April 26, 2024

పుత్రోత్సాహము తండ్రికి…

రచన : జి.ఎస్. లక్ష్మి

 

ఉదయం ఆరుగంటల సమయం. ధనంజయరావు బెత్తెడు వెడల్పున్న అత్తాకోడలంచు పట్టుపంచె కండువాతో, చేతికి బంగారు చైనున్న ఫారిన్ రిస్ట్ వాచీతో, రెండుచేతులకీ కలిపి ధగధగలాడిపోతూ మెరిసిపోతున్నఎనిమిది వజ్రాలూ, మణులూ పొదిగిన ఉంగరాలతో, మెడలో పెద్ద ఉసిరికాయలంతున్న రుద్రాక్షమాలతో హాల్ లో అసహనంగా భార్యా, కొడుకుల కోసం ఎదురుచూస్తున్నాడు.

నెమ్మదిగా వస్తున్న భార్య ప్రభావతిని చూసి విసుగ్గా అడిగాడు.

“ఎక్కడ నీ కొడుకు..? ఇంకా లేవలేదా..?”

“వాడికి వాడి ఫ్రెండ్స్ తో ఏదో ప్రోగ్రాం ఉందిటండీ..”భయపడుతూ చెప్పింది.

“ఏవిటో అంత గొప్ప ప్రోగ్రాం. గుడ్డివాళ్లకి చదువు చెప్పాలా..కుంటివాళ్ళకి డేన్స్ చెప్పాలా.. లేకపోతే అనాథలు తిన్న విస్తళ్ళు ఎత్తాలా..”

వెటకారంగా అతనన్న మాటలకి ఆ తల్లి మనసు గిలగిలలాడిపోయింది.

ఆనంద్ అయిదేళ్ళవాడిగా వున్నప్పుడు ధనంజయరావు ఒక కాంట్రాక్టర్ దగ్గర ఒప్పుకున్న పనికోసం కలకత్తా వెళ్ళి రెండేళ్ళు ఉండాల్సొచ్చింది. ఆ రెండేళ్ళూ ఆనంద్ తల్లితో కలిసి అమ్మమ్మ గారింట్లో వుండేవాడు. ఆ ఇంటికి ఎదురుగా ఒక అనాధ శరణాలయం వుండేది. అక్కడ చిన్న చిన్న పిల్లలు అన్నం కోసం సత్తుపళ్ళాలు పట్టుకుని నిలబడ్డం, నిర్వాహకులు చీదరించుకుంటూ ఆ పళ్ళాల్లో ఓ ముద్ద పడేయడం, దానిని వాళ్ళు ఆవురావురుమంటూ తినడం, అర్ధాకలితో యేడిచే వారి కడుపులూ అన్నీ చూస్తూండేవాడు. ఆ వయసులో ఏం చెయ్యాలో తెలిసేది కాదుకాని.. వాళ్లకోసం ఏదైనా చెయ్యాలని మటుకు అనిపించేది.

అందుకే ఉద్యోగంలో చేరగానే తనకి తోచినట్టు అవసరమైనవాళ్ళకి సాయం చేస్తున్నాడు. కాని ఆనంద్ అలా డబ్బు ఉత్తినే ఇచ్చేయడం ధనంజయరావుకి అస్సలు ఇష్టం వుండటంలేదు. రోజూ తండ్రికీ, కొడుక్కీ వాదానలే.. మధ్యలో పాపం ప్రభావతి ఇద్దరి మధ్యనా ఏం చెప్పలేక నిస్సహాయంగా నిలబడిపోతోంది.

తండ్రి మాటలు విని అప్పుడే అక్కడికి వచ్చిన ఆనంద్

“ఎలాగూ నేను చేసే పని నీకు ఇష్టం ఉండదుగా.. మరలాంటప్పుడు అదేపనైతేనేం..” అన్నాడు.

“అహా.. బయల్దేరేడండీ మహాత్ముడు ఉధ్ధరించడానికీ.. అయినా అడ్డమైన వాళ్ళమీదా నువ్వంత ఖర్చు పెట్టడానికి ఎవడబ్బ సొమ్మనుకున్నావ్..? నీకంత ఖర్చుపెట్టడానికి సరిపడ పెద్ద ఉద్యోగం ఎలా వచ్చిందో తెల్సా..? అదేవీ ఆకాశం నుంచిఊడిపడలేదు. నేను నీకంత పెద్ద చదువు చెప్పించడం వల్ల  వచ్చింది.

అంత పెద్ద చదువుకి ఎంత ఫీజు కట్టేనో తెల్సా.. లక్షలకి లక్షలు గుమ్మరించేను.  అంతా స్వార్జితంరా స్వార్జితం. ఒక్కొక్క రూపాయీ ఖర్చుపెట్టి ఇటుకా ఇటుకా కలిపి ఈ ఇల్లు కట్టాను. పైసా పైసా కూడబెట్టి నీ ఫీజులు కట్టాను. పగలూ రాత్రీ అనకుండా కష్టపడి తిరిగి ఈ సమాజంలో ఒక హోదా సంపాదించాను. కాని నువ్వేం చేసావ్..? అంత జీతాన్నీ పట్టికెళ్ళి అణాకానీ వెధవల మీద ఖర్చు పడుతున్నావ్. ”

“నేనేం అంత జీతాన్నీ పట్టుకెళ్ళి వాళ్ళ దోసిట్లో పొయ్యట్లేదు. ఉన్నంతలోనే కాస్త ఖర్చు పెట్టి వాళ్ళని కూడా గౌరవంగా బతికే స్థితికి తెద్దామనుకుంటున్నాను. ”

“ఏవిట్రా నువ్వు తెచ్చేది.. ఎవర్ది వాళ్ళే చూసుకోవాలి. మానాన్నేం చేసాడు..? ఎంతో గొప్పింటికి దత్తతగా వెళ్ళాడు. బోల్డు ఆస్తి. అంతె.. ఇంక ఒళ్ళు తెలీలేదు. అడిగినవాడికీ అడగనివాడికీ ఎడాపెడా దానాలు చేసేసాడు. ఆఖరికి ఆయన పోయేటప్పటికి మిగిలిందేంటో తెల్సా.. నాలుగురోడ్ల జంక్షన్ లో ఆయన శిలావిగ్రహం, పక్కన ఎందుకూ పనికిరాని డిగ్రీ చేతిలో పెట్టుకుని నేనూను. ఆయన దగ్గర అంతంత సహాయం తీసుకున్నవాళ్ళల్లో ఒఖ్ఖళ్ళంటే ఒఖ్ఖళ్ళు నన్ను పట్టించుకున్నారా.. ”

ఆవేశంగా చెప్తున్న ధనంజయరావ్ కాస్త సేపు ఆగాడు.

ఆనంద్ కి బాగా అర్ధమవాలని అతని దగ్గరగా వెళ్ళి

“పట్టించుకోడం మాటటుంచు.. పైగా..పుచ్చుకున్న వాళ్లందరూ కలిసి ఆయనకి ఒళ్ళు కొవ్వెక్కి డబ్బులిచ్చాడు, మేవేవన్నా ఇమ్మన్నావా.. అంటూ ఇచ్చినాయన్నే వెక్కిరించేరు. అప్పట్నించి ఎంతో కష్టపడి ఇన్నాళ్లకి ఈ లెవెల్ కి వచ్చేను. ఒక్కరూపాయికూడా ఎవరికీ ఇవ్వబుధ్ధవదు. అసలు ఎందుకివ్వాలీ  అనిపిస్తుంది. ఇది నేను కష్టపడి సంపాదించుకున్నది. నాకూ, నా కుటుంబానికీ అంతే… అందుకనే నీకు అంత చదువు చెప్పించగలిగేను. నా ఖర్మ కొద్దీ నీకు మీ తాత పోలికలొచ్చి తగలడ్డాయి ,… ఇంతలా చెప్తున్నా వినిపించుకోవేంట్రా..” అన్నాడు.

తండ్రితో వాదన పెంచడం ఇష్టం లేక “నాన్నా, నేనేం చెప్పినా మీకర్ధంకాదు. నాకు టైమైపోతోంది. నేను వెళ్తున్నాను.”అంటూ ఆనంద్ బైటకి వెళ్ళిపోయాడు.

“విన్నావా… విన్నావా.. నీ కొడుకు ధోరణి.? మనిషంత మనిషిని. ఓమూల మనతో రమ్మని చెప్తూనే వున్నాను. ఎలా వెళ్ళిపోయేడో చూడు. ”

కొడుకు వెళ్ళిపోడంతో ఆ కోపమంతా భార్య మీద చూపించేడు.

ధనంజయరావు కొడుకు ఆనంద్ ఒక మల్టీనేషనల్ కంపెనీలో మంచి పొజిషన్ లో వున్నాడు. అతనూ అతని స్నేహితులు మరో నలుగురూ కలిసి వాళ్ళ జీతంలో కొంత ఒకచోట పోగేసి “మిత్రా ఫౌండేషన్” అని పెట్టి సమాజంలో కొన్ని ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు పనిచేసే కంపెనీకి దగ్గరలో వున్నమురికివాడలోని పిల్లలకి పుస్తకాలూ, పెన్సిళ్ళూ ఇచ్చి చదువు చెప్పి, పరీక్షలకు పంపుతున్నారు. పదేళ్ళలోపున్న స్ట్రీట్ చిల్డ్రన్ కి ఆశ్రయం కల్పించి, చదివిస్తున్నారు. అంతే కాకుండా అవసరమైనప్పుడు సెలవు పెట్టి వెళ్ళి మరీ అంధులైన విద్యార్ధులకి అండగా పక్కనుండి పరీక్షలు రాస్తున్నారు.

ప్రకృతి వైపరీత్యాలు ముంచుకొచ్చినప్పుడు, ఏక్సిడెంట్లు అయినప్పుడు ఆనంద్, అతని ఫ్రెండ్స్ వెంటనే అక్కడ ప్రత్యక్ష్యమై స్వఛ్ఛందంగా సేవ చేస్తారు.

ఇవన్నీ చూస్తుంటే ధనంజయరావుకి ఒళ్ళంతా కారం రాసుకున్న ట్టుంటుంది.

తన కొడుకుతో పాటు ఉద్యోగంలో చేరినవాళ్ళు ఇళ్ళూ గట్రా కొనుక్కుంటుంటే, ఆనంద్ ఇలా డబ్బంతా ఊరిమీద ఖర్చు చెయ్యడం అతనికి అస్సలు నచ్చలేదు.

చాలా పెద్దవాళ్ళ పరపతిని ఉపయోగించి ఆ రోజు ఊళ్ళోకి వచ్చిన స్వాములవారి దర్శనానికి ఏర్పాట్లు చేసుకున్నాడతను. తనతో పాటు కొడుకును కూడా తీసికెళ్ళి ఆయనకి మొక్కిస్తే, కొడుకీ పిచ్చిపనులు మానుతాడని ధనంజయరావు యోచన. కాని ఆనంద్ ప్రవర్తన చూస్తే తండ్రి కన్న ఆ దిక్కుమాలినవాళ్ళే ఎక్కువన్నట్టుగా వెళ్ళిపోయాడు. విసుక్కుంటూ భార్యతో కలిసి  స్వామి విడిది చేసిన భవంతికి బయల్దేరేడు.

ఆ భవంతి ఇంకా ఎక్కడో మైలు దూరంలో ఉండగానే జనాన్ని కంట్రోల్ చేస్తున్న పోలీసుల్ని చూసేడు. పడవంత కారు చూడగానే అక్కడున్న పోలీసు సెల్యూట్ కొట్టి,  మిగిలినవాళ్లందరినీ పక్కకి జరిపి ధనంజయరావు కారుకి దారి చేసేడు. ధనంజయరావు తన గొప్ప చూడమన్నట్టు భార్య వైపు చూసేడు. కాని ప్రభావతి బైట జనాలవైపు పరీక్షగా చూస్తోంది. అంత పరీక్షగా ఏం చూస్తోందా అని కాస్త తల పక్కకి వాల్చి చూస్తే అక్కడ ఆనంద్, అతని స్నేహితులు తమచుట్టు కొంతమంది పిల్లల్ని పెట్టుకుని నిలబడున్నారు. అందర్నీ పక్కకి తప్పించడంలో పోలీసు వాళ్లని కాస్త కసురుకోడం కూడా ధనంజయరావు చూసేడు. ఇదంతా చూస్తున్న ప్రభావతి మనసు కలుక్కుమంది. కొడుకు ఎండలో అలా నిలబడుంటే తను, భర్తా కారులో సుఖంగా వెళ్ళడం ఆమెకి నచ్చలేదు. ఏం చేస్తుంది? ఏం చెయ్యగలదు? తండ్రి మాట తండ్రిది. కొడుకు మాట కొడుకుది.

“చూసేవా నీ సుపుత్రుణ్ణి. హాయిగా ఏసి కారులో రారా అంటే ఆ గుడ్డివాళ్ళ వెనకాల ఎలా నిలబడున్నాడో.. ఎలా చెప్తే అర్ధమౌతుందే వాడికి. ఈ దానాలూ, సేవలూ మానేస్తే వాడి జీతం తో  వాడు ఇంతకన్న మంచి కారు కొనగలడు. వీడితోనే చేరేడు ఆ పరమేశం కొడుకు …అప్పుడే సిటీలో రెండు చోట్ల ఫ్లాట్లు కొన్నాడు. వీడూ వున్నాడెందుకూ..?”

ప్రభావతి ఊరుకోలేకపోయింది.

“ఆ పరమేశం అద్దింట్లో ఉంటున్నాడు. అంచేత కొడుకు ఉండడానికో ఇల్లు కొన్నాడు. మనవాడికేం తక్కువా.. మనిల్లు ఉందికదా. ఇంక వాడికి బాధెందుకూ..”

“హోసి పిచ్చిమొద్దా.. ఒకటుంటే ఇంకోటి కొనుక్కోకూడదని ఎక్కడుందే. ఎన్నిళ్ళుంటే అంత గొప్ప. ఎంత గొప్పవాణ్ణి కాకపోతే అందర్నీ పక్కకి తప్పించి మన కారుకి దారిస్తారు.  ఎంత గొప్పవాణ్ణి కాకపోతే తల్లకిందులా తపస్సు చేసినా దొరకని స్వామివారి దర్శన భాగ్యం ఇంత సులభంగా దొరుకుతుంది.  దేనికైనా పెట్టి పుట్టాలే. అదృష్టం అందల మెక్కిస్తానంటే బుధ్ధి బురదగుంటలోకి లాగిందని.. కారులో కూచుని సుఖపడరా అంటే వినకపోతే ఎవడేం చేస్తాడు..?”

ఇద్దరూ స్వామివారి భవనం లోకి వెళ్ళి, అక్కడ వరండాలో అందరితోపాటూ స్వామివారి పిలుపు కోసం వేచి చూస్తూ కూచున్నారు.

గంట గడిచింది. వెళ్ళేవాళ్ళు వెడుతూనే వున్నారు.. వచ్చేవాళ్ళు వస్తూనే వున్నారు. కాని ధనంజయరావుకి మాత్రం స్వామివారి దగ్గర్నుంచి ఇంకా పిలుపు రాలేదు. పిలుపుకోసం వేచివుండడంకన్నా కూడా తనంత గొప్పవాణ్ణి స్వామివారు ఇంకా దర్శనానికి పిలవకపోవడం మరింత అవమానంగా అనిపించిందతనికి.

“కాస్త పక్కకి కూర్చుంటారా..” అన్న అక్కడి కార్యకర్త పలుకులకి ఈ లోకంలోకొచ్చిన ధనంజయరావు ఏమిటన్నట్లు చూసేడు.

“ప్లీజ్.. వచ్చేవాళ్ళు పిల్లలు.. చాలామందున్నారు. అందులోనూ దేవునికి అత్యంత ప్రియమైనవాళ్ళు. మీరు కాస్త పక్కకుంటే వాళ్ళు స్వామివారి దర్శనానికి వెడతారు..”

కార్యకర్త మాటని కాదనలేని భార్యాభర్తలిద్దరూ, ఆ వరండాలో వున్న మిగిలినవాళ్లతోపాటు ఒక మూలగా వెళ్ళి నిలబడ్డారు. వచ్చేవారెంత ప్రముఖులో అని వాళ్లంతా ఆసక్తిగా చూస్తుంటే ఆనంద్, అతని స్నేహితులూ కలిసి ఒక నలభైమంది  పదిహేనేళ్ళలోపు పిల్లల్ని వరసగా లోపలికి తీసికెళ్ళడం చూసి ఆశ్చర్యపోయాడు ధనంజయరావు.

“వీళ్ళు దేవుడికి ప్రియమైనవాళ్ళా..” నెమ్మదిగా భార్య చెవిలో గొణిగాడు.

చురుగ్గా చూసింది ప్రభావతి. అంతే నెమ్మదిగా జవాబిచ్చింది.

“ఏ తల్లితండ్రులకైనా ప్రయోజకులయిన పిల్లలకన్నా కూడా అమాయకులు, చేతకానిపిల్లలమీదే ప్రేమ ఎక్కువుంటుంది. మరి ఆ దేవునికి మనమంతా పిల్లలమే కదా. మనం ప్రయోజకులం.  వారు మరొకరి సహాయం కావల్సినవాళ్ళు. అందుకే దేవునికి వాళ్ళె అత్యంత ప్రియమైనవాళ్ళు.”

భార్య సమాధానానికి మాటలురాక ధోరణి మార్చుకుందుకు కిటికీలోంచి లోపల జరుగుతున్నదేమిటా అని చూసేడు.

లోపల విశాలంగా వున్న హాల్లో స్వామివారు పిల్లలందర్నీ ఆశీర్వదిస్తూ, ఆనంద్ ని దగ్గరికి పిలిచి ఇలా అంటున్నారు.

“మీరు చేస్తున్న పనులు హర్షించదగ్గవి. అందుకే మిమ్మల్ని రమ్మని పిలిపించాం. మీరు కార్యశీలురని విశ్వసిస్తూ, మీకు ఒక పని అప్పగిస్తున్నాం..” అన్నారు.

ఆనంద్, అతని స్నేహితులూ ఏమిటన్నట్టు ఆసక్తిగా చూసేరు.

“మీరు తలపెట్టిన ప్రణాళికలు ప్రజోపకరమైనవి. దానికి మీరు పెట్టుకున్న ఫౌండేషన్ సరిపోతుందనుకోను. నేను కొంత మొత్తం మీకు విరాళంగా ఇవ్వదల్చుకున్నాను. దానిని సద్వినియోగపరుస్తారని ఆశిస్తున్నాను.” అంటూ పక్కనున్న ఆయన వంక చూసారు. పక్కనున్న పెద్దమనిషి స్వామివారి చేతిలో ఒక చెక్కు పెట్టారు. అది ఆనంద్ చేతిలో పెట్టి,

“ఈ రోజుకి పిల్లలందర్నీ ఇక్కడే వుండనివ్వండి. అన్నీ గమనిస్తారు. సాయంత్రం తీసికెళ్ళండి.”అనగానే అక్కడి కార్యకర్తలు కొంతమంది పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళారు.

ఆనంద్ వాళ్ళు బయటికి రాగానే ధనంజయరావు ఎదురెళ్ళి,

“ఎంతిచ్చారురా స్వామివారు..?” అనడిగాడు ఆతృతగా.

“పదిలక్షలు..”అప్పుడే దానిని చూసిన ఆనంద్ అన్నాడు. “పదిలక్షలా..”

అనుకుంటే, ధనంజయరావు కళ్ళకి  డబ్బు వలన కమ్మిన అహంకారపు పొరలు తొలగిపోయాయి. ఈ పిల్లలు చేసే పనులు ఎంత గొప్పవి కాకపోతే అంత పెద్దస్వామివారు అంత డబ్బు వీళ్ళ చేతిలో పెడతారు.. అనే ఆలోచన ఆయనను వేధించింది. ఈ ప్రపంచంలో డబ్బు కన్న విలువైనవి చాలా ఉన్నాయనీ, ఆ విషయం తన కొడుకు గుర్తించేడనీ అర్ధమయ్యేసరికి ధనంజయరావుకి  ఒక్కసారిగా కొడుకు మీద వాత్సల్యం పొంగి పొరలిపోయింది.

ఒక కార్యకర్త బైటకి వచ్చి, “ఇంకీపూట స్వామివారు ఎవర్నీ చూడరు. సాయంత్రం రండి..” అని చెప్పేసి లోపలికెళ్ళిపోయాడు. వేచిచూస్తున్న వాళ్లందరూ ఏం చెప్పాలో తెలీక వెనక్కి మరలిపోయారు.

వెడుతున్న వాళ్లలో ఒకాయన అన్నాడు.

“ఈయనకి లక్షలు లక్షలు డబ్బులు పోసినవాళ్ళకే దర్శనం ఇస్తారుట.. మొన్న ఎవరో చెప్పుకుంటున్నారు..” అన్న మాట వినపడగానే ధనంజయరావు ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన్ని ఆపి ఇలా అన్నాడు..

“మీరనుకుంటున్నది తప్పండీ. నేనూ ఇక్కడికి వచ్చే ముందు అలాగే అనుకున్నాను. నా దగ్గరున్న డబ్బుకీ, నేనెక్కి వచ్చిన కారుకీ, స్వామివారికి నేను సమర్పించే కానుకలకే విలువుంటుందనుకున్నాను. కాని కాదండీ. ఈ విలువలన్నీ తాత్కాలికాలే. అసలైన, శాశ్వతమైన విలువలంటే ఆ పిల్లలు చేసే సేవలండీ. సమాజంలో అందరూ సమానంగా బతకాలంటూ, కొత్తగా ఉద్యోగాల్లో చేరిన ఈ పిల్లలు వారికోసం ఏమీ కొనుక్కోకుండా , వారు సంపాదించే డబ్బునీ, ఎంతో విలువైన వారి సమయాన్నీ కూడా ఆ పిల్లలకోసం ఖర్చు పెట్టడం అన్నదే అసలైన విలువంటే. ఆ సంగతి నాకూ ఇప్పుడే తెలిసింది. ఆ వయసులో మనం మన గురించే ఆలోచించుకున్నాం. కాని మన పిల్లలు మనకన్న విశాలంగా అలోచిస్తున్నారు. దానికి వాళ్ళని మనం మెచ్చుకోవాలండీ..”

ధనంజయరావు మాటలకి ఆ పెద్దమనిషి తెల్లబోయాడు. దానికి

“అవునండీ.. వీడు మా అబ్బాయే. అరుగో.. ఆ మిగిలిన ముగ్గురూ వాడి స్నేహితులు. వాళ్ళ జీతాల్లోంచి కొంత మొత్తంతో అవసరమైనవాళ్ళని ఆదుకోవడవే కాకుండా వీళ్ళు అవసరమైతే ఆఫీసుకి ఒకటి రెండురోజులు సెలవు పెట్టికూడా వెళ్ళి,  దగ్గరుండి, ఆ అంధులు చెపుతుంటే వాళ్ళ తరఫున వాళ్ళకి పరీక్షలు రాసి వస్తారు. చదువుకోలేనివారిని ఒకచోట చేర్చి, ప్రతి మూడురోజులకీ ఒకసారి వెళ్ళి వాళ్ళకి పుస్తకాలూ, పెన్నులూ ఇచ్చి, చదువు చెప్పి వస్తారు. మంచినీళ్ళు లేనిచోట అవి రావడానికి ప్రయత్నం చేస్తారు. ఇలా ఎన్నని చెప్పను. ఇన్నాళ్ళూ ఎందుకూ పనికిరాని పనులు చేస్తున్నాడనుకున్నాను కానీ వాటి విలువ నాకు ఇన్నాళ్ళకి తెలిసింది. స్వామివారిలాంటి గొప్ప మనిషి వీళ్ళలోని సేవాభావం తెలుసుకుని, పిలిపించేరంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో ఇప్పుడు తెలుస్తోంది.. మనం నేనూ, నా ఇల్లూ అనుకున్నాం తప్పితే ఇలా సమాజం గురించి ఆలోచించలేదు. మన పిల్లలు మనని మించి ఎదిగినందుకు మనం గర్వించాలండీ..”

ఆవేశంగా అన్న ధనంజయరావు మాటలకి ఆ పెద్ద మనిషి మాటలు రాక నిలబడిపోయాడు.

ఆనంద్ కల్పించుకుని, “అంతంత పెద్ద మాటలెందుకులే నాన్నా. మీరు అంత కష్టపడి మాకు ఒక నీడంటూ కల్పించారు కనుకనే ఇప్పుడు మేము ఇవి చెయ్యగలుగుతున్నాం. ఆ రోజుల్ని బట్టి మీరు నడిచారు. మీరు కల్పించిన భద్రతని చూసుకుని మేము నడుస్తున్నాం. అంతే..”

ఎంతో ఎదిగిపోయినా అంతే ఒదిగిపోయిన ఆనంద్ ని చూసి ఆనందం పట్టలేక “చూసేవా నా కొడుకుని..” అన్నట్టు గర్వంగా భార్య వైపు చూసాడు ధనంజయరావు.

3 thoughts on “పుత్రోత్సాహము తండ్రికి…

  1. ఆదర్శాలు ఆచరణలో మనస్పూర్తిగా పెట్టగలిగితే, అవి మరికొందరికి స్పూర్తి కలిగిస్తే, అంతకన్న మించిన ఆనందంలేదు….బాగుంది.

Comments are closed.