May 2, 2024

7. ఏ తీరానికో

రచన: అమరజ్యోతి

 

చిమ్మ చీకటి. . .

అమావాస్య. . .

కన్ను పొడుచుకున్నా.  . . కానరాని  వెలుగు

నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తోంది.

కాళ్ళ కింద నలుగుతోన్న ఎండుటాకుల చప్పుడు.

దూరంగా  ఎక్కడో  నక్క  ఊళ. . .

గుడ్లగూబల అరుపులు.  . .

అతి భయంకరమైన   నిశ్శబ్దంలో.  . . . .

ష్. . . . . . . . . . . . . ష్. . . . . . . . . గాలి.  . . . .

చేతిలో టార్చ్ లైట్  వెలిగించింది.

పెద్ద పెద్ద చెట్లు  ఊడలు విరబోసుకుని  దెయ్యాలలా.  . .

అతి కష్టంగా నడుస్తోంది  ఓ పక్క బురదలో కూరుకుపోతూ.  . .

నడుస్తోంది. . . . అలా.  . . అలా. . .

మైళ్ళకు మైళ్ళు.  . . అలసిపోతోంది.  . సోలిపోతోంది.  . .

దాహంతో నాలుక పిడచకట్టి పోతోంది.  అయినా గమ్యం చేరుకోవాలి.

ఇదే లక్ష్యం.  . ఒకటే ఆరాటం.  . ప్రాణాన్ని పణంగా పెట్టి నడుస్తోంది.  . సాగుతోంది

అనుకున్నది సాధించడం ఒక్కటే లక్ష్యం.

ఒక్కటే గురి.  . .

అదిగదిగో దూరంగా వెలుతురు  కనిపిస్తోంది.  నక్షత్రాల్లా. . . మెరుస్తూ.  . . చెట్లపై

ఇంకా.  . ఇంకా.  . వెళ్తోంది.  . . ఆ చెట్ల తోపుల్లోకి

పైకి చూసింది.    కళ్ళను మిరిమిట్లుకొల్పుతూ. . . నక్షత్రాల్లా.  .  కనిపించినవి రకరకాల పూలు

రంగు రంగుల పూలు.    అబ్బ ఎన్ని రంగులో. . తెలిసిన రంగులే కాక ఎన్నో రకాల షేడ్స్,

తన జన్మలో ఎప్పుడూ చూడనివి,  వినను కూడా లేనివి.  మతిపోతోంది.

అన్నీ కావాలన్న ఆరాటం.  కానీ తనకి ఒక్కటి సరిపోతుంది.  అసలు ఒక్కటే తీసుకోవాలి.

అదే ధర్మం న్యాయం.  సరే ఇప్పుడు ఎంచుకోవాలి.  ఎదో ఒక్కటే.  . . ఏది ?ఎలా? మనసు పరి పరి విధాల పోతోంది.

ఎలా. . ఎలా సరే తప్పదు  కనుక  ఒక బంగారు రంగు పుష్పంపై చేయి వేయబోయింది.  అందకుండా వెనక్కెల్లింది.

మరో ప్రయత్నం చేసింది   ఇంకా వెనక్కెల్లింది  ఎంత ప్రయత్నించినా  వెనక్కి పైకి పోతోంది అందకుండా.  . .

సరే మరో దవళ వర్ణపు  పుష్పాన్ని  అందుకోబోయింది, .  అదీ  అందుకోబోయింది.  సున్నితంగా కోసుకోవచ్చనుకుంది.  కానీ తనదీ అదే దారి అందలేదు.

ఊదారంగు,  ఎరుపు రంగు,  నీలం,  ఆకుపచ్చ, పసుపు, ఆఖరికి నలుపురంగు పూవునూ ప్రయత్నించింది.

ఏదీ దక్కలేదు వెక్కిరిస్తూ పైపైకి పోతున్నాయి.  చాలా భాదగా వుంది.  ఏదుపోస్తోంది.  నా బంగారుతండ్రి కి,  నా ఒక్కగానొక్క కొదుక్కీ,  నా మురిపాల మూటకు నా బంగారు బాబుకు ఒక్క పూవూ బహుమతిగా ఇవ్వలేనా ?

పుట్టిన తర్వాత ఇంతవరకూ ఏది అడిగినా కాదనలేదే ఇప్పుడెలా ?ఆలోచిస్తోంది ఏ రకంగా సంపాదించాలి ?

సహాయం చేసేవరేవ్వరూ లేరు.  ఎలా. . ఎలా. . ఏంతో సతమతమవుతోంది.  మధన పడుతోంది.  ఏమిటిది ?ఎందుకిలా ?

ఆఖరికి చెట్టు కూడా  ఎక్కుదామని  ప్రయత్నించింది.  ఒక్కసారిగా పిడుగులు పడ్డట్టు శబ్దంతో కూడిన  అరుపులు. . .

వద్దు.  . వద్దు.  . రావద్దు.  . అంటూ.  . . ఒక్కసారిగా  ఉలిక్కిపడి  తేరుకుంది.  ఎవరు.  . . ఎవరు?  ఇవన్నీ ఈ పూభోణీల

అదే  అమ్మాయిల  తల్లిదండ్రుల  గొంతు కదూ.  . !అవును గుర్తుపట్టింది.  తనూ.  . . కోపంగా అరుస్తూ.  . అదే స్థాయిలో అడిగింది.  ఎందుకు ?ఎందుకు  వద్దు చెప్పండి ?మాకు అర్హత లేదా ?ఎందుకు లేదు ?ఏమి తక్కువ ?

అవును.  . ఆస్తి  తక్కువ.  . ఒక  గొంతు  కర్కశంగా.  .

అవును  భూములూ,  పుట్టలూ లేవు.  మరో గొంతు.  . .

సినిమా హీరోలా లేడు. . మరో గొంతు కీచుగా.  . .

అక్కా, చెల్లి,  వున్నారు. . . మరో విషపు నాగు గొంతు.  . .

నాన్నకు  హోదా లేదు  అంతస్థులేదు.  . . మరో దయ్యం  గొంతు. . .

అమ్మా, నాన్నా బతికే వున్నారు. మరో పిశాచo. . అరిచింది.

అందుకే వద్దు.  మాకు మీ సంబంధం వద్దు.  .

మీ అబ్బాయికి  మా అమ్మాయిని ఇవ్వం  తీర్మానించారు.

ఆ పూలలాంటి అమ్మాయిలను  కన్నతల్లిదండ్రులు.

అయినా, పట్టుదలగా,  చెట్టు ఎక్కబోతూంటే. . .

వాళ్ళు బాణాలు  వేస్తున్నారు. ఎన్నో.  . ఎన్నెన్నో.  . .

అన్నీ అబద్దపు బాణాలు,  విషపు బాణాలు.  . . .

అబ్బో.  . . . .     కొన్ని గుచ్చుకుంటున్నాయి.

వద్దు వద్దు.  . . అరుస్తూ.  . . లేచింది నిద్ర లోంచి  విశాలిని.

భయంతో  బిక్కచచ్చిపోయింది. ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్ద అయ్యింది.

ఒక్కసారి చుట్టూచూసింది.  తన గదిలోవుంది.

వచ్చింది  కల అని  అర్ధమైంది. ఒక్కసారిగా, దుఃఖం, ఏడుపు తన్నుకొచ్చాయి.

చేతుల్లో మొహం కప్పుకొని ఏడ్చేసింది.  కాస్సేపటికి కాస్త తేరుకుంది.

ఎందుకిలాంటి కల వచ్చింది ?

కొడుకు  పెళ్లి విషయంలో తను పడుతున్న వేదన ఈ రూపంలో.  . .

తల విదిల్చి లేచింది.  బాత్రూంలోకెళ్ళి  మొహం కడుక్కుని వచ్చింది.  జడ వేసుకుని,  చీర మార్చుకుని,  కాస్త పౌడరద్దుకుని,  బొట్టు పెట్టుకునేసరికి కాస్త మనసు ప్రశాంతమయింది.  కాస్త టీ పెట్టుకు తాగింది.  డాబా పైకెళ్ళింది.

విశాల ఆకాశం పరిశీలనగా చూస్తుంటే,  మనస్సు సేదదీరింది.  హాయిగా వుంది.  కూర్చుని ఆలోచించింది.  ఒక సం//నుంచీ తను కొడుక్కి పెళ్లి చేద్దామని సంబంధాలు  చూడడం మొదలు పెట్టింది.  ఎవరినైనా ఇష్టపడుతున్నాడేమో.  . . అని అడిగి చూసింది.  లేదని  చెప్పాడు.

అమ్మాయి నీకు,  నీకు అమ్మాయి నచ్చటమే ముఖ్యమనీ,  కులమతాల ప్రసక్తి కానీ,  కట్నకానుకల ప్రసక్తి కానీ మన ఇంట్లో వుండవని, నీకు అవి ఇష్టం లేవని తెలిసే చెప్తున్నా. . చెప్పింది.  అయినా తన ఇష్టానికే వదిలేసేడు.  తను చూసిన అమ్మాయినే  నచ్చితే చేసుకుంటానన్నాడు.  చిన్నప్పటి నుంచీ కష్టపడి చదువులో ముందంజలో ఉండేవాడు.  ఆటల్లో కూడ.  . . స్కూల్లోను,  కాలేజి లోను ఎన్నో బహుమతులు  గెలుచుకున్నాడు.  రాష్ట్రస్థాయిలోనూ,  జాతీయ స్థాయిలోనూఎన్నో అవార్డులు,  ప్రశంసాపత్రాలు పొందాడు.  దేశమే గర్వించే విధంగా ఎందరివో దీవెనలు అందుకున్నాడు.  ఉద్యోగంలో చేరేక వాళ్ళ కంపెనీ తరపున పోటీలలో పాల్గొని వారికీ ఎంతో ఖ్యాతిని ఆర్జించి పెట్టాడు.

దేశం గర్వించే బిడ్డను కన్నందుకు,  అలా పెంచినందుకు చాలా సంతృప్తిగానే  వుంది.  అందంగా వుంటాడు.  ప్రతి బిడ్డా తల్లి కంటికి అందగాడే అనుకోకండి.  నిజంగానే అందంగా వుంటాడు.

మరి. . . ఇన్ని వున్నా పెళ్ళి ఎందుకు కుదరట్లేదు ?

ఈ సమాజం  మనిషిని  కొలిచే కొలతలు.  . డబ్బు,  హోదా,  ఆస్థులు, అంతస్తులు.  .  ఎలా  సంపాదించినా  పరవాలేదు.  ఛీ.  . ఛీ.  . . అసయ్యం వేస్తుంది.  వ్యక్తిగతంగా వున్న విలువలు,  ప్రతిభల కన్నా. . అవే ఎక్కువ.  చాల భాధ,  విరక్తి కలిగేవి వారి మాటలు వింటుంటే.  . . ఎంతమంది  ఆదర్శవాదులు,  సంఘ సంస్కర్తలు ఎంత కృషి  చేసినా  ఏముంది?

ఈ సమాజంలో  కులమతాల  పిచ్చి,  డబ్బు పిచ్చి  నరనరాన  జీర్ణించుకు పోయాక,  వేళ్ళూనుకు పోయాక,

అత్యాశల  జీవితాలు  గడుపుతారు.  ఆ కుళ్లును కడుక్కోరు.  అంతే.  . ఛి.  . ఛి.  . ఇక ఆలోచించలేకపోయింది.

భాదామయమైన  మనసును దారి మళ్లించే  క్రమంలో పనులు యాంత్రికంగా చేస్తోందే కానీ.  . . మళ్ళీ. . ఆలోచనలే.  . .

నిన్న అత్తయ్యగారు  ఫోనులో అన్న మాటలు మరీ ముళ్ళుల్లా  గుచ్చుకున్నాయి. వున్న ఒక్కగానొక్క కొడుక్కి పెళ్ళి చేయలేక పోతున్నానట. ఎంతసేపూ సమాజం, సభలూ అని తిరుగుతున్నానట.  వాడి కోసం తానేమి అసలు చేయలేనట్లు,  నిర్లక్ష్యంగా వున్నట్లు,  ఉద్యోగం చేస్తోన్నపిల్లాడిని అలా ఎలా వదిలేసేవ్ అంటూ ఎన్ని మాటలన్నారని

ఆమెకే మనవడిపై  ప్రేమ వుంది నాకు లేనట్లు అంటున్నారు.  విపరీతమైన కోపం వచ్చింది.  ఎప్పటి నుంచో  తనలో వున్న బాధ,  వేదన తన్నుకొచ్చింది.  ఇక ఆమెతో ఇన్నాళ్ళూఅనకుండా వున్నవి ఆవేశంగా అడిగేసి,  కడిగేసింది.

నేను బాబు పెళ్ళికోసం  ఎన్నివిధాలుగా ప్రయత్నిస్తున్నానో  మీకు తెలియదా?నన్నెలా అనగలుగుతున్నారు?

అసలీ  దుస్థితి అంతా. .  ఇప్పుడు అమ్మాయిలు  తక్కువగా  వుండడం వలెనే కదా.  . . అబ్బాయిల తల్లిదండ్రులకు ఈ అవస్థలు? అసలిదంతా మీలాంటి వారి వల్లే కదా. . .  గత ఇరవై ఏళ్లకు ముందు స్కానింగ్ లో  కడుపులో వున్నది అమ్మాయని  తెలిస్తే చాలు  అబార్షన్లు  చేయించేసేవాళ్ళు.  నాకు,  మీ కూతురికి అలానే చేయించేసేరు. ఆమె ఎంతగా మొత్తుకున్నా విన్నారా?మీ కొడుకు కట్నాలిచ్చి పెళ్ళి చేయలేడని,  నాకింకా  చిన్న వయసేనని ఇద్దరు పిల్లలను చూసుకోలేనని వంక చెప్పేరు.  నాకు,  మీకు నచ్చచెప్పే అంత వయసు,  జ్ఞానం లేవు.  మిమ్మల్ని ఎదిరించి ;మాట్లాడే శక్తీ  మీ అబ్బాయికి లేవు.  ఇన్ని కారణాల వల్ల ఐతే  ఏమి ?ఈ  రోజు  పలుకరించే కూతురు లేకుండా అయిపోయాను.

నేటి సమాజంలో అబ్బాయిలు ఎక్కువగా, ,  అమ్మాయిలు  తక్కువగా  ఉండటానికి కారణమయ్యేరు. అమ్మాయిలు, అబ్బాయిలతో సమానంగా  చదువుకుని వుండి, ఎంచుకునే ఛాయిస్ లు  వున్న క్రమంలో,  అబ్బాయిల పరిస్థితి ఇలానే వుంటుంది మరి.  అన్నీ తెలిసి నిందిస్తున్నారు.  అని అన్నీ అనేసి  మనసు తేలిక చేసుకుంది.  విపరీతంగా గతాన్ని,  తలుచుకుని  వేదన చెందిన మనసు,  అలసిన తనువూ,  కనులకు విశ్రాంతినిస్తూ.  . . . . నిద్రలోకి జారుకున్నాయి.

ఎప్పటిలానే తెల్లవారింది.  ఎవ్వరి బాధలతోను, ఎవ్వరి క్షోభలతోనూ,  సంభందం లేకుండా,  తన పని తను చేసుకు పోతోంది ఈ ప్రకృతి. వాకింగ్  చేసి వచ్చిన విశాలిని వాకిట్లో పడిన దిన పత్రికను అందుకుంది.  జిల్లా ఎడిషన్ లో మదర్స్ డే సందర్భంగా, ఇద్దరు తల్లుల ఫోటోలు వేసి వారి గురించి రాసారు.  ఒకామె ఇంటర్వ్యూ పై రాసిన హెడ్డింగు పై తన దృష్టి పడింది.

అమ్మకే మరో జన్మని ఇవ్వబోతున్న బంగారు తల్లి.  అని  ఆసక్తి గా చదివింది.  ఇంజనీరింగ్ లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి, అత్యధిక  మార్కులు సాధించి ,  గవర్నర్ చే అభినందనలు అందుకున్న అమ్మాయి. . అవని కిడ్నీ ఫెయిల్. అయి అనారోగ్యంతో ఆపరేషన్ చేయాల్సిన  స్థితిలో వున్న తన తల్లికి  తానే  కిడ్నీ ఇవ్వటానికి  సిద్ధపడిందని,  ఇలాంటి  కూతుర్ని కన్న తల్లిగా గర్విస్తున్నాననీ,  అయితే  పెళ్ళి   కావాల్సిన  పిల్లను ఇలా అవుకుగా చేయటం తనకు  ఇష్టం లేదనీ, లక్షలు ఖర్చు పెట్టి  కొని  వైద్యం  చేయించుకునే స్థోమత  తమకు లేదనీ,  అవనికి ఎంత వద్దని వారించినా, వినటం లేదనీ  ఆమె బాధను  వ్యక్తం చేసింది.  ఇది చదివిన  విశాలిని హృదయం  కదిలి కన్నీరొలికింది.

కాస్సేపు ఆగి బాగా ఆలోచించి లేచింది.  స్నానం చేసి వచ్చింది.  కాఫీ కలిపి తెచ్చుకుంది.  ఆ పత్రిక విలేఖరి  ద్వారా  అవని అమ్మ సరోజ గారి ఫోను నెంబర్ తెలుసుకుని ఆమెకు ఫోన్ చేసి మాట్లాడి,  ధైర్యం చెప్పింది.  నేనున్నాను  ఒక సోదరిలా.  . భయపడవద్దంది. వారి ఇంటి అడ్రెస్స్,  డాక్టర్ ఎవరో తెలుసుకుని  వారి ఫోన్ నెంబర్ తీసుకుంది.

తమ లయన్స్ క్లబ్ మెంబెర్స్ కు,  ’చైతన్యజ్యోతి’’మహిళా సభ్యుల గ్రూపుకూ, తన బెస్ట్ ఫ్రెండ్స్ సర్కిల్  అందరికి వాట్స్ యాప్ లో మేసేజ్ లు  పెట్టింది. ఈ ఆపరేషన్ విషయమై తనకు మరో పరిష్కారం  కావాలని,  అవనికి  ఆపరేషన్ చేయకుండా తన వంతు  కృషి  చేస్తాననీ, కిడ్నీ ఇచ్చేవారుంటే,  తనకు  తెలియచేయమని  అభ్యర్ధించింది.  అందరూ తమ తమ మార్గాల్లో  ప్రయత్నాలు మొదలు పెట్టారు.

తన స్నేహితురాలు ‘’మానవ సేవే  మాధవ సేవ‘’ బాడీ డోనార్స్  సంస్థ ను ఎంతో నిస్వార్ధంగా నడుపుతోన్న ఎం.  ఎస్.  లక్ష్మిని  సహాయం చేయమని కోరింది.  తన ఫ్రెండ్ రమకు  వూర్లో నే ఉంటున్న  సరోజగారి అడ్రెస్ చెప్పి

అక్కడికి రమ్మని కోరింది.  తానూ తన వెహికల్ పై వెళ్ళింది.  వారి ఇల్లు చూసి అబ్బురపడింది. పాత కాలం నాటి పెంకుటిల్లే  అయినా ముచ్చటగా  ఉంచారు.  ఇంటి  ముంగిట ముత్యాలతో పెట్టినట్లు  వున్న ముగ్గు. పక్కనే వున్న కాస్త స్థలం లోను ఎన్నో మొక్కలు పచ్చగా.   లోపలి నుంచీ చక్కగా లంగా, ఓణి లో వున్న అమ్మాయి వచ్చి లోపలికి తీసుకెళ్ళినది. తనను అవనిగా పరిచయం చేసుకుంది.  గదిలో పడుకున్న తల్లి దగ్గరకు తీసుకెళ్ళి పరిచయం చేసింది.  విశాలిని, రమలు ఇద్దరూ తాము తెచ్చిన  పళ్ళను టీపాయిపై  పెట్టి తమ గురించి విపులంగా చెప్పారు.

ఉదయం పేపర్లో చూసిన దగ్గర నుంచీ.  . అంతా. . . . ఆమె కళ్ళు తుడుచుకుంది. నిస్సహాయురాలినై పోయానండి అని.

కూతురు భవిష్యత్తు పై ఆమె ఆవేదన,  ఆరాటం నిస్సహాయత ఏడ్చి, ఏడ్చి కన్నీరింకిన ఆ కళ్ళే చెబుతున్నాయి. విశాలిని  అవనిని  దగ్గరకు తీసుకుని, చెక్కిలి నిమిరి నుదిటి పై ముద్దు పెట్టింది.  మీకు,  అవనికీ ఎమీ కాదమ్మా బాధపడకండి.  మా మిత్రులందరం  మీకు ఆపరేషన్ జరిగేలా చూస్తాం,  అవని అవసరం లేకుండా.  . . భయపడకండి. రెస్ట్ తీసుకోండి. మేము వెళ్తాం మీకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం.  . అని అవని తల్లిని  ఓదార్చి, బయలుదేరారు.

గేట్ వరకు వచ్చిన  అవనిని అభిమానంగా.  . . చూస్తూనే, బయటకు  కదిలింది  విశాలిని. ఉదయం  లేచేసరికే శుభవార్త. అవని విషయంలో  తాత్కాలికంగా ఏర్పరచిన  సమూహమ్ లో మిత్రుల నుంచీ సందేశాల రూపంలో రాత్రి నుంచీ నడుస్తున్నట్లున్నది.  తానే చూడలేదు.  వారి   సమిష్టి  కృషి లో శ్రమ తెలుస్తోంది. మొత్తానికి  సాధించేరు.

చాలా సంతోషం కలిగింది.  చాలా రోజులు పట్టొచ్చనుకున్నాను.  కిడ్నీ దాత దొరికారనీ,  వాళ్లకి ఇచ్చేంత మొత్తం  సమకూరిందనీ,  డాక్టర్ గారికి ఈ సంగతి చెప్పి మీరు ఆపరేషన్ ఎప్పుడు చేసినా,  మీ ఇష్టమే అని చెప్పామని,  డాక్టర్లు తమ వంతు కృషీ చేసి ఆమెకు త్వరగా ఆరోగ్యవంతురాలిని చేస్తామని  చెప్పారట.  బహుశా నేడో, రేపో ఆపరేషన్ ఏర్పాట్లు చేయొచ్చని ఆనందంగా చెప్పేరు.  ఓహ్.  . . thanks. . బాబా.  . . కన్నీరు చిప్పిల్లగా. . . . మనస్పూర్తిగా. . . .

మరో పది రోజులకు అంతా సుఖాంతమైంది.  సరోజగారి ఆపరేషన్ సక్సస్ కావడం,  ఆమె ఆరోగ్యంగా వుండడం.  అందరి సహాయ సహకారములతో,  అందరం సంతృప్తిగా  వున్నారు.   సమిష్టి కృషికి మెచ్చుకుంటూ,  దిన పత్రికల్లో వార్తగా,   అందరి అభిప్రాయాలనూ ప్రచురించారు.  డాక్టర్లు చేసిన సేవకు,  వారి సౌజన్యానికి  ధన్యవాదాలు తెలిపారు.

మరో నెల రోజులు విశాలినికి  తెలియకుండా గడిచి పోయాయి.  ఎలా అంటే. . . అదేనండీ అమ్మాయిల వేటలో.  .ఆ రోజు  సరోజగారిని చూసి వచ్చేక విశాలినితో రమ  అవనిని  మన  రఘుకు అడిగితే.  . . . ఎలా ఉంటుందని.  . ?

ఒక్కసారిగా ఆశ్చర్య పోయింది. విశాలిని తన మనసులో వున్నది ఎలా తెలిసిందా అని.  నిజమే రమా. . . అవని అన్నింటిలోనూ చాలా బావుంటుంది.  అందం,  చదువు,  వినయం,  విధేయతా,  సంస్కారం,  కలగలసిన అపురూపమైన వ్యక్తిత్వం గల అమ్మాయి.  ;కానీ. .  ఆ అమ్మాయి కి చేసిన సహాయాన్ని ఇలా వినియోగించుకోవడం  అన్న ఆలోచనే  అమానుషంగా. . . వుంది.  మనం అడిగితే వాళ్ళు కాదనరు.  కానీ వారి కృతజ్ఞతను మనం  మనకు అనుకూలంగా మలుచుకోవడం దారుణం.  నాకే కాదు రఘు కూడా  అస్సలు ఒప్పుకోడు.  వద్దు   రమా  అంది.  అలా.  . ఎలా.  .

అనుకుంటావు ?వాళ్ళకూ ఇలాంటి అబ్బాయి  దొరకాలి కదా !అంది.  లేదు రమా.  . ఆ అమ్మాయి ఇప్పుడే జీవితం చూస్తున్నది మంచి భవిష్యత్తు వున్నది.  తన ఆలోచన మేరకు  తనకు నచ్చిన వ్యక్తిని  ఎన్నుకుంటుంది. మనందరి కృషితో జరిగిన మంచి పనికి ప్రతిఫలాన్ని ఆశించినట్లు ఉండడం  నాకు మనస్కరించడం లేదు. వదిలేయ్ అంది.  మధ్యాహ్నం పోస్ట్.  . అన్న పిలుపుతో.  . వచ్చిన పుస్తకాలతో పాటు ఒక ఇన్లాండ్ కవర్ ను చూసి  ఆశ్చర్యం.

అందమైన అక్షరాలతో చిరునామా. . తనదే.  . తనకే రాసేరు ఎవరబ్బా?విప్పితే.  . . ఇలా. . .

పూజ్యులు విశాలిని గారికి,

నమస్కారములు.  నా పేరు సుష్మ.  మీకు గుర్తుంటాను నేను ఎందుకంటే  మీ అబ్బాయి కోసం నన్ను చూడటానికి మా ఇంటికి  వచ్చారు.  నేను నచ్చానని చెప్పారు.  కానీ నాన్న ఎందుకో ఈ సంబంధం పట్ల ఆసక్తి  చూపించలేదు.  మీతో ఏమి చెప్పేరో నాకు తెలియదు.  నాకు నచ్చారు అని చెప్పలేకపోయాను.  అంత ధైర్యం లేదు నాన్న దగ్గర

కానీ ఆంటి, మీరు ఈ మధ్య  అవనిని కాపాడిన తీరు, తన కోసం మీరు పడ్డ శ్రమ,  చేసిన కృషి అన్నీ నా స్నేహితుల ద్వారా విన్నాను.  మీరంటే విపరీతమైన అభిమానం కలిగింది.  ఈ విషయాలన్నీ నాన్నకు చెప్పి ఆ రోజే మీ అబ్బాయి,  మీరు  నాకు నచ్చారన్నసంగతి గుర్తు చేసేను.  ఇప్పుడు నాన్న కూడా ఇష్టపడ్డారు. మీలాంటి అమ్మ ఉన్న వ్యక్తి తప్పకుండా, మంచి హృదయమ్ కలవాడై వుంటాడు.  మీకు ఇష్టమైతే నన్ను మీ కుటుంబంలో చేర్చుకోండి.  అమ్మ లేని నాకు ఆ లోటు తీర్చండి.  అమ్మ ప్రేమను చవి చూసే అదృష్టం కలిగించండి.  మీరు నాన్నగారితో మాట్లాడి మా పెళ్ళికి ఏర్పాట్లు చేస్తారని  ఆశిస్తున్నాను.

ఇట్లు

సుష్మ

చదవడం పూర్తి చేసిన విశాలిని  కళ్ళనిండా నీళ్ళునిండాయి. ఇలాంటి అమ్మాయి కోసమే  కదూ !తాము చూస్తున్నది,  కోరుకున్నది అనుకుంటూ రఘుకూ.  రమకూ ఈ శుభ వార్తను చెప్పటానికి లేచింది ఆనందంగా.  . . . .

 

 

 

 

 

 

1 thought on “7. ఏ తీరానికో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *