May 3, 2024

మై గ్రేట్ అమ్మమ్మ….

రచన: సుభద్ర వేదుల
ss

చిటికెన వేలికైనా చిన్న దెబ్బ తగిలితే బాధతో విలవిలలాడతాం కదా? మరి జీవితంలోనే తట్టుకోలేని దెబ్బతగిలితే? అది కూడా లేటు వయసులో? దాన్ని ఎదురొడ్డి, అధిగమించి, ఓపక్క కారుతున్న కన్నీరునాపుకుంటూ కంటి ముందున్న బాధ్యతలని విస్మరించకుండా నిర్వహించగలగడం సాధ్యమేనా? అంటే కాదు అనే జవాబు చెప్పుకోవాలేమో. బాగా చదువుకుని, ప్రపంచాన్ని చూసిన వారికైతే కొంతవరకూ సాధ్యమేమో కానీ జీవితాన్ని తప్ప ఏ స్కూళ్ళల్లో కూడా చదువుకోకుండానే, ఎలాంటి క్రైసిస్ మేనేజ్మెంటులూ, డిజాస్టర్ మేనేజ్మెంటులూ తెలియకుండానే ? అనే ప్రశ్నలకి “అవును”, కర్తవ్యాన్ని విస్మరించకుండా ఉండగలిగితే, కొండంత బాధను కడుపులో ఉంచుకొని కూడా సాధించవచ్చు , బాధకంటే బాధ్యత ముఖ్యం అని ప్రత్యక్షంగా నిరూపించిన వ్యక్తి మా అమ్మమ్మ శ్రీమతి గంటి భగళావతి గారు.

దాదాపు ఎనభైకి దగ్గరపడుతున్న వయసున్న అమ్మమ్మ పుట్టిందీ, మెట్టినదీ కూడా కోనసీమలోని చిన్న గ్రామాలే. చదువు పెద్దగా లేకపోయినా లోకజ్ఞానమూ, తెలివితేటలూ మొదటినించీ చాలా ఎక్కువ ఆవిడకి. ఆడపిల్లలకి తగినంత చదువు చెప్పించకపోవడం వల్ల వారి తెలివితేటలు ఎంత వృధా అవుతాయో? అన్నదానికి ఆమె ఒక ఉదాహరణ. తెలివికి తోడు మాట మంచితనమూ, పనిలో నేర్పరితనమూ కలిసి ఆమెని అందరికీ ప్రేమపాత్రురాలిని చేశాయి. పెద్ద ఉమ్మడి కుటుంబంలో, పెద్ద కోడలిగా అన్ని బాధ్యతలనీ ఎంతో సమర్ధవంతంగా నిర్వహించిన ఆవిడ కుటుంబానికి చేసిన సేవ ఎవరూ మరువలేనిది. అంత పెద్ద ఇంటి ప్రతీ అవసరమూ ఒక పెద్ద ప్రాజెక్టే అనుకుంటే అన్నింటినీ ఎప్పుడూ ఒక్క వెలితి కూడా రానివ్వకుండా నిర్వహించిన ఆమె ఒక గొప్ప ప్రాజెక్ట్ మేనేజరే. అది ఇంట్లో ఆవకాయ పెట్టడమైనా… ఆడపిల్ల పెళ్ళి చేయడమైనా సరే. పెద్దలతో వినయంగానూ, పిన్నలతో సన్నిహితంగానూ ఉంటూ అందరి మనసులనీ గెలుచుకున్న ఆవిడ ఈనాటికీ మరుదులకీ, ఆడపడుచులకీ కూడా “జన్మనివ్వని అమ్మే”. తాను జన్మనిచ్చిన కూతురూ, కొడుకులకైతే ఇక చెప్పనక్కరలేదు.

కూతురైన మా అమ్మకి చిన్నతనానే వివాహం చేయడం వల్ల చాలా చిన్న వయసులోనే అమ్మమ్మ అయిన ఆమె మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసేవారు. ప్రతీ సెలవులకీ అమ్మమ్మగారింటికి వెళ్ళడమూ, అమ్మమ్మ చేతి వంటలకోసం ఎదురు చూడటమూ ఇప్పటికీ మర్చిపోలేని అనుభూతి.

మావయ్య వివాహం జరిగి ఇద్దరు పిల్లలతో సుఖంగా ఉన్నాడు, తన ఇద్దరు పిల్లలూ జీవితంలో స్థిరపడ్డారు! అని ఆనందించే తరుణంలో భగవంతుడు చూసిన చిన్న చూపు కారణాన కొడుకూ, కోడలూ వారి ఇద్దరు చిన్నపిల్లలని తనకొదిలేసి యాక్సిడెంట్ లో ఒకేసారి దూరమైనప్పుడు, ఆమెకి కలిగిన కష్టం ఎవరూ తీర్చలేనిదీ, పూడ్చలేనిదీ. అయినా అంత బాధనీ తన కడుపులోనే దాచుకుని, కళ్ళముందున్న బాధ్యతని మాత్రం మరువకుండా ఆ ఇద్దరు పిల్లల సంరక్షణనీ తన మీదే వేసుకున్నారావిడ.

హైదరాబాదునించి వారిని తమతో స్వగ్రామం తీసుకువెళ్ళి వారి ఆలనా పాలనా తానే చూసుకునేవారు. దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న తన తమ్ముడు నడుపుతున్న స్కూల్ కి పంపడానికి పిల్లల్నిద్దరినీ పొద్దున్నే తయారుచేయడమూ, కావలసిన పుస్తకాలూ, ప్రైవేట్లూ అన్నీ ఒంటిచేత్తో నిర్వహించేవారు. వినికిడి లోపం ఉన్న తాతగారు మాట్లాడేది తక్కువే, అందువల్ల అన్ని నిర్ణయాలూ తానే తీసుకోవలసి వచ్చేది. ఆయనకి నెమ్మదిగా అర్ధం అయ్యేలా చెప్పి తను ఆలోచించి పెట్టుకున్న పనులన్నీ పూర్తి చేసేవారు. ప్రతీ నిమిషమూ పిల్లలకి కావలసినవి ఎలా సమకూర్చాలి! అన్నదే ఆవిడ తాపత్రయం. వ్యవసాయం మీద, ఇతర ఆదాయాల మీద వచ్చిన డబ్బంతా జాగ్రత్త పెట్టి ఇంటి ఖర్చులు పోనూ మిగతావన్నీ వాళ్ళిద్దరి పేరు మీదే ఫిక్సెడ్ డిపాజిట్ లు వెయ్యడమూ, లేదా బంగారం, వెండి రూపంలో జాగ్రత్త పెట్టడమూ చేసేవారు. ఎక్కడ ఎప్పుడు ఎంత దాచినదీ, అది ఎక్కడనించి వచ్చినదీ? లాంటి వివరాలన్నీ ఈ వయసులో కూడా పుస్తకంలో కాదు ఆవిడ చేతివేళ్ళమీదే ఉంటాయి, ఆ జ్ఞాపకశక్తిని చూస్తే మాకందరికీ ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది.

ఎన్ని పనులున్నా సరే, ఎప్పుడూ తాతగారి ఆరోగ్యం, పిల్లల బాగోగులే అమ్మమ్మకి ముఖ్యం. తాను మందులు శ్రద్దగా వాడటమే కాక అందరి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకునేవారు. పిల్లలనిద్దరినీ బాగా చదివించాలనీ, వారు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటే చూడాలని ఆశ. తన ఆరోగ్యం అంతంతమాత్రంగా ఉన్నా సరే ఎప్పుడూ ఆ ఇద్దరి మనవలగురించే తాపత్రయపడతారు అమ్మమ్మ. వారిద్దరి పెళ్ళిళ్ళు జరిగి సుఖంగా ఉండాలనేది ఆమె కోరిక. “మనవడి కాబోయే పెళ్ళానికి చంద్రహారం”, “మనవరాలి కాబోయే మొగుడికి ఉంగరం”, కన్యాదానం చేసేటప్పుడు పిల్లకి మనం నగలు పెట్టాలి అని అమ్మాయికి కావలసిన ముఖ్యమైన నగలూ, అంటూ అన్నీ ప్లాన్ చేసి దాచి ఉంచారు ఆవిడ.

ఒక స్థితిలో పళ్ళెటూరిలో చదువులు సక్రమంగా సాగడం లేదని వాళ్ళిద్దరినీ తెచ్చుకుని హైదరాబాదులోనే చదువులు చెప్పించారు అమ్మానాన్నా. తాతగారు కాలం చేశాకా, అమ్మమ్మ తను కూడా అమ్మానాన్నల దగ్గరే ఉంటున్నారు. ఇక్కడ ప్రతీ అడుగులోనూ అమ్మమ్మకి మా అమ్మా, నాన్నగార్లు అందించిన తోడ్పాటు, ఆలంబనల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. తమ పిల్లల బాధ్యతలు పూర్తి చేసుకుని రిటైర్ అయి హాయిగా ఉండవలసిన తరుణంలో కూడా తమ్ముడి పిల్లల బాధ్యతని తన మీద వేసుకుని నిర్వయించడం అమ్మ గొప్పతనమైతే, అమ్మకి అన్నింటిలోనో తన ప్రొత్సాహాన్నీ, సహాయాన్నీ అందిస్తూ ఒక్కో సారి ఆమెని మించి బాధ్యతలని నిర్వ్హించడం మా నాన్నగారి మంచితనమూ, గొప్పతనమే అని చెప్పాలి. కన్నతల్లిని ఆదరించినంత సమానంగా తననూ చూసుకునే అల్లుడు దొరకడం తన అదృష్టం అంటుంది అమ్మమ్మ. ఇప్పుడు పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యారు. ఇంజనీరింగ్ చదివి బెంగుళూరులో ఉద్యోగం చేసుకుంటున్న అమ్మాయికి పెళ్ళి చేస్తే తాము తీసుకున్న బాధ్యత ఒక కొలిక్కి వస్తుందని అమ్మా, నాన్నగార్ల ఆశ.

తన జీవితంలో తగిలిన శరాఘాతంలాంటి విపత్తునీ, కొడుకూ, కోడలూ దూరమవ్వడాన్నీ క్షణం కూడా మరువలేక పోయినా సరే ఇప్పటికీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం, తపన పడటం ఆవిడ ముందు చూపునీ, బాధ్యతల పట్ల ఆవిడకున్న నిబధ్ధతనీ సూచిస్తాయి అని నేను అనుకుంటాను.

“కష్టాలు మనుషులకి తప్ప మానులకి రావు” అన్నది సామెత, నిజమే! కానీ కష్టాన్ని తట్టుకుని నిలబడటం ఎంతమందికి సాధ్యమవుతుంది? ధీరోధాత్తంగా నిలబడటం ఎంతమందికి చేతనవుతుంది? అనుకుంటే అమ్మమ్మ ఆ ప్రశ్నకి సమాధానంగా కనిపిస్తుంది నాకు. ఆవిడకి ఈ ప్రయత్నంలో మా అమ్మ శ్రీమతి వేదుల సుందరి, నాన్నగారు శ్రీ వేదుల రామంగారు అందించిన సహకారం వెలకట్టలేనివి, మరవలేనివి. అలాంటి తల్లితండ్రుల బిడ్డలం కావడం మా పూర్వజన్మ సుకృతం.

9 thoughts on “మై గ్రేట్ అమ్మమ్మ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *