April 27, 2024

ఎంత ఘాటు ప్రేమయో!

— మధురవాణి

అనగనగా ఒక ఊర్లో మహా రద్దీగా ఉండే ఒక వీధి. ఆ వీధి ఎల్లప్పుడూ తూనీగల్లాగా ఝూమ్మని బైకులేసుకు తిరిగే కుర్రాళ్ళతోనూ, రంగుల రంగుల దుస్తుల్లో మెరిసిపోతూ నవ్వుతూ, తుళ్ళుతూ అందమైన సీతాకోకచిలుకల్లా విహరించే అమ్మాయిలతోనూ కళ కళలాడిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఊర్లోనే పేరుపొందిన రెండు అతి పెద్ద కాలేజీలు అక్కడే ఉన్నాయి మరి!

ఆ రెండు కాలేజీల్లో కలిపి వేలల్లో ఉంటారు విద్యార్థులు. పేరుకి విద్యార్థులే అయినా కూడా విద్య కోసం అర్థించడం మానేసి ఏ వింధ్యనో, సంధ్యనో అర్థిస్తూ తిరిగే అబ్బాయిలే ఎక్కువగా కనిపిస్తుంటారు అక్కడ. యీ సదరు ప్రేమార్థులు కాలేజీ లోపలకన్నా కాలేజీ వీధిలోనే ఎక్కువగా తచ్చాడుతూ ఉండటం వల్ల, ఇహ చేసేదేం లేక పాపం ఆ వీధి కాస్తా ఊర్లోకెల్లా మహా రద్దీ అయిన వీధై కూర్చుంది.

తల నున్నగా దువ్వుకుని, సాదాసీదా బట్టలేసుకుని, వీపుకి పుస్తకాల బ్యాగు తగిలించుకుని, అటూ ఇటూ దిక్కులు చూడకుండా, రోడ్డు మీద ఎక్కడా ఆగి పెత్తనాలు చేయకుండా నేరుగా కాలేజీకొచ్చే బుద్దిమంతులు కొందరైతే, వానాకాలంలో కూడా చలవ కళ్ళద్దాలు తీయకుండా, ఆ సదరు మొహాన్ని అద్దంలో చూడడం వల్ల భయంతో బిక్క చచ్చిపోయి నిటారుగా నించున్న క్రాఫుతో, ఒక చిన్న పుస్తకాన్ని ఆట వస్తువులా చేసి చేతుల్లో గిరగిరా తిప్పుకుంటూ, అమ్మాయిల మీద తప్పించి వేరెక్కడా ఏకాగ్రత నిలపలేని ప్రబుద్ధులు మరికొందరు.

ఇవ్విధమున పలు పలు రకాలైన యువజనులతో హరివిల్లులోని రంగులన్నీ ఒకేచోట అలరారుతున్నట్టుండే ఇలాంటి కాలేజీ వీధుల్లో మనం తరచి చూడాలే గానీ  నిత్యం ఎన్నెన్ని ఘాటు ప్రేమలో, ఎన్నెన్ని బూటు ప్రేమలో! మచ్చుకి అలాంటి ఓ ఘాటు ప్రేమకథని చూసొద్దాం పదండి.

 

**********

రోజుట్లాగే ఆ రోజు మధ్యాహ్నం కాలేజీలో క్లాసులయ్యాక ఇంటికి బయలుదేరింది శృతి. మేడ మెట్లెక్కి వాళ్ళుంటున్న గది గుమ్మం ముందుకి వచ్చేసరికి పూజ ఆపాటికే వచ్చేసి లోపల నిశాంత్ తో మాట్లాడుతోంది.
నిశాంత్ ఎవరంటే, ఆ ఊర్లోనే ఉంటున్న పూజ వాళ్ళ పెద్దమ్మ కొడుకు. పూజ కంటే ఓ రెండేళ్ళు పెద్దయినా ఇద్దరూ స్నేహితుల్లానే మసలుతుంటారు. అంతే కాదు పూజతో సమానంగా శృతితో కూడా స్నేహంగా ఉంటాడు నిశాంత్. ఒంటరిగా యీ ఊర్లో ఉండి చదువుకుంటున్న యీ ఇద్దరమ్మాయిలనూ అప్పుడప్పుడూ వచ్చి పలకరించి వెళ్తుంటాడు.

అప్పుడే వచ్చి గుమ్మంలో నించున్న శృతిని చూసి నిశాంత్ ‘హాయ్’ అంటూ పలకరించాడు.
శృతి కూడా తిరిగి నవ్వుతూ పలకరిస్తూ చెప్పులు విడిచెయ్యడానికి వంగినప్పుడు యథాలాపంగా వీధి వైపు చూసింది. వీధిలో బైకు మీద ఇద్దరు కుర్రాళ్ళు చాలా నెమ్మదిగా సైకిలు మీద వెళ్తున్నట్టుగా వెళ్తున్నారు. శృతి నవ్వు మొహంతో అటువైపు చూసేసరికి బైకు వెనకాల కూర్చున్న కుర్రాడు మొహవంతా కళ్ళు చేస్కుని శృతి వైపే చూస్తూ నవ్వుతూ కనిపించాడు.
ఆ కుర్రాడి తీరుకి ఆశ్చర్యపోయిన శృతి లోపలికొస్తూ “ఆ బైకు మీద వెళ్ళే వాడెవడో మహా తింగరోడిలా ఉన్నాడు. ముక్కూ మొహం తెలీని నన్ను చూసి అంతలా నవ్వుతాడేంటీ!” అంది.
“ఆ బైకు వీరుడికి నీ ముక్కూ మొహవేం ఖర్మ, ఏకంగా నీ జీవిత చరిత్రంతా తెలుసు” అల్లరిగా అంది పూజ.
శృతి వెంటనే పూజ వంక చురుగ్గా చూస్తూ “ఇంక చెప్పవే.. చెప్పు.. నా మీద కవితలూ, కాకరగాయలూ కూడా రాసేస్తున్నాడని చెప్పు” ఎద్దేవా చేస్తున్నట్టుగా అంది.
“నువ్వు మరీ అమ్మమ్మల కాలంలో ఉన్నావే శృతీ..” అంటూ పూజ ఏదో చెప్పబోతుండగానే శృతి మధ్యలో అడ్డుకుని “పోనీ.. అది కాకపోతే నా మీద ఏకంగా సీరియళ్ళూ, సినిమాలూ గట్రా తీస్తున్నాడంటావా అయితే?”
“మన బైకు వీరుడిని నువ్వు మరీ తక్కువా అంచనా వేస్తున్నావ్ శృతీ! యీ హైటెక్ యుగంలో పాత చింతకాయ పచ్చడిలా అలాంటివెందుకు చేస్తాడు. నీ పేరు మీద ఏ వెబ్సైటో తయారు చేస్తాడు గానీ!”
“హబ్బా పూజా.. నన్నొదిలెయ్యవే బాబూ! నేనేదో మాటవరసకంటే, నువ్వేంటే ఆ తింగరోడి మీద ఏకంగా చర్చాకార్యక్రమం పెట్టేస్తున్నావ్!” అంటూ విసుక్కుంది శృతి.
వీళ్ళిద్దరి మాటలు వింటూ నిశ్శబ్దంగా నవ్వుతూ కూర్చున్నాడు నిశాంత్.
శృతి వెంటనే నిశాంత్ వైపు చూస్తూ “ఏంటీ.. మూకీ సినిమా చూసినట్టు చూస్తున్నావ్.. ఏం మాట్లాడకుండా” అని అడిగింది.
“శృతీ.. ముందు నేను చెప్పేది మొత్తం విను. అప్పుడు వీడిలా ఏం మాట్లాడకుండా ఇలా పిల్లిలా కూర్చుని ఆ ముసిముసి నవ్వులెందుకు రువ్వుతున్నాడో నీకే అర్థమౌతుంది” అంటూ పూజ మళ్ళీ చెప్పడం మొదలెట్టింది.
“శృతీ.. ఊరికే ఊసుపోక కాదు ఇదంతా చెప్పేది. కారణముంది కాబట్టే ఇప్పుడీ చర్చ. నిజానికి యీ విషయం గురించి నేనే నీకు చెప్దామనుకుంటున్నాను. ఈలోపు అనుకోకుండా నువ్వే యీ ప్రస్తావన తెచ్చావు. ఇందాక నువ్వు తింగరోడన్నావే, ఆ బైకు మీద కనిపించిన అబ్బాయి గత పది రోజుల నుంచీ రోజుకి నాలుగు సార్లు నువ్వు ఇంటికీ కాలేజీకి తిరిగేప్పుడు బాడీగార్డు లాగా నీ వెనకాలే తిరుగుతున్నాడు. యీ విషయం నాకప్పుడే తెలుసు. కానీ, ఎలాగూ కొన్ని యుగాల తరవాతైనా నీ అంతట నువ్వే యీ విషయం గమనించకపోవు. అప్పుడెలాగూ కంగారు పడతావు కదా! ముందే చెప్పి ఇప్పటి నుంచే నిన్ను కంగారు పెట్టడం ఎందుకులే అని ఊరుకున్నా!” అంటూ అసలు విషయం చెప్పింది పూజ.
శృతి కంతా అయోమయంగా అనిపించింది. “ఏదో సరదాగా ఓ మాటంటే, ఇదేంటీ ఏకంగా ఇంత పెద్ద కథ వినిపిస్తుందీ పూజ..” అనుకుని నమ్మలేనట్టు చూస్తోంది. మళ్ళీ పూజ చెప్పడం కొనసాగించింది.
“అన్నట్టు, ఆ బైకు మీద తిరుగుతున్న తింగరోడికి ఓ పేరుంది, మనోహర్. మన కాలేజీకి వెళ్ళే దార్లో ‘కే-నెట్’ అని ఓ ఇంటర్నెట్ సెంటరుంది కదా. ఆ సెంటరు ఓనరే యీ మనోహర్. అసలు నెట్ సెంటర్ పెట్టాడంటేనే ఏ పనీ పాటా లేని యోగ్యుడైన యువకుడని అర్ధం కదా! పైగా యీ మనోహర్ ఆ షాపు లోపల కన్నా బయటే ఎక్కువసేపు కూర్చుని మన కాలేజీ రోడ్డులో వచ్చి పోయేవాళ్ళని చూస్తూ కాలం గడుపుతూ ఉంటాడన్నమాట!
అలా ఓ రోజు సాయంత్రం పనేమీ లేక ఆ నెట్ సెంటర్ ముందు ఫ్రెండ్స్ తోకూర్చుని మిరపకాయ బజ్జీలు తింటున్నప్పుడు నిన్ను చూశాడట. అప్పటిదాకా కారంగా అనిపించిన మిరపకాయ బజ్జీలు కాస్తా ఉన్నట్టుండి  మైసూరుపాకులా తియ్యగా రుచించాయట. అదీ మనోహర్ ఒక్కడికే!
ఇంకేముందీ! ఇంత వింతా, విడ్డూరం జరిగిందంటే, ఇది అదేనని తేల్చారట సదరు మనోహర్ మరియు పక్కనున్న చెంచా బృందం.. అదే మిత్ర బృందం. అంతే, అప్పటిదాకా పనీ పాటా లేని మనోహరుడికి ఆ శుభ ముహూర్తం నుంచి ఇహ చేతి నిండా పనే పని!
ఎంతో కష్టపడి ఆ బైకుని సైకిల్లా నడపగలిగిన నైపుణ్యమున్న ఓ బైకుసారథిని పెట్టుకుని రోజుకి నాలుగుసార్లు నీ వెనకాల తిరుగుతూ నీ కళ్ళల్లో పడటం కోసం మహా ఇదైపోతున్నాడు. ప్చ్.. పాపం! ఇప్పుడర్థమయిందా నీ పేరు మీద వెబ్సైటు ఎందుకు వెలిసిందో!
టూకీగా ఇదన్నమాట.. నీ ప్రేమ కోసం మొహం వాచిపోయున్న ఆ బైకుదాసు కథా కమామీషు!” అంటూ నిట్టూర్చింది పూజ.

ఇంతలో నిశాంత్ కలగజేసుకుంటూ “శృతీ! పూజ ఇలా వెటకారంగా చెప్తోంది గానీ, మనోహర్ నిజంగా చాలా బుద్ధిమంతుడు. నిన్ను చాలా నిజాయితీగా ప్రేమిస్తున్నాడు. యీ పది రోజుల్లోనే వాడు నీ గురించిన అన్నీ వివరాలు తెలుసుకున్నాడు తెలుసా! డబ్బు, హోదా, కులం లాంటి పట్టింపులేం లేకుండా నిన్ను ఎంత ఇదిగా ప్రేమిస్తున్నాడో తెలుసా!” అంటూ ఇంకా ఏదో చెపుదామని మాటల కోసం వెతుక్కుంటూ ఓ క్షణం ఆగాడు.
వెంటనే పూజ అందుకుని “అవునే శృతీ.. పాపం ఆ మనోహర్ నిన్ను ఘోరాతి ఘోరంగా, దీనాతి దీనంగా ప్రేమిస్తున్నాడు. ఎప్పుడూ ఏ పనీ పాటా లేకుండా తిరిగేవాడు కాస్తా ఇప్పుడు పొద్దున్నే కాలేజీ టైమయ్యేసరికి ఎంచక్కా ‘మనోహర్ మంచి బాలుడు’ అన్న టైపులో పక్క పాపిట తీసి క్రాఫు నున్నగా దువ్వుకుని, మొహానికి బాగా పౌడరు దట్టించి, నోట్లో వేలేసుకుని ఆ నెట్ సెంటర్ ముందు కూర్చుని నీ కోసం పడిగాపులు కాస్తున్నాడు. ప్చ్ ప్చ్.. పాపం ఎంత ఘాటు ప్రేమయో!” అంటూ అల్లరిగా చెప్పింది.
పూజ వెటకారంగా అన్న మాటలకి నిశాంత్ ఉడుక్కుంటూ ఏదో అనబోతుండగా శృతి వాళ్ళిద్దరినీ వారించి “ఆగండాగండి..

ముందు నేనడిగిన వాటికి సమాధానం చెప్పండి. ఆ తరవాత తీరిగ్గా మీరిద్దరూ పోట్లాడుకోవచ్చు” అంది.
“అసలు యీ బైకుదాసు ప్రేమ గురించి మీ ఇద్దరికీ ఎలా తెలిసింది. ముందది చెప్పండి” అని వాళ్ళిద్దరినీ నిలదీసింది శృతి.
“ఇంకెలా తెలుస్తుంది? ఓ వారం క్రితం యీ నిశాంత్ గాడే వచ్చి చెప్పాడు. ఉట్టినే చెప్పడం కాదు, ఆ మనోహర్ అప్లికేషను నీకు గట్టిగా రికమెండ్ చేయమని కూడా అన్నాడు. నేనా పని చేయలేదని ఇవ్వాళ నేరుగా వాడే దిగబడ్డాడు తానే స్వయంగా వ్యవహారం చక్కబెట్టడానికి” చెప్పింది పూజ.

ఇంతలో నిశాంత్ ఆవేశంగా “హే శృతీ.. నువ్వే చెప్పు. ఇందులో తప్పేం ఉంది. మనోహర్ నిన్ను నిజాయితీగా, మనస్ఫూర్తిగా…” అంటూ ఏదో చెప్పబోతుండగా శృతి మధ్యలోనే ఆపేసి “అదేలే.. మనస్ఫూర్తిగా, కడుపు నిండుగా.. ఇలా రకరకాలుగా మహా బీభత్సంగా ప్రేమించేస్తున్నాడంటావ్. అంతేగా! సరే సరే.. నాకు ఆ విషయం అర్థమయ్యింది. అందులో ఏం తప్పు లేదు కానీ, నేను కూడా ఆ అబ్బాయిని ప్రేమించాలిగా మరి! నాకలాంటి ఉద్దేశ్యాలేమీ లేవు. అవునూ.. ఇదంతా సరే గానీ అసలు నీకూ, ఆ అబ్బాయికీ ఎలా పరిచయం?’ అని అడిగింది.
వెంటనే పూజ ఉత్సాహంగా “దీనికి సమాధానం నేను చెప్తా నేను చెప్తా!” అంటూ గొడవ చేసింది.
“నిశాంత్ ని అడుగుతుంటే నువ్వు హడావుడి పడిపోతావేంటే..” అని శృతి విసుక్కోబోతుండగా పూజ బుంగమూతి పెట్టి “మరేమో నేను బజర్ రౌండ్ అనుకున్నాలే! అందుకే నేను చెప్తా నేను చెప్తా అని ముందుగా అరిచా..” అనగానే శృతి మోహంలో విసుగంతా పోయి నవ్వుతూ పూజ తలపై ఓ మొట్టికాయ వేసి “సరే నువ్వే చెప్పు” అంది.
“క్రీస్తు పూర్వం ఆ మనోహర్ ఇంటర్ మూడో సంవత్సరం చదూకునే రోజుల్లో క్లాస్మేట్ అయిన ఓ అబ్బాయి అన్నయ్య వాళ్ళ ఫ్రెండుకి మన నిశాంత్ వాళ్ళ డిగ్రీ క్లాస్మేటు ఒకడు ఫ్రెండు. ఆ మనోహర్ బ్యాచ్ నీ గురించి చేసిన పరిశోధనలో మన నిశాంత్ గురించి తెల్సుకుని, వెంటనే వీడిని తమ ప్రాణస్నేహితుడుగా మార్చుకుని ఇలా ‘నిశాంత రాయబారం’ నడిపిస్తున్నారన్నమాట!” అంటూ నవ్వుతూ చెప్పింది పూజ.
“అబ్బో.. అయితే నాగార్జునా సిమెంట్ లాగా చాలా ధృడమైన స్నేహబంధమేనన్నమాట వీళ్ళది. సర్లే నిశాంత్.. నాకలాంటి అభిప్రాయమేమీ లేదని మీ ఫ్రెండుకి చెప్పెయ్యి..సరేనా!’ అంది శృతి నిశాంత్ వంక చూస్తూ.
అది విన్న నిశాంత్ మొహం వేళ్ళాడేస్కుని “ఏంటి శృతీ అలా అనేశావ్! మా వాడిని చూసి ఓ నాలుగైదు సార్లు నవ్వావంట కూడా కదా! ఇప్పుడేంటి అలా ‘నో’ అని తేల్చిపారేసావ్?” అన్నాడు.
నిశాంత్ మాటలకి శృతి “నేనా.. ఆ అబ్బాయిని చూసి నవ్వానా.. అదీ నాలుగైదు సార్లు.. ఎప్పుడు, ఎక్కడ!? అసలు ఆ అబ్బాయిని చూడ్డం ఇవ్వాళే మొదటిసారి నేను” అంటూ ఆశ్చర్యపోయింది.

మళ్ళీ పూజ అందుకుంది. “మళ్ళీ బజర్ రౌండ్.. నేను చెప్తాను. మరేమో నువ్వొకసారి మన వీధి మూలనున్న పెద్ద చెత్తకుండీలో చెత్త పడేస్తూ అటువైపుగా వచ్చిన మనోహర్ వంక ‘చెత్త చూపులు’ చూశావ్! మరోసారేమో, మన కాలేజీ దగ్గరున్న సాయిబాబా గుడిలో ప్రసాదం తీస్కుంటూ మనోహర్ కేసి చూస్తూ ‘దద్దోజనం నవ్వు’ నవ్వావ్! అదే గుడిలో మరోసారి కొబ్బరి చిప్ప పగలగొడుతూ ‘చిప్ప చూపులు’ చూశావ్! ఇంకోసారేమో కాలేజీ రోడ్డులో చాక్లెట్ తింటూ నడుస్తూ ‘చాక్లెట్ చూపులు’ చూశావ్! అంతెందుకు.. ఇందాక ఇంట్లోకొచ్చేప్పుడు నువ్వు చెప్పులు విప్పుతూ రోడ్ మీద బైకు పైన వెళ్తున్నమనోహర్ ని చూసి ‘చెప్పు నవ్వులు’ నవ్వలేదూ! చెప్పు శృతీ చెప్పు.. యీ నానా రకాల చూపులూ, నవ్వులూ నువ్వు మనోహర్ పైన విసిరావా లేదా.. నీ గుండె మీద చెయ్యేసుకుని ఆత్మసాక్షిగా నిజం చెప్పు శృతీ!’ అంటూ ఆవేశం అభినయించింది పూజ.
“కాస్త వెటకారంగా చెప్పినా సరే, పూజ చెప్పింది నిజమే కదా! ఆయా సందర్భాల్లో నువ్వు మనోహర్ వంక చూడ్డం, నవ్వడం నిజం కాదా?” అన్నాడు నిశాంత్.
దానికి సమాధానంగా శృతి రెండు చేతులు జోడించి “అయ్యా, అమ్మా! యీ గోలంతా నాకస్సలు అర్ధం కావట్లేదు. నేనెవరివైపూ చూస్తూ చిప్ప చూపులూ, చెప్పు నవ్వులూ రువ్వలేదు. నేనేదో యథాలాపంగా చూసినప్పుడు ఆ అబ్బాయి అక్కడుంటే, నేను అతన్ని చూసి నవ్వినట్టేనా? ఆ అబ్బాయి అలా అనేస్కుంటే నాకేమీ సంబంధం లేదు. అయినా, ఇప్పటినుంచి రోడ్డు మీద అసలు తలెత్తకుండా నడుస్తాను. సరేనా! ఇదిగో నిశాంత్.. నేను గట్టిగా చెప్తున్నా! నాకిలాంటి వ్యవహారాల్లో అస్సలు ఆసక్తి లేదు. యీ సంగతి నువ్వెళ్ళి అర్జెంటుగా మీ స్నేహితుడికి చెప్పెయ్యి. యీ కథకి ఇక్కడితో మంగళం పాడేస్తున్నా. అంతే ఇంక.. జైహింద్!” అంటూ వాళ్ళిద్దరి నోళ్ళూ మూయించేసింది శృతి.

**********

కానీ, కథ అక్కడితో సమాప్తం కాలేదు. ఇన్ని రోజులు శృతికి నా ప్రేమ విషయం తెలియకపోయినా, ఇప్పటికైనా తెలిసిందని రూఢీ అయింది కాబట్టి, ఎలాగైనా సరే శృతిని మెప్పించాలని నానా పాట్లు పడటం మొదలెట్టాడు మనోహర్.

ఓ రోజు పొద్దున పూట శృతి, పూజ ఇద్దరు కాలేజీకి వెళ్తుంటే “శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి. దృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి ..” అంటూ చక్కటి పాట వినిపిస్తోంది.
అది విని ఆశ్చర్యపోతూ “అదేంటే పూజా.. మన కాలేజీ రోడ్డులో ఎప్పుడూ ఏ భాషో కూడా కనిపెట్టలేని పాటలు వినిపిస్తుంటాయి కదా! అలాంటిది ఉన్నట్టుండి ఇంత శ్రావ్యమైన సంగీతం మీద గాలి మళ్లిందేంటి జనాలకి” అడిగింది శృతి.
దానికి సమాధానంగా పూజ నవ్వుతూ “సంగీతం మీద శ్రద్ధా, గాడిద గుడ్డా.. అదంతా నీ మీద ఆ బైకుదాసుడు కురిపిస్తున్న ప్రేమధార! మళ్ళీ ఒకసారి విను ఆ పాట. నీకే అర్థమవుతుంది. ఆ పాట వాళ్ళ నెట్ సెంటర్ నుంచే వినిపిస్తోంది గమనించావా? ఇలాంటి పాటలు వినిపించేస్తే నువ్వు మురిసి ముక్కలైపోయి అతగాడ్ని ప్రేమించేస్తావని ఆ చెంచా బృందంలో ఎవరో బడుద్దాయి ఉపదేశించి ఉంటాడు. దాని ఫలితమే ఇది” అంది.
ఆ తరవాత వరసగా నాల్రోజుల పాటు శృతి కాలేజీ రోడ్డులో కనిపించినప్పుడల్లా అదే పాటని ముప్పూటలా వినిపిస్తూ వాయగొట్టేశారు.

ఒక రోజు నిశాంత్ కలిస్తే పూజ అడిగింది. “ఏంట్రా నిశాంత్.. మీ ఫ్రెండ్ మనోహర్ తనకెలాగూ శృతిని శృతి చెయ్యడం చేతకావట్లేదని జ్ఞానోదయం అవ్వడం చేత మనసు మార్చుకుని ఎవరో భారతి అని ఓ కొత్తమ్మాయి వెంట పడుతున్నాడటగా! ఆ అమ్మాయి కనపడ్డప్పుడల్లా ‘భారతీ..’ అంటూ ఏవో పాటలు కూడా వినిపిస్తున్నారటగా! మా క్లాస్మేట్ ఒకబ్బాయి చెప్పాడులే” అంటూ ఆట పట్టించింది.
ఆఘమేఘాల మీద యీ వార్త మనోహర్ కి చేరిపోయింది. ఆ దెబ్బకి ఇంక పాటలు వినిపించే ప్రోగ్రాం మానుకున్నారు. “హమ్మయ్యా.. ఒక హింస తప్పింద”ని ఊపిరి పీల్చుకుంది శృతి.

ఆ తరువాత మరో నాల్రోజులకి ఓ సాయంత్రం పూట శృతి, పూజ కలిసి గుడికి బయలుదేరారు. మనోహర్ నెట్ సెంటర్ ముందు నుంచే ఆ గుడికి వెళ్ళాలి. అప్పుడే పూజ అంది “ఇంకాసేపట్లో నీ బైకుదాసుడు గుళ్ళో ప్రత్యక్షం అవుతాడు చూడు” అని.
పూజ అన్నమాటని నిజం చేస్తూ వీళ్ళిద్దరూ గుడికెళ్ళిన కాసేపటికి మనోహర్ బృందం ప్రత్యక్షమయ్యారు గుళ్ళో. దేవుడి దర్శనం చేస్కుని గుడి ప్రాంగణంలో ఆరుబయటకొచ్చి కూర్చున్నారు శృతి, పూజ. వాళ్లకి మాటలు వినపడేంత దూరంలో మనోహర్ వాళ్ళున్నారు.
“మనోహర్.. మనోహర్.. అరే మనోహర్.. నిన్నేరా! ఏంట్రా ఎంత పిలిచినా పలకవు. అంత దీక్షగా ఎవర్ని చూస్తున్నావురా?” అని ఒకడంటే, “అరే.. అసలు మన మనోహర్ కి ఎంత దైవభక్తిరా.. ప్రతీ రోజూ దేవుడికి పూజ చేయకుండా కనీసం పచ్చి కోక్ అయినా ముట్టడు” అని మరొకడు. “అరే మనోహర్.. నీ డ్రెస్ చాలా బాగుందిరా.. మొన్న మీ అన్నయ్య ఫారిన్ నుంచి వచ్చినప్పుడు తెచ్చాడు కదూ..అయినా మీకేంట్రా లక్షాధికారులు”, “అరే మనోహర్ మొన్నొకరోజు మనిద్దరం మాట్లాడుతుంటే మా క్లాస్ అమ్మాయిలు చూసారట. ఆ రోజు నుంచీ ఒకటే గొడవరా బాబూ నీ వివరాలు చెప్పమని” అంటూ ఆ చెంచా బృందమంతా పలువిధాలుగా ‘మనోహర్ సకల గుణాభిరాముడు.. కావున ఆలసించిన ఆశాభంగం’ అన్నట్టుగా ఊదరగొట్టేస్తున్నారు.

“వీళ్ళెక్కడ దొరికారే బాబూ మన ప్రాణానికి.. గుడికొస్తే ప్రశాంతంగా కూర్చోనీకుండా విష్ణుసహస్రనామ పారాయణంలాగా యీ మనోహర్ భజనేంటీ..” విసుక్కుంది శృతి.
“వీళ్ళకి ఇవ్వాళ పైత్యం మరీ ప్రకోపించినట్టుంది. పోనీ, నేవెళ్ళి నాలుగు ఝాడించేసి రానా?” ఆవేశంగా అంది పూజ.
“వద్దులే పూజా! ఆ అబ్బాయి నేరుగా మన జోలికి రాలేదు కదా ఇప్పటిదాకా. మనం అనవసరంగా కల్పించుకోడం ఎందుకు. మనం ఇంటికెళ్ళిపోదాం” అని వారించింది శృతి.

 

********

ఆ తరవాత అడపాదడపా మనోహర్ బృందం అక్కడక్కడా ఇలాంటి భజనలు చేస్తూనే ఉన్నారు. ఏవో పరీక్షల హడావిడిలో శృతి, పూజ ఇద్దరూ బాగా బిజీ అయిపోయి యీ మనోహర్ విషయం తాత్కాలికంగా మర్చిపోయారు.
పరీక్షలైపోయాక పండుగ కోసమని ఊరెళ్ళిన శృతి, పూజ ఓ వారం రోజుల సెలవుల తర్వాత తిరిగొచ్చారు. ఆ మరుసటి రోజు ఇద్దరూ కలిసి కాలేజీకి  వెళుతుంటే దోవలో మనోహర్ మిత్ర బృందం కనిపించింది.
వాళ్ళని చూడగానే “మళ్ళీ మొదలయ్యాయే బాబూ.. నీ బైకుదాసుడి ప్రేమలీలలు” అంటూ నిట్టూర్చింది పూజ. “హబ్బా.. మళ్ళీ తప్పదు కాబోలు మనకీ వాయింపు..” అంది శృతి నీరసంగా!
కానీ చిత్రంగా వాళ్ళెవరూ కనీసం మనోహర్ పేరైనా ఎత్తకుండా నిశ్శబ్దంగా వీళ్ళిద్దరినీ దాటుకుని వెళ్ళిపోయారు. “ఉన్నట్టుండి వీళ్ళలో ఇంత మార్పెలా వచ్చిందా!” అని తీరిగ్గా ఆశ్చర్యపోవడం వీళ్ళిద్దరి వంతైంది.
“వారం రోజులు నువ్వు కనిపించకపోయేసరికి పాపం.. నీ మొహం మరిచిపోయి గభాల్న పోల్చుకోలేకపోయారేమోనే శృతీ!  అంతేలే మరి అలవాటు తప్పిందిగా!” అంది పూజ నవ్వుతూ.
“నువ్వు గమనించావా మనోహర్ లేడు వాళ్ళతో. అసలు కథానాయకుడు పక్కన లేడు కదా అని అలా మౌనం దాల్చారేమో పాపం యీ మిత్రబృందం!” అంటూ శృతి కూడా నవ్వింది.
తర్వాత్తర్వాత  వాళ్ళని మరింత ఆశ్చర్యపరుస్తూ స్వయంగా మనోహరే ఎదురుపడ్డా కూడా ఇన్నాళ్ళూ రెప్ప వాల్చకుండా తదేకంగా చూసిన అతను ఇప్పుడు మాత్రం శృతి ఎవరో తనకు తెలీదన్నట్టు తప్పుకుని పక్కకి తొలగిపోసాగాడు.
“కేవలం మిత్రబృందమే కాదు, హీరో గారు కూడా నీ మొహం మర్చిపోయినట్టున్నాడే!” అంటూ అల్లరి చేసింది పూజ.

అప్పటికేదో సరదాగా అలా అనుకున్నాగానీ రోజులు గడుస్తున్న కొద్దీ మనోహర్ బృందం కనబరుస్తున్న వింత ప్రవర్తన కాస్త భయపెట్టింది వాళ్ళిద్దరినీ. మనోహర్ స్నేహితులు రోడ్డు మీద ఎక్కడన్నా ఎదురుపడితే కొరకొరా కోపంగా చూస్తున్నారు. అలాగని పల్లెత్తు మాట కూడా అనట్లేదు. అకస్మాత్తుగా ఇంత మార్పుకి కారణం ఏమయ్యుంటుందా అని స్నేహితురాళ్ళిద్దరికీ అర్థం కాలేదు.

ఈ అయోమయం గురించే తరచి తరచి ఆలోచిస్తూ ఉండగా ఉన్నట్టుండి శృతికొక భయం గొలిపే ఊహ వచ్చింది. “కొంపదీసి అతన్ని ప్రేమించలేదని చెప్పి మన మీద ఏ యాసిడ్ దాడో చెయ్యాలని చూస్తున్నారేమోనే పూజా.. నాకు భయంగా ఉంది వాళ్ళంతా మనకేసి అలా తేడాగా చూస్తుంటే..” అని తన మనసులో ఉన్న భయాన్ని బయటపెట్టింది శృతి.
“నువ్వు మరీ అంత బెంబేలుపడిపోకు శృతీ.. పోనీ నీకంత అనుమానంగా ఉంటే ఎందుకైనా మంచిది.. మనం మన ప్రిన్సిపాల్ కి గానీ, మా పెదనాన్న గారికి గానీ చెప్దామా ఈ విషయం..” అంది పూజ.
“అహా.. వద్దు వద్దు.. అప్పుడు మరీ పెద్ద రచ్చయిపోతుందేమో! నిజానికి, ఆ అబ్బాయి నేరుగా వచ్చి మనతో ఎప్పుడూ ఏమీ మాట్లాడలేదుగా! ఒకవేళ నేనే ఎక్కువ ఊహించుకుని భయపడుతున్నానేమోనని కూడా చిన్న సందేహం! ఒకవేళ ఇదంతా కేవలం నా అనుమానమే అయితే అనవసరంగా ఆ అబ్బాయిని రెచ్చగొట్టినట్టు అవుతుందేమో కదా అని ఆలోచిస్తున్నా” అంది శృతి.
“అదీ నిజమేలే! అయితే ఒక పని చేద్దాం.. నేను నిశాంత్ ని రమ్మని పిలుస్తాను. ముందు ఒకసారి వాడితో మాట్లాడితే తరవాత ఏమి చెయ్యాలో మనకి స్పష్టత రావచ్చు. రేపే వాడిని రమ్మంటాను. నువ్వు మాత్రం ఇదంతా మనసులో పెట్టుకుని కంగారుపడకు. సరేనా!” అంటూ అనునయంగా శృతికి ధైర్యం చెప్పింది పూజ.

మరుసటి రోజు సాయంత్రం నిశాంత్ వచ్చాడు వాళ్ళని కలవడానికి. ముగ్గురూ కలిసి ఇంటి ముందు వసారాలో కూర్చుని కబుర్లాడుతూ ఉండగా మాటల్లో మనోహర్ ప్రస్తావన తీసుకొచ్చింది పూజ.
“ఏంట్రా నిశాంత్.. నీ ప్రాణ స్నేహితుడు మనోహర్ ఏమంటున్నాడు?” సరదాగా అడిగింది పూజ. ఆ మాట వినగానే అప్పటి దాకా నవ్వుతున్నవాడల్లా చప్పున గంభీరంగా మొహం పెట్టాడు నిశాంత్.
“ఎలాగూ శృతికిష్టం లేదని చెప్పిందిగా! ఇంకా ఎందుకు వాడి గురించి ఆరా తీయడం” అన్నాడు కించిత్ కోపంగా.
నిశాంత్ అలా అనేసరికి మరింత కంగారుగా అనిపించింది శృతికి. అది గమనించిన పూజ కళ్ళతోనే శృతికి భరోసా ఇస్తూ “ఎలాగైనా నిశాంత్ తో గట్టిగా మాట్లాడి ఈ విషయం తేల్చెయ్యాలి. లేకపోతే ఈ పిచ్చిపిల్లకి ఇంక నిద్ర కూడా పట్టదు” అనుకుంది మనసులో.
వెంటనే “అబ్బ ఛా! ఇన్నిరోజులేమో మేం వద్దు మొర్రో అన్నా చెప్పి మా బుర్ర తినేసావ్. ఇప్పుడేమో ఏదో మాటవరసకి అడిగితే అంత విసుగెందుకు బాబూ?” అంటూ గట్టిగా అడిగింది పూజ.
“సరే, అయితే చెప్తా విను. ఇంక వాడు శృతి జోలికే రాడు” అన్నాడు నిశాంత్.
“అబ్బో! అంతటి జ్ఞానోదయం అయిందా యువరాజా వారికి. పోన్లే మంచిదేగా! ఇంతకీ నువ్వేనా నాయనా యీ పుణ్యం కట్టుకుంది” అంది వెటకారంగా పూజ.
“నేనేం చెప్పలేదు. పాపం అంత దీనంగా అన్ని రోజులు శృతి వెంట తిరిగినా తను పట్టించుకోలేదని వాడంతట వాడికే జ్ఞానోదయమయ్యింది. అందుకే అలా మారిపోయాడు” అని చెప్పుకుపోతున్నాడు నిశాంత్.

అంతలో రోడ్డు మీద వెళ్తున్న కుర్రాడెవరో నిశాంత్ ని చూసి ఆగిపోయి “అరే నిశాంత్.. రేపొద్దున వస్తున్నావుగా! మనమే దగ్గరుండి ఏర్పాట్లన్నీ చూస్కోవాలి. అన్నీ అనుకున్నట్టు సరిగ్గా జరక్కపోతే మనోహర్ గాడు ఊరుకోడు.

ఎనిమిదింటికల్లా వచ్చేసెయ్” అంటూ రోడ్డు మీద నుంచే అరిచి చెప్పి వెళ్లిపోయాడు.
అది చూసాక పూజ చాలా కోపంగా “ఈ మనోహర్ ఆ బైకుదాసుడేగా! అయినా నాకు తెలీకడుగుతాను.. నువ్వు అంత దగ్గరుండి మరీ విరగబడి ఏర్పాట్లు చేసేంత రాచకార్యాలేమిట్రా నీకు వాళ్ళతో? నేను పెదనాన్న గారికి చెప్తానుండు. నువ్విలా పనికిమాలిన వాళ్ళతో కలిసి వెధవ వేషాలు వేస్తూ తిరుగుతున్నావని” అంటూ గట్టిగా బెదిరించింది.
వెంటనే నిశాంత్ రెండు చేతులూ జోడించి “అమ్మా పూజమ్మ తల్లీ! నీకో దండం. నీకు పుణ్యం ఉంటుంది.. అంత పని మాత్రం చెయ్యకు మాతా! నిజం చెప్పేస్తానుగా! రేపు ఉదయం మనోహర్ గాడి నిశ్చితార్ధం. ఆ ఏర్పాట్ల గురించే వాడు వాగింది. ఇంకో రెండు వారాల్లో మనోహర్ పెళ్లి. అదీ సంగతి! అంతేగానీ వేరే ఏం కాదు. నన్ను మాత్రం ఇంట్లో ఇరికించకు” అంటూ కాళ్ళ బేరానికొచ్చాడు నిశాంత్.

నిశాంత్ మాటలు విని నమ్మలేనట్టు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు శృతి, పూజ ఇద్దరూ.
వెంటనే తేరుకుని “హమ్మ నిశాంత్.. ఇన్ని రోజులూ ఎన్ని మాయ మాటలు చెప్పావు! మరి నిజాయితీగా, మనస్ఫూర్తిగా, కడుపు నిండుగా నన్నే ప్రేమించేస్తున్నాడన్నావ్! అన్నీ అబద్దాలు చెప్పావు కదా మాకు” నిలదీసింది శృతి.
“బాబోయ్ తల్లుల్లారా.. నిజం చెప్తున్నాను. నన్ను నమ్మండి. అప్పుడలాగే చెప్పాడు వాడు. ఎన్ని రోజులైనా నువ్వు తన వైపు చూడట్లేదని ఇంక వాళ్ళింట్లో వాళ్ళు చూసిన అమ్మాయికి ‘ఓకే’ అనేసానని చెప్పాడు” నచ్చజెప్తున్నట్టుగా అన్నాడు నిశాంత్.
“ఏంటీ! యీ కొన్ని రోజుల్లోనే, అదీ అసలు శృతి తో నేరుగా కనీసం ఒక్క ముక్కయినా మాట్లాడకుండానే అంత జీవిత సత్యం తెలిసిపోయిందంటనా ఆ అపర ప్రేమికుడికి!” దెప్పిపొడిచింది పూజ.
కాసేపు శృతి, పూజ ఇద్దరూ కలిసి కాసేపు నిశాంత్ కేసి తినేసేలా చూసి అంతలోనే పడీ పడీ నవ్వసాగారు. నిశాంత్ కి వాళ్ళెందుకు అంతలా నవ్వుతున్నారో అర్థం కాక బిత్తరచూపులు చూస్తూ ఉండిపోయాడు.
వీళ్ళిలా నవ్వుల్లో మునిగి ఉండగానే బయటపడడం ఉత్తమం, మళ్ళీ వాళ్ళ మూడ్ మారిపోతే తనని ఎక్కడ ఉతికేస్తారోనని బెదిరిపోయి అక్కడ నుంచి చల్లగా జారుకున్నాడు నిశాంత్.

“హమ్మయ్యా.. ఏదయితేనేం ఓ పెద్ద హింస తప్పిపోయింది మన ప్రాణానికి. ఇకమీదట పాటల పైత్యం, వెర్రి మొర్రి భజనలూ వినే దుస్థితి తప్పింది. ఇంక హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు” అంటూ ఇంకా నవ్వుతూనే ఉంది శృతి.
ఉన్నట్టుండి చప్పున నవ్వడం ఆపేసింది శృతి. ” పోనీలే పూజా.. ఇక నుంచి అతన్ని హేళన చెయ్యొద్దు మనం. నిన్న మనం అనుమానించినట్టు అతన్ని ప్రేమించలేదన్న కోపంతో మన పట్ల దురుసుగా ఏమీ ప్రవర్తించలేదు కదా పాపం! ఇష్టపడ్డాను అన్నాడు.. కాదనేసరికి బుద్ధిగా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. ప్రేమించకపోతే మేము చస్తాం లేదా మిమ్మల్ని చంపుతాం అంటూ చిత్రవధ చేసే ప్రేమికుల కంటే ఈ మనోహర్ లాంటి వాళ్ళు కోటి రెట్లు నయం. ఇన్నాళ్ళూ విసుక్కున్నా ఇప్పుడు మాత్రం ఆ అబ్బాయి మీద నాకు గౌరవం కలుగుతోంది ఈ విషయాన్ని ఇంత తేలిగ్గా తీసుకున్నందుకు. అలాంటి వాళ్ళ గురించి మనం నవ్వుకోడం మన సంస్కారాన్ని ప్రశ్నిస్తున్నట్టు ఉంటుందేమో!” ఏదో ఆలోచనల్లోంచి మాట్లాడుతున్నట్టు భారంగా అంది శృతి.
“అది సరే శృతీ!  కానీ, నా బాధల్లా ఏంటంటే.. ఇక మీదట ‘ఎంత ఘాటు ప్రేమయో.. ఎంత తీవ్ర పైత్యమో..’ అని మనం పాడుకుని మురిసిపోయే అవకాశం తప్పిపోయింది కదా అని విచారిస్తున్నా ప్చ్..!” అంటూ విచారం అభినయిస్తూ వాతావరణం తేలికపరిచే ప్రయత్నం చేసింది పూజ.
“అబ్బబ్బా.. పూజా.. నీ అల్లరికి హద్దూ అయిపూ లేకుండా పోతోంది ఈ మధ్య!” అంటూ తేలిగ్గా నవ్వేస్తూ స్నేహితురాలిని మురిపెంగా విసుక్కుంది శృతి.

18 thoughts on “ఎంత ఘాటు ప్రేమయో!

  1. అతను శుభ్రంగా పెళ్ళి చేసుకోవడం నాకు నచ్చిందండీ..ముగింపు హాయిగా వుంది.దేవదాసూ కాలేదు..యాసిడు బాటిలూ పట్టలేదూ..పోనీలేండి ఇలాంటి కథలవల్లనైనా అమ్మాయిలకి కాస్త రిలీఫ్ దొరుకుతుంది ఈ ప్రేమదాసులనుంచి..
    బావుంది..గోఎహెడ్..

  2. madhu bagundi .. kadha funny 🙂 gaa

    haayiga chandamama chadivinattu .. ekkada acid poyinchestavo ani tension vacchindi

  3. కొంచెం బోరు కొట్టిందండి కథ పూర్తిగా చదవలేకపొయాను

  4. @ కుమార్ గారూ, లలిత గారూ..
    నేను రాసింది చదివాక మీకేమనిపించిందో అది చెప్పారు అంతే కదా.. ఇంత మాత్రానికే తిట్టేసుకుంటానా చెప్పండి! నిజానికి నా రాతలు చదవడానికే కాకుండా మీ అభిప్రాయాలను, సలహాలని తెలియజేయడానికి కూడా మీ విలువైన సమయం వెచ్చించినందుకు ఆనందంగా అనిపిస్తుందండీ.. తప్పకుండా మీరు చెప్పిన సూచనల గురించి ఆలోచిస్తాను. Thank you for your feedback! 😀

  5. @ బులుసు గారూ,
    అంతేనా.. మీరు అబ్బాయిలకే సపోర్ట్ చేస్తానంటారా అయితే. మేము దీన్ని ఖండిస్తున్నాం అధ్యక్షా!
    తియ్యటి మీ చక్రపొంగలి నవ్వుకి మాత్రం బోల్డన్ని ధన్యవాదాలు.. 😀

    @ శ్రావ్యా జీ,
    థాంక్యూ! ఇంతకీ ఆ ట్రేడ్ మార్క్ డైలాగ్ ఏవిటా అని మొన్నటి నుంచి బుర్ర బద్దలు కొట్టుకుంటున్నా వెలగలేదు..:( మీరే చెప్పెయ్యండి అదేంటో!

  6. @ శైలబాల,
    ధన్యవాదాలు! 🙂

    @ మంచు,
    బాబోయ్.. అంత వీజీగా నన్ను గొడవల్లోకి లాగేద్దామనేనా మీ ప్లాన్! 😛
    అదేదో సినిమాలో బ్రాహ్మీ చెప్పినట్టు నేను క్రియేటర్ ని కదా! ఏ పాత్రలోనూ ఉండను.. జస్ట్ పాత్రల్ని సృష్టిస్తూ ఉంటానంతే! 😉

  7. @ బద్రి,
    ఓహో అలాగంటారా.. అయితే చదువు అని రాయాల్సిందేమో విద్య అనకుండా! 😉

    తొలిప్రేమలో ఆ సీన్ నాక్కూడా చాలా ఇష్టం. 🙂 అయితే, కథ ఎండింగ్ లో ఎక్కడన్నా తేడా వస్తే ఈపాటికి యుద్ధం మొదలైపోయేదంటారా? 😉

  8. కధా ప్రారంభం కొత్తగా వుండి బావుంది.
    కుమార్ గారు చెప్పినట్టూ సంభాషణలు కుదించి వ్రాస్తే ఇంకా బావుండేది
    నిజం చెప్పాలంటే నా వరకు నేనే త్వర త్వరగా కిందికి వచ్చేసాను
    మధురవాణి తిట్టినా తియ్యగానే వుంటుందనే ధైర్యంతో ……

  9. మధురవాణి గారూ,
    క్షమి౦చాలి, నేను ము౦దర వ్యాఖ్యాత లతో కొ౦చె౦ విభేదిస్తున్నాను.
    సరదాగా బానే ఉ౦ది కధ కానీ, కధలకు౦డాల్సిన ముఖ్య లక్షణ౦, రీడబిలిటీ లో, ఈ కథని మీరు ఇ౦కా ఇ౦ప్రూవ్ చేయొచ్చు అని నా అభిప్రాయ౦. ముఖ్య౦గా ఓ పాత్ర చెప్పిన డైలాగ్ కీ, మరో పాత్ర చెప్పిన డైలాగ్ కీ, ఇ౦కో లైన్ గ్యాప్ ఇస్తే బాగు౦డేదేమో.
    అలాగే ఇదే కథని చాలా డైలాగులు ఎత్తేసి, క్లుప్త౦గా కూడా చెప్పొచ్చు, అలా౦టప్పుడు పాఠకుల్లో ఆసక్తి సడలకు౦డానూ, వాళ్ళు గ్లాన్స్ చేసేసి స్క్రోల్ డౌన్ చేయకు౦డానూ ఉ౦టు౦ది.

    కథ మొదలుపెటిన తర్వాత, చాలా వరకూ డైలాగులన్నీ కూడా ప్రిడిక్టబుల్ గా ఉ౦టూ, డైలాగు వ్యాక్యాలు కలసిపోయి ఉన్నాయనుకో౦డి, పాఠకులు తొ౦దర త్౦దరగా కి౦దకి జారిపోతు౦టారు.

    ఇ౦కొన్ని చెప్పొచ్చు కానీ, ప్రస్తుతానికి౦తటితో ఆపేస్తున్నాను, లేద౦టే మీరు నన్ను తిడతారు.
    క్షమి౦చాలి, కేవల౦ పొగడ్తలు మాత్రమే కామె౦ట్లుగా పెట్టట౦ రానివాణ్ణి, సహృదయతతో స్వీకరిస్తారని ఆశిస్తూ..

  10. బావుందండి ! మంచు గారు అంత క్లియర్ గా మధుర గారి ట్రేడ్ మార్క్ డైలాగ్ ఉన్నా మధర గారి ప్లేస్ ఏది అని అడుగుతారేమి ? లేకపోతే confirm చేసుకుంటున్నారా 😀

  11. అన్నీ రకాల చూపులు చూసి రెచ్చగొట్టి, చూస్తే ఎందుకు ఛూస్తున్నాడు ఆయ్ , చూడకపోతే ఎందుకు చూడటం లేదు గయ్ మనే అంటారా? నా సానుభూతి మనోహార్ కే. పాపం పసివాడు.
    కధ సూపరు గా ఉంది. నాదో చక్రపొంగలి నవ్వు .

  12. ముగింపు వేరేగా ఉంటే గొడవలు అయిపొయేవి :-))

    భలే రాసేరు మధురగారు… చిప్ప చూపులు, దద్దోజనం నవ్వు కెవ్వు :-)) ఇంతకీ అప్పుడు మీరు శృతి ప్లేస్ లొ ఉన్నారా లేక పూజ నా :-)))

  13. ఇప్పుడే చదివా. మరీ అబ్బాయిలని అన్నేసి మాటలనాలా.Grrrrrrrr

    విద్య కోసం అర్థించడం మానేసి ఏ వింధ్యనో, సంధ్యనో అర్థిస్తూ తిరిగే అబ్బాయిలే ఎక్కువగా కనిపిస్తుంటారు//
    మరీ విద్యనే అర్థిస్తే సంధ్య వింధ్య ఫీలవ్వరేంటండీ, అందుకే సమానత్వం కోసం అందరినీ అర్థిస్తుంటారు.

    //
    వానాకాలంలో కూడా చలవ కళ్ళద్దాలు తీయకుండా, ఆ సదరు మొహాన్ని అద్దంలో చూడడం వల్ల భయంతో బిక్క చచ్చిపోయి నిటారుగా నించున్న క్రాఫుతో, ఒక చిన్న పుస్తకాన్ని ఆట వస్తువులా చేసి చేతుల్లో గిరగిరా తిప్పుకుంటూ, అమ్మాయిల మీద తప్పించి వేరెక్కడా ఏకాగ్రత నిలపలేని ప్రబుద్ధులు మరికొందరు.
    //
    సమాధానం ఇక్కడ
    http://www.youtube.com/watch?v=l0aO2ZnhojU
    1:19 నుండి చూడండి

    కాకపోతే చివర్లో మా గొప్పతనాన్ని గుర్తించారు కాబట్టి, కథ బావుంది అని ఒప్పుకుంటున్నా

Comments are closed.