May 9, 2024

అర్చన 2020 – ఆంగికం , వాచికం

సంధ్యా గోళ్లమూడి

హవభావముల తోడ అభినయమేలనో దొరా !
దేశాభివృద్హికి తోడుపడుమోయ్ దొరా .
కాలానుగుణముగా నడచు బాట చూపు
వెనుకబాటుతనమె విద్యలో మఱ్ఱివూడలైంది .
చదువుల తల్లి మోము వెలవెలబోయింది
పసిడిమొగ్గలు పాకలో పేడ పిసుకుతుంటే .
ముక్కుపచ్చలారని పిల్లలు పెళ్లిపీటలెక్క
బలిపీఠమైంది వారి బ్రతుకుకదే పెళ్ళిపీట
ఎవరికి వారే నాకెందుకంటూ ప్రక్క చూపులతో.
చక్కగా పోయేరు, అడ్డుకొనలేరెవరు దేశాన
బైట పనికి పోయిన పిల్ల ఇల్లు చేరుదాక
గుండెలు గుప్పెట కనుగుడ్లు దారివెంట
అన్ని దాటి చేర్చంగ మురిపెముగ అత్తవారింట
నాల్గు దినాలకే నలుగురు చూపించు నరకమే.
దారి లేదా ఇక్కట్లు దాటను, గమ్యమే శూన్యమా ఆడపిల్లకు
చేరి ఆలోచన చేసి చూడండి , భావి తరపు భవిత కోరండి .
పుట్టగానే పిల్ల ఎవరిదని చూడక , కనుల కద్దుకోరా కొడుకా .
నాణ్యమైన చదువు మొదలు ఇంటిలోనని మరువకు .
వంట యింటికి చేయకు బందీగా బడిబాట పట్టించు మేటిగా .
తన రక్షణకు అన్ననో తమ్ముడో కాదురా కొడుకా కావలి
స్వశక్తి పెరుగుటకు పట్టు పట్టి తర్ఫీదునియ్యి ,
నీవిచ్చు ఆస్తి ఆమెకు గుండెబలము, ధైర్యమేరా
వెన్ను తట్టి నిలుపు ఆట పాటలలోన,
వెనకడుగు లేదని అన్ని విద్యలలోన .
ఆడ యాడో కాదు, పుట్టిన ఆడపిల్లంటేను
నీడలేనిది అసలు కానే కాదు. విద్య నేర్పు
అదను చూసి పదును అన్నటులే నిలుచును ,
నిలిపేటి శక్తి నీ పెంపకమునకు మాత్రమే కలదు
ఆడ మగ తేడాలొద్దు పెంపకాన, ఊడిపడడు
మొగపిల్లవాడైన పుట్టేది అమ్మయ్య నుంచే ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *