April 26, 2024

ప్రథమాచార్యుడు

రచన  –  కొంపెల్ల రామకృష్ణమూర్తి.

“శ్రీవాణీ గిరిజాశ్చిరాయ” యనుచున్ శ్రీకారముం జుట్టి -వా

గ్దేవీ మంజుల కచ్ఛపీరవళి కాంధ్రీకంఠ మాధుర్యమున్

నీవే కూర్పక యుండిపోయిన మహాంధీభూత హృద్రంగమై

యేవో గాలుల తేలిపోయెడిది కాదే  తెల్గు ముమ్మాటికిన్.

 

“దేశ్యమనగ నొక్క దివ్యప్రవాహము

కదలుచుండు నద్ది కాలము వలె ”

అనుచు నాడె పలికి యాగామి  సాహిత్య

రీతి దలచినావు ఋషి సముడవు !

 

స్వస్థాన వేషభాషలయందు తులలేని

రక్తి కల్గించు సూత్రము ఘటించి,

పామర వ్యవహార భాషా మహాంభోధి

లో నున్న రత్నాలు సానబట్టి,

తత్సమ,దేశ్య,తద్భవ శబ్దములకెల్ల

అక్షర రమ్యతనందజేసి ,

గీర్వాణవాణి కంకితమైన వ్యాసర్షి

కవితాత్మ నాంధ్రలోకమున నిలిపి,

 

భారతాఖ్యము భవ్య సౌభాగ్యమొకటి

తరతరాలుగ జాతికి దక్కునట్లు

చేసినాడవు “తెల్గు ప్రాచేతసుడవు ”

శత నమస్సులు నన్నయాచార్య! నీకు.

 

 

 

1 thought on “ప్రథమాచార్యుడు

  1. మూర్తిగారూ!

    ఆదికవి నన్నయ గురించి చాలా చక్కని పద్యాలు అందించారండీ! ధన్యవాదములు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *