April 26, 2024

24. లైకా

రచన: విజయలక్ష్మీ పండిట్
ఆ రోజు తెల్లవారక ముందు మా ఇంటి వెనుక తలుపుపై ఏదో గోకుతున్న చప్పుడు . నాకు మెలకువచ్చింది. ఆ గోకుడు శబ్ధం ఆగి ఆగి వినిపిస్తూనేవుంది. మామూలుగ ఆ టైమ్ లో మా అమ్మ లేచే సమయం. అమ్మ లేచింది. హాలులో పడుకున్న నేను మా అక్క ఇద్దరం మేలుకున్నాము ఆ శబ్ధానికి . నాకప్పుడు దాదాపు పద్మాలుగేండ్ల వయసు.

అమ్మ వెళ్ళి వెనక భోజనాల గది వంటగది కలిసిన పెద్దహోలు తలపు ఇనుప అడ్డగడియ, ప్రక్కన వేసిన ఇనుప చిలుకు గడియ రెండు తీసి బయటికి చూసింది .
మా అమ్మ వెనుకనే నేను మా అక్క వెళ్ళాము కుతూహలంగా ఏమిటా తలుపు గోకుడు శబ్ధం అని.

అమ్మ తలుపు తీయగానే
వగర్స్తుఅమ్మకాళ్ళదగ్గర
పడిపోయింది మా పెంపుడు కుక్క
లైకా . నేను నా వెనుక మా అక్క పరిగెత్తుకుంటూ ఆత్రుతగా వచ్చాము.అమ్మ కాళ్ళదగ్గర పడిఉన్న లైకాను దగ్గర కూర్చుని చేతిలోకి ఎత్తుకున్నాను.

మా అందరి ముఖాలలో ఆనందంతో కూడిన ఆశ్ఛర్యం.
మా అమ్మ అనింది “ఎవరు తెచ్చారు లైకాను పల్లెనుండి..,తోటలో కాపలా కోసం తీసుకెళ్ళారు కదా “అంటూ..ఇంటి వెనుక కలయతిరిగింది.

ఎవరు కనిపించలేదు .
“మరెలా వచ్చింది ఇది ముపైకిలోమీటర్ల
దూరం నుండి” అని ఒకరితో ఒకరు అనుకుంటూ సంభ్రమాశ్ఛర్యాలకు లోనయినాము.

అంతలో నీరసించిన లైకాను గుర్తించిన అమ్మ
“ఇది అంతదూరం నడిచి వచ్చేసి నట్టుంది “
అని అనింది. నేను మా అక్క ముఖాలచూసుకున్నాము ఆశ్ఛర్యంగా..!

“అంతదూరం ఒకటే ఎలా వచ్చిందమ్మా ఒకటే . దారి ఎట్లా తెలిసింది
లైకాకు “అన్నాను నేను అప్రయత్నంగా. మరలా
“అమ్మా దీనికి బాగ ఆకలిగా ఉన్నట్టుంది . పాలు పెడతాను ఇవ్వమ్మా” అని అంటూంటే లోపల్నుండి మా పెద్ద చెల్లెలు కరుణ ,తమ్ముళిద్దరు అశోకు , ఆనందు వచ్చారు నిద్రలేచి. మా చిన్న చెల్లెలు అనిత నిద్రపోతోంది.మేము ఆరుమంది సంతానం మా అమ్మ నాన్నకు.

ఆ హడావిడికి , లైకా మూలుగుడు విని రాగానే మా చిన్నతమ్ముడు ఆనందు నా చేతిలో నుండి లైకాను లాక్కున్నంత గా తన చేతుల్లోకి తీసుకుని హత్తుకున్నాడు. వాడికి లైకా అంటే మా అందరికంటే చాల ఇష్టం. లైకాను మా ఇంటికి తెచ్చుకోడానికి కారణం మా తమ్ముడి పట్టుదలే.

***

అవి వేసవి సెలవులు
కావడంతో మాకు ఆటలు, దిగుడు బావిలో ఈత నేర్చుకోవడం, రోజు సాయంత్రం చెరువు కట్టవరకు వాకింగ్, నేను మా అక్క లైబ్రరీకి వెళ్ళడం,రాత్రిపూట భోజనాలయినాక కొంతసేపు కథలు చెప్పుకోవడం, వెన్నెలరాత్రులలో మిద్దె పైన
మాకందరికి చేతిముద్దతో రాత్రి భోజనం..,
మా నాన్న మాకోసం వేసే వేసవి శెలవుల కార్యక్రమాలు. మధ్యలో ఒకటి రెండు సినిమాలకు,
బంధువుల ఊర్లకు వెళ్ళడం.

ఆ రోజు బాగా గుర్తు. మా నాన్నతో
మేము ఐదుమంది వాకింగ్ కు వెళ్ళివస్తూంటే మా తమ్ముడు వెనుకబడుతూ మెల్లగ వస్తున్నాడు. మా నాన్న ఎందుకు మెల్లగ నడుస్తున్నావు ఆనంద్ అని వెనుకకు తిరిగిచూశాడు. మా తమ్ముడు ఒక చిన్న కుక్కపిల్ల తో ఆడుతూ వస్తున్నాడు. వాడి కాళ్ళసందుల్లో దూరుతూ ఆడుతూ వెంట వస్తూంది ఆ కుక్కపిల్ల .బొద్దుగా ముద్దుగా ఉంది.

మా నాన్న చుట్టూ చూస్తూ “ఎవరిది ఆ కుక్కపిల్ల “
అన్నాడు. దారిన పోయేవాళ్ళు ఎవరు ఏమి పలకలేదు ఎవరి పనిమీద వారు గభ గభ నడిచిపోతున్నారు. మేమంతా కుక్కపిల్ల చుట్టుచేరి
మా నాన్నతో “ఈ కుక్కపిల్లను ఇంటికి తీసుకెళదాము నాన్న “అంటూ. మా చిన్న తమ్ముడు మా నాన్న చేయిపట్టుకుని
ఊపేస్తూ కుక్కపిల్లను మనింటికి తీసుకుపోదాం నాన్నా అంటూ ఒకటే మారాంచేయసాగాడు.

మా నాన్న కొంతసేపు చుట్టూ చూశారు. “ఎవరిదో వాళ్ళెవరయిన కుక్కపిల్లను వెతుక్కుంటూ వస్తారేమో చూద్దాము” అంటూ ,అక్కడ రోడ్డు ప్రక్కన ఆగాము. చాలా సేపటివరకు ఎవరు రాకపోవడంతో కుక్కపిల్లతో ఇల్లుచేరాము సంతోషంగా.

ఆ రోజునుండి మాకు కొత్త నేస్తం తోడయింది.
అందరం కలసి ఆ కుక్కపిల్లకు స్నానం చేయించి
సుభ్రంచేశాక మా ఇంట్లో మా బాయమ్మ
.., మా వంటమనిషి నడిగి పెరుగన్నం కలిపి తెచ్చి
ఒక చిన్నగిన్నెను మా అమ్మనడిగి తీసుకుని అందులో వేసి కుక్కపిల్ల ముందు పెట్టగానే ఆత్రుతగా తినింది. కొంచెందూరంగా నిలబడి అది తినడం చూస్తూన్నాము మేము
ఒకరివైపొకరు ఆనందంగా చూసుకుంటూ.
“ ఏం పేరు పెడదాము కుక్కకు. ఇది మగ కుక్క “అన్నారు మా నాన్న.

ఆది క్రాస్ బ్రీడ్ లా గుంది. మూతి కొంచెం పొడవు
బ్రౌను కలర్లో నల్లని కనుగుడ్ల తో ,తోక కొన కొంచెం కుచ్చుగా ముద్దుగా ఉంది.
మేము దానికి పేరు ఆలోచించే కార్యక్రమంలో పడ్డాము .

మా మేన మామ పెద్ద పెద్ద కుక్కలను పెంచేవారు.
అల్షేషన్ కుక్కలు, కొన్ని చిన్న చిన్న గుఱ్ఱాల్లా మా మేనమామ కారు లేదా ఒక్కోసారి జీపు దిగిగానే
వెనకాల దుంకిపరిగెడుతూ ఇంటిలోపలికి వచ్చేసేవి.

చిన్నప్పుడు ఆ కుక్కలను చూసి భయపడి లోపలికి
పరుగు తీసేవాళ్ళము మా అమ్మ నాన్నల వెనక నక్కుతూ. అయినా మా మామగారు మా ఇంటికి తరుచుగ రావడం మేము
మా మామగారి ఇంటికి వెళ్ళడం వల్ల అవి అలవాటయి పోయాయి.

“మనమూ ఇంట్లో కుక్కలను పెంచుకుందాము నాన్న” అని అడిగే వాళ్ళము ముఖ్యంగా మా తమ్ముళ్ళు.

మా నాన్న ఎందుకో అంతగా పట్టించుకోలేదు.
ఇప్పుడు ముద్దుగాఉన్న ఈ కుక్కపిల్ల అందరికి
నచ్చింది. మా అందరిలో చెప్పలేనంత కుతూహలం ,ఆశ్ఛర్యం ,ఆనందం దాని ముద్దు చేస్టలు చూస్తూంటే.

మా నాన్న ఆ కుక్కపిల్లకు “ లైకా అని పేరు పెడదాము.., లైకా అనే కుక్క మొదట అంతరిక్ష యాత్ర చేసిన కుక్క పేరు “ అని అనగానే అందరం ఒకరినొకరు చూసుకుంటూ తలలూపాము.
ప్రేమగా లైకా లైకా అని పిలవడం మొదలు పెట్టాము. కొన్ని రోజులకు తన పేరును గుర్తించి పిలవగాన తోకాడించుకుంటూ వచ్చేది.

అప్పటికే మా ఇంట్లో ఒక పిల్లి ఉండేది షీలా అని . ఇంట్లో బియ్యం మూటలు ఎలకలు కొట్టకుండా ఉండడానికి మా అమ్మ ఒకిటి రెండు పిల్లులను ఎప్పుడు ఇంట్లో పెట్టుకునేది.లైకా షీల రెండు ఫ్రెండ్సయిపోయాయి . వాటి రెండింటి గిల్లికజ్జాల ఆటలకు ఆశ్ఛర్యపోతూ మేము భలే ఎంజాయ్ చేసేవాళ్ళము.

వాటికి పాలు పెట్టడం అన్నం కలిపి పెట్టడం, సోపు పెట్టిస్నానం చేయించడం ఇష్టమయిన పనులుగ ఉండేవి మాకు. మా చిన్న తమ్ముడు చాల ముద్దు చేసేవాడు లైకాను .వాడికప్పుడు
వయసు దాదాపు ఎనిమిది ఏండ్లు ఉండేవి. మా చిన్న తమ్ముడు నా కంటే ఆరు సంవత్సరాలు
చిన్నవాడు. నేను అప్పుడు 9 దో క్లాసు చదువు తున్నాను.

మా లైకా చాల గట్టిగా మొరుగుతూ ఎవరిని ఇంటిజాడలకు రానిచ్చేది కాదు. మా నాన్న లాయర్ .మా ఇంటికి మా నాన్న క్లయింట్స రాడనికి బయపడేవారు. ఎవరయిన ఇంటికి వచ్చినపుడు దానిని కంట్రోల్ చేయడానికి మెడబెల్టుకు గొలుసు
వేసి కట్టేయడం జరిగేది.

లైకా ఎత్తుకంటే పొడవు బాగ పెరిగింది. చాల చురుకయింది. దాని అరుపుకు మా వీధిలో
పోయేవాళ్ళు భయపడేవాళ్ళు. మాతో కూడా రోజు వాకింగ్ కు , ఈతకు వెళ్ళనపుడు మాతో కూడా లైకాను తీసుకెళ్ళేవాళ్ళము.

***

మా ఇంట్లో అప్పుడు రెండు మూడు జర్సీ ఆవులు వుండేవి. మా అందరికి పాలు పెరుగు నెయ్యికి కొదువ లేకుండా రోజుకు ఒక్కోటి మూడు నాలుగు లీటర్ల పాలు ఇచ్చేవి. వాటి దూడలు పెరిగి పెద్ద వయినపుడు అన్నింటిని టౌన్లో ఇంటిదగ్గర పెట్టుకోవడం కష్టమని ముపై కిలోమీటర్ల దూరంలో ఉండే మా మామిడితోటలో పచ్చగడ్డి అవి బాగ ఉంటాయని మా తోటలో కాపలా ఉండే
మనుషులిద్దరితో తోటకు తోలి పంపేవాళ్ళు
అమ్మ వాళ్ళు .

ఆ రోజు మా కంగానపు సాయిబు ,అంటే మా అమ్మవాళ్ళ ఊరుదగ్గర కౌలుకు ఇచ్చిన మా పొలాలు, మామిడి తోట చూసుకునే మనిషి వచ్చాడు. మామిడి తోటకు కాపల ఉండేవాళ్ళను ఇద్దరిని వచ్చి పెద్దావును దూడలను తోటకు తోలుకొని పొమ్మని చెప్పి పంపింది మా అమ్మ. రెండుకుటుంబాలు మాతోటలో ఉండేవి తోటకు కాపల.

వారంరోజుల తరువాత ఇద్దరు మా తోట కాపల దారులు పాలు వట్టి పోయిన ఆవును,పెరిగిన రెండు దూడలను తోలుకొని పోవాలని వచ్చారు. వాళ్ళు “మాకు కుక్కను కూడా పంపండమ్మా తోటలో కాపలాకు దొంగల
భయంలేకుండ ఆవులు దూడలను తోలుకుని పోయేప్పుడు లైకా కుక్కను కూడా తీసుకుని పోతాము . కుక్క అరుపుకు అందరు భయపడతారు తోటలోకి రావడానికి” అని
మా అమ్మ నాన్నను ఒప్పించుకున్నారు.
మాకు ఆవిషయం తెలియదు.

మరుసటి రోజు ఉదయం 5 గం॥ ముందు లేసి
దూడలకు కావాల్సిన మేతగడ్డి , వాళ్ళకు కుక్కకు
కావాల్సిన అన్నము అన్ని సర్దుకున్నారు.ఎండ రాకముందే దూడలకు అలసట లేకుండా చాల
దూరం నడిచివెళ్ళిపోవచ్చని మేమంతా నిద్ర లేవకముందే బయలుదేరి వెళ్ళిపోయారు లైకాను
ఆవు , దూడలతో కూడా గొలుసుతో నడిపించుకుంటూ. మధ్యలో పల్లెలలో
విశ్రాంతి తీసుకుంటూ మరుసటి రోజు సాయంత్రానికి చేరిపోతారు తోటకు.

మేము నిద్ర మేలుకుని లైకాను మా తోట వాళ్ళు తీసుకుని పోయారని తెలుసుకుని చాల బాధపడ్డాము. మాఅమ్మ నాన్నతో పోట్లాడినంతపని చేశాను . కొన్ని రోజులేకదా మామిడి కాయల కాలం అయిపోగానే మరలా
తీసుకొచ్చేస్తారని మమ్మల్ని బుజ్జగించి సర్ది
చెప్పారు అమ్మ నాన్న.

మా చిన్న తమ్ముడు ఏడుస్తూ కూర్చున్నాడు
లైకా కావాలని. వాడిని సముదాయించడానికి తలప్రాణం తోకకొచ్చినంత పనయింది మా
అమ్మ నాన్నకు. ఏవో వాడికిస్టమయిన
తాయిలాలు, సైకిలు కొనిపెడతామని చెప్పి
ఏడుపు మానిపించారు.

స్కూలునుండి ఇంటికి రాగానే మాచిన్న తమ్ముడు
లైకాతో ఆడుకొనేవాడు. లైకాకూడా ఆనందుతో ఎక్కువ ఆడేది.అది వాడి ఒడిలోకి, బుజాలపైకి ఎక్కి తన ఇష్టాన్ని ఆనందాన్ని వ్యక్త పరుస్తూ ఆడుకునేది. లైకా ఇల్లువదిలి పోవడంతో
ఎక్కువ బాధపడింది మా ఆనందు.

నేను మా అక్క మా పెద్ద చెల్లెలు పరీక్షలు దగ్గర పడటంతో చదువులో మునిగి పోయి మా మధ్య లైకా లేకపోవడం గుర్తుకొచ్చినపుడు బాధపడేవాళ్ళం.లైకా మా అందరికి ఒక రిక్రిఏషన్
కేంద్రంగా ఉండేది. లైకా లేని మా ఇంటిలో సందడి తగ్గి మాలో ఒక నిరుత్సాహ వాతావరణం అలుముకుంది.

మామిడి తోటకు వెళ్ళిన లైకా ఇరవయిరోజుల తరువాత ఇప్పుడు అగస్మాత్తుగా ఎవరి తోడు లేకుండ మా మధ్య ప్రత్యక్షమవడంతో మేమంతా ఆశ్చర్యానికి లోనయాము. మాఅందరిలో ఆశ్చర్యం తో కూడిన ఆనందం వెల్లివిరిసింది.

మా లాగానే లైకా కూడా మన్మల్ని
విడిచి వెళ్ళిన తరువాత మా అందరి స్నేహాన్ని ప్రేమను ఆటలను మిస్ అయి ఆ ఒంటరి
తనాన్ని తట్టుకోలేపోయిందని మాకు అర్థమయింది.

రాత్రి పూట బయలుదేరి నడిచిన దారిని తన ఆగ్రాణశక్తితో మా ఇంటి దారిని గుర్తుపట్టి
ముపై కిలోమీటర్లు నడిచి వచ్చేసింది.

కుక్కలకు మూడు వందల మిలియన్ల ఆల్ఫాక్టరి రిసెప్టార్లు ముక్కులో అమరి వున్నాయని , వాటివలన వాటికి మెదడులో ఆ వాసనను పసికట్టి పదిలపరిచే ఏర్పాటు సహజంగా ఉన్నందున మరలా ఆ దారిని లేదా స్థలాన్ని
మనుషులను గుర్తుపట్టడం కుక్కల లోని సహజ ప్రత్యేక గుణం. మనుషుల ముక్కులలో
ఆ రిసెప్టార్లు ఆరు వేల మిలియన్లే వుండడం
మూలాన వాసనను పసికట్టే గుణం కుక్కలలో
మనుషుల కంటే నలబయి రెట్లు ఎక్కువ ఉంటుందన్న విషయాన్ని తరువాత తెలుసుకున్నాము.

మమ్మల్ని వెతుక్కుంటూ అంతదూరం నడచి
మా ఇంటికి వచ్చి మాతో కలవడంతో లైకా పై మా ప్రేమ ఇనుమడించింది. మరలా ఇంట్లో అది తోకాడించుకుంటూ సంతోషంగా తిరుగుతుంటే
మాలో,మా ఇంట్లో ఆశ్చర్యం , ఆహ్లాదం
ఆనంద వెల్లివిరిసాయి.
మా అమ్మ నాన్న కూడా లైకాను పంపడం
పొరపాటయిందనుకున్నారు.మా అమ్మ
నాన్నంటే కూడా లైకాకు చాల ఇష్టం.
లైకాను మేము ఆరుగురు ఒకరు మార్చి ఒకరు ఎత్తుకుని ముద్దాడుతూ …,ఆ రోజు మాకు పండగే.

*+*+*+*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *