May 8, 2024

అర్చన 2020 – అదృష్టం

రచన: యలమందల తిరుపతి

దేహ భాగాలైన
హస్తరేఖల్లో లేదు
నుదుటిరాతలో లేదు
ఊహల్లో ఊపిరిపోసుకోదు అదృష్టం
అలుపెరగని జీవన పోరాటంలో
నీతి నిజాయితీ నీడల్లో
వుంది అదృష్టం
నైతిక విలువల మాటున
కరుణ మొలిచే గుండెల చాటున
కొలువై వుంది అదృష్టం
విమల హృదయాలలో వికసిస్తుంది
మానవ మనో వికాసరేఖల్లో మౌనమాదుర్యం
ఆస్వాదిస్తుంటుంది అదృష్టం
మృదు ప్రణయ రేఖల్లో
శాంతి పరిమళ సత్య ప్రసంగాల్లో
దాగుంది అదృష్టం
వక్రించే వక్రరేఖల్లో కనిపించదు భాగ్యరేఖ
శుభ్ర సుందర ముఖబింబాల్లో చెమటను చిందించి
సంపదను సృష్టించే కష్టజీవి కండరాల్లో
నాట్యవిలాసం చేస్తుంది అదృష్టం
సుఖలాలసకు లీలా విలాసాలకు
సుదూరం అదృష్టం
శ్రమ సౌందర్యానికి మనోజ్ఞ మనోనిర్మలత్వానికి
శిరస్సు వంచుతుంది అదృష్టం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *