May 2, 2024

విశ్వనాధవారి నాయికలు – రణరంభాదేవి

రచన :  డా.  కౌటిల్య

II శ్రీ గురుభ్యోన్నమః II

విశ్వనాథవారి సాహిత్యంలో ఒక అంశాన్ని తీసుకుని విశదీకరించి రాయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను కాని రాద్దామని మొదలు పెట్టాక తెలుస్తోంది, అది ఎంత దుస్సాహసమో! నాలుగైదు సముద్రాలమీద పడి బారలేసి ఈదినట్లనిపిస్తోంది. ఎలా మొదలు పెట్టాలో, ఎలా సాగించాలో అస్సలు తీరు తెన్నూ కనిపించలేదు. చివరాఖరికి విశ్లేషణలా కాకపోయినా పరిచయంగా రాయగలిగినా చాలులే అనుకుని నాకు తెలిసిన, నేను చదివిన నాలుగు విషయాలు ఇలా మీముందు పెడుతున్నాను.

 

ఇక నేను ఎంచుకున్న అంశం “విశ్వనాథ వారి నాయికలు – స్త్రీ పాత్రలు“. ఈ అంశం ఎంచుకోటానికి చాలా కారణాలున్నాయి. ముఖ్యమైంది, “విశ్వనాథ వారు సంప్రదాయవాది, కాబట్టి ఆయన స్త్రీ పాత్రలన్నీ మడిగట్టుకుని ఇంట్లో కూచున్నే విధంగా ఉంటాయని” చాలా మంది అనుకుంటుంటారు. అది వట్టి అపోహ. ఆయన సృష్టించిన ఏ నాయికా, ఏ స్త్రీపాత్రా అబల కాదు, సబలలే! ప్రతి పాత్రకీ ఒక నిర్దిష్టమైన వ్యక్తిత్వం ఉంటుంది, ఒక నిర్దిష్టమైన విషయానికి ప్రతీకలుగా ఉంటాయి. అసలు ఏ నవల తీసుకున్నా, ఏ నాటకం తీసుకున్నా ప్రతి స్త్రీ పాత్రా ఎంతో ఉన్నతంగా ఉంటాయి. ప్రతి నవలికకీ స్త్రీ పాత్రలే ప్రాణాధారాలుగా ఉంటాయి. కొన్నిచోట్ల అసలు నాయకుడి పాత్రకి ప్రాధాన్యతే ఉండదు, అంతా తానై నడిపిస్తుంది నాయిక. కాని పాత్రౌచిత్యాలు ఎక్కడా చెడకుండా, బిగువు సడలకుండా పట్టుకొస్తారు విశ్వనాథవారు.

మన భారతీయ సంస్కృతి “స్త్రీ”కి ఎంతటి ఉన్నత స్థానాన్నిచ్చి సమాజంలో శిఖరాగ్రస్థానాన కూర్చుండబెట్టి పూజించిందో విశ్వనాథవారి ప్రతి స్త్రీపాత్రా మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. ఒక అరుంధతి,ఒక దేవదాసి, ఒక శశిరేఖ, ఒక కిన్నెరసాని,ఒక మాహేశ్వరి, ఒక వంకజాబిల్లి, ఒక ఏకవీర. ఇలా ప్రతి పాత్రా చదివిన పాఠకుడి మనస్సులో జీవితాంతం చెరగని ముద్రలు వేస్తాయి, జీవితాలకి ఆదర్శప్రాయంగా నిలుస్తాయి.

అలంకారికులు చెప్పిన లక్షణాలలో చక్కగా ఒదిగిపోతుంది ప్రతి నాయికా; ఒక చోట ముగ్ధలైతే, ఒక చోట ధీరలు. ఎంతగా శృంగారరసాన్ని ఒలికిస్తాయో, అంతకన్నా ఎక్కువగా రాజనీతిదురంధరలు. వారి క్రీగంటి చూపులు ఎంత మనోహరాలో, వారి కత్తి ఝళిపింపులుకూడా అంతే పదునైనవి. రాజకీయ విషయాల్ని కంటి చూపుతో అదుపులో పెట్టగల సమర్థలు. నాయకుడికి అడుగడుగునా ధర్మోపదేష్టలు, మార్గోపదేష్టలు. భారతజాతి గౌరవం, సంస్కృతి “స్త్రీ”ని ఆశ్రయించుకునే ఉందనడాని తార్కాణాలు. ఇంటి పనులు చేసుకునే గృహిణి పాత్ర అబలా కాదు, గుర్రమెక్కి ఖడ్గచంక్రమణాలు చేసే వీరవనితలు స్త్రీత్వదూరాలూ కాదు! తమ రాజకీయచతురతతో రాజ్యాలు కూల్చనూగలవు, వలసినవారిని సింహాసనం మీద కూర్చుండబెట్టనూ గలవు. వాదనాపటిమలో , సకలశాస్త్ర విజ్ఞానపారీణతలో అపర సరస్వతులు.

ఇలా చెప్పుకుంటూ పోతే చర్విత చర్వణంగా మిగులుతుందేమో! ఒక్కో పాత్రనీ తీసుకుని వీలైనంతవరకూ విపులంగా చర్చిస్తాను. కొన్ని చారిత్రిక పాత్రలూ, కొన్ని సాంఘిక పాత్రలూ, మెల్లగా ఒక్కోటీ పరిచయం చేస్తాను.

రణరంభా దేవి

అసలు విశ్వనాథవారి స్త్రీపాత్రల పేర్లు ఎంతో అందంగా, విచిత్రంగా ఉంటాయి. ఆ పేరు ఆపాత్ర తత్త్వానికి ఖచ్చితంగా ఇమిడిపోతుంది. ఈ “రణరంభా దేవి” పాత్ర, విశ్వనాథ వారి “కాశ్మీరరాజ వంశావళి” అనే వరుస నవలల్లో చివరి నవల “భ్రమరవాసిని”లోనిది. ఈ పాత్ర విశ్వనాథ వారి అద్భుత సృష్టి. సృష్టి అని చెప్పటం కన్నా అద్భుతంగా మలిచారనవచ్చు. ఎందుకంటే ఈ పాత్ర సృష్టించినది కాదు, నిజంగా చరిత్రలో ఉన్నదే. “కల్హణ రాజతరంగిణి”లో ఉన్నదే. అందులో నామమాత్రంగా చెప్పిన పాత్రని తీసుకుని ఒక విశేషమైన పాత్రగా మలిచారు విశ్వనాథవారు.

కథలోకి వస్తే, కాశ్మీరరాజు రణాదిత్యుడు, పూర్వజన్మలో ఆచరించిన ఘోరమైన “భ్రమరవాసినీ” వ్రతానికి “దేవి” సంతుష్టయై, అతడు అవివేకంతో కోరినా మన్నించి, ఈ జన్మలో రణరంభాదేవిగా పుట్టి అతనికి భార్యగా వస్తుంది.  ఆ జన్మలో అందవికారి, తన భక్తురాలు, మధుసూదనుడి(రణాదిత్యుడి పూర్వజన్మ) భార్య ఐన “నీలమణి”ని తన రూపుతో, అసమాన సౌందర్యంతో “అమృతప్రభ”గా పుట్టించి రణాదిత్యుడికి రెండవభార్యగా చేస్తుంది. తరువాత రణాదిత్యుడి చేత దిగ్విజయయాత్ర చేయించి సర్వభారతమండలానికీ చక్రవర్తిని చేస్తుంది.అటుపిమ్మట అతడికి హాటకేశ్వరమంత్రాన్ని ఉపదేశించి, పాతాళలోకానికి పంపించి అక్కడ దైత్యదానవ నాగ యక్ష రాక్షస స్త్రీలతో భోగాన్ని కలిగిస్తుంది. అక్కడ మూడువందలయేండ్లు ఉండి తరువాత మరలా వచ్చి “లలితాదిత్యుడ”న్నపేరుతో కాశ్మీరాన్ని మరలా పరిపాలిస్తాడు,అది వేరే కథ. క్లుప్తంగా కథాంశం ఇది….

రణరంభాదేవి సాక్షాత్తూ వైష్ణవి. ఆ భ్రమరవాసినీదేవి మానవరూపంలో ఒకరికి భార్యగా వస్తే జరిగే సన్నివేశాలని బహుచక్కగా చిత్రీకరిస్తారు. అలంకారికులు చెప్పే ఏ నాయికా లక్షణాలలో కూడా ఈ పాత్ర ఇమడదు. ఎందుకంటే ఆ పాత్ర ఒక విశేషమైన పాత్రేకాని, నాయికకాదు. నాయికా నాయకులు అమృతప్రభా రణాదిత్యులు. రణరంభ సూత్రధారిణి,నాయకమణి.

నవలలో ఎక్కువభాగం రణాదిత్యుడి పూర్వజన్మ వృత్తాంతం, స్వప్నాలు వీటితోనే ఉన్నా ప్రధానపాత్రగా రణరంభాదేవి కనిపిస్తుంటుంది. సాక్షాత్పరమేశ్వరి మానవరూపం దాల్చి వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి, అన్నది కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది.

కథలో నిడివి ఎక్కువ ఉన్న పాత్రలు రణాదిత్యుడు,అమృతప్రభ,మధుసూదనుడు,నీలమణిలవే అయినా కథ మొత్తం రణరంభాదేవి ఆధారంగానే నడుస్తుంటుంది.

రణరంభాదేవి, చోళరాజు రతిసేనుడికి వైశాఖపూర్ణిమనాడు, సముద్రంలో,బంగారుతమ్మిలో దొరుకుతుంది. రతిసేనుని ఇంట పదునాఱేళ్ళు పెరుగుతుంది..ఆ పెరిగినన్నాళ్ళు వారికి వైష్ణవి అన్నట్టే అనిపిస్తుంది కాని, వారి పుత్రికగా అనిపించదు. ప్రతి విషయం దైవికమైన మహత్తులతో వర్ణిస్తారు విశ్వనాథవారు.మామూలు బాలికలా ఎక్కడా చెప్పరు. రతిసేనుడి మీదకు దండెత్తినవారిని వైష్ణవియైన మాయ నిర్జిస్తుంది,పెంపుడుతండ్రికి శత్రుపీడతొలగిస్తుంది,అతడిని అప్రతిహతుడిని చేస్తుంది. ఎంతమంది రాకుమారులు కోరి వచ్చినా కాదని, రణాదిత్యుడిని  స్వయంవరణం చేస్తుంది. చోళదేశానికి,కాశ్మీరానికి ఎక్కువదూరమని, రతిసేనుడు వివాహంకోసం రణరంభని కులూతదేశానికి పంపిస్తాడు. కులూతాధిపతి రతిసేనుడు ప్రాణమిత్రులు. అక్కడికి వెళ్ళిన రణరంభ వారికి కూడా ఆరాధ్యనీయ అవుతుంది. అందరికీ తలలో నాలుకలా మెదులుతుంది. ప్రతిచోటా లక్ష్మి తన మహత్తుతో వర్తిస్తూనే ఉంటుంది.

అసలు, కథ రణరంభా రణాదిత్యుల వివాహమైన తర్వాత శోభనపుగదిలో మొదలవుతుంది. రణాదిత్యుడు వధువుకోసం శోభనశాలలో నిరీక్షిస్తుంటాడు. అక్కడ రణరంభ తాను వైష్ణవినని రణాదిత్యుడికి ముందే తెలియజేయటానికి కుడ్యాలంతా రకరకాల పురాణకథా చిత్రాలతో నింపి లక్ష్మీ ప్రతికృతుల దగ్గర తన రూపులని చెక్కిస్తుంది. అలా ముందుగానే రణరంభమీద ఒక రకమైన భక్తి,భయం కలిగేట్టు చేస్తాడు కవి, తరువాత మెల్లగా కథ నడుస్తుంది. విశ్వనాథవారు రణరంభా సౌందర్యాన్ని వర్ణించిన తీరు చదవ్వలసిందేకాని చెప్పలేం. రణాదిత్యుడిని స్వయంవరణం చేసినప్పుడు లేఖలో మడిచి, తన శిరస్సున ఉన్న చంద్రవంక పంపుతుంది రణరంభ. ఆ చంద్రవంకను గూర్చిన వర్ణన అద్భుతంగా ఉంటుంది. శక్తి నిత్య చంద్రచూడాభిరామ అన్నదానిని రూఢిగా చెప్తారు ఇక్కడ విశ్వనాథ. దాన్ని తిరిగి వివాహవేళ రణాదిత్యుడు ఆమె శిగలో అలంకరిస్తాడు. అప్పుడు ఆమె ప్రసన్నతతో  సభవైపు చూసిన చూపుకి అందరూ నిస్తబ్దులౌతారు. ఆ చూపు రణరంభపాత్రమీద ఒకరకమైన భక్తిని కలిగిస్తుంది పాఠకుడికి. ఒక్క ధీరప్రహ్లాదుడు మాత్రం ఆ వైష్ణవిని గుర్తించి చేతులెత్తి నమస్కరిస్తాడు,దీన్నిబట్టి “దేవతలు నిజంగా కదిలివచ్చి మనలో మసిలినా అందరూ గుర్తించలేరు,మనకున్న కళ్ళు చూడలేవు,జ్ఞాననేత్రాలు తప్ప” అని చెప్పకనే చెప్తారు విశ్వనాథ. ఇవన్నీ రణాదిత్యుడిని కాసేపు అయోమయంలో పడేస్తాయి, ఆయనతో పాటు పాఠకుడిని కూడా. 🙂

తనని భార్యాభావనతో స్పృశిస్తే రణాదిత్యుడు దగ్ధమౌతాడని తన ప్రతికృతిని ఉంచి, తాను భ్రమరీరూపు దాలుస్తుంటుంది రణరంభ. మొదట రణరంభ గదిలోకి అడుగు పెట్టేప్పుడు ఆ పాదాన్ని పడగవిప్పిన తాచుతో పోల్చి దాదాపు ఒక పేజీ నిడివిలో వర్ణిస్తారు విశ్వనాథవారు. ఆ వర్ణనకి ఆయనకి మనసులో జేజేలు చెప్పకుండా ఉండలేం. తర్వాత రణరంభ కన్నులని వర్ణిస్తారు. లక్ష్మి పద్మపత్రాయతాక్షి అన్నదానికి అద్భుతమైన వివరణ ఇస్తారు. అంటే పద్మం విచ్చుకునేప్పుడు ఎంత అందమో అంత అందం అని, ఆ కళ్ళలోతుని, వైశాల్యాన్ని బహు చక్కగా రణాదిత్యుడి ఊహ మాటల్లో మనకి తెలియజేస్తారు. రణరంభ నవ్వే తుమ్మెదమోతగా వినిపిస్తుంది పాఠకుడికి.

రణరంభా, రణాదిత్యుల ప్రథమ సంవాదమే చాలా ఉదాత్తంగా ఉంటుంది. రణరంభ వద్ద ముకుళించుకుపోతాడు రణాదిత్యుడు. ఆమె రణాదిత్యుణ్ణి అడుగడుగునా నడిపిస్తుంటుంది, ప్రతి విషయంలో శాసిస్తుంటుంది. ప్రతి సంవాదంలో రణాదిత్యుడితో పాటు పాఠకుడికి కూడా ఎన్నో మహావిషయాలు ఉపదేశిస్తుంది,తత్త్వబోధ చేస్తుంది రణరంభాదేవి. సాక్షాత్తూ ఆ భగవతి వచ్చి మనకు చెప్తున్న అనుభూతి కలుగుతుంది. సౌందర్యము,మోహము,శృంగారము,రససిద్ధి మొదలైన విషయాలన్నీ చెప్తూ మన మనసుల్ని ఒకవిధమైన జ్ఞానజగత్తులో విహరింపజేస్తుంది.

తిరిగి కాశ్మీర ప్రయాణంలో మరణించిన సైనికులని పునరుజ్జీవితులని చేస్తుంది, మహారాణి. అది చూసి కొందరు ఆమెను భగవతి అంటారు, కొంతమంది నమ్మరు,కొంతమంది తటస్థంగా ఉంటారు. పాఠకుడి మనసులో అక్కడ కలిగే డోలాయమాన పరిస్థితులని చక్కగా గ్రహించి, వాటిని చక్కగా విశదీకరిస్తాడు రచయిత.

అమృతప్రభా(ఈమె కులూతాధిపతి కూతురు) రణాదిత్యులని ఒకరికొకరు ఎదురుపడేట్లు చేసి, వాళ్ళ మనస్సులలో ఉద్వేగాన్ని రేకెత్తించేలా చేస్తుంది. ఉద్వేగపడుతున్న అమృతప్రభ దుఃఖాన్ని రణరంభాదేవి సొంత అక్కలా అనునయిస్తుంది. ఇక్కడ మనకి రణరంభ భగవతిగాకాని, మహారాణిలా కాని అనిపించదు. ఒక చెల్లెలి ఉద్వేగాన్ని ఓదారుస్తున్న అక్కలానే కనిపిస్తుంది. అలా ప్రతిపాత్రకి సన్నివేశచారుత్వం,ఔచిత్యం కలిగించటంలో విశ్వనాథవారికి సాటి ఎవరూరారేమో. తరువాత వాళ్ళిద్దరి వివాహానికి తానే పెత్తందారయ్యి వారిరువురికి పునఃసాంగత్యాన్ని కలిగిస్తుంది.

ఇక కాశ్మీరానికి వెళ్ళాక,ప్రతి రాత్రీ తాను భ్రమరిగా మారి వరుస స్వప్నాలతో రణాదిత్యుడికి పూర్వజన్మ కథనంతా చూపిస్తుంది. భ్రమరీనినాదం రణాదిత్యుడి జీవుడిలో ఒకరకమైన పులకలెత్తిస్తుంటుంది. ఒకరకమైన స్వాప్నికావస్థలోకి తీసుకెళ్తుంటుంది. నడుమ నడుమ వీరిద్దరి మధ్య చర్చలు. పాఠకుడికి తానొక వింతజగత్తులో విహరిస్తున్నట్టనిపిస్తుంది.

ఇక సర్వ రాచకార్యాలూ రణరంభ కనుసన్నలతోనే జరుగుతుంటాయి. ఆమె రాజకీయ చతురతకి, మేధాశక్తికి అందరూ ఆశ్చర్యపడుతుంటారు. సర్వజగత్తునూ నడిపించే మహామాయకి చిన్న చిన్న రాచకార్యాలు ఒక లెఖ్ఖా.  మంత్రులని, సేనాధిపతులని ఎంత దర్పంతో ఆదేశిస్తుంటుందో, అంతే వినయంతో వారిని పితృసమానంగా గౌరవిస్తుంటుంది. ఒకచోట రణాదిత్యుడనుకుంటాడు,”ఈ భ్రమరవాసిని నా మనసుమీద కూర్చుని అధికారం చేస్తున్నది” అని. అదే భావన పాఠకుడికీ కలుగుతుంది.

రణాదిత్యుడికి ప్రథమోద్వేగాలు తగ్గగానే జైత్రయాత్రకు బయలుదేరదీస్తుంది. తాను వెన్నంటి ఉండి సర్వభారతాన్నీ గెలిచి ఇస్తుంది, సర్వసామ్రాజ్యాధిపతిని చేస్తుంది. జైత్రయాత్రలో భాగంగా రణాదిత్యుడి పూర్వజన్మప్రదేశమైన “లావాణక” గ్రామానికి వెళతాడు. అక్కడ తనని లక్ష్మీ సహస్రనామాలతో నాట్యార్చన చేసిన వారాంగనలిద్దరినీ, పూర్వం వాళ్ళెంత దుష్టకార్యాలు చేసినా మన్నించి ఆదరిస్తుంది. అమ్మ నృత్యగానప్రియ అనటానికి నిదర్శనాన్నిఇక్కడ చూపిస్తారు విశ్వనాథవారు. అక్కడ రణరంభని లక్ష్మీసహస్రనామాలతో అర్చిస్తాడు రణాదిత్యుడు. తిరిగి వచ్చేప్పుడు మధుసూదనుడి అక్క రణరంభ పాదాల దగ్గర కదంబపుష్పాన్ని సమర్పిస్తుంది. అప్పుడు రణరంభ చేసిన మందహాసం జగన్మోహనంగా ఉంటుంది. అది అమృతప్రభ మున్నెన్నడూ చూడని నవ్వు.  ఆ మహేశ్వరికి కదంబకుసుమాలంటే అంత ప్రీతి మరి.

జైత్రయాత్రలో కులూతానికి వెళ్ళినప్పుడు అమృతప్రభ తండ్రి, రణరంభాదేవితో అన్న మాటలు మనకు బాగా గుర్తుండిపోతాయి”.  నా బిడ్డని చెల్లెలిగా స్వీకరించావు,నా జన్మ చరితార్థమైంది. నందుడు శ్రీకృష్ణునికి తండ్రి. నేను రణరంభకు తండ్రిని.” జైత్రయాత్ర ముగిసి వచ్చాక శ్రీనగరంలో రణరంభాదేవి మూడు ఆలయాల్ని ప్రతిష్ఠిస్తుంది. సాక్షాత్తూ బ్రహ్మని రప్పిస్తుంది ప్రతిష్ఠకి. వైష్ణవియైన మాయ జన్మించిందని తెలిసి సర్వ దేవతలూ భువిలో జన్మించి ఆ విష్ణుశక్తికి పరిచర్య చేశారు అని విశ్వనాథవారు చెప్తారు. నిజమేకదా! ఎక్కడ ఆ మహాదేవి ఆ చోటు సర్వదేవతానిలయమే కదా. అంతా పర్యాలోచించి చూస్తే విశ్వనాథవారు రణరంభ పాత్రని లలితాసహస్రనామాలకి,లక్ష్మీ సహస్రనామాలకి అర్థభూతంగా మలిచారనిపిస్తుంది. అమ్మ నిత్యయవ్వన. అమృతప్రభ వృద్ధురాలవుతుంది, కాని రణరంభమాత్రం మొక్కవోని సౌందర్యంతో అలానే ఉంటుంది.

చివరికి రాజ్యాన్ని పాలిస్తున్నది రణాదిత్యుడా, రణరంభాదేవియా అన్నట్టు భరతభూమిని పాలించి, రణాదిత్యుడి రాజ్యం “మరో శ్రీరామచంద్రుడి రాజ్యం” అనిపించి, రణాదిత్యునికి పాతాళలోకవాసం కలిగించి తాను శ్వేతద్వీపానికి వెళ్ళిపోతుంది రణరంభాదేవి.తన భక్తులని అనుగ్రహించటానికి వింధ్యపర్వత గుహాంతరాళాలలో “భ్రమరవాసిని”గా ఉంటుంది.ఇలా కథ మొత్తంలో రణరంభాదేవి కొన్నిచోట్ల రణాదిత్యుడికి భార్యగా అనిపిస్తుంది.కొన్నిచోట్ల అమృతప్రభకి అక్కగా అనిపిస్తుంది.తానే గురువై తత్త్వబోధ చేస్తుంది, పట్టమహిషిగా తన రాజ్ఞీత్వాన్ని నెరపుతుంది. కొన్నిచోట్ల అసలు సాక్షాత్పరమేశ్వరి, మహాదేవిగా కనిపిస్తుంది. అలా ఆ పాత్రని మలిచాడు ఆ మహానుభావుడు.

ఇలా చెప్పుకుంటూపోతే పుస్తకం మొత్తం ఎత్తిరాసినట్లవుతుందేమో. కాబట్టి,కథకి ఆయువుపట్టు లాంటి ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. పూర్వజన్మలో మధుసూదనుడు భార్యని “అమ్మా” అని పిలుస్తుంటాడు. దానికి ఆమె,”మీకు భార్య అమ్మ, అమ్మ భార్య” అని నిష్టూరమాడుతుంది. ఆ మాట శాపంగా పరిణమించి, అంత ఘోరమైన భ్రమరవాసినీ వ్రతం చేసిన మధుసూదనుడికన్నా, ప్రతినిత్యం పడమటింట కూర్చుని తన్ను పూజించిన నీలమణి శాపాన్నే “దేవి” మన్నిస్తుంది. ఆ మధుసూదనుడికి భార్యగా వస్తుంది, ఈ జన్మలో రణరంభగా. అంటే దైవాన్ని అర్చించటంలో ఒక నిశ్చలత ఉండాలి,నమ్మిక ఉండాలి. అప్పుడే దైవాలు అనుగ్రహిస్తాయి. దేవతల ప్రసన్నత్వం బాహిరాలైన మన ఉపసదలక్షణాలందుండదు,జీవలక్షణాలందుంటుంది. ఇదే రణరంభాదేవి పాత్రకి మూలం,ఆమె అవతరించడానికి ఆధారభూతం. నమ్మికొలిస్తే దైవాలు కదిలి వస్తారనటానికి రణరంభాదేవి నిదర్శనం!

II మంగళమ్ II

10 thoughts on “విశ్వనాధవారి నాయికలు – రణరంభాదేవి

  1. ఇన్నాళ్ళకు మీ విస్తారమైన పుస్తకపరిజ్ఞానానికి పని చెప్పారన్నమాట.
    చాలా మంచి ప్రయత్నం. వెంఠనే పుస్తకం కొనుక్కుని చదవాలనేలా ఉండి మీ వ్యాసం. Thanks for the post.

Comments are closed.