April 27, 2024

పరవశానికి పాత(ర) కథలు – రండి! స్కిప్టు మీద కూచోండి

రచన: డా. వివేకానందమూర్తి

గోపాల్: నా రాధకి ఎలా వుంది డాక్టర్ గారూ!
డాక్టర్ : మిస్టర్ గోపాల్! మీరొక్కసారి నాతో అలా పక్కకి రండి.
గోపాల్ : ఏం డాక్టర్! కొడతారా! నేనేం తప్పు చేశాను.
డాక్టర్ : అదికాదు. నీతో రహస్యంగా మాట్లాడాలి (ఇద్దరూ కారిడార్ లోకి నడుస్తారు)
డాక్టర్ : ఆమె పరిస్థితి చాలా సీరియస్ గా వుంది.
గోపాల్ : ఆం! డాక్టర్ : కంగారుపడకండి. ఆపరేషన్ చేస్తే ఏ ప్రమాదం లేదు.
గోపాల్ : ఆపరేషన్! అపరేషన్!! మరో గత్యంతరం లేదా డాక్టర్!
డాక్టర్ : లేదు. ఆమె ఈ లోకాన్ని విడిచి పెట్టేలోపుగా ఆపరేషన్ చెయ్యక తప్పదు.
గోపాల్ : ఎంతవుతుంది డాక్టర్?
డాక్టర్ : రెండు లక్షల రూపాయలు.
గోపాల్ : రెండు లక్షల రూపాయలే! ఎప్పటిలోగా కావాలి డాక్టర్?
డాక్టర్ : సాయంత్రంలోగా.
గోపాల్ : ఎలా డాక్టర్?
డాక్టర్ : వూల్లో ఎడ్ల పందాలు జరుగుతున్నాయి. వాటిలో పాల్గొనండి. గెలిస్తే రెండు లక్షల రూపాయలు మీవే.
గోపాల్ : అలాగా! మరయితే ఎద్దు కానివాళ్ళను పందెంలో పాల్గొనిస్తారా డాక్టర్?
డాక్టర్ : మీరు ఎద్దు కానవసరం లేదు, ఒక రెండెడ్ల బండిని మీరు వేగంగా తోలాలి. దట్సాల్.
గోపాల్ : ట్రై చేస్తాను డాక్టర్.
డాక్టర్ : సిన్సియర్ గా చెయ్యండి. గెలుపు మీదే.
గోపాల్ : ఇంతకీ నా రాధ జబ్బేవిటి డాక్టర్?
డాక్టర్ : అది ఒక విచిత్రమైన వ్యాధి. రేపు జరుగబోయేవన్నీ నిన్న జరిగాయనుకొంటుంది. నిన్న జరిగినవన్నీ రేపు జరుగుతాయనుకొంటుంది.
గోపాల్ : ఈ వ్యాధి రాధకి ఎలా వచ్చింది డాక్టర్ ?
డాక్టర్ : దీని కంతకీ ఒక రకమైన సూక్ష్మజీవి కారణం. దురదృష్టవశాత్తూ అది మీ రాధలో ప్రవేశించింది. గోపాల్ : ఎలా డాక్టర్?
డాక్టర్ : వెరీ సింపుల్! ముక్కుద్వారా శ్వాసకోశంలోకి ప్రవేశించి, అక్కడి నుంచి ఎకాఎకీ ఎడమ అరికాలులోకి, మళ్ళీ అక్కడి నుంచి మెదడులోకి ప్రవేశించింది. ఆ సూక్ష్మజీవిది చాలా విచిత్రమైన మనస్తత్వం.
గోపాల్ : మీరు చాలా గొప్పవారు డాక్టర్! వ్యాధిని బలే కనిపెట్టారు.
డాక్టర్ : ఇదంతా నా గొప్పతనం కాదు. నిన్న ఆమె జడకి ఎక్స్ రే తీస్తే బైట పడింది.
గోపాల్ : అలాగా డాక్టర్! అయితే సరే, నేను ఎడ్ల పందాలకు వెళ్ళివస్తాను.
డాక్టర్ : బెస్టాఫ్ లక్, నేనీలోగా అపరేషనకు అన్ని ఏర్పాట్లు చేస్తాను.
— కట్ –
(కన్సల్టేషన్ రూమ్ లో)
డాక్టర్ : ఆపరేషన్ సక్సెస్!
గోపాల్ : ధ్యాంక్యూ డాక్టర్! ఇదుగో మీరడిగిన డబ్బు రెండు లక్షలు.
డాక్టర్ : వెరీగుడ్ (అందుకుంటూ) అయితే పందెం గెలిచారన్న మాట.
గోపాల్ : లేదు డాక్టర్! అది నా రాధ ఇన్సూరెన్స్ డబ్బు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *