April 27, 2024

8. ఐ టూ…

రచన:  వారణాసి రామకృష్ణ

 

ఇoడియాలో సరదాగా గడుపుదామని అమెరికా నుండి వచ్చి ఫ్రెండ్ వెంకట్ రెడ్డికి ఫోన్ చేస్తే ఎంతకీ తియ్యట్లేదు.  కంగారుగా వాడి ఇంటికెళ్తే వాళ్ళావిడ ఎదురై భోరుమని ఏడుపు ప్రారంభిoచింది.

కొంపదీసి వెంకట్ గాడు గానీ బాల్చి తన్నేసాడా..ఛీ ఛీ పాడు ఆలోచన అనుకుంటూ “ఏంటమ్మా వెంకట్ రెడ్డి ఇంట్లో లేడా” అడిగితే  “అయ్యో అన్నయ్య! రెండ్రోజులైంది,ఆయన ఎవరితో మాట్లాడడంలేదు! గదిలోంచి బైటికి రావట్లేదు. నాకెందుకో భయంగా ఉంది” అంటూ మళ్ళీ భోరుమంది.  ఏమయ్యిందానని గదిలో కెళ్ళి చూస్తే ముసుగు కప్పుకుని ఓ మూల కనిపించడు.  నన్ను చూడగానే వెంకట్  కెవ్వుమని కేక పెట్టాడు.  ఆ అరుపుకు నేను భయపడి చచ్చి గట్టిగా అరిచాను.

“అరె నువ్వా ?అదేంట్రా అట్లా అరిచావు?” వెంకట్ రివర్స్ లో అడిగితే

“వెధవా నువ్వెందుకు కేక పెట్టావు?” ఇంకా గుండె దడ తగ్గలేదు నాకు.

“అరెస్టు చెయ్యడానికి పోలీసులు వచ్చారనుకున్నా!” వణుకుతూ చెప్పాడు.

“అరెస్టా? నిన్నెందుకు అరెస్ట్ చేస్తారూ?” అడిగితే  నెత్తి మీది ముసుగు తీసి భయంగా చెప్పాడిలా –

“ఇండియాలో ఇప్పుడు మగవాళ్ళంతా కేసుల భయానికి దడిసిపోతున్నారు, తెలుసా?”

“కేసులా? ఏం కేసుల్రా?” కొంచం నేనూ  భయపడ్డాను.

“ఆడవాళ్ళంతా ఇప్పుడు మగాళ్ళ మీద ‘మీ టూ’ కేసులు పెడుతున్నారు ”

“మీ టూ? అంటే?”  అర్ధం కాక బుర్ర గోక్కుoటే  “అమెరికాలోనే మొదలైంది నీకే తెలీదా?”  అంటూ

మీ టూ ఉద్యమం గురించి చెప్పుకోస్తూ లోగడ  ఏ ఏ సెలబ్రిటీ లతోఎవరెవరు అసభ్యంగా ప్రవర్తించారో వాళ్ళు   ఫిర్యాదులు చేస్తే కేసులు, అరెస్టులు గోల అంటూ అన్నీ చెప్పాడు.

“సరే!నువ్వేమైనా సెలబ్రిటీనా? నీ మీద ఫిర్యాదు ఎవరు చేస్తారు? నీకెందుకురా భయ్యిం ”

“ఆఫీసులో నా అసిస్టెంట్ మణికి లీవ్ శాంక్షన్ చెయ్యలేదని, వర్కు బాలేదని సరళని చీవాట్లు పెట్టా! దాంతో ఇద్దరూ కక్ష గట్టేరు. మొన్న లంచ్ అవర్లో మీ టూ అని వెంకట్ రెడ్డి అని ఏదో గుసగుస లాడుతూ నన్ను చూడగానే సైగలు చేసుకున్నారు. అప్పుడే అనుకున్నా-ఈ  బకారా గాడ్ని  మీ టూ లో కేసులో ఇరికిస్తే పనై పోతుందని ఇద్దరూ డిసైడ్ అయ్యారని !”

“ఎహే పో!  నువ్వు నీ పిచ్చి అనుమానాలు?” కొట్టి పారేశాను.

“అమ్మో! వీళ్ళు కాకపొతే పక్కింటి పిన్నిగారు గ్యారెంటీ కేసు పెడుతుంది! ఆవిడ చీర కొంగు లాగేను”

“చీర కొంగు లాగేవా? ఎందుకు లాగేవు ?” అనుమానంగా చూసి కోపంగా అడిగాను.

“బుద్ది లేక! ఓ రోజు సైకిల్ మీద వెళ్తుంటే పిన్నిగారు  రిక్షాలో వెళ్తూ కనిపించేరు. సరిగ్గా అప్పుడే ఆవిడ  చీర కొంగు రిక్షా చక్రంలో చిక్కుకోవడం చూసి  ప్రమాదం తప్పిద్డామని కొంగు లాగేను. అప్పుడు  పిన్నిగారు  ఉరిమి చూసేరు!”  చెప్పి భయంతో వణికి పోయాడు. ఎక్కడో తేడా అనిపించి

“సైకిల్ మీద వెళ్తుండగా జరిగిందా?” అడిగాను.

“అవున్రా! ఆ తర్వాత వాళ్ళు ఇల్లు మారేరు. మొన్న మళ్ళీ పిన్ని గారు  మార్కెట్లో తీక్షణం గా చూసి నిన్ను ఎక్కడో చూశాన్రా అబ్బాయ్ అంది. అప్పట్నించి.. “ అంటూ చిటికెన వేలు పైకెత్తి చూపి

“భయంతో దాని క్కూడా పోవట్లేదు” బాధగా మొహం పెట్టాడు.

నేను వాడ్ని ఎగాదిగా  చూసి “ఎంతకాలమయ్యింది?” ఆడిగాను.

“ఏంది? బాత్రూం పోకనా?”

“తూ, అదికాదుబే! కొంగు లాగిన సంఘటన జరిగి!

“అదా! పాతికేళ్ళు అయ్యే ఉంటుంది”  వెంకట్ చెప్పగానే తుళ్ళి పడి “ఏంట్రా? పాతికేళ్ళ కిందటి సంగతి ఇప్పుడు చెప్తున్నావా? నేనింకా ఈమధ్య అనుకున్నా! అంటే పిన్నిగారి వయస్సు ఇప్పుడు…”

లెక్కలేస్తూ బుర్ర గోక్కుంటే  “డెబ్బైకి తక్కువుండదు! “ తాపీగా చెప్పాడు.

“ఎదవ!ఎదవన్నర ఎదవ! అప్పుడు నీ వయసు ఎంత ?

“నాకప్పుడు  పదేళ్ళు బాసూ”

“తూ! ఎప్పుడో నువ్వు బుడ్డోడుగా వున్నప్పుడు  కొంగులాగితే ఇప్పుడు ఈ వయసులో ఆవిడ నీ మీద కేసు పెడుతుందా! బుద్ది లేదూ, పిచ్చి అనుమానాలు కట్టిపెట్టు ” కోపం ముంచుకొచ్చి తిట్టి వాడిని హాల్లోకి లాకొచ్చా!

అప్పుడు   టీవీలో– మీ టూ ఇంటర్వ్యూ వస్తోంది. బోలెడు మంది ఆడవాళ్ళు  యాంకరమ్మ ప్రశ్నలకి సమాధానం ఇస్తున్నారు. ఒక అమ్మాయి  సినిమాలో ఛాన్స్ కోసం వెళ్తే నిర్మాత అసభ్యంగా ఎలా ప్రవర్తించాడో భోరుమని ఏడుస్తూ  వివరించింది. తర్వాత పక్కనే ఉన్న ఇంకో ముసలమ్మ మీదకి కెమెరా ఫోకస్ చెయ్యగానే  బోసినవ్వులు నవ్వుతూ  “అప్పడు నాకు ఇరవై ఏళ్ళు! అందంగా ఉండేదాన్ని. సిన్మా షూటింగ్ అయ్యాక బోడిలింగం గారు  నా చెయ్యి పట్టుకుని   ” సిగ్గుతో  ఆగిపోయింది.

“ఏమైందో చెప్పండి ?” యాంకరమ్మ నవ్వుతూ పళ్ళు బైట పెట్టి కుతూహలంగా అడిగింది

ముసలమ్మ ముసిముసి నవ్వులు రువ్వుతూ “చెప్పలేను బాబూ.. తెగ సిగ్గేస్తోంది” అంటూ మూతి ముప్పై మూడు వంకర్లు తిప్పింది. “చెప్పాలి! మీలాంటి సీనియర్లు చెప్తేనే అలాంటి మృగాళ్ల బండారం బైటికివచ్చేది! “ అంటూ యాంకరమ్మ “ ప్రముఖ దర్శకనిర్మాత సినీ స్టూడియో అధినేత శ్రీ  బోడిలింగం  గారు ఇప్పుడుఎలా  స్పందిస్తారో లైవ్ లో చూద్దాం”  చెప్పగానే టీవిలో మంచంమీద ఆఖరి  దశలోఉన్న  బోడిలింగం గారు కనిపించారు. పక్కనే మరో యాంకరమ్మ అదో రకంగా నవ్వి మూతి దగ్గర మైక్ పెట్టిoది.

“మీరు 50 ఏళ్ళ క్రిందటచేసిన  నిర్వాకం ఇప్పుడు బైటికొచ్చింది, ఏం జరిగిందో చెప్పండి “

“ఎ.. వ..రూ ?! ” వణికిపోతూన్న స్వరంతో బోడిలింగ గారు“హేవిటో! చెవులూ ఇనపడ్డం మానేశాయి. !పద్మశ్రీ గానీ ఇచ్చేరా?” ఆశగా పక్క మీంచి లేవబోయి మళ్లీ అక్కడే చతికిలబడ్డాడు.

“మీరు అలనాటి ప్రముఖనటీమణి కనకం గారి పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆవిడ ఫిర్యాదు చేస్తున్నారు!”

యాంకరమ్మ కాస్త గట్టిగా అరిస్తే కనకం పేరు వినగానే ముసలాయన కళ్ళు మెరిసి

“ హే..వి..టీ..కనకమoటున్నారు?”  బోసినోరు తెరిచాడు.

“అవును కనకంగారే! ఆవిడ మీద  అఘాయిత్యానికి  పూనుకున్నారని అభియోగం! ”

యోగం అన్న చివరి మాట వినిపించి మొహ చింకి చాటంతచేసుకుని చటుక్కున లేచి కూర్చున్నాడు.

” అబ్బో..యోగం..మహాభోగం!ఏం చెప్పమంటారు ఆ గోల్డన్ డేస్!కనకం నిజంగా కనకమే! ఒంటినిండా కనకం కుమ్మరిస్తే కానీ  ఒప్పననేది! మహా గడుగ్గాయి పిల్ల..”  గత స్మృతులతో ముసలాయన మొహం వెలిగి పోగా దీర్ఘాలు తీస్తూ అప్పటి సంగతులు వల్లె వేశాడు.  అవి వింటూ కనకం సిగ్గుతో ఇక్కడ మెలికలు తిరుగుతుండేసరికి యాంకరమ్మ “ కనకం గారిమీద మృగాళ్ళ దౌర్జన్యం.. చూస్తూనే ఉండండి మీటూ లైవ్ షో బ్రేక్ తర్వాత..”  అంటూ కిసుక్కుమని గోలి సోడా కొట్టినట్టు నవ్వింది.

ప్రోగ్రాం చూస్తున్న వెంకట్ కెవ్వుమని కేక వేసి “చూశావా! ముసలమ్మ కనకం గారు  బైట పెట్టగా లేనిది  పిన్నిగారు కొంగు లాగితే  చెప్పదా? అమ్మో, పోలీసులోచ్చేస్తారు, పరువు మూసిలో కలిసి పోతుంది ”

వణికిపోతూ మళ్ళీ  గదిలోకి దూరి నెత్తిన ముసుగు వేస్కుని మూల కూర్చున్నాడు.

చేసెదేమీ లేక నేను బుర్ర గోక్కుని వెనక్కి తిరిగి వస్తూ అసలు ఇండియా లో ఏం జరుగుతోందో వార్తలు తెలుసుకుందామని  షాపులో దినపత్రిక కొనుక్కుని రోడ్డు మీదకి రాగానే ఒకాయన వచ్చి

“అదేంటి సార్ అక్కడ కొన్నారు? మీ అదృష్టం బావుండి ప్రమాదం తప్పింది ” అన్నాడు.

అర్ధం కాక వెర్రి చూపు చూస్తే “షాపులో ఆడమనిషి పేపర్లు అమ్ముతోంది పేపర్ ఇచ్చెటపుడో, డబ్బులు   ఇచ్చేటపుడో ఆవిడ చెయ్యి మీకు తగిలినా మీ చెయ్యి ఆవిడకి టచ్చు అయ్యినా ఎంత ప్రమాదం? కొంపదీసి చెయ్యి తగిలించారని ఆవిడ కేసు పెట్టిందే అనుకోండి! బుక్కయిపోరూ? ఎప్పుడూ మగాళ్ళు అమ్మే షాపులోనే  కొనండి! మగాళ్ళకి రోజులు బాగోలేవు ”  సలహా చెప్పి చక్కా పోయాడు. వామ్మో ఇదొక ఉపద్రవమా? ఇంతలో ఆటో కనిపిస్తే “వస్తావా” అడిగాను.  తీరా అడిగాక పరీక్షగా చూస్తే షర్టు ప్యాంటులో అమ్మాయి! వార్నాయినోయ్!  చచ్చాను, పైగా వస్తావా అని కూడా అడిగాను గుండెలు అదిరిపోతుంటే ఆటో అమ్మాయి  “రాను సార్! స్కూల్ పిల్లల్ని పికప్ చేసుకోవాలి” అంటూ వెళ్లి పోయింది. గండం గడిచిందిరా దేముడా అనుకుని సిన్మా కెళ్తే ఒక్క మగ పురుగు  కనిపించలేదు.

ఇంతలో లేడీ మేనేజర్ అట గబగబ వచ్చి

“లేడీస్ స్పెషల్ షో వేస్తున్నాం సార్!మగాళ్ళకి టిక్కెట్లు ఇవ్వడం లేదు. రిస్కు తప్పించుకోటానికి “ అన్నది.

“రిస్కా? రిస్కేంటమ్మా ?” ఆశ్చర్యంగా అడిగితే నవ్వి చెప్పిందిలా..

“ధియేటర్లో సీట్లు ఆడోళ్ళ పక్కన మగవాళ్ళకి వస్తే చీకట్లో చెయ్యో కాలో తగిల్తే ఆడవాళ్ళు కేసులు పెడితే ధియేటర్ యజమాని కోర్టుకు వెళ్ళాలి.ఈ గోల పడలేక లేడీస్ స్పెషల్  బస్సు మెట్రో లో సెపరేట్ బోగీ ఉన్నట్టు ధియేటర్లో ఆడవాళ్ళ కోసం ఒక షో,  మగాళ్ల  కోసం ఒక షో వేస్తున్నాం !  గొడవే లేదు కదా సార్“

ఆహా! దేశం ఎంత ప్రగతి సాధిస్తోంది! నుదురు బాదుకుని ఇంటికొచ్చి చూస్తె1  మా నాయనమ్మ ఎర్రటి ఎండలో వీర లెవిల్ మేకప్ వేసుకుని మంచి పట్టు చీర కట్టుకుని కారెక్క బోతూ నన్నుచూసి

“ఒరే రాముడూ!నువ్వు వస్తావా?” అడిగింది.  మా నాయనమ్మ గొప్ప చిత్రకారిణి.  ఉద్యోగం చేస్తూనే బొమ్మలు గీస్తూ  ఆ రోజుల్లో గొప్ప పేరు సంపాయించింది.

“ఎక్కడికే ? ఓ పక్క ఎండలు మండి పోతుంటే ఈ పట్టు చీరేంటి? మేకప్పేంటి ?” చిరాగ్గా అడిగాను.

“ప్రెస్ క్లబ్ లో మీ టూ ప్రోగ్రాం పెట్టి నన్నూ రమ్మన్నారు, టీవీ కవరేజీ ఉందట”

“మీటూ ప్రోగ్రాం కా ? నువ్వెందుకూ అక్కడికి?”

“మీ నాన్నేకేమో బిజినెస్ పన్లు, మీ అమ్మకి టీవీ సీరియళ్ళు, నువ్వేమో అమెరికాలో బిజి! ఇక నాతో మాట్లాడే వాళ్ళు ఎవర్రా? బొమ్మలు వేసే ఓపికా లేదు, పొద్దుబోయేది ఎట్లా?అందుకని చక్కగా మీ టూ ప్రోగ్రాం కెళ్ళి చిన్నప్పుడు నా వెంట బడ్డ మాజీ మినిస్టర్ పేరూ, లవ్ లెటర్ ఇచ్చిన ఫిలిం డైరెక్టర్ పేరు అసూయతో ప్రమోషన్ ఇవ్వని మా రిటైర్డ్ బాసు బండారం బైట పెడితే మస్తు టైం పాసు “ గర్వంగా  తెల్ల జుట్టు ఎగరేసింది.

“ఎప్పుడో జరిగిన వాటి గురించి ఇప్పుడు ఎందుకే బామ్మా?”

“ఎందుకేంట్రా?  తిక్క కుదిరి బుద్ది రావాలి ఇప్పటికైనా వెదవ వేషాలు వేసిన వాళ్ళందరికీ  ”

“అంటే? ఎప్పుడో వెధవ వేషాలు వేసిన వాళ్ల కి ఇప్పుడు బైట పెడితే గానీ  బుద్ది  రాదంటావు?”

“అప్పట్లో ఇన్నిఅవకాశాలు లేవుగా! ఆ వెధవలకి ఇప్పుడైనా బుద్ది రావొద్దూ? ”

“చావుకు ఎదురుచూస్తున్న వాళ్లకి బుద్ది రావటం సంగతి దేవుడెరుగు, ఇప్పుడు బుద్దిగా ఉండాల్సిన సమాజం ఏమవుతుంది?ఎప్పుడో జరిగినవన్నీ బైట పెడితే ప్రయోజనం ఏంటి? నేటి తరానికి  ఏ సందేశం ఇస్తుంది? గతం ఏదో కొంచెం బానే  ఉండేదన్న నమ్మకం, ఆడవారి పట్ల గౌరవం ఉండేవి అన్నభావన యువతలో ఉండాలి. దాన్ని అనుసరించాలి ,వాళ్ళు పాటించాలి అంతే గానీ గతంలో ఇలాంటివీ  జరిగాయి గతం కూడా  చెత్త అనే భావన వచ్చేలా చేస్తే  స్పూర్తి కొరవడదూ?మరింత తెంపరితనం పెరగదూ? పోకిరీలు ఇంకా  బరితెగించరూ?”

“అందుకని పాత సంగతులు తవ్వొద్దూ అంటావు?”

“తవ్వటం వల్ల ప్రయోజనం ఏంటి అని అడుగుతున్నా!దానికంటే వెకిలి చేష్టలు పోకిరీ పనులు ఇప్పుడుచేసే వాళ్ళని మీ టూ లో బైటికి లాగి వెంటనే శిక్షలు అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటే సమాజం బాగు పడుతుంది.  తప్పుడు పనులు చేసే వాళ్ళు ఆలోచిస్తారు, భయపడతారు”

“నిజమేరా! డ్రైనేజీ కెలికి బైటికేస్తె దుర్వాసనతో వాతావరణం కాలుష్యం అవుతుంది. కంపు బైటికి పొక్కకుండా వ్యవస్థని బాగు చేసుకోవాలి ! ప్రక్షాళన చెయ్యాలి! ఆడవారిపట్ల చిన్నచూపు కొందరు మగాళ్లకే కానీ దాన్ని మొత్తం మగ జాతికి ఆపాదించలేం”

“భలే  చెప్పావ్ బామ్మా!ఇప్పుడు వెళ్ళు మీ టూ మీటింగ్ కి !”

“ఏవిటీ? వద్దన్నావూ? ”  బామ్మ ఆశ్చర్యం గా చూసింది.

“అప్పుడు వద్దన్నది పాతకి పాతర వెయ్యనందుకు! ఇప్పుడు వెళ్ళమంటున్నది అభద్రతాభావం పోగొట్టి ఈ తరం మహిళకి గొప్ప నమ్మకం తెచ్చే కొత్త వ్యవస్థని స్వాగతిస్తున్నoదుకు!”

“అవున్రా, వెళ్లి చెయ్యాల్సిన తక్షణ కర్తవ్యం ఏమిటో గుర్తు చేస్తాను!” అంటూ కారెక్కింది.

ఇంతలో  వెంకట్ ఫోన్ చేసి  “ఆఫీస్ కి రావట్లెదు ఏమైందని మణి సరళాలిద్దరూ ఇంటికొచ్చిమరీ వాకబు చేశారు.” హుషారుగా చెప్పాడు.

“మరి లంచ్ టైం లో వాళ్ళిద్దరూ మీ టూ, వెంకట్ రెడ్డి  అన్నారన్నావు!”

“వాళ్ళిద్దరూ ‘మీ టూ శ్రీ రెడ్డి’ గురించి మాట్లాడుకున్నారట!” హి హి హీ మంటూ తేలిగ్గా నవ్వేశాడు.

“పిన్నిగారి సంగతేంటి? పోలీస్ కేసు పెట్టిందా?”

“ పిన్నిగారు మా అమ్మకి ఫోన్ చేసి రిక్షా చక్రంలో చీర ఇరుక్కోకుండా కొంగులాగి ప్రమాదం తప్పించింది  మీ కుర్రాడే   థాంక్స్ చెప్పండి ఆ బడుద్దాయికి అందట ” సంబరoగా చెప్పాడు.

“ఐతే నీవన్నీ అపోహలేనని అర్ధమయ్యి అనుమానం పిశాచి పీడా విరగడయ్యిoదంటావు !”

“ఇంకా అడుగుతావా?అయినా ఎవరు పోకిరీ ఎవరు మర్యాదస్థుడు ఆ మాత్రం మహిళలకి అర్ధం కాదా బాసూ?ఊరికే ఎవ్వరిమీదా అభియోగాలు చెయ్యరు కదా?!”

“అమ్మయ్య ! రక్షించావ్ ”  తేలికపడ్డ మనసుతో నవ్వేను.

 

***                      ***

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *