April 26, 2024

మీనా

రచన :     M రత్నమాలా రంగారావ్ ….వైజాగ్

 

 


“మీనా…”

అనే గద్దింపు కేకతో ఉలిక్కిపడి లేచాను. మద్యాహ్నం భోజనం తరువాత పేపరు చదువుతూ వాలుకుర్చీలో కూర్చున్నప్పుడు కన్ను మూతపడింది. ఇంతలో మీనా.. అనే గద్దింపు కేకతో మెలకువ వచ్చేసింది. లేచి శబ్దం వచ్చిన దిశగా కిటికీలోనుండి బయటకు చూశాను. ప్రక్క యింటిలో నుండి కాస్త గట్టిగానే కేకలు వినిపిస్తున్నాయి. మద్యాహ్నం వేళ కావటంతో వీధులన్నీ నిర్మానుష్యంగా,  నిశ్శబ్ధంగా వుండటంతో స్పష్టంగా వినిపిస్తున్నాయి ప్రక్క యింటి వాళ్ల మాటలు.

 

“నీకసలు బుద్ధి లేదు..  ఎంత చెప్పినా యింతే, పోనీలే అని నేను ఊరుకుంటుంటే మరీ తలకెక్కుతున్నావు ” చీత్కారంగా అంటూ భళ్లున తలుపులు తీసుకుని విసురుగా బయటకు వచ్చి బైక్ స్టార్ట్ చేసి వెళ్లిపోయాడు అతను. వయసు సుమారుగా ముప్ఫై లోపే వుండవచ్చు. ఏదో గవర్నమెంటు ఆఫీసులో ఉద్యోగం చేస్తూ భోజనానికి ఇంటికి వచ్చినట్లుంది.  అబ్బో!! చాలా కోపిష్టి మనిషిలా వున్నాడు. అయినా, ఏమయిందో ఏమో,  అంతలా ఎగురుతున్నాడు.

 

మేము ఆ యింట్లోకి వచ్చి  పట్టుమని పది రోజులు కూడా కాలేదు. పిల్లలిద్దరూ సెటిల్ అయి దూరంగా వుండటం, ఆయన క్యాంపులకు వెళితే ఒంటరితనం తప్పడం లేదు. రిటైర్మెంట్ వయసు దగ్గరవటంతో కొంచెం సిటీకి దగ్గిరగా వుండే ఏరియాలో కాపురం పెట్టాం. అత్యవసరాలన్నింటికి హాయిగా వుంటుందని.  క్రొత్తగా ఈ  కాలనీకి రావటంతో ఇరుగు పొరుగులెవరూ పెద్దగా  పరిచయం కాలేదు.

 

ఈ పదిరోజులు ఇల్లు సర్దుకొవడంతోనే సరిపోయింది. ఇంతలో ఈయనకు కాంపు పడింది..  ప్రక్కయింటి వైపు కాంపౌండ్ వాల్ మీదుగా చూశాను. ఎవరూ మెసిలిన జాడ లేదు. “క్రొత్తగా పెళ్లైన జంటలా వుంది.. ప్రణయ కలహమేమో,  ఏం మొండితనం చేసిందో ఆ పిల్ల” చిన్న చిరునవ్వు పెదాల మీదకు పాకింది. తను కూడా పెళ్లైన కొత్తలో చాలా మొండిగా వుండేది. అది మొండితనమని కూడా తెలిసేది కాదు. ఒక్కర్తినే ఆడపిల్లను కావటంతో నాన్నవాళ్లు చాలా గారం చేశారు. ఏది కావాలన్నా పట్టుపట్టి జరిపించుకునేది. పాపం, ఈయనేమో నలుగురున్న కుటుంబం నుండి రావటం, తండ్రి చిన్నప్పుడే పోవటంతో, అన్నింటికి అడ్జస్టు అవుతూ పెరగటంవలన, నా పోకడ వింతగా వుండేదట.

 

తరవాత , తరవాత చాలా మారానట లేక ఆయనకే నా పద్ధతి అలవాటు అయిందేమో మరి… టైము మూడు గంటలు దాటుతుండడంతో టీ పెట్టుకుందామని లేచాను. ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇప్పుడు ప్రక్కవాళ్ల గొడవ వింటుంటే అప్పట్లో ఎంత సిల్లీగా ఆయనను వేధించానో గుర్తు వచ్చి నవ్వుకున్నాను.

 

ఆ రోజు ఆదివారం…

“హాయ్ మీనూ, మీనూ.. “గోముగా పిలుస్తూ తలుపు తీసుకుని లోపలికి వెళుతున్నాడతను. ముందు వసారాలో కూర్చుని  పేపరు చదువుకుంటున్న ఆయన వైపు చూసి ప్రక్కవాళ్లను గమనించమన్నట్లుగా సైగ చేసాను. ఆయన కేంపు నుండి రాగానే మొత్తం విశేషాలన్నీ శేషం లేకుండా ఏకరువు పెట్టటం మొదట్నుంచీ అలవాటు నాకు. మగవాళ్లకు చుట్టుపక్కల జరుగుతున్నవి అంతగా ఇంట్రస్టు వుండదులా వుంది. ఏమీ పట్టించుకోరూ.

 

“నీకెందుకోయ్ వాళ్ల గొడవ?” అతి ప్రేమ, ద్వేషం ఏదీ భరించలేవు. ప్రపంచంలో జరుగుతున్నవన్నీ మీ ఆడవాళ్లకే కావాలి ” స్వగతంలా అన్నా పైకే అన్నారాయన. నేనేదో జవాబిచ్చేంతలో.. “చూడమ్మా ! నేనంతలా పిలుస్తుంటే, మూతి ముడుచుకుని ఎలా  లోపలికి వెళ్లిపోతోంది. చూడు”,  ఆ అబ్బాయి వాళ్లమ్మతో అనుకుంటా అంటున్నాడు.

 

“పోనీలేరా, చిన్నది, దాని మూడ్ బావుంటే అదే వస్తుంది. ఐనా దాని అలక ఎంత సేపు” ఆవిడ మురిపెంగా అంది. “అదే, అదే వద్దంది.. నువ్వలా నెత్తికెక్కించుకోబట్టే నా మాట వినదు. నీ సపోర్ట్ ఎక్కువైపోయి, మొండితనం ఎక్కువైంది..” అక్కసుగా అన్నాడతను, అమ్మనేమీ అనలేక. ” అది కాదురా అబ్బాయ్.. అంత విసుగెందుకు?, నీకు ప్రేమ వచ్చినా పట్టుకోలేము, కోపం వచ్చినా అంతే.. అన్నింటికీ రూల్స్, క్రమశిక్షణ అంటే ఎలా??……….” ఆవిడ సాగదీసింది. “అవునులే, తప్పంతా నాదేలే!! నువ్వు ముచ్చటపడ్డావని ఆ రోజు బుర్ర వూపాను చూడు అదే నా మొదటి తప్పు. అది ఇప్పుడు నా తలకెక్కుతోంది.. ఇంక ఇప్పుడు ఏమనుకుని ఏం లాభం?… భరించక తప్పదు కదా.. సరే , నే బయటకు పోతున్నా … బై..” ఆ అబ్బాయి రుసరుస..

 

“పాపం! ఆదివారం నాడైనా అలా బయటకు తీసుకు వెళ్లరాదుట్రా,  దాని మొహం చూడు ఎలా వాడిపోయిందో! వారమంతా బయటకు తీసుకువెళ్లటం అస్సలు కుదరదు కదా.. అలా ఒక్కడివి వెళ్ళటం ఏమిటి?” బ్రతిమిలాడుతోంది ముసలామె. నాకు కోపం  కోపం ముంచుకొస్తోంది ఆ కుర్రాడి తీరుకు. ఇన్ని మాటలు అంటున్నా, ఆ మీనా అనే పిల్ల కిమ్మనదే.. ” ఏం! నేను పిలిచినప్పుడు మూతి ముడుచుకుని లోపలికి వెళ్లింది కదా..మధ్యలొ నీ రికమెండేషన్ ఎందుకో ? మీ యిద్దరూ అలా ఏ గుడివరకో, పార్కు వరకో వెళ్లి రండి.నే పోతున్నా” ఎద్దేవా చేస్తూ బయటకు వెళ్లిపోయాడు అతను.

 

ఉసూరుమనిపించింది నాకు. ఆ సంభాషణ వింటుంటే. ” చూడండి, తల్లి చెబుతున్నా వినకుండా ఎలా వెళ్లిపోయాడో? ఆ పిల్ల ఎంత బాధ పడుతుందో? ఈ రోజుల్లో కుర్రాళ్లకు వాళ్ల మాట నెగ్గాలనే పంతమేగానీ, అవతలి వాళ్లను అర్ధం చేసుకునే గుణమే వుండటం లేదు. అంద్కే ఇన్ని విడాకుల కేసులు,విడిపోవటాలు, డిప్రెషన్‌లు ” ఏకబిగిన స్టేట్మెంట్ ఇచ్చేసాను. “నువ్వేనా ఈ మాటలు అంటున్నది” అన్నట్టు నన్ను చూశారు మావారు. “ఏమిటోయ్! ఇంకా వాళ్ల మాటలే ఫాలో అవుతున్నావా? అయినా మనకేం తెలుసు వాళ్ల యింటి పరిస్థితులు చెప్పు. కళ్లతో చూడకుండా ఏదో గొడ మీద నుండి విని తప్పొప్పులను నిర్ణయించేసుకోవటమేనా? పరిస్థితులు అవగాహన చేసుకోకుండా, ఎవరిమీదా, మనకుగా మనం అభిప్రాయాలు ఏర్పరచుకోకూడదు… ” పేపరు మడిచి ఇంక అ టాపిక్‌కి ఫుల్ స్టాప్ ప్ ఎట్టి లోపలికి వెళ్లిపోయారు ఆయన.

 

నాకు చాలా మంటగా అనిపించింది. నన్నే ఇన్‌డైరెక్ట్‌గా అన్నట్లనిపించింది. మగాళ్లంతా ఒకటే కదా, సపోర్టులు అలాగే ఉంటాయి మరి. ఇంకా ఏం చూడాలో? అర్ధం చేసుకోవటానికి, అంతా కళ్ల ముందు స్పష్టంగా అర్ధం కావడంలేదూ.. ఆ కుర్రాడి పద్ధతి.” లోపలికి వెళ్ళిపోయాను విసవిసా.. మరేం అనలేక. హాస్పిటల్ పని మీద బంధువులు రావటంతో ఓ వారం పది రోజులు చాలా బిజీ అయిపోయి అసలు ప్రక్కవాళ్ల గురించి పట్టించుకోలేదు. అయినా   ఆ  అమ్మాయిని చూడాలని, వీలైతే నాలుగు మాటలు చెప్పాలని మనసులో ఓ మూల  పీకుతోంది. చుట్టాల హడావిడి అయిపోవటం, ఆయన మళ్లీ కాంపుకు వెళ్ళటంతో, కాస్త ఖాళీ దొరికింది. పని లేకపోవటంతో మనసు ఖాళీగా వుంది.

 

చాన్నాళ్లనుండి రాస్తూ ఆపిన శ్రీరామకోటి నామం వ్రాయటం మొదలుపెట్టాను. చెయ్యి రాస్తోంది గానీ, మనసు ప్రక్క యింటి మీదకు మళ్లిపోయింది. ప్రక్కయింటి అబ్బాయి కేకలు పెడుతున్నాడు ఈ సారి మరీ కాస్త ఘాటుగా.. ” అమ్మా! ఇక నా వల్ల కాదు. నేను భరించలేను దీన్ని. చూడు నా ఆఫీసు కాగితాలు ఏం చేసిందో? నేనంటే లోకువ తనకి, నా వస్తువులు ముట్టుకొవద్దని లక్షసార్లు చెప్పాను. ఇక భరించటం నా వల్ల కాదు. ” చాలా అసహనంగా, బాధగా వుందతని గొంతు. ” దాన్ని క్షమించలేనమ్మా! దాన్ని దిగబెట్టేస్తాను, ఇలా క్షణం క్షణం అల్లర్లతో నేను వేగలేను. దాన్ని తయారు చేయి…” ” అది కాదురా అబ్బాయి, ముసలావిడ గొంతులో ఆతృత స్పష్టంగా తెలుస్తుంది. ఆ అబ్బాయి అనుకున్నంతా చేస్తాడని..  “నేను చూసుకుంటాను కదా, తెలియక పాపం..” ఆవిడ సర్ది చెప్పబోయింది.

 

“మరి నువ్వింక ఏమీ  మాట్లాడకమ్మా” ఆ అబ్బాయి గొంతులో విసురు తగ్గలేదు. నా మనసు నిలువలేదు . ఏం చేయాలో పాలు పోలేదు. ప్రక్కవాళ్ల విషయాలలో అనుమతి లేకుండా  దూరటం తప్పే అయినా, వివేకమున్న ఒక వ్యక్తిగా, కళ్లముందు అన్యాయం జరిగిపోతుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను. చివ్వున లేచి, తడబడే అడుగులతో వెళ్లి ప్రక్కయింటి తలుపు తట్టాను….. “ఎవరూ.. ” అంటూ ఆ అబ్బాయి వచ్చి తలుపు తీసాడు. ఇల్లంతా కాగితం ముక్కలతో చిందరవందరగా వుంది. ఆ అబ్బాయి మొహం కోపంతో జేవురించి వున్నట్లనిపించింది నాకు.. ” మేము.. నేను.. ప్రక్క యింట్లోకి ఈ మధ్యనే వచ్చాము ” వేలితో మా వాటా చూపిస్తూ ఆగాను. “సారీ, మీ విషయంలో కల్పించుకుంటున్నందుకు .. పెద్దదాన్ని కదా.. చూస్తూ ఊరుకోలేక…” ఆయాసంతో ఒక్క క్షణం ఆగాను.

 

ఆ అబ్బాయి అయోమయంగా చూశాడు. ఏదో జవాబు చెప్పబోయాడు. అంతలోనే.. నేను ” చూడు బాబు! మరొకలా అనుకోవద్దు. చిన్న పిల్లలు మీరు. మీ గొడవ సొంతం అంటే మీరు మీ మీనాతో  పోట్లాడడం, వాళ్లింట్లో దిగబెట్టేస్తానని అనటం విని తట్టుకోలేక వచ్చాను. చిన్న చిన్న పొరపాట్లు చూసి చూడనట్లుగా సర్దుకుపోవడమే సంసారం. క్రొత్తగా కాపురానికి వచ్చిన పిల్లకు అంతా కొత్తగా, అయోమయంగా వుంటుంది. మనమే సర్ది చెప్పుకుని సంయమనం పాటిస్తే ఏ గొడవైనా వడ్లగింజలో బియ్యపుగింజలా వుంటుంది” ఒక్క క్షణం ఆగాను. ఆ అబ్బాయి మొహంలో భావం సిగ్గులాంటి అపరాధ భావం కనిపించింది నాకు.

 

” ఆంటీ! ముందు మీరు లోపలికి రండి.. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్ధం కావడం లేదు …” ఆశ్చర్యం ధ్వనించింది అతనిలో. ఇంకా అమాయకం నటిస్తున్నట్లు అనిపించింది నాకు. లోపలినుండి వీధి గదిలోనికి వస్తూ.. “ఎవరు గిరి ఎవరొచ్చారు? ఎవరూ? ” అంటూ పెద్దామె లోపలినుండి వచ్చింది. నేను టక్కున, “నమస్కారమమ్మా! ఈ ప్రక్క యింట్లోకి క్రొత్తగా వచ్చాము మేము.. అదే మీ కొడుకూ,కోడలు రోజూ గొడవపడటం, ఆ అమ్మాయిని అదే  మీనాను పుట్టింట్లో దిగబెట్టేస్తానని కేకలు వేయటము విని.. మీ మీనాను ఒకసారి కలుద్దామని…” ఆవిడ ఆశ్చర్యంగా అందావిడ..

 

క్షణంలో అర్ధం చేసుకుని భళ్ళున నవ్వుతూ ”  అదేరా గిరి.. మన మీనాను చూడటానికి వచ్చారు.. పో.. మీనాను తీసుకురా…” ఆవిడ ఇంకా నవ్వుతూనే వున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది ఆవిడ నవ్వు చూసి.  ఆ అబ్బాయి కూడా వాళ్లమ్మతో  పాటు నవ్వుతూ లోపలికి వెళ్లి,,

ఒక తెల్లని బొచ్చుకుక్కపిల్లని ఎత్తుకుని వచ్చి “ఇదిగోండి మా మీనా” అంటూ క్రిందకు దింపాడు.

అది పరుగెత్తి వెళ్లి పెద్దావిడ కాళ్ల దగ్గర చుట్టుకుఇ పడుకుని చూస్తోంది గోముగా. నాకు అయోమయంతో నోట మాట రాలేదు..

“మీనా! ఆంటీకి షేక్ హాండ్ ఇవ్వు” ఆ అబ్బాయి అంటున్నాడు.

 

 

******************************************************************************

 

 

 

 

 

 

2 thoughts on “మీనా

  1. సస్పెన్స్ బాగా మైన్ టైన్ చేసారు…కథనం బాగుంది…ఎక్కువ వ్రాయను…నా కామెంట్ చూస్తే సస్పెన్స్ పోవచ్చు. ఎందుకంటే ఎన్నాటా గారి మెయిల్ చూసి మీ కథ చదివా..అంచేత కొంత అర్థమయిపోయింది…..గుడ్

  2. హహ్హహ…పేరు భలే పెట్టారులెండి..ఇక్కడ (కెనడాలో) కుక్కలని కుక్క అని కానీ అది అని కానీ అనకూడదు…వాటి పేర్లతో చెపుతూ, హీ/ షీ అనాలి.అబ్బో వాటి వైభవమే వైభవం…మొన్న ఒకానొక మీటింగులో మా బాసిణి..వచ్చే జన్మలో కుక్కగా పుట్టాలని డిసయిడు అయిపోయానని చెప్పుకున్నారు…పోనీలే అంత అదృష్టం వస్తే మంచిదేగా అనుకున్నము మేమందరమూ

Comments are closed.