April 26, 2024

రామానుజ

రచన : రహ్మానుద్ధీన్..

 

[pullquote]యోనిత్యమచ్యుత పదాంబుజ యుగ్మరుక్మ
వ్యామోహదస్తదితరాణి తృణాయమేనే
అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధో
రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే
[/pullquote]

 

 

 

 

 

 

 

ఈనాడు మనం పూర్తి అజ్ఞానంలో బ్రతుకుతున్నాం. మనకు మనం తెలియని మాదక దశలో జీవిస్తున్నాం. స్వదేశంలోనే విదేశీయులుగా జీవిస్తున్నాం. మన  కట్టు-బొట్టు ఏనాడో వదిలేసాం. మన పరిసరాల్ని కూడా పాశ్చాత్య సంస్కృతికి అద్దం  పట్టేలా మార్చేస్తున్నాం. మన సంస్కృతి మన ముందు వెలవెలబోతున్నా కళ్ళులేని కబోదిలా ప్రవర్తిస్తున్నాం. వేరెవరో విదేశీయులు వచ్చి, మన చరిత్రను తవ్వి  మీ పూర్వీకులు ఇంత గొప్పవారు అని మనకు  చూపిస్తే, పట్టించుకోం. మన సంస్కృతీ-నాగరికత-సంప్రదాయ-సాహిత్య-కళా-తాత్విక-ఆద్యాత్మిక అంశాలను నిరూపిస్తే కాకతాళీయమని అతి కొద్ది మంది నమ్మి, మిగితా అధిక జనాభా నమ్మకుండా — పైగా గుడ్డి సాకులు చెప్పి, అవి కేవలం గత చరిత్ర వైభవమని, సంస్కృతి కాదు అని తాము నమ్మి, మొత్తం సమాజాన్ని నమ్మింప జేసే నేర్పరుల మధ్య మన నికృష్టపు బతుకులు సాగుతున్నవి. వినాశనానికి దారి తీసే పరధర్మం-పరసంపద-పరసంస్కృతులను కౌగిలించి, మనల్ని మనం చంపుకుంటున్నాం. ఇంట్లో వంట వండుకోవటానికి తీరికుండదు, కానీ రెస్టారెంటులో రెట్టింపు సమయం వెచ్చించి మింగుడు పడని, రుచీ పచీ లేని పైగా ఆరోగ్యానికి అత్యంత హాని కలుగజేసే చెత్త-గడ్డి తింటాము. మనకు సొంతమైన పంచెకట్టు మనకు రాదు. ఒకవేళ ఎదుటివాడు వేసుకుంటే ఎక్కిరిస్తాము. అసలు మనం రోజువారి వేసుకునే బట్టలతో మన వాతావరణం లో బ్రతకగలమా అన్న ప్రశ్న ఎవరికీ కలుగదు. సరే వస్త్రం అనేది వళ్ళు కప్పుకోవటానికి, కానీ పాశ్చాత్య పోకడలకు పోయి, అర్ధనగ్నంగా, పూర్తి నగ్నం గా తయరవుతున్నాం మనం. మనకు మన మాతృభూమి కన్నా అమెరికా గురించే హెచ్చుగా తెలుసు మన దేశం గురించి అడిగినా, ఈ దేశంలో పుట్టిన మహనీయుల గురించి అడిగినా మనకు ఏమీ తెలీదు. ఇందుకు ముఖ్యకారణం మన నరనరాల్లో  పాతుకుపోయిన బానిసత్త్వపు బ్రతుకు. దాదాపు 200సంవత్సరాల పాటు బానిసత్త్వం లో మగ్గిన భారతీయత. అదే కాలంలో సర్వనాశనమైపోయి, మార్పులు చేర్పులు చెందిన మన సంస్కృతి-సంప్రదాయాలు.

 

పాశ్చాత్య విద్యలో కనుమరుగైపోయిన అత్యంత ప్రాచీనమైన  మన గురుకుల విద్య. మొదట కుల-జాతుల తగాదాల్లో, ఆ పై ముస్లిం రాజుల రుధిర-ఖడ్గ పాలన కింద, ఆ తరువాత తెల్లవారి బూటుకాళ్ళకింద నలిగిపోయి పూర్తిగా మారిపోయింది మన భారతీయత. నేడు సాధారణ మనిషికి అత్యంత దూరాన నిలిచాయి నా వేదాలు, ఉపనిషత్తులు, పురాణలు, లక్షలకోట్ల విద్యలూను. నేటి పరిస్థితి ఎలాంటిదంటే వేదం నేర్చుకోవాలన్న ఆసక్తి, కుతూహలం జనాలకున్నా, ఎలా నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి అన్న విషయం మాత్రం తెలీదు. ఇంత జరిగినా మతఛాందసవాదుల చాదస్తం తగ్గలేదు. వేదసంపదను మరింత దూరం చేయటానికే వీరు పుట్టారా అన్నట్టుగా ప్రవర్తిస్తారు. వారు నేర్చుకోరు, ఇతరులను నేర్చుకోనివ్వరు. అంత గొప్పవా వేదాలు? వేదాల గొప్పతనం, ధార్మికంగా ధార్మిక పరంగా ఉన్న విషయాలు చాలా పుస్తకాల్లో ఇంకా వ్యాసాల్లో మనం చూస్తూ వుంటాం.  కానీ వేదాల్లో నిక్షిప్తమై ఉన్న అపార విజ్ఞానాన్ని వెలికి తీయటంలో మనందిరి కృషి —- సున్నా … ఎవ్వరూ వేదాల్ని ధర్మం తప్ప వేరే దృష్టితో చూడరే? చూసే సౌభాగ్యం కలుగనివ్వరు మతవాదులు. ఒక వేళ మతవాదుల్ని ఒప్పించినా, హేతువాదులమంటూ మరో సైన్యం బయలుదేరుతుంది. ఇవన్నీ అటుంచి స్వయంగా నేర్చుకుందామంటే, వేదాలున్నది దైవభాషలో-సాధారణ మనిషికి చదవనలవి కావు.

 

ఇటువంటి వింత పరిస్థితి ని తమ దివ్యదృష్టి తో ముందుగానే కనిపెట్టిన మహనీయులే భాష్యకారులు. ఎందరో భాష్యకారులున్నా ముగ్గురు ప్రముఖంగా పేర్కొనబడ్డారు.  వారే మధ్వ-శంకర-రామానుజాచార్యులు. ముగ్గురూ దాదాపు ఒకరి తరువాత ఒకరు భారతభూమిని పావనం చేయటానికి అవతరించారు. మధ్వాచార్యుల వారు ఉడిపి నుండి ద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ మధ్వ మతాన్ని స్థాపించారు. వీరి తరువాత మంత్రాలయ గురు సార్వభౌములు శ్రీ రాఘవేంద్రగురువులు మధ్వమతానికి మరింత ఔన్నత్యాన్ని తెచ్చిపెట్టారు. శంకరాచార్యులు ఆది శంకరులుగా లోక విదితమే, భారతదేశమంతా సంచరించి అప్పటికి తిరోగమనం పట్టిన  హిందూ మతాన్ని ఉద్ధరిస్తూ నాలుగు దిక్కుల్లో నాలుగు శారదాపీఠాలను స్థాపించి ఎన్నో దేవాలయాలను పునఃప్రతిష్ఠించి సనాతన ధర్మానికి కొత్త అర్ధాన్ని-జీవాన్ని తెచ్చిపెట్టారు.ఇక శ్రీమహావిష్ణువు స్వరూపుడైన అనంత ఆదిశేషుని అంశతో మన జనులను ఉద్ధరించటానికి ఈ భువి పైకి వచ్చిన వారే శ్రీమద్భగవద్రామానుజాచార్యుల వారు. విశిష్టాద్వైత సిద్ధాంతాలను అందించిన మహానుభావుడు. తిరుమల మొదలు శ్రీరంగం-కాంచిపురం-ప్రయాగ-బదరీ-వృందావన క్షేత్రాల్లో పూజాదిక సంప్రదాయాలను ప్రవేశ పెట్టారు. వీరందించిన వేదభాష్యాలను తెలుసుకునే ముందు వీరి గురించి తెలుసుకోవాలి.

 

జన్మతయా శ్రీవైష్ణవ సాంప్రదాయం లో పెరిగాను కాబట్టి నాకు శ్రీవైష్ణవ మతం తత్సంబంధిత విశిష్టాద్వైత సిద్ధాంతం గురించి బాగా తెలుసు, మిగతా ఇరు సిద్ధాంతాలు మా తాత వద్ద కొంచెం మరియు పుస్తకాల ద్వారా ఇంకొంచెం తెలుసుకున్నాను. శ్రీవైష్ణవ సాంప్రదాయానికి ఆద్యులు పన్నిద్దరు ఆళ్వారులు. ఆళ్వార్ అనగా భగవంతుని భక్తిలో పూర్తిగా లీనమైన వారనీ, భక్తులలో ఉత్తములనీ అర్ధము. పెరియాళ్వార్ మొదలు ఆండాళ్ వరకూ జాతి-కుల-లింగ భేదాలు లేకుండా మహనీయులై తరించిన విష్ణు భక్తులే ఈ ఆళ్వార్లు. ఒక పక్క మత ఛాందసవాదులు, మరో పక్క జైన-బౌద్ధ మతాల ప్రచారం తో హిందుత్త్వము సన్నగిల్లుతున్న సమయంలో  తారతమ్యాలను మించి భగవంతుని ఆరాధనను సామాన్య ప్రజల వద్దకు తేవటానికి దక్షిణ భారతావని లో వెలసిన వారే  ఈ ఆళ్వారులు. భక్తి నే ఆయుధంగా మార్చుకొని వైష్ణవాలయాలలో వెలసిన ఆ మహావిష్ణువును అంతటా దర్శిస్తూ తరిస్తూ నాలాయిర ప్రబంధమనే దివ్య గ్రంథాన్ని అందించారు. ఈ ప్రబంధమునే ఈ నాటికి కూడా ద్రావిడ వేదం గా భావించి ఆ నాలుగు వేల పాశురాలను భగవంతుడిచ్చిన మహా ప్రసాదంగా భావిస్తారు వైష్ణవులు. ఆళ్వారులు కేవలం ద్రవిడ దేశానికే పరిమితమయ్యారు. వారి భక్తి భావనను ఇతర దేశాలకు వ్యాప్తి చేయటానికి సాక్షాత్ ఆ ఆదిశేషుడే అవతరించడం జరిగింది. ఆయనే భగవద్రామానుజులవారు.

 

నేటి  తమిళనాడులోని చెన్నై పట్టణానికి దగ్గరలోగల శ్రీపెరుంపుత్తూరు అంబడే శ్రీపెరుంబుదూర్ నందు  అసూరి కేశవ సోమయాజి దీక్షితులు మరియు కాంతిమతి దంపతులకు జన్మించారు.  పూవు పూయగానే పరిమళిస్తుంది అన్న చందాన రామానుజుల వారు అన్ని విద్యలను నేర్చుకుని, అద్వైత సిద్ధాంతంలోని కొన్ని భాగాలను గురువు ముందే తప్పని నిర్ధారించిన ఘనత పొందారు. రామానుజుల వారికి మొదటినుండే జాతిభేదం పై  నమ్మకం ఉండేది కాదు. శూద్రుడైన కాంచిపూర్ణుడు భగవంతుని ఆరాధనలో తరించడాన్ని చూసి అతనినే గురువుగా స్వీకరించి పాదాభివందనం చేస్తారు రామానుజులు. ఇంటికి భోజనానికి ఆహ్వానించి , ఆ పై భార్య తంజమాంబ చేత కాంచిపూర్ణుడు అవమాన పడటం చూసి గృహస్థాశ్రమానికి వీడుకోలు చెప్పి సన్యసిస్తారు. తరువాత కాంచిపురం వరదరాజుని సేవించి , ఆపై గురువాజ్ఞపై శ్రీరంగం  లోని యమునాచార్యులను కలవటానికి, శిష్యరికం చేయటానికి వెళతారు. రామానుజులవారు రాక ముందే యమునాచార్యులవారు పరమపదిస్తారు. కానీ యమునాచార్యులవారి భౌతిక కాయం యొక్క మూడు చేతి వేళ్ళు ముడుచుకుని ఉంటాయి, అవి గమనించిన రామానుజులవారు యమునాచార్యుల మనోభావాన్ని తెలుసుకొని మూడు ప్రతిజ్ఞలు చేస్తారు, ఆ మూడు వేళ్ళు ఒక్కో ప్రతిజ్ఞకి ఒక్కొక్కటి చొప్పున తెరుచుకుంటాయి. అలా భగవద్రామానుజులవారికి యమునాచార్యులు చనిపోయి కూడా కర్తవ్యం నిర్దేశించారు.

 

ఆ మూడు ప్రతిజ్ఞలు :
1. వైష్ణవ సాంప్రదాయాలకు సంకేతమైన,పంచ సంస్కార కర్మ,నాలాయిర దివ్య ప్రబంధబోధన,శరణాగతితో కూడిన మత ప్రతిపాదన మరియు ప్రచారం, అనే ఈ మూడు కర్తవ్యాలను విధి తప్పక నిర్వర్తించటం.
2. వేదాంతానికి మూలస్తంభాలవంటి ప్రస్థానత్రయానికి (ఉపనిషత్తులు-బ్రహ్మసూత్రాలు-భగవద్గీత) సరికొత్త వ్యాఖ్యానం వ్రాయటం.
3. భాగవత,విష్ణుపురాణాలనురచించినవేదవ్యాస,పరాశరమునుల అంశలతో జన్మించిన ఇద్దరు శిశువులను గుర్తించి, వారికా నామధేయాలను ప్రసాదించి, వ్యాస పరాశరులకు నివాళులు అర్పించటం.

 

ఈ ప్రతిజ్ఞలను  పూర్తి చేయటానికి ఆచార్యులవారు దేశ నలుమూలలా తీర్థయాత్రలు చేస్తూ, హిందూ మతాన్ని పునఃస్థాపిస్తూ ఒక్కఒక్కటిగా ప్రతిజ్ఞలను పూర్తి గావిస్తారు. ఆ రోజుల్లో ప్రచారం లో ఉన్న వర్ణ వ్యవ్స్థ అన్నా కుల వ్యవస్థ అన్నా ఆచార్యులకు నచ్చేది కాదు, భగవంతుని ఆరాధనే పరమపదమని, ఆయన్ని చేరుకునేందుకు కుల-జాతులు అడ్డుకాదని తర్కించారు. అప్పటికి ప్రాచుర్యంలో ఉన్న ఎన్నో సామాజిక ఋగ్మతలను బాగు చేసారు. నేటికి కూడా శ్రీరంగం ఆలయంలో ఈ సాంప్రదాయం చూడొచ్చు, జాతి-వర్ణ భేదం లేకుండా ప్రతి ఒక్కరు ఆ స్వామి ఆరాధనలో నిమగ్నులౌతారు. తిరుకోట్టియూర్ లో గల గోష్టిపూర్ణుని వద్ద అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశం పొందుతారు.

 

అయితే మంత్రోపదేశ సమయంలో గోష్టిపూర్ణులు రామానుజుల వారికి జాగ్రత్తలు చెబుతూ, అష్టాక్షరి వినినా జపించినా స్వర్గ ప్రాప్తి కలుగుతుంది అని, అయితే ఇది అత్యంత గోప్యమనీ, ఇతరులకు తెలిపితే తెలుసుకున్నవారు స్వర్గానికి వెళ్ళినా చెప్పిన వాడు నరకానికి పోతాడని, కేవలం యోగ్యుడైన శిష్యునికే ఇది తిరిగి ఉపదేశించాలని చెబుతాడు. రామానుజుల వారికి లోక హితం ముఖ్యం, అందుకు తాను నరకానికి పోయినా పర్వాలేదు అని తెలుసుకొని, తిరుకోట్టియూర్ కోవెల గోపురం యెక్కి అందరికీ అష్టాక్షరిని వినిపిస్తారు. అది రామానుజ తత్త్వం – తాను కరిగిపోతున్నా అందరికీ వెలుగు ప్రసాదించే క్రొవ్వొత్తి లక్షణం కూడా అదే. గురువు కోపం కన్నా, నరక వ్యధలకన్నా పరోపకారం పర హితమే మిక్కిలి ఉత్తమమని నమ్మినారు కాబట్టే అంతటి మహనీయులు. అక్కడితో రామానుజుల వారు ఆగలేదు దేశంలో గల అన్ని ఆలయాలకు అర్చనా విధానాన్ని నిర్దేశించారు. నేడు తిరుమలతో సహా చాలా వరకూ వైష్ణవాలయాల్లో పూజా విధానం రామానుజుల వారి ఉపదేశమే. అలానే ప్రతి మనిషి తన ఎదుటివానితో ఎంతో స్నేహపూర్వకంగా ఉండేలా “అడియెన్” అన్న సిద్ధాంతాన్ని ప్రవేశ పెట్టారు. అంతటి మహానుభావుడైన రామానుజాచార్యులవారిని మనసారా స్మరించుకుందాం.

 

సర్వదేశదశాకాలేషు అవ్యాహత పరాక్రమా
రామానుజార్య దివ్యాజ్ఞాం  వర్ధతాం అభివర్ధతాం

3 thoughts on “రామానుజ

  1. శ్రీ రహ్మానుద్ధీన్ గారు తాను వైష్ణవ సాంప్రదాయంలో పెరిగాననటం ఆశ్చర్యంగా ఉంది కదూ! ఎందుకంటే,ఆయన పేరు చూస్తే మహమ్మదీయుడనిపిస్తుంది.దయచేసి వివరణ ఇవ్వగలరు.

    భవదీయుడు,
    టీవీయస్.శాస్త్రి

  2. very good narration.
    వేరెవరో విదేశీయులు వచ్చి, మన చరిత్రను తవ్వి మీ పూర్వీకులు ఇంత గొప్పవారు అని మనకు చూపిస్తే, పట్టించుకోం..So true.

    I never had a chance to know detailed information .looking forward to read more articles from you…..thanks

Comments are closed.