నామో తెలీకుండా, కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడుకోకుండా వారికి అండ దండగా ఉండకుండా చేస్తోంది. కుటుంబమంతా టీ.వీ.ముందు చేరి బాగా పొద్దు పోయేవరకూ చూస్తూ నిద్ర కూడా చెడగొట్టుకుని ఉదయం ఆలస్యంగా లేస్తుంటాం. కుటుంబబంధాల్ని కూడా ఈ టీ .వీ. బలహీనం చేస్తోందంటే అతిశయోక్తి కాదు. మనమందరం మంచి ప్రోగ్రాంలు మాత్రమే చూస్తాము అని ప్రతిన బూనాల్సిన తరుణం ఆసన్నమయింది. కాదంటారా !
(%

4 thoughts on “కాలాన్ని చేజారనివ్వకు…

  1. చాల బాగా వ్రాశారండీ
    పుట్టి. నాగలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *