May 8, 2024

అర్చన 2020 – సూరీడు కనిపిస్తాడు. !

రచన: కె.ఎస్.రెడ్టి

స్వయంకృత చాలా ఆత్రుత పడిపోతుంది. చీకటి పడుతున్నది. చలికాలం. ట్రైన్ వెళ్ళి పోతుందేమో. . ఇంటికి చేరలేనేమో !? అడ్డ దారిన వెళితే అందుకోవచ్చు.
తనకోసం, అమ్మా నాన్న, ఎంతగా ఎదురు చూస్తుంటారో. చెల్లి తనకోసం నిదురపోదేమో! ఛీ. . ఈ బస్సు రిపేరు ఇప్పుడే కావాల? వారానికి ఒకసారి తన వాళ్ళను చూసుకొనే అదృష్టం కూడాలేదు. దిగులుతో కళ్ళల్లో నీళ్ళ తిరిగాయి, . తప్పదు. ఏ ఆధారం లేని తన కుటుంభానికి తనే ఆదరువు. ఈ మాత్రం చదివించడానికి ఎంతకష్టపడ్డారో?
ఐటి డిప్లమో చేసిన తనకు, ఇదైనా వచ్చిందని సంతోషపడింది. కానీ ఉద్యగం చాలా దూరంలో వచ్చింది. తల్లిదండ్రులు ససేమిరా కాదని చెప్పారు. వాళ్ళకు నచ్చ చెప్పేసరికి, తలప్రాణం తోకకొచ్చింది. శుక్రవారం సాయంకాలానికి వెళ్లి ఆదివారం సాయంకాలినికి తిరిగివచ్చి , వర్కింగ్ ఉమెన్ హస్టలనబడే గోడౌనుకు చేరి, చెమటతో తదిచిపోయి , అలిసిన శరీరాన్ని, దోమలకు ఆహారంగా వదిలేసి, కళ్ళముందు నాట్యం చేసే, ఇంటి పరిస్థితుల జ్గాపకాలను, చెప్పుతోకొట్టి తరిమేసి, నిదురకోసం కొట్లాడటమే ఆ రాత్రి పని. !!. ఇలా ఎన్ని రాత్రులో ఈ రోజుకోసం. !!
గబ్బుక్కున సిద్దు జ్గాపకం వచ్చాడు. పాపం. . తనకు అన్ని విధాల అండగా, తోడుగా నిలుస్తాడు.
తనూ సిద్ధూ, ఫ్లాట్ ఫాం చివరిలో చీకటిగా ఉన్నచోట, ట్రైను ఆలస్యం అయినప్పుడు, లోకాన్ని మరిచి పోయి, ఎన్నో కధలు చెప్పుకునే వాళ్ళు . ప్రతిసారి ఓ నలుగురు పోరంబోకులు తాగేసి, వెకిలి చేష్టలు చేస్తూ, తిరుగుతూ ఉండే వాళ్ళు. పోలీసులు అటు వచ్చినా, వాళ్ళను పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ సిద్దు మాత్రం, వాళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు , జాగ్రతగా ఉండాలని చెప్పేవాడు. ఎందుకైనా మంచిది వాళ్ళ ఫోటోస్ తీసి పెడతాను అని తీసి, తనకు కూడా పంపాడు. వాయిస్ రికార్డు చేసేది కూడా నేర్పించాడు. ఈ దారి ప్రమాదం అని కూడా చెప్పాడు. అయినా ట్రైన్ వెళ్లి పోతుంది; అది దగ్గరి దారి. సిద్దు ఎదురు చూస్తుంటాడు, అనే దైర్యంతో. మలుపు తిరిగింది స్వయంకృత.
స్టేషన్ దగ్గరకు వచ్చింది. లైట్లు లేవు. ఇలాంటి చోట లైట్లు, సి సి టి వి కెమరాలు ఎందుకు పెట్టారో ఆ మేధావి వర్గం, అని తిట్టి పోసింది. దగ్గరలోనే ఉంది స్టేషన్. పది బారలు. !!అంతే ఒక్క సారిగా నలుగురు వచ్చి, నోరు మూసేసి ఎత్తుకుపోతున్నారు. గింజుకుంది. పెనుగులాడింది. కాళ్ళతో చేతులుతో, ఇష్ట వచ్చినట్లు కొడుతూ, వదిలించుకోవాలని ప్రయత్నించింది. అమ్మా. . నాన్నా. . దేవుళ్ళారా. . దెయ్యాల్లారా కాపాడండి. . ఆదుకోండి. అరిచి. . అరిచి. . అలిసిపోయి స్పృహ తప్పి పోయింది. దేవుడు రాలేదు. !?
కళ్ళు తెరిచేసరికి రక్తపు మడుగులో ఉంది. కుమిలి కుమిలి ఏడ్చి ఏడ్చి, ఈ లోకాన్ని, తన బ్రతుకుని, నోటి కొచ్చినట్లు తిట్టుకుని, నీరసంతో లేవలేక, స్మారకం తప్పిపోయి, అలాగే పడిపోయింది.
ఎవరివో మాటలు , చూచాయిగా వినిపిస్తున్నాయి. కళ్ళు తెరవాలని ప్రయత్నించింది. వీలు పడలేదు. తనను మోసుకేలుతున్నట్లనిపించి, పెనుగు లాడింది. శక్తి చాలక, స్పృహ కోల్పోయింది స్వయంకృత.
మెలుకువ వచ్చేసరికి, నిదానంగా నలువైపులా చూసి, హాస్పిటల్లో ఉన్నట్లు గ్రహించింది స్వయంకృత. పోలీసులు, డాక్టర్లు తిరుగుతున్నట్లు అనిపించింది. స్వయంకృత కోలుకునే సరికి నాలుగు రోజులు పట్టింది. సిద్దూ కోసం ఎదురు చూసింది . రాలేదు. అణుచుకోలేని బాధ , శక్తి చాలక, తల్లిదండ్రులకు , ఎమని చెప్పాలో తెలియక, తల్లడిల్లిపోయింది. నర్సు ! పోలీసులు తీసుకొచ్చారని, ఫోను ఇచ్చింది. వాళ్ళను అరెస్టు చేసారని చెప్పింది. స్వయక్రుత భయం, వాళ్ళు ఇంటికి ఫోను చేసుంటారా? అక్కడున్న ఆడ పోలీసును అడిగింది. ఎప్పుడు తెచ్చారు? ఈ రోజే!! తెలిసుండదులే, అనేగుడ్డి నమ్మకం.
స్తిమితంగా ఉండలేక పోతుంది. తన జీవితాన్ని, ఆశలు, ఆశయాలను సర్వ నాశనం చేసిన ఆ కామాంధులను, నరికి పోగులు పెట్టాలనుంది. వాళ్ళు . బ్రతకకూడదు. మగతనం లేకుండా చెయ్యాలి. ఎలా? ఇంట్లో వాళ్లకు తెలిస్తే అందరూ చస్తారు. !!
నాకు ఇప్పుడు ఎలాంటి న్యాయం జరగాలి? నా కన్నెరికాన్ని తిరిగి ఇవ్వగలరా? నాలో జరిగే సంక్షోభాన్ని ఆర్పగలరా ? ఎన్ని కష్టాలు, అవమానాలు ఎదుర్కొని ఇంత దూరం ఎదిగింది, తన స్త్రీత్వాన్ని కాపాడు కున్నది, ఈ నరరూప రాక్షసులకు అర్పించడానికా? ఒకే ఒక్కటి!! ఇలాంటి కామందులు , మళ్ళీ . . . . !! స్వయంక్రుతలో జరుగుతున్న మానసికక్షోభకు అడ్డు కట్టలే లేవు.
“ఎంత ధైర్యం. ఎంత కొవ్వు. ? ఆ దారిన అంత రాత్రిపూట ఎవరైనా వస్తారా? తెగించిందే అయి ఉంటుంది. బాగా శాస్తి జరిగింది. మరీ బరి తెగించింది ఈ . . . !”
“అయినా ఆడాడ్నుంచొ, ఇంత దూరం రావడం ఏవిటి ? ఆ బోడి ఉద్యోగానికి , అక్కడనే ఎదో ఒకటి చూసుకోకూదదా ! వ్యాపారం చెయ్యడానికి కాకపోతే? ఛీ. . . చెడిపోయారు, మరీ ఈ ఆడవి. ఇంకా. . . !
“బాగా ఆరితేరిందే అయి ఉండాలా ! మిండగాడితో రోజూ ఆ చివరిలో. . . ? మన ఆడోళ్ళమే పోవడానికి భయపడుతాం. జరగాల్సిందే! మిగిలినోల్లకన్నా బుద్ధి వస్తుంది !! నువ్వు రామ్మే, రెండో ఆట వదిలి పెట్టే టైము అయ్యింది. అవతల మీ మామకు ఇంకా వండలే ! ఈ మాటల్లో పడి . . . !” “ ఎం మునిగి పోదులే అత్తా! ఇంకో ఆట. ఏదో ఒకటి తినేసి ఉంటాడులే! రోజూ తెలిసిందే కదా!” అంటూ పేక ముక్కలు కలిపింది, ఐదు వందలు పోగొట్టుకున్న కోడలనబడే కలికి తురాయి .
“పిల్ల పిట పిట లాడు తుంటూ ఉంటుంది. నేను రొజూ వాళ్ళని ఛూస్తూనే ఉన్నా!నాకే ఎదో చేయ్యాలనిపించేది, ” భళ్ళున నవ్వాడు. కట్టుడు పళ్ళు క్రింద పడ్డాయి. జొల్లు కార్చుకున్నాడు సీనియర్ సిటిజన్.
“ పాపం పెండ్లి కావాల్సిన పిల్ల. !”
“ ఇక దాన్ని ఎవరు చేసుకుంటారు. కంపెనీ పెట్టుకోవాల్సిదే! జరిగితే బాగుండు. పది రూపాయలు పోతే పోనీ ఒక సారి. . . ! ఐశ్వర్య బ్రేస్ట్ , కత్రిన గ్రీత్, ఇలియానా నవ్వు . . అబ్బ!!ఈ జన్మకు అది చాలు. ” అందరూ, పళ్ళు క్రింద పడుతాయని, నోటికి చేయి అడ్డు పెట్టుకుని నవ్వు తూనే ఉన్నారు.
గస్తీ తిరుగు తున్న పోలీసు అమ్మాయి అంతా విని, ఛీ. . ఛీ. . అంటూ దూరంగా వెళ్ళింది. రేపు రేప్ కు బలైన అమ్మాయి దగ్గరే తన డ్యూటీ. !!
మరుసటి రోజు వచ్చిన, డ్యూటీ పోలీసు అమ్మాయి, ఆ విషయాలన్నీస్వయంకృతకు చెప్పి, ఏడ్చింది. వాళ్లకు పెండ్లాం పిలకాయలు లేరా? ఆ వయస్సుకు తగ్గ మాటలా, బుద్దులా అవి. కాళ్ళు చేతులు పడిపోవాలి అని తిట్టి పోసింది . పోలీసుల్లో కూడా సున్నిత హృదయులు ఉంటారా? నమ్మ లేక పోయింది స్వయంకృత.
వాళ్ళ నలుగురు, మరో పదిమందికి వేరే పని లేదని, గంజాయి, యాషి స్సు, ఇల్లీగల్ బెట్టింగు, అమ్మాయిల్ని తార్చడం పోలీసు వాళ్లకు, ప్రభుత్వాధికారులకు బాగా తెలుసని, వాళ్ళను ఎవ్వరూ ఎం చెయ్యలేరని, చెప్పింది. ప్రతి నెలా అందరికి పెద్ద మోతాదులో ముడుపులు. . . !!
“కాలం అట్లుంది’’ అని , రేపు స్టేషన్ కు వచ్చి రిపోర్టు ఇవ్వమని, తనే వస్తానని చెప్పింది.
అలాగే నిరామయంగా శూన్యంలోకి చూస్తుండి పోయింది. ఏవిటి తన బ్రతుకు? స్త్రీకి రక్షణే లేదా? ఇంత దారుణంగా ఉందా ఈ సమాజం? ఎవరు ఎలా ఉన్నా, వాళ్లకు ఎంత మద్దతు ఉన్నా, వదిలిపెట్టేది లేదు!! ఇంకా చెడ్డ పేరు వస్తుంది, మనసు హెచ్చరించింది. మీ తల్లిడండ్రుల పరువు, ప్రతిష్ట మంటగలుస్తాయి వాళ్ళు నిన్ను దగ్గరకు రానివ్వరు. వెళితే అందరిని సంఘం చిన్న చూపు చూసి, వెలి వేస్తుంది. ‘మానంపోయి నేను ఏడుస్తుంటే . . ? అది ఎట్లాగు పోయింది. ఇవి కూడా. . !అన్ని తప్పులను సహజమని ఎప్పుడో మన్నించేసింది ఈ సమాజం. మరి ఈ చేయని తప్పును. . . . ??
నా తల్లిదండ్రులు నన్ను ఆదరిస్తారు. ఈ యువతులు, ప్రతి స్త్రీ , ఎదిరించానని, శిక్ష పడేటట్లు చేసానని, నన్నుగౌరవిస్తారు. ఆదర్శంగా తీసుకుంటారు. కానీ తెలిస్తే అమ్మా నాన్నలు భాధపడుతారు. వాళ్లకు తెలియనివ్వకూడదు. ఇక్కడ ఉంటే కూడా మనశ్శాంతి ఉండదు. వాళ్ళను ఉరికంభం ఎక్కించిన తరువాత వెళ్లి పోవాలి.
మరుసటి రోజు పోలీసు స్టేషన్ కు వెళ్ళింది. ఇంకా చాలా బలహీనంగా ఉన్నట్లు అనిపించింది. ఎంతకూ రారు ఆ ఇనస్పెక్టర్. చెమట పోసి పోతుంది. కళ్ళు తిరిగి పోతుంది. అది చూసి లేడీ కానిస్టేబులు , నీళ్ళు తెచ్చి ఇచ్చి కూర్చోపెట్టి, ఫ్యాను వేసి , టే తాగుతారా అని అడిగింది. వద్దు అని చెప్పింది స్వయంకృత.
ఇంతలో, పోలీసు వ్యాన్లో అ నలుగురు నిందితులను , వాళ్ళ వెనకాల మరో రెండు కారుల్లో తెల్ల చొక్కాల గుంపు దిగింది. లేడి పోలీసు ఎందుకో చాలా ఆత్రుతగా, చెమటతో తడిచిపోయి వణుతున్నట్లు అనిపించింది. స్వయంకృత చేతిని పట్టుకుంది. ఆమె అనుమానంగా పోలీసు వైపు చూసింది. మొహమాటపడుతూ నవ్వి ముఖం తుడుచుకొంది. “మీరు భయపడకండి. ” అంది స్వయంకృతతో!?తనను నలిపి నాశనం చేసిన నికుష్టులు, వాళ్లకు పోలీసు సపోర్టు !!లేడి పోలీసు కళ్ళు. . !
కాస్సేపటికి తిరిగి అందరూ కార్లులో ఎక్కారు. స్వయంకృత ఆశ్చర్య పోతూ, లేడీ పోలీసు వైపు చూసింది. అది అంతే అన్నట్లు తల ఊపింది. ఆ వచ్చిన వాళ్ళు , నాలుగు కులాల అధినాయకులని అసహ్యించుకుంటూ చెప్పింది. ఈలాంటి ఘాతక చర్యలకు కూడా అంగబలమా ?విస్తుపోతూ, ఆ పోలీసు అమ్మాయిని చూసింది. కళ్ళు నిప్పులు గ్రక్కుతున్నాయి. తల దించుకుంది. లోపలికి పిలుపొచ్చింది.
వచ్చి రేపు రమ్మన్నారు అని చాలా భాధగా చెప్పింది. అలా వారం రోజులు తిప్పారు. ఓపిక నశిస్తున్నా , వదలదలుచుకోలేదు. ఈలోగా ఎదురుకోవాల్సిన అవమానాలన్నీ ఎదురుకొంది.
ప్రెస్సు వాళ్ళ దగ్గరకు వెళ్ళితే, అసభ్యంగా ప్రవర్తించారు. లేడీ పోలీసు తరువాత చెప్పింది వాళ్లకు ముట్టాల్సింది ముట్టింది అని! భయపడుతూ సిగ్గుతో మెల్లగా అంది , ”ఇనస్పెక్టర్ ర్ర్ర్ర్రాత్రికి వస్తారేమోనని, కనుక్కోమని . . . ? వస్తే వాళ్ళను అరెస్టు. . . . ? ” కళ్ళు దించుకుంది లేడీ పోలీసు .
“ నువ్వు పోరాదా ?” అని కసిరింది స్వయంకృత .
“ డ్యూటీలో చేరినప్పటి నుంచి అదే కదమ్మా. !” కళ్ళనీళ్ళు పెట్టుకొని తల దించుకుంది. ఇరవై ఏండ్లు కూడా లేని పోలీసు జింక బుగ్గలపై కన్నీరు జారటం కనిపించింది. .
ఇంత దారుణమా ? ఉద్యోగాలు చేసే ఆడపిల్ల బ్రతుకులు !! అని కుమిలి పోయింది స్వయంకృత.
ఈ వారం రోజుల్లో వార్డను, చాలా దయగా ఓదారుస్తూ, తను ఆసరాగా ఉంటానని చెప్పి దైర్యాన్ని ఇచ్చింది. ఆశ్చర్యపోయింది స్వయంకృత. ఆమెను గురించి చాలా చెడ్డగా వినుంది. హాస్టల్లోని పిల్లలతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తుందని, టౌనులోని బడా బాబులు, ఆమె చేతిలో ఉంటారని. !!
ఇంటికి మెసేజ్ పెట్టింది. చాలా పనులున్నాయి. . తరువాత వస్తానని, స్వయంకృత.
పోలీసులతో లాభం లేదని, నేరుగా కోర్టుకే వెళ్ళింది. మాజిస్టరేట్ చాలా ఓపిగ్గా విని, ఆ దుర్మార్గుల ఫోటోలు అన్నీ ఇచ్చింది. వెంటనే పోలీసులకు ఫోనుచేసి, కేసు రిజిస్టర్ చెయ్యమని, లేకుంటే పరిణామాలు చాలా కటినంగా ఉంటాయని బెదిరించి. స్వయంకృతను చాలా అనునయించి, దైర్యం చెప్పి, దగ్గరకు తీసుకొని, ముద్దు పెట్టుకుని పంపించాడు. అందులో తండ్రి స్పర్స లేదు. ఆశ్చర్యపోతూ బయటపడింది.
పోలీసు స్టేషనుకురాగానే, సిద్దు ఉంటే , అనుకుంది. ఇన్ని రోజులైనా రాలేదు. !? రేపో మాపో కేసు లేకుంటా చేస్తారని లేడీ పోలీసు చెప్పింది.
రాగానే, ఇనస్పెక్టర్ నిప్పులు చెరిగాడు. “నేను తలుచుకుంటే, ఇక్కడే ఇప్పుడే రేప్ చేయిస్తాను , కేసులేకుండా చెయ్యగలను, రేపు ఉదయం లోగా నీ అమ్మా అబ్బలను తీసుకొచ్చి, వ్యభి చారం చేయిస్తున్నారని, కేసుపెట్టి లోపల తోయ్యగలను” అరిచాడు. భయపడలేదు స్వయంకృత.
చూద్దాం. కేసు పెట్టండి. లేకుంటే నేరుగా ప్రెసిడెంటు, ప్రధానమంత్రి దగ్గరకు వెళ్ళతాను. టీవి చానల్సుకు వెళ్లి, నీ రంగు బయట పెడతానని అరిచింది స్వయంకృత.
“పోవే. . పో ! ఎం జరుగుతుందో చూస్తాం. వెంట్రుకలు. . వెంట్రుకలు పెరుక్కోలేరు. పెండ్లాన్ని తీసుకెళ్ళి పండపెట్టి, డబ్బు ముఖానగోడితే నోరు మూసుకుంటారు. నా ఉద్యోగం నాకు వస్తుంది. ”
నోట మాట రాలేదు స్వయంకృతకు, సిగ్గుతో, కోపంతో వణికిపోయింది “నీ బిడ్డలు ఎవరికీ పుట్టారో తెలుసా?” చీధరించుకుంటూ అడిగింది.
అతను కొట్టిన దెబ్బకు, క్రిందపడి పోయింది. ఫోను ఎగిరి దూరంగా పడింది. లేడీ పోలీసు, మళ్ళీ దూసుకు వస్తున్న అతనికి అడ్డు నిలుచొని, బ్రతిమలాడి, లోపలికి తీసుకెళ్ళింది . ఫోను తీసుకుంది. వీడియో ఆన్ చేసి ఉంది. ఆపుచేసి లేచే లోగా, జనం చేరి పోయారు. తల వంచుకుని వస్తుంటే, వినలేని నానా మాటలు: ఒక్క మాట కూడా, అ పోలీసు, అహంకారాన్ని, దురుసుతనాన్ని గురించి, మాట్లాడలేదు.
వీళ్ళా భావి భారత పౌరుల తల్లిదండ్రులు. పిచ్చి. . పిచ్చిగా ఉంది. విరక్తిగా ఉంది. చావడం కంటే వేరే మార్గం లేదు. చస్తే ఎలా? నా తల్లి దండ్రులు. . . ? నా చెల్లెలు, తమ్ముడు. . . . ?స్వయంకృతకు ఘోష !!
తన దగ్గరున్న ఆ కామాంధుల ఫోటోలు. తన ఫోనులో అనుకోకుండా రికార్డు అయిన, ఇనస్పెక్టర్ దుర్భాషలు, చేష్టలు అన్నీ వ్వాట్స్ అప్ లో, ప్రధానమంత్రికి, దేశాద్యక్షునకు, ముఖ్యమంత్రికి పంపి బయలుదేరింది ఉన్న కాస్త దైర్యంతో, స్వయంకృత. ఎన్ని వత్తిళ్ళు, దబాయింపులు, బెదిరింపులు!!
ఊరికెళ్లాలి. రైల్వే స్టేషన్ కు వచ్చింది. ఫోను తీసుకుని గుండెల్ని అరిచేతిలో పెట్టుకుని, ధైర్య్యాన్ని కూడగట్టుకొని , భాదను అణుచుకొని ఇంటికి ఫోను చేసింది. ఏడుపును ఆపుకోలేక పోతుంది. అయినా. . . !
తండ్రి గొంతు వినిపించింది.
“ నాన్నా” అనగలిగింది. ఆయనే నిలపకుండా మాట్లాడుతున్నాడు. విని నాతండ్రేనా ఇతను ? వాళ్ళ కోసమా నేను బ్రతకాలనుకుంది. ? అని కూలబడి పోయింది.
“జరిగి పోయింది ఎలాగూ జరిగి పోయింది. ఎందుకమ్మా అగుడు. . యాబై లక్షలు తెచ్చి ఇచ్చారు. వాళ్లకు ఉరిశిక్ష తప్పదంట కదా, వాళ్ళను చంపడం ఎందుకు? పోతారు, వాళ్ళ పాపాన వాళ్ళే!! నువ్వు అడ్డు తిరిగితే, నీకే . . . . . . ! మన్నించడం. మరిచిపోవడం మానవులలోని మహోన్నత గుణం. ” ఆ తరువాత మాటలు వినిపించ లేదు. కుప్పలా కూలి పోయింది స్వయంకృత.
చచ్చిపోయింది. . చచ్చిపోయింది. . అంటున్నారు గాని, ఎవ్వరూ దగ్గరకు రాలేదు. స్పృహ కోల్పోయింది స్వయంకృత. చావలేదు. తండ్రి మాటలకు, మరణమెందుకు . . చచ్చి జీవించాల్సిందే. నిలువునా తగలబడుతూ . . . . పోగొట్టుకున్న తరువాత, ప్రాణం ఉన్నా. . . . . ?
ఎవరో గట్టిగా అరుస్తున్నారు. ఉలిక్కి పడి చూసింది. బుకింగు క్లార్కను అడుగు తున్నాడు. , ” ఈ బండి యాడికి పోతాది!”
వారణాసి. . . కాశీ, !
*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *