May 8, 2024

పెళ్లి చేసి చూపిస్తాం! మేమూ పెళ్లి పెద్దలనిపిస్తాం!!!

 

 రచన : కృష్ణప్రియ

 

 

ఇంటి నుండి అమ్మ ఫోన్!  “మన మధు గాడున్నాడు కదా.. వాడికి ఏమైనా సంబంధాలున్నాయా అని వాళ్లమ్మ, నాన్న తెగ అడుగుతున్నారే! నువ్వు కాస్త సహాయం చేసి పెట్టు..”

మామూలప్పుడు అయితే  “చాల్లే.. నేనా? ఇంకా నయం..” లాంటివి అనేసేదాన్ని. కానీ.. ఆఫీసు లో ఒక భయంకరమైన బగ్ వెనక తెగ తిరుగుతున్నానేమో.. ఏదో పరధ్యానం లో “ఓకే” అని పెట్టేసి వేరే పని చూసుకుంటూ ఉండిపోయాను.  గంట లో మధు వాళ్లమ్మ ఫోన్!

“మగ పిల్లాడు ..ఏముంది.. టక్కుమని కుదిరిపోతుంది అనుకున్నాం.. అమ్మాయి పెళ్లి ఈజీ గా అయిందనిపిస్తుంది… కాస్త ఆ కంప్యూటర్ లో నువ్వు చూసి పెట్టు తల్లీ.. మధు కి చెప్పాను.. కృష్ణక్క నీకు సహాయం చేస్తుంది.. మాకు చేతనవునా?” అని. వాడు ఎగిరి గంతేసాడంటే నమ్ము!

“మీ అమ్మావాళ్లనడిగి నీ ఈ-మెయిల్ అవీ తీసుకున్నాం. . వాడు నీకు ఫోన్ చేస్తాడు..”  అమ్మో!.. వాడికి అంత ఉత్సాహం గా ఉందా? పెళ్లి చేసుకోవటానికి?’ అనుకున్నా.. పాపం చూస్తే  మామూలుగానే ఉంటాడే.. అంత తేడా గా అనిపించడే.. పైగా నా మీద ఏంటి భరోసా?  అని కూడా అనుకున్నా.

“అయ్య బాబోయ్! మళ్లీ పెళ్లి కి సహాయాలా! చస్తాను”. పదేళ్ల క్రితం సంఘటన గుర్తొచ్చింది. మా వారికి బెస్ట్ ఫ్రెండ్ రవి. ముప్ఫై ఏళ్ళు వచ్చేసాయి. పెళ్లి చేసుకోలేదు ఇంకా అని వాళ్ల తల్లిదండ్రులు గొడవ. మా ఇంటికి ఒక నెల రోజులకి ఎందుకో వచ్చాడు. మా ఎదురు అపార్టుమెంటు లో ఒకమ్మాయి కీ పెళ్లి అవలేదు. వాళ్లమ్మ నన్ను అడిగింది. “మీ ఇంట్లో అబ్బాయి వివరాలు చెప్పూ” అని.

ఇక నాకు ఒక్కసారి గా వచ్చిన పెద్దరికానికి ఉబ్బి తబ్బిబ్బయి ఇంట్లోకి వచ్చాను. పెద్దావిడ ఇచ్చిన లిస్టు ప్రకారం మీ కుల గోత్రాలు చెప్పమని అడిగాను అంతే! అతని రియాక్షన్ చూసాక నామీద నాకే విరక్తి కలిగింది.

“నేనూ, వాడూ పదో స్కూల్ రోజులనుండీ స్నేహితులం. ఒక్కసారి కూడా ఇప్పటివరకూ అడగని ప్రశ్న నువ్వు అడిగావు ..I am hurt ” అని తన గది లోకి వెళ్ళిపోయాడు. తర్వాత ఎప్పుడూ అంత ఆప్యాయం గా మాట్లాడలేదు. ఏదో తెలియని ఒక గాప్  L(((

ఈ గాయం నుండి నెమ్మదిగా బయట పడుతున్నా. “ఛీ. ఛీ.. ఈసారి ఇలాంటి ఇబ్బంది కరమైన పరిస్థితి లోకి చచ్చినా దిగకూడదు..” అని ఒట్టు పెట్టుకున్నానో లేదో.. మళ్లీ పెళ్లి గొడవ లో ఇరుక్స్! మా చుట్టాలమ్మాయికి కాలనీ లోనే ఎవరో అబ్బాయికి చూస్తున్నారు. “ఒకసారి ఎలా ఉంటాడో ఏంటో కనుక్కో ..” అని.  సరే ఇది కొద్దిగా ఓకే.. కాస్త ముఖపరిచయం ఉంది కదా.. అని ఊర్కే అటువైపు వెళ్దాం అని నడక కి బయల్దేరాను.

” తయ్యుం తాహా తకధిమి తక ఝణు తకిట తొం..” అని వినపడుతోంది..తలుపు సగం తెరిచి ఉంది. “ఫోన్ చేయకుండా తలుపు కొట్టటం.. సభ్యత కాదేమో” అని ఆలోచిస్తున్నా.. ఈలోగా.. ఒకరిద్దరు తెలిసిన వాళ్లు.. “రండి మీరు కూడా.. పర్వాలేదు..” అని వెళ్తున్నారు. సరే ఏమైతే అయ్యిందని వెళ్లి చూసానా? ఆ అబ్బాయి  భారత నాట్యం కాలనీ ఆడవాళ్లకోసం ప్రత్యెక ప్రదర్శన ఇస్తున్నాడు. “ఇదేమి సరదా?” అని విసుక్కుని వచ్చేసి చెప్పాను. “అబ్బా.. పెళ్లయ్యాక మనమ్మాయి డాన్స్ మాన్పించి డ్రిల్ చేయిస్తుంది లే! వెళ్లి అసలు కనుక్కో..”  అని  మళ్లీ ఊదర పెడితే ..

ఇబ్బంది గా మళ్లీ వెళ్లి చూసా   ఈసారి ఊతప్పం వేసి అపార్ట్మెంట్ ఆడవాళ్లకి ౨-౩ పచ్చళ్లతో వేడి వేడి గా వడ్డిస్తున్నాడు.. “చా.. వంట చేస్తున్నాడు నైస్… కానీ..అపార్ట్ మెంట్ ఆడవారికి ఏదో సినిమా లో శ్రీకాంత్ లాగా అలా వడ్డించటం.”. ఎందుకో మా చుట్టాలమ్మాయికి భర్త గా.. అస్సలూ ఆ ఊహే భరించలేకపోయాను.  ఇంటికొచ్చి నా ఫీడ్ బాక్ ఇస్తే.. “అబ్బా.. నువ్వు మరీ.. పెళ్ళయ్యాక ఊతప్పం లేదు పాలప్పం లేదు మన  ఎవ్వర్నీ అమ్మాయి  రానీయదు లే”  అన్నారు.. నేను ససే మిరా అని మంకు పట్టు పట్టి కూర్చున్నాను.

అదృష్టం కొద్దీ ఆ అబ్బాయికి వేరే సంబంధం దొరికిపోయింది. ‘పోన్లే’ అని హాయిగా కూర్చున్నా.. కానీ ఆ పిల్ల మాకు చాలా  దగ్గర చుట్టం   అని తెలిసి.. అదేదో నేనే వీళ్ల నుండి ‘ఎగరేసుకు’ పోయానని నా మీద కోపం తెచ్చుకున్నారు ఆ అమ్మాయి తల్లి దండ్రులు. అందరూ బాగానే ఉన్నారు మధ్యలో నేనే విలన్ అయ్యాను.

“ఇది బాగానే ఉంది. ఇక ఆ వైపు పోయేది లేదు” అని అప్పట్నించీ పెళ్లి సంబంధాలంటేనే ఎలర్జీ లాంటిది వచ్చేసింది. కానీ.. మా వదిన వరసావిడ ఒకరు నాకు ఒకానొక ఆదివారం ఉదయం మూడు గంటలకి కాల్ చేసింది. ఇండియా నుండి. గుండె దడ దడ లాడింది! కాళ్లు ఎందుకో అడుగేస్తుంటే పడిపోతున్నాయి. నా గొంతు నాకే హీనం గా వినిపిస్తోంది. భయం భయం గా.. ఫోన్ ఎత్తి..”హలో..ఎవరు?” అన్నాను. విషయం విన్నాక ఒళ్లు మండింది. వాళ్ల మరిది మా ఊళ్లో పెళ్లి చూపులకి వస్తాడట. “నువ్వు కాస్త తోడు వెళ్తావా? సారీ ఈరోజే నీ నంబర్ తెలిసింది. ఏమనుకోవద్దు ఈ సమయం లో చెప్తున్నందుకు,.. డిస్టర్బ్ చేసానా పాపం? ” అని అడిగింది.

బ్రహ్మానందం లాగా “అబ్బే అస్సలూ చేయలేదు.. మాకు ఆదివారం ఉదయం బ్రాహ్మీ ముహూర్తం లో లేచి ఏమీ తోచక గోళ్ళు గిల్లుకోవటం హాబీ” అందామనుకున్నా కానీ చేసింది నా వైపు చుట్టం కదా అని ఆగిపోయా.. “పర్వాలేదు ” అని ఆ అబ్బాయి వచ్చే సమయం లాంటి వివరాలు కనుక్కున్నాను. నాకా ఎలాగూ పెళ్లి చూపులు అవీ లేకుండానే పెళ్లయిపోయింది. ఎన్నో సినిమాల్లో చూశాను. నిజంగా మనమేమీ చేయక్కరలేదు. హాయిగా దర్జా గా వెళ్లి కాస్త పెద్దరికం తో.. “ఏమ్మా! పాటలు ఏమైనా వచ్చా? పులిహారావకాయ పెట్టె విధానం చెప్పు. మువ్వొంకాయ కూర కారం పాళ్లు చెప్పు చూద్దాం..” లాంటి ప్రశ్నలు అడిగి వాళ్లు పెట్టిన స్వీట్లు తిని రావచ్చు.. అనుకుని ఆరోజు ఉత్సాహం గా నా చీరలు అన్నీ తీసి చూసుకున్నా..

ఎప్పుడూ “అబ్బా.. పాత ఫాషన్ చీరలు..” అనుకునేదాన్ని. మొట్ట మొదట సారి..”అయ్యో ఈ చీరలన్నీ మరీ ఇలా ఉన్నాయి? గద్వాల్, నారాయణ పేట, గుంటూరు జరీ చీరలు పెట్టుకుని ఉంటే ఇలాంటి అవసరాలకి ఉపకరించేవి కదా అని బాధ పడ్డాను. ఏదో ఉన్నంతలో కాస్త పెద్దవాళ్లు కట్టుకునే రకం చీర తీసుకుని రెడీ గా ఉన్నా.  అనుకున్న సమయానికి అక్కడకి వెళ్లామా? హాయిగా మర్చిపోయి సరదాగా మాట్లాడేసి కాఫీ తాగేసి వచ్చేసా.. రాగానే ఫోన్ వదిన గారికి..

“అమ్మాయి చాలా బాగుంది. చాలా సింపుల్ గా.. మట్టి రంగు బట్టలు కట్టుకుని.. నవ్వుతూ చక్కగా మాట్లాడుతోంది. బోల్డు పుస్తకాలు చదివింది. కొ.కు. సాహిత్యం ఇష్టమట! నాన్ ఫిక్షన్ చదువుతుందట!! నాకు భలే నచ్చింది” అన్నాను. ఆవిడ వేసిన ప్రశ్నలకి పాపం ఒక్కదానికీ సమాధానం నాదగ్గర లేదు. అసలు గమనిస్తేగా? “అమ్మాయి జుట్టు ఎంతుంది? నగలేమైనా పెట్టుకుందా? వాళ్లింట్లో సామాన్లూ అవీ ఎలా ఉన్నాయి? సన్నగా ఉందా? లావా?” బిక్క మొహం వేసాను. “మరి వెళ్లి చేసిందేమిటి?” అని అర్థం వచ్చేట్టు ఏదో అంది. సిగ్గేసింది.

దెబ్బకి ఇలాంటి టాపిక్కులు వచ్చినప్పుడు దూరం గా ఉండటం నేర్చుకున్నాను. అంటే నేర్చుకున్నానని అనుకున్నాను. కొన్నాళ్లకి ఆఫీసు అకౌంట్ కి మెయిల్.  “మీ అత్తగారు ఇచ్చారు నీ ఈమెయిల్ ఐడీ..మీ ఆఫీసు లో ఫలానా అబ్బాయి ఉన్నాడా? లేడా? ఒకవేళ ఉంటే ఆ అబ్బాయి గుణ గణాలు తెలుసుకుని మాకు తెలియజేయగలవు..”

సరే దానిదేముంది? ఈసారి పోయిన సారి లాంటి తప్పులు చేయకూడదు అని గట్టిగా అనుకున్నాను. ఒక్కసారి ఆఫీస్ డైరెక్టరీ సర్చ్ చేసి.. ఆ అబ్బాయి ఉన్నాడని తెలుసుకున్నాను. వేరే బిల్డింగ్. ఆరోజు భోజనం బ్రేక్ లో ఆ బిల్డింగ్ దాకా నడిచాను. జేమ్స్ బాండ్ కి తాత లా ఫీల్ అయి .. ఆ అబ్బాయి క్యూబ్ కెళ్లి  ‘Excuse me..Can you please do this directory search for me?’ అని నా బాడ్జ్ చూపించి అడిగి అతని మాటా పద్ధతీ గమనించి విజయోత్సాహం తో వెనక్కి వచ్చి నా క్యూబ్ లో కూలబడ్డా.

“అవునండీ.. మీరు చెప్పిన అబ్బాయి.. ఇక్కడే పని చేస్తున్నాడు. ఇంకో బిల్డింగ్ లో ఉన్నాడు. ఇవ్వాళ్ల కాజువల్ గా మాట్లాడాను. చూడటానికి స్మార్ట్ గా బాగున్నాడు. బాగా మాట్లాడుతున్నాడు.” అని ఈ-మెయిల్ ద్వారా కితాబు ఇచ్చేసా. ఆరోజంతా “ఆహా.. ఎంత లాఘవం గా వివరాలు రాబట్టాను? ” అని నాకు నేనే భుజం తట్టుకుని, అభినందించుకుని, తెగ ఉత్సాహం గా గడిపి మర్నాడు ఆఫీస్ కొచ్చి మెయిల్ చూసుకుంటే.. వచ్చిన ప్రశ్నలు ఇవండీ..

(ఇప్పుడంటే ఫేస్ బుక్, లింక్ డ్ ఇన్, ట్విట్టర్ బ్లాగు, గూగుల్ బజ్జూ, ప్లస్సూ ల్లాంటివి ఉన్నాయి కానీ.. పదేళ్ల క్రితం ఇలాంటి ఇన్వెస్టిగేషన్ చేయటం అసలు నాలాంటి వారి తరమౌతుందా? )

“ఆ అబ్బాయి తాగుతాడా? ఇల్లు నీట్ గా పెట్టుకుంటాడా? పాత ప్రేమ వ్యవహారాలు? షాపింగ్ చేసేటప్పుడు బేరాలు అవీ బాగా చేస్తాడా? ఆ అబ్బాయి కార్ లో అమ్మాయిలని ఎక్కించుకుంటాడా? భక్తి ఏ రేంజ్? ( on the scale of 1-10), ఆరోగ్యం అదీ ఎలా ఉంటుంది? అక్క చెల్లెళ్లకి ఎక్కువ డబ్బులు ఇచ్చేస్తూ ఉంటాడా? వీకెండ్స్.. ఎలాంటి ప్రదేశాలు వెళ్తాడు?’  వార్తా పత్రికలూ అవీ చదువుతాడా? బయట ఎక్కువ తింటాడా? ఇంటి భోజనం ప్రిఫర్ చేస్తాడా? ” ఇలాంటి ప్రశ్నలు నా పై సంధించారు. “బాగానే ఉంది. నాకు అవన్నీ ఎలా తెలుస్తాయి?” అన్నాను. అప్పటికీ.

అప్పుడు మొదలైంది గొడవ. అతని టీం లో ఎవరుంటారో తెలియదు. అసలు అతని సర్కిల్ లో ఎవరుంటారో తెలియదు. రోజూ ఫోన్. ఊర్కే “వాళ్ల గ్రూప్ వాళ్లని కనుక్కోకూడదూ? “ ఎంతమందిని అడిగినా ఒక్కళ్ళకీ ఆ అబ్బాయి కి తెలిసిన వాళ్లు లేరు. ఒక పదిహేను రోజుల నరక యాతన తర్వాత కొన్నింటికి నా ఇష్టం వచ్చిన సమాధానాలు చెప్పి, కొన్ని తెలియలేదని, కొన్నింటికి సమయం లేదని.. చెప్పి.. చివరకి “నా వల్ల కాదు” అని చేతులెత్తేసా.  తర్వాత వాళ్లు ఆ అబ్బాయికి పిల్లని ఇవ్వలేదుట. కానీ చాలా మంచివాడని తేలిందిట. నేను ఇండియా కి వచ్చినప్పుడు పని మీద వాళ్ల వీధి లోకి వెళ్తే మొహం తిప్పేసుకున్నారు.

నాకూ పౌరుషం వచ్చింది. మా తాతగారనేవారు.. “ఎవరి మీదైనా కోపం వస్తే నాలుగు జంతికలు పటపటా నములు!” అని.  “అసలు అంత సహాయం చేస్తే..థాంక్స్ అయినా చెప్పకుండా!!”  అని నేనూ ఎగిరాను. వాళ్ల ముందు కాదు లెండి. ప్రైవేట్ గా మా ఇంట్లో..

తర్వాత నుండీ ఎవరైనా “ఆఫీస్ లో ఫలానా అబ్బాయి ఎలాంటి వాడు?  అమ్మాయి మంచిదేనా?” లాంటి ప్రశ్నల నుండి తప్పించుకుని ఏదో ఇలా గడుపుతున్నాను. ఇంతలో.. నా బుద్ధి ఎందుకు వక్రించిందో.. ఇలాగ మధు వాళ్ళమ్మ కి ‘బుక్’ అయిపోయా.  ఎంత వద్దన్నా.. బ్రతిమలాడి మరీ నా చేతిలో మాట్రిమనీ వెబ్ సైట్ పెట్టి చూడమన్నారు. ఇది కొంచం పర్వాలేదు.  నేనేమీ చేయక్కరలేదు. రోజూ మధు ఇచ్చే అమ్మాయిల వివరాలు నోట్ చేసుకుని ఫోన్ చేసి వాళ్లకి ఇష్టం అయితే ఒక సారి పెళ్లి చూపులు ఏర్పాటు చేయటమే.   ‘ఓకే’ అనేసా.

 

మొదటి రోజు మధు ఒక నాలుగు సంబంధాల వివరాలు వెబ్ సైట్ లంకె తో సహా.. పంపాడు. ఇక నాలోని స్త్రీ వాది జూలు విదుల్చుకుని  లేచింది. “ఆడ పిల్లలంటే ఏమనుకుంటున్నావు నువ్వు? ఒక్క రోజులో నాలుగు సంబంధాలు చూస్తావా? నీకు అంత కనికష్టం గా కనిపిస్తున్నారా.. ఆడపిల్లలు? నీ మొహం చూసుకున్నావా? అద్దం లో? ” అని ఆవేశం గా అరిచేసాను.

 

వాడు ముసి ముసి నవ్వులు నవ్వుకుని “అక్కా.. నాకూ ఆడవాళ్లంటే తెగ గౌరవం.  స్పందించిన మొదటి సంబందాన్ని నేను సరే నంటా! నువ్వైతే కాల్ చేయి. ‘ అన్నాడు. అలా అన్నాడు బాగుందని నేను మొదటి నంబర్ కి ఫోన్ చేశా.. గొంతు సవరించుకుని రెడీ గా ఉన్నా..

“హలో” మర్యాద గా గొంతు వినపడింది. పర్వాలేదు.. అనుకుని..

“నమస్కారమండీ.. నా పేరు కృష్ణప్రియ! నేను ..మాట్రిమనీ సైట్ లో మీ వివరాలు చూసి కాల్ చేస్తున్నా”  అన్నాను.  అంతే!!!

ఒక టెలీ మార్కెటింగ్ కాల్ వచ్చినప్పుడు ఎంత మర్యాద గా మాట్లాడతామో అంత పెడసరం గా “ఆ చెప్పండి. మాకు చేతిలో చాలా సంబందాలున్నాయండీ.. మీ అబ్బాయి గురించి చెప్పండి. మాకు ఇంటరెస్టింగ్ గా ఉంటే ఆలోచిస్తాం…” అంది అవతలావిడ.

“మా మధు…  B Tech chemical engg….” అని అంటూనే ఉన్నా..

ఆవిడ “ఓహ్.. Comptuers, ECE  చేసి IIM lO MBA చేసిన సంబంధాలున్నాయి మా దగ్గర.. మీ అబ్బాయి ఏం కాలేజ్? ” అంది.

“వార్నీ.. ” అనుకుని..  REC.. అంటుండగానే.. “ఓకే,ఓకే.. మేము IIT సంబంధాలు చేసుకుందామనుకుంటున్నాము .. సారీ” అని పెట్టేసింది. నాకు తల తిరిగి పోయింది. ఫోన్ వంక చూస్తూనే ఉండిపోయా..

మిగిలిన నాలుగూ కూడా ఇంచుమించు ఇదే వరస. మా వారూ, నేనూ సగం సగం పని తీసుకుని ఫోన్లు చేశాం.. ఒక అరవై కాల్స్ తర్వాత .. నాకూ, మా వారికీ  వినపడిన ప్రశ్నలు…

 

“మీ అబ్బాయి పే పాకేజ్ ఎంత?”

” నాఇడా లో ఉంటుంది మా అమ్మాయి. అక్కడికి బదిలీ చేయించుకుంటాడా? ”

“ఫ్లాట్లు ఎన్ని కొన్నాడు? కార్ మోడల్ ఏది?”

“విదేశాలకి ఎందుకు వెళ్లలేదు?”

“మా అమ్మాయి కారీర్ ఓరియంటెడ్. వంట,ఇంటి పనీ అలాంటిది చేయదు. వంట మనిషి ని పెట్టుకోవాలి…’

‘మీ అబ్బాయి స్కూలింగ్ మెట్రో ల్లో అయిందా? మాకు కనీసం హైదరాబాద్ లో అయినా చదివి ఉండాలి అబ్బాయి అనుకుంటున్నాం”

“urban bent of mind  ఉండాలి మాకు అబ్బాయి లో, అబ్బాయి కలుపు గోలు గా మాడర్న్ గా ఉండాలి ”

“మా అమ్మాయి ఫార్వార్డ్ థింకింగ్ ఉన్న పిల్ల. దాని ప్రవర్తన పై ఆంక్షలు పెట్టకూడదు.. దాని స్నేహితులని గౌరవించాలి”

“అబ్బాయి వివరాలు ఇవ్వండి మా అబ్బాయి అమెరికా లో ఉంటాడు. తనకి, కోడలికీ నచ్చితే కాల్ చేస్తాం”

“మా దగ్గర చాలా అప్లికేషన్లు ఉన్నాయండీ.. ఏ మధు?  ఎప్పుడు ఫోన్ చేసారు మీరు ? Not able to place you..”

“బరువు ఎంత? బాడీ మాస్ ఇండెక్స్ ఎంత?”  — నమ్మలేరు కదూ.. నిజ్జం గా నిజం

లాంటి ప్రశ్నలు కోకొల్లలు.

కొన్ని ముందుగా తేల్చుకుని ముందుకెళ్తే మంచిదనుకోవటం వల్ల అనుకుంటే.. కొన్ని మరీ టూ మచ్ గా అనిపించాయి.

‘ఈకాలం ఆడపిల్లలకి స్మార్ట్ గా,ఫిట్ గా  ఉండాలి.. పదిహేను లక్షలైనా జీతం ఉండాలి.. IIT,IIM ల్లో చదివి అంత జీతం వచ్చే స్థితి కి వచ్చి, అంత  ఫిట్ గా ఉండగల్గి అన్ని ఆస్తులు వెనకేసి, అంత నవ్వించే స్వభావం అయ్యుండి.. ఇవన్నీ ఒక్క మనిషి లో సాధ్యమా అక్కా? ” మా మధు అన్నాడు.

మధుని చూస్తే జాలి వేయటం కాదు కానీ.. జనరల్ గా పరిస్థితి ని చూస్తే.. నవ్వాలో ఏడవాలో తెలియలేదు. ఎంతో సున్నితం గా రెండు కుటుంబాల మధ్య సంగతి దేవుడెరుగు.. ఇద్దరు మనుషులకి వివాహం ఇంత కమర్షియల్ అయిందా? మధు తక్కువ వాడు కాదు. కనీసం B Tech, 5 ft 8 inches పొడవు, అందం, కళలూ,డబ్బూ, దస్కం, పేరూ, ప్రతిష్టా, ఉద్యోగం, కుటుంబం  అంటూ ఖచ్చితమైన అభిప్రాయాలు ఉంచుకున్న వాడు మూడు నెలల తర్వాత  ఒక ఆడపిల్ల అయితే చాలు! ఇంకేం అక్కర్లేదు..అనే స్థితి కి వచ్చాడు.

 

అన్ని విధాలా కుదిరిన మేనరికం లేకపోతే ఎవరో ఒక మంచి కుటుంబ చరిత్ర ఉన్న దగ్గర చుట్టానికి కట్ట బెట్టిన పాత పద్ధతా, ఇలాగ ఇంత కమర్షియల్ గా చూసుకుని అస్సలూ తెలియని మనిషిని కేవలం నాలుగైదు భౌతిక వివరాల ఆధారం గా పెళ్లి జరిపే మాడర్న్ పద్ధతా? తల నొప్పి వచ్చేస్తోంది..

‘ఏరా?  ఇన్నేళ్ల నుండీ ఉద్యోగం చేస్తున్నావు కదా? నీకు ఒక్క అమ్మాయి దొరకలేదా?” అని అడిగాను. వాడు నావైపు చూసి నవ్వి.. ‘ఆయనే ఉంటే మంగలి తో పనేంటి? నాకన్ని స్కిల్స్ ఉండేడిస్తే .. బాగానే ఉండు” అనేసాడు..

 

హమ్మో.. ఇంకో పది పదిహేనేళ్ళకి మార్కెట్ ఎలా ఉంటుందో ఏమో? 🙁  మా ఆడపిల్లలు పెద్దయ్యేదాకా ఇలాగే ఉంటే బాగుండు అనుకున్నాం.

ఇక మాకు కూడా పంతం వచ్చేసింది. ఎలాగయినా సాధించాల్సిందే! మా వారు బజారు కెళ్ళారు రెండు కంకణాలు కొని తేవటానికి.. అవి కట్టేసుకున్నాక ..

పెళ్లి చేసి చూపిస్తాం మేమూ పెళ్లి పెద్దలనిపిస్తాం!!!

7 thoughts on “పెళ్లి చేసి చూపిస్తాం! మేమూ పెళ్లి పెద్దలనిపిస్తాం!!!

  1. బాగుంది అని చెప్పడం కన్నా నేటి నిజానికి దగ్గరగా ఉంది అని చెప్పడం సరి…మొదటి భాగం కొంచెం స్లోగా ఉన్నా రానురానూ పికప్ వచ్చి చదవాలనిపించింది…నాకు తెలిసిన ఒక విషయం….పెళ్ళిచూపులకి అబ్బాయి బయల్దేరుతుంటే చూడబోయే అమ్మాయి ఫోను: “నాకు వేరే లవర్ ఉన్నాడు, నీకు నేను నచ్చలేదని చెప్పు” అని..”కావాలంటే మా బాయ్ ఫ్రెండ్ మాట్లాడుతాడు.” అని అతనికి ఫోన్ ఇచ్చింది…అలాంటప్పుడు ముస్తాబయి బయల్దేరుతున్న కొత్త పెళ్ళికొడుకు పరిస్థితేమిటి…. ఆ అమ్మాయిది తప్పని కాదు.నిజంగా ప్రేమిస్తే ఆ విషయం ముందే తనతలిదండ్రులకు చెప్పొచ్చుగా.. మాది సాంప్రదాయ కుటుంబమని మురిసిపోయే ఆ అమాయకులకు కొంత అవమానం తప్పేది? ఇది ప్రగతి…ఇదే ప్రగతి..అనుకోవాలే తప్ప ఇదా ప్రగతి అని ప్రశ్నించలేని పరిస్థితి.

  2. అమ్మొ నేను ఎక్స్పీరిఎన్స్ చేసానండీ… టీచింగ్ చేస్తున్న అబ్బాయి కొసం.
    టీచరా!!! అని దీర్ఘాలు తీస్తూ అసలు టీచర్ అంటే పనికి రాని వాడు అన్నట్టు మాట్లాడారు. ఆ పిల్లాడు కూడా “అసలు నాకు పెళ్ళవుతుందా అని బెంగ పెట్టేసుకున్నాడు పాపం…ఆ స్టోరీ ఇంకా కంటిన్యూ అవుతోంది.

  3. Nice reflection on the changing social trends.

    ఇందులో హ్యూమర్ ఉన్న మాట నిజమేగానీ నాకైతే ఇది సోషల్ కామెంటరీ లా అనిపిస్తుందండీ. బహుశా ‘సాంఘీకం’ విభాగంలో ఉంటే బావుండేది.

  4. “హమ్మో.. ఇంకో పది పదిహేనేళ్ళకి మార్కెట్ ఎలా ఉంటుందో ఏమో? మా ఆడపిల్లలు పెద్దయ్యేదాకా ఇలాగే ఉంటే బాగుండు అనుకున్నాం.”
    :))

  5. అదృష్టవంతులు, ఇద్దరు ఆడపిల్లలు. పదిహేను ఏళ్ల తరువాత మీరు ఇంకెన్ని ప్రశ్నలు వేస్తారో మగపిల్లల తల్లి తండ్రులని.?. పాపం మగ పిల్లలు వారి తల్లి తండ్రులు.

Comments are closed.