April 27, 2024

శకుంతల దుష్యంతుల కధ సార్వకాలికం

శకుంతలా దుష్యంతుల కథ అనగానే మనకి వారి ప్రణయం, దుష్యంతునికి శాపం, భరతుని జననం లాంటి ఐతిహాసిక విషయాలే చాలావరకూ గుర్తొస్తాయి. అయితే ఈ కథను సమకాలీన స్త్రీవాదకోణంలోనుండి విశ్లేషించిన డా. తిరునగరి దేవకీదేవిగారు తన విశ్లేషణను మనకు ఈ వ్యాస రూపంలో అందిస్తున్నారు


ధమతత్వజ్ఞులు ధర్నశాస్త్రంబని

యధ్యాత్మవిదులు వేదాంతమనియు

నీతి విచక్షుణులు నీశాస్త్రంబనియు

కవి వృషభులు మహాకావ్యమనియు

లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని

యైతిహాసికులితిహాసమనియు

పరమపౌరాణికుల్ బహుపురాణ సముచ్చ

యంబని మహిగొనియాడుచుండ

వివిధ తత్వవేది వేదవ్యాసు

డాదిముని పరాశరాత్మజుండు

విష్ణుసన్నిభుండు విశ్వజనీనమై

పరగుచుండ జేసె భారతంబు”

అంటూ వేదవ్యాస విరచిత మహా భారత సమ్యగ్స్వరూపాన్ని నన్నయ లోకానికి పరిచయం చేశారు. మహాకావ్య లక్షణాలను కల్గియుండి పురాణ సముచ్చయంగా దృష్యమానమై లాక్షణికుల విధివిధానాలతో విలసిల్లుతూ ధర్మన్న్ని నీతిని ప్రజలకందించి హీతేనసహితం సాహిత్యమని ఋజువు చేస్తూనే కాంతా సమ్మతంగా సందేశాన్ని మనకందించిందని ఆ కారణంగానే అందులో ప్రతిపాదించిన ధర్మం నీతి సార్వకాలికంగా గోచరిస్తుందని పలువురి అభిప్రాయం.

కవుల కలం నుండి జాలువారిన ఇతివృత్తాలేవైనా వారి ఆలోచనా సరళి ఏమైనా, పాఠకుల సహృదయత చైతన్య స్థాయిననుసరించి వారావిష్కరించుకునే భావజాలముంటుంది. ఆ క్రమంలో వ్యాసుడు ఏ రాజకీయ సామాజిక సాహిత్య ఆర్ధిక పరిస్థితుల్లో రచించినా కవిత్రయం ఏ దృష్టితో అనువదించినా ఎవరి భావావిష్కరణ వారిది.

మహాభారతంలో చెప్పుకోదగిన ఉపాఖ్యానాల్లో శకుంతలోపాఖ్యానాం ఒకటి. సందేశాత్మకమైన ఉపాఖ్యానామిది. శకుంతలోపాఖ్యానాంలో కధంతా ముగింపువరకు పాఠకులను ఆందోళనకు గురిచేసి ముగింపు మాత్రం పాఠకులకు ఊరట నిస్తుంది (శకుంతల తల్లి మేనక కధ ఆనాటి వేశ్యావ్యవస్థను అద్దం పడుతూ పురుషప్రయోజనాలకై ఉపకరణంగా ఉపయోగించుకోబడుతున్న వారి దీనావస్థను ముందుకు తెస్తుంది). విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్న సందర్భం గా దేవేంద్రుడు

“.. మేనక యను ధవలాక్షి పిలిచి విశ్వామిత్రుపాలికి జని తదేయ ఘోరతపము చెఱచి కోమలి! నాదైన దేవరాజ్యమహిమ నీవు కావుమ”ని ఆజ్ఞాపించాడు.

ఆ మాటలు వింటూనే మేనక ఆందోళనపడింది. ఒకవైపు ఇంద్రునితో పాటుగా దేవతలందరూ గడగడవణికిపోయ్తే కోపోదగ్రుడైన విశ్వామిత్రుడు. మరోవైపు కాదనలేని ప్రభువాజ్ఞ. ఏ మాత్రం ఏమరుపాటుకు లోనైనా విశ్వామిత్రుని శాపానికి గురికావలసిందే. దేవేంద్రుని తిరస్కరించే వీలే లేదు.

అమ్ముని అల్గి చూడుడును ఆ క్షణమాత్రన గోత్రధామణీధ్రమ్ములు వ్రయ్యు న య్యినుము దక్కగ నంబుధులింకు మూడులోకమ్ములు దిద్దరందిరుగు గాడ్పుచలింపగనోడు నుగ్రతంబమ్మిన యట్టి కోపపరుపాలికి బ్రావులువోననోడరే” అంటూ సందేహిస్తూనే అమరపతి ఆజ్ఞకే తల ఒగ్గింది. భూలోకానికి పయనమైంది. విశ్వామిత్రుని తపోవనంలోకి ప్రవేశించింది. విశ్వామిత్రుడు కోపిష్టి అనే విషయాన్ని అంగీకరిస్తూనే, ‘ఆపద కలగవచ్చునేమో’ అనే సందేహంలో తలమునకలౌతూనే ప్రభువాజ్ఞను శిరసావహించడానికి సిద్ధమైంది. వ్యవస్థలలో రాజులకై కట్టుబడి ఉండాల్సిన నిబద్ధతలో భాగంగా ఆమె స్పందించింది. భూలోకానికి వచ్చి తపోవనంలో ప్రవేశించింది. పుష్పాపచయంలో సహాయం చేసే నెపంతో సఖులతోపాటు విహరించింది. అవకాశం చూసుకోని విశ్వామిత్రుని మనోజభావ కందళితుని చేసింది. ఆతనితో రమించింది. ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. మొత్తమ్మీద విశ్వామిత్రునికి తపోభంగం కావించింది. దేవేంద్రుని ఆజ్ఞ అంతమేరకే. మాతృత్వంతో శిశువును దరిచేర్చుకునే అవకాశం పాపం ఆమెకు లేదు. ఆమెకే కాదు అప్సరసగణం పరిస్థితి అదే. ఆ కారణంగా ఆమె సైకతస్థలిలో ఆ శిశువునుంచి వచ్చిన మార్గాన్నే వెళ్ళిపోయింది. ఇందులో కార్యం దేవేంద్రుడిది. ఉపకరణం మేనక. విశ్వామిత్రుని తపోభగ్నం లక్ష్యం గా దేవేంద్రుని ఆశయం నెరవేరింది. ఈ కధ ప్రతీకాత్మకమైనది. సమాజంలో ఇటువంటి కధలనేకం. రాజరాజనరేంద్రుని కాలంలో ఇటువంటి సంఘటనలనేకం చోటుఛేసుకుని ఉంటాయి. ఇప్పటికీ అటువంటి సంఘటనలనేకం పునరావృతం అవుతూనే ఉన్నాయి. పితృస్వామ్యంలో పురుషప్రయోజనాల దృష్ట్యా స్త్రీని ఎరగా ఉపయోగించుకుంటూ పరిణామాలకు వాళ్ళనే భాధ్యులను చేయడం తిరిగి వారినే నిందించడం పరిపాటి. మేనకలాంటి స్త్రీలెందరో తమ ప్రమేయం లేకుండానే పిల్లలకు జన్మనించ్చి కసాయి తల్లులుగా ముద్రవేసుకుంటున్నారు. విధివంచితులై పిల్లల్ని వదులుకోవడమో, సమాజంతో అపవాదుకు గురికావడమో ఆత్మాహుతి చేసుకోవడమోవంటి సంఘటనలు కోకొల్లలు. ఉపఖ్యానంలో మేనకపై అభాండాలు లేకపోయినా కన్నపేగు బంధాన్ని తెంచుకునిపోయిన ఆమె కడుపుకోతను వర్ణించకపోయినా అది భరించలేనిది. లక్ష్యం విశ్వామిత్రుని తపోభంగం అయినందున ఈ విషయాలను కవి ఏ మాత్రం స్పృశించలేదు. ఏది ఏమైనా విధివంచితులై అమాయకంగా కుంతీదేవిలా తల్లులైన స్త్రీలందరు లోకాపవాదానికి భయపడ్డవారే. లోకం తీరునే పట్టించుకోకుండా వారి బ్రతుకేదో వారు బ్రతికే వారు వేశ్యలు. ఈ విధంగా శకుంతల తల్లి కధ కూడా హృదయాన్ని ద్రవింపజేసేదే.

మొత్తం మీద ఆడశిశువుకు జన్మనిచ్చిన మేనక వెనుదిరిగినయనంతరం ఆమె శకుంత పక్షులతో రక్షింపబడి శకుంతలమై ముని కుమారుల ప్రమేయంతో కణ్యామహర్షి ఆశ్రమానికి చేరి అతని పెంపుడు కూతురైనది. యుక్తవయస్కురాలై తపోవనంలో విహరిస్తున్న సందర్భంగా వేటకై వచ్చిన దుష్యంతుడు అదే తపోవనానికి చేరుకున్నాడు. దుష్యంతుడు కణ్యామహర్షి ఆశ్రమాన్ని చేరుకుని శకుంతలను చూడటం యాదృచ్చికం.

“………….. తన్వింబయోజదళాయతాక్షిసం
కుల మిళితాళినీల పరికుంచిత కోమల కుంతలన్ శ
కుంతల యను కన్యకను” చూచెను.

అంటే చాలా అందకత్తె అయిన శకుంతలను చూచాడు. ఆ అందానికి ఆకర్షితుడూ అయ్యాడు. దుష్యంతుడు అంతటితో ఆగిపోలేదు. పెళ్ళిచేసుకోవాలనే ఆలోచనా వచ్చింది. కానీ ఆ యివతికి తన్ను వివాహమాడగల అర్హత ఉందా? లేదా? తేల్చుకొనే ఉద్దేశంతో ఇట్టి రూపలావణ్యవిలాస విభువు గుణసుందరి విందులకేల వచ్చితివంటూ ప్రశ్నించి ఆమె క్షత్రియపుత్రిక అనే సమాధానాన్ని పొంది వివాహార్హత కల్గిన స్త్రీగా తను సంతృప్తిని పొందాడు. ఈ సందర్భంలో కేవలం శారీరక వాంచకే ప్రాముఖ్యతనివ్వకుండా వివాహానికే పెద్దపీట వేశాడు.

ఇద్దరూ యుక్తవయస్కులు. కణ్యామహర్షి తపోవనంలో లేడు. అయినా దుష్యంతుడు అందులో తనవంతు ఔచిత్యాన్ని పరిశీలించుకునే ముందడుగు వేశాడు. మనసులోని పెళ్ళిమాటను శకుంతల ముందుంచాడు. తన్ను వివాహమాడి అశేషరాజ్యలక్ష్మీ మహానీయ సౌఖ్యముల తేలియాడమని నచ్చచెప్పాడు. నీవంటి అందకత్తెకు వల్కలాజినములు, ఫలాశనములు విటపకుటీరాసనము సరిగాదని సలహా ఇచ్చాడు. అంటే తన్ను వివాహమాడటం వల్ల ఆమెకు కలుగబోయే సుఖసౌఖ్యాలను ఆనందాలను ఏకరవు పెట్టి ఆమెను వెన్వెంటనే ఒప్పించే ప్రయత్నం చేశాడు. అష్తవిధ వివాహాల్లో గాంధర్వవిధి వివాహప్రసక్తిని తెచ్చాడు.

“…………… గాంధర్వవిధి వివాహమగుట వినవె యుక్తవా”ని తెలియజేస్తాడు. అయినా శకుంతల తొందపడలేదు. వివాహం అంగీకారమైనా

“కరుణనిరతులు ధర్మ స్వరూపులింతకు మదీయ జనకులు సనుదెతురు వారి వచ్చి నీ కిచ్చిరేని పాణిగ్రహణం సేయుమునన్నున్” అంటూ తండ్రి వచ్చిన అనంతరమే వారి అంగీకారం చేతనే తన పాణిగ్రహణం జరుగగలదని స్పష్టం చేస్తుంది. దుష్యంతుడు తనసందేహాలను నివృత్తిచేసుకున్నాడే తప్ప శకుంతల పరిమితులను పట్టించుకోలేదు.

“వనజ నేత్ర! గాంధర్వవివాహమతి రహస్యమ్ను, నమంత్రకమగుచునొప్పు”, అంటూ గాంధర్వవివాహం అతిరహస్యమంటూనే కణ్యామహర్షి లేకున్నా ఈ వివాహావిధికెట్టి ఆటంకాలుండవని, వివాహం ఆయన రాకపూర్వమే చేసుకోవచ్చని తొందరపెట్టాడు. దుష్యంత శకుంతల వివాహాలనిర్ణయాలవంటి సంధర్భాలు ఈనాటికీ అనేకం చోటుచేసుకుంటున్నాయి. వివాహానికి ముందు స్త్రీలు ఎన్నో విధాలుగా అభ్యంతరం తెలిపినా ఏదో విధంగా నచ్చజెప్పి మెడలు వంచి పెళ్ళిచేసుకోనే సంఘటనలు కొనసాగుతూనే వున్నాయి. ఆ ధోరణే ఇక్కడా కనబడుతున్నది. శకుంతల మొత్తం మీద పెళ్ళికి ఒప్పుకున్నది. కానీ రాజులకు బహుభార్యత్వముంటుందని ఆమెకు తెలుసు. ఆ క్రమంలో అతనికింతకు పూర్వమే పెళ్ళై వుండే అవకాశముంది. సంతానమూ ఉండే అవకాశముంది. మరి రాజు వాళ్ళకే రాజ్యాధికారం కల్పించవచ్చు. అందువల్ల ముందే

” నరనుత! నీ ప్రసాదమున నాకుదయించిన నందనున్ మహీ
గురుతర యౌరాజ్యమునకున్ దయతో నభిషిక్తుజేయగా
వరం ప్రసన్న బుద్ది ననవద్వముగా దయనేయు నెమ్మితో
నిరుపమదాన నట్లయిన నీకును నాకును సంగమంబగును”

ప్రశ్నించింది. ప్రశ్నించటమే కాదు అతన్ని ఒప్పించింది. అంటే దుష్యంతుడు శకుంతల కొడుకునే యువరాజుగా చేయడానికి అంగీకరించి ఆమెను గాంధర్వ పద్ధతిలో వివాహం చేసుకున్నాడు. ఈ మాటలు, అంగీకరించడం వంటివి నలుగురి ముందు జరిగినవి కావు. ఇరువురికి మాత్రమే పరిమితమైనవి. అలాంటప్పుడు ఈ వరానికి కార్యరూపం ఉండగలదా ? లేదా ? అనే సందిగ్ధంలో ‘ఉండగలదనే’ భావానికి మొగ్గుచూపించింది. దుష్యంతుడూ వివాహానికే మొగ్గు చూపాడు. శకుంతలనూ అందుకు అనుకూలంగా మార్చుకున్నాడు. (తానొక చక్రవర్తినని, రాజుగా తనకుండే పరిమితులుంటాయని, ప్రజలు తనపట్ల సహృధ్భావన్ని కలిగి ఉండే విధంగా తన జీవితం స్వేచ్చామయమైనది కాదని, తాను కొన్ని పరిమితులకు లోనై ఉండటం తప్పనిసరి అని దుష్యంతుడు ఆలోచించలేదు. యుక్తవయసులో క్షత్రియ కులానికే చెందిన అందమైన యువతీయువకులు ఏకాంతంలో కలుసుకున్నవారు భవిష్యత్తుకన్నా వర్తమానానికే ప్రాముఖ్యమిచ్చారు. గాంధర్వ వివాహం జరిగింది. తద్వార అఖమత సుఖాలను అనుభవించాడు. ఆ తర్వాత అన్న త్ప్రధాన వర్గంబు కణ్యామహాముని పాలికి ప్రత్తెంచెందనని చెప్పి తన నగరానికి వెళ్ళిపోయాడు.

దివ్యదృష్టితో శకుంతలాదుష్యంతుల వివాహాన్ని తెలుసుకున్న కణ్యామహర్షి కూడా ఆ గంధర్వవివాహం విధిచోదింతలని అంగీకరించాడు. ఒకవేళ దుష్యంతుడు అంగీకరించకపోతే శకుంతల పరిస్థితేంటని సందేహం ఆయనకు కలుగకపోలేదు. ప్రకృతి సాక్ష్యంగా జరిగిన వివాహానికి ప్రకృతే అవసరానికి సాక్ష్యమివ్వగలదనే నమ్మకం ఆయనకు కల్గియుండవచ్చు. అనుకున్న ప్రకారం పుత్రోదయం తర్వాత మునికుమారులను తోడిచ్చి కణ్యామహర్షి శకుంతలను దుష్యంతమహారాజు వద్దకు పంపించాడు. (శకుంతల దుష్యంతమహారాజు సభలో ప్రవేశించడంతోనే ఆమె అస్థిత్వపోరాట ఆలోచనలు ముందుకు వస్తాయి). సకల సామంత మంత్రి పురోహిత ప్రధాన పౌరజన పరివృతుడైయున్న రాజసభలో శకుంతల దుష్యంతుడిని చూస్తూనే కలవరపడింది. కణ్యాశ్రమంలో అతనితో గడిపిన క్షణాలను గుర్తుతెచ్చుకొంటుంది, అక్కడ దుష్యంతుడు అనురాగంతో ఆప్యాయంతో మధ్యురమైన స్నేహంతో ప్రవర్తించాడు. రాజసభలోని దుష్యంతుని ముఖకవళికలలో ఆ లక్షణాలేవీ లేవని గమనించింది. రాబోయే ఆపదను అంచనా వేసుకొంది. కొంత తత్తరపడింది. ఆలోచనా పరంపరలు ఆమెను వెంబడించాయి.

ఎఱుగడొకొనన్ను నెఱిగియి
నెఱుగని యట్లుండునొక్కొయెడదవ్వగంటన్
మఱచెనొకొముగ్దులధిపులు
మఱవరె బహుకార్యభారమగ్నులు గారె

మొదట తన్ను తను ఎఱుగనట్లే ఉన్నాడని అనుమానించింది. ఆపై తన్ను గుర్తించి కూడా తెలియనట్లు నటిస్తున్నాడా? అనే అనుమానం కలిగింది. “భార్యగా స్వీకరించినవాడు, పుత్రోదయానికి కారణమైనవాడు తనను గుర్తించకుండా ఉండేందుకు వీలెట్లా ఉంటుంది” అనే విశ్లేషించుకోకల్గిన విజ్ఞత కల్గినదైయుండటం వల్ల తన్నెఱిగి కూడా ఎఱుగనట్లు నటిస్తున్నడా? అని ప్రశ్నించుకుంది. అయితే ఈ ప్రశ్నలోనే ఎఱిగి కూడా ఎఱుగనట్లు నటిస్తున్నాడనే సమాధానం కూడా ఉంది. ఆ విషయాన్ని అర్ధం చేసుకున్నా ప్రకృతి సాక్షిగా పెండ్లాడిన వాడు తనని నిర్లక్ష్యం చేస్తున్నాడని అంగీకరించడానికి మనస్సు ఒప్పుకోలేదు. అందువల్ల “చాలాకాలమైనందువలన మఱిచిపోయాడేమో”? అని సమాధానపరచుకోవాలని చూసింది. అందుకూ మనస్సొప్పుకోలేదు. అధిపులైనవారు ఎంతంటి కార్యభారాలున్నప్పటికీ మఱిచిపోవడానికి వీల్లేదని నిర్ణయించుకొంది. ఈ విధంగా ఒకవైపు దుష్యంతుని ప్రవర్తనా విధానం రెండొవైపు ఇష్టపడి మనువాడిన భర్తపై ఉండాల్సిన విశ్వాసం ఈ రెండు ఆలోచనల మద్య కొట్టుమిట్టాడుతూనే

” తలపగ నాడువల్కిన విధంబెడదప్పగ వీడెనొక్కొచూ
డ్కొలు విరిసంబులై కరము క్రూరములైన నిమిత్తమేమియో”

అంటూ ఆందోళన చెందింది. వివాహవిషయంగా కణ్యామహర్షి అనుమంతితో పాణిగ్రహణం చేసుకుందామని శకుంతల ప్రతిపాదించింది అయినప్పటికీ ఆ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా గాంధర్వవివాహవిధిని ముందుకు తెచ్చి ఒప్పించి పెళ్ళి చేసుకున్నడు. పైగా కలుగబోయే సంతానానికి(మగ) యువరాజుగా చేస్తానని మాట కూడా ఇచ్చి దాంపత్యసుఖాన్ననుభవించాడు. ఆ దుష్యంతుని చూపులే ఇప్పుడు ప్రేమలేనివై కఠినంగా క్రూరంగా ఉండటాన్ని చూసి శకుంతల ఆందోళన పడింది. కొందఱు వ్యక్తులు ఆయా సంధర్భాలలో స్వల్పవ్యవధికి సంబంధిన పరిచయాలను మరచిపోయే ఆస్కారముంటే ఉండవచ్చు కాని అది మాములు జనానికి సంబంధిన విషయం, ఈ సంధర్భంలో దుష్యంతుడు శకుంతలను నచ్చి మెచ్చి ఒప్పించి వివాహం చేసుకోవడమే కాదు కనబోయే కొడుకుకు రాజ్యం కట్టపెడతాననే మాట ఇచ్చి సంసారిక సుఖాన్ననుభవించాడు. అట్లాంటి దుష్యంతుడు మరచిపోయే ఆస్కారముండదని శకుంతల విశ్లేషించుంది. ఆ విశ్లేషణ మదింపులో దుష్యంతుడు ఉద్దేశ్యపూర్వకంగా తనను నమ్మనట్లు నటిస్తున్నాడని అర్ధం చేసుకుంది అందువల్లే

‘కలయగ పల్కరించిరుపకారులునైరని నమ్మియుండగా
వలవదు బుద్ధిమంతులు నవయులైన ధరాధునాధులణ్

అంటూ ఆవేదన చెందింది. కానీ ఏం లాభం ? చేతులు కాలాక ఆకులు పట్టుకుంది. ఇందులో యువతకు మరీ ముఖ్యంగా యువతీ లోకానికి చక్కటి మార్గనిర్దేశనమున్నది. ఐశ్వర్యం అంతస్థులు రాజరికాలని చూసి వారి వ్యక్తిత్వం ఉన్నతంగా ఉంటుందని ఊహించడానికి వీల్లేదనే స్పష్టమైన సలహా వుంది. చివరగా దుష్యంతుడు తనను ఉద్దేశపూర్వకంగానే తెలియనట్లు నటిస్తున్నాడనే నిర్ణయానికి వచ్చింది.

మఱచిన దలపింపగనగు
నెఱుగని నాడెల్లపాట నెఋఇగింపగనగున్
మఱి యెఱిగి యెఱుగనొల్లని
కఱటిం దెలుపగ కమలగర్భునివశమే

కావాలని తనను గుర్తుపట్టనట్లు నటిస్తున్న దుష్యంతుడికి తనను గుర్తింపజేయడం ఆ బ్రహ్మతరం కూడా కాదని నిర్ణయించుకొంది. అయినా తనదైన ప్రయత్నం చేయకతప్పదని ఆలోచించింది. (ఈ సంధర్భం శకుంతలకు ప్రత్యేకమైనదేమీ కాదు. పెళ్ళికొప్పించి కాపురం చేసి పిల్లలను కని సకల సుఖాలనుభవించి ఆ స్త్రీపై మోజుతీరిన తర్వాత ఆ స్త్రీని ఒదులుకో చూసే ప్రతీ మగాడి ముందు ఆ భార్యపడే వేదనలకిది ఓ నమూన. ఇంతటి నిర్ణయానికి వచ్చినా కొడుకు రాజ్యాధికారాన్ని కోల్పోవటమేకాక అక్రమసంతానపు ముద్ర తల్లీకొడుకులిద్దరికీ పడే అవకాశముంది. ఆ అవమానాన్ని అధిగమించాల్సిన అవసరాన్ని గుర్తుచేసుకుంది. అతన్ని ఒప్పించేందుకై తీవ్రంగా ప్రయత్నించింది. అందులో భాగంగానే

జననాధ వేటనెపమున
గొనకొని కణ్యాశ్రమమునకున్ వచ్చి ముదం
బునందు నాకు నీ యి

చ్చిన వరం దలంప వలయు చిత్తములోనన్” అంటూ వేడుకొంటుంది. ఈ వేడుకోలు లోనూ శకుంతల వాడిగా సంధిన మాటలు లేకపోలేదు. కణ్యాశ్రమంలో తన కుమారుణ్ణి యువరాజుగా చేస్తాననే వరాన్ని జ్ఞాపకం చేసుకోవలసిందిగా చెప్తుంది. కేవలం ఆమె మాటలు అంతకే పరిమితం కాలేదు. నీవు ఈ విషయాన్ని “అంగీకరించకపోవడంలో ఉద్దేశ్యపూర్వకమైన మోసమేమైనా ఉన్నదా ?” అని నిలదీయదలచుకున్నది. ఆ నిలదీయడానికి ఉపయోగించిన పదమే “వేట నెపమున గొనకొని కణ్యాశ్రమమునకున్ వచ్చి ..” అంటే దుష్యంతుడు ఒక రాజుగా, క్షత్రియుడుగా వేటాడం అనే వేడుకలో భాగంగా ఆశ్రమానికి రాలేదని వేటనెపంతో నన్ను మోసగించడానికి మాత్రమే వచ్చావనే బాణాన్ని సంధించింది. ఒకవైపు ఇచ్చిన వరాన్ని జ్ఞాపకం చేసుకోమన్నది. ఈ వరాన్ని నిజం చేయకపోతే నీవు వేటకొరకు కాకుండా వేటనెపంతోనే వచ్చినవాడవౌతావనీ సవాల్ విసిరింది. ఇంత మెలుకువతో తెలివిగా మాట్లాడినా ఆ మాటలేవీ దుష్యంతుని చెవికెక్కలేదు. అందువల్ల ఏకంగా

‘ఏ నెఱుగ నిన్ను నెక్కడి
దానవు మిన్నకయ యనుచితంబులు పలుకం
గానేల యరుగు యంబురుహా
నన యెందుండి వచ్చితందులకు శడిన్..” అంటాడు.

ఈ అనడంలో ఆవేశం ఉంది. వీలైనంత తొందరగా ఆమెను కొలువుకూటమినుండి పంపింఛే ప్రయత్నం ఉంది. అందులో భాగంగానే సామాజికులకు తనమాటలే నిజమని నమ్మించే ప్రయత్నముంది. వివాహప్రసక్తి, సంతానప్రసక్తి, యువరాజు ప్రసక్తి .. ఇవేమీ స్పృశించకుండానే “నీవు నాకు తెలియదు, నీవు మాట్లాడే మాటలన్నీ అనుచితాలు. వచ్చినదారినే వెళ్ళిపో” పై పద్యం సారంశమిదే. ఈ మాటలతీరు దుష్యంతుడి ప్రణాళిక ప్రకారంగా సామాజికులందరు శకుంతలనే అనుమానింఛే అవకాశముంది. లేనిపోని జిమ్ముక్కులు చేసి రాజ్యాధికారం చేజిక్కించుకునేదుకుకై శకుంతల ప్రయత్నం గా పౌరులు ప్రజలు భావించే ఆవకాశముంది. అందువల్ల వీలైనంత తొందరలో ఆమెను వచ్చినదారినే వెన్వెంటనే పొమ్మని ఆజ్ఞాపించి అసత్యాన్ని సత్యంగా నిరూపించదలుచుకున్నాడు. అందువల్లే ఆ తొందరపాటు. దుష్యంతుని మాటలకు శకుంతల బిత్తరవోయింది. తనను ఒదిలించుకోవడానికి ఆ విధంగా మాట్లాడుచున్నాడని అర్ధం చేసుకొంది. అతని ప్రయత్నమెంతటిదైనా సమాజంలో తాను గౌరవంగా బ్రతకాలంటే దుష్యంతమహారాజు పుత్రుడిగా తనకొడుకు రాజ్యంలో గౌరవంగా జీవించడమే కాక రాజ్యాధికారన్ని కూడా పొందాలనే పట్టుదల ఆమెలో ఎక్కువైంది. ఆ పట్టుదలలో శకుంతలకు తప్పని అస్థిత్వపోరాటముంది. అందువల్లే ఆమె ఎలాంటి జంకూ కొంకూ లేకుండా అతడిని నిలదీయదలుకుంది. ధర్మపత్నిగా నిరూపించుకోదలచింది.

ఏల యెఱుక లేని యితరుల యట్ల నీ
వెఱుగ ననచుబలికె దెఱిగి యెఱిగి
యేనకాని దేని నెఱుగరిందొరులని
తప్ప పలుకనగునెధార్మికులకు”

అంటూ కుండబద్దలు కొట్టినట్లు ప్రశ్నించింది. ఇంగితజ్ఞానం కల్గినవారెవరికైనా సత్యశోధన దిశలో ఉన్న ఎవరికైనా శకుంతల దుష్యంతుల వాదంలోని సత్యం తెలియకపోదు. చేసుకున్నది గాంధర్వ వివాహం ఆ వివాహంలో సాక్ష్యం ప్రకృతే. పౌరులెవ్వరూ సాక్షులుగా లేరు. సామాజికులకు దుష్యంతుడే భర్త అని శకుంతల ఋజువు చేసుకునే అవకాశం లేదు. ఆ విషయాన్నే శకుంతల ముందుకు తెచ్చింది. అంతేకాదు “ఆ కారణంగానే నీవు అబద్దమాడుతున్నావో?” అని నిలదీసింది. ఎవరికీ తెలియనంత మాత్రాన అబద్దం ఆడటం ధార్మికులకు తగినదేనా?” అని మరో ప్రశ్న సంధించింది. ఈ ప్రశ్నలో ఓ కిటుకును ఉపయోగించింది. లౌక్యంగా అతణ్ణి ధార్మికుడంటూ సంబోదించింది. ఆ సంబోదన అతడి ముందటి కాళ్ళకు బంధం వేయడం కొరకే. ధార్మికుడవంటు సంబోధిస్తూనే ధార్మికులైనవారు తప్పు పలకడం తగునా” అంటూ ప్రశ్నించింది. ఈ ప్రశ్నఓ నీ ధార్మికుడివా ? తప్పు పలికేవాడివా అనే సవాల్ వుంది. ధార్మికుడివైతే అబద్దం ఆడవు. అబద్దమాడే వాడివైతే ధార్మికుడవు కాదు. ధార్మికుడివా? కాదో! తేల్చుకోవాల్సిన అవకాశాన్ని దుష్యంతునికే ఇచ్చింది. ఈ సున్నితమైన అంశాన్ని దుష్యంతుడు గమనించి తప్పకుండా తనను తన కుమారుణ్ణి స్వీకరిస్తాడనే నమ్మకంతోనే శకుంతల ఆ ప్రయత్నం చేసింది.

అంతే కాదు

విమల యశొనిధీ పురుషవృత్తమెఱుంగుచునుందుజూనివే
దములును బంచభూతములు దర్మువు సంధ్యలునంతరాత్మయన్
యముడును జంద్ర సూర్యులు నహంబును రాత్రియున్నహా పదా
ర్ధములిచి యుండగా నరుడు దక్కొన నేర్చునె తన్నుమ్రుచ్చిలన్

నా యెఱిగినట్లు యన్నియి
నీ యిచ్చినవరము ధారణీవర యెఱుగున్.
నా యందు డొటి యట్టుల

చేయుతునుగ్రహమవజ్ఞాసేయందగునే అంటూ బ్రతిమిలాడింది. ఈ బ్రతిమిలాడటంలొనో ఆమె దుష్యంతుణ్ణి “నిర్మలమైన యశస్సుకు విధియైనటువంటివాడా “ అంటూ సంబోదించింది.

మానవుని వృత్తాంతాన్ని వేదాలు పంచభూతాలు ధర్మం, సంధ్యలు అంతరాత్మ యముడు సూర్యచంద్రులు రాత్రింబవల్లు ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తూనే ఉంటాయని చెప్పింది. దుష్యంతుడు అబద్దమాడలాని చూసినా ఈ ప్రకృతిసాంతం పర్యవేక్షిస్తుందని చెప్పినపుడు ఆత్మపరిశీలన చేసుకునే దిశలో సత్యాన్ని అంగీకరిస్తాడని శకుంతల ఆశపడింది. అన్నిటినీ మించి ‘అంతరాత్మ ‘ నుండి మానవుడు తన్ను తాను మోసం చేసుకోవడం అసాధ్యమనే విషయాన్ని కూడా ఇందులో చేర్చింది. అంతరాత్మని శోధించుకునే వాడెప్పుడూ జీవితంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటాడు. తెలిసి తెలిసి తాను తప్పు చేసానని గ్రహించికూడా, సరిదిద్దుకునే ప్రయత్నం చేయక దుష్ఫలితాలకు దుర్మార్గాలకు కారకులైనవారు అంతరాత్మ మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తున్న సందర్భంగా జీవితంలో ధైర్యంగా నిలదొక్కుకోవడం కష్టం. ఆ దుర్మార్గం, ఆ దుష్ఫలితం హృదయాన్ని నిలిపివేస్తుంది. పిండి పిప్పి చేస్తుంది. అశాంతితో కలవరపేదుతుంది. క్షణక్షణం నరకం చేస్తుంది. ఊపిరాడని పరిస్థితులను కల్పిస్తుంది. చివరిగా జీవితాన్ని ముగించుకునే పరిస్థితినే తీసుకురావచ్చు. ఇంతటి శక్తివంతమైన అంతరాత్మను శకుంతల దుష్యంతుని ముందుంచింది. వీటన్నిటికీ “మన వివాహవిషయం తెలిసుండీ నీవు తప్పించుకోలేవని. తెలియనట్లు నటించడం మంచిది కాదాని హితం చెప్తుంది. ఈ ప్రయత్నంలోనూ ఆమె అతణ్ణి నిర్మలమైన యశస్సు గలవాడివనీ, రాజులలో శ్రేష్టుడివైనవాడివని సంబోదించి సన్మార్గానికి తిప్పే ప్రయత్నం చేసింది. అయినా రాజరికమర్యాదకై ప్రాకులాడుతున్న దుష్యంతుని ముందు శకుంతల ప్రయత్నాలేవీ ఫలించలేదు. వేడుకోళ్ళన్నీ పనికిరాకుండాపోయాయి.

సతియును గుణవతియును బ్రజా
వతియును ననువ్రతయునైన వనిత నవజ్ఞా
న్వితదృష్టిజూచునతి దు
ర్మతి కహముం బరం గలదె మతాబరికింపన్

ధర్మబద్దంగా వివాహమాడిన గుణవతి సహధర్మచారిణి అయిన భార్యను నిరాదరించిన దుర్మతికి ఇహలోకంలోనే కాదు పరలోకంలో కూడా మంచిగతులుండవని చివరగా శకుంతల దుష్యంతుణ్ణి బెదిరించింది. సాధువాక్యాల్తో మంచిమాటలతో పొగడ్తలతో అతణ్ణి వివాహానికి కట్టుబడి ఉండేటట్లుగా ప్రయత్నం చేసింది. ఆ మార్గం సుగమం కాలేదు. దాంతో ఆమె ఆవేశం కట్టలు తెంచుకొంది. భార్యను నిరాదరిస్తే సంభవించబోయే ఫలితాలను ముందుంచి ‘తస్మాత్ జాగ్రత్తా అని బెదిరించింది.

ఒకమంచి భార్యను కల్గియుండగల అదృష్టాన్ని ఏకరువు పెడుతూనే అట్టి పురుషుడు పుణ్యవంతుడౌతాడనే ప్రయోజనాన్ని సూచిస్తుంది. అంతేకాకుండా జీవితంలో భార్య కారణమగానే పురుషుడు తన ఆపదలన్నిటినీ అధిగమించగలడని, భార్యయందు ప్రవేశించి పురుషుడు పుత్రుడుగా ఉర్ధవిల్లుతాడని ఆ పుత్రుడు పున్నామనరకాలనుండి తప్పించగల్గినవాడని, ముఖ్యంగా దుష్యంతపుత్రుడు నూరు వాజపేయాలనొరిస్తాడని సరస్వతి ఆకాశవాణిగా వినిపించిందని అంతటి పుత్రుని వదులుకో జూడటం ధర్మం గాదని, సత్యం చాలా గొప్పదని ఆ సత్యాన్ని తప్పడం పాడిగాదనంటూ దాంపత్యధర్మాన్ని, పుత్రప్రయోజనాన్ని సత్యనిష్ఠకుగల గొప్పతనాన్ని చెప్పి అతణ్ణి ఒప్పించడానికి శాయశక్తులా కృషి చేసింది. చివరిగా తనను దారినపోయే సాధారణ స్త్రీగా అంచనా వేసుకోవద్దంటూ

‘క్షత్రియ విశ్వా
మిత్రునకు పవిత్రయైన మేనకకున్ స
త్పుత్రినయి కలుగక
ధా త్రీతలనాథ యింత ధర్మేతరనే’

అని మళ్ళీ బ్రతిమిలాడటంలోనికి దిగుతుంది. ఈ వేడికోళ్ళు, అభ్యర్ధనలు, ధార్మిక నీతులు, బెదిరింపులేవీ దుష్యంతుడి మీద పనిచేయలేదు. అతడు నూటికి నూరుపాళ్ళుగా తన రాజగౌరవాన్ని కాపాడుకునేందుకే ప్రయత్నించాడు. రాజు నలుగురికీ మంచి చెడుల విషయంలో తీర్పు చెప్పవలసినవాడు. ఆదర్శంగా ఉండవలసినవాడు. స్త్రీల పట్ల దయాబుద్దితో ప్రవర్తించవలసినవాడు. దుష్టశిక్షణ శిష్టరక్షణ చేయవలసినవాడు. కుశలనీతి కల్గియుండవలసినవాడు. శకుంతలను భార్యగా స్వీకరించాల్సిన దుష్యంతుడు పై విషయాలన్నిటినీ విస్మరించాడు. దుష్యంతుడు శకుంతలను వదిలించుకోవడానికి చివరి అస్త్రంగా

ఏనెట నీవెట సుతుడెట
యేనెన్నడు దొల్లి చూచి యెఱుగను నిన్నున్
మానిను లసత్య వచనలు

నా నిట్టుల సత్యభాషణంబుచితంబే అంటూ బుకాయించాడు. సత్యాసత్యాలు ఏ విధంగా ఉన్నా సామ్నాజికులు ప్రస్తుతాంశాలకే ప్రాధాన్యమిస్తారు. ఆ క్షణంలో వాళ్ళకు సత్యంగా గోచరించిన విషయాన్నే తీవ్రంగా పరిగణిస్తారు. దుష్యంతుడు నేను నిన్నెప్పుడూ చూడనేలేదు. నీ అబద్ధపు మాటలు స్త్రీలోకానికే మచ్చ తెచ్చేవిగా ఉన్నాయంటాడు. ప్రజలను, పౌరులను నమ్మించడానికి

పొడవున ప్రాయంబునగడు
గడిది బలంబునను జూడగా నసదృశునీ
కొడుకని యీతని నెంతయు
నెడమడుగగ జూపదెత్తె యిందఱు నగగాన్.

అని కూడా అంటాడు. ఇక్కడ దుష్యంతుడి ఒక అద్భుత విషయాన్ని ముందుకు తీసుకువచ్చి తాను తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. శకుంతల దుష్యంతుల కొడుకు అసమాన్యుడు. అతణ్ణి చూస్తే శకుంతల పుత్రుడిగా లేడు. మంచి దేహదార్డ్యంతో పొడగరియై ఉన్నాడు. ఇతిహాసాల్లోని అందరి ఇంతుల్లా శకుంతల అతి సుకుమారంగా కోమలంగా ఉంది. శకుంతలకు ఇంతటి పుత్రుడు ఉండటానికి వీల్లేదు. అనేటట్లుగా అతని దేహదార్డ్యముంది. అతడు తన కొడుకని ఆమె తన భార్యయని దుష్యంతునికి తెలుసు. లోలోపల వారిపట్ల సుముఖత ఉండిఉండవచ్చు. కాని రాజమర్యాద కాపాడుకోవడానికి తాను సంతోషిస్తున్న విషాయాలనే ముందుకు తెచ్చి తన్ను తాను రక్షించుకోజూశాడు. ఆమెను సభనుండి వెళ్ళిపొమ్మని ఆజ్ఞాపించాడు. ఆమె దుష్యంతుడు తనను స్వీకరించడాని సిద్దంగా లేదనే విషయన్న్ని గమనించిన క్షణం నుండి అనేకవిధాలుగా అతడిని ఒప్పించడంలో విఫలురాలైంది. తిరుగు ప్రయాణం తప్పదనే నిర్ణయానికి వచ్చింది.

తడయక పుట్టిననాడ తల్లిచే దండ్రిచే విడువ
బడితి నిప్పుడు పతిచేతను విడువంబడియెదనొక్కి
నుడువులు వేయినింకేల యిప్పాటినోములు దొల్లి
నోచితినిగాకేమి యనుచు గుందెడెందమున

తన జీవితమే కష్టాలమయమైనందుకు ఎంతో దుఃఖించింది. భగవంతుడే శరణని నమ్ముతూ కొడుకును తీసుకొని వెనుదిరుగుతుండగానే

“గొనకొని వీడు నీకును శకుంతలకుంబ్రియనందనుండు సే
భరియింపుమీతని శకుంతల సత్యం వెల్కెసాధ్వి స
ద్వినుత మహాపతివ్రత వివేకముతోనని దివ్యవాణి దా
వినిచె ధరాధునాథునకు విస్మయమందగ దత్సభాసదుల్”

అంటూ వేలుపుల పలుకులు వినబడ్డాయి. ఈ మాటలు వినీవినపడక ముందే దుష్యంతుడు శకుంతలను స్వీకరించడానికి సిద్ధమయ్యాడు. అంతవరకు తాను చేసిన వాదనను సాంతంగా ఉపసంహరించుకున్నాడు.

ఏను నీ యింతియగాని యెఱుగరన్యు
లర్థి కణ్యామహాముని యాశ్రమంబు
నందు గాంధర్వవిధి వివాహమున గరము
నెమ్మి జేసతి దేని పాణిగ్రహణము

అంటూ తన నిరాకరణకు గల కారణాలను పౌరుల ముందుంచాడు.

అన్యులెఱుగమి లోకాపవాద
భీతినెఱియు నిత్తన్వి బ్రీతిదప్పి
యెఱగనంటి నిందఱికిప్పుడెఱుంగ
జెప్పెనాకాశవాణి యచ్చెరువుగాక

దుష్యంతుడు లోకాపవాదభీతితో ఈమె నాకు తెలియదన్నానని నొక్కి చెప్తున్నాడు. పెళ్ళి చేసుకునే సందర్భంలో కాదు కూడదని తండ్రి చేతుల మీదుగా పాణిగ్రహణం జరుగుతుందని శకుంతల తెలియజేసినప్పుడు గాంధర్వవివాహం అంగీకారయోగ్యమైనదే అంటూ ప్రకృతిసాక్ష్యంగా ఉండటం వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేదనే ధోరణిలో ఆమెను ఒప్పించాడు. గాంధర్వవివాహ విషయంలో లోకులు అనుమానించే అవకాశమున్నదని కాని, లోకాపవాదానికి తాను వెనక్కు తగ్గాల్సి వస్తుందేమో అనికాని అతడేమాత్రం ఆలోచించలేదు. రాజు తలచిందే ధర్మం, రాజు చెప్పిందే శాస్త్రం (గుఱ్జాడ) అన్నట్లుగా “లేడికి లేచిందే పరుగు” అను సామెతను సార్ధకం చేస్తూ పెళ్ళిచేసుకున్నాడు. ముందూ వెనుకా ఆలోచించకుండా ఆమె కొడుకును యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేస్తానని మాట కూడా ఇచ్చాడు. అందరి స్త్రీల వలెనే శకుంతల గంధర్వ వివాహానికి తటపటాయించింది. అంతేకాదు రాజులకు బహుభార్యత్వం అంగీకారమైనదే. క్రితంలోనే వివాహం జరిగి వుండవచ్చు. భవిష్యత్తు లో మళ్ళీ పెళ్ళి చేసుకునే అవకాశమూ ఉంటుంది. తెలిసి తెలిసి తనకు కలుగబోయే సంతానాన్ని అనామకులను చేయడానికి శకుంతల మనస్సంగీకరించలేదు. శకుంతలకే కాదు. ఏ తల్లికీ అలాంటి మనస్సుండదు. అన్ని ఆలోచించిన శకుంతలకు కొలువుకూటంలో భంగపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. తన్ను తాను రక్షించుకోవడానికి లేక రాచరికహోదాను మేడిపండు గౌరవాన్ని కాపాడుకోవడానికి ఒక స్త్రీ జీవితాన్ని ఆమె సంతానాన్ని అపఖ్యాతి పాలు చేయడానికి అంధకారమయం చేయడానికి సిద్ధమయ్యడు. రాజుగా తాను ప్రజలకు ధర్మానికి కట్టుబడి ఆదర్శప్రాయుడై ఉండాలనే ఆలొచనే ఆయనకు రాలేదు. సాధారణ సామాజికుల వలె స్వార్ధపూరితంగా ఆలోచించాడు. (పితృస్వామ్యంలోని అందరి మగవాళ్ళ వలెనే దుష్యంతుడూ ఆలొచించాడు ఆ ధోరణే ఈ దుష్యంతుడిలో కనబడుతున్నది. వ్యాసమహర్షి రచించినా నన్నయ అనువదించినా ఇది ఆనాటి సమాజాన్నే కాదు ఈనాటి సమాజాన్ని కూడా అద్దం పడుతున్న సంఘటన ఇది. ఈ మధ్య కాలంలో జరుగుతున్న అనేకానేక సంఘటనలకేమాత్రం తీసిపోదు.)

ఈ సందర్భంలో దుష్యంతుడు భరతవర్ణానికి ఆ పేరు రావడానికి కారకుడైన భరతుని తండ్రి.ఒక గొప్ప నాయకుడు. ఉత్తమోత్తమ చరిత్ర కలవాడు. అంతటి మహానుభావుడు సాధారణ జనానీకం వలె మొదట తొందరపడి ఆ తర్వాత నాలుక్కరుచుకున్నాడు. ఫలితంగా తాను నష్టపోవడానికి సిద్ధపడలేదు. శకుంతలా భరతుల జీవితాలనీ ఫణం పెట్టాలనుకొన్నాడు. తన గౌరవాన్ని కాపాడుకో జూసాడు. సాహిత్యం సమాజాన్ని అద్దం పట్టడమే కాదు సందేశత్మకమై ఉండాలి. నాయకుడు అంటేనే నీతిమార్గంలో ప్రజలకు అనుసరణీయుడై ఉండాలి అని ఒక నమ్మకం. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. అందువల్ల గంధర్వవివాహం ధర్మబద్ధమైనదనే అంగీకరయోగ్యమైనదనే విశ్వాసం ప్రజల్లో సడలకూడదు. తద్వారా ఆ నాయకుల పట్ల విముఖత ఏర్పడకూడదు. ఆ కారణంగానే తదనుకూలంగా రచయిత వేలుపుల పలుకులను ప్రవేశపెట్టాడు.

విమలయశొనిదే పురుషవృత్తమేఱుగుచు నుండు జూవె వే
దములును బంచభూతములు ధర్మువు సంధ్యలు నంతరాత్మయున్
యముడును జంద్రసూర్యులు నంబును రాత్రియున్మహాపదా
ర్ధము లిని యుండగా నరుడు దక్కొన నేర్చునె తన్నుమ్రుచ్చిలన్

గాంధర్వవివాహానికి ప్రకృతిసాక్ష్యమని నమ్ముతున్న కాలంలో ఆ ప్రకృతేసాక్ష్యంగా వచ్చి శకుంతలను ఆతని కొడుకును రక్షించింది. ఒక నమ్మకం ఆధారంగా చేసుకున్న వివాహబంధాన్ని ఆ నమ్మకమే రక్షించింది. అయితే ఈ మధ్య కాలంలో జరుగుతున్న అనేకానేక సంఘటనలకేమాత్రాం తీసిపోనిదీ కథ. వివాహానికి మరీ ముఖ్యంగా ప్రేమిచే రోజుల్లో లేని అభ్యంతరాలు అనుమానాలు అపోహలు ధర్మాధర్మాలు విశ్లేషణలు విచక్షణాలు వివాహ సంధర్భంగా లేదా వివాహానంతరం వారి వారి ఆర్ధికస్థాయిలననుసరించి హోదాలననుసరించి ముందుకు వస్తాయి. గాంధర్వవివాహాలుగా కాకపోయినా ప్రేమ పేరిట గుళ్ళు గోపురాల్లో స్నేహితుల సమక్షంలో పెళ్ళిళ్ళాడటం మామూలైపోయింది. యుక్తవయసులో ఉన్న యువతీయువకులు ఏ మాత్రం ముందుచూపు లేకుండా మంచి చెడు విచక్షణ లేకుండా ప్రేమ వ్యవహారంలో పడుతున్నారు. ప్రేమించుకున్నవారందరూ పెళ్ళి వరకు వస్తారనీ ఖచ్చితమైన నమ్మకమేమీ లేదు. పెళ్ళి జరిగినా సజావుగా కాపురాలను కొనసాగిస్తారని నమ్మకం లేదు. ఒక సందర్భంలో అమ్మాయి యింటి ఆర్ధికస్థితిగతులు ఆమె వద్దనున్న నగలు, నగదును ఆశించి అబ్బాయిలు ఆ ఆమ్మాయిలకు ప్రేమ పేరిట దగ్గరై లొంగతీసుకుంటున్నారు. మరి కొన్ని సందర్భాల్లో అబ్బాయిల అందచందాలని చూసి అమ్మాయిలు ఆకర్షితులౌతున్నారు. ఇంకొన్ని సందర్భాల్లో పరిపక్వతలేని ఆదర్శాల ఆరాటంతో తొందరపడి దగ్గరౌతున్న వారుంటున్నారు. ఆర్ధికంగా నిలదొక్కుకొని పరిపూర్ణ వ్యక్తిత్వాలను నిర్మించుకున్న వారికెలాంటి ఇబ్బదులుండవు. ప్రేమజంటలో ఏ ఒక్కరికి నిజాయితీ లేకపోయినా ప్రేమ వ్యవహారాలు పెళ్ళిళ్ళ వరకు పోయే అవకాశముండదు. పెళ్ళి జరిగినా వారి జీవితం సాఫీగా సాగుతుందనే నమ్మకముండదు. ప్రేమ వ్యవహారం పెళ్ళి వరకు వచ్చేసరికి తల్లిదండ్రులనుండి బంధువర్గం నుండి ఆక్షేపణాలు. అంతవరకు యువతీయువకులుగా వారు కొనసాగిస్తున్న జీవనవిధానాన్ని పట్టించుకోని పెద్దలు పెళ్ళిప్రసక్తి వచ్చే వరకు ఆక్షేపణాలతో ముందుకు వస్తారు. కొన్ని చోట్ల అమ్మాయి పక్షం వాళ్ళు అనాంగీకారాన్ని తెలిపితే మరికొన్ని చోట్ల అబ్బాయి పక్షం వాళ్ళు విముఖతను చూపుతున్నారు. ఏమైనా అబ్బాయో అమ్మాయో లేదా ఇద్దరు మనస్తాపానికి గురౌతున్నారు. ప్రేమ పేరుతో విలాసంగా కాలం గడిపి తీరా పెళ్ళి ప్రస్తావన వచ్చేసరికి ముఖం చాటు చేసుకునే అబ్బాయిలు, తల్లితండ్రుల పట్టింపులతొ విధిలేక దూరమవుతున్న అమ్మాయిల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూ ఉంది. అబ్బయికి మాత్రమే ఇష్టం లేని సందర్భంలో మహిళాసంఘాల మద్దతుతో అమ్మాయిలు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకొనే దిశలో ఉద్యమిస్తున్నారు. న్యాయం జరుగుతుందని చెప్పలేని పరిస్థితి. అమ్మాయిలు దూరంగా ఉన్నపుడు అబ్బాయిలు అంతరంగం విప్పుకోలేని పరిస్థితి. ప్రేమని కాదని బలవంతంగా తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్ళికి తలవంచినా ఆ ప్రేమవ్యవహారం బయటపడ్డా భర్తతో వేధింపులు తప్పవు. ప్రేమలో లేని అడ్డంకులు పెళ్ళికెందుకని కొందరు అబ్బాయిలు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుంటే తామిష్టపడ్డారు కాబట్టి పెళ్ళిచేసుకొని తీరాల్సిందే అనే మూర్ఖత్వంతో ఎన్నో ఆసిడ్ దాడులు కత్తి దాడులనేకం రోజువారీ వ్యవహారలైపొయాయి. ఎంతోమంది అమ్మాయిలు తమ విలువైన ప్రాణాలను ప్రేమపేరిట పోగొట్టుకుంటున్నారు. పెద్దల విముఖత కారణంగా యువతీయువకులు కలసికట్టుగా ఆత్మాహుతులకు పాల్పడుతున్నారు. ఏది ఏమైన ప్రేమజంటలో ఏ ఒక్కరికి నిజాయితీ లేకపోయినా నష్టపోయేది ఎక్కువగా స్త్రీలే. పెళ్ళో దాంపత్యమో బెడిసికొట్టిన కాలంలో అపవాదులు అధికంగా వచ్చేది స్త్రీజాతికే. అంతేకాకుండా విశ్రుంఖలనంగా ప్రవర్తించేవాళ్ళు ఆ స్త్రీలను వాడుకోచూడటం, దెబ్బతీయటం, అవమానించడం చివరిగా బతకకుండా చేయటం వంటి సంఘటనల సంఖ్య దినదినం పెరిగిపోతూ వున్నాయి. సమాజంలో ఆస్తికులే అధికశాతం. దొంగ-దొర, మంచివాడు – చెడ్డవాడు, భూస్వామీ – పాలేరు, పెట్టుబడిదారు – కార్మికుడు, ప్రభుత్వం ప్రజలు అందరు ఈ ఆస్థికుల కోవకి చెందినవారే. ఎవరికివారుగా ఆ భగవంతుణ్ణి స్మరించి తమకు విజయం కల్పించమని వేడుకునేవాళ్ళే. భగవంతుడి సాక్షిగా వివాహం జరుపుకుంటున్నవాళ్ళే. వాళ్ళే అనేక కారణాలతో పరస్పరంగా నిందించుకొంటున్నా వేదనలకు గురిచేస్తున్నా ఆ భగవంతుడు సహాయానికి రాని సందర్భాలనే చూస్తున్నాం. ఈ విషయంగా అబ్బాయి తొందరపాటుకన్నా అమ్మాయిలనే ఎక్కువగా గర్హిస్తాం. పెద్దల అంగీకారంతో జరిగిన వివాహాలకే రక్షణ కరువైన రోజుల్లో నాటి గంధర్వ వివాహాలు, నేటి విప్లవవివాహాలు యువతకు అనుసరించదగింది కాదని చెప్పడానికి ఈ ఉపాఖ్యానం ఓ గొప్ప ఉదాహరణగా (స్థైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఇట్లాంటి సంఘటనలను ఎదుర్కొనే స్త్రీలూ ఉన్నారు) ఈ కధ సార్ధకమైనది. ఒక గొప్ప సంకేతంతో వ్యాసుడు ఈ కధను పేర్కొంటే దుష్యంత మహారజు పట్ల అమితమైన గౌరవంతో అతనికెలాంటి అపవాదు ఆపాదించకుండా ఉండటం కోసం కాళిదాసుమహాకవి శాప వృత్తాంతాన్ని చేర్చారు. ఏది ఏమైనా ఈనాటి యువత, పెద్దలు సామాజిక సంస్థలు ఈ మద్యకాలంలో వెర్రితలలుగా విస్తరిస్తూ యువతను తప్పుదారి పట్టిస్తున్న మీడియాని నియంత్రిస్తూ సమాజాన్ని సరైనదిశలో పయనింప చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తస్మాత్ జాగ్రత్త.

5 thoughts on “శకుంతల దుష్యంతుల కధ సార్వకాలికం

  1. >>ధమతత్వజ్ఞులు ధర్నశాస్త్రంబని
    >>యధ్యాత్మవిదులు వేదాంతమనియు
    >>నీతి విచక్షుణులు నీశాస్త్రంబనియు

    ఈ వ్యాసంలో టైపాట్లు, పొఱబాట్లు కావలసినన్ని ఉన్నాయి. దయచేసి క్వాలిటీ మెరుగుపర్చగలరు.పైని లైన్లు దృష్టాంతం.

    ఈ వ్యాసం తాలూకు విశ్లేషణ అర్థరహితం. ఇలా చూస్తే, తండ్రి శుక్రాచార్యుని శిష్యుడైన కచునికి దేవయాని లైను వేసింది అని పురాణ కథ చెబుతోంది కాబట్టి స్త్రీలకు మోహం ఎక్కువ అనే ఒక దారుణమైన inference ను ఆ కథ ద్వారా లాగవచ్చు. ఎవరికి వారు, వారి వాదనల కోసం పురాణపాత్రలను, లోకోత్తరమైన మనుషుల చరిత్రను వక్రీకరించడం అంత మంచిది కాదు.

  2. కాళిదాసు చేర్చిన శాప వృత్తాంతం తప్పకుండా మగాణ్ణి రక్షించే ప్రయత్నమే. దుష్యంతుడు ఖచ్చితంగా నయవంచకుడు గానే కనబడతాడు. అంతేకాదు, అనవసరమయిన అంగుళికం వృత్తాంతం వల్ల తెలియచెప్పిన నీతి ఏమిటంటే, ఆడదానికి ప్రేమించడానికి, దానిని నిరూపించుకోడానికి ఒక ఆధారం, సాక్ష్యం కావాల్సి రావడం, అందులోనే బంగారం ఆభరణాల పట్ల స్త్రీలకు మోజు, అత్యావశ్యకం అనే సందేశం కనబడి ఒక దుష్ట సంప్రదాయమే ఏర్పడడం ఈ కధ వల్ల స్త్రీ జాతికి ఒనగూడిన ప్రయోజనం. తాడేపల్లి గారు చెప్పిన పితృస్వామ్యం, స్త్రీవాదం వంటి అంశాలు అవసరమా? అన్నారు. అవును అవే ఉన్నాయి ఈ కధలో. అప్పటి ఆ పరిస్థితులే అలా వ్రాయించాయి. అంటే కాదు అవే ఉత్తమ ప్రమాణాలు అనీ స్త్రీలను కట్టిపడవేసే అవస్థను సృష్టించాయి.
    ఈ కధను ఈనాటి పరిస్థితులకు అన్వయించడం తప్పుల్ని పునరావృత్తం చెయ్యడానికి పురికోల్పడమే. ఆసిడ్ దాడి చేసే లేదా నయవంచన చేసే నేటి పిచ్చి ప్రేమ కుర్రాళ్ళకి, దుష్యంతుడికి పెద్ద తేడా లేదు.
    రాజా.
    gksraja.blogspot.in

  3. purana gadhani samakaaleena paristulaku anvayistu..meeru chesina visleshana bavundi. good one.

  4. రెండో భాగం

    పితృస్వామ్యం/ పురుషస్వామ్యం అనే పదం నాకు మిక్కిలి ముచ్చట గొలుపుతుంది. అది తప్ప ఇంకే స్వామ్యమూ లేని సృష్టిలో దాన్ని ప్రత్యేకంగా మెన్షన్ చేయడం అనవసరమేమో. స్త్రీస్వామ్యం ఉన్న దేశం గానీ, కాలం గానీ ఉన్నదా ? పురుషుడి స్వామ్యం వల్లనే మనం చూస్తున్న కుటుంబమూ, నాగరికతా, సభ్యత, సంస్కృతీ అన్నీఏర్పడ్డాయి . అతని యొక్క చుఱుకైన క్రియాశీల పాత్ర మూలాన, అతని చొఱవ మూలాన ఏర్పడ్డాయి. తండ్రి అనేవాడి ఉనికి మూలాన కుటుంబాలు స్థిరంగా ఉంటున్నాయి. అతను చనిపోతే ఎవఱి దారిన వారు తలా ముక్కా పీక్కుని పోతారు. పిల్లలు కనడం తప్ప కుటుంబవ్యవస్థని నిలబెట్టడానికి ఆడవాళ్ళు చేసేదేమీ లేదు. వాళ్ళు తొమ్మిది నెలలు మోస్తే మగవాడు జీవితాంతం మోస్తాడు. చచ్చాక కూడా అతను తన ఆస్తుల రూపంలో తనవాళ్ళని ఇంకా ఇంకా పోషిస్తూనే ఉంటాడు. అతనొకడు కుటుంబంలో ఉండబట్టి “ఎవఱు ఎవఱి సంతానం ? ఎవఱు ఎవఱిని చేసుకోవచ్చు ? ఎవఱిని చేసుకోకూడదు ?” అనేవి స్పష్టంగా అర్థమై వావి-వరుసలు అనేవి ఏర్పడ్డాయి. అతను ఉండబట్టి ఈ కుటుంబాలు అనేవి ఉన్నాయి. అతను యథేచ్ఛాజీవనాన్న ి కౌగలించుకుని బయటికెళ్ళిన రోజు ఇవి అదృశ్యమవుతాయి.

  5. పురాణకథల్ని విశ్లేషించడానిక ్కూడా ఫెమినిస్టు పదజాలం తప్ప వేఱే భావజాల ప్రాతిపదిక లభించని సమకాలీన భావదారిద్ర్యాని కి విచారిస్తున్నాన ు. పురాణాల్నీ, మతగ్రంథాల్నీ ఫెమినిస్టు దృక్పథం నుంచి వివరించలేము. ఎందుకంటే అవి ఫెమినిజానికి విరుద్ధమైనవి. పతివ్రతలు ఫెమినిస్టులు కారు, కాలేరు (అండ్ వైస్ వర్సా). ఆనాడే కాదు, ఈనాడు కూడా !

    ఈ సైటులో ఎక్కడా లేని విధంగా వ్యాఖ్యల పరిమాణం మీద ఆంక్షలు ఉండడం వల్ల నా వక్తవ్యం

Comments are closed.