April 26, 2024

చెప్పబడనిది, కవితాత్మ!

రచన: వెంకట్.బి.రావ్

 

పూర్వం ఒక పల్లెటూరి పాఠశాలలో ఒక పంతులుగారుండేవారట. ఆయన పాఠం చెపుతున్నపుడూ చెప్పనపుడూ అని లేకుండా, ఎప్పుడు చూసినా పిల్లల మీద చిర్రుబుర్రులాడుతూండేవాడట. ఒకరోజలా చిర్రుబుర్రులాడుతూ పాఠం చెబుతూండగా, ఒక పిల్లవాడు పాఠం సరిగా వినకపోతూండడం గమనించి, కోపంతో ఆ పిల్లవానిని లేపి నిలుచుండబెట్టి బెత్తం చూపుతూ “ఈ బెత్తం చివర ఒక మూర్ఖుడు ఉన్నాడు!” అన్నాడట. దానికా పిల్లవాడు తడుముకోకుండా “ఏ చివరన పంతులుగారూ?” అన్న ప్రశ్నతో సమాధానం చెప్పాడట. ఆ సమాధానానికి దిమ్మతిరిగిపోయిన పంతులుగారికి ఆ పిల్లవాడు వాచ్యంగా చెప్పనిది, అర్ధంగావలసినదేదో అర్ధమై మరి మాట్లాడకుండా ఉండిపోయాడట. ఇంతకీ, ఈ పొట్టి కథనెందుకు చెప్పాలిసొచ్చిందంటే, ఇందులో ఆ పిల్లవాడు వాచ్యంగా చెప్పనిదేదయితే ఉందో, దానిని సాహిత్య పరిభాషలో ‘ధ్వని’ అని అంటారని చెప్పడానికి.

 

భారతీయ సాహిత్యానికి సంబంధించిన పరామర్శలో ‘ధ్వని’ అనే పదం చాలా పెద్ద సంగతి. మన సాహిత్యవేత్తల అభిప్రాయంలో

‘కావ్యాత్మ ధ్వని’ అనీ, కావ్యంలోని ఈ ‘ధ్వని’ పాఠకునిలో (పాఠకురాలిలో) కలుగజేసే అనుభూతి ‘రస’ మనీ చెప్పబడింది. ‘ధ్వని’ కావ్యాత్మ కావడడం వలననూ, కావ్యంలో ఏదైతే వాచ్యంగా చెప్పబడదో అది ‘ధ్వని’ కావడంవలననూ, ఏదైతే చెప్పబడదో అదే ‘ధ్వనిసిధ్ధాంతం’ ప్రకారం కావ్యానికి ఆత్మ అయింది. ఆనందవర్ధనాచార్యులు తమ ‘ధ్వన్యాలోకం’ లో దీనిని ప్రతిపాదించి నిరూపిస్తే, ముమ్మట, జగన్నాథ, విద్యానాధాదులీ సిధ్ధాంతాన్ని శిరసావహించి అనుసరించారు. రస మెప్పుడూ వ్యంగ్యమే కావాలి తప్ప వాచ్యం కారాదన్నది నిర్ణయమైపోయింది. ఈ సూత్రాన్ని పాటించిన కవిత్వం ఉత్తమమైనదిగా పరిగణించబడింది. భాస, కాళిదాస, భవబూత్యాది మహాకవుల రచనలన్నీ ఈ సూత్రానికి కట్టుబడే ఉంటాయన్నది నిరూపించబడింది, ఉత్తమ కవిత్వానికి వారి రచనలు మార్గదర్శకాలూ, ఆదర్శప్రాయాలూ అయ్యాయి.

 

ఇప్పుడు కాసేపు ఈ సాహిత్యానికి సంభందించిన భాషనలా పక్కనబెట్టి, మనం సాధారణంగా నిత్యం మాట్లాడుకునే మాటల్లో చెప్పాలనంటే, మనం ఒక పద్యాన్నో పాటనో చదివేటప్పుడూ వినేటప్పుడూ వాటి భావం ఒక్కొకప్పుడు మనల్ని ఎక్కెడికో తీసుకువెళుతూండడాన్ని గమనిస్తాం. ఒక పేజీడు పదాలు చెప్పగలిగే సంగతిని (ఒక్కొకప్పుడు చెప్పలేని సంగతిని), వాక్యానికి నాలుగు లేదా ఐదు పదాలు మించని ఒకటిరెండు వాక్యాలు చెప్పగలుగుతాయి. అలా చెప్పగలిగిన వాక్యాలలో కనబడకుండా ప్రజ్వరిల్లి వెలిగేది ధ్వనే!

 

“శశినా సహ యాతి కౌముదీ

సహ మేఘేన తటిత్ ప్రలీయతే.”

 

‘చంద్రునితోపాటే వెన్నెల వెళ్ళిపోతుంది, మేఘంతో లీనమై మెరుపు పోతుంది’ అని ఈ మాటల అర్ధం. ఇది చదివినప్పుడు ఈ రెండు దృష్టాంతాలూ వాచ్యంగా చెప్పనిదానిని మరిదేనినో పఠిత తలపుకు తెస్తాయి. ఒక ప్రియురాలు తన ప్రియుని వెనకనే సిగ్గుపడుతూ అడుగులువేస్తూ, నీవులేనిదే నాకిక బ్రతుకు లేదన్నట్లుగా అనుసరించిపోతూండడం అనే హృద్యమైన సన్నివేశం తలపులలో మెదిలి ‘ఆహా!’ అనిపిస్తుంది ఒక్క క్షణకాలం. ఇందులో చెప్పనిదేదయితే వుందో అదే అసలు సంగతి.

 

“అవిఅహ్ణ పేక్ఖణిజ్జేణ తక్ఖణం మామి తేణ దిట్ఠేణ,

సివిణఆ పీఏణ వ పాణిఏణ తహ్ణ వ్విఆ ణ పిట్ఠా.”

 

గాథాసప్తశతిలోని ఒకటవ శతకంలో 93వ గాథ ఇది. దీనికి సంస్కృత ఛాయ:

 

“అవితృష్ణ ప్రేక్షణీయేన తత్ క్షణం మాతులాని తేన దృష్టేన,

స్వప్న పీతేనేవ పానీయేన తృష్ణేవ న భ్రష్టా.”

 

‘చూడాలిచూడాలని మనసులో ఎంతగానో తహతహలాడుతున్న తరుణంలో తనకు ప్రియుడైన వ్యక్తి హటాత్తుగా క్షణకాలం దర్శనమిచ్చి మాయమౌతాడు. ఆ క్షణకాల దర్శనం తృప్తినిస్తుందా? ఇవ్వదు గాక ఇవ్వదు. స్వప్నంలో తాగిన మంచినీళ్ళు దాహాన్ని తీరుస్తాయా? తీర్చవు గాక తీర్చవు!’ – ఇదీ ఈ గాథ భావం. ‘స్వప్నంలో తాగిన మంచినీళ్ళు’ – ఎన్ని మాటల్లో ఎన్ని పేజీలు నింపితే ఈ మూడు మాటలు చెప్పగలిగిన భావాన్ని చెప్పగలం? రెండువేల సంవత్సరాల క్రితం ఒక ప్రాకృతకవి మనస్సులో మెదిలిన ఊహాచిత్రం ఇది. చెబితే ఇలాగదా చెప్పాలి!

 

“పుట్టంతేణ వి హిఅఏణ మామి ణివ్వరిజ్జఏ తమ్మి,

ఆద్దాఏ పడిబింబం వ్వ జ్జమ్మి దుఃఖం ణ సంకమఇ.”

 

గాథాసప్తశతిలోని మూడవ శతకంలో 4వ గాథ ఇది. దీనికి సంస్కృత ఛాయ:

 

“స్ఫుటతాపి హృదయేన మాతులాని కథం నివేద్యతే తస్మిన్,

ఆదర్శే ప్రతిబింబ మివ యస్మిన్ దుఃఖం న సంక్రామతి.”

 

దీనికి తెలుగు స్వేఛ్ఛానువాదం (స్వకీయం):

 

“అద్దము నందు ప్రతిబింబమటుల

ఒద్దిక నెవ్వని హృదిని చెలి బాధ హత్తుకొనదొ

వద్దనుకొన కతని కేమని నా వ్యధ చెప్పుదు నత్త?

హద్దెరుగని దుఃఖ మావహించిన సైతు గాని!”

 

ఎంత దుఃఖం, బాధ చెప్పబడిందీ గాథలో!  ‘అద్దంలో ప్రతిబింబం’ అన్న రెండు మాటలతో ఎంత కఠినత్వాన్ని ఉత్ప్రేక్షించగలిగాడీ ప్రాకృతకవి! ఇలా చెబితేనే అది కవిత్వం అవుతుంది, అనబడుతుంది. లేనిది కాదు. ఇవి అతిసున్నితమైన, అత్యున్నతమైన భావచిత్రాలు. ఇంతటి ఉదాత్తమైన భావనలు చెయ్యాలంటే అంతే ఉదాత్తతగలిగిన చిత్తంతో మనిషుండాలి.

 

“కలికి సొగసైన నీ కనులు వ్రాసితిగాని

బెళుకు చూపులు వ్రాయు విధమెరుగనైతి…”

 

“ఏ తీరుగ రమణిని గెలిచి నీవెట్లు రూపౌదువో?

చూతము రార!

రాతిరనే ఏనుగనెక్కి, రాకాచంద్రుడు గొడుగుగానూ

లేత తెమ్మెర మొదలైన బలములచేత గెలిచెదనంటివా?”

 

తెలుగులో ఇవి క్షేత్రయ్య పదములలోనివి. కమనీయ ధ్వనిపూరితాలైనటువంటి వాక్యాలలో ఇవి కొన్ని.  చూపులను చిత్రించడమన్న ఊహ, రాతిరనే ఏనుగు, రాకాచంద్రుడు గొడుగు కావడమనే ఊహ, లేత తెమ్మెరలు బలగాలు గావడమన్న ఊహ తెలుగులో పద్య సాహిత్యంలో ఊహించలేని విశేషాలు. ఒకవేళ ఎక్కడైన కనబడినా ఇంత సులభంగా అర్ధమయ్యే పదాలతో మాత్రం కనబడవు.

 

‘అక్షర రమ్యత’ అన్న మాటను నన్నయ ఏ దురదృష్టకర క్షణంలో అన్నాడోగాని, ముదిరి పాకాన బడ్డ స్థాయిలో తెలుగులో కవిత్వం అంటే మాటలూ వాటి అర్ధాలు అన్న సంగతి పోయి, అక్షరాలూ వాటితో ఆటలూ అన్న స్థితికి దిగజారిపోయింది. కవిత్వం అంటేనూ, కావ్యం అంటేనూ ఏమిటన్న దానికి కవులు ఇచ్చిన ఈ క్రింది నిర్వచనాలలోనే అది కనిపిస్తుంది.

 

“చెప్పగవలె గప్పురంబులు

గుప్పలుగా బోసినట్లు కుంకుమ పైపై

గుప్పినక్రియ విరిపొట్లము

విప్పినగతి ఘుమ్మనన్ గవిత్వము సభలన్.”

 

“పలుకగవలె నవరసములు

గులుకం బద్యములు చెవులకున్ హృద్యముగా

నళుకక యటుగాకున్నం

బలుకక యుండుటయె మేలు బహుమానముగన్.”

 

“చెవులకు జవులై చల్లగ

గవులకు దవులై సమస్త కావ్యకళా బం

ధువులై రససింధువులై

యవురా! యన గవిత లవని నలరగ వలదా.”

 

అక్షరాల ఆర్భాటం తప్ప పై పద్యాలలో కవిత్వానికి సంబంధించిన లక్షణం స్పష్టంగా అర్ధమయ్యేట్లుగా చెప్పినట్లు  ఏ పద్యంలోనూ కనిపించదు. ఉత్తమ కవిత్వం వ్రాయాల్సిన సందర్భాలలో, ధ్వనిపూరితాలయిన పద్యాలు వ్రాయాల్సినచోట, అలా చెయకుండానూ; లక్షణం స్పష్టంగా చెప్పాల్సినచోట్లలో అస్పష్టంగా అర్ధరహితమైన, ఊహించనలవికాని ఉత్ప్రేక్షలతో నిండిన పద్యాలను చెప్పడం, తెలుగు పద్యసాహిత్య గ్రంథాలలో చూడగలం. నేలవిడిచి సాము చెయ్యడమంటే ఇదే గదా అనిపిస్తుంది. ‘పదజ్ఞత లేని కవిత్వం వృధా!’ అని చెప్పిన వ్యక్తి కొఱవి గోపరాజు (తన ‘సింహాసనా ద్వాత్రింశిక’ లో). ఎక్కడ ఏ పదం పడితే అర్ధం సరిగా పండుతుందో గుర్తెరిగి చెప్పినదే కవిత్వమన్న అర్ధంలో ఇది చెప్పినాడనుకోవచ్చును. అయితే, అక్షరాలతో ఆటనే కవిత్వంగా యెంచి అందులోనే నిమగ్నమైన తెలుగు పద్య కవులు పదజ్ఞతను గురించి పట్టించుకున్నది లేదన్నది సత్యం. ఫలితంగా, తెలుగు పద్య సాహిత్యంలో ‘చెప్పబడనిది’ మృగ్యమైపోయి, దుర్భిణీ పెట్టి వెదికినా ఎక్కడోతప్ప కనబడని స్థితిలోకి వెళ్ళిపోయింది. పద్యాలు సుదీర్ఘసమాసభరితాలై (కవిత)ఆత్మ లేని శరీరాల్లాగా మిగిలిపోయాయి. ఎక్కడైనా ఉంటే ఆ వున్నది కాస్త కూడా అక్షరాల, మాటల కోలాహలం మధ్య అగపడకుండా పోయింది. చేసేదిలేక, వేరే దారి లేకా, తెలుగు కవితాత్మ పద్యాన్ని వదిలి పదాన్ని, పాటను ఆశ్రయించి చిన్నదో పెద్దదో అక్కడే నివాసం ఏర్పరుచుకుంది.

 

“వీధి నెందరు ఉన్న విసరదే గాలి, రచ్చ నెందరు వున్న రాదమ్మ వాన,

చిన్న నా అబ్బాయి వీధి నిలుచుంటె, మొగిలి పువ్వులగాలి ముత్యాల వాన!”          (జానపద గేయం)

 

“అమ్మణ్ణి కన్నుల్లు తమ్మిపువ్వుల్లు, తమ్మిపువ్వులలోని కమ్మతేనెల్లు,

చిన్నారి కళ్ళల్లో కన్నిటి జల్లు, కన్నీరు చూపకే కరుగు నెడదల్లు!”            (జానపద గేయం)

 

“చిక్కుడు పువ్వెరుపు చిలకముక్కెరుపు, చిగురెరుపు చింతల్ల దోరపండెరుపు,

రక్కిస పండెరుపు రాగిచెంబెరుపు, రాచవారిళ్ళలో మాణిక్య మెరుపు,

తానెరుపు అమ్మాయి తనవారిలోన!”                                         (జానపద గేయం)

 

“తమలపాకుల మీద వడ్లెండబోసి, రాచిలుక పోచిలుక వడ్లు దంతాము

రాచిలుక దంచినవి రాసులడ్డాయి, పోచిలుక దంచినవి పోగులడ్డాయి

రోకలి చిన్నది రోలు చిన్నాది, నాతోటి పోటేసె చెలియ చిన్నాది

రోకటికి రోటికి రెండు దండాలు, మము గన్న తల్లికి వెయ్యి దండాలు”        (జానపద గేయం)

 

“ఏటికేతంబట్టి ఎయిపుట్లు పండించి

ఎన్నడూ మెతుకెరుగరన్నా, నేను గంజిలో మెతుకెరుగరన్న!”                (జానపద గేయం)

 

“కాటుకా చుక్కబొట్టు కడిగినా పోదు, నొష్టరాసిన రాలు తుడిచినా పోదు

అడ్డచెఱగులు బెట్టి అద్దినా పోదు, పైటచెంగులు పెట్టి పులిమినా పోదు!”      (జానపద గేయం)

 

“రసికులైనవారు రమణుల కొకవేళ

వంగుటెల్ల ధర్మవర్తనంబు;

ఈరసమున విల్లు నారికి వంగదా?

చిత్తజాతరూప! సింగభూప!”            (ఒక చాటు పద్యం; బమ్మెర పోతన)

 

“గతి రసికుండ! షట్చరణ! గానకళా కమనీయ! యో మధు

వ్రత! వికచారవింద వనవాటిక నేమిటికిం బరిత్యజిం

చితి వటవీ ప్రదేశమున జెట్టులు సేమలు నేమి గల్గునన్

మతిచెడి సంచరించెదవు? ప్రాబడిపోయెనె నీ వివేకమున్?

 

చేర వచ్చివచ్చి దూరంబుగా బోదు

డాయవత్తు దవ్వు పోయిపోయి

మాటలింక నేల మాపాలిటికి నీవు

మాయలేడివైతి మంచరాజ!”              (వినుకొండ వల్లభరాయని క్రీడాభిరామం)

 

తెలుగు జానపదగీతాల్లోనూ, పద్య సాహిత్యంలోనూ కమనీయ ధ్వనిపూరితాలైనటువంటి పాటలలోనూ, పద్యాలలొనూ పైన చూపినవి కొన్ని.

 

(భారతి మాసపత్రిక పూర్వ సంచికలలో ప్రముఖులు వ్రాసిన వ్యాసాలను ఈ వ్యాసం వ్రాయడంలో సంప్రదించడం జరిగింది).

 

*****

 

 

 

 

11 thoughts on “చెప్పబడనిది, కవితాత్మ!

  1. నేను ఇదివరకు చేసిన వ్యాఖ్యలో “అనుచితం” – అన్న మాట మిమ్మల్ని నొప్పిస్తే క్షమించండి. అయితే కామేశ్వర్రావు గారు తెలుగుపద్యసాహిత్యంలో ధ్వని మీద రెండు పుస్తకాలు (భారతధ్వని దర్శనము, ధ్వని-మనుచరిత్రము) మీకు చూపారు. మనుచరిత్రము విషయం వదిలేసినా, భారతధ్వనిదర్శనము మీరు చదివి విమర్శిస్తే బావుంటుంది. (మీరు చదివినారేమో నాకు తెలియదు).

    సాహిత్యం, చెప్పబడనిది, స్వకీయ కల్పన – వీటి మీద మీ అభిప్రాయం సమగ్రంగా అర్థం కాకపోవడం వల్ల చిక్కు వస్తూంది. మీరు మరిన్ని వ్యాసాలు వివరించాలి.ఇకపోతే – “..భాస, కాళిదాస, భవబూత్యాది మహాకవుల రచనలన్నీ ఈ సూత్రానికి కట్టుబడే..” (ఆ వాక్యంలో స్ఖాలిత్యం సరిచూడగలరు) – వాళ్ళ దగ్గర మాత్రం ఒరిజినాలిటీ ఎంతమాత్రమండి? భాసుడి అవిమారకం, దరిద్రచారుదత్తం, మధ్యమవ్యాయోగం, భవభూతి మాలతీమాధవం, కాళిదాసు మేఘదూతం, ఋతుసంహారం తప్ప మిగిలినవి అనువాదాలేగా? ఈ కొద్ది వాటిలో మాత్రం “చెప్పబడనిది” ఏ పాటిది లెండి?

  2. ఏది సాహిత్యం అన్నది అర్ధం చేసుకోవడంలో చాలా అంతరం ఉన్నది అర్ధం అవుతోంది.

    బహుశా నేనే తప్పనుకుంటా!

    నమస్కారాలతో,
    venkat.b.rao

  3. వెంకటరావుగారి పై వ్యాఖ్య చూసిన తర్వాత, నా ముందు వ్యాఖ్యలోని యీ కింద వాక్యాన్ని నేను వెనక్కు తీసుకుంటున్నాను:

    >>ఇంత మంచి చర్చకి అవకాశమిచ్చినందుకు మీకు ధన్యవాదాలు.

    నమస్కారాలు,
    సెలవ్.

    (నాలో నేననుకున్న కొన్ని మాటలు, వెంకటరావుగారితో కాదు)

    కవి ప్రతిభలోన నుండును కావ్యగత శ
    తాంశములయందు తొంబదియైన పాళ్ళు
    ప్రాగ్విపశ్చిన్మతమ్మున రసము వేయి
    రెట్లు గొప్పది నవకథాధృతిని మించి

    దీన్ని కాదంటే – అసలు సంస్కృతంలో కూడా వ్యాసుడు(?), వాల్మీకి తప్ప ఇంకెవ్వరూ కవులు కాకుండా పోతారు కదా! భాసుడు, కాళిదాసు, భవభూతి – వీళ్ళ ఎవ్వరి రచనలకీ ఏమాత్రం గౌరవం దక్కకుండా పోతుందే!
    హమ్మయ్య! ఒక్క తెలుగుపద్యసాహిత్యమే అనుకున్నా, దీనికి తోడు సంస్కృతసాహిత్యం సమస్తమూ యీ విమర్శఝరిలో పడి కొట్టుకుపోతుంది.
    పీడా విరగడైపోయింది!

  4. ఎక్కడినుంచో ఒక వస్తువుని తెచ్చి, దానికి ఆ వస్తువుని సృష్టించిన వ్యక్తి ఊహించని రకరకాల రంగులుపూసి, ఇదిగో ఇది నా సృష్టి అని చెప్పడం, అందునా ఈ రంగులుపూయడం అనే కార్యకలాపాన్నే అత్యుత్తమైన సాహిత్య సృష్టిగా మనకు మనమే Qualify చేస్తూ చెప్పడం …

    ఏ concept కినా, idea కైనా, రచన కైనా సాహిత్య గౌరవం అది సృష్టించబడిన చోట ఒక్కసారే దక్కడం న్యాయం, ధర్మం. మహాభారతానికి వ్యాసుని వద్ద, రామాయణానికి వాల్మీకి వద్ద, ఇత్యాదిగా. అలాకాకుండా, రామాయణాన్ని నిరొష్ట్యంగానూ, నిర్వచనంగానూ, ఇంకోలానూ, మరోలానూ రాసిన ప్రతిచోటా ఆ రచనలన్నిటికి సాహిత్యగౌరవం దక్కుతుందనుకోవడం, సాహిత్యంగా చెప్పడం…

    శతాబ్దాలకు శతాబ్దాలుగా గొర్రెదాటు పధ్ధతిలో విసుగూవిరామంలేకుండా కలలుకని, ideas ని దిగుమతి చేసుకుని కావ్యాలు రాసి, దాన్నే ఒక legacy గా తరం నుంచి తరానికి అందించి, చివరికి ఆధునిక సాహిత్యానికి కూడా అదే దౌర్భాగ్యం పట్టే స్థాయికి స్థితిని లాక్కొచ్చిన మన పద్యసాహిత్య కవులు అవలంబించిన పధ్ధతులూ

    “హనుమంతుడు సీతను హాయిగ పెండ్లియాడె!” లాంటి అనుచితమైన, హేయమైన వాటిని సమస్యలుగా చెప్పుకుంటూ వాటిని పద్యాల్లో బంధించుకు చూసుకుని భేష్, భేష్ అనుకుంటూ అదే కవిత్వం అనుకుంటూ మనం సాగిస్తున్న వ్యాసంగమంతానూ
    ….

    ఒక పధ్ధతిగా చేసిన విమర్శకు, అదే పధ్ధతిలో తగిన విధంగా సమాధానం చేప్పకుండా, ఆ విమర్శలోని విషయాన్నంతా ఆ వ్యక్తి ‘వ్యక్తిగత అభిప్రాయం’ అనే ఒక convenient carpet కిందకు తోసేసి, మీద కూర్చుని మనది అత్యుత్తమ సాహిత్యం అని మనకు మనమే కితాబిచ్చుకుంటూ గడపడం…

    పైవన్నీ ఉచితాలే అయితే, తెలుగు పద్య సాహిత్యాన్ని గురించి నేను చేసిన వ్యాఖ్య, బహుశః, అనుచితమే అనుకుంటాను!

    ఏది సాహిత్యం? ఏది అసాహిత్యం?
    ఏది ఉచితం? ఏది అనుచితం?

    నమస్కారాలతో,
    venkat.b.rao

  5. వెంకట రావు గారి సమాధానం చదువుతుండగానే నాకు స్ఫురించిన పద్యం ఇది – “ఇంతటి కన్నులుండ తెఱువెవ్వరి వేడెదో భూసురేంద్ర!” 🙂

    అపారమైన తెలుగుపద్యసాహిత్యంలో ధ్వని కావ్యాలు లేవంటే కాస్త అనుచితమైన మాటేనండి.

  6. వెంకటరావుగారు,

    నమస్తే.

    >>”వ్యాసంలో ఈ మాటలను ఉపయోగించాల్సి వచ్చిన ప్రతిచోటా ‘చెప్పబడనిది’ అని చేర్చి చెప్పడం కుదిరేదిగా కనబడక, స్థూలంలో ఈ మాటల సమానార్ధకంగా కాకపోయినా, సూచించేదిగా, ‘ధ్వని’ అన్న మాటను వాడాను, ఉద్దేశ్యపూర్వకంగానే”

    ఈ వివరణ మీ వ్యాసంలో ఉండి ఉంటే నా వ్యాఖ్యలో ఆ ఆక్షేపణ ఉండేది కాదు. మీరు “ధ్వని” అన్న మాటని ప్రయోగించడమే కాకుండా ఆనందవర్ధనుడినీ, ధ్వన్యాలోకాన్నీ ఊటంకించడం వల్ల, ఆ పదాన్ని మీరనుకున్న విస్తృతార్థంలో వాడదలచుకున్నారన్న విషయం అసలు తెలియకుండా పోయింది. పద, జానపద సాహిత్యంలోని కవిత్వ విశేషాలని గురించి చెప్పాలనే మీ ప్రయత్నం ఎంతో అభినందనీయం. ఆ విషయమ్మీదనే మీరు మరింత దృష్టి కేంద్రీకరించి మరిన్ని మంచి వ్యాసాలు వ్రాయాలన్నదే నా వ్యాఖ్యలోని పరమార్థం.

    >>”అయితే, పై శ్లోకంలో ధ్వనించేదే నికార్సయిన ధ్వని అయితే, అలాంటి ధ్వనికి ఉదాహరణలుగా చెప్పదగిన రెండు పద్యాలను (మూలం ఏ సంస్కృత, ప్రాకృతాలలోనో లేనివాటిని, అనువాదాలు, అనుకరణలు కాని వాటిని, అచ్చంగా మనవే అని చెప్పుకోదగినటువంటి వాటిని), తెలుగు కావ్యాలనుంచి రెండింటిని ఉదాహరించండి.”

    >>”నా వ్యాసంలో నేను చెప్పజూచిందీ ఇదే, మనదేదైనా ఉంటే అది పద, జానపద సాహిత్యంలోనే ఉన్నదని. నేను వ్యాసంలో చెప్పవిడిచినది ఏదైనా ఉంటే అది ఇప్పుడు చెబుతున్నాను – తెలుగు కావ్యాలలో ధ్వని ఏదైనా కనిపిస్తే అది అనువాద ధ్వనే గాని, స్వంత ధ్వని కాదు.”

    నిడదవోలు వెంకటరావుగారు చేసిన విభాగం వస్తువుని దృష్టిలో పెట్టుకొని చేసినది. “సరసాంధ్ర వృత్తరత్నాకరం”నుండి పద్యం చూపించిన మీకు, మన పద్యకావ్యాలు సంస్కృత మూలాలకి మక్కీకి మక్కీ అనువాదాలు కావని, అవి అనుసృజనలనీ, వాటిలో కవుల స్వతంత్ర కల్పనలు అనేకం ఉన్నాయనీ తెలియదనుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు. మార్కండేయపురాణంలో 150 పద్యాలలో ఉన్న కథని తీసుకొని 800 పైచిలుకు పద్యాలుగా పెద్దన వ్రాసిన మనుచరిత్రని అనువాదకావ్యం అనడం ఎంతవరకూ సమంజసం? నాచనసోమన ఉత్తరహరివంశంలో సంస్కృత హరివంశంలో లేని ఎన్ని కథలు కల్పనలూ ఉన్నాయి? రాయల ఆముక్తమాల్యద ఏ కావ్యానికి అనువాదం?
    వాటన్నిటినీ వదిలేసి భారతాన్నే తీసుకున్నా, మూలంలో లేని ఎన్నో కవిత్వాంశాలు తెలుగు భారతంలో కనిపిస్తాయి – చూడగలిగే చూపుంటే. చూడాలనే ఆసక్తి ఉంటే శలాక రఘునాథశర్మగారు వ్రాసిన “భారత ధ్వని దర్శనము” చూడవచ్చు. అందులో ఎన్ని “అనువదింపబడిన ధ్వనులో”, ఎన్ని మన తెలుగు కవుల స్వంతమో నిర్ణయించుకోవచ్చు. అలాగే రాజన్నశాస్త్రిగారి “ధ్వని – మనుచరిత్రము” కూడా. ఈ రెండు పుస్తకాలూ Digital Libraryలో దొరుకుతున్నాయి.

    >>”ఇవన్నీ పండిత ఉమాకాంత విద్యాశేఖరులు తెలుగు కావ్యాలలో నన్నయాది తెలుగు కవుల కవిత్వంపై వెలిబుచ్చిన అభిప్రాయాలు. ఈ అభిప్రాయాలను వారు వెలిబుచ్చినది తెలుగు కావ్యాలలో కవిత్వాన్ని చూడలేకపోయే నంటారా?”

    అవును చూడలేకపోయే నంటాను. అతను తెలుగుకావ్యాల గురించి చెప్పిన చాలామాటలు అతని స్వంత అభిరుచి ఆధారంగానే తప్ప శాస్త్రీయం కాదు.

    “తెలుగు భాష యొక్క తత్త్వం సాధారణంగా వ్యస్తపదత్వం. పదాలు రెండు మూడు, అంతగా యెక్కువైతే నాలుగు కంటె యెక్కువ సాధారణంగా చేరవు.”, “గుర్వంతపాదాలూ, గుర్వక్షరబహుళాలూ అయిన శార్దూలం, మత్తేభం మొదలైన సంస్కృతవృత్తాలు తెలుగుభాషా తత్త్వానికి ఎంత మాత్రం అనుకూలమైనవి కావు.”

    మొదలయినవి “అభిప్రాయాలు”గానే పరిగణించగలం కాని శాసనాలుగా భావించలేము. “భాషాతత్త్వం” అంటే ఏమిటి? దానికి వ్యస్తపదత్వం “సాధారణం” అని ఎలా చెప్పగలం? ఎలా అంటే, తెలుగు కావ్యాలలో భాష తెలుగు కాదని, అంతకుముందున్నదో, లేదా జానపద కవిత్వంలోనో, ఇప్పటి వాడుకభాషలోనో ఉన్నది మాత్రమే తెలుగు భాష అని సూత్రీకరించి. అది ఎంతవరకూ సమంజసం? అలాగే వృత్తాల గురించి కూడాను, “అనుకూలమైనవి కావు” అంటే? వాటితో వెయ్యేళ్ళుగా కవులు పద్యాలు వ్రాస్తూనే ఉన్నారుగా. అవి కొంతమందికయినా ఆస్వాదయోగ్యమయినవి కదా. “లావొక్కింతయు లేదు”లాంటి పద్యాలు సామాన్య జనుల నోళ్ళల్లోను కూడా ఆడినవే కదా! మరి ఎందుకు “అనుకూలం కావు”?

    నిజానికి ఉమాకాంత విద్యాశేఖరుల విమర్శకి ఇంత చిన్న వ్యాఖ్యలో ప్రతివాదన చెయ్యడం సరి కాదేమో. ఆయన విమర్శకి ప్రతి విమర్శ రాకపోవడం అతని విజయాన్ని సూచించదని నా అభిప్రాయం. అది కేవలం అతని వ్యక్తిగత అభిప్రాయంగానే తీసుకొని, అతను నిరసించిన కవిత్వాన్ని ఆస్వాదించేవాళ్ళు ఆస్వాదిస్తూ ఉండడమే కారణమని నేననుకుంటాను.

    ఇంత మంచి చర్చకి అవకాశమిచ్చినందుకు మీకు ధన్యవాదాలు.

  7. ఈ వ్యాసంపై, పై అభిప్రాయాలకి, వ్యాసకర్తగా నా వివరణ, సమాధానం:

    ధ్వని, వక్రోక్తి, శ్లేష, అలంకారము మెదలైనవి కవిత్వంలో దేనికోసమైతే ప్రయోగింపబడతాయో అది చెప్పడంకోసం, ఈ మాటలన్నిటిని
    సూచించే విధంగా తెలుగులో ఒక సరళమైన మాటద్వారా చెప్పాలన్న ప్రయత్నం మొదలెట్టినప్పుడు నాకు స్ఫురించిన మాట ‘చెప్పబడనిది’ అనే మాట. ఈ మాటనే ఉపయోగించి ఈ వ్యాసం వ్రాయడం జరిగింది. వివిధ సాహిత్యాలలో ఇవి పోషింపబడిన, ఉత్తమమైనవిగా నాకు తోచిన సందర్భాలను ఉటంకించడం, ఒకింత వివరణతో వాటి ఔన్నత్యాన్ని గురించి చెప్పడం ఈ వ్యాసం ఉద్దేశ్యం.
    వ్యాసంలో ఈ మాటలను ఉపయోగించాల్సి వచ్చిన ప్రతిచోటా ‘చెప్పబడనిది’ అని చేర్చి చెప్పడం కుదిరేదిగా కనబడక, స్థూలంలో ఈ మాటల సమానార్ధకంగా కాకపోయినా, సూచించేదిగా, ‘ధ్వని’ అన్న మాటను వాడాను, ఉద్దేశ్యపూర్వకంగానే. స్థూలంలో నైనా సరే, సూచించేదిగా నైనా సరే, ఈ మాటను ఏలా వాడతారు? అని ప్రశ్న వేస్తే, చదువరికి ఇదేదో శాస్త్ర చర్చ లాగుంది అనిపించకుండా, వ్యాసం
    ముందుకు నడవడానికి ఇంకో మార్గం కనబడలేదన్నది నా సమాధానం.

    తెలుగు పద్యసాహిత్యాన్ని తక్కువ చేసి చూపించాల్సిన పనిలేదన్న మాటను గురించి – ఇక్కడ మాట కోసంగా నేను తక్కువ చేసి చూపించాననే అనుకుందాం ప్రస్తుతానికి –
    ధ్వని సంబంధిత చర్చ ఎక్కడ జరిగినా, అందులో మొదటగా ఉదాహృతమయ్యే శ్లోకం ఇది:

    “కస్యవా న భవతి రోషో దృష్ట్వా, ప్రియాయాః సవ్రణ మధరమ్
    సభ్రమర పద్మా ఘ్రాణశీలే! వారితవామే! సహస్వేదానీమ్.”

    దీనికి మూలం హాలుని ‘గాథా సప్తశతి’ లోనిది. దీనికి శ్రీనాథుని తెలుగు అనువాదం ‘వారణసేయ దావగొనవా’ పద్యం. దీనికే ఇంకో రూపం కవి ఎవరో తెలియని ‘ఉమా మహేశ్వరము’ అనే పేరున్న ఒక అలభ్య కావ్యంలో లభ్యమైన ఒకే ఒక్క పద్యంగా,వెల్లటూరి లింగయమంత్రి కృత ‘సరసాంధ్ర వృత్తరత్నాకరం’ అనే ఛందో గ్రంథంలో ఉదాహరింపబడిన ఈ క్రింది పద్యం:
    .
    “మాకంద ఫల రసంబుల
    నాకలిగొని మేము గ్రోలు నా కొమ్మలలో
    చీకటినప్పుడు నొక చిలు
    కేగతినో మోవి గఱచె నెఱుగవె చెలియా!”

    పైన ఉదాహరించిన సంస్కృత శ్లోకంలో ధ్వనించిన అర్ధం ఏదైతే ఉందో, అది, అప్పటి రోజుల సంగతేమోగాని, ఇప్పుడున్న పరిస్థితులలో ధ్వనికి ఉదాహరణగా చెప్పడం సరైన పనిగా నాకు తోచక, ఉద్దేశ్యపూర్వకంగానే నా వ్యాసంలో వదిలేయబడింది.

    అయితే, పై శ్లోకంలో ధ్వనించేదే నికార్సయిన ధ్వని అయితే, అలాంటి ధ్వనికి ఉదాహరణలుగా చెప్పదగిన రెండు పద్యాలను (మూలం ఏ సంస్కృత, ప్రాకృతాలలోనో లేనివాటిని, అనువాదాలు, అనుకరణలు కాని వాటిని, అచ్చంగా మనవే అని చెప్పుకోదగినటువంటి వాటిని), తెలుగు కావ్యాలనుంచి రెండింటిని ఉదాహరించండి. ఇక ముందు ధ్వని గురించి ఎక్కడ రాయాల్సి వొచ్చినా వాటినే ఉదాహరించుతూ రాసుకుందాం.

    తెలుగు మహాభారతం, విరాట పర్వంలోని ధ్వని పూరిత పద్యానికి మాతృక వ్యాసునిదని వేరే చప్పాల్సిన పని లేదు కదా!

    ఇక, చూడగలిగే వాళ్ళకు తెలుగు కావ్యాలలో ధ్వని బాగానే కనబడుతుంది, దుర్భిణీ పెట్టి వెదకవలసి పనిలేదు – అనే దాన్ని గురించి:

    “తెలుగు సాహిత్యం అనువాద రచనలని, స్వతంత్ర రచనలని రెండు విశాల విభాగాలుగా ఉన్నది. స్వతంత్ర రచనలు ద్విపద, ఉదాహరణ, యక్షగాన, సంకీర్తనము అనునవి” – ఇది స్వర్గీయ నిడదవోలు వెంకటరావు గారు చెప్పిన మాట. నా వ్యాసంలో నేను చెప్పజూచిందీ ఇదే, మనదేదైనా ఉంటే అది పద, జానపద సాహిత్యంలోనే ఉన్నదని. నేను వ్యాసంలో చెప్పవిడిచినది ఏదైనా ఉంటే అది ఇప్పుడు చెబుతున్నాను – తెలుగు కావ్యాలలో ధ్వని ఏదైనా కనిపిస్తే అది అనువాద ధ్వనే గాని, స్వంత ధ్వని కాదు. (దీనికి ఒక్కటే ఒక్కటి
    మినహాయింపుగా కనబడేది, పింగళి సూరన ‘కళాపూర్ణోదయం’ అనుకుంటాను.)

    ‘చెప్పవలసిన దానికంటె హెచ్చుగా కవిగాని పాత్రలుగాని చెప్పడం విస్తర దోషం. దీనివల్ల విసుగు రసభంగం కలుగుతున్నవి.’

    ‘భావాన్ని వ్యక్త దశకు తెచ్చి వదిలితే అఖండబలంతో హృదయాన్ని అధిష్ఠిస్తుంది. లేదా కొట్టికొట్టి వదిలితే పలచబడి నీరసిస్తుంది.’

    ‘తెలుగు భాష యొక్క తత్త్వం సాధారణంగా వ్యస్తపదత్వం. పదాలు రెండు మూడు, అంతగా యెక్కువైతే నాలుగు కంటె యెక్కువ సాధారణంగా చేరవు.’

    ‘అఖండ శసిమండలకుండలితకుసుమకోదండ కాండాసనహిండిత
    కరకుముదకాం తాండవితపరాగమండలంబున’ అనే రీతి వసుచరిత్రాదులలో పెరిగి భాషకు వైరుప్యమాపాదించినవి.’

    ‘గుర్వంతపాదాలూ, గుర్వక్షరబహుళాలూ అయిన శార్దూలం, మత్తేభం మొదలైన సంస్కృతవృత్తాలు తెలుగుభాషా తత్త్వానికి ఎంత మాత్రం అనుకూలమైనవి కావు. వీటిలో తెలుగుపద్యాలు వ్రాయడం ఛందోవ్యతిక్రమ మవుతున్నది. ఛందోవ్యతిక్రమమే భాషా వ్యతిక్రమానికి హేతువు…..భారతంలో ఈ వ్యతిక్రమమారంభమైనప్పటినుండి అడుగడుక్కూ వక్ష్యమాణాధికపదదోషంచేత దూషితమై దీర్ఘవృత్తాలు శరణమై క్లుప్తంగా వ్యంగ్యవిభుత్వంతో రచించే ఉత్తమకవితామార్గానికి అంధులమై మనకు పద్యం వ్రాయడమే
    కవిత్వమయింది. ఇప్పటికి పద్యం వ్రాయడమే మనకు కవిత్వంగా ఉన్నది.’

    ఇవన్నీ పండిత ఉమాకాంత విద్యాశేఖరులు తెలుగు కావ్యాలలో నన్నయాది తెలుగు కవుల కవిత్వంపై వెలిబుచ్చిన అభిప్రాయాలు.

    ఈ అభిప్రాయాలను వారు వెలిబుచ్చినది తెలుగు కావ్యాలలో కవిత్వాన్ని చూడలేకపోయే నంటారా? నాకయితే అలా అనిపించలేదు.

    చివరగా ఒక మాట. తెలుగు పద్య కావ్యాలమీద నాకు చిన్నచూపు లేదు. నాకు ఉన్నచూపల్లా వాటిల్లో original stuff ఎంత? అనే దాని మీదే!

    నమస్కారాలతో,
    venkat.b.rao

  8. కామేష్,

    చక్కగా వ్రాశారు.

    “ధ్వని” అనేది ఒక సిద్ధాంతం మాత్రమే. అది కూడా 11 వ శతాబ్దంలో ఆనందవర్ధనుడు ప్రతిపాదించినది. అంతకు ముందే కావ్యాదర్శం, వక్రోక్తి తదితర అలంకారశాస్త్ర గ్రంథాలు, భిన్నప్రతిపాదనలు ఉన్నై. కావ్యాత్మ “ధ్వని” అన్న ప్రతిపాదనతో విభేదించిన వారూ ఉన్నారు.

    అయినా చదివి ఆనందించే వాళ్ళకు రసనిష్పందం అవసరం కానీ శాస్త్రమే అన్నీ నిర్ణయించాలంటే ఎలా?

    విరాటపర్వంపై మీరు చెప్పిన విషయంతో ఏకీభవిస్తున్నాను. వాచ్యం కంటే భిన్నంగా ప్రతీయమానమైన వస్తువు (స్త్రీలలో శరీరలావణ్యం కంటే భిన్నంగా సహృదయులకు కనిపించే సొగసు) ఏదైతే ఉందో అది ధ్వని. “గూఢార్థం” వాచ్యం కంటే భిన్నం కాదు కాబట్టి ధ్వని కాదు.

    ఆ మాటలో విశేషార్థాలు ఉన్నవి కాబట్టే ధ్వని అని నా అవగాహన కూడానూ.

    >>అయితే ఆ తర్వాత పద్యంలో ధర్మరాజు భీమునితో నిగూఢభాషణములు >>చేసాడని కవి వాచ్యంగా చెప్పడంతో ఆ ఉన్న ధ్వని కూడా >>గుణీభూతం(అప్రధానం) అయిపోయింది.

    ఈ తరువాత పద్యం ఏదో నాకు తెలియదు. 🙂

  9. తెలుగు పదసాహిత్యంలోనూ, జానపదసాహిత్యంలోనూ అపారమైన కవిత్వం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే దాన్ని గొప్పగా చెప్పడం కోసం పద్యకావ్యాలనీ, కవులనీ తక్కువ చెయ్యాల్సిన అవసరం లేదు.

    “అయితే, అక్షరాలతో ఆటనే కవిత్వంగా యెంచి అందులోనే నిమగ్నమైన తెలుగు పద్య కవులు పదజ్ఞతను గురించి పట్టించుకున్నది లేదన్నది సత్యం. ఫలితంగా, తెలుగు పద్య సాహిత్యంలో ‘చెప్పబడనిది’ మృగ్యమైపోయి, దుర్భిణీ పెట్టి వెదికినా ఎక్కడోతప్ప కనబడని స్థితిలోకి వెళ్ళిపోయింది.”

    తెలుగుకవుల పదజ్ఞత, తెలుగు కావ్యాలలో ధ్వని చూడగలిగే వాళ్ళకి చక్కగానే కనిపిస్తుంది. దుర్భిణి పెట్టి వెదకనక్కర లేదు.

    అలాగే పదకవిత్వంలోనూ, జానపదకవిత్వంలోనూ – ఆ మాటకొస్తే ఏ కవిత్వంలోనయినా – కవిత్వాన్ని ఆస్వాదించడానికి “ధ్వని” సిద్ధాంతం తెలియాల్సిన అవసరం లేదు. అలాంటి సిద్ధాంతాలన్నీ కవిత్వ మూలాలని తెలుసుకోడానికీ, కవిత్వవిమర్శ చెయ్యడానికీ పుట్టిన శాస్త్రాలే తప్పిస్తే, కవిత్వాన్ని చదివే సామాన్య పాఠకులకి అవి ఏమంత ప్రయోజనాన్ని ఇవ్వవు.

    ధ్వని, అలంకారము, వక్రోక్తి మొదలైన పదాలని వాడేటప్పుడు, వాటికున్న విస్పష్టమైన అర్థంలోనే వాడడం సమంజసం. అలంకారం, ఉక్తివైచిత్రి, ధ్వనీ మొదలయిన వాటి మధ్యనున్న భేదం గుర్తించడం అవసరం. వ్యాసంలో ఇచ్చిన చాలా ఉదాహరణల్లో ఉన్నది కేవలం అలంకారమో ఉక్తివైచిత్రో తప్ప ధ్వని కాదని నా అనుమానం. ఒకవేళ అయితే, దాని గురించి మరింత వివరణ అవసరం. నేను పైన చెప్పినట్టుగా, ఆయా వాక్యాలలోని కవిత్వాన్ని ఆనందించడానికి అలాంటి వివరణ అవసరం లేదు కాని, శాస్త్రచర్చకి మాత్రం అవసరమే.

    రవీ,

    మీరు ఉదహరించిన పద్యంలో ధ్వని ఉన్న మాట నిజమే కాని, అది కేవలం ధర్మరాజు గూఢంగా మాట్లాడ్డం వల్ల వచ్చినది కాదు. గూఢంగా మాట్లాడినంత మాత్రాన అది ధ్వని అయిపోదు. అక్కడ ధర్మరాజు మాట్లాడిన మాటల్లోని ప్రత్యేకత వల్ల, ఆలోచించిన కొలదీ అనేక విశేషార్థాలు స్ఫురిస్తాయి కాబట్టి అక్కడ ధ్వని ఉంది. అయితే ఆ తర్వాత పద్యంలో ధర్మరాజు భీమునితో నిగూఢభాషణములు చేసాడని కవి వాచ్యంగా చెప్పడంతో ఆ ఉన్న ధ్వని కూడా గుణీభూతం(అప్రధానం) అయిపోయింది.
    అసలు విశేషస్ఫూర్తి లేకుండా, ఏదో ఒక స్పష్టమైన విషయాన్ని చెప్పడానికి ఒక ప్రతీకనో మరొక దాన్నో వాడితే, అది “కోడ్ లేంగ్వేజ్” అవుతుంది తప్ప ధ్వని అవ్వదు. ఉదాహరణకి – పాండవులు వారణావతానికి ప్రయాణమైనప్పుడు విదురుడు “కోడ్ లేంగ్వేజ్”లో అక్కడ వాళ్ళకి రాబోయే ఆపద గురించి చెప్తాడు. అక్కడ “ధ్వని” లేదు.

  10. విరాటపర్వంలో ఒకచోట కీచకుడు సైరంధ్రిని తరుముతూ రాజు ఉన్న సభకు వస్తాడు. విరాటరాజు ఏమీ చేయక అలా నిమ్మకుంటాడు. పక్కనున్న వలలుడు (భీముడు) రెచ్చిపోయి సభ బయట ఉన్న ఒక చెట్టును పెకలించబోతాడు. అప్పుడు పక్కన ఉన్న కంకుభట్టు (ధర్మరాజు) వలలుడితో అంటాడు. “వలలా! ఆ చెట్టు వంటచెఱుకుగా పనికిరాదు. ఇంకోచెట్టును పట్టాలి.” …… ధ్వని!

    – విరాటపర్వం ఉటంకిస్తారేమోనని ఆసక్తిగా చదివాను. కనబడకపోవడం ఒకింత నిరాశ!

    ఇంకా కాసిన్ని సరళమైన ఉదాహరణలు, ధ్వని విరుద్ధ సిద్ధాంతాల గురించిన పరామర్శ, శ్లేష/ధ్వని సారూప్యాలు, భేదాలు తదితర అంశాలు చెప్పి ఉంటే నా బోటి విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండేది.

  11. వెంకట్‍గారి విశ్లేషణాత్మక వ్యాసం చాలా బాగుంది. చెప్పకుండా చెప్పగలగడం అనే ప్రక్రియ బాగా వివరించారు. ఇటు వంటి విజ్ఞాన వంతమైన వ్యాసాలు, చదివాక చాలాసేపు ఆలోచింపజేస్తాయి. పాఠకుల సాహిత్య పరిధిని పెంచడానికి మీరు చేస్తున్న కృషి ప్రశంసనీయం.

Comments are closed.