April 27, 2024

అన్నమయ్య – ఒక పరిచయం

రచన :  మల్లిన నరసింహారావు

                     

 

 

మాలిక పత్రికలో ప్రచురణ నిమిత్తం ఏదైనా ఓ వ్యాసాన్ని  పంపించరాదా – అని ఆ పత్రిక సంపాదకవర్గం నుండి ఒక ప్రతిపాదన ఈ మెయిల్లో వచ్చింది. సరే అని ఒప్పుకున్నాను. తరువాత  ఏ విషయం మీద వ్రాస్తే బాగుంటుందని ఆలోచిస్తే అన్నమాచార్యుల కీర్తనల గుఱించిన ఓ పరిచయ వ్యాసం అయితే బాగుంటుందని అనిపించింది. అన్నమాచార్యులు, పెదతిరుమలాచార్యులు, చిన తిరుమలాచార్యుల సంకీర్తనలను తిరుమల తిరుపతి దేవస్థానం వారు చాలా సంవత్సరాల క్రితమే 29 పుస్తకాలుగా ప్రచురించారు. ఆ పుస్తకాలనన్నింటిని తిరుపతిలోని టి.టి.డి. వారి ప్రెస్సులో 750 రూపాయలకు 2001 లో అనుకుంటా కొని తెచ్చి ప్లాస్టిక్ కవర్లతో అట్టలు వేసి పుస్తకాల బీరువాలో అందంగా సర్ది పెట్టుకున్నాను. తరువాత తరువాత ఒక్కొక్క పుస్తకాన్నీ చదివి అందమైన సంకీర్తనలను గుర్తు పెట్టి వాటిని నా బ్లాగుల్లో వ్రాయటం ప్రారంభించాను. ఇలా కొంతకాలం చేసాను కానీ ఈమధ్యను దానిని కొనసాగించలేకపోయాను. ఇప్పుడు ఆ 29 పుస్తకాలలోని సంకీర్తనలను పుస్తకానికి 3 సంకీర్తనల వంతున పరిచయం చేస్తే బాగుంటుందని అనిపించి ఆ ప్రయత్నాన్ని మొదలుపెట్టాను. పాఠకులకు ఈ ప్రయత్నం ఎంతవరకూ  నచ్చుతుందో చూడాలి.

 

 

 

మొదటి నాలుగు సంపుటాలు అధ్యాత్మ సంకీర్తనలతో నిండి ఉన్నాయి. మొదటి సంపుటంలో 583 సంకీర్తనలు అన్నమాచార్యులవారివి ఉన్నాయి. స్థాలీపులాక న్యాయంగా ఓ మూడు సంకీర్తనలను ఉదాహరిస్తున్నాను. మొదటి సంకీర్తన ‘భావయామి గోపాలబాలం మనస్సేవితం’ అనేది. ఈ సంకీర్తనలకు రాగాల పేర్లు ఆ యా పుస్తకాలలో పొందుపఱచబడినవాటిని యథాతథంగా ఇక్కడకూడా ఉంచుతున్నాను. కాని నాకు సంగీతంలో ఏమాత్రమూ పరిచయం లేదు. అన్నమయ్య కీర్తనలలోని భావసౌందర్యాన్ని గూర్చి నాకు తెలిసినంతమటుకు చదువరులకు తెలియజేయాలనే ఉత్సాహం మాత్రమే నాది. ఆ కీర్తనలు ఆలాపించిన మహానుభావులు  ఎందరెందరో ఉన్నారు. ఆ కీర్తనలలోని సంగీత సౌరభం గూర్చి నాకు ఎంతమాత్రమూ పరిచయం లేదు. పైగా అన్నమయ్య సంకీర్తనలలో సంగీతానికంటె భావానికే అధిక ప్రాధాన్యం ఇవ్వబడిందనే విషయం పెద్దలు చెప్పగా వినటం జరిగింది. మొదటి సంపుటంలోని మొదటి సంకీర్తన.

 

ధన్నాసి               23వ రేకు

భావయామి గోపాలబాలం మన-

స్సేవితం తత్పదం చింతయేయం సదా IIపల్లవిll

 

కటిఘటితమేఖలాఖచితమణిఘంటికా-

పటలనినదేన విభ్రాజమానం

కుటిలపదఘటితసంకుల శింజితే నతం

చటులనటనాసముజ్జ్వలవిలాసం.IIభావII

 

నిరతకర కలితనవనీతం బ్రహ్మాది-

సురనికరభావనా శోభితపదం

తిరువేంకటాచలస్థిత మనుపమం హరిం

 

పరమపురుషం గోపాలబాలం.భావII 1-137

అన్నమయ్య సంకీర్తనలలో సాధారణంగా మూడేసి చరణాలు ఉంటాయి. కాని ఈ సంకీర్తనలో మాత్రం రెండు చరణాలు మాత్రమే ఉన్నాయెందుచేతనో. ఇది సంస్కృతభాషలో రచింపబడిన సంకీర్తన. అర్థం చేసుకొనే ప్రయత్నం చేద్దాం. నాకు సంస్కృతభాషా పరిచయం బాగా తక్కువ. అయినా ఎలానో అలా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. తప్పులను – పెద్దలు, తెలిసినవారూ- తెలియజేస్తే కృతజ్ఞుడిని.

 

భావయామి=భావించుచున్నాను

గోపాలబాలం=బాలునిరూపంలో ఉన్న గోపాలుని

సదా=ఎల్లప్పుడూ

మనస్సేవితం=మనస్సుతో సేవించబడుచున్న

తత్ పదం=ఆ గోపాలబాలుని పదములను

చింతయ ఇయం=నేను చింతనచేస్తున్నాను

చింతయే2హమ్ కావచ్చునేమో అని ఫుట్ నోట్సులో వ్రాసి ఉంది. నేను చింతిస్తున్నాను అని అర్థం.

కటి=నడుము భాగమునందు

ఘటిత=ఉంచబడిన

మేఖలా=వడ్డాణముయందు

ఖచితమణిఘంటికా=తాపడము చేయబడ్డ మణులఘంటలయొక్క

పటల=సమూహము

విభ్రాజమానం=ప్రకాశితమగుచున్నది.

కుటిలపదఘటిత=వంకరగానున్నపదములయందుంచబడిన

శింజితే నతం=మువ్వలచప్పుడు(?), శింజితానతం అని ఉండవచ్చేమో అంటూ ఏమైనా అర్థమంత సరిగా దోపదు అని అథోసూచికలో సూచించారు.

చటులనటనా=నటనలతో చలించున్న

సముజ్జ్వలవిలాసం=సముజ్జ్వలమైన విలాసముతో కూడుకున్నది

నిరత=మిక్కిలి ఆసక్తికొన్న

కరకలిత=అరచేతియందలి

నవనీతం=వెన్నపూస

బ్రహ్మాదిసురనికరభావనా శోభితపదం =బ్రహ్మదేవుడు మొదలుగాగల దేవతల సమూహము చేత భావింపబడిన అందమైన పదములు

తిరువేంకటాచలస్థితమ్=శ్రీవేంకటాచలపర్వతమందున్న

అనుపమం హరిం=చక్కనివాడైన శ్రీహరిని

పరమపురుషం=పరమపురుషుడైన

గోపాలబాలం=గోపాలబాలునిని

భావయామి=భావించుచున్నాను.

 

ఇక ఈసంపుటి లోని రెండవ సంకీర్తన.

ముఖారి        26వ రేకు

ఆఁకటివేళల నలపైన వేళలను

తేఁకువ హరినామమే దిక్కు మఱి లేదు IIపల్లవిII

 

కొఱమాలివున్న వేళ కులముచెడినవేళ

చెఱవడి వొరులచేఁ జిక్కినవేళ

వొఱపైన హరినామ మొక్కటే గతిగాక

మఱచి తప్పిననైన మఱి లేదు తెఱఁగు IIఆఁకటిII

 

ఆపదవచ్చినవేళ యారడిఁబడినవేళ

పాపపువేళల భయపడిన వేళ

వోపినంత హరినామ మొక్కటే గతిగాక

మాపుదాఁకాఁ బొరలిన మరి లేదు తెఱఁగు IIఆఁకటిII

 

సంకెళఁ బెట్టినవేళ చంపఁబిలిచిన వేళ

అంకిలిగా నప్పులవా రాఁగినవేళ

వేంకటేశునామమే విడిపించ గతిగాక

మంకుబుద్ధిఁ బొరలిన మరి లేదు తెఱఁగు IIఆఁకటిII 1-158

 

తేకువ= ధైర్యము, భయము

 

కొఱమాలి=పనికిమాలిన

 

వొరపైన=యోగ్యమైన, సుందరమైన

 

ఆరడి=నింద

 

అంకిలి=అడ్డగింత

 

పొరలిన=దొర్లిన

 

మనకు కష్టాలు కలిగిన వేళలలో ఆ శ్రీహరి ధ్యానమే మనకు గతి. అదికాక మరి ఏవిధంగానూ కూడా మనం మన కష్టాలను గట్టెక్కలేం. మనకు వచ్చే వివిధ రకాలైన కష్టాలను వరసగా వర్ణించి ఆ యా సమయాల్లో శ్రీహరి ధ్యానం చేయటం వలన మన కష్టాలు తీరిపోతాయని సూచన చేస్తూ సాగిన సంకీర్తన యిది.

 

ఇక ఈ సంపుటంలోని ఇంకో (మూడవ) సంకీర్తన.

 

గుండక్రియ

 

కడు పెంత తాఁ గుడుచు కుడుపెంత దీనికై

పడనిపాట్లనెల్లఁ బడి పొరలనేలా IIపల్లవిII

 

పరులమనసునకు నాపదలు గలుగఁగఁ జేయు

బరితాపకరమైనబ్రదుకేలా

సొరిది నితరులమేలు చూచి సైఁపఁగ లేక

తిరుగుచుండేటి కష్టదేహ మిది యేలా IIకడుII

 

యెదిరి కెప్పుడు జేయుఁ హితమెల్లఁ దనదనుచు

చదివిచెప్పనియట్టిచదువేలా

పొదిగొన్నయాసలోఁ బుంగుడై సతతంబు

సదమదంబై పడయు చవులు దనకేలాIIకడుII

 

శ్రీవేంకటేశ్వరుని సేవారతికిఁగాక

జీవనభ్రాంతిఁబడుసిరులేలా

దేవోత్తముని నాత్మఁ దెలియనొల్లక పెక్కు-

త్రోవ లేఁగిన దేహి దొరతనంబేలాIIకడుII 1-302

 

కడుపుకు తినడానికి తనకెంతకావాలి? (చాలా తక్కువ). దీనికోసమై పడరాని పాట్లన్నీ పడి పొర్లుతూ ఉండాలి.

ఇతరుల మనసుల కాపదలు కలుగజేయు పరితాపాన్ని కలుగజేసే బ్రతుకు ఎందుకు?

క్రమముగా ఇతరులమేలు చూచి సహించలేక తిరుగుతూ ఉండేటి కష్టదేహము ఇది ఎందుకు?

ఇతరులకు చేసే మేలెల్లా తనదే, తనకోసమే నని చదివి చెప్పని చదువు ఎందుకు?

ముప్పిరిగొను ఆశలలో యెల్లప్పుడూ కూరుకుపోతూ సతమతమైపోతూ  పొందే ఆ ముత్యాల కాంతి తనకెందుకు?

 

శ్రీవేంకటపతి సేవలో పొందే అనురక్తిని కాక జీవనభ్రాంతిని కలిగించే భోగభాగ్యాలు ఎందుకు?

 

ఆ దేవోత్తముడైన శ్రీహరిని ఆత్మలో తెలియటానికి ఇష్టపడక పెక్కుత్రోవలలో తిరిగే దేహి గొప్పదనం ఎందుకు?

 

ఈ విధంగా ఈ సంకీర్తనలో అన్నమయ్య మనం మన జీవనవిధానాన్ని ఎలా మలచుకోవాలో సూచన చేసాడు.

 

ఇక రెండవ సంపుటం లోనికి ప్రవేశిద్దాం. ఈ సంపుటంలోనివి శ్రీ అన్నమాచార్యుల సంకీర్తనలే. మొత్తం 519 సంకీర్తనలు. మొదటి సంకీర్తన.

రామక్రియ

చాటెద నిదియే సత్యము సుండో

చేటు లేదీతని సేనించినను IIపల్లవిII

 

హరినొల్లనివా రసురలు సుండో

సుర లీతనిదాసులు సుండో

పరమాత్ముఁ డితఁడె ప్రాణము సుండో

మరుగక మఱచిన మఱి లేదిఁకను.IIచాటెదII

 

వేదరక్షకుఁడు విష్ణుఁడు సుండో

సోదించె శుకుఁ డచ్చుగ సుండో

ఆదిబ్రహ్మగన్నాతఁడు సుండో

యేదెస వెదకిన నితఁడే ఘనుఁడు.IIచాటెదII

 

యిహపర మొసఁగను యీతఁడె సుండో

వహి నుతించెఁ బార్వతి సుండో

రహస్య మిదివో రహి శ్రీవేంకట-

మహిధరంబున మనికై నిలిచె.IIచాటెదII 2-164

 

మరుగక=చాటుచేయక

 

వహి= విధముగా

 

సుండో=నిశ్చయార్థకముగా చెప్పే మాటను గూర్చి చెప్పటానికి వాడతారు..

 

అన్నమయ్య ఏదైనా విషయాన్ని నొక్కి చెప్పదలిస్తే దాన్ని చాటింపు వేసి మరీ చెప్తాడు.ఈ విషయం చాలా సంకీర్తనల విషయంలో మనకు కనిపిస్తుంది.

ఇదే సత్యము అని చాటింపువేసి మరీ చెప్తున్నాను వినండోహో — శ్రీహరిని సేవిస్తే నష్టం ఎంతమాత్రమూ లేదు గాక లేదు.

శ్రీహరిని అంగీకరించని వాళ్ళందరూ రాక్షసులే, దేవతలందరూ ఈతని దాసులే సుమా! పరమాత్ముడైన ఈతడే ప్రాణము సుమా!

ఇది సంతాపించి మరిస్తే మరిక ఏమీ లేదు.

విష్ణుడే వేదరక్షకుడు, దీనిని శుకమహర్షి మనకు శోధించి నిరూపించాడు. సృష్టికి ఆదిమూలమైన బ్రహ్మను కన్నవాడీతడే! యే దెసను వెదకినా యీతడే ఘనుడు.

మనందరికీ ఇహపరాలొసగే దీతడే.ఇతనిని పార్వతీ దేవి ప్రార్ధించింది.(విష్ణు సహస్ర నామాల్లో చివరను శివుడు పార్వతీ దేవికి “శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే- సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే” అంటూ విష్ణుమూర్తిని సంక్షిప్తంగా కీర్తించే విధానాన్ని బోధిస్తాడు). ఇది చాలా రహస్యమైనది సుమా! శ్రీవేంకటేశ్వరుని కొండమీద ప్రతిష్టించబడి నిలిచి వున్నది

 

ఈ సంపుటంలోని రెండవ సంకీర్తన

 

గుండక్రియ      169వ రేకు

దాఁచుకో నీ పాదాలకుఁ దగ నేఁ జేసిన పూజ లివి

పూఁచి నీ కీరితిరూపపుష్పము లివి యయ్యా। ॥పల్లవి॥

 

వొక్క సంకీర్తనే చాలు వొద్దికై మమ్ము రక్షించఁగ

తక్కినవి భండారాన దాఁచి వుండనీ

వెక్కసమగు నీ నామము వెల సులభము ఫల మధికము

దిక్కై నన్నేలితి విఁక నవి తీరని నా ధనమయ్యా। ॥ దాఁచుకో ॥

 

నా నాలికపై నుండి నానా సంకీర్తనలు

పూని నాచే నిన్నుఁ బొగడించితివి

వేనామాల వెన్నుఁడా వినుతించ నెంతవాఁడ

కానిమ్మని నా కీపుణ్యము గట్టితి వింతేయయ్యా। ॥ దాఁచుకో॥

 

యీ మాట గర్వము కాదు నీ మహిమే కొనియాడితిఁగాని

చేముంచి నా స్వాతంత్ర్యము చెప్పినవాఁడఁ గాను

నేమానఁ బాడేవాఁడను నేరములెంచకుమీ

శ్రీమాధవ నే నీదాసుఁడ శ్రీవేంకటేశుఁడవయ్యా. ॥ దాఁచుకో॥ 2-338

 

చాలా ప్రసిద్ధమైన అన్నమయ్య కీర్తనలలో ఇది ఒకటి.

 

ఈ సంకీర్తనలు నీ పాదాలకు తగినవిధంగా నేను చేసిన పూజలివి. ఇవి నేను నీకు సమర్పించే పూచిన నీ కీర్తిరూపములైన పుష్పములయ్యా!

మమ్మల్ని ఒద్దికగా రక్షించడానికి వీటిలో ఒక్క సంకీర్తనే చాలు. తక్కినవి భండారాన దాచి వుండనీ. అధికమైన నీ నామము యొక్క వెల సులభము, ఫలమధికము. నీవు నాకు దిక్కై నన్ను ఏలావు. అవి నా తీరని ధనమయ్యా.

నా నాలికపై నిలచి నీవు పూనుకొని నాతోఎన్నో సంకీర్తనలతో నిన్ను పొగడించికొనినావు. వేయి నామాల వెన్నుడా! నిన్నునుతించగా నే నెంతవాడను? నీవే కానిమ్మని నాకు ఈ పుణ్యాన్నికట్టావింతేనయ్యా!

ఈ మాట గర్వముతో చెబుతున్నది కాదు. నీ మహిమనే నేను కొనియాడేను, కాని వేఱు కాదు.

చేముంచి(?) నా స్వాతంత్ర్యము చెప్పినవాడ కాను. నియమంతో పాడే వాడిని. నేరములెంచకువయ్యా. ఓ శ్రీ మాధవా! నేను నీ దాసుడనయ్యా! నీవు నా పాలి శ్రీవేంకటేశ్వరుడవు.

 

ఇంకో సుందరమైన మూడవ సంకీర్తన ఈ సంపుటంలోనించే

 

దేసాళం                          175వ రేకు

గతులన్ని ఖిలమైన కలియుగమందున

గతి యీతఁడే చూపె ఘనగురుదైవము IIపల్లవిII

 

యీతని కరుణనేకా యిల వైష్ణవులమైతి-

మీతనివల్లనే కంటి మీ తిరుమణి

యీతఁడే కా వుపదేశ మిచ్చె నష్టాక్షరిమంత్ర-

మీతఁడే రామానుజులు యిహపరదైవము.IIగతుII

 

వెలయించె నీతఁడే కా వేదపురహస్యములు

చలిమి నీతఁడే చూపే శరణాగతి

నిలిపినాఁ డీతఁడే కా నిజముద్రాధారణము

మలసి రామానుజులే మాటలాడేదైవము.IIగతుII

 

నియమము లీతఁడేకా నిలిపెఁ ప్రపన్నులకు

దయతో మోక్షము చూపెఁ దగ నీతఁడే

నయమై శ్రీవేంకటేశు నగమెక్కే వాకిటను

దయఁజూచీ మమ్ము నిట్టే తల్లి తండ్రి దైవము.IIగతుII 2-372

 

చలిమి= ఈ పదాన్ని అన్నమయ్య చాలా సంకీర్తనలో వాడాడు. శ్రీహరి నిఘంటువులో దీనిని చెలిమి గా చూపించారు.

 

మలసి=విజృంభించి

 

ప్రపన్నులు= ప్రపత్తి చేసినవారు

 

ఈ కీర్తన విశిష్ఠాద్వైత మతాచార్యులైన శ్రీరామానుజాచార్యులను గుఱించి చెప్పిన సంకీర్తన.

త్రోవలన్నీ చెడిపోయిన యీ కలియుగమునందు మనకు సరియైన మార్గమును ఘనులు, గొప్పదైవము అయిన శ్రీ రామానుజాచార్యులవారే చూపించినారు.

యీతని కరుణ చేతనే కాదా యీ ఇలలో మనము వైష్ణవులమైనాము. యీతనివల్లనే ఈ తిరుమణి(వైష్ణవులు నొసట నిడుకొనే తెల్లని ధవళ మృత్తిక)ని చూడగలిగాము.యీతడే కదా మనకు అష్టాక్షరీ మంత్రము(ఓం నమో నారాయణాయ)ను ఉపదేశించినది.యీయనయే శ్రీరామానుజాచార్యులు మనకు ఇహపరముల రెండింటికీ దైవము.

వేదపు రహస్యాలనన్నీ ప్రసిద్ధికెక్కునట్లుగా చేసినదీతడే కదా. చలిమిని(?)యీతడే శరణాగతిని చూపించెను. ఇతడే కదా మనకు నిజముద్రాధారణమును(చేతులకిరుప్రక్కలా భుజముల క్రిందుగా కాల్చిపెట్టిన వైష్ణవముద్రను ధరించుటను నియమముగా)నిలిపినాడు. తిరిగి శ్రీ రామానుజులే మనతో మాటలాడే దైవము.

భక్తిపరులు చేయు శరణాగతి చేయువారికి నియమములనేర్పాటు గావించినదీతడే కదా.తగినట్లు దయతో మోక్షమును చూపించిన దీతడే కదా.అందమైన శ్రీవేంకటేశుని కొండ యెక్కిన మాకు వాకిటిలోనే ఇట్టే దయ చూచే తల్లి, తండ్రి, దైవము శ్రీ రామానుజులే.

 

ఇక మనం మూడో సంపుటం లోనికి ప్రవేశిద్దాం, రండి.

 

సామంతం       234వ రేకు

పసిఁడియక్షంత లివె పట్టరో వేగమే రారో

దెసలఁ బేరటాండ్లు దేవుని పెండ్లికిని.IIపల్లవిII

 

శ్రీవేంటేశ్వరునికి శ్రీమహాలక్ష్మికి

దైవికపుఁ బెండ్లిముహూర్తము నేఁడు

కావించి భేరులు మ్రోసె గరుడధ్వజం బెక్కె

దేవతలు రారో దేవుని పెండ్లికిని. IIపసిఁడిII

 

కందర్ప జనకునికిఁ గమలాదేవికిఁ బెండ్లి

పందిలిలోపలఁ దలఁబాలు నేఁడు

గందమూ విడె మిచ్చేరు కలువడాలు గట్టిరి

అందుక మునులు రారో హరి పెండ్లికిని.IIపసిఁడిII

 

అదె శ్రీవేంకటపతి కల మేలుమంగకును

మొదలితిరునాళ్ళకు మొక్కేము నేఁడు

యెదుట నేఁగేరు వీరె యిచ్చేరు వరము లివె

కదలి రారో పరుష ఘనుల పెండ్లికిని. IIపసిఁడిII 3-194

 

ఈ సంకీర్తనలో శ్రీవేంకటేశ్వరునికి అలమేలుమంగమ్మతల్లికి జరుగుతున్న పెండ్లిసంబరాన్ని వర్ణిస్తా డన్నమయ్య. వారి పెండ్లికి  అన్ని దిక్కులలోని దేవతలనూ పేరంటాండ్లుగా రమ్మని అన్నమయ్య ఆహ్వానిస్తున్నాడు. మనమూ వెళదాం రండి. దేవునిపెండ్లికి అందరూ పెద్దలే కదా. దేవుడిని దేవినీ దీవించటానికి బంగారపు అక్షతలను చేతిలో పట్టుకుని వేగంగా ఈ పెండ్లికి రమ్మని మనలనందరినీ పేరుపేరునా పిలుస్తున్నా డన్నమయ్య. ఈ రోజే శ్రీవేంకటేశ్వరునికి శ్రీమహాలక్ష్మికి దైవికంగా కుదిరిన పెండ్లి సుముహూర్తం. భేరులు మ్రోగించారు, గరుడధ్వజాన్ని నిలబెట్టారు.దేవతలు అందరూ దేవునిపెండ్లికి తరలి రండి. మదనుని జనకుడైన శ్రీమహావిష్ణువుకు శ్రీలక్ష్మికీ నేడు పెండ్లి జరుగబోతోంది. అందరూ తరలి  రండి. పందిరిలో వారిద్దరూ తలంబ్రాలు పోసుకునే వేడుకను మనమంతా తిలకిద్దాం. మంచి గంధాన్ని, తాంబూలాన్నిఇచ్చేరు. కలువడాలు కట్టారు. మహామునులు అందరూ శ్రీహరిపెండ్లికి తరలి రండి.  అదిగో శ్రీవేంకటపతికీ అలమేలుమంగమ్మకూ పెండ్లి జరుగుతోంది. మొదలి తిరునాళ్ళలా జరుగుతున్న ఈ సంబరానికి మేమంతా నేడు మొక్కుతున్నాము. ఎదురుగా వెళ్తున్న వీరు అనేక వరాల్ని మనకు అనుగ్రహించేరు. ఈ ఘనుల పెండ్లికి అంతా తరలి రండి అంటూ అన్నమయ్య మనకందరికూ స్వాగతం పలుకుతున్నాడు ఈ సంకీర్తనలో.

 

ఇక మూడవ సంపుటంలోని రెండవ సంకీర్తనలోకి ప్రవేశిద్దాం.రండి.

 

దేవగాంధారి        262వ రేకు

వినరో భాగ్యము విష్ణుకథ

వెనుబలమిదివో విష్ణుకథ.IIవినII

 

ఆదినుండి సంధ్యాదివిధులలో

వేదంబయినది విష్ణుకథ

నాదించీనిదె నారదాదులచే

వీదివీధులనె విష్ణుకథ.IIవినII

 

వదలక వేదవ్యాసులు నుడిగిన-

విదితపావనము విష్ణుకథ

సదనంబైనది సంకీర్తనయై

వెదకినచోటనే విష్ణుకథ.IIవినII

 

గొల్లెతలు చల్ల గొనకొని చిలుకఁగ

వెల్లవిరియాయ విష్ణుకథ

యిల్లిదె శ్రీవేంకటేశ్వరునామము

వెల్లిగొలిపె నీవిష్ణుకథ. IIవినII 3-355

 

వెనుబలము

 

సదనము=ఇల్లు, గృహము, జలము

 

వెల్లవిరి యగు=వ్యాపించు

 

వెల్లిగొలుపు=ప్రవహించు

 

ఈ సంకీర్తనలో విష్ణువును కృష్ణుడిని ఒక్కరుగానే కీర్తించినట్లు కనబడుతోంది. విష్ణుకథ అంటే భాగవతమనే అర్థమే స్ఫురిస్తోంది ఈ సంకీర్తనలో. ఈ విష్ణుకథను వినటం మన మహాభాగ్యం. ఈవిష్ణుకథ వింటే మనకు అధికమైన బలం కలుగుతుంది. సృష్ట్యాదినుండీ సంధ్యావందన విధులలో వేదంలా భాసించింది విష్ణుకథ. నారదాది మహామునులచే వీధివీధియందూ మారుమ్రోగినది ఈ విష్ణుకథే. వేదవ్యాస మహామునిచే విరచితమైన కథే ఈ విష్ణుకథ. సదనమై సంకీర్తన యై వెదకినచోటెల్లా దొరికేది ఈ విష్ణుకథ. గొల్లభామలు చల్ల చిలుకుతూ పాడే కథ ఈ విష్ణుకథే. ఈ విష్ణుకథలో ప్రసిద్ధిపొందిన నామం ఆ శ్రీవేంకటేశ్వరునిదే.

 

ఈ సంపుటిలోని మూడవ సంకీర్తనం చూద్దాం రండి.

 

శుద్ధవసంతం

 

చేరి యశోదకు శిశు వితఁడు

ధారుణి బ్రహ్మకుఁ దండ్రియు నితఁడు। IIపల్లవిII

 

సొలసి చూచినను సూర్యచంద్రులను

లలి వెదచల్లెడు లక్షణుఁడు

నిలిచిననిలువున నిఖిలదేవతల

కలిగించు సురలగనివో యితఁడు। IIచేరిII

 

మాటలాడినను మరియజాండములు

కోటులు వొడమేటిగుణరాశి

నీటగునూర్పుల నిఖిలవేదములు

చాటువనూరేటి సముద్ర మితడు। IIచేరిII

 

ముంగిటఁ బొలసినమోహన మాత్మలఁ

బొంగించే ఘనపురుషుఁడు

సంగతి మావంటిశరణాగతులకు

నంగము శ్రీవేంకటాధిపుఁ డితఁడు। IIచేరిII

 

ఈ శ్రీవేంకటేశుడు యశోదకు శిశువైన శ్రీకృష్ణుడే.ఈ భువిలో బ్రహ్మదేవునికి తండ్రి కూడా యితడే.

వైముఖ్యముతో చూచినను సూర్యచంద్రులిరువురిని ఉత్సాహముతో వెదజల్లే లక్షణము కలిగిన వాడితడు.

నిలుచున్నపళంగా అందరు దేవతలను ప్రత్యక్షపరచగలిగే సురల గనియే యితడు.

మాటలలో కోటానుకోట్ల అజాండములను కలుగునట్లు చేయగలిగిన గుణములప్రోవితడు.

నీటైన ఊరుపుల వంటి అన్ని వేదములు ఊరేటి సముద్రము వంటివాడితడు.

ముంగిట వెలసిన మోహనరూపము ఆత్మలయందు పొంగించే గొప్ప పురుషుడితడు.

మావంటి శరణాగతులైనవారికి శరీరము వంటి వాడీ శ్రీవేంకటేశ్వరుడు.

 

 


1 thought on “అన్నమయ్య – ఒక పరిచయం

  1. అర్థవివరణతో అర్థవంతంగా వ్రాసారు…పాడగలిగినవారు ధన్యులు…అర్థంతెలిసి పాడితే భావనలో అందుతాడు పరమాత్మ…అంటారు అనుభవఙ్ఞులు…ప్రాతఃస్మరణీయుడైన అన్నమయ్య వ్రాసిన కొన్ని కీర్తనలు పరిచయం
    చేసిన మీరు అభినందనీయులు.

Comments are closed.