May 3, 2024

నా మాట..

రచన: విజి కనెగుల్ల

http://picosong.com/Vnzy

రాస్తానని ఒప్పుకున్నాను, కానీ ఎలా? ఏమని రాయను? అసలేవిధంగా రాయటం మొదలుపెట్టను? నాలోవున్న భావాలను రాతల్లో పెట్టనా? లేక ఇన్నేళ్ళలో నేను ఎదుర్కొన్న అనుభవాలను కాగితంపై పెట్టనా? వృత్తిరీత్యా నేను చూసిన ఒడిదుడుకులను కలంతో రాయనా? లేక వృత్తిపరంగా రోజూ నా చుట్టూ జరుగుతున్న స్థితులపై స్పందించనా? ఖచ్చితంగా, ఒక ఆడదానినై వుండి ఆడవారి స్థితిగతులపై సమీక్షను నేను రాయాలి అనే ఒక గట్టి నిర్ణయం, నన్ను ఈ సమీక్షను రాసేలా చేస్తోంది.
నిజానికి అందరి ఆడవారిలా నేను ఎదుర్కొన్న సమస్యలు చాలా మామూలే కానీ, ఇదో కానీ అనటంలోనే ఎంతో అర్ధం వుంది అని అర్ధం చేసుకునే వాళ్ళు ఎంతమంది వున్నారు? సరే అర్ధాలు, పరమార్ధాలు, ప్రక్కనపెట్టి నా చుట్టూ జరిగిన జరుగుతున్న సంఘటనల్లో ఒకటి ‘మహిళాదినోత్సవం’ సంధర్భంగా మాలిక ద్వారా మీ అందరికీ తెలియజెప్పడానికి సాహసిస్తున్నాను.

సాహసం అని ఎందుకంటారా? నిజమే/ ఆడవారు. చెప్పాలని అనుకున్నదాన్ని చెప్తే అది సాహసం కాక ఇంకేమవుతుంది? అసలాడవారిగూర్చి ఈ విధంగా ఒక దినం జరుపుకునే దౌర్భాగ్యం ఎందుకు కలిగింది? అని ఆలోచిస్తే, నిజమే అడుగడుగునా కీచకులున్న ఈ ప్రపంచంలో ఆడవారి గురించి మాట్లాడుకునే రోజులు ఎప్పుడూ ఉంటాయి. ఏంటీ? ఈవిడేదో ఫెమినిస్టు లా వుందే? అని అనుకుంటున్నారా? నేను ఏ ఫెమినిస్టు ని కాదండీ, నిజానికి నేను చూసిన విన్న, వింటున్న స్థితులే నేనిలా రాసేలా చేసాయి.
మొన్నీమధ్య ఓ సలహా కార్యక్రమంలో ఒక పెద్దాయన ద్వారా సలహాలిప్పించే కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమానికి నేనే వ్యాఖ్యాతను కావడం నా దురదృష్టం. దురదృష్టమని ఎందుకన్నానంటే సంఘంలో పేరున్న పెద్దాయన నాతోటి ఫ్రెండ్స్కి అసభ్యకర మెసేజ్ లతో హింసించిన మగమహారాజు. ఆ పెద్దాయన ఎంత వెధవ అయినా మా కార్యక్రమంలో న్యాయ సలహా ఇచ్చే గొప్ప వ్యక్తి. లోన కోపం ఉన్నా పైకి మాత్రం నవ్వుతూ ‘ఆహా! ఓహో!’ అనాల్సిన వృత్తి నాది. అందుకే దురదృష్టం అన్నపదం ఇక్కడ వాడాల్సి వచ్చింది.

అసలు కధలోకి వస్తే జనం కూడా ఎంత వెర్రి వెధవలో అనిపిస్తుంది. లేకపోతే ఏంటండీ? సలహాల కార్యక్రమంలో ఒక సాధారణ తండ్రి ‘తన కూతురు మాట వినట్లేదూ, సినిమాలు చూసి చెత్త డ్రెస్సులు వేసుకుంటోంది, మీరు మహానుభావులు కనుక మా పాపకి బుద్ధి చెప్పండీ, అని విన్నవించుకున్నాడు.

ఆడవారిపై చాలా గౌరవ మర్యాదలు నటించే సదరు పెద్దాయన మొహం వెలిగిపోయింది. ఇదే అదను అనుకుని, తను చేసే పనులు కప్పి పుచ్చుకుని ఆడపిల్ల పెంపకంపై చిన్న సైజు ఉపన్యాసం దట్టించడం మొదలుపెట్టాడు. మరొక మహానుభావుడు ఆడపిల్లలకి ఒక వయసు వచ్చాక పెళ్ళి చేసి పడేయాలట. చదువు, ఇతర వ్యాపకాలు వారికి అవసరమని కుండబ్రద్దలు గొట్టి మరీ చెప్పాడు. ఇవన్నీ వింటూ ఏమీ అనలేని స్థితిలో ఉన్న నాకు కడుపు రగిలిపోయింది. సలహాలు ఇచ్చే సదరు వ్యక్తి, మరింత ఉత్సాహంతో బాపూ గారి బొమ్మల్లో ‘విలనులా నాకు కనిపించాడు. నిజానికి నా ఫ్రెండు తనకి జరిగిన విషయం బైటకి చెప్పలేక ఎంత వ్యధను అనుభవించిందో నాకు తెలుసు. కానీ ఆలోచిస్తే అనిపిస్తోంది, నిజమే ఎందుకు ఆడవాళ్ళు తమకు జరిగిన అన్యాయాలను, పడుతున్న బాధలను బైటకు చెప్పలేకపోతున్నారు? ఒక మగవాడు దైర్యంగా అసభ్యంగా మెసేజులు పెడితే ఎంతమంది ఆడవారు తమ భర్తలకు దైర్యంగా చూపగలుగుతున్నారు? “ఏం! తిరిగి తమ భర్త నువ్వే లోకువిచ్చివుంటావ్. వాడెదురుగా పళ్ళికిలించి మాట్లాడివుంటావ్” అని ఎదురు నింద పడ్తుందనా? ఇలాంటి భయాలతో అసలు విషయాన్ని దాచిపెట్టినంత కాలం మనమే తప్పుచేసిన వారిగా ఉండిపోతాం. ఆడవారం ఆడవారం గానే మిగిలిపోతాం. మనం తప్పుచేయనంత వరకూ, తప్పుచేసిన ఎవడినైనా ప్రశ్నించే హక్కు వుంది.

సో లేడీస్.. ఎవడైనా మీ మనసుకి కష్టం కలిగించే పనికానీ, అసభ్యకరమైన అది మీ తప్పుకాదు. ‘ఆడదానిగా పుట్టటమే మీ శాపం’ అని పాత చింతకాయ పచ్చడిలా అనుకోటం మాని వీలుంటే మీ అనుకునే మీవాళ్ళకి చెప్పి మనో స్థైర్యం కూడగట్టుకొని సదరు వ్యక్తికి బుద్ధి చెప్పండి.

మీలా మరో మహిళ గురికాకుండా నోరు తెరిచి ఇదీ నిజం! అని చెప్పండి. ఇలా చెప్పటం వల్ల మీ మనస్సుకైనా కొంత ఊరట కలుగుతుంది. మీ ఇంట్లో ఆడపిల్లలకి బైట మగవాడినుంచి మానసిక కష్టం కలిగితే తల్లిగా, చెల్లిగా, అత్తగా, అక్కగా తోడుండి వారిని నిశ్శబ్దాన్ని వదిలి నిజాన్ని నిర్భయంగా చెప్పమనండి. ఆ దైర్యాన్ని మీరే ఇవ్వండి.
ఏం మన దేశంలో ఒక నిర్భయ పుట్టింది గానీ, ఒక నిర్భయుడైనా పుట్టాడా? లేదే! ‘ఆడవారి ధోరణి వల్లే అత్యాచారాలు జరుగుతాయీ అనే కొంతమంది వ్యక్తులను ఈ ప్రశ్న వేస్తే ఏం చెప్తారు? ఏది ఏమైనా ఆడవారు పెద్దపెద్ద ధర్నాలు సభలు నిర్వహించవలసిన పనిలేదు. కానీ తమకు జరిగిన అన్యాయాన్ని నిర్భయంగా బైటకి చెప్పటం వలన మిగిలిన ఆడవారికి కొంతైనా మేలు కలుగుతుంది. మనకు మనమే దైర్యం, మనమే ఒక శక్తి. అని అనుకుని బ్రతికితే కానీ ఈ సమాజం లో బ్రతకలేము. యత్రనార్యంతు పూజ్యతే…. అన్న విధం గా మాటల వరకు, రాతల వరకే కాకుండా చేతల్లో చూపించే రోజుల్లో వచ్చేంతవరకూ ఇదో ఇలా ఆడవారిని గూర్చిన రోజులు జరుపుకునే అవసరం వుండదు అని అనుకుంటున్నాను.

నిజానికి నేను రాయాలనుకున్నది వేరే. కానీ నా మనస్సుకి మాత్రమే పని చెప్పి చేయి దానిపని అది చెయ్యడం వల్ల ఇది మాత్రమే రాశాను. ఇంకా చెప్పల్సినవెన్నో.
నేను రాయటానికి ప్రోత్సహించిన నా హితులు జ్యోతీ వలబోజుగారు ఒప్పుకుంటే ముందు ముందు మరెన్నో విషయాలు మీతో పంచుకోటానికి నేను సిద్ధంగా ఉన్నాను. వినటానికి మీరు సిద్దమేనా?????????

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *