May 19, 2024

కంకణాలు – జొన్నరొట్టెలు

రచన: కవిత బేతి

‘ఇవాళ ఎలాగయినా అమ్మకి ఫోన్ చేసి మాట్లాడాల్సిందే…’
‘ఈయన కూడా ఊర్లో లేరు, క్యాంపులో ఉండగా ఇలాంటి విషయాలు చెప్పినా సరిగా పట్టించుకోరు…’
‘రేపటికిగానీ ఇంటికి రారు…’ ఆలోచిస్తూ నడుస్తుంది సరిత.
ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ వాకింగ్ చేస్తుందన్నమాటే కానీ రాత్రి నుండి సరిత మనసు మనసులో లేదు.
ముంబైలో ఉండే సరిత అక్క లలిత ముందునాటి రాత్రి ఫోన్ లో చెప్పిన విషయం విన్నప్పటినుండి అసహనంగా ఆలోచనలు సాగుతున్నాయి, ‘అక్క ఇప్పుడు ఉంటున్నదానికన్నా పెద్ద ఇల్లు కొనుక్కుంది. పదిరోజుల్లో గృహప్రవేశం, రమ్మని నెల కిందటి నుండే చెప్తుంది. పుట్టింటి వాళ్ళు కట్నం కింద బట్టలు పెడతారు, ఆ సంగతి తెలిసిందే. కానీ, దానితోపాటు అమ్మ దగ్గర ఉన్న నాలుగు తులాల చేతికంకణాలు మెరుగు పెట్టి ఇవ్వమని అక్క అడిగిందట, అమ్మ కూడా ఒప్పుకుందట. మూడేళ్ళ కింద హైదరాబాద్ శివార్లలో తను ఫ్లాట్ కొనుక్కొని గృహప్రవేశం చేసుకున్నప్పుడు బట్టలతోపాటు బంగారం ఇచ్చారు. ఇప్పుడు బంగారం ధర పెరిగింది, ఆ లెక్కన తులం పెట్టినా అక్కకి ఎక్కువ డబ్బులు ఇచ్చినట్టే, అలాంటిది నాలుగు తులాల కంకణాలు ఇవ్వడానికి అమ్మ ఎలా ఒప్పుకుంది? అక్క వాళ్ళత్తగారు బాగా ఉన్నవారు, బావగారు బిజినెస్ లో బాగా సంపాదించారు. తమకి భర్త జీతమే ఆధారం, లోను తీసుకుని ఇల్లు కొనుక్కున్నారు, ఇంకో ఇల్లు కొనుక్కునే పరిస్థితిగానీ, ఆలోచనగానీ లేదు. తనకి ఒకడే కొడుకు, అక్కకి ఇద్దరు పిల్లలు. ఇలా చూసుకున్నా పిల్లల పెళ్ళిళ్ళకి కట్నాల కింద పుట్టింటినుంచి తనకన్నా అక్కకే డబల్ అందుతుంది. ఇది చాలా అన్యాయంగా తోచింది సరితకి. క్యాంపుకు వెళ్ళిన భర్త వచ్చాక చెప్పి, అమ్మా నాన్నతో వివరంగా మాట్లాడాలి.’ అనుకుంది.
అప్పుడప్పుడు లలితతో తన జీవితాన్ని పోల్చుకుంటూ భర్త దగ్గర చెప్పుకుని వాపోతుంది సరిత. “నువ్వు కూడా ఉద్యోగం చేయొచ్చు కదా” అంటాడతను. పెళ్లికి ముందు చేసేదే, కానీ పెళ్లి తర్వాత కొత్త చోటు, కొత్త వాతావరణం అత్తగారిల్లు, సంసారం అలవాటు పడాలని, ఆ తర్వాత ప్రెగ్నెన్సీ అని, పిల్లవాడి బాగోగులని ఇప్పుడు అదే అలవాటైపోయి, “ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత ఉద్యోగం చేయాలంటే ఏదోగా ఉంది, ఎవరిస్తారు” అంటూ దాటేస్తుంది.
‘అక్కకి ఇచ్చే దాంట్లో సగం తనకూ ఇవ్వాలని, లేకపోతే గృహప్రవేశానికి అస్సలు రానని చెప్పాలి’ అనుకుంటూ నడుస్తుంటే “అమ్మా అమ్మా, సరితమ్మా!” అని ఎవరో పిలిచినట్టై వెనక్కి తిరిగి చూసింది. కమ్యూనిటీ వాచ్మెన్ భార్య సరోజ, “మీతో మాట్లాడాలని రెండు మూడు రోజులుగా చూస్తున్నానమ్మా” అన్నది దగ్గరగా వచ్చి.
“ఏంటి, చెప్పు?” అన్నది సరిత.
“అదేనమ్మా, మా చెల్లెలు సువర్ణ ఊరి నుంచి వచ్చింది కదమ్మా. ఊర్లో అమ్మానాన్నలకి పొలంపనుల్లో సాయం చేసేది. ఇదివరకు చెప్పాను కదా, వయసు మీద పడుతుండడంతో నాన్నకు ఇప్పుడు చేతకావడం లేదని పొలంపనులు మానుకొని ఇంటి దగ్గరే చిన్నచిన్న పనులేవో చేస్తున్నారు. అక్కడ ఊర్లో ఇంటర్ దాకే ఉంది, పాస్ అయింది. మాలాగా దాని బ్రతుకు అవ్వకూడదని పెద్దచదువులు చదువుకుంటే బాగుంటుందని ఆలోచించి ఇక్కడికి తీసుకువచ్చాము కదా, కాలేజీ సీటు సంగతి చూడమంటే వినడంలేదమ్మా, అవన్నీ నాకు సరిగా తెలవదు. ఏ కాలేజీ, ఏం చదవాలి అని మీతో మాట్లాడమని వచ్చినప్పటి నుండి చెప్తున్నా. ఇదుగో అదుగో అంటూ దాటేస్తుంది, నాతో పాటే పనులకు వస్తుంది, ఇంకా ఏవో చేస్తుందట. ఒకసారి మీరు మాట్లాడండమ్మా. ఈ పనులతో ఏమవుతుంది, మీలాగా పెద్ద చదువులు చదువుకోవాలని కొంచెం బుద్ధి చెప్పండమ్మా” అన్నది.
“సరే, సాయంత్రం రమ్మను ఇంటికి” అన్నది సరిత.
“సరేనమ్మా” అంటూ వెళ్ళిపోయింది సరోజ.
సరిత ఇంటికి చేరుతుండగా ఫోన్ మోగింది.
“హలో”
“హలో మేడం, మన ఏరియా మహిళా క్లబ్ నుంచి మాట్లాడుతున్నాను. మన కమ్యూనిటీ చుట్టుపక్కన ఉన్న ఏరియాలో చాలామంది స్లమ్ డ్వెల్లెర్స్, వలస కూలీలు ఉన్నారు. వాళ్ళ పిల్లలు, ముఖ్యంగా అమ్మాయిలు బళ్లకు వెళ్ళకుండా చదువుకి దూరమై ఇళ్లలో పనులు, కూరగాయలు అమ్ముకోవడం, ఇస్త్రీ చేయడం లాంటి పనులు చేస్తున్నారు. నగరం విస్తరిస్తూ ఇటువైపు ఎక్కువ కొత్తకొత్త బిల్డింగులు రావడంతో వీళ్ళకు పనులు బాగా దొరుకుతున్నాయి. మనిషికి చదువు ఎంత ముఖ్యమో, విచక్షణా జ్ఞానాన్ని, విజ్ఞానాన్నీ ఎలా పెంచుతుందో, ఎవరిమీద ఆధారపడకుండా స్వయంశక్తితో ఎదగటానికి ఎలా దోహద పడుతుందో, సామాజిక, కుటుంబ విలువలను ఎలా పెంచుతుందో, చదువు ఎంత అవసరమో తెలియజేస్తూ మహిళా దినోత్సవం సందర్బంగా చిన్న డ్రైవ్ ఏర్పాటు చేస్తున్నాము. మా అసోసియేషన్ తరఫున ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కొందరిని ఆహ్వానిస్తున్నాము. మీరు ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ అని తెలిసింది. మార్చి 8 న మీరు వచ్చి మహిళలు ఎంత శక్తివంతులు, యుక్తిమంతులు, దానికి చదువు కూడా తోడైతే వాళ్ళు సాధించలేనిది ఏమిటి, లాంటి అంశాల గురించి మీదైన శైలిలో వాళ్లకు అర్ధమయ్యేలా చిన్న ఉపన్యాసం ఇస్తారా” అని అడిగింది. సరేనని ఒప్పుకుంది సరిత.
***
రోజంతా అమ్మతో కంకణాల విషయం ఎలా మాట్లాడాలా అని, ఉపన్యాసం ఏం రాయాలా అని గజిబిజి ఆలోచనలతోనే గడిచింది. సాయంత్రం అయ్యేసరికి ‘ఏదో ఒకటి రాయడం మొదలుపెడితే సరి’ అని, లాప్టాప్ తీస్తుండగా సరోజ సువర్ణని వెంటబెట్టుకొని వచ్చింది.
“అక్కమాట ఎందుకు వినడం లేదు, ఎందుకు చదువుకోనంటున్నావు” అని అడిగింది సరిత.
“లేదక్కా, అమ్మానాన్నల పైన అక్కాబావల పైన భారం అవ్వకుండా నా సొంత కాళ్ళమీద నిలబడి వాళ్లని ఆదుకోవాలని ఉంది” అని జవాబిచ్చింది సువర్ణ.
“సొంతకాళ్ళ పైన నిలబడతావా? ఇంటర్ చదువుతోనా? ఏం చేద్దామని, డిగ్రీ అయినా పూర్తి చేయకుండా ఎంత సంపాదిస్తావు, ఎలా సంపాదిస్తావు?” అనడిగింది సరిత.
“అక్కా, మా అక్కతోపాటు నేను కూడా కొన్ని ఇళ్లల్లో పని కుదుర్చుకున్నాను. ముప్పయివేల వరకు వస్తుంది. ఇక్కడ చాలాచోట్ల బండ్ల మీద జొన్నరొట్టెలు చేసేవాళ్ళని చూశాను, రొట్టెకు పదిహేను రూపాయలు తీసుకుంటున్నారు. మన కాలనీకి మాత్రం కొంచందూరం వరకు లేవు. నాకూ, అక్కకి కూడా జొన్నరొట్టెలు చేయడం బాగావచ్చు, దానికోసం దుకాణం పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. సాయంత్రం పూట ఒక బండి పెట్టుకుంటే చాలు. అదీ లేకపోయినా పరవాలేదు వాట్సాప్ లో నలుగురికి తెలిసేలా చేసి ఇంట్లోనే చేస్తూ ఆర్డర్లు బుక్ చేసుకోవచ్చు. ఆర్డర్లని బట్టి రోజూ రెండు మూడు గంటల పని అంతే, ఈ నాలుగు కాలనీలో వాళ్ళకి సరిపోతుంది. ఇళ్లలో పని ఉదయం అయిదున్నర నుండి మొదలు పెడితే పదిన్నర వరకు అయిపోతుంది. పైన ఫ్లోర్లో ఉండే మాలతి అక్కకి బొటీక్ ఉంది కదా, మధ్యాహ్నం అక్కడ చేతిపని చేస్తున్నాను. నాకు మిషన్ కుట్టడం వచ్చు. డ్రెస్సులు, బ్లౌజుల కటింగ్ నేర్పిస్తానన్నారు. ఇప్పుడంతా ప్లాస్టిక్ మానేసి బట్టసంచులు ఇస్తున్నారు, తాన్లలో బట్ట తెచ్చి చేతిసంచులు కుట్టుడు తేలిక పనే. బావని అడిగితే ఓల్డ్ సిటీ మార్కెట్ల బట్ట తక్కువకి దొరుకుతుందని చెప్పాడు. మెషిన్ సంగతి కూడా కనుక్కుంటా అన్నాడు. ఒక టైలరింగ్ షాపు పెట్టుకుంటా. జొన్నరొట్టెలతో పాటు ఊర్లో చేసే రాగిసంకటి, గడక, రోటిపచ్చళ్ళ కోసం పక్కనే ఇంకో షాప్ తెరవచ్చు. మా అమ్మ ఊరు వంటకాలన్నీ కమ్మగా చేస్తుందక్కా. ఈ పనులకి ఇంచుమించుగా నలబై, యాభై వేలు వస్తాయి. అమ్మనీ నాన్ననీ ఇక్కడికే పిలిపించుకుంటే దగ్గరుండి చూసుకోవచ్చు. వాళ్ళు నా కోసం ఇన్నేళ్లు కష్టపడ్డారు, ఇంకా వాళ్ళని ఏమడుగుతా.
అక్కా, ఈ కాలనీలో అందరూ చదువుకున్నవాళ్లే కానీ అందరూ ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు. చాలా మటుకు హౌస్ వైఫ్లే ఉన్నారు. డిగ్రీ చేయాలంటేనే మూడేళ్లు, అన్ని రోజులు నేను వీళ్ళ మీద భారం అవ్వదలచుకోలేదు. ఎప్పుడో డిగ్రీ వచ్చిన తర్వాత సంపాదించడం కోసం, ఉద్యోగాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగడం ఎందుకు, నాకు ఇప్పుడే కళ్ళకి పైసలు కనబడుతున్నాయి. పనిచేసుకుంటూ, అమ్మనాన్నని చూసుకుంటూ నాదంటూ ఒక షాపు పెట్టుకొని అక్కతో కూడా పనిమానిపించి ఇద్దరం కలిసి చిన్నగా వ్యాపారమే చేసుకుంటాం, దానితోపాటుగా చదువుకుంటా. చదువుకోనని చెప్పలేదక్కా, నాకున్న ఈ కొంచం ఆలోచన చదువువల్లనే కదా. నేను చెప్తే మా అక్కకి అర్ధం కాదు, మీరయినా చెప్పండక్కా. నేను మాలతి అక్క ఇంటికి వెళ్ళొస్తా” అని వెళ్ళిపోయింది.
సరిత ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండటంతో కాసేపు చూసి సరోజ లేచి వెళ్ళిపోయింది.
సువర్ణ తనతో బుద్ధి చెప్పించుకోవడానికి వచ్చిందా, తనకి బుద్ధి చెప్పడానికి వచ్చిందా అర్థం కాలేదు సరితకి. కళ్ళ ముందు నిన్నటి నుంచి కనబడుతున్న నాలుగు తులాల కంకణాలు మాయమై జొన్నరొట్టెలు, చేతిసంచులు, రోటిపచ్చళ్ళు కనబడుతున్నాయి. మహిళా దినోత్సవం ఉపన్యాసం ఏం రాయాలా అన్న ఆలోచన ఓ కొలిక్కి వచ్చింది.

*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *