May 9, 2024

అర్చన 2020 – ఆత్మరక్షణ

రచన: దొంతభక్తుని రామ నాగేశ్వరరావు

ఓ పసిపాప మృగాళ్ళ పాపానికి బలై పోతే
కన్నతల్లి హృదయం బ్రద్దలై పిచ్చిదయ్యింది
ఓ పుత్తడి బొమ్మ ప్రేమ వంచనతో అంగడి బొమ్మైతే
కన్నతండ్రి తాళలేక బలవన్మరణం పొందాడు
ఓ చెల్లిపై ప్రేమోన్మాది ఆసిడ్ దాడిని ఆపే ప్రయత్నంలో
అన్న హంతకుడై జైలు పాలయ్యాడు ఆగ్రహంతో
ఓ భార్య తాగుబోతుల కాహుతి కాకుండా
భర్త అడ్డుకొని మృత్యుదేవత కౌగిట ఒరిగాడు
అతివలను సంరక్షించే పవిత్ర యజ్ఞంలో
అమాయక బంధువర్గం సమిధలు కారాదు
మా ‘మాన ప్రాణ సంరక్షణకు మేమే కొంగు బిగిస్తాం
ఆడది అబల కాదు ‘ సబల’ అని నిరూపిస్తాం
‘నిర్భయ దిశ’ చట్టాలతో సంతృప్తి పొందబోము
‘ఆత్మరక్షణ’ కై ఝాన్సి , రుద్రమ్మల వారసులమౌతాము
ఆకర్షణలకు లొంగక బుద్ధిబలం చూపుతామ్
వయసు పొంగులో కాలు జారక మనోబలంతో సాగుతామ్
ఆడపిల్లలకు ఆత్మగౌరవ జీవనం నేర్పిస్తాం
మగపిల్లలను ఆదర్శ పురుషులుగా మలుస్తాం
శక్తి యుక్తులతో మేమూ సంపదలు సృష్టిస్తామ్
మాతృమూర్తులుగా ఆరోగ్యసమాజాన్ని నిర్మిస్తామ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *