April 26, 2024

మెచ్చుకోలు

రచన: లావణ్య బుద్ధవరపు

మనం చేసే పని ఎంత చిన్నదైనా పెద్దదైనా, దానికి ఫలితం ఎంత చిన్నదైనా కూడా ప్రతి అంశంలోనూ మెచ్చుకోలు ఆశించడం సహజ మానవ నైజం.
ఇది పుట్టుకతోనే వస్తుంది. సాధారణంగా పిల్లలు నడక మొదలు పెట్టడం, మాటలు పలకడం, రకరకాల విన్యాసాలు చేయడం లాంటివి తల్లిదండ్రులుగా చూస్తూ మనం మురిసిపోతూ వారిని ప్రేమమీరా ముద్దుల్లో ముంచెత్తిస్తాం. అది వాళ్ళు మరింత ఉత్సాహంగా ఇంకా ఎక్కువగా ఆ పనులను చేయడానికి పురిగొల్పుతుంది.
అది మరి ఎదిగేకొద్దీ చదువుల్లో ఆటపాటల్లో వాళ్ళు కనబరిచే ప్రతిభా పాటవాలను బట్టి ఇంట్లోనే కాదు స్కూలు, కాలేజీ, చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఒక ప్రత్యేకమైన గౌరవమిస్తూ మెచ్చుకుంటూ ఉంటే అది ఒకరకమైన టానిక్కుగా పనిచేసి మరింతగా విజయం సాధించే దిశగా ముందడుగు వేస్తారు.
ఆ తర్వాత ఉద్యోగం, వ్యాపారం లేదా, ఏదైనా కళ ఎందులోనైనా ముఖ్యంగా ఏదైనా సాధిస్తే ఖచ్చితంగా మెచ్చుకోలు దొరుకుతుంది.
అంతా బాగానే ఉందిగా, మరేంటి అంటారా?
అక్కడే ఉంది చిక్కంతా. ఇవన్నీ బాగా ఆడినప్పుడు, బాగా పాడినప్పుడు, బాగా పని చేసినప్పుడు ఇలా ఏదైనా బాగా చేస్తేనే మెచ్చుకోలు. కానీ ఈ బాగా అనేది ఈ తరానికి అద్భుతంగా అనేవరకూ స్థాయి పెరిగిందంటే మనందరం ఒప్పుకుని తీరాలేమో.
ఎందుకంటే ఒకప్పుడు పాసవడం నుంచి ప్రథమ శ్రేణి అంటే 60% ఆ పై 70% అనేవి చాలా గొప్ప విషయాలు. కానీ ఇప్పుడది పెరిగి 90%+ కి వెళ్ళి, అసలు 60, 70 లాంటివాళ్ళసలు ఎందుకూ పనికిరానివాళ్ళుగా మిగిలిపోవడం మనం నిత్యం చూస్తున్నాం.
ఇది మార్కులు మాత్రమే కాదు. అన్ని అంశాలలోనూ మనం చూడచ్చనుకుంటా. ఎవరైతే అత్యద్భుతమైన ప్రతిభ కనబరచరో, ఎవరు ఏ ప్రత్యేకతా లేకుండా సాధారణంగా తమ జీవితాన్ని గడుపుతారో వారికి ఎటువంటి ప్రత్యేకమైన మెచ్చుకోలూ ఉండదు.
ఐతే ఇప్పుడేంటీ అంటారా?
ఒక చిన్న మెచ్చుకోలు మనసుకి ఆనందాన్ని, పనుల్లో ఉత్సాహాన్ని, జీవితంలో ఉల్లాసాన్ని నింపగలదు అనుకున్నప్పుడు, ఒక పని పూర్తైనా, ఒక చిన్న వంటకం వండి పెట్టినా, ఒక హోం వర్కు పూర్తిచేసినా, ఒక ప్రశ్నకు బెరుకు లేకుండా సమాధానం చెప్పినా అది ఏదైనా మెచ్చుకోదగ్గ అంశమే కదూ. మరెందుకు ఇంత చిన్న విషయాన్ని మర్చిపోతున్నాము?
ఉదాహరణకు:
ఒక భర్త తన భార్యకు ఒక చీర కొంటే, ఆమె, నాకు నచ్చినది కొని పెట్టారు, బాగుంది అని చెప్పేది ఎంత శాతం జరుగుతోంది. అది చీరలవరకే కాదు, పిల్లలను లక్షలు ఖర్చుపెట్టి చదివించడం, ఇంట్లో వాళ్ళందరి అన్ని రకాల అవసరాలు, సరదాలూ తీర్చడం, తల్లిదండ్రులు వైద్యాలు బాగోగులూ చూసుకోవడం, ఇలా ప్రతి అంశమూ నిత్యం జరిగేదే అయినా అలా జరిపించడానికి వారు పడే తపనను, వారు చేసే కృషిని మెచ్చుకునేవారెంతమందో.
ఇది మగవారికైతే మరి ఆడవారికీ అంతే, వారు చేసే వంటలు, ఇంటి పనులు, పిల్లల పెంపకం, ఇతర మర్యాదలూ, సామాజికపరమైన వ్యవహారాలు, అన్నీ సజావుగా సాగితేనే ఒక ఇంటికి సరైన గౌరవ మర్యాదలు దక్కుతాయి. ఇది తెలిసినా ఎంతమంది కుటుంబ సభ్యులు నీవల్ల నా ఇల్లు నిలబడింది అని గానీ, నువ్వు ఈ చీరలో బాగున్నావు అని, నీ చేత్తో చేసిన ఫలానా వంట బాగుంటుంది అని ఇలా బయటివారిని మెచ్చుకున్నంత తేలికగా ఇంట్లో స్త్రీలను మెచ్చుకోవడం మానేసి చాలా కాలమే అయింది.
ఎవరైనా కొత్తగా పరిచయం అయినప్పుడు చూపించినంత ఆసక్తి, మెచ్చుకోలు, ఉత్సాహం లాంటివి కాలం జరిగే కొద్దీ అన్నీ మరుగున పడిపోయి నెమ్మదిగా ‘ఆ ఇదంతా సాధారణమే అన్నట్టు గా, కనీసం గుర్తించడం కూడా లేనంతగా ముందుకు పోతుంటాం.
ఇవి పైకి కనిపించకపోయినా, మనసులో ఏదో తెలియని ఒక లోటు చోటు చేసుకుని, నెమ్మదిగా జీవితం పట్ల ఒక నిరాసక్తత పెరగడం, బయట గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాలు పెరగడం, నెమ్మదిగా సంబంధ బాంధవ్యాలలో ఆత్మీయత కరువై, నామమాత్రపు బంధాలను సమాజం కోసం కొనసాగించడం లాంటివి జరుగుతాయి.
మరి సమస్య చిన్నగా ఉన్నప్పుడు, పరిష్కారం మన చేతులోనే ఉన్నప్పుడు, మేలుకోకపోతే నా అన్న వారు చుట్టూనే ఉన్నా, స్వంతం అనే భావనని కోల్పోతున్నారు కదా. మరి కొంత సమయం మన అనేవారికోసం, వారు చేసే పనులను, వారి ప్రవర్తనలోని మార్పులను గుర్తించడం, చిన్న చిన్న విజయాలను ఉత్సాహంగా ఒకరితో ఒకరు పంచుకోవడం, ఒకరిని ఒకరు మెచ్చుకోవడం అనే ప్రయత్నాలు క్రమం తప్పకుండా జరగాలి. అదేదో ఎవరికోసమో, లేదా నటన లాగా కాకుండా మనసులోంచి వచ్చిన మాటలైతే అవతలివారిని మనసులను కట్టిపడేసి ఆప్తుల సంఖ్య పెరుగుతుంది. ఆత్మీయులు పెరుగుతారు. ఎక్కడికి వెళ్ళినా మీ ఉనికి ఇతరులకి ఒకరకమైన ఆనందాన్ని ఇస్తుంది. మరి ఏమంటారు.
మరొక విషయం, అన్ని రకాల మెచ్చుకోలు మనకి మరొకరు ఇవ్వనవసరం లేదు. మనల్ని మనం చిన్న చిన్న విషయాలు, మనకి నచ్చిన పనులు చేసినప్పుడు, మనం చిన్న చిన్న విజయాలు సాధించినప్పుడు, ఏవైనా పనులు లేదా పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నా మనల్ని మనం మెచ్చుకోవడం మనల్ని మనం ప్రేమించడం మన అవసరం.
గుర్తుంచుకోండి, మిమ్మల్ని మీరు ప్రేమించకపోతే ప్రపంచంలో ఎవరూ మిమ్మల్ని ప్రేమించలేరు.
మిమ్మల్ని మీరు మెచ్చుకోండి, అవసరమైన చోట మనస్పూర్తిగా ఇతరులను కూడా తప్పకుండా మెచ్చుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *