May 25, 2024

యాత్రామాలిక – ముక్తినాథ్

రచన: నాగలక్ష్మి కర్రా

కైలాశ్ మానససరోవరం యాత్ర చేసుకున్నాక నేపాలులో ఉన్న ముక్తినాథ్ యాత్ర చేసుకోవాలనిపించింది. సరే గూగుల్ లో చూసుకొని ఓ ట్రావెల్స్ వాళ్లని సంప్రదించి బేరసారాల తరువాత మేం మొత్తం ఏడుగురం బయలుదేరేం.
మేం మాట్లాడుకున్న పేకేజీ ప్రకారం రెండురోజులు ఖాట్మండు, ఒకరోజు జనకపూర్, ఒక రోజు పోకర, ఒక రోజు ‘జోమ్ సోమ్’, తిరుగు ప్రయాణంలో ఒక రోజు పోకర, రెండురోజులు ఖాట్మండు. మొత్తం మా పాకేజీ ఎనిమిది రాత్రులు తొమ్మిది పగళ్లు. జనకపురికి ఖాట్మండు నుంచి ఫ్లైటు, పోకర నుంచి ముక్తినాథ్ కి ఫ్లైటు, హోటల్స్, బ్రేక్ఫాస్ట్, డిన్నరు, పార్కింగు, ఎయిర్ పోర్ట్ లకి తీసుకు వెళ్లడం తీసుకురావడం కూడా కలిపి రేటు మాట్లాడుకున్నాం. మా టూరు ఆపరేటర్లు మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు.
మేం ఖాట్మండులో దిగానే మాకోసం ఓపద్నాలుగు సీటర్ల లగ్జరీ వేనుతో మా గైడ్ కమ్ డ్రైవరు వేచి ఉండడం మాకానందాన్ని కలుగ జేసింది.
ఆరోజు సాయంత్రం పశుపతి నాథుని దర్శించుకొని రూము చేరుకున్నాం. మా హోటలు పశుపతినాథ్ మందిరానికి దగ్గరగా ఉండడం వల్ల తెల్లవారు ఝామున సాయంత్రం రద్దీ తక్కువగా ఉన్నప్పుడు దర్శించుకొనే భాగ్యం కలిగింది. జనకపురి, మనోకావన చూసుకొని పోకరా చేరేం, పోకరా నుంచి అన్నపూర్ణ పర్వత శిఖరాలలోని సూర్యోదయ అందాలు చూడడానికి వెళ్లేం. మా అదృష్టం బాగుండి ఆ రోజు మబ్బులు లేకపోడంతో హిమాలయాల వెనుకనుంచి ఉదయిస్తున్న సూర్యుడిని దర్శించుకున్నాం. ఆ రోజు పోకరాలో పర్యాటక స్థలాలని చూసుకున్నాం.
మరునాడు ప్రొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ చేసుకొని , ప్రతి మనిషికి 7 కిలోగ్రాములు మించకుండా అవుసరమైన సామాను సర్దుకొని మిగతా సామాను హోటలు వారివద్ద ఉంచి బయలుదేరేము ఎన్నాళ్లుగానో అనుకున్న ముక్తినాథ్ కి.
పోఖర విమానాశ్రయం నుంచి జోమ్సోమ్ విమానాశ్రయానికి వెళ్లడానికి 25 నిముషాల సమయం పడుతుంది. ఆరాత్రి మాకు జోమ్సోమ్ లోనే బస. తిరిగి మరునాడు పోఖర వచ్చెస్తాము. పోఖర నుంచి జోమ్సోమ్ కి సుమారు 150 కిలోమీటర్లు మాత్రమే, జీపులలో వెళితే సుమారు పదిగంటలు పడుతుందని చెప్పేరు, అంటే రోడ్ల పరిస్థితి ఊహించుకోవచ్చు. అందుకే మేము ఫ్లైటు లో బుక్ చేసుకున్నాం.
పోఖర విమానాశ్రయం జనకపూర్ విమానాశ్రయం కంటే చిన్నది . బోర్డింగ్ పాస్ అని యేదో కాయితం చేతిలో పెట్టేరు, అందులో మా పేర్లు లేవు, సీటు నెంబర్లు లేవు, కాక్ పిట్ కి తలుపు లేదు, లోపల పైలెట్లు ఇద్దరూ వారి ముందు వెలుగుతున్న బటన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. మొత్తం విమానం 12 మంది కూర్చోనేంతే వుంది, తక్కువ ఎత్తులోంచి వెళుతోంది, నోట్లోంచి నారాయణ మంత్రం తప్ప మరేమీ రావడం లేదు. క్రింద ప్రవహిస్తున్న ‘కాళి గండకి‘ అందాలు ఆస్వాదించలేకపోయేను, అక్కడ వేస్తున్న గాలికి అట్టతో చేసిన విమానంలా ఊగిపోతోంది. 25 నిముషాల ప్రయాణం తరువాత జోమ్సోమ్ విమానాశ్రయంలో దిగేం. రన్ వే, ఓ పాటి గది తప్ప మరేమీ లేవు విమానాశ్రయంలో, మా బేగులు తీసుకొని చిన్న గేటులోంచి బయటకు రాగానే ఎదురుగా మా హోటలు, అక్కడే ఓ జీపు మమ్మల్ని ముక్తినాథ్ తీసుకు వెళ్లడానికి రెడీగావుంది.

Processed with VSCO with preset

మాకిచ్చిన రూములో మా సామానులు పడేసి, చలిబట్టలు, నడకకు వీలుగా ఉండే బూట్లు వేసుకొన జీపెక్కేం. సుమారు 25 కిలోమీటర్లు 3 గంటలు పట్టింది. మాతో పాటు మరో జంట ( తెలుగువారే ) ఉన్నారు జీపులో, మోడీగారి దయ వల్ల అక్కడ కొత్తరోడ్డు పనులు చురుకుగా సాగుతున్నాయి, 5 కిలోమీటర్ల రోడ్డు వెయ్యబడింది, చాలా మటుకు గండకీ నది పక్కగా సాగుతుంది ప్రయాణం, ముక్తి నాథ్ కి 3 కిలోమీటర్ల దూరంలో పార్కింగులో దిగేం. అక్కడనుంచి నడిచి గాని, గుర్రాలమీద గాని, మోటార్ సైకిలు మీదగాని వెళ్లొచ్చు. నేను నడచి వెళ్లాడనికే నిశ్చయించుకున్నాను, ఆ దారి ప్రమాదకరంగా నాకు అనిపించలేదు, కేదార్, అమర్నాథ్, హేమకుంఢ్ వెళ్లిన మాకు ఆ దారి చాలా విశాలంగా అనిపించింది, అయితే హై ఆల్టిట్యూడ్ వల్ల ఆయాసమనిపించింది.
దారిలో రెండుమూడు చోట్ల ఓ నాలుగు మట్టి ఇళ్లు తప్ప మరేమీ లేవు, దారంతా చెట్టూ చేమా ఏమీ లేవు. శాలిగ్రామాలు, చల్లని పానీయాలూ అమ్ముతున్నారు.
ముక్తినాథ్ హిందువులకే కాదు, బౌద్దులకు కూడా పవిత్ర క్షేత్రం.
భౌద్దుల గురువైన ‘పద్మసంభవుడు‘ ( బౌద్దుని అవతారమని అంటారు ), టిబెట్ వెళుతూ ఇక్కడ కొన్నాళ్లు తపస్సు చేసుకున్నాడట, ఈప్రదేశంలో ‘ఢాకినీ దేవతలు‘ ఆకాశం లో నాట్యం చెయ్యడం చూసేడట, బౌద్ధుల తాంత్రిక సిద్ది ప్రదేశాలలో ఇది ముఖ్యమైనదిగా వారి నమ్మకం. బౌద్దులు ఈ క్షేత్రాన్ని ‘ఛుమంగ్ గైత్స్‘ ( సహస్ర ధార ) అనిఅంటారు, మందిరం లోని విష్ణుమూర్తి విగ్రహాన్ని ‘అవలోకితేశ్వరుని’ అవతారంగా చెప్తారు.
ఇక హిందువుల నమ్మకం విషయానికి వస్తే, ముందుగా వైష్ణవుల గురించి చెప్పుకుందాం.

వైష్ణవులు పరమపవిత్ర క్షేత్రాలుగా చెప్పబడ్డ 108 దివ్యదేశాలలో ఇది 107 వది. 8 స్వయంవ్యక్త క్షేత్రాలలో ఇది ఒకటి, మిగతావి శ్రీరంగం, శ్రీమూష్ణం, తిరుపతి, నైమిశారణ్యం, తోటాద్రి, పుష్కర్, బదరీనాధ్. గండకీ నదిలో విష్ణుమూర్తి శాలిగ్రామ రూపంలో ఉంటాడనేది హిందువుల నమ్మకం. నర్మదా నదిలో ఉండే శాలిగ్రామాలు శివుని రూపాలని, గండకీనదిలో దొరికే శాలిగ్రామాలు విష్ణు రూపాలని అంటారు. ఇక్కడకి వచ్చేవారు ముఖ్యంగ శాలిగ్రామాలకోసం వస్తారు. ముక్తినాధ్ ని ‘పంచభూత ప్రదేశమని’ కూడా అంటారు. ‘తిరుమంగై ఆళ్వారు’ శ్రీదేవి భూదేవి సమేత విష్ణుమూర్తి దర్శనం వల్ల జీవుడు ముక్తి పొందుతాడని ఈస్వామిని కీర్తించేడు.
ముక్తినాథ్ లోయ సుమారు 3710 మీటర్ల ఎత్తులోఉంది, మందిర పరిసరాలకు రాగానే కాస్త చెట్లు ఉండి కాస్త ప్రాణానికి హాయి అనిపించింది. మందిర ద్వారం దగ్గర నుంచి లోపలకు వెళితే ఓ పక్కగా శివ మందిరం, శివుని దర్శించుకున్న తరువాత ఓ 400 గజాలు నడిచి వెళితే మెట్లు, మెట్లెక్కి వెళితే అక్కడ విశాలమైన హాలు కూర్చోడానికి బెంచీలు ఉన్నాయి, వెనుకగా చిన్న మందిరం, మందిరానికి ఎదురుగా మూడు చిన్న కొలనులు ఉన్నాయి, ఈ కుండాలని ముక్తి కుండం, పాప కుండం, మోక్ష కుండం అని అంటారు. చలి గజగజలాడిస్తోంది, చుట్టూర మంచుకప్పబడ్డ దౌళగిరి పర్వతశ్రేణులు. ఆ కుండాలలో చెయ్యి ముంచడానికి కూడా సాహసం చెయ్యలేకపోయేం, నీళ్లు నెత్తిన జల్లుకున్నాం, ముందుగా శ్రీదేవి భూదేవి సమేత విష్ణుమూర్తిని దర్శించుకొని నేతి దీపాలు వెలిగించుకొని, హారతి తీసుకున్నాం, ఇక్కడ పూజలు నిర్వహించేది ఓ బౌద్ద సన్యాసి. మందిరం వెనుకవైపున 108 గోవుముఖాల లోంచి పడుతున్న 108 ధారలు, ఈ ధారలు 108 పవిత్ర క్షేత్రాలలోని పుష్కరిణుల నీరు ఇక్కడకి వస్తుందని అంటారు. వీటిని ముక్తి ధారలని కూడా అంటారు. ఈ నీటిలో స్నానం చేసినా, తలపై జల్లుకున్నా ముక్తి లభిస్తుందట.
మేం 108 ధారలోని నీరూ తలపై జల్లుకున్నాం, కొందరు బౌద్దులు (చైనా , జపాను దేశాలకు చెందిన వారు) ఈ ధారలన్నింటిలోనూ స్నానాలు చేసి తరువాత ముక్తికుండాలలో కూడా స్నానం చేసేరు. ఆ కొండలలో మంచుకురవక పోయినా వాతావరణం మైనెస్ లలో ఉండడం వల్ల గోవు ముఖంలోంచి పడుతున్న ధార నేలను తాకేక గడ్డ కట్టుకుపోతోంది. మరోసారి ముక్తినారాయణుని దర్శించుకొని మాకూడా తీసుకు వెళ్లిన నేతి దీపాలు వెలిగించి ఆ ప్రశాంత ప్రకృతిని ఆశ్వాదిస్తూ కొంతసేపు గడిపి నిర్మాణంలో ఉన్న పెద్దబుద్దుని విగ్రహాన్ని దర్శించుకొని కిందకు దిగుతూ పక్కనే ఉన్న జ్వాలామాయిని దర్శించుకున్నాం. చిన్న మందిరం మందిరంలో మూడు ప్రదేశాలనుంచి సహజంగా ప్రజ్వలిస్తున్న జ్వాలలు, పక్కగా నిత్యపూజాదికాలు జరుగుతున్న చిన్న విగ్రహాలు ఉన్నాయి, కొత్త నిర్మాణపు పనులు సాగుతున్నాయి. ఈ జ్వాలామాయి 108 శక్తి పీఠాలలో ఒకటి అని మా గైడు చెప్పేడు. అక్కడనుంచి కిందికి దిగి ముక్తినాధ్ ముఖ్యద్వారానికి చేరుకున్నాం. మా దంపతులం తిరుగు ప్రయాణానికి కూడా నడకనే ఎంచుకున్నాం. దారిలో మాకు కావలసిన శాలగ్రామాలను కొనుక్కున్నాం.
జోమ్ సోమ్ జీపులో వచ్చేటప్పుడు గండకీ నది దగ్గర ఆగి నదిలో ఉన్న చిన్న రాళ్లను ఏరుకొని తెచ్చుకున్నాం.

జోమ్సోమ్ ప్రాంతాన్ని మంచు ఎడారిగా చెప్పుకోవచ్చు. ఇక్కడి ప్రజలు చాలా మొరటుగా ఉంటారు. రాత్రవుతున్నకొద్దీ చలి బాగా పెరిగిపోయింది. హోటల్స్ అంటే ఓ పదిమంది పనిచేస్తూ అలా ఉండవు. హోటలు నడుపుతున్న గృహస్థు, కుటుంబ సభ్యులే వంటా వార్పూ చేసి పర్యాటకులకు వేడిగా వడ్డిస్తూ ఉంటారు. ఇక్కడనుంచి గండకీ గోర్జ్, దామోదర కుండ్ వెళ్లేవాళ్లు బసచేస్తూ ఉంటారు, ప్రొద్దుట అయిదుకల్లా ఈ టూర్లు ప్రారంభమౌతాయి. వారికి వేడిగా టీ టిఫిను అందివ్వడానికి రాత్రి పన్నెండునుంచి వంట మొదలు పెడతారు, మధ్యాహ్నం మూడునుంచి టూర్లకు వెళ్లినవాళ్లు వెనక్కి రావడం మొదలవుతుంది, వారికి తాగడానికి వేడినీటి నుంచి అన్నీ వారే అందిస్తారు. అంత చలిలో పనిచేస్తున్న వారిని చూస్తూ ఉంటే ‘అయ్యో పాపం‘ అనిపించింది .
ఆ రాత్రి రెండేసి రజ్జాయిలు కప్పుకొని వెచ్చగా నిద్రపోయేం, స్నానాలకు వేడినీళ్లు లేకపోవడం, చన్నీళ్ల స్నానం చేసేంత ధైర్యం లేకపోడంతో పోకరాలో స్నానం చెయ్యడానికి నిశ్చయించుకొని ప్రొద్దుట వేడి టీ తాగి రొట్టె తిని విమానాశ్రయానికి బయలుదేరేం.

ఇవండీ మా ముక్తినాథ్ యాత్రా విశేషాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *