May 6, 2024

అండమాన్ డైరీ – 5

రచన:  దాసరి అమరేంద్ర amarendra

 

చూసిన అడవులూ, ‘తెలిసిన’ రోడ్లే గదా నిర్లిప్తంగా సాగుతోన్న వానులో కలవరం ` క్షణకాలం. రోడ్డు పక్కన ఓ జరవా జంట! మరి అందరి కన్నూ ఎలా కప్పారో తెలియదు. ఆ క్షణంలో మా వానుమేట్లు సాక్షాత్తూ తిరుపతి దేవుడూ పద్మావతీ దిగివచ్చి  కనిపించినా అంతగా సంతోషపడేవారు గాదేమో! జన్మ ధన్యమయిందన్నంత పరవశం! అతి ఉత్సాహంతో ఒకళ్ళిద్దరు కెమెరాలు సంధించబోతోంటే మిగిలిన వాళ్ళం ఆపాం. కొంత సామాజిక స్పృహవల్ల, మరికొంత భయం వల్ల..

SAM_4000 - Copy

అయిదింటికి గూటికి చేరేసరికి ప్రకాష్‌ రూపొందించిన మరో కార్యక్రమం ఎదురు చూస్తోంది. ఆ రోజు వాళ్ళ మెస్‌లో నెలసరి గెట్టుగెదరట. తంబోలా, ఇతర ఆటలు, ఓ ఓపెన్‌ ఎయిర్‌ సినిమా, స్నేహితులు కలవడాలు, కబుర్లు, మద్యపానాలు ` అదీ ఆరోజు కార్యక్రమం. అందరం అక్కడ గడుపుదామన్నది అతని అభిమతం. మరి అది మాకూ ఇష్టమయిన పనే గదా.

అంతా కలసి ఒక్కసారి గత ఐదారు రోజుల్ని సింహావలోకనం చేసుకొన్నాం. నేనూ లక్ష్మీ ఆశించిన దానికన్నా ఎక్కువ ఆనందాన్నిచ్చిందీ యాత్ర అన్నమాట నిర్వివాదం. అసలివన్నీ ప్రత్యక్షంగా చూస్తేనే తప్ప ఊహకు అందని అనుభవాలు. వేల కిలోమీటర్ల అవతల సముద్రంలో ద్వీపాలు.. ఆ ద్వీపాల్లో అడవులు.. ఆ అడవుల్లో కొండలు.. ఆ కొండల్లో ఆదిమజాతి వారు.. పగడాల దిబ్బలు.. శిలాతోరణాలు.. దీవుల మధ్య జలసంధులు.. దేశంలో ఎక్కడాలేని మట్టి ఓల్కనోలు.. బంగ్లాదేశ్‌ భారతీయులు.. విదేశీ యాత్రికులు.. జపాను బంకర్లు.. అండమాన్‌ దారు పావురాలు.. బడాబడా బస్సులను గట్టుకు చేర్చే  ఫెర్రీలు.. ‘కాలుష్యం అంటే ఏమిటీ?’ అని అడిగే గాలి.. నగరాల కంటికి కనిపించని అనేకానేక నక్షత్రాలు.. అందం.. అమాయకత్వం.. సరళమైన జీవసరళి.. ఆ సరళికి కష్టం నష్టం కలిగించని పద్ధతిలో సాగిపోతోన్న పర్యాటనలు.. పెరిగిన పర్యావరణ స్పృహ పుణ్యమా అని అడవుల్ని కబళించని పర్యాటక పరిశ్రమ..

అదీ అండమాన్‌ ` అదే అండమాన్‌

(అప్పుడేనా భారతవాక్యం!! ఇంకా పదిరోజులు ముందున్నాయి!!)

 

* * * * *

 

మార్చి పది. మేం పచ్చల ద్వీపాలు చేరి ఆరు రోజులు గడిచిపోయాయి.

‘బయట’ ప్రయాణాలు ముగిసాయి.  రేపు పదకొండు ఉదయం లక్ష్మి ఫ్లైటు.

మొదటి రోజు సాయంత్రం ఊళ్ళో తిరిగామే గానీ ` ఊరును పూర్తిగా పరిశీలించింది లేదు. పైగా చూడదగ్గ పోర్ట్‌ బ్లెయిర్‌ విశేషాలు ఇంకా మిగిలేఉన్నాయి.

‘‘ఉదయం పదిగంటల ప్రాంతంలో బయల్దేరితే ముఖ్యమైన ప్రదేశాలు తీరిగ్గా చూసుకొని మళ్ళా నాలుగింటికి ఇంటికి చేరవచ్చు’’, రాత్రి ప్రకాష్‌ సలహా..

‘ఏవేమి మిగిలాయీ!’ నా ప్రశ్న.

‘‘ఛాటమ్‌ ఐలెండ్‌లో పాతకాలం నుంచీ నడుస్తోన్న ఓ రంపపు మిల్లు ఉంది. అందులోనే అడవులకు సంబంధించిన మ్యూజియం ఉంది. అదోగంట. సముద్రిక అంటూ మెరైన్‌ లైఫ్‌కు సంబంధించి మా నావీ వాళ్ళే నడుపుతోన్న మరో మంచి మ్యూజియం ఉంది. ఈ రెండూ కాక ఆంథ్రపోలజీకి చెందిన మరో మ్యూజియం పట్నం నడిబొడ్డున ఉంది. సరే సాగరిక అనే కాటేజి ఎంపోరియం ఎలానూ ఉంది..’’ వివరించాడు ప్రకాష్‌.

ఎలాగూ బయటపడేది ఎప్పుడో పదింటికి కాబట్టి, ఉదయం అయిదున్నర అయితే నాకు పర్యాటక ప్రదేశాల్లో కాలు నిలువదు గాబట్టి ` పొద్దున్నే రూంలోంచి కెమేరాతో బయటపడ్డాను. కాలనీ అంతా తిరిగి రావాలనీ, ఎత్తు పల్లాలూ, రోడ్ల పొడవు వెడల్పులూ క్షుణ్ణంగా కొలవాలనీ, ముందూ వెనుకా కూడా కనిపించి కవ్విస్తోన్న సాగర జలాలను ఫోటోల్లో బంధించాలనీ ` ప్లాను. ఓ గంటన్నర అందులో.

                                          SAM_4077 - Copy

                తొమ్మిదికల్లా ప్రకాష్‌ వాళ్ళ ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్‌ భేటీ. సరదాగా, నవ్వులూ కబుర్లూ ఛలోక్తులతో ` ఓ గంట. తనకారూ, తనకు బాగా పరిచయం ఉన్న ఓ డ్రైవరూ ఏర్పాటు  చేసాడు ప్రకాష్‌. ఎక్కడెక్కడికి తీసుకువెళ్ళాలో టూకీగా వివరించాడు. ఆ నడివయసు డ్రైవరు అనుభవజ్ఞుడు. మర్యాదస్తుడు. తెలుగు వచ్చిన తమిళుడు. కలుపుగోరు మనిషి ` మరిహ కావలసిందేముందీ!!

మొదటి మజిలీ ఛాటమ్‌ సామిల్లు. గవర్నమెంటు వారి మిల్లు ఇది.

ఆసియా ఖండపు ప్రాచీన సామిల్లులలో ఇది ఒకటట. 1883లో స్థాపించారు. పెద్ద పెద్ద దుంగల్ని అవలీలగా కోసి పలకలు చేసే బడాబడా మిషీన్లు. ఇక్కడ కోసిన కలప పలకలు ఇంగ్లండు రాణిగారి నివాసం దాకా వెళ్ళాయట. రోజూ వచ్చే యాత్రికులకు అన్నీ వివరంగా చూపించి వివరించే ఏర్పాట్లు.. మాతోపాటే మొన్న నీల్‌ ద్వీపం నుంచి ప్రయాణం  చేసిన ఓ బెంగాలీ కుటుంబంతో కలసి మిల్లంతా చూడడం.. మిల్లు ప్రాంగణం నుంచి కనిపించి ఆకట్టుకొనే సాగర దృశ్యాలు.. అలాంటి కలప ఫ్యాక్టరీలను చూడగలగడం ` అదో అనుభవం. పరిజ్ఞానం.

SAM_4038 - Copy

ఆ మిల్లు ఆవరణలోనే ఫారెస్టు డిపార్టుమెంటు వారు నడుపుతోన్న అతి చక్కని మ్యూజియం ఉంది. అండమాన్లలో  దొరికే వివిధ రకాల కలపల నమూనాలు, వాటి వాటి వివరాలు.. చెక్కతో చేసిన అతి చక్కని శిల్పాలు.. వాటన్నిటినీ అందంగా అమర్చిన విధానం ` ఆ విహంగ వీక్షణం ఓ అరగంట.. ఆ ప్రాంగణంలో తిరుగాడు తోంటే ఆరుబయట ఓ స్థూపం.. ఏవిటా అనిచూస్తే వివరాలు ` ‘ఇక్కడికే నూట ఏభై సంవత్సరాల  క్రితం ప్రధమ స్వాతంత్య్ర సంగ్రామ యోధుల్లో మొదటి బృందానికి చెందిన రెండు వందల మందిని తీసుకురావడం జరిగింది. వారి రాక ఈ ద్వీపాలలో బయట ప్రపంచం వారు విరివిగా కాలూని నివసించడానికి నాంది పలికింది’. (ఆ జ్ఞాపకార్ధమే ఈ జ్ఞాపికా స్థూపం) `అని రాసి ఉన్న శిలాఫలకం.

SAM_4033 - Copy

అరణ్య విషయాల ప్రదర్శన తర్వాత మా మజిలీ సాగర విశేషాల నావీ వారి  మ్యూజియం ‘సముద్రిక’. గవ్వలు, శంఖాలు, పెద్ద పెద్ద తిమింగిలాల అస్థి పంజరాలు, పగడాలు, ఆక్వేరియం, చక్కని మెయింటెనెన్సు ` బయట ఆవరణలో ఓ నీలి తిమింగలపు బృహస్థిపంజరం.

SAM_4054 - Copy

గబగబా ఏంథ్రపోలజీ వారి మ్యూజియం. జరవాల భూమిలో తెలుసుకొన్న అండమాన్‌ ఆదిమజాతి విశేషాలతో పాటు ఇక్కడ  నికోబార్‌ దీపాలలోని వారి వివరాలూ తెలిసాయి. అండమాన్‌ తెగలవారివి నీగ్రోఇడ్‌ రూపురేఖలయితే నికోబార్‌ వారివి మంగోలాయిడ్‌ రూపు రేఖలు.. చేరువనే ఉన్న ఇండోనేషియా ప్రభావమా? స్థూలంగా ‘నికోబారీస్‌’గా వ్యవహరించే తెగవారు ముప్ఫైవేలమంది నీకోబార్‌ ద్వీప సముదాయంలో ఉత్తరాన ఉన్న కార్‌ నికోబార్‌ ద్వీపంలో ఉంటారట. వ్యవసాయం, వరాహ పాలన వారి జీవనాధారం. చదువూ ఉద్యోగాల్లో బాగా ముందున్నారు. వీళ్ళు గాక దక్షిణాన ఉన్న గ్రేట్‌ నికోబార్‌ ద్వీపపు అంతర్భాగాలలో నాలుగు వందల జనాభా ఉన్న ‘షోంపెన్‌’ అన్న తెగ ఉంది. వేట, ఆహార సేకరణ ముఖ్య వ్యాపకాలుగా ఉన్న ఈ తెగ వారికి బయట ప్రపంచంతో సంపర్కం అతి స్వల్పం..

అనుకొన్నవన్నీ ముగిసాయి ` ‘సాగరిక’లో షాపింగు తప్ప. ‘నన్ను షాపింగుకు తీసుకు వెళ్ళడం అంటే పిల్లిని చంకను బెట్టుకోవడమే.. శుభ్రంగా ఇంటికి వెళదాం. నేను ఉండిపోతాను. ప్రశాంతినీ, వాళ్ళ అమ్మగారినీ తీసుకొని నువు వద్దువు గాని’ అని మంత్రం వేసాను. లక్ష్మి సరేనంది. తనకు సరైన తోడు.. నాకు అవసరమైన విరామం..

* * * * *

రాత్రే చెప్పి ఉంచాను ప్రకాష్‌తో`‘మార్చి పది లక్ష్మి పుట్టినరోజు. ఏదైనా మంచి రెస్టారెంట్లో అందరం డిన్నరు చేస్తూ ఉత్సవం జరుపుకుందాం’ అని. ఏర్పాట్లు చేసాడు. ఎనిమిదిన్నరకల్లా ఓ మూడో అంతస్తు రెస్టారెంటు చేరుకొన్నాం. అయిదుగురము ప్లస్‌ వాళ్ళబాబు. సంప్రదాయ సిద్ధంగా కేక్‌ కూడా ఎరేంజి చేసాడు ప్రకాష్‌. కేకులు.. ఫోటోలు.. భోజనాలు.. హర్షాతిరేకాలు.. రెండు గంటలు. కాకపోతే ఓ ‘మోసం’ జరిగిపోయింది. ‘ఈ పార్టీ నాది’ అనేసాడు ప్రకాష్‌. వారించే ప్రయత్నం శాయశక్తులా చేసాను. కానీ స్థానబలమే నెగ్గింది.

పదకొండు ఉదయమే లక్ష్మి ఫ్లైటు. నలుగురమూ కలసి వెళ్ళి వీడ్కోలు చెప్పాం.

ఈ వారం రోజులుగా తనతో పాటు నేను ఎత్తిన ‘టూరిస్టు’ అవతారం ముగిసింది. వచ్చే ఆదివారం వరకూ నాది ‘ట్రావెలర్‌’ అవతారం.

ఏమిటీ తేడా?

‘టూరిస్టు అన్ని టికెట్లూ, అన్ని బుకింగులూ చేసుకొని మరీ వెళతాడు, ట్రావెలర్‌ ఎప్పుడూ తిరుగు ప్రయాణం టిక్కెట్టు కొనడు’ అన్నది ఒక నిర్వచనం. ‘టూరిస్టు తను ముందే నిశ్చయించేసుకొన్న మానసిక దృక్కోణంలోంచే ఆయా ప్రదేశాలు చూస్తాడు. ఓ ట్రావెలర్‌ ఎప్పుడూ ఓపెన్‌ మైండ్‌తో వెళ్ళి అనుభవాలను హృదయంతో స్వీకరిస్తాడు’. ఇది మరో నిర్వచనం…

నిర్వచనాల సంగతి ఎలా ఉన్నా రాబోయే వారం గురించి ప్రణాళిక సిద్ధపరచాను.

నికోబార్‌ వెళ్ళడం ఎలానూ పెట్టుకోలేదు. కనీసం అండమాన్‌ ద్వీపాలు మూడింటినీ కొస నుంచి కొసదాకా  ‘దిగ్రేట్‌ అండమాన్‌ ట్రంక్‌ రోడ్డు ` ఆద్యంతాలు చూడాలనుకొన్నాను. ఉత్తర అండమాన్‌ ద్వీపంలోని డిగ్లీపూర్‌, ఆ పక్కనే ఉన్న రాస్‌`స్మిత్‌ ద్వీపాలూ, దారిలో వచ్చే మాయాబందర్‌  పట్టణం, డిగ్లీపూర్‌కు కాస్తంత దూరాన ఉన్న ` అండమాన్‌ నికోబార్లలోని అత్యున్నత శిఖరం ` సాడల్‌పీక్‌ (2500 అడుగులు) వెళ్ళాలనీ ` ఇదో ప్రణాళిక. మూడు రోజులు.

ఒక రోజు పాటు హేవలాక్‌ గానీ, నీల్‌ గానీ మళ్ళీ వెళ్ళిరావాలన్నది మరో ఆలోచన. ఏది వెళ్ళాలా అని ఊగిసలాడి చివరికి హేవలాక్‌కే ఓటు వేసాను. నీల్‌ ద్వీపాన్ని పుష్కలంగా చూసాననీ, హేవలాక్‌లోనే చాలా మిగిలిపోయిందనే ఈ ఓటు. అలాగే పోర్ట్‌ బ్లెయిర్‌ శివార్లలో మౌంట్‌ హారియట్‌ అన్న పన్నెండొందల అడుగుల శిఖరం ఉంది. దక్షిణ అండమాన్లలో ఎత్తైన శిఖరం. దాని దగ్గరే అడవి, ట్రెక్కింగు దారి ` ఆ పరిశోధన మరో రోజు…

.‘చిడియాతపు’ అన్నది దక్షిణ అండమాన్ల దక్షిణ కొస. ట్రంకు రోడ్డుకు ఒక చివర. ‘అక్కడ మాకు స్క్యూబా డైవింగ్‌ అవకాశాలు ఉన్నాయి. ఒక పూట వెళ్ళి వద్దాం’ అన్నాడు ప్రకాష్‌. దానికో రోజు. ‘అసలీ అండమాన్లలో ఉన్న పగడాల సంపదను జాతీయ సొత్తుగా ప్రకటించి మహాత్మా గాంధీ నేషనల్‌ మెరైన్‌ పార్కుగా గవర్నమెంటు ప్రకటించింది. పోర్ట్‌ బ్లెయిర్‌కు ముప్ఫై కిలో మీటర్ల దూరంలో మూడు వందల చదరపు కిలోమీటర్ల ప్రదేశం ఆ పార్కు.. వండూర్‌ అన్న ప్రదేశం ఆ పార్కు ముఖ ద్వారం. అక్కడినుంచి ‘జాలీ బోయ్‌’ అన్న ద్వీపానికి తీసుకువెళ్ళి ఓ పూట అక్కడ ఉంచి స్నోర్క్‌లింగు చేయించి తీసుకువచ్చే ఏర్పాటు ఉంది. దానికి మీరు మరో రోజు కేటాయించండి..’  ప్రకాష్‌ సలహా. శిరసావహించాను.

ఆరు రోజులు అలా. ఏడో రోజు ఉదయం అచ్చంగా నాకోసమే అట్టేపెట్టుకొన్నాను. ఈ పదిహేను రోజుల్లో నాకు పరిచితమై నన్ను మళ్ళా మళ్ళా రమ్మని పిలిచే ప్రదేశాలు ఉంటాయి గదా ` వాటి కోసం. మధ్యాహ్నం నుంచీ తిరుగు విమానం సరేసరి!

* * * * *

ఆ ‘ఫుట్‌ లూజ్‌’ ఆలోచన, వారం దాకా ఎందుకూ ` వెంటనే ఆచరణలో పెట్టాను. ‘మధ్యాహ్నం ఆసక్తికరమైన చోటికి లంచ్‌కి వెళదాం. మీరు బాగా ఇష్టపడతారు’ అని ప్రకాష్‌ ఊరించాడు. ‘బావుంది, ధ్యాంక్స్‌! కానీ మధ్యాహ్నానికి ఇంకా రెండు గంటలు టైముంది గదా` అలా ఊళ్ళో ఓ చెక్కరు కొట్టి వస్తాను’ అన్నాను. అతని టూ వీలర్‌ అందుకొన్నాను.

నా మొట్టమొదటి సోలో లాంగ్‌ ప్రయాణం. మినీబే నేవీ కాలనీ నుంచి బయటపడి, వీఐపీ రోడ్డు చేరి ఎడమకు తిరిగి, ఎయిర్‌పోర్టును దాటుకొని, జంగ్లీ ఘాట్‌ మీదుగా, ఎంత్రాపోలజీ మ్యూజియం, అబర్డీన్‌ బజారు, అబర్డీన్‌ జెట్టీ (తెలిసిపోతోంది, తెలిసిపోతోంది, ఊరంతా తెలిసిపోతోంది ` దారులూ ఎల్లలూ మనసుకు పట్టేస్తున్నాయి!!), రాజీవ్‌ గాంధీ జల క్రీడా సముదాయం, కుడివేపుగా మళ్ళి, మెరైన్‌ డ్రైవ్‌, ఒక వేపు సముద్రం ` మరో వేపు కొండగుట్టలు ` చివరికి కార్బిన్స్‌ కోవ్‌ బీచి!! అదో చిరు విజయం.

ప్రకాష్‌ ఊరించిన ప్రదేశం. అబర్డీన్‌ బజారుకు కిలోమీటరు దూరాన, మెరైన్‌ హిల్‌ అన్నచోట ఉన్న ` ‘ఫార్చ్యూన్‌ రిసార్ట్‌ బే ఐలెండ్‌’ అన్న వెల్‌కమ్‌ గ్రూప్‌ వారి హోటల్లోని ` ‘నికోబార్‌’ అన్న రెస్టారెంటు! ఓపెన్‌ టు ఎయిర్‌ రెస్టారెంటది!

చక్కని వ్యూ. కాస్తంత ఎత్తైన ప్రదేశంలో ఉంది గాబట్టి కింద సముద్రం, దూరంగా కుడి చేతి వేపున రాస్‌ ద్వీపం, ఎదురుగా ఎత్తుపాటి కొండలు, పరీక్షగా చూస్తే లీలగా నార్త్‌బే బీచ్‌ ప్రాంతం, పురాతనత్వాన్ని గుర్తుకు తెచ్చే హోటలు అలంకరణ`ఫర్నీచరు, ఉండీలేనట్టు పలచగా అతిధులు, ప్రకాష్‌కు పరిచయముండి చిరునవ్వుతో పలకరిస్తోన్న రెస్టారెంటు మానేజరూ స్టాఫూ, పరిసరాలను పట్టించుకోకుండా సముద్రాన్నీ, నీలపు రంగునూ, పచ్చని కొండల్నీ కళ్ళతో తాగేస్తోన్న నేను.

‘మీ దగ్గర ఇరవై రూపాయల నోటు ఉందా?’ అడిగాడు ప్రకాష్‌. వెదికాను. లేదు. తన దగ్గరా లేదు. రెస్టారెంటు మానేజరు దగ్గరకు వెళ్ళి సంపాయించి తెచ్చి ఇచ్చాడు. ‘ఆ నోటు మీద బొమ్మ చూడండి..’ చూసాను. ఒక వేపు గాంధీ.. మరో వేపు ఏదో ప్రకృతి దృశ్యం. పామ్‌ చెట్ల ఆకులు, వాటి వెనక లీలగా సముద్రపు కెరటాలు, ఆవెనక కొండ చెరియ, దాని మీద కనిపించీ కనిపించని లైట్‌ హౌసు..! అనుమానం వచ్చి నోటు పైకి దృష్టి సారించి ఎదురుగా చూసాను. అదే దృశ్యం!! ఈ ఫార్చ్యూన్‌ హోటలు బాల్కనీలోంచి కనిపించే సుందర దృశ్యాన్నే అండమాన్ల ప్రతీకగా, ఇరవై రూపాయల నోటు రూపంలో కోట్లాది భారతీయుల ముందుకు చేర్చింది ప్రభుత్వం! మెచ్చుకోవాలి..

ఫోటోలు.. కాఫీలు.. కబుర్లు.. కొబ్బరి బొండాలు`ఓ గంటసేపు. స్థానికంగా తెలిసిన మనిషి లేకపోతే ఇలాంటి లోలోపలి అందాలూ, విశేషాలూ వేమవరం వుల్లయ్యలకు అందవు గదా! ఎంత థ్యాంక్స్‌ చెప్పీ ఏం లాభం? ఋణం తీర్చుకొనే ఏకైక మార్గం మన ఊళ్ళోని ఇలాంటి విశేషాలను వీళ్ళకు పరిచయం చెయ్యడమే!

చాలామంది మిలటరీ వాళ్ళకు ఉన్నట్టే ప్రకాష్‌కూ గోల్ఫ్‌ ఆట అంటే విపరీతమైన అనురక్తి. ఊరుకు పదీ పదిహేను కిలోమీటర్ల దూరాన మిలటరీ ఏరియా మధ్యలో ఉన్న ఓ (పం)తొమ్మిదిగుంటల గోల్ఫ్‌ కాయల ఆట స్థలానికీ, దానికి చేరువలోనే ఉన్న కోకోనట్‌ బీచ్‌ అన్న సువిశాలమైన బీచ్‌ పార్కుకీ వెళ్ళడమన్నది ఆనాటి మా సాయంత్రపు కార్యక్రమం. ఇంట్లో ఓ రెండు గంటల రెస్టు తర్వాత గోల్ఫ్‌ దారి పట్టాం. ఉదయం వెళ్ళి వచ్చిన కార్బైన్స్‌ కోవ్‌ లానే ఇదీ తూర్పు తీరంలో ఉంది. ఓ ఏడెనిమిది కిలోమీటర్లు దిగువన, దక్షిణాన, అరగంట ప్రయాణం.. ఆసక్తికరమైన నగరశివార్లలోని గ్రామీణ ప్రాంతాల గుండా, మిలటరీ ఏరియాల గుండా ప్రయాణం.

SAM_4106 - Copy

గోల్ఫ్‌ కోర్స్‌ ఉన్న ప్రదేశం ` ఒక్క మాటలో చెప్పాలంటే ` అద్భుతంగా ఉంది. సముద్రానికి ఆనుకొనే ఉందీ క్రీడాంగణం. గట్టిగా కొడితే బంతి సముద్రంలోకి వెళ్ళి మాయమయిపోతుందా అనిపించేంత చేరువలో సముద్రం.. సముద్ర తలానికి పదీ ఇరవై అడుగుల ఎత్తున్న ఈ గోల్ఫ్‌ కోర్సు.. ఆ ప్రాంతమంతా ఓ గంటసేపు తిరిగి రావడం.. మధ్య మధ్యలో  ఆట కోసం సృష్టించిన చిరు కొలనులు… అందులో సహజంగా విచ్చుకొన్న కలువలు.. సాయం సమయపు ఆకాశపు వర్ణ విన్యాసాలు.. అడపాదడపా కనిపించి ప్రకాష్‌నూ, నన్నూ పలకరించే ఇతర క్లబ్బు మెంబర్లు.. చక్కగా గడచిపోయిన గంట!

దానిని ఆనుకొనే కోకోనట్‌ బీచ్‌ ` వందలాది కొబ్బరి చెట్లు.. ‘అండమాన్‌లో ఉన్నామా అమలాపురం గ్రామాల్లోనా?’  అనిపించింది. ఏదో పార్టీ ఏర్పాట్లు, ఆదివారం సాయంత్రం గదా ` అన్ని చోట్లా విద్యుత్‌ దీపాలు, తోరణాలు.. పండుగ వాతావరణం.

‘‘అక్కర్లేదు. మీరు అంత ఉదయానే నిద్ర పాడుచేసుకోవద్దు. ఏక్టివాలో వెళతాను. అక్కడికి మన టిక్కెట్ల ఏజంట్‌ ఎలానూ వస్తాడు గదా. అతనికి బండి తాళాలు ఇస్తాను’’, అనేసాను ప్రకాష్‌తో..

బాగా తెల్లవారుఝామునే మాయాబందరు బస్సు. అబర్డీన్‌ బజారు దగ్గరున్న మైన్‌ బస్టాండు నుంచి. మొదట్నించీ అవసరమయిన టిక్కెట్లు ఇతర పర్మిట్లూ ఏర్పాటు చేస్తోన్న ఆనంద్‌ అన్న ఏజంటు కుర్రాడు అప్పటికే ఓ ప్రైవేటు ట్రావెలర్స్‌లో టిక్కెట్టు కొని తెచ్చి ఇచ్చాడు. అన్నీ అమరాయిగదా అని నేనే ప్రకాష్‌ను వారించాను.

తెల్లవారుఝామునే చేరుకొన్నా గానీ బస్టాండులో మా బస్సు కనిపించలేదు. కొంచెం అటూ ఇటూ వెదగ్గా ‘గీతాంజలి బస్సా.. వెళ్ళి అయిదునిముషాలు అయింది’ అన్నాడో టీ దుకాణం మనిషి. ‘అదెలాగూ అసలు బయలుదేరడానికే ఇంకో అయిదు నిముషాలు ఉంది గదా’.. అని నే వాపోయాను. అయినా మొరవినేదెవరూ? జిర్కాటాంగ్‌లో ఆరింటి కాన్వాయ్‌లో ముందు ఉండడం కోసం ఇలా నిర్ణీత సమయం కన్నా ముందే ఉరుకులు పెట్టడం అక్కడ మామూలేనట. బానే ఉంది ` మరి నాలాంటి కొత్తవాళ్ళ సంగతేమిటీ?

మినీ క్రైసిస్‌! బండి వెళ్ళిపోయింది. ఏక్టివా తాళాలు ఇద్దామంటే ఆనందూ రాలేదు!

గబగబా ఆలోచించాను. బస్టాండు గేటు పక్కనే ఉన్న టీ బడ్డీ మనిషిని రిక్వెస్టు చేసాను. ఒప్పుకొన్నాడు. ప్రకాష్‌కు ఫోను చేసి ` ఇదిగో ఇలా ఫలానా టీ మనిషికి తాళాలు ఇస్తున్నాను. పక్కనే బండి పార్కు చేస్తున్నాను. తొమ్మిది లోపల కలెక్టు చేసుకోవాలట, చేసుకోగలరా ` అని అడిగాను.  మరేం పర్లేదు వెళ్ళండి అన్నాడు.

మాయా బందరుకు కాదు గానీ ` బారాటాంగ్‌ వెళ్తోన్న బస్సు కనిపించింది. వంద కిలోమీటర్లయినా వెళ్ళవచ్చుగదా అని అది ఎక్కేసాను. అసలు మీ గీతాంజలి జర్కాటాంగ్‌ చెక్‌పోస్ట్‌ దగ్గర దొరికే అవకాశం ఉంది అని ఎవరో సూచించారు. ఆశ!

చీకట్లు తొలిగే సమయంలో జిర్కాటాంగ్‌.. దిగివెళ్ళి క్యూ మొదట్లో చూస్తే గీతాంజలి. డ్రైవరునూ క్లీనర్నీ కొంచెం కోప్పడే ప్రయత్నం చేసాను గానీ వాళ్ళు మహానుభావులు.. ‘మీరంటోన్న నిర్ణీత సమయం అంటూ పట్టింపులు పెట్టుకొంటే మేం ఆరుగంటల కాన్వాయ్‌ మిస్సయ్యి మరో రెండు గంటలు పడిగాపులు గాయాలి. పైగా రాత్రికి డిగ్లీపూర్‌ చేరలేం. ఇది ఒక్క చోటతో ముగిసే క్యూ గాదు. దారిలో ప్రతి ఫెర్రీ దగ్గరా వెనకబడిపోతాం’ ` వారి లాజిక్కు. కరెక్టే. ‘మరి అసలు బస్సు సమయాన్నే ముందుకు జరపొచ్చు గదా’ అడిగాను. ‘ఏం లాభం! అందరూ అలాగే జరిపితే?’ వారి తిరుగు సమాధానం. అర్ధమయింది. ఇదో చిరు విషవలయం! ఈ విషాదగాధకు ప్రమోదాంతం నాకు నా గీతాంజలి దొరకడం!!

SAM_4122 - Copy

ఈ నా గోడంతా వింటోన్న పక్క సీటు కుర్రాడు మాటల్లో పెట్టాడు. స్నేహం చూపించాడు. నాలుగయిదు గంటల మాయాబందరు ప్రయాణం వరకూ ఫ్రెండ్‌ ఫిలాసఫర్‌ గైడ్‌ అయిపోయాడు. పోర్ట్‌బ్లెయిర్‌లో కారు నడుపుతాడట. నిండా ఇరవై నిండని మనిషి. బెంగాలీ.. బంగ్లాదేశీ.. ఉత్సాహి.. ప్రపంచమంటే పుష్కలంగా కుతూహలం.. బొంబాయి, ఢిల్లీ, కలకత్తా, మద్రాసు నగరాలు చూడాలన్న జీవిత కోరిక. చదువుకోవాలన్న తపన  నవయవ్వన గ్రామీణ భారతానికి అసలు సిసలు ప్రతీక అనిపించాడు. ముచ్చటేసింది. దారిలో ‘మధ్య జలసంధి’ దగ్గర ఆగినపుడు ఫలహారం, కూల్‌ డ్రిరకూ పట్టుకొచ్చాడు. ‘మీరు మా అండమాన్ల అతిధి’ అంటూ ఇచ్చాడు. బలవంతం చేయించుకోకుండా పుచ్చుకొన్నా. ‘ఇచ్చుటలో’ ఉన్న హాయి తెలిసిన ‘బుద్ధిమంతుడు’ అతను. తీసుకోవడంలోని సొగసు ఎరిగిన సగటు మనిషిని నేను ` జోడీ సరిపోయింది.

బారాటాంగ్‌ దాటాక సరికొత్త ప్రదేశాల ఆవిష్కరణ. గ్రామాలు, చిరు పట్టణాలు, ‘కదమ్‌ తాల’ పట్నం, అడపాదడపా సముద్ర దర్శనం, ‘బాకుల్‌తల’ గ్రామం, రంగత్‌ పట్నం, ఓ చక్కని తమిళశైలి దేవాలయం, ‘బిల్లీ గ్రౌండ్‌’ గ్రామం, ‘నింబూదేరా’, ‘తుగాపూర్‌’ ` టీ జంక్షన్‌.

బస్సు ఇక్కడ ఎడమకు మళ్ళి డిగ్లీపూర్‌ వెళుతుంది. నేను ముందుకు సాగి, మాయా బందర్‌ వెళ్ళాలి. మా టూర్‌ ఏజెంటు వాళ్ళ తమ్ముడు, విజయన్‌, ఇక్కడ పోలీసు ఉద్యోగి. ఈ టీ జంక్షనుకు విజయన్‌ వచ్చి, నన్ను మాయాబందర్‌ పిడబ్ల్యూడీ అతిధి గృహంలో దింపి, స్థానికంగా తిరగడానికీ మర్నాడు డిగ్లీపూర్‌ వెళ్ళడానికీ టాక్సీలవీ ఏర్పాటు చెయ్యాలన్నది ఆనంద్‌ ఆకాంక్ష. టీ జంక్షన్‌ చేరడానికి అరగంట ముందే విజయన్‌తో సెల్‌ఫోన్లో మాట్లాడాను. బస్సు దిగగానే వచ్చి కలిసాడు. ఆరడుగుల అందగాడు. హుందా అయిన అవతారం..

‘మీరూ మేడమ్‌ కలసి వస్తారని మా జీపు అడిగి పెట్టి ఉంచాను. ఒక్కరే అన్నారు గదా అని ఇపుడు బైక్‌ మీదే వచ్చాను. పర్లేదు గదా’ అన్నాడు. ఓ గొప్ప ఆఫీసరు దంపతులకు, సాయపడే అవకాశం అని భావించినది కాస్తా నాలాగా ఓ జోలె భుజాన వేసుకొని దిగిన పెద్ద మనిషికి సహాయం అన్న స్థాయికి దిగినందుకు అతని గొంతులో నిరాశ స్పష్టంగా తెలిసిపోయింది. ఏం చెయ్యగలనూ?! అయినా అతనే తమాయించుకొని వెంటనే గౌరవం, స్నేహం కలగలిపి ఆత్మీయత పంచి పెట్టాడు.

టీ జంక్షన్‌ నుంచి మాయాబందర్‌ ఓ పదీ పదిహేను కిలోమీటర్లు.. ఆ భూభాగపు ఉత్తరపు కొసన ఉంది మాయాబందర్‌ పట్నం. ఎత్తు పల్లాలు.. మిట్టలు గుట్టలు.. అటూ ఇటూ దోబూచులాడుతోన్న సముద్రం ` ఆసక్తికరమైన ప్రదేశం. ఆ ప్రాంతాలలో అదే ముఖ్యమైన ఊరట. అయిదారువేల జనాభా, కొన్ని గవర్నమెంటు ఆఫీసులు, కళకళలాడుతోన్న ఊరిసెంటరు, ఇంకొంచెం ముందుకెళితే ఓ గుట్టమీద పీడబ్ల్యూడీ గెస్టుహౌసు.

కానీ చుక్కెదురయింది! పోర్ట్‌బ్లెయిర్‌ నుంచి మాకే సందేశమూ రాలేదన్నాడు అక్కడి మానేజరు. ‘పర్లేదు ` ఊళ్ళో వసతి చూపిస్తాను’ అన్నాడు విజయన్‌. కానీ ఆ గెస్టుహౌసు అతి చక్కని ప్రదేశంలో ఉండడం వల్ల దాని చూరు పట్టుకొని మరి కాసేపు వేళ్ళాడాను. విజయన్‌ పోలీసు పలుకుబడీ, నా సహనం మూర్తీభవించిన పోరాట పటిమా ఆ మానేజరు గారి ముందు ఓటమినే చవిచూసాయి. వెనక్కి తిరిగి చూసుకొంటే అంతా మన మంచికే అని తెలియవచ్చింది!!

ఊరి మెయిన్‌ రోడ్డులో వసతి వేట. ‘మీ బడ్జెట్‌ ఎంతా?’ అడిగాడు విజయన్‌. ‘అయిదారొందల వరకూ పర్లేదు’ చెప్పాను. ‘ఓ ఎక్కువ.. చిన్న ఊరు గదా ` ఈజీగా దొరుకుతుంది’… వెళ్ళాం. వెదికాం. ఒకటి రెండు చూసాక ఓ ‘అన్‌మోల్‌ గెస్ట్‌హౌస్‌’లో రోజుకు మూడు వందల ఏభైకి సెటిలయ్యాం. అడిగి మరీ మొదటి అంతస్తులోని ‘సముద్రం కనిపించే’ గది తీసుకొన్నా. దాన్ని నడిపే ఆవిడ స్నేహంగా మాట్లాడింది. వాళ్ళందరికీ విజయన్‌ బాగా తెలుసు. ‘మామూలుగా అయిదొందలు.. నాకు తెలుసుగదా ` తగ్గించారు’ మాటరాఫ్‌ ఫేక్ట్‌గా చెప్పాడు విజయన్‌.

SAM_4129

అప్పటికింకా మధ్యాహ్నం మూడు దాటలేదు. అప్పటికే నా రెండ్రోజుల టాక్సీ మనిషి ` మణి ` వచ్చి కలిసాడు.         ఉన్న రెండు మూడు గంటల్లో ఏం చెయ్యాలీ? అన్నది ఆలోచించి, ‘ఎవిస్‌ ఐలెండ్‌’ అని వాళ్ళిద్దరూ రెండు నిముషాల్లో తేల్చేసారు!

తీరం నుంచి ఒకటీ ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉందా ద్వీపం. స్థానికులే కాబోలు ` ఓ సహకార సంస్థగా ఏర్పడి ఆ ద్వీపంలో కొబ్బరిసాగు కొనసాగిస్తున్నారు. ద్వీపానికి వెళ్ళాలంటే మరపడవ కావాలి. ఫారెస్టు వాళ్ళ పర్మిట్టూ కావాలి. ఆ వేళ కాని వేళలో మా తమిళ మణి చకచకా అవి సాధించి పెట్టాడు. మూడున్నరకల్లా ఎవిస్‌ ద్వీపంలో..

చాలా చాలా చిన్న ద్వీపం. అంతా కలసి కిలోమీటరున్నర చుట్టుకొలత.. కొబ్బరి తోటల కాపలాదారుడు తప్ప స్థిరనివాసం లేని ద్వీపం. మేం వెళ్ళేసరికి ఆ కాపలాదారుడికో స్నేహితుడు. నేనూ, తెలుగు పడవ మనిషీ, మణీ ` వెరసి అయిదుగురం. అచ్చమైన ప్రైవేటు క్షణాలవి. విడివిడిగా కొబ్బరిచెట్లూ, మధ్యలోంచి కాలిబాటలు, అక్కడక్కడ మరేవో ఒకటీ అరా పెద్ద చెట్లు, సముద్రానికి చేరువలో ఏవేవో పొదలు తీగలు, మేం దిగిన చోట తప్పించి మిగిలిన తీర ప్రాంతమంతా  రాళ్ళూ రప్పలూ ` కధల్లో లాంటి వాతావరణం. తోడుగా వస్తానంటోన్న మణిని ఆపి, ‘త్వరగా వచ్చెయ్యాలి మరి’ అంటోన్న కాపలా మనిషి ` లక్ష్మీ నారాయణన్‌ ` మాటకు బుద్ధిగా తల ఊపి, ఓ గంటసేపు నా ఒంటరి ద్వీపంలో..

ఇలా భూగోళపు పటానికి అందని దీవుల్లో ‘ఎవరూ లేని చోట’ ప్రకృతితో ‘చిన్న మాట’ చెప్పుకొనే అవకాశం ఎంతమందికి వస్తుందీ? నాకు కూడా జీవితంలో మొదటిసారేనేమో గదా!! ఆ స్పృహ ఆయా క్షణాల మహత్తర లక్షణాలను ఎత్తి చూపగా ` బెదురంటే తెలియకుండా తీర ప్రాంతమంతటినీ చుట్టిపెట్టాను. ఎక్కడైనా కంటికి నుదురుగా కనిపిస్తే ‘లోపలికి’ కూడా వెళ్ళి మరీ ద్వీప పరిశోధన చేసాను. తిరిగి వచ్చేసరికి అంతా నాకోసం ఎదురుచూస్తూ ` మరిక ఇబ్బంది పెట్టకుండా బోటెక్కాను!!

SAM_4132

తిరుగు ప్రయాణంలో మరపడవ తెలుగు మనిషిని మాటల్లో పెట్టాను. మాయా బందరు ఓ తెలుగు ఊరు!! ఆరువేల జనాభాలో కనీసం నాలుగువేలు తెలుగు వాళ్ళట! రెండుమూడు తరాల క్రితం బతుకుతెరువు వెదుక్కుంటూ శ్రీకాకుళం ప్రాంతం నుంచి వచ్చిన పల్లెకారుల కుటుంబాలవి. ఈ ఏభై అరవై ఏళ్ళలో నిలదొక్కుకొని తిండికీ బట్టకూ లోటు లేకుండా బతుకుతోన్నా, చదువు సంధ్యలలో ముందుకు వెళ్ళి రాణించిన యువతీయువకుల సంఖ్య అంత చెప్పుకోదగ్గది గాదు. ఎక్కడుందీ లోపం?

పడవ దిగాక ఆ పడవ మనిషి సహాయం తీసుకొని ఆ పల్లెకారుల కుటుంబాలతో కబుర్లలో పడ్డాను. ఆడా మగా పిల్లా పీచూ యువకులూ ` ఓ పదిహేను మంది. కుశలపు కబుర్లకే పరిమితమయ్యాను. ఆంధ్రాలోని నెల్లూరూ, ప్రకాశం జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళూ ఉన్నా ` ఎక్కువగా విజయనగరం శ్రీకాకుళం వాళ్ళట. తెలుగుదేశం పార్టీ ఉనికి ఉందా ఊళ్ళో. కాంగ్రెస్సూ, బీజేపీ కూడా ఉన్నాయి. ఊరి పంచాయితీ ప్రెసిడెంటు ఎప్పుడూ సహజంగానే తెలుగు మనిషేనట. ఆమధ్య గంగవరలక్ష్మి అన్న ఆవిడ పంచాయితీ ప్రముఖ్‌గా అయిదేళ్ళు పనిచేసి ఊళ్ళో చెప్పుకోదగ్గ మార్పులు తెచ్చారట. పిల్లలంతా మినహాయింపులు లేకుండా స్కూళ్ళకు వెళుతున్నారట. ఏదేమైనా నిమ్మకు నీరెత్తినట్టున్న జీవితాలు.. ఉండవలసినంత కదలిక లేదనిపించింది.

పగలయితే ముగిసింది గానీ రాత్రిని డిక్లేర్‌ చెయ్యడానికి మరో మూడు గంటల సమయం ఉందిగదా.. ‘మాయాబందర్‌’ ఆత్మ ఎక్కడుందో వెదుకుదామనిపించింది. మెయిన్‌ రోడ్డు వదిలి అటూ ఇటూ అన్వేషణ.. విశాలమైన ఊరు.. ‘ఊరికే, అలా’ పడివున్న పెద్ద పెద్ద ఖాళీ స్థలాలు.. ఎగుడుదిగుళ్ళు.. దూరంగా ఓ గుట్టమీద ఓ మాత్రపు అట్టహాసపు గుడి.. తమిళ పూజారి.. కిందుగా సముద్రం.. నల్లటి నీడల నీళ్ళు.. కబుర్లలో పడిన ఆ పల్లెటూరి వాళ్ళు.. ప్రయత్నించి విజయవంతంగా వాళ్ళతో స్మాల్‌టాక్‌.. ఎవరో బిరబిరా పేపరుతో.. ‘తెలుసా జిర్కాటాంగ్‌ దగ్గర రెండు తలల పాము కనిపించిందట.. ఇదిగో దాని ఫోటో’ అంటూ అందరికీ చూపించాడు. అందరి ఉత్తేజంలో నేనూ నా భాగం అంది పుచ్చుకొన్నాను..

మళ్ళా మెయిన్‌ రోడ్డు మీదికి వస్తే మరో చిరుగుడి. తెలుగు వారి ప్రాబల్యం ఉన్న దేవాలయం.. ముఖ్య ధర్మకర్త అక్కడే ఉన్నారు. వాళ్ళింట్లో ఏదో శుభకార్యం సందర్భంగా అందరికీ ధారాళంగా ప్రసాదం పంచుతున్నారు.  నేనూ వెళ్ళి అడిగి పుచ్చుకొన్నా.. మాటలు కలిపారాయన. నా ఒంటరి ప్రయాణం మీద ఆసక్తి చూపించారు.. కానీ ఆయన ధార్మిక చింతనకూ నా లౌకిక దృష్టికీ పొంతన కుదరక మాటలు సాఫీగా సాగలేదు!

వెన్నెల రాత్రులూ, చంద్రోదయం.. సముద్రంలోంచి అదో అరుదైన దృశ్యం.. మూడ్‌ కుదిరింది. ఊరు ఉత్తర కొసన పడవల రేవు ఉందని తెలుసు. ఓ కిలోమీటరు పై చిలుకు. ‘పద, పద’ అంది మనసు. అడుగువేసాను.. మెల్లగా, హాయిగా.. పరిసరాలను సర్వాంగాలతో ఆస్వాదిస్తూ.. ఎక్కడ్నించో లలిత లలితంగా పాటలు. ఎవరిదీ.. తెలిసిన గొంతు.. తెలిసీ తెలియని భాష.. జాగ్రత్తగా వినగా హేమంత్‌ కుమార్‌ పాడుతోన్న భక్తి గీతాలని తెలిసింది. దారి మలుపు తిరగగానే కుడిచేతివేపున ఓ పాతిక ముప్ఫై మెట్ల ఆవల ఉన్న నిరాడంబరమైన మందిరం కనిపించిందవి. అతి తక్కువగా భక్తులు ` ముందుకు సాగాను.. మరో అరకిలోమీటరు.. పావుగంట.. జెట్టీ.. మనుషుల్లేరు.. నేను, చంద్రుడూ, జెట్టీ!

తిరిగొచ్చేస్తోంటే హేమంత్‌కుమార్‌ వదలనన్నాడు. అవునుమరి ` నలభై అయిదూ ఏభై ఏళ్ళ పరిచయం. ‘యాదిల్‌కె సునో దునియా వాలో’ అంటూనూ ‘కుచ్‌ దిల్‌ నె కహా’ అంటూ లతా గొంతుతోనూ అనుపమంగా ఆనాడే కట్టి పడేసిన మనిషి. మెట్లెక్కి పైకి చేరాను. మెల్లగా పాటల్లోకి ప్రవేశించాను. మనసుతో వింటే ఏ భాష అర్ధం అవదూ? మెల్లగా బెంగాలీ తెలిసిపోసాగింది. అదో అనూహ్య వాతావరణం.. అనుకోని ఆనందం.. అలాంటి ఏకాంత క్షణాలలో ఒంటరితనం దగ్గరకు రాగలదా?! ఆ గుడి, ఆ మెట్లు, ఆపాట, ఆ భాష, ఆ చెట్లు, ఆ గుట్ట, ఎదురుగా దూరాన సముద్రం, పైన చంద్రుడు ` అన్నీ ఆత్మీయంగా పలకరిస్తూ ఉంటే ఇహ ఒంటరితనం ఎక్కడుంటుందీ?!

‘ఎవరు బాబూ..’ అన్న మెల్లని పలకరింపు. పూజారి. చెప్పాను. అతనూ పక్కన చేరగిలబడ్డాడు. కబుర్లలో పడ్డాం. ఏభై ఏళ్ళ పెద్దాయన. ఈ ఊరివాడుగాడట. బెంగాలు. ఇది బెంగాలీల గుడి. పూజా పునస్కారాలు సవ్యంగా సాగకపోతోంటే ఊళ్ళో వాళ్ళు పనిగట్టుకొని ఇతన్ని పిలిపించారట. ‘పిల్లలు పెద్దాళ్ళయిపోయారు. జీవితాల్లో స్థిరపడిపోయారు. మాకు ఏ బంధాలూ లేవు.. దేశానికి బాగా దూరంగా ఉన్నామన్న మాటేగానీ ఇక్కడి వాతావరణం కూడా బావుంది. సుందర ప్రదేశం. మంచిగాలి, మంచి మనుషులు. మాకు అవసరాన్ని మించిన మర్యాద లభిస్తోంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ లోగా ఆవిడా వచ్చి చేరారు. భోజనం చేసి వెళ్ళమన్నారు. ‘టీచాలు’ అన్నాను. కలకాలం గుర్తుండిపోయే అనుభవం.

మళ్ళా మెట్లు దిగి ప్రపంచంలో పడి కడుపు వేస్తోన్న ఆకలి కేకలు విన్నాను. రోజంతా తినీ తినని తిండి. అప్పటిదాకా తిరుగుడుతోనే కడుపు నిండిపోయినట్టనిపించింది. ఇపుడు తెలుస్తోంది ఆకలి.. ఎవర్నో వాకబు చేసాను. ‘అదిగో ఆ మూల పెద్దావిడ నడుపుతోన్న చిన్న హోటలుంది వెళ్ళు.. నేనూ ఊరికి కొత్తాడినే. పోర్టుబ్లెయిర్‌ నుంచి పది రోజుల పనిమీద వచ్చాను. ఓ రోజు తిండికి ఇబ్బంది పడి రెండో రోజు కనిపెట్టాను. ఇహ మూడు పూటలూ అక్కడే’ అంటూ సలహా ఇచ్చాడో పాపన్న.. వెళ్ళాను.. నలభైఅయిదూ ఏభై ఏళ్ళ శుభ్రమైన ` తమిళం అంతగా మాట్లాడని ` తమిళ వనిత.. హిందీయే మా సంభాషణా మాధ్యమం.. భోజనం సింపుల్‌గా, రుచిగా ` బావుంది.

‘అన్‌మోల్‌’ చేరేసరికి తొమ్మిదిన్నర ` రిసెప్షన్లో ఇంకా మధ్యాహ్నం కనిపించినావిడే ఉంది. వాళ్ళదేనట ఆ హోటలు. ఆయన కాంట్రాక్టరు.. మామగారు కాంట్రాక్టరు.. మరిది పోర్టుబ్లెయిర్‌ ఉద్యోగం… ఈ పదిగదుల హోటలు ఈవిడే నడుపుతోంది. చురుకైన మనిషి.. కలుపుగోలు.. కాసేపు నా వివరాలు తెలుసుకొంది. తనకు తోచిన సలహాలు.. డిగ్లీపూర్‌ వివరాలు.. ‘కొత్త మనిషివిగదా ` ఏమై పోయావో అని కూర్చున్నా. నే ఉండేది నీ రూం పైనే, పై అంతస్తులో’ అంటూ రిసెప్షను కట్టేసి నాతో పాటు పైకి సాగింది. ఆపై అంతస్తుకు చెక్క మెట్లు. అక్కడ చెప్పులు వదిలి మెట్లెక్కి పైకి వెళిపోయిందావిడ… ఆసక్తికరం.

మాయా బందర్‌ నుంచి డిగ్లీపూర్‌ ఎనభైఅయిదు కిలోమీటర్లు. టాక్సీలో రెండున్నర గంటలు.

డిగ్లీపూర్‌లో నేను నిర్దేశించుకొన్న గమ్యాలు `  రాస్‌ Ê స్మిత్‌ ద్వీపాలు, సాడిల్‌ పీక్‌. అవి ఊరికి పదిహేనూ ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని మ్యాపులు చెబుతున్నాయి. అంటే అంతా కలసి రెండు వందల కిలోమీటర్ల ప్రయాణం. మహా అయితే ఆరు గంటలు పడుతుంది ` ఒట్టి ప్రయాణానికి. ఉదయమే బయల్దేరితే చీకటి పడే సమయానికి నేననుకొన్న రెండు ప్రదేశాలూ చూసుకొని తిరిగి మాయా బందర్‌ వచ్చెయ్యవచ్చు. ముందుగా అసలు ఆ రాత్రి డిగ్లీపూర్‌లోనే గడపాలనుకొన్నా గానీ మాయాబందర్‌ ఊరు నచ్చింది. నాకు దొరికిన రూము నచ్చింది. సముద్రం నచ్చింది. వినిపించే తెలుగు నచ్చింది. అంచేత ప్లాన్‌ మార్చుకొని ` డిగ్లీలో నైట్‌హాల్ట్‌ ఆలోచన విరమించి, దాన్ని ‘టాక్సీలో డే ట్రిప్‌’గా తిరగరాసాను.

మణికి ఆరింటికల్లా రమ్మని చెప్పాను. ఆరున్నర. అయిపులేడు. మొబైల్లో దొరకడు. ఆందోళన. అసహనం. పావు దక్కువ ఏడుకు మరోకుర్రాడు వచ్చాడు. మణి గారికి ఏదో అత్యవసరమైన పని పడిరదట. అందుచేత ఈ ఏర్పాటు. కుర్రాడు కృష్ణ ఉత్సాహి, మాటకారి. చొరవ గల మనిషి. రోజంతా బాగా సాయపడ్డాడు.

రెండు గంటల్లోపలే డిగ్లీ పూర్‌ చేరుకొన్నాం. దారిలో చిన్న చిన్న ఊళ్ళు.. అలవాటయిపోయిన పరిసరాలు.. నిన్నటి కొలంబస్‌ ఎఫెక్టు తగ్గి మళ్ళా మామూలు ట్రావెలర్‌ను అయ్యాను. ‘లా ఆఫ్‌ డిమినిషింగ్‌ రిటర్న్‌స్‌’ నా మీద పని చేయడం మొదలెట్టిందా అన్న చిరు ఆందోళన! క్రిష్ణకు తెలిసిన ఓ చిన్న హోటల్లో ఇడ్లీ దోశెల బ్రేక్‌ఫాస్టు.

డిగ్లీపూర్‌ చిన్నపట్నం. నార్త్‌ అండమాన్‌ ద్వీపంలో ముఖ్యమైన ఊరు. కాస్తంత పరీక్షగా చూస్తే ఎన్నో భాషలు కనిపించాయి, వినిపించాయి. తమిళం, బెంగాలీ ` ఎక్కువ. తెలుగు ఉంది. హిందీ వాళ్ళు ఉన్నారు. ఒకటి రెండు మళయాళీ మొహాలు. అరుదుగా ఒరియా, అందరూ సగటు మనుషులే. చిన్న దుకాణాలు, బడ్డీ హోటళ్ళు, ఆటోలు, ఒకటి రెండు మెకానిక్‌ షాపులు ` ఎవరూ ఆంగ్లం నేర్చిన సొగసరులు గాదు. మరి కామన్‌ భాష? సందేహమెందుకూ? హిందీనే. మాతృభాష ఏదయినా దాన్ని పక్కన పెట్టి అందరూ హిందీలో తమ తమ దినసరి వ్యవహారాలను సామాన్యుల భాష హిందీలో చక్కదిద్దుకోవడం నేను డిగ్లీపూర్‌లోనే గాదు, దాదాపు అన్ని అండమాన్ల ఊళ్ళలోనూ గమనించాను. పోర్ట్‌ బ్లెయిర్‌లో సైతం హిందీనే ప్రజలభాష. ఆ భాషకు ‘రాజభాష’ అంటూ ముద్ర వేసి ఏభై ఏళ్ళుగా పార్లమెంటరీ కమిటీలూ, అధికార భాషా సంఘాలు వేసి దేశ విదేశాలు పర్యటిస్తూ దాని ప్రాచుర్యం కోసం, అమలు చెయ్యడం కోసం దొరతనాలు చేస్తోన్న అవిరళ కృషి ఇప్పటిదాకా ఇవ్వని ఫలితం ` అండమాన్‌లో సామాన్యులు సాధించగలిగారు. అబ్బుర మనిపించింది. ఆయా సంఘాలూ, కమిటీలూ అండమాన్లకొచ్చి విషయాన్ని అధ్యయనం చేస్తే కొత్త కొత్త అయిడియాలు పుష్కలంగా దొరుకుతాయి గదా అనిపించింది.

 

* * * * *

 

ఇంకా ఉంది….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *