May 9, 2024

అర్చన 2020 – ఒక కోయిల విలాపం

రచన: నండూరి సుందరీ నాగమణి

మావి కొమ్మల చేరి, పరవశమ్మున
గొంతెత్తి నేను పాడుకొంటూ ఉంటే,
నా పాట విని దరిచేరావు, నీ అందమైన కోయిలన్నావు,
నన్ను ప్రేమించానన్నావు, మూడు ముళ్ళేసి పెళ్ళాడావు…

ఎన్నో అందమైన పగళ్ళూ, మరెన్నో నులి వెచ్చని రాత్రులూ
ఆనందంగా సాగిపోయాయి…
మత్తిల్లిన కొత్త కాపురంలో పాటకు సమయమేదీ?

ఒకరి తరువాత మరొకరు సంతానం పుట్టుకు వస్తే…
నిద్ర పుచ్చుదామని జోలపాటకై నే గొంతు సవరించుకుంటే…

అప్పుడు చూసా మొదటిసారి – ముడుచుకున్న నీ కనుబొమలు…
నీ ప్రసన్న వదనంలో కదలాడే భయంకర అసహనపు ఛాయలు!

అయినా అదేదో చిరాకులో ఉన్నావనుకుని, పాతబడిన
నా సంగీతపు పుస్తకాన్ని దులిపి సాధన చేయబోతే…

‘వద్దులే, బయటకు పోయి కచేరీలు చేయవుగా…’
అంటూ మెత్తగానే హెచ్చరించిన నీ కర్కశ స్వరం
హత్య చేసింది నా గళం లోని సప్త స్వరాలను…

నా పాట విని మురిసి వలచిన నీకు
నేడు నేను పాడటమే అయిష్టమైతే…
గొంతు నులిమిన కోయిలనై అలా విలపిస్తూనే ఉన్నాను…
చిత్రమేమిటంటే…
ఆ విలాపం కూడా ఆలాపనలాగే ఉంది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *