May 8, 2024

అర్చన 2020 – అరణ్య రోదన

రచన: ఎ.బి.వి నాగేశ్వరరావు

భ్రూణ హత్యలను తప్పుకొంటేనే బ్రతుకులు,
జన్మతః వచ్చే నామకరణాలు ‘మైనస్’లు.
తను పుట్టినందుకు అమ్మను-
అంటూంటే అయినవారే !, అంతేసి మాటలు,
తన లోకం తనది, నిద్రాముద్రలో పసి పసిడి పాపాయి.

ఎదిగినకొద్దీ, ఈ తీరులు, తెన్నులు తెలుస్తున్నకొద్దీ, అనిపిస్తుంది ఆమెకు-
ఏమిటి ఈ ఆలోచనలు, వికృత పోకడలు, ఆచారముల ఆగడములు ? అని.
ఇహ లోకంలో- ఇంతుల రాతలు రాసేది ఇంకొకరా ?
ఎద అనేది ఉందా అసలు, ఈ మానవ జాతికి ? అని.

‘మనీ’ మత్తులో మనిషి- జోగుతు ఉంటే ఇలా,
విలువలు వివర్ణమై వెలిసి పోతున్నాయని,
మూఢాచారాలు ఆజ్యం పోస్తున్నాయని.
మారక; విజృంభితమగుతూ ఉంటే, ఈ సరళి ఇలానే –
ముంచుకు వచ్చే జీవన విపత్తులో- జాతి మనుగడ కేళిముఖమే, అని.

భోరున విలపిస్తుంది అంతరంగాన, మనసున్న మనిషిగ-
దేనికిలా వ్యత్యాసమని, ఏమిటి ఈ వ్యాపారమని ?
సాంప్రదాయాలు, సామాజిక రుగ్మతలు, ఆర్థిక అంశాలు –
మనిషి మేథస్సును కట్టడి చేస్తున్నాయని,
జీవితాలను నిలువునా కడగండ్ల పాల్జేస్తున్నాయి, అని.

మేథస్సే మనిషికి శత విధముల శాపమూ అయ్యిందని,
అది లేకే, ఔను మరి ! ఆ తీరున తమస్సు లేకనే,
అన్య ప్రాణులు ఆనందము తమ సొంతముగా
ఆరు ఋతువులూ గడుపగలుగు చున్నాయని,
జీవిత మకరందము నిండుగా గ్రోలుకొనుచున్నాయి, అని.
***
అష్ట కష్టాలూ- ఆజీవనం ఆమెకు సొంతమైనా,
ఆమె జీవన రాగం- ఆసాంతమూ ఆర్తనాదమైనా,
జాతి మనుగడను చింతిస్తున్న ఆమె ఔదార్యం !
ఆలకించీ స్పందించి, సంఘటితమగు వారుంటేగా –
అతివల ఆ నిశ్శబ్ద మౌన వేదనకు ఉండేది గుర్తింపు,
వచ్చేందుకు మనిషి తీరులో ఇసుమంత మార్పు !!.

అందుకే, మరి అందుకే –
కలకంఠి కన్నీళ్ళకు యుగాలుగా లేకున్నది ముగింపు,
అవుతూన్నది అనాదిగా ఆమె అంతరంగ ఆ వేదన –
సరిగ్గా, అరణ్య రోదన.

1 thought on “అర్చన 2020 – అరణ్య రోదన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *