June 19, 2024

లేఖాంతరంగం – 1

 

renukaరచన: రేణుక అయోల

 

renuka1

సరళ దగ్గరనుంచి ఉత్తరం రాగానే చాలా సంతోషం అనిపించింది.

తీరిగ్గా కూర్చుని ఉత్తరం చదవడం మొదలు పెట్టాను..

ఆ గుండ్రటి అక్షరాల వెంట నా చూపులు పరుగులు తీసాయి..

 

సరోజా (అంటూ ఆప్యాయంగా పిలుస్తున్నట్లే మొదలుపెట్టింది ఉత్తరం.)

మొన్న మా మేనత్త కొడుకు  పెళ్లికి వెళ్లవలసి వచ్చింది. నీకు తెలుసుగా సుందరం అని మా ఇంటికి వచ్చేవాడు గుర్తుందా? ఎర్రగా పొడుగ్గా వుండేవాడు. మన ఇద్దరం వాడికి ఆంధ్రా అమీతాబ్ అని పేరు పెట్టాం.  వాడికే పెళ్లి కుదిరింది. ఎంత అల్లరి చిల్లరగా  ఉండేవాడో ఒకానొక దశలో. మామేనత్త బెంగ పెట్టేసుకుంది అసలు వీడు బాగుపడతాడా అని. కాని ఈ రోజు వాడో పెద్ద డాక్టరు. అమెరికా అమ్మాయిని పెళ్ళి చేసుకుంటున్నాడు.  త్వరలో అమెరికా వెళ్లిపోతాడు కూడా. అందుకే  మా మేనత్త ఎక్కడ లేని చుట్టాలని పిలిచింది పెళ్లికని.

 

కాని సరోజా ఆ పెళ్లి చూసాక ఎందుకనో నాలో చాలా అసంతృప్తి పేరుకు పోయింది.  ఎటువైపు చూసినా ఆర్భాటాలు, ఆడంబరాలు.  ఎంత ఖర్చుపెడుతున్నామా అన్నధ్యాసే గాని ఒక చక్కటి సంప్రదాయం కరువైపోయిందనిపించిందే.  పెళ్లికూతురి ముఖంలో సిగ్గు కన్నా మేకప్ పాడైపోతుందేమో అన్న ఆత్రం ఎక్కువ కనిపించింది.  తన మొహంలో సహజంగా కనిపించే సిగ్గు, అమాయకత్వం కరువై పోయాయి. వారం పదిరోజులనుంచి బ్యూటి పార్లల్ కే వెళుతోందిట.  ఆ పెళ్లి మేకప్ కోసమే కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టారుట.  అంత అవసరమా అనిపించింది నాకైతే..

 

ఇలా అన్నానుకో నన్నో పాతకాలం దానిలా చూస్తారు. సరే! ఇంతకి నేను చెప్పాలనుకున్న విషయం మరచిపోయి ఏదో రాస్తున్నాను కదూ సరోజ.  ఆ పెళ్ళిలో  ఆడపిల్ల తరపు వాళ్ల చుట్టం అనుకుంటా, ఆవిడ వాళ్లకి ఏమవుతారో తెలియదు గాని నా పక్కనే కూర్చున్నారు.  చాలా అందంగా వున్నారు దగ్గరదగ్గర యాభైఏళ్ళు ఉంటాయానుకుంటా. ఆ వయసులో కూడా చాలా అందంగా వున్నారే!  ఆవిడనే చాలా సేపటివరకు చూస్తూ కూర్చున్నాను..

 

మర్నాడు ఆవిడ ఎక్కడ కనిపించలేదు. ఎందుకోగాని ఆవిడని మరచిపోలేక పోయాను.  మా మేనత్తని అడిగాను ఆవిడఎవరని ఈ వాళ కనిపించలేదని? సరోజా!  మా మేనత్త చెప్పిన విషయం వినగానే షాక్ అయిపోయాననుకో.. ఆవిడకి ఒక్కడే కొడుకుట బెంగుళూరులో చాలా పెద్ద పోజిషన్ లో ఉన్నాడుట.

పిల్లాడు చిన్నగా ఉన్నప్పుడే ఆవిడ భర్త పోతే, ఆవిడ అందం చూసి ఎంతమంది పెళ్లి చేసుకుంటామన్నా కొడుకు కోసం అత్తగారింట్లోనే వుండిపోయి, ఉద్యోగం చేసుకుంటూ కొడుకుని పెంచి పెద్దచేసి, కొడుకు దగ్గరే వుండిపోదామని ఉద్యోగానికి  రిజైన్ చేసి వెళ్లారుట. కాని సరోజా! ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? కోడలికి ఆవిడ అందంగా వుండడం నచ్చలేదుట..

 

ఎంత తెలివిగా ఆవిడని ఆవిడదారి చూసుకునేలా చేసిందో తెలుసా? ఒకే ఒక భయంకరమైన అపవాదు వేసింది ఆ కోడలు. ఆవిడ వొంటిమీద చాలా సహజంగా వచ్చిన చిన్న ఎలర్జీని మందులతో పొతుంది కాని ఎవరితో తిరిగితే ఇలాంటి ఎలర్జీ వచ్చిందో అంటూ అపవాదు వెయ్యగానే ముందు వెనకా ఆలోచించకుండా ఆ కొడుకు కూడా సందేహం పడ్దాడుటే. అంతే ఆవిడ  ఎంత ఏడ్చిందో చెప్తుంటే మనసు వికలం అయిపోయిందంటే నమ్ము.ఇప్పుడు ఆవిడ ఒంటరిగా ఉంటోందిట.  యవ్వనం, అందం అన్నీ పోగొట్టుకుని, కన్నకొడుకు కూడా ఇది నమ్మాడా అన్న బెంగ తోడేస్తుంటే ఆవిడ అలా ఎప్పటికీ జీవచ్ఛవంలా వుండాలా? అదే మగవాడైతే వెంటనే పెళ్ళి చేసేసుకుంటాడు కదా….

 

ఈ పిల్లలకోసం ఇన్ని త్యాగాలా? అసలు ఆడవాళ్లు జీవితాంతం ఇలా ఎవరో ఒకరికోసమో బతుకంతా గడపాల్సిందేనా? ఓపక్క  మగవాళ్లతో సమానంగా వేలకి వేలు సంపాదిస్తూ, విడాకులు నిమిషాలమీద

తీసుకుని తెలివిగా తమ జీవితాన్ని చక్కదిద్దుకుంటున్నారు. మరోపక్క ఇలాంటి వాళ్లు… ఎన్నో సందేహలు తీరకపోయినా ఇలాంటి వాళ్లు తారసపడ్దప్పుడు మనసు చెదిరిపోతుంది.

 

నీ జవాబుకోసం ఎదురు చుస్తూవుంటాను నీ అభిప్రాయం కోసంకూడా….

నీ నేస్తం సరళ

 

సరళ రాసిన ఉత్తరం చదవడం అయిపోయాక కూడా,  సరళకి ఎదురైన అనుభవం గురించి చాలా సేపు ఆలోచించాను. తనకు వెంటనే సమాధానం రాయాలనిపించింది.  ఉత్తరం రాయడం మొదలు పెట్టాను…

 

 

 

 

8 thoughts on “లేఖాంతరంగం – 1

 1. అవును రేణుక ఇప్పుడు పెళ్ళిళ్ళలలో కాసుల ఆర్భాటమే తప్ప
  సామాజిక నిర్మాణాణానికి అవసరమైన ఒక పవిత్రమైన కార్యంగా భావించటం లేదు.దాని పర్యవసానం చూస్తునేవున్నాము కదా!

 2. అవును రేణుక ఇప్పుడు పెళ్ళిళ్ళలలో కాసుల ఆర్భాటమే తప్ప
  సామాజిక నిర్మాణాణానికి అవసరమైన ఒక పవిత్రమైన కార్యంగా భావించటం లేదు.దాని పర్యవసానం చూస్తునేవున్నాము కదా!

 3. అ౦అ గొప్పగా లేదు ఇ౦దులో చదవడానికి అర్థ౦ చేసుకు౦దుకు ఏమీ లేదు. కోడలికి అత్తగారి అ౦ద౦ నచ్చకపోతే ఆమె దుఖఃప్డడ౦ ఎ౦దుకు? పెళ్ళాలు వచ్చాక కొడుకులు దూర౦ అయిన వాళ్ళు చాలామ౦ది ఉ౦టున్నారు ఇ౦తకీ చెప్పొచ్చేదేమిట౦టే లేఖ గా రాసారు కాబట్టి కానీ కథ లో కొత్తదన౦ ఏమీ లేదు

  1. anonymous garau uttaralalo abhiprayalu chinanava peddada kaadu manasulO mata cheppukOvadami /spndinchi naduku dhnya vadalu…

  2. anonymous garau uttaralalo abhiprayalu chinanava peddada kaadu manasulO mata cheppukOvadami /spndinchi naduku dhnya vadalu…

 4. వాస్తవ దృశ్య రూపం కనిపించింది . రేణుక గారి కలం పదునుగా ఉంది. అభినందనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *