April 26, 2024

6. దేవుడే కాపాడాలి

రచన:  రామలక్ష్మి జొన్నలగడ్డ

 

మా పాత మారుతి కారు సిగ్నల్‌ సమీపించిందో లేదో ఎర్ర దీపం వెలిగింది. ‘‘ఫరవాలేదు, పోనీయ్‌’’ అన్నాడు చెంగూ బాబాయ్‌ డ్రైవరుతో.

‘‘మన ముందో కారుంది సార్‌’’ అన్నాడు డ్రైవర్‌.

‘‘ఎవడ్రా వాడు, రెడ్‌ లైట్‌ పడితే కారాపేయడమే’’ విసుక్కున్నాడు బాబాయ్‌.

తెల్లబోయి బాబాయిని చూశాను. నియమపాలనే ధ్యేయమనే తనేనా ఈ మాటన్నది! కానీ బాబాయ్‌ నన్ను చూడ్డం లేదు. కారు తలుపు అద్దంమీద చేత్తో పాముతున్న బిచ్చగాడికోసం – అద్దం కిందకి దింపాడు. ఆశగా తనని చూస్తున్న వాడితో, ‘‘నా కారు అద్దాన్ని చేత్తో ముట్టుకుంటావుట్రా లం…’’ అంటూ బూతులు లంకించుకున్నాడు. బిచ్చగాడు హడిలిపోయి పారిపోయాడు.

బాబాయ్‌ దగ్గర అలాంటి భాషాపాండిత్యముందని ఊహించలేదేమో షాక్‌ తిన్నాను.

సిగ్నల్‌ పడగానే కారు మళ్లీ కదిలింది. ‘అమెరికా ఇన్‌ ఇండియా’ సూపర్‌ మార్కెట్‌ రాగానే, ‘‘ఆ పక్కన ఆపు’’ అన్నాడు బాబాయ్‌. ‘‘నో పార్కింగ్‌ ఏరియా సార్‌! పార్కింగ్‌ ఏరియాలోకి వెడదాం’’ అన్నాడు డ్రైవర్‌.

‘‘అందులోకి వెడితే అదో పెద్ద సముద్రం. ఫరవాలేదు, పక్కనే ఆపు’’ అన్నాడు బాబాయ్‌. కారు ఆగగానే, యూనిఫాంలో ఉన్న ఒకతనొచ్చి షాపు పార్కింగ్‌ ఏరియాకి దారి చూపాడు. బాబాయ్‌ అతడితో ఏం మాట్లాడాడో, అతగాడో యాబై రూపాయల నోటు అందుకుని సలాంచేసి వెళ్లిపోయాడు. మేము షాపులోకి వెళ్లాం.

ఆ షాపు యజమాని ప్రకాష్‌, బాబాయ్‌ స్నేహితుడు. నిజానికి అమెరికాకీ ఆ షాపుకీ ఏ సంబంధం లేదు.

‘‘ఫిరోజ్‌ ఖాన్‌ తల్లి విధవరాలు. ఘాందీ ఇంటిపేరున్న ఓ పార్సీని పెళ్లాడి ఫిరోజ్‌ ఘాందీ అయ్యాడు. స్వతంత్రోద్యమంలో ఫిరోజ్‌ తన ఇంటిపేరు స్పెల్లింగు గాంధీగా మార్చాడు. అతణ్ణి పెళ్లాడిన ఇందిర అలాగైంది ఇందిరా గాందీ. తరతరాలుగా జనమా కుటుంబాన్ని గాంధీ-నెహ్రూ కుటుంబంగా భ్రమించి, పట్టం కడుతున్నారు. అంతా పేరులోనే ఉంది. మా ప్రకాష్‌ తన షాపుకీ పేరెట్టడం వెనుక ఇంత కథ ఉంది’’ అన్నాడు బాబాయ్‌.

నల్లధనాన్ని తెలుపు చేసుకుందుకీ షాపు తెరిచాడు ప్రకాష్‌. బాబాయ్‌ నన్నా షాపంతా తిప్పి, అలాంటి షాపులే మన వ్యవస్థలో ఎందరికో ఆసరా ఔతున్న వివరాలు మనసుకి హత్తుకునేలా చెప్పాడు.

‘‘నేను ఫలానా అని తెలిస్తే, ఈ షాపులో మనకి ట్రీట్‌మెంట్‌ వేరే ఉంటుంది. అందుకే ప్రకాష్‌ లేనప్పుడు నిన్నిక్కడికి తీసుకొచ్చాను’’ అంటూ బాబాయ్‌ అక్కడున్న ఓ స్టాల్లో కొన్ని చాక్లెట్లు కొన్నాడు. పన్నుండదని బిల్లొద్దన్నాడు. బయటకొచ్చేక నాకో చాక్లెట్టిచ్చాడు. నేను రేపరు విప్పి ఏంచెయ్యాలా అనుకుంటుండగా, తన రేపరుని ఉండగా చుట్టి రోడ్డుమీదకి విసిరేశాడు. నాకు మనసొప్పక రేపర్ని జేబులోకి తోసేశాను.

మా కారు రోడ్డుకి అటుంది. రోడ్డు దాటుతూ బాబాయ్‌ రెండు సార్లు పక్కనే ఉమ్మాడు.

కారెక్కాక ఎవరికో ఫోన్‌ చేసి, ‘‘ఏరా, మీ సినిమాకి ప్రియరంజని డేట్సిచ్చిందా?’’ అన్నాడు బాబాయ్‌. ఏం బదులొచ్చిందో ఏమో, ‘‘ఏంటీ, పల్చటి దుస్తుల్లో వాన సీనుకొప్పుకోలేదా? అసలు బట్టలే లేకపోతే ఓకేనా?’’ అన్నాడు. తర్వాత ప్రియరంజని ఏయే సినిమాల్లో ఎలాంటి దృశ్యాల్లో నటించిందో, పోర్నోగ్రఫీని మించిన భాషలో ఏకరువు పెట్టి, ‘‘దానికోసారి గుర్తు చెయ్యి’’ అన్నాడు.

ప్రియరంజని నాకు తెలుసు. ఇప్పుడే ఇరవైల్లో అడుగెడుతోంది. చాలా బాగుంటుంది. తొందర్లో ఓ పెద్ద హీరోతో పిక్చరుకి మాటలు జరుగుతున్నాయని వార్త. ఆమె గురించి అంత అసభ్య పదజాలం వినడం – అదీ బాబాయ్‌ నోట అదోలా అనిపించింది నాకు.

ఇంటి దగ్గర మధ్యాహ్నం పన్నెండుకి బయల్దేరాం. సాయంత్రం ఆరు దాకా ఊళ్లో తిప్పుతూ, అంతవరకూ తెలియని కొత్త (చీకటి) కోణాల్ని – వన్డేల్లో రోహిత్‌శర్మ సిక్సర్సులా, అలవోకగా ప్రదర్శించాడు బాబాయ్‌.

దారిలో వేణుగోపాలస్వామి గుడొచ్చింది. నాస్తికుణ్ణి కాను కానీ భక్తుణ్ణీ కాను. సామాన్యుల ప్రతినిధుల్ని శాసించగల హోదా ఉన్న ఆదర్శ ప్రజానేత చెంగూ బాబాయ్‌ – దేవుడి విషయంలో ప్రదర్శించే కొత్తకోణం చూడాలనిపించి, ‘‘దర్శనం చేసుకుందామా?’’ అన్నాను. ‘‘ఇప్పుడు కాదు, రేపు’’ అన్నాడు బాబాయ్‌.

ఇంటికెళ్లేలోగా ఆలోచనల్లో కాస్త వెనక్కి వెళ్లాను…

–              –              –              –              –

నాన్న రైతు. దశాబ్దాలుగా పల్లెటూళ్లో ఉంటున్నా – పట్నవాసం ఆయన కల. ఇద్దరు కొడుకుల్నీ, ఇద్దరు కూతుళ్లనీ పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేశాడు. అంతా విదేశాల్లో ఉన్నారు. నేను ఐదోవాణ్ణి. కడగొట్టువాణ్ణి. అన్నలు, అక్కల్లాగే నేనూ ఊరొదిలిపెడితే – తను వెళ్లి పట్నంలో స్థిరపడాలని ఆయన ఆశ. నాకేమో పల్లెలన్నా, దేశమన్నా ప్రాణం. నాన్న వారసుడిగా ఇక్కడే స్థిరపడి దేశంకోసం ఏమైనా చెయ్యాలనుంది.

నాన్న తెలివైనవాడు. తన మాట చెప్పడు. నేనేమన్నా కాదనడు. కానీ చెంగూ బాబాయ్‌ని రప్పించాడు.

మా ఇంట్లో అంతా చెంగూ అంటారు కానీ, బయట బాబాయ్‌ చెంగల్రాయుడు సార్‌గా సుప్రసిద్ధుడు. నాన్నకి తోడబుట్టినవాడు కాదు కానీ, వాళ్లది అంతకంటే దగ్గరి అనుబంధం. తను నాన్నకంటే పదిహేనేళ్లు చిన్న. పట్నంలో పెరిగాడు. నాన్న పెళ్లప్పుడు తనకి ఏడేళ్లుట. ఆ పెళ్లప్పుడు ఈ ఊరు తెగ నచ్చేసి, సెలవొస్తే చాలు, వచ్చేసేవాట్ట. అమ్మ, నాన్నల దగ్గర బాగా చనువు. పెద్దయ్యేక ఇక్కడే పొలం కొనుక్కుని, రైతుగా స్థిరపడిపోతాననేవాడు. అలా చదువు నిర్లక్ష్యం చేసి, టెన్తు క్లాసు దాటలేదు. తండ్రికి కోపమొచ్చి, ‘‘చదువురాని మొద్దువి. వ్యవసాయం చెయ్యాలనుంటే, ముందు వేరే ఓ రంగంలో నీ సమర్థతను నిరూపించుకో. అప్పుడు నీకు కోరిన ఊళ్లో పొలం కొనిపెడతాను’’ అన్నాట్ట. అప్పుడు బాబాయ్‌ రాజకీయాల్లో చేరేడు. చదువులో టెన్తు దాటకపోయినా కొన్నాళ్లు రాష్ట్రానికి ఇంటెరిమ్‌ విద్యాశాఖామంత్రిగా ఉన్నాడు. తను బాగా జూనియర్‌ కావడంతో, పార్టీలో సీనియర్సంతా ఒక్కటై తనని పక్కన పెడితే – వేరే పార్టీలో చేరాడు. అంతలో మధ్యంతర ఎన్నికలొచ్చాయి. తన పార్టీ అధికారానికి రావడంలో, మరీ అమిత్‌ షా అంత కాకపోయినా, కొంత కీలకపాత్ర వహించాడు. మంత్రి పదవులకంటే పార్టీ పదవులైతేనే పార్టీమీద పట్టుంటుందని, తెరవెనుక రాజకీయాల్లో స్థిరపడ్డాడు. ఇప్పటికి నాలుగు పార్టీలు మారినా ఎక్కడా వివాదాల్లో ఇరుక్కోలేదు. ‘మీడియాలో ఆట్టే కనపడకు, వినపడకు’ అన్నది తన పోలిసీ. అందుకేనేమో మా ఇంటికి చడీచప్పుడూ లేకుండా ఓ ప్రయివేట్‌ టాక్సీలో వచ్చాడు.

ఇంట్లో అడుగెడుతూనే వంగి అమ్మ, నాన్నల కాళ్లకి దణ్ణం పెట్టాడు. నాన్న బాబాయ్‌ని లేవదీసి, ‘‘మా చంటాడూ ఇలా దణ్ణాలు పెడతాడు. యాంత్రికంగా దీవిస్తాం. మరి నువ్వు దణ్ణం పెట్టగానే మాకీ పులకింతలేంటీ – ఊరొదిలి ఎదిగావ్‌ కదా, నీ దణ్ణానికి విలువ పెరిగిపోయినట్లుంది. మావాడికా మాట చెప్పు’’ అన్నాడు.

బాబాయ్‌ ఎందుకొచ్చాడో అప్పుడే నాకర్థమైపోయింది. తను సామాన్యుడా, అన్నయ్య అమెరికాలో చదువుకి వెడితే, క్షణాలమీద బ్యాంకు లోనిప్పించాడు. చిన్నక్క పెళ్లికి పైసా కట్నం తీసుకోని వరుణ్ణి చూశాడు. పెద్దబావకి ఓ కంపెనీ పింకు స్లిప్పిస్తే, బాబాయ్‌ ధర్మమా అని మరో కంపెనీలో చేరి ఫారిన్‌ వెళ్లిపోయాడు.

నాన్న దృష్టిలో బాబాయిప్పుడు కన్నాశుల్కంలో గిరీశం. నేను వెంకటేశం.

ఆరు గదుల మండువా ఇల్లు మాది. బాబాయికి వీధరుగునానుకుని కుడివైపున ఉన్న గదిచ్చారు. అక్కడ సోఫా కమ్‌ బెడ్‌ ఉంది కానీ బాబాయ్‌ అడిగాడని నేనే తెచ్చి మడతమంచం వేశాను. ఒకప్పుడా గదినానుకుని పైకప్పు లేని గచ్చు దొడ్డుండేది. సహజమైన పగటి కాంతిలో, నీలాకాశాన్ని చూస్తూ, చల్లగాలి స్పర్శకి పులకరిస్తూ, చితుకుల మంటమీద కాగిన వేణ్ణీళ్ల స్నానం అదో అనుభవం. ఆధునికత ఆ గచ్చుదొడ్డిని బయటి గాలి, వెలుతురు సోకని బాత్రూంగా  మార్చింది. వేణ్ణీళ్లకి గీజరు, షవరు కాక – అక్కడే మరుగుదొడ్డి కూడా.

మర్నాడుదయం బాబాయ్‌ నాకు మొబైల్లో మహాప్రవక్త అన్నాజీ విడియో చూపించాడు. ‘చెడు వినకు. చెడు కనకు. చెడు అనకు. పెద్దల్ని గౌరవించు. నియమాలు పాటించు. భాష, నడతల్లో సంస్కారం తప్పనివ్వకు. తప్పులు మానవసహజం. నీవల్ల జరిగిన ప్రతి తప్పునీ నీకు నీవుగా గ్రహించి – ఏరోజుకారోజు దైవసన్నిధిలో పశ్చాత్తాపపడి నిన్ను నీవు సంస్కరించుకో’ – రెండు నిముషాల్లో అన్నాజీ చెప్పిన మాటల సారాంశమిది.

వినడమయ్యేక మొబైల్‌ ఆఫ్‌ చేసి, ‘‘అన్నాజీ అసామాన్యుడు. ఆలోచిస్తే, వేదమంత్రాలంత లోతైన మాటలు ఆయనవి. ఈ సందేశాన్ని వంటబట్టించుకుంటే – మనం డాలర్ల కలలు కనడం కాదు. అమెరికా వాళ్లే రూపాయల కలలు కంటారు. నాకైతే, రోజూ ఆయన సందేశం విన్నాకనే మిగతా పనులు. నువ్వూ రోజూ ఆయన సందేశం వినడం అలవాటు చేసుకో’’ అంటూ బాబాయ్‌ ఆ విడియోని నా మొబైల్‌కి పంపాడు.

అంతలో అమ్మ కాఫీకప్పుతో అలా వచ్చింది. నేనక్కణ్ణించి వెళ్లిపోబోతే, ‘‘కూర్చోరా, నీతో ఇంకా మాట్లాడాలి’’ అన్నాడు బాబాయ్‌.

అమ్మ నవ్వి, ‘‘ఇది మా సత్యం పాలు పితికే టైము. ఆ టైముకి వీడక్కడ ఉండాలి’’ అంది.

‘‘ఏం – సత్యం కొత్తగా పాలలో నీళ్లు కలుపుతున్నాడా’’ అన్నాడు బాబాయ్‌.

సత్యం నమ్మకస్థుడైన పాలేరు. వయసులో నాన్నకంటే పెద్దవాడు. బాబాయ్‌కి సత్యం బాగా తెలుసు. సత్యాన్ని అనుమానించడం మమ్మల్ని మేము అవమానించుకోవడమే. ఆ విషయం బాబాయ్‌కి తెలియదనుకోను.

అమ్మ బాబాయ్‌కి ఏంచెప్పిందో నాకు తెలియదు. నేను పెరట్లోకి వెళ్లిపోయాను.

సత్యం పాలు పితకడం అయింది. తన వెనుకనున్న చెక్కబల్లమీద చెంబుని ఉంచాడు. ఆ చెంబు పక్కనే ఓ స్టీలుగ్లాసుంది. అందులో గుమ్మపాలు, అంటే అప్పుడే పితికిన పాలలో తొలిచుక్కలు ఉంటాయి. గోరువెచ్చగా, ఉండీలేనట్లున్న తీపితో అవి నాకెంతో నచ్చుతాయి. పరగడుపునే గుమ్మపాలు తాగడం అమ్మ నాకు చిన్నప్పుడే అలవాటు చేసింది.

సత్యం గ్లాసు అందించి, ఆ వెంటనే కాస్త దూరంగా రాటకు కట్టేసిన తువ్వాయి మెడలో తాడు సడలించాడు. తువ్వాయి ఛెంగుఛెంగున తల్లి దగ్గరకు వెళ్లింది. చిరు ముట్టెతో తల్లి పొదుగును కుమ్ముతోంది. తల్లి ఆవు మెడను తిప్పి తువ్వాయిని ప్రేమగా నాకుతోంది.

నాకా దృశ్యం ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. తల్లీబిడ్డల అనుబంధానికి సృష్టిలో అంతకుమించిన సన్నివేశం ఉంటుందనుకోను. పురాణకథలకు భాష్యంలా – ఆ దృశ్యం నాలో రకరకాల భావనల్ని రేపుతుంది.

ఆవు పాలు దూడకోసం. మేము ఆవుకి రక్షణ కల్పించి, తిండిపెట్టి, పోషించేది కేవలం పాలకోసం. దూడకి దక్కాల్సిన పాలలో అధికభాగం వాడుకుంటూ, దానికి చివర్లో కాసిని పాలచుక్కలు వదులుతాం. తల్లి పాలు దక్కకుండా చేసినా, దూడకి కూడా రక్షణ కల్పించి, తిండి పెట్టి, పోషించి పెద్ద చేస్తాం. ఎదిగేక ఆ దూడ కూడా ఏదోలా మళ్లీ మాకే ఉపయోగపడుతుంది. నిజానికి మేమా ఆవునీ, దూడనీ దోపిడి చేస్తున్నాం. కానీ ఆ ఆవుకీ, దూడకీ, మాకూ స్నేహానుబంధముంది. పరస్పరస్పర్శలో మాలో కలిగే స్పందనలు ఎంతో ఆహ్లాదకరం.

మన ప్రజాస్వామ్యంలో – ప్రజలు, ప్రభుత మధ్య అనుబంధం కూడా ఇలాంటిదేనని నాకు అనిపిస్తుంది.

మా ఇంటి పెరట్లో కొనసాగే ఈ స్నేహానుబంధంలో ఉన్న దోపిడి స్ఫురించకపోతే, మన ప్రజాస్వామ్యంలో జరిగేది దోపిడి అనుకోవడమెలా? ఈ సందిగ్ధమేనేమో నా ఆశయసాధనలో ముందడుగెయ్యకుండా ఆపుతోంది!

కొందరిది మార్కిస్టు దృక్పథం. కొందరిది సామ్యవాదం. కొందరిది స్త్రీవాదం. నాకున్న సందిగ్ధాలు లేనివాళ్లు వారి వారి వాదాలతో నిశ్చింతగా ముందుకెడుతున్నారు. వారిది సబబా, నాది సబబా అన్నది చాలా ఏళ్లుగా నన్ను వేధిస్తున్న ప్రశ్న. సమాధానం దొరక్క, ప్రశ్న దగ్గరే ఆగిపోతున్నాను. దొరికితే – చాలామంది అమాయకుల్ని కాపాడ్డంలో నా వంతు పాత్ర నిర్వహించగల్గుతానని ఆశ!

ఎక్కడ ప్రశ్న పుట్టిందో, అక్కడే బదులు దొరకొచ్చన్న భావనతో – వీలున్నప్పుడల్లా ఇక్కడికొచ్చి మా ఆవూ దూడల అనుబంధాన్ని చూస్తుంటాను. గుమ్మపాలదేముంది – సత్యం తనే ఇంట్లోకొచ్చి నాకందించి వెడతాడు….

‘‘ఏమిటాలోచిస్తున్నావ్‌!’’ ఉలిక్కిపడి వెనక్కి తిరిగితే – బాబాయ్‌!

తనెందుకొచ్చాడో తెలుసు కాబట్టి ముందరి కాళ్లకు బంధమెయ్యాలని, ‘‘నీతో కలిసి వ్యవసాయం చేయాలని సరదాగా ఉంది!’’ అన్నాను.

‘‘పిల్లలు పెద్దల్ని గౌరవించే సంద్రాయం మనది. పెద్దలమీద గౌరవంతోనే, రైతుకావాలన్న ఆశయాన్ని వదిలి రాజకీయాలవైపు మళ్లాను. మరి అన్నయ్య కూడా నిన్ను రాజకీయాల్లోకి మళ్లించాలనుకుంటున్నాడు. ఆ విషయం తెలుసా నీకు?’’ అన్నాడు బాబాయ్‌.

‘‘నీకైతే చదువిష్టం లేదు. నేను నిజంగానే చదువురాని మొద్దుని. రాజకీయాలకు పనికిరాను’’ అన్నాను.

‘‘కానీ నువ్వు మొదువి కాదనడానికి చాలా నిదర్శనాలున్నాయి’’ అన్నాడు బాబాయ్‌.

నిజమే! పదిపన్నెండేళ్లప్పుడే మా ఊరి లైబ్రరీలో పుస్తకాలన్నింటినీ ఔపోసన పట్టేశాను. క్లాసు పాఠాలు తోటివాళ్లకంటే నాకే బాగా అర్థమయ్యేవి. కానీ చదివేది జ్ఞానానికో, వినోదానికో ఐతేనే నాకిష్ట్టం. అందుకే,  పరీక్షల్లో  వాళ్ల మార్కులు ఎనబైలూ తొంబైలూ, నావేమో నలబైకీ యాబైకీ మధ్యలోనూ! టెన్తుదాకా అదే వరస.

స్కూల్లో చాలా సందేహాలొచ్చేవి: మాతృభాషని ప్రేమించమనేవారు. క్లాసులో తెలుగు మాట్లాడితే నవ్వేవారు. దేశాన్ని ప్రేమించమనేవారు. బాగా చదివితే అమెరికా వెళ్లిపోవచ్చనేవారు. దేశానికి రైతే వెన్నెముక అనేవారు. వ్యవసాయం చెయ్యడం చిన్నతనం అనే భావాన్ని మనసులో నాటేవారు.

ఎక్కడో ఏదో లోపముంది. చదివిన ఇతర పుస్తకాల్ని బట్టి ఆ లోపం కొంచెం కొంచెంగా అర్థమయ్యేది.

మంచి మార్కులకోసం ఏంచెయ్యాలో తెలుసు. ఆ మార్కులు నన్ను విదేశాలకు మళ్లిస్తాయని భయమేసేది.

ఊరన్నా ఊళ్లోవాళ్లన్నా నాకిష్టం. ఇల్లన్నా ఇంట్లోవాళ్లన్నా ఇష్టం. ఇష్టమైనవాళ్లతో కలిసుండనివ్వని పెద్ద చదువులు ఎందుకనిపించేది. అంతా ఇంజనీరింగు, మెడిసిన్‌లకై కృషి చేస్తుంటే – నేను ఆడుతూ పాడుతూ చదివి బియ్యే ఎకనామిక్సు చేశాను. అదీ మా ఊరికి ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజిలో.

‘‘నాన్న మాటలు నిజం కాదు. పుత్రప్రేమ, అంతే!’’ అన్నాను. బాబాయ్‌ నవ్వి, ‘‘పట్నంలో పెరిగిన నేను, పల్లెటూళ్లని ప్రేమించడానికి కారణం అన్నయ్యే! అలాంటివాడు తన నలుగురు పిల్లల్ని విదేశాలు పంపించేశాడు. చివరివాడివైన నిన్నూ పట్నం తోలెయ్యాలనుకుంటున్నాడు. తనకీ పట్నం వెళ్లాలనుంది. నువ్వో నేనో, పల్లెటూళ్లో ఉండిపోయి సాధించేది ఏముండదు. మీ నాన్నలాంటి రైతులకే కాదు, నేటి యువతకీ గ్రామాలపట్ల మోజు పుట్టేలా ఏదో చెయ్యాలి. అందుకు రాజకీయాలే సరైన మార్గం’’ అన్నాడు.

బాబాయ్‌లో ఏదో విశేషముంది. నా ఆశయసాధనకి తన దగ్గర ఉపాయం దొరకొచ్చనీ, అది రాజకీయం కావచ్చనీ అనిపించడానికి ఎంతోసేపు పట్టలేదు. ఇంతకీ అసలు విషయమేమిటంటే – బాబాయ్‌కి రాజకీయాల్లో పూర్తిగా తనవాడనిపించే ఓ మనిషి కావాలి.

‘‘ప్రకృతి, మనిషి సహజీవనం చేసే ప్రదేశం పల్లెటూరు. ప్రకృతిని మనిషి నాశనం చేసే ప్రదేశం నగరం. నగర సంస్కృతి పల్లెల్ని నీరసపరుస్తోంది. ప్రకృతి మనిషికి దేవుడిచ్చిన వరమంటారు. ప్రకృతిలోనూ, మనిషిలోనూ కూడా దేవుడున్నాడంటారు. అంటే పల్లెటూళ్లను కాపాడగలిగింది దేవుడు మాత్రమే! అందుకే నేను అన్నింటికీ దేవుణ్ణి నమ్ముతాను. నువ్వూ నాకులా దేవుణ్ణి నమ్మితే, మన ఆశయసాధనకి రాజకీయాలే గొప్ప సాధనం కాగలవని నా నమ్మకం. ఆ ఉద్దేశ్యంతోనే నీకు ఉదయం అన్నాజీ మాటలు వినిపించాను’’ అన్నాడు బాబాయ్‌.

నేనెంతలా ప్రభావితమయ్యానంటే – తర్వాత ఇదిగో ఇలా బాబాయ్‌తో కలిసి నగరంలో తిరిగాను….

–              –              –              –              –

మర్నాడుదయం నిద్ర లేచి, బాబాయ్‌తో కలిసి అన్నాజీ సందేశం విన్నాను.

‘‘ఈరోజు వేణుగోపాలస్వామి గుడికెడుతున్నాం. నీ సంగతి చెప్పు. నాకులా దర్శించుకోగల సత్తా నీకుందా? లేకుంటే నీకు వీలైనట్లే దర్శించుకుందువుగాని’’ అన్నాడు బాబాయ్ నాతో. ‘‘నీకులా అంటే?’’ అన్నాను అర్థం కాక.

‘‘ఈరోజుకి చన్నీళ్ల స్నానం చెయ్యాలి. నేత బట్టలు కట్టాలి. గుడి మనింటికి రెండు కిలోమీటర్ల దూరం. నడిచే వెళ్లాలి. కాళ్లకి చెప్పులుండకూడదు. గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చెయ్యాలి. క్యూలో ధర్మదర్శనం చేసుకోవాలి. దర్శనమయ్యేదాకా చిరాకు, కోపం ఉండరాదు. ఎవరేమన్నా- నవ్వుతూ బదులివ్వాలి. తిడితే పడాలి కూడా’’ అని బాబాయ్‌ అంటే, అదో థ్రిల్‌ అనుకున్నాను కానీ అదెంత కష్టమో, బయల్దేరాక తెలిసింది.

స్నానాదులు పూర్తి చేసుకుని – కాళీ కడుపుతో ఇంట్లో బయల్దేరేసరికి తొమ్మిది దాటింది. కాళ్లకి జోళ్లు లేకుండా రోడ్డుమీద అడుగెట్టేసరికి ముళ్లమీద నడుస్తున్న అనుభూతి. రెండు కిలోమీటర్లు రెండొందల కిలోమీటర్లలా అనిపించాయి. అరగంట దూరానికి సుమారు గంట నడిచాం. దారిలో కాళ్లకి జోళ్లు లేని పేదవాళ్లు చాలామందే కనబడ్డారు. కానీ వాళ్లది ఆలయప్రయాణం కాదు, జీవనయానం. అదీ నాకులా కాకుండా చలాకీగా, హుషారుగా!

గుడికెళ్లేసరికి ఎండెక్కింది. కాళ్లు కాలుతున్నాయి. గుడి ఆవరణ పెద్దది. మూడు ప్రదక్షిణాలకే ముక్కోటి దేవతలూ కనిపించారు. స్వామి దర్శనానికి టికెట్టు పది రూపాయలే. టికెట్టు కొన్న భక్తులకి నిముషాల మీద దర్శనం ఐపోతోంది. వాళ్ల సంఖ్య ఎక్కువున్న కారణంగా ధర్మదర్శనానికి బాగా ఆలస్యమైపోతోంది. ఆ రోజు మాకైతే పన్నెండయింది. ఒకోసారి తనకి రెండు కూడా దాటిపోతుందని బాబాయ్‌ అన్నాడు.

గుళ్లో పులిహోర, దద్ధోజనం ప్రసాదాలుగా ఇచ్చారు. ఆవురావురుమంటున్న నా ఆశలమీద నీళ్లు చల్లుతూ, ‘‘ఇవి ఇంటికెళ్లి అందరితో కలిసి తినాలి. తర్వాత మనం మామూలుగా భోంచెయ్యొచ్చు’’ అన్నాడు బాబాయ్‌.

చేతికొచ్చిన ప్రసాదం నోటికందకుండా పొయ్యేసరికి నాలో ఉక్రోషం, కోపం ఒక్కసారిగా కలిసి పొంగాయి. ఎలాగో తమాయించుకుని, ‘‘ఏమిటిది బాబాయ్‌! మనిషి మనిషికోసం చేసిన నియమాల్ని ఒక్కటి కూడా పాటించని నీకు, దేవుడి విషయంలో ఇంత పట్టింపు అవసరమా?’’ అన్నాను నిష్ఠూరంగా.

బాబాయ్‌ నవ్వి, ‘‘మన దేశంలో అధిక సంఖ్యాకులు సామాన్యులు. మనిషి చేసిన నియమాలు, శాసనాలు తమకే విధంగానూ ఉపయోగపడవని సామాన్యుల భావన. అందుకే వాళ్లు వాటిని అనునిత్యం అతిక్రమిస్తున్నారు. సామాన్యుల జీవితాలు బాగు చెయ్యడానికి ఎన్నుకున్న ప్రతినిధుల్ని శాసించగల హోదా నాది. అందుకే నేను అన్నింటా సామాన్యుణ్ణే అనుసరిస్తాను’’ అన్నాడు.

‘‘అది సరే – మరి దేవుడి విషయంలో మాత్రం ఈ పట్టింపెందుకూ అంటున్నాను’’ అన్నాను చిరాగ్గా.

‘‘ఆమాత్రం ఊహించలేవా? సామాన్యుల్ని కాపాడ్డానికి నా చేతనైనది చెయ్యడం నా బాధ్యత. వాళ్లకోసం మనుషులేం చెయ్యలేరని తెలిసేక, ఇక వాళ్లని దేవుడే కాపాడాలని గ్రహించాను. అందుకే దేవుడి నియమాల విషయంలో ఇంత పట్టింపు’’ అన్నాడు బాబాయ్‌.

దేశానికి ఏదైనా చెయ్యాలన్న నా ఆశయం విషయంలో ముందడుగు ఎందుకు పడడం లేదన్న ప్రశ్నకు సమాధానం దొరికినట్లే అనిపించింది. మరిప్పుడు ముందడుగు పడుతుందా అన్నది కొత్త ప్రశ్న!

—0—

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *