May 1, 2024

సరిగమలు-గలగలలు – 6

రచన: మాధవపెద్ది సురేష్suresh

(సినీ సంగీత దర్శకుడు)

జె.వి.డి.ఎస్.శాస్త్రి (జంధ్యాల వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్యశాస్త్రి) నాకు 1969లో పరిచయమయ్యాడు. అన్నయ్య రమేష్ పరిచయం చేశాడు. అన్నయ్య కోసం అప్పుడప్పుడు మా యింటికి వచ్చేవాడు. తమ నాటికల్లో హీరో. పైగా రచయిత కూడా. గుండెలు మార్చబడును, సంద్యారాగంలో శంఖారావం లాంటి పాప్యులర్ నాటికలు రాసి హీరోగా యాక్ట్ చేసేవాడు. వాటికి నేను కూడా కొన్ని సార్లు ఎకార్డియన్ వాయించాను. అన్నయ్యకీ, జె.వి.డి.ఎస్.కీ కామన్ ఫ్రెండ్స్ ఎక్కువ. అన్నయ్య, సుత్తి వీరభద్రరావు, విన్నకోట విజయరాం, సుబ్బరాయశర్మ నలుగురూ ఎ.కె.టి.పి.ఎం.ఎచ్. స్కూల్లో (సత్యనారాయణపురం, విజయవాడ) బెంచ్ మేట్‌లు. విన్నకోట రామన్నపంతులు గారు జంధ్యాలకి గురువు. ఆయనంటే జంధ్యాలకి చాలా గౌరవం. నేను 1969లో ఎస్.ఆర్.ఆర్ & సి.వి.ఆర్.ప్రభుత్వ కాలేజీలో పి.యు.సి.వి.లో చేరాను. అన్నయ్య నాకంటే రెండేళ్లు సీనియర్, అదే కాలేజీలో బి.ఎ.(సైకాలజీ, సోషియాలజీ, ఫిలాసఫీ) చదివే జంధ్యాల నాకన్నా ఒక యేడు సీనియర్. ఎం.వి.రఘు, సాయినాధ్, తోటపల్లి మధు, నాని (ముద్దమందారం ప్రొడ్యూసర్) ఇలా చాలా మంది ఎస్.ఆర్.ఆర్ & సి.వి.ఆర్. కాలేజి స్టూడెంట్స్. జంధ్యాల డ్రెమెటిక్ సెక్రటరీ. రఘు ఆర్ట్ సెక్రటరీ. అన్నయ్య మ్యూజిక్ సెక్రటరీ. ఆ భ్యాచ్‌లో సుమారు 20 మంది సినీ ఫెల్డులో సెటిల్ అయ్యారు.

jandhyala

జంధ్యాల అందగాడు. కాలేజికి అంబాసిడర్ కార్‌లో వచ్చేవాడు. మొదటినుండీ మితభాషి. మేమందరం ఒక రకంగా మా కాలేజ్ హేరోస్. జంధ్యాల నాన్నగారు శ్రీ జంధ్యాల నారాయణమూర్తిగారు బుష్ రేడియో డీలర్, అప్పట్లో ఎం.ఎస్.మూర్తిగారు జి.ఐ.సి. రేడియో డీలర్స్. రాజబాబు గారు (హీరో మురళీమొహన్) కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీలో ఉండేవారు. అందరూ మంచి రంగస్థల నటులు. జి.ఎస్.ఆర్.మూర్తిగారు (ఆంద్రా సిమెంట్స్) విన్నకోట రామన్న పంతులుగారు ఇలా ఎంతో మంది మహానుబావులు  ఎంతోమందికి మార్గదర్శకులుగా నిలిచారు. అనుకోని పరిస్థితుల్లో జంధ్యాల నాన్నగారికి వ్యాపారంలో సమస్యలు రావటంతో జంధ్యాల 1975లో మద్రాసు వచ్చాడు. అప్పటికే అతనికి వివాహం అయింది. జంధ్యాల భార్య అన్నపూర్త్ణ దేవత. అన్నపూర్ణ మావయ్యగారి (హోతా పార్దసారధి గారు) అబ్బాయి భగవాన్‌కి మా చెల్లెలు శశినిచ్చి వివాహం చేశారు. ఈ రోజుల్లో సూర్యకాంతంగారు (జంధ్యాల అమ్మగారు) అన్నపూర్ణ లాంటి అత్తాకోడళ్లని చూడటం కద్దు. ఒక రకంగా జంధ్యాల మావగారివైపు అందరూ ఒక కాపు కాశారు. ఎంతో సఖ్యంగా వుండేవారు.

జంధ్యాలకి మొదటి నుండీ సంగీతం అంటే ఎంతో ప్రాణం. వాళ్ల నాన్నగారు విజయవాడలో హిందుస్థానీ సంగీత సభలు నిర్వహించేవారు. పండిట్ రవిశంకర్ లాంటి ప్రపంచ ప్రసిద్దుల్ని విజయవాడకి క్లబ్ తరవున పిలిపించి కచేరీలు ఏర్పాటు చేసేవారు. మద్రాసులో డైరెక్టర్ కె.విశ్వనాధ్గారింటి ఎదురుగా చందమామ రామారావు గారింట్లో మొదట్లో అద్దెకుండేవారు జంధ్యాల. హనుమాన్ జంక్షన్ తరువాత విశ్వంగారు ఎంతో ఆదరించి ప్రోత్సహించారు. జంధ్యాలకి విశ్వనాధ్ గారంటే ఆరో ప్రాణం. సిరిసిరిమువ్వకి పనిచేయటంతో జంధ్యాల జీవితం మలుపు తిరిగింది. అడవి రాముడు, శంకరాభరణం, యమగోల సినిమాలతో తొందరగా పర్‌ఫెక్ట్ స్క్రిప్ట్ ఇచ్చే ఏకైక రైటర్‌గా ఒక వెలుగు వెలిగాడు. మా కాలేజ్‌మేట్ నాని (కె.ఆర్.ప్రసాద్) ‘ముద్ద మందారం’ సినిమా తీసి జంధ్యాలను డైరెక్టర్‌గా పరిచయం చేశాడు. మొదటి సినిమా నుండి ప్రఖ్యాత దర్శకుల కోవలోకి వెళ్లాడు. బాపుగారు, విశ్వనాధ్ గారి తరువాత ప్రత్యేకత ఉన్న దర్శకుడిగా ఎంతో పేరు సంపాదించాడు.

స్నేహితులంటే ఎంతో ప్రాణం జంధ్యాలకి. ‘ముద్ద మందారం’ మొదలు పెట్టే ముందు నేనూ, జంధ్యాల, బాలు గారు విమానంలో వెళ్తున్నాం. నేను బాలు గారి కచేరీకోసం హైద్రాబాద్ వెళ్తున్నాను. జంధ్యాల వేరే పనిమీద ఢిల్లీ వెళుతున్నాడు. మా ఇద్దరి మాటల సందర్భంలో ‘ఏరా, నాకు ఒక పిక్చర్ వచ్చింది. నువ్వు అందరు సంగీత దర్శకుల దగ్గరా పనిచేస్తున్నావు కదా! ‘నాకు మంచి మ్యూజిక్ డైరెక్టర్‌ని సజెస్ట్ చేయరా’ అని అడిగాడు. ‘నీకు అన్ని రకాలుగా పర్‌ఫెక్ట్‌గా మంచి సంగీతం అందించాలంటే రమేష్ నాయుడు గారు, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు అయితే బావుంటుందన్నాను. నా మాటకి విలువ ఇచ్చి, ఆ ఇద్దరు మహానుబావులతో ఎంతో అద్భుతమైన సంగీతాన్ని రాబట్టుకున్నాడు. ఆల్‌మోస్ట్ జంధ్యాల సినిమాలన్నింటికీ నేను కీబోర్డ్ ప్లేయర్‌గా పనిచేశాను.

‘ముద్దమందారం’, ‘ఆనందభైరవి’, “శ్రీవారికి ప్రేమలేఖ’ లాంటి ఎన్నో మంచి సినిమాలకి రమేష్ నాయుడు గారు అందించిన సంగీతం అద్భుతం. గొప్ప మెలొడీ మేకర్. అలాగే అన్నమయ్య సినిమా తీద్దామనుకొని (జంధ్యాల జీవితాశయం అది) నాయుడుగారితో అద్భుతమైన పాటని ఇండియాలో ఉన్న అందరు ప్రసిద్ద గాయనీ గాయకులతో రికార్డు చేయించాడు. కానీ సినిమా చేయలేకపోయాడు, బ్యాడ్ లక్.

అలాగే రాజన్-నాగేంద్ర గార్లతో ‘నాలుగు స్థంభాలాట’ లాంటి ఎన్నో విజయవంతమైన సినిమాలకి ఉన్నతమైన సంగీతం అందించాడు.

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంగారితో ‘వివాహ భోజనంబు’, ‘పడమటి సంధ్యారాగం’ లాంటి ఎన్నో విజయవంతమైన సినిమాలకి అద్భుతమైన, అనిర్వచనీయమైన సంగీతాన్ని మనకు వినిపించాడు ముఖ్యంగా ‘పడమటి సంధ్యారాగం’ లో అన్ని పాటలూ హైలెట్.

తెలుగు చిత్ర సీమలో మొట్టమొదటిసారి తెలుగు సినిమా పాట ‘అమెరికా’ దేశంలో వాషింగ్టన్ డి.సి.లో రికార్డు చేయటం జరిగింది. జంధ్యాల ఎంతో శ్రమించి, కసిగా తీసిన చిత్రం ‘ఆనందభైరవి’. ఆ యూనిట్ సన్మాన కార్యక్రమాలకు జంధ్యాల దంపతులు, నిర్మాత శాండిల్య గారూ, సీతాదేవి గారు, శివ, ఎస్.పి.బి.దంపతులు, శైలజ, నేను, నాభార్య, ఆర్కెస్ట్రా సభ్యులూ అందరం 1985లో అమెరికా వెళ్లాం. అక్కడే ‘పడమటి సంధ్యారాగం’ పుట్టింది. ఆ చిత్రానికి పేరు బాలూగారు సజెస్ట్ చేశారు. అందుకు నిర్మాతలు ఆయనకి 116 యు.ఎస్.డాలర్లు ఇచ్చారు.

‘పిబరే రామరసం’ అనే పాట సాయంత్రం 6-9 కాల్‌షీట్‌లో వాషింగ్టన్ డి.స్.లో రికార్డు చేయటం జరిగింది. సౌండ్ ఇంజనీర్ ఒక మహిళ. అద్భుతంగా రికార్డు చేసింది. ఒక్క్ ఆసిస్టెంట్ లేకుండా ఆవిడే రికార్డు చేసింది. ఆర్కెస్ట్రా శ్రీనివాసమూర్తి (వయొలిన్ & ఎరేంజర్ – ప్రస్తుతం ఎ.ఆర్.రహమాన్‌కు అసిస్టెంటు), డ్రమ్స్ శివమణి (వరల్డ్ ఫేమస్ డ్రమ్మర్, పడమటి సంధ్యారాగంలో నీగ్రో అబ్బాయిగా నటించాడు కూడా), సూర్యనారాయణ (ఫ్లూట్), నేను ఎకోస్టిక్ పియానో, కీబోర్డ్, ప్రసాద్(తబ్లా), రాజా (రిథిమ్ బాక్స్) రాజేశ్వరరావు గారి అబ్బాయి, సంగీత దర్శకుడు వాసూరావు (బేస్ గిటార్) జోసెఫ్(గిటార్), జీవితంలో మరచిపోలేని రోజది. నాకు ప్రత్యేకంగా నచ్చిన పాట అది.

ఒకసారి బాపుగారి సినిమా రీరికార్డింగ్‌లో కీబోర్డ్ వాయిస్తున్నప్పుడు బాపు గారు నన్ను పిలిచి “ఏమయ్యా! మీ స్నేహితుడు జంధ్యాల ‘ముద్దుగారే యశోద’ పాటని ఎంతో గొప్పగా పిక్సరైజ్ చేశాడు’ అని చెప్పారు. కాసేపయ్యాక జంధ్యాలకి ఫోన్ చేసి చెప్పాను. ఎంతో థ్రిల్ ఫీల్ అయ్యాడు. బహుశా జంధ్యాల జీవితంలో చేసిన ఎన్నో అద్భుతాలలో ఎన్నతగింది ఆ పిక్చరైజెషన్. పాటలు విజువలైజ్ చేయటంలో జంధ్యాల ఘనాపాటి. ‘సరిగమపదనీ స్వరధారా’ అనే పాట పిక్చరైజేషన్ కూడా నాకెంతో ఇష్టం. ముఖ్యంగా బాలుగారంటే జంద్యాలకి ఎంతో ప్రాణం. అలాగే జానకిగారన్నా, సుశీలగారన్నా, చిత్ర అన్నా ఎంతో ప్రేమ తనకి. జంధ్యాల వాయిస్ అద్భుతంగా ఉంటుంది. నేను ఎన్నో సార్లు తనతో అనేవాణ్ని నీ వాయిస్ నాకుంటే చాలా బావుండేదని.

తనకి వాళ్ల అమ్మాగారంటే మాటల్లో చెప్పలేనంత  ప్రేమ. సహృదయుడు, విజ్ఞత ఉన్నవాడు. ముఖ్యంగా సినిమా ఫీల్డులో ఎంతోమందిని ఇంట్రడ్యూస్ చేయటమే కాకుండా వాళ్లని విజయవంతమైన తోవలో నడిపాడు.

నేను మొట్టమొదట ట్యూన్ చేసిన పాటనే ఒకే చేశాడు. ‘హై హై నాయకా’ సినిమాకి ‘ఇది సరిగమలెరుగని రాగము, ఇది భాషేలేని భావము, ప్రేమగానము’. రచన శ్రీ జొన్నవిత్తుల, పాడిన వారు శ్రీ ఎస్.పి.బి.., శ్రీమతి ఎస్.జానకి   (1998 ఆగస్టు 21న, ఎ.వి.ఎం.జి.రికార్డింగ్ థియేటర్) ఆ పాట రికార్డు అవగానే ఎంతో ఆనందించాడు.

జంధ్యాలన్నా, తన కుటుంబ సభ్యులన్నా నాకే కాదు, నా కుటుంబం అందరికి ప్రాణం.

జంధ్యాల చాలా కమర్షియల్ సినిమాలకి రచయితగా పనిచేసినా ఏనాడూ అసభ్య పదజాలం ఉపయోగించలేదు. అలాగే తను దర్శకత్వం వహించిన ఏసినిమాలోనూ సెన్సార్ వాళ్లకి పని కల్పించలేదు. ఆరోగ్యకరమైన హాస్యాన్ని పండించాడు. అతని కలానికి రెండు వైపులా పదునుంది.

జంధ్యాల మంచి సంగీతానికి పెద్దపీట వేశాడు. ఆ తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు జంధ్యాల. పెళ్లైన చాలా సంవత్సరాలకి కవల పిల్లలు పుట్టారు. సాహితి, సంపద వాళ్ల పేర్లు. బంధువుల దగ్గరా, స్నేహితుల దగ్గరా ఇంట్లోనూ ఎంతో మంచిపేరు తెచ్చుకొన్న జంధ్యాల అందరికీ ఆప్తుడు. ఎంతో విజ్ఞత కలవాడు. కానీ టైమ్ అనే రెండక్షరాల ముందు ఎటువంటి వాళ్లైనా తలవంచాల్సిందే. ‘లైవ్ ఈజ్ ప్రీ రికార్డెడ్ క్యాసెట్’.  నాకన్నా 7 నెలలు పెద్దవాడు.  చేసింది ఒక్క సినిమా అయినా చాలా బాగా చేశాడు. మంచిపాత్ర. తన గురువుగారి దర్శకత్వం. మంచిపేరు సంపాదించుకొన్నాడు. జంధ్యాల మితభాషి, మొదటినుండీ ఖరీదైన బట్టలు ధరించేవాడు. ఎవరైనా గట్టిగా మాట్లాడినా, ఎవర్నైనా విమర్శించినా సహించేవాడు కాడు. నన్ను సినీ పరిశ్రమలో ఏరా! అని ఆప్యాయంగా పిలిచేవాడు తనొక్కడే.

ఘంటసాల గారి అంతిమయాత్రలో పాల్గొన్నాను. మళ్ళీ ఇటు సినీ పరిశ్రమలోని ప్రముఖులందరూ, స్నేహితులందరూ, బంధువులు, ఆప్తులూ అందరూ మనస్పూర్తిగా జంధ్యాల అంతిమయాత్రలో పాల్గొనటం చూశాను. మనిషి చనిపోతే అలా పోవాలి. ఏనుగు ఉన్నా పోయినా ఒకటే. తను మరణించిన కొద్దినెలల లోపే వాళ్ల నాన్నగారు చనిపోవటం ఆ కుటుంబానికి తీరని బాధ. పింగళిగారు, ఆత్రేయగారి తర్వాత అంత పేరు సంపాదించుకొన్నాడు జంధ్యాల. జంధ్యాల గురించి నేను ఇలా రాస్తానని కలలో కూడా ఊహించలేదు. నా వరకు జంధ్యాల నా రక్తంలో ప్రతి అణువులోనూ ఉన్నాడు. తను మరణించలేదు నాదృష్టిలో.

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *