April 26, 2024

“మోటు ” బావి

రచన : పసుపులేటి గీత

కడుపులో బిడ్డలా
నడుం మీద బిందె
నడుమ్మీద బిందెలా
కడుపులో బిడ్డ ..
రెండింట్నీ మోసుకుంటూ
ఎక్కడ తొణికిపోతాయో,
ఎక్కడ బెణికిపోతుందో..
అడుగులో అడుగు
ఈ దూరాభారమేంటో అడుగు
ఈ దుర్భర భారమేంటో అడుగు
పాదరసపు గట్లమీద
పాల గుండెల ‘మోత’
ఎంతెంత దూరం, ఇంకా ఎంత దూరం..?
పాదాల్ని నములుతున్న కాలిబాట
మోటబావి మోటుసరసం
పారాణి ఆరని తొలినాళ్లలో నాకు కాల్లో ముల్లు విరిగితే
నా మొగుడికి కంట్లో ముల్లు విరిగేది
ముచ్చట్లు తీరిపోయి,
ముందుకు మూణ్ణెళ్లు వచ్చాయి
బోరు బోరు మంటూ నీరయ్యే
మా వీధి బోరింగుకు
గుండె బీటలు వారిపోయింది
బిడ్డకన్నా ముందు బిందే
చంకనెక్కి సవారీ చేస్తోంది
అరికాలి నుంచి నడినెత్తి వరకు
ఒళ్ళారా స్నానం చేసిన
మా ఆయన్ని చూస్తే
నా నెత్తుట్లో మునిగొచ్చిన
పిశాచాన్ని చూసినట్టుంటుంది
ఇంటిల్లిపాదికి ఆపాదమస్తకాన్ని తడిపే
మోటబావి నీళ్లు
వాళ్ల పిడికెడంత గుండెను మాత్రం
తడపలేక పోతున్నాయి
కరువొచ్చి ఊరెండిపోతే
కడుపొచ్చి ఊపిరి తీస్తోంది
ఏడడుగులు వేసినప్పటి సంతోషాన్ని
ఏడామల మోటబావి మింగేసింది
ఇంటికాడ ఇచ్చి పుచ్చుకునే వదినమ్మలందరూ
బావికాడ బద్ధ శత్రువులైపోతారు.
బావినంతా తోడి తెచ్చిపోసినా
పానకాల రాయుళ్ళాంటి గుండిగ నిండదు
బావి కక్కుర్తి కొద్దీ కని పడేసిన
కుక్క మూతి పిందెల్లాంటి నీటి అలల మీద
సిగ్గు చచ్చిన బిందెల మూకుమ్మడి దాడి
బతుకు చిల్లి బిందెలా
నీరు కారిపోతోంది
బిందె, బిందెకూ వస్తూ పోతూ
మూలబడ్డ బోరుకేసి చూసి చూసి
మూలుగుతుంటాను
మబ్బు లెండి నింగీ, నేలా నెర్రలిచ్చినా
కడుపులో నలుసు తిరగబడినా
కలపెల్లాడేది నా కంటి చెమ్మే
నెత్తురంతా ఉప్పునీరైనా, ఉమ్మనీరైనా
ఎంతకీ తీరదా ఈ నీటి కరువు.. !!
ఇంతకీ కరువైనా, కడుపైనా
కాల్చుకు తినేది నన్నేనా?
కాటి పిలుపయ్యేది నాకేనా?

2 thoughts on ““మోటు ” బావి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *