క్షమయా ధరిత్రీ …..

రచన: మంధా భానుమతి

 

ఆంధ్ర భోజుడు, శ్రీకృష్ణ దేవరాయల పాలనలో, అష్టదిగ్గజాల సమక్షంలో తెలుగు కవితామతల్లి అగ్రపీఠం అలంకరించి అందరి నోటా తెనుగు నానుడి వయ్యారాలు పోతున్నప్పుడు, కవులే కాక ఇతర వృత్తుల వారు కూడా సాహిత్యమంటే మక్కువ చూపించే వారని తెలిసిందే.

 

ఆ తరువాత అచ్యుతరాయల కాలంలో కన్నడ సాహిత్యానికి ప్రాముఖ్యత నిచ్చినా, విజయనగరంలో ఇంకా తెలుగు పలుకులు వినిపిస్తూనే ఉన్నాయి. అష్టదిగ్గజాల్లోని కవులు కొందరు తమ పాండిత్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు.

 

అటువంటి సంధికాలంలో…

 

“తిరువేంకట కృష్ణమాచార్యులవారు” బ్రాహ్మీ ముహుర్త కాలానికి స్నానపానాదులన్నీ ముగించి సంధ్యా వందనానికి కూర్చున్నారు. ఆచార్యులవారికి కోటలో ఘడియలు తెలిపే గంటలు చెవిన పడకముందే మెలకువ వచ్చేస్తుంది.

 

పరమనిష్ఠా గరిష్ఠులయిన కృష్ణమాచార్యులకి ఆ ప్రాతఃకాలం.. ఎందుకో హృదయం భారంగా అనిపించింది. గాయత్రీ మంత్రం నూటఎనిమిది సార్లు ఏకాగ్రతతో జపించే ఆచార్యులు పదిమార్లు జపించగానే ఉలిక్కిపడి కన్నులు తెరిచారు.

 

“నాలో ఈ అలజడిని ఆపలేనా? శరీరం అంతా నిస్త్రాణగా అయిపోయినట్లుంది. భౌతికంగా ఏ రుగ్మతా లేదు. మానసిక ఆందోళ తప్ప..” కనులు మూసుకుని ఆలోచిస్తున్నారు. కృష్ణపరమాత్మని తలుచుకుంటూ దీర్ఘ ఉచ్వాస నిశ్వాసలతో ఆజ్ఞాచక్రం మీద దృష్టినిలిపి పద్మాసనంలో కూర్చుండిపోయారు. ఆవిధంగా ఎంతసేపుండిపోయేవారో! కానీ..

 

“రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం..” పెరటి వాకిలి ఎదురుగా ఉన్న తులసికోట చుట్టూ కళ్ళాపు జల్లి ముగ్గులు పెడ్తూ ఆచార్యుల వారి ధర్మపత్ని మహలక్ష్మమ్మ సన్నని కంఠంతో స్తుతిస్తున్న ఆదిత్య హృదయం, వెనువెంటనే..

 

విశాలమైన దక్షిణ మండపంలో సా,పా,సా శృతి పట్టి సరళీస్వరాలు సాధన మొదలుపెట్టిన పదిమంది పిల్లల కంఠధ్వని.. కృష్ణమాచార్యులవారిని, ధ్యానంలోనుండి బైటికి తీసుకు వచ్చాయి.

 

అప్పటికే ప్రాచుర్యం పొందిన పురంధరదాసులవారి కర్ణాటక సంగీత ప్రారంభ సరళీ స్వరాలను వాడలోని పిల్లలచేత సాధన చేయిస్తోంది    ఆచార్యులవారి ఏకైక పుత్రిక పద్మావతి. ఆ ప్రాతః కాలమందు మాయామాళవగౌళ రాగం లో వినవచ్చే శృతి బద్ధమైన దాటు స్వరాలు ఆచార్యులవారి అంతరంగానికి ప్రతీకల్లా ఉన్నాయి.

 

విజయనగర సామ్రాజ్యంలో, కృష్ణమాచార్యులవారు వృత్తి రీత్యా శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన వైద్య బృందంలో సభ్యులు.. రాయలు వేటకి వెళ్ళినప్పుడు అడవుల్లోతిరిగి అనేక ఔషధవిలువలు కలిగిన ఆకులను, కాండాలను, వేర్లను సేకరిస్తూ ఉండేవారు. వారు వంశపారంపర్యంగా సంక్రమించిన తాళపత్ర గ్రంధాల సారాన్ని తండ్రి వద్ద అభ్యసించి, చూర్ణాలు, భస్మాలు, లేపనాలు తయారుచేసి భౌతిక, మానసిక రుగ్మతలను పోగొడుతూ అపర ధన్వంతరి అనిపేరు పొందారు.

 

అచార్యులవారి ప్రవృత్తి సంగీత సాహిత్యాలు. సంగీతంలో ప్రావీణ్యత, సాహిత్యంలో ప్రవేశం.. రాయలవారికి అత్యంత సన్నిహితుల్ని చేశాయి. తమ ప్రతిభతో అష్టదిగ్గజాలతో సమాన మయిన స్థానాన్ని కొలువులో పొందగలిగారు.

 

శ్రీకృష్ణ దేవరాయల అనంతరం కూడా కొలువులో కొనసాగుతూనే ఉన్నారు, అంతకు మునుపున్న ప్రాముఖ్యత లేకపోయినా, వయో భారం వలన, వనాలకి వెళ్ళి మూలికలు సేకరించలేకపోయినా కూడా!

 

ఆచార్యులవారు సంధ్యావందనం పూర్తి చేసి, హారతి ఇచ్చి పూజగదిలో నుంచి బయటికి రాగానే మహలక్ష్మమ్మ అందించిన వెండిగ్లాసులోని గోరు వెచ్చని మీగడ పాలని తాగి, మడి పంచె మార్చి పట్టువస్త్రాలు ధరించి వీధిలోకి వచ్చారు. మనసులో ఇదీ.. అని చెప్పలేని కలత. తూరుపున వెలుగురేఖలు విస్తరిస్తున్నాయి.

 

అదే సమయంలో, పక్కింటిలోని తెనాలి రామకృష్ణకవి కూడా భుజం మీది శాలువా సవరించుకుంటూ బయటికి వచ్చి చిరునవ్వు నవ్వాడు. వయసులో ఎక్కువ తేడా లేకపోయినా ఆచార్యులు గురుతుల్యులు అతనికి.

 

“ఆచార్యులవారి మోము ఎందుకో చిన్నబోయింది ఉదయానే..”

 

“ఏమో తెలియదు రామకృష్ణయ్యా! మనసంతా కలచివేసినట్లుంది. ఏదో అనూహ్య సంఘటన జరిగినట్లు.. జరుగుతున్నట్లు, ఒక అతీత శక్తి హెచ్చరిస్తోంది. ఏమీ పాలు పోవడం లేదు.”

 

ఆచార్యుల వారి నోట బలహీనంగా వస్తున్న మాటలు వింటుంటే రామకృష్ణకవికి కూడా ఆందోళనగా అనిపించింది. పాలిపోయినట్లున్న మోము, వణుకుతున్న పెదవులు కనగానే పరుగున వచ్చి కృష్ణమాచార్యులని చిత్రాసనం మీద కూర్చుండ బెట్టారు.

 

“మీ ఆరోగ్యం..”

 

“నాకేం ఫరవాలేదు రామకృష్ణా! అమ్మాయి గురించే నా చింత.”

 

“ఏమయింది స్వామీ! అపర ధన్వంతరులు మీరు. ఏ రుగ్మత వచ్చినా చిటికలో మాయ చెయ్యగల సమర్ధులు. మీరే ఈ విధంగా మధన పడితే..”

 

“ఏదయినా జబ్బు అయితే కుదర్చగలను.. మొండితనంకి నా వద్ద మందులేదు రామకృష్ణా!”

 

“మీ గృహ విషయాలలో నేను కల్పించుకోవడం అంత మంచిదికాదు ఆచార్యా!” రామకృష్ణయ్య మొహమాట పడ్డాడు. ఆచార్యులవారి ఇంటి సమస్య తానెలా తీర్చగలడు?

 

“ఫరవాలేదు.. ఎవరికో ఒకరికి చెప్పుకోకపోతే ముందు నాకు వైద్యుని అవసరం వచ్చేట్లుంది. కూర్చో. రాయల ఆస్థానంలో ఎన్నో చిక్కుముడులను విప్పినవాడివి నాక్కూడా ఏదయినా ఉపాయం చెప్పగలవేమో..”

 

“చెప్పండి..” సర్దుకుని వేరొక చిత్రాసనం మీద ఎదురుగా కూర్చున్నాడు రామకృష్ణయ్య. ఇంటిలోపల పిల్లలు పిళ్ళారిగీతాలు పాడుతున్నారు. పద్మావతి రజత పాత్రనిండా పాలు తీసుకొచ్చి రామకృష్ణయ్య పక్కన పెట్టి నమస్కారం చేసింది.

 

“శుభమస్తు..” ఆశీర్వదించి, పాత్రని స్వీకరించి అమ్మాయిని పరికించాడు.

 

పదహారేళ్ళు నిండాయో లేదో, పసితనం పూర్తిగా పోని చంద్రబింబం వంటి మోములో చిరునవ్వు.. సహజ సౌందర్యంతో మెరుపుతీగలా ఉంది. ఒద్దికగా వెనక్కి నడిచి గవాక్షం దాటాక వెనుతిరిగింది. ఈ అమ్మాయి సమస్య.. ఒక వేళ ఏదయినా ప్రేమ వ్యవహారం కాదు కదా! నేడో రేపో పెళ్ళి చేసి అత్తవారింటికి పంపవలసిన కన్య..

 

పద్మావతి లోపలికి వెళ్ళగానే కనకదాసు కీర్తనలు అందుకున్నారు పిల్లలు.

 

“నీ మాయ యొళగో.. నిన్నొళు మాయయో..

 

బయలు ఆలయ దొళగొ ఆలయ బయలు దొళగొ..”

 

(మాయలో నువ్వున్నావా, నీలో మాయ ఉందా?

 

అవనిలో ఆలయం ఉందా ఆలయంలో అవని ఉందా..)

 

“వింటున్నావుగా! అదీ సంగతి.” అచార్యులవారు నిట్టూర్చారు.

 

అందులో విచిత్రమేమీ వినిపించలేదు, కనిపించలేదు రామకృష్ణ కవికి.

 

“ఏమయింది మహానుభావా? చక్కని సంగీతం, అంత కన్నా చక్కని భావం.. కనకదాసు కీర్తనలు పాడిస్తోంది పిల్లలచేత.”

 

“అదే నయ్యా నాబాధ. తెలుగు భాషని పట్టించుకోకుండా, అన్నమయ్య కీర్తనల లోని తియ్యదనాన్ని, భక్తి భావాన్ని, వేదాంత సారాన్ని పంచకుండా, ఆ కన్నడ శూద్రుని లల్లాయి పదాల్ని వల్లిస్తోంది. పోనీ సంస్కృతం.. జయదేవుని అష్టపదులైనా గానం చెయ్యవచ్చును కదా!”

 

రామకృష్ణయ్య తెల్లబోయాడు. తామందరూ అపర కృష్ణావతారంగా భావించే రాయల ఆస్థాన వైద్యుడు, ఈ విధంగా మాట్లాడగలడా! ఇటువంటి భావనతో ఉండగలడా? ప్రజ్ఞ ఎక్కడ వుంటే అక్కడ పట్టం కట్టిన రాయల సాంగత్యంలో ఇదేనా నేర్చుకున్నది? పైగా కన్నడ పదాలు.. రాయలు కన్నడ రాజై ఉండి తెలుగు సాహిత్యానికి ఎంత గౌరవాన్నిచ్చాడు.. మరి అతని తెలుగు ప్రజలు కన్నడ సాహిత్యానికి అంతే గౌరవం ఇవ్వద్దా?

 

“ఒక్క పాటలు పాడడమే కాదయ్యా..”

 

అంతలో పద్మావతి మృధుమధురమైన కంఠస్వరం వినిపించింది. పిల్లలకి ఏదో కథ చెప్తున్నట్లుంది..

 

“ఒక సారి ఒక బియ్యపుగింజకీ, రాగిగింజకీ వివాదం వచ్చింది. రాగి ప్రజలందరి ఆకలీ తీరుస్తుంది, బియ్యం ఒక్క ధనవంతులుకే అందుబాటులో ఉంటుంది.. మరి దాని విలువ ఎక్కువ. కానీ రాగిలో పోషక విలువలు ఎక్కువ. నేను గొప్పంటే నేను గొప్పని రెండూ వాదులాడుకుంటూ రాముడి దగ్గరకు వెళ్ళాయి తీర్పు చెప్పమని.

 

ఇద్దరి వాదనలూ విన్న రాముడు ఆరు నెలలు రండు రకాల గింజల్నీ గాలి చొరని, చీకటికొట్లో బందీగా ఉండమన్నాడు. ఆరు నెలల అనంతరం బయటికి తీసి పరీక్ష చేయించాడు. బియ్యం గింజ పాడయిపోయి, పొడి పొడిగా రాలి పోయింది. రాగి గింజ చెక్కు చెదరకుండా నిలిచింది. అప్పుడన్నాడా దేముడు.. “కష్టించి పని చేసే జీవుల్లాగే రాగిగింజ కూడా ఎటువంటి స్థితినైనా తట్టుకుని నిలబడుతుంది.. ధనవంతుల శరీర మనో బుద్ధుల్లాగే బియ్యపుగింజ ఆటుపోట్లొస్తే జావ కారిపోతుంది. నా పేరు రాఘవ కదా.. అందుకని నిన్ను కూడా రాగి అని పిలుస్తారు అందరూ..” అని తీర్పు నిచ్చాడు.”

 

“భలే ఉంది అక్కా కథ. ఎవరు చెప్పారు?” పిల్లలు అడిగారు.

 

“భక్త కనక దాసు అని ఒక మహాను భావుడున్నాడు. వ్యాసరాయని శిష్యుడు. ఆయన రాసిందే ఇందాక మనం పాడిన పాట. ఆయన శూద్రకులంలో పుట్టి, సైనికుడిగా పోరాటాలు చేసి.. ఒక యుద్ధంలో బాగా గాయపడినప్పుడు ఆ ఆదికేశవుడు ఆయనకి పునర్జన్మనిచ్చాడు. తరువాత వ్యాసరాయలవారు ఆయనకి దాసుగా గుర్తింపునిచ్చారు.. పురంధర దాసు వలెనే. అనేక వేదాంత గీతాల్ని రచిస్తూ పాడుతున్నారు. కష్టించి పనిచేసే తక్కువ జాతులవారిని హీనంగా చూడడం నచ్చక, పాటలు, పదాల రూపంలో తన ఆవేదనని వెలిబుచ్చుతున్నాడు. ఆ కనక దాసరు పాడిన రామాధ్యాన చరిత్ర లోనిదే ఈ కథ.”

 

పిల్లలు ఆసక్తిగా వింటున్నారు. కానీ ఆచార్యులవారు అసహనంగా అటూ ఇటూ కదిలారు.

 

తెనాలి రామకృష్ణుడు చిరునవ్వుతో వింటున్నారు. ప్రజల నోట ఎంత త్వరగా ప్రయాణించకపోతే ఇంత దూరం వచ్చి, ఈ ఆచార్యుల వారి ఇంట మారు మ్రోగుతున్నాయి కనకదాస కీర్తనలు! ఆనందంగా తల పంకించాడు.

 

కృష్ణమాచార్యులకి మాత్రం రామక్రిష్ణయ్య మొహంలో కనిపిస్తున్న మెచ్చుకోలు నచ్చలేదు.

 

“విన్నావా రామక్రిష్ణయ్యా! అమ్మాయి వరస ఇలా ఉంది. అదంతా సరే.. ఇంట్లో కూర్చుని ఏవో పాటలు పాడుకుంటోందిలే అనుకుంటే ఇప్పుడు ఉడిపి తీసుకెళ్ళమంటోంది. అసలే రాజ్యం అల్లకల్లోలంగా ఉంది. ఉమ్మత్తుర్, తిరువనంతపురం రాజుల తిరుగుబాటు అణచడానికి అచ్యుతరాయలు దక్షిణదేశం వెళ్ళారు. ఇక్కడ చూస్తే శ్రీకృష్ణ దేవరాయలవారి అల్లుడు, అళియరామరాయలు ఎప్పుడు సింహాసనం లాక్కుంటాడో తెలీదు. తనకి రాజ్యం ఇవ్వకుండా తమ్ముడ్ని రాజుని చేశాడని కినుకగా ఉన్నాడు. గుమ్మం కదిలితే ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో చెప్పలేము. ఈ సమయంలో ఉడిపి ఎందుకు చెప్పు?”

 

ఆచార్యులు చెప్తున్న మాట కూడా నిజమే. ఆడపిల్లని ఏవిధంగా అంత దూరం పంపాలి? దారి దోపిడీలు, క్రూరమృగాలు, విష కీటకాలు.. దారంతా అడవి మార్గం. ఎవరినైనా తోడు పంపడానికి ఆచార్యులవారికి అంత అంగబలం, అర్ధబలం లేవు.

 

“ఏం రామకృష్ణయ్యా మాట్లాడరు?”

 

“ఏం చెప్పగలను ఆచార్యా? మీరు చెప్తున్నదానిలో కూడా అర్ధముంది. ఎవరినైనా తోడునిచ్చి పంపుతే.. దైవ దర్శనానికి వెళ్తానంటే కాదని అనగలరా చెప్పండి?”

 

“ఒక్క దైవ దర్శనమయితే నాకు అంత క్షోభ ఉండేది కాదు.. ఆ కనకదాసు వెళ్తాడట.. ఆ సమయానికి ఆ మహా భక్తుడ్ని చూడడానికి వెళ్తుందిట. అక్కడే నాకు చిరచిరలాడుతోంది.” ఉత్తరీయంతో మొహం తుడుచుకున్నారు ఆచార్యులు.

 

నిజానికి రామకృష్ణయ్యకి కూడా వెళ్ళాలనే ఉంది. కాకపోతే ఇల్లాలి అనారోగ్యం ఇల్లు కదలనిచ్చేట్లు లేదు.

 

రామకృష్ణయ్య ఏదో చెప్పబోయేంతలో లోపల్నుంచి పద్మావతి బయటికి వచ్చింది. వెనుకే పిల్లలందరూ బిలబిలా వచ్చి తలో దిక్కూ వెళ్ళిపోయారు.

 

“తండ్రిగారు నా గురించే చెప్తున్నారా మామయ్యా! నాకు కనకదాసరు కీర్తనలు, ఆయన అభిప్రాయాలు ఎంతో ఇష్టం. నన్ను పంపడానికి భయపడనక్కర్లేదు కూడా. అంతఃపురకాంతలు కొందరు వెళ్తున్నారు. అందరం మగవేషాలు వేసుకుని వెళ్తాము. ఆ పైని కొంత సైనికబలం కూడా మావెంట వస్తోంది. అంత వెరవనవసరంలేదు మామయ్యా! నాకు గుర్రపుస్వారీ బాగా వచ్చు. కత్తి యుద్ధంకూడా నేర్చుకున్నాను. మీరైనా చెప్పండి.” తడుముకోకుండా.. అన్ని ఏర్పాట్లూ చేసేసుకున్నట్లు మాట్లాడుతున్న పద్మావతి వైపు రెప్ప వాల్చకుండా చూశాడు రామకిష్ణయ్య.

 

తండ్రిగారు కాదన్నా వెళ్ళేట్లే ఉంది.. ఆచార్యులవారికి నచ్చచెప్పక తపేట్లు లేదు.

 

……………….

 

ఉడిపి.. శ్రీకృష్ణ మందిరం వద్ద కోలాహలంగా ఉంది.

 

కనకదాసు వచ్చి రెండు దినములయింది. ఆలయ అధికారులు, పూజారులు హీన కులజుడైన దాసు ఆలయం లోనికి ప్రవేశించడానికి ఒప్పుకోవట్లేదు. ఆలయ ముఖద్వారం నుంచి నెట్టి వేశారు.

 

గుడి వెనుకభాగానికి వెళ్ళి తన ఏకతారాని మీటుతూ అందుకున్నాడు కనకదాసు..

 

“కుల కుల కుల వెందు హొడెధడ ధీరి..”

 

(మానవులారా! కులము కులమంటూ ఒకరి నుండి వేరొకరు విడిపోకండి.. అందరూ పుట్టేది ఒకలాగే, తినేది ఒకే విధమైన కూడే, తాగేది అదే నీరే.. ఏ ఒకరు ఇంకొకరి కంటే అధికులు కానేరు..)

 

అగ్రకులజులందరూ ఆలయం లోపల, మిగిలినవారు బయట వేచి చూస్తున్నారు. అందరికీ అలసటగా ఉంది.. ఒక్క కనకదాసుకి తప్ప. ఆయన మాత్రం ఒక కీర్తన వెంట ఇంకొకటి.. అనర్గళంగా ఆపకుండా పాడుతూనే ఉన్నాడు.

 

తిరువేంకట కృష్ణమాచార్యులు ఆలయంలోపల, గర్భగుడిలో పూజారులతో కాల వైపరీత్యం గురించి చర్చిస్తున్నారు.

 

పద్మావతి, అంతఃపురకాంతలతో కనకదాసుకి సమీపంలోనే వేచి కీర్తనలలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది.

 

భక్త కనకదాసు గొంతు బొంగురుపోయి.. ఆవేదనతో ఆయన శోషచెంది నేలకూలేట్లున్నాడు. అప్పుడు జరిగిందొక అద్భుతం..

 

ఈ అన్యాయం సహించలేనన్నట్లు భూమాత కంపించింది.

 

ఆలయ ప్రహారీ, గుడిలోపలి గోడ బీటదీస్తూ, రెండుగా విడిపోయాయి.

 

తూర్పు దిక్కుగా నిలిచి చూస్తూ భక్తులకి అభయమిచ్చే శ్రీకృష్ణుడు పశ్చిమదిక్కుగా తిరిగి కనకదాసుని తన కటాక్షవీక్షణాలతో కరుణించాడు.

 

జరుగుతున్న అద్భుతాన్ని చూస్తున్న ప్రజలందరూ నమ్మలేనట్లు లేచి నిలబడి ఆ పరమాత్మని స్తుతించసాగారు. ఆ ప్రదేశమంతా కృష్ణనామంతో మారు మ్రోగిపోయింది.

 

భక్త కనకదాసు కన్నులవెంట కావేరి వరద.. ఆలయప్రాంగణంలో ఉన్న వారందరూ నిశ్చేష్టులై నిలబడిపోయారు. గర్భగుడిలోని పూజరులు.. తమని వెలివేసినట్లు వెనుతిరిగిన శ్రీకృష్ణప్రమాత్మని క్షమించమని మోకరిల్లారు.

 

భూమాత ప్రకంపనలు ఆగలేదు. భక్తజనం అటూఇటూ కదలిపోతూనే భజన చేస్తున్నారు. శ్రీకృష్ణుని వీక్షణం మాత్రం కనకదాసు వంకనే..

 

పద్మావతి, ఆమె సహచారిణులు కనకదాసు పక్కనే నిలిచి రెప్పవేయకుండా నీలమేఘశ్యాముని చూస్తూ, భజిస్తున్నారు.

 

అప్పుడు.. తిరువేంకట కృష్ణమాచార్యులలో కదలిక వచ్చింది. విడివడిన గోడల మధ్యనుంచి బయటికి నడిచారు. ఆయన వెనుకే మిగిలిన అందరూ..

 

శ్రీకృష్ణుడిని, భూమాతని శాంతింపజేయమని భక్త కనకదాసుని చేతులు ముకుళించి వేడుకున్నారు.

 

ధరిత్రి క్షమించి శాంతించింది.. కానీ కృష్ణ విగ్రహం మాత్రం పశ్చిమ దిక్కుకే నిలబడి పోయింది.

 

చలనం లేకుండా స్థాణువులా నిలచిన తండ్రిగారిని పద్మావతి కదిలించి, ఆందోళనగా నాడి పరికించింది. ఫరవాలేదన్నట్లు తల పంకించి జ్ఞానోదయం చేసిన పుత్రికని అక్కున చేర్చుకున్నారు ఆచార్యులు ఆనందంతో.

 

“అమ్మా! నిన్ను ఎంతో క్షోభపెట్టాను.. క్షమించు తల్లీ!”

 

కన్నుల నీరు తిరగగా తండ్రిగారి కాళ్ళముందు మోకరిల్లింది పద్మావతి.. క్షమయా ధరిత్రి!

 

చరిత్రలో కనకదాసు చరిత్ర శాశ్వతంగా నిలిచిపోయింది. నేటికీ ఉడిపి క్షేత్రంలో విగ్రహం వెనుతిరిగి ఉంటుంది. భక్తులు, గర్భగుడి గోడకున్న కిటికీ లోనుండే దేముని వీక్షించాలి.

 

శ్రీకృష్ణ కటాక్ష సిద్ధిరస్తు!

 

*—————————*

రాముని భర్తృధర్మము

 

           రచయిత :- యఱ్ఱగుంట సుబ్బారావు

 

ధర్మప్రధానుడైన రాముడు దారనైనను, ధనమునైనను(అర్థకామములను) ధర్మబద్ధమైన వానినే స్వీకరించును. ప్రభువు, తండ్రి అయిన దశరథుని ఆజ్ఞానువర్తియగుటయే తన ధర్మమని రాముడు విశ్వసించినాడు. వంశసంప్రదాయమునుబట్టి, ప్రభువు ఆనతినిబట్టి జ్యేష్ఠుడైన తనకు లభించిన రాజ్యమును, వరముల వలలో చిక్కిన తండ్రి కోరగా భరతునికై పరిత్యజించినాడు, వనవాసమును అంగీకరించినాడు. అట్లే స్వపరాక్రమ విజితయు, స్వయంవరలబ్ధయు అయిన సీతను జనకుడు కన్యాదానము చేయుటకు జలపాత్రతో సిద్ధముకాగా తండ్రి అనుమతి లేకుండా ఆమెను స్వీకరించలేదు. తండ్రి అనుమతితో వివాహమాడిన సీతపై రామునకు ’ స్థిరానురాగమున్నది, తల్లిదండ్రులు(బిడ్డపై) చూపు వాత్సల్యమున్నది.’

 

                                          “స్థిరానురాగో మాతృవత్ పితృవత్ ప్రియః” – ( అయోధ్యా. ౧౧౮-౪)

 

అయితే ఈ “దారధనాదులు సాపవాదమైనచో” వానిని త్యజించు ధర్మనిష్ఠ రామునియందున్నది. రాముడు తనకు కల్గిన (రాజ్య)లాభ, నష్టములను గణింపక, సమదృష్టి కల్గియున్నను, ఇతర మనుష్యుల కష్టములకు దుంఖించు మృదుహృదయమున్నది. తన పట్టభంగమునకు దుఃఖించుచున్న తల్లి దుఃఖమును చూడలేక దుఃఖించినాడు. ప్రజలు తనను విడిచి వెనుకకు మరలక, రథమెక్కి వనములకేగుచున్న తనకూడా రాలేక వ్యథచెందుట చూచి వారికై రథము దిగి సరయూనదీ తీరము వరకు పాదచారియై వెళ్ళినాడు. అట్టి దయామయుడైన రాముడు సీత తనతో అడ్వులకు వచ్చి దుర్భర కష్టములు పడుటకు అంగీకరించలేదు. ఆమె అనేక విధములుగా ఆయనను ఒప్పించుటకు ప్రయత్నించినది. నారీధర్మములను ఉదహరించినది, నిష్టురములాడినది, ప్రాణములను విడుతుననినది, తుదకు దుర్నివారముగా దుఃఖించినది. ఇక్కడ ఒక ప్రశ్న కలుగును. తనవెంట వత్తుననిన కౌసల్యకు “భర్త బ్రతికి ఉండగా స్త్రీ కుమారుని అనుసరింపరాదని, భర్తకు సేవచేయవలెనని” స్త్రీ ధర్మములను ఆమెచే స్మరింపజేసిన రాముడు, ఇపుడదే ధర్మమును ఆచరించుటకు సిద్ధమైన సీతనేల వలదనినాడు? లోకమున స్త్రీ ధర్మములు రూఢమై ఉన్నను వానిని ఆచరించుటకు వారు(స్త్రీలు) మనఃపూర్వకముగా సిద్ధమై ఉండవలయును. అట్లుగాక అవి వారిపై బలాత్కారముగా విధించి, వారిచే ఆచరింపజేయ చూచిన ఆ ఆచరణము వికృతముగా పరిణమించును. తమంతట తాముగా సిద్ధమైనచో వారి ధర్మాచరణము వారికి సుఖముగా నుండును, ఇతరులకు తృప్తి కలుగును. లోకము కొఱకో, భర్త తృప్తి కొఱకో కాక సీత తాను చేయదలచిన ధర్మాచరణము తన కొఱకే అను విషయము తెలియవలసి ఉన్నది. అది తెలిసికొనుటకే, ఆమె ఆంతర్యమును ఎఱుగుటకే తుదవరకు ఆమెను శోధించినాడు. తనకొఱకు ఇతరులు కష్టపడుటను సహింపకపోవుట, సీత సర్వాభిప్రాయమును ఎఱుగదలచుట- ఈ రెండును సీత వనగమనమును రాముడు అంగీకరింపకపోవుటకు కారణములు. అంతియేగాని అడవిలో స్త్రీ సంరక్షణము చేయలేక కాదు. సీతను ముందు, తనను అనుసరింపరాదనుటకు హేతువును రాముడిట్లు చెప్పుచున్నాడు-” సీతా! నీ సర్వమైన అభిప్రాయము నెఱుగక, నిన్ను కాపాడ సమర్థుడనయ్యు నీ వనవాసమునకు అంగీకరింపనైతిని.”

 

తవ సర్వమభిప్రాయమవిజ్ఞాయ శుభాననే

వాసం న రోచయేరణ్యే శక్తిమానపి రక్షణే( అయోధ్యా. ౩౦-౨౮)

 

సీత సర్వాభిప్రాయము నెఱిగిన పిమ్మట ఆమె వనవాసమును అంగీకరించినాడు. దీనినిబట్టి భార్య అభిప్రాయమును, స్వాతంత్ర్యమును ఎట్లు మన్నించినది విశదమగుచున్నది. రాముడు సీతకు ఆమె స్వధర్మాచరణములో స్వేచ్ఛను ఇచ్చినను, ఆమె యెడల స్నిగ్ధముగా ఉన్నను ఆమె చెప్పిన ఆలోచనలన్నింటిని ఆయన ఆమోదించడు. అవి ధర్మబద్ధము కానిచో వానిని సహేతుకముగా తిరస్కరించును. విరాధవధ జరిగిన పిమ్మట రాక్షసులవలన హానిని శంకించి భయపడిన సీత రామునితో- “కారణము లేకనే రాక్షసులతో వైరము వలదు. క్షత్రియునకు శస్త్రసాంగత్యము తేజోవృద్ధి చేయును. దేశధర్మమునుబట్టి, అరణ్యములో ధనుర్బాణములు పరిత్యజించి, మునివృత్తి నవలంబించి, వనవాసవ్రతమును ముగించుకొని పట్టణమునకేగిన పిమ్మట క్షాత్రధర్మమును తిరిగి ఆచరింపవచ్చును. అయితే క్షత్రియులు ఆర్త్రత్రాణము చేయుటకు ఆయుధములు ధరింపవలసినదే”                       (అరణ్య. ౯-౧౪,౧౫౨౫,౨౬), అని పరస్పర విరుద్ధమైన అభిప్రాయములను వెలిబుచ్చినది. దానికి రాముడు- ” మునులు శరణు వేడగా రాక్షసుల బారినుండి వారిని రక్షింతునని బాస చేసితిని. ఆర్తులను రక్షించుటకు క్షత్రియుడు ఆయుధధారి కావచ్చునని నీవే చెప్పితివి. అట్టి స్థితిలో వారిని రక్షించుటకు ఆయుధములను ధరించి, వారికిచ్చిన మాటను కాపాడుకొనుటకు సిద్ధమైతిని”(అరణ్య. ౧౦-౩,౧౭) అని శరణాగతరక్షణమను క్షాత్రధర్మమునకు విరుద్ధములైన ఆమె అభిప్రాయములను మృదువుగా త్రోసిపుచ్చినాడు.

 

ధర్మబద్ధమైన రాముని కామపురుషార్థము ధర్మపత్నియగు సీతయందు ఫలించినది. వారు పన్నెండు సంవత్సరములు అయోధ్యలో సర్వసుఖములు అనుభవించిరి. సీత రామునకు ప్రాణములకంటె ఇష్టురాలైనది( ప్రాణైః ప్రియతరా మమ – అర.౫౮-౬), ప్రాణసహాయ అయినది (క్వ సా ప్రాణసహాయా మే వైదేహీ– అర.౫౮-౪). ఒకరి ప్రేమను ఒకరు పరీక్షించి చూచికొనిరి. ఒకరి హృదయమందొకరు ప్రతిష్టితులైరి. ఒకరిపై ఒకరికి విశ్వాసమున్నది. ఒకరిని విడిచి ఒకరు జీవించలేనంతగా సీతారాముల పరస్పర ప్రేమ ప్రవర్ధమానమయినది. “ఆత్మవంతుడు కీర్తిని విడువలేనట్లు నిన్ను విడుచుట నాకు శక్యము కాదు.”(అయోధ్య. ౩౦-౨౯) అని సీతతో రాముడనినాడు. రావణునకు భయపడుచునే వానిని, వాని మాటలను తృణీకరించి-“సర్వలక్షణలక్షితుడు, సత్యసంధుడు, మహానుభావుడు, సముద్రమువలె గంభీరుడు, నరసింహుడు, సింహమువంటివాడు, విశాలవక్షుడు, జితేంద్రియుడు, కీర్తిమంతుడు, మహాత్ముడు, రాచబిడ్డ అయిన రామునిని నేను అనువర్తించుదానను- “అహం రామమనువ్రతా”-(అరణ్య.౪౭-౩౬) అని సీత రావణునకు ప్రకటించినది. ఇట్టి వీరి అన్యోన్యనురాగమునకు వారికి కల్గిన వియోగము ఒక పరీక్ష అయినది. ఆ పరీక్షలో వారి ప్రేమలోని గాఢత్వము, ఔన్నత్యము లోకమునకు వెల్లడి అయినది. అట్టి వియోగదశలో వారి పరస్పర గాఢానురాగమును చూచి, విషాదము చెంది, మెచ్చుకుని, ఒకరి సందేశము ఒకరికి యెఱింగించి, వారిని యూరడించి, కడకట్టిన వారి ప్రాణములను నిలుపు మహద్భాగ్యము ఒక్క హనుమంతునకు లభించినది. రామవియోగములో, అశోకవనములో దీనయై, దుఃఖితయై, కర్శితయై, భీతయై, క్రూరవికృతరాక్షసీ పరివేష్టితయై, బంధుజనవియోగంతో ఏకాకియై, మలినగాత్రయై, అధశ్శాయియై, రామధ్యానపరయై ఉన్న సీతను దర్శించినాడు. సీతావియోగములో మధుమాంసములు వర్జించి, కేవల మూలఫలాదులను తిను రాముని, నిత్యశోకపరాయణుడై,(సీతా) ధ్యానపరాయణుడై,ఇంకొక విషయము చింతింపని రాముని, నిద్రలేని రాముని, ఒకవేళకు పట్టిన నిద్రనుండి తటాలున “సీతా!” అని పలవరించుచు లేచు రామునినీ దర్శించినాడు. రామవియోగములో సీత, సీత యెడబాటులో రాముడు జీవించియుండుటకు హేతువును హనుమంతుడు ఇట్లూహించుచున్నాడు.-” ఈమె మనస్సులో రాముడున్నాడు, ఆయన మనస్సులో సీత ఉన్నది. అందువలననే పతివ్రతయైన ఈమెయు, ధర్మాత్ముడైన రాముడు ముహుర్తకాలమైన జీవించియున్నారు.”

 

అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితమ్

తేనేయం స చ ధర్మాత్మా  ముహూర్తమపి జీవతి(సుందర. ౧౫-౫౨)

 

ఇట్లు వారి ధార్మికనిష్టకు పరస్పరానురాగమునకు ముగ్ధుడైన హనుమంతుడు రామసందేశమును చెప్పి సీతను ఊరడించవలెనని, సీతాసందేశముతో రాముని సంతోషపరచవలెనని నిశ్చయించుకుని, అటులనే చేసినాడు.

 

దుర్భరవియోగములో నిగ్గుదేలిన ఈ ప్రేమమూర్తులకు పునస్సమాగమమును కలిగించు శుభపరిణామము ఏర్పడినది. కాని ఆ పునఃసమాగమము సుకరముగా, సుఖముగా సంభవించలేదు. ఏ సీతను ప్రాణాధికముగా ప్రేమించెనో, ఏ సీతకై చెట్టుచెట్టుకు, కొండకొండకు పరువులెత్తి వెదకెనో, ఏ సీతమీది ప్రేమచే ఉన్మాదివలె జడములగు చెట్లను, కొండలను, నదులను, మూగజీవులగు పశుపక్ష్యాదులను సీతను గూర్చి ప్రశ్నించెనో, ఏ సీతను పోగొట్టుకుని ఉత్సాహధైర్యములు జారిపోయి కర్తవ్యశూన్యుడై తనను అరణ్యములో విడిచి అయోధ్యకు తిరిగి వెళ్ళవలసినదిగా లక్ష్మణుని కోరెనో , కవగూడియున్న మృగపక్షి మిథునములను చూచి ఏ సీతను నిరంతరము స్మరించెనో, ఏ సీతా విరహతాపముతో దగ్ధమగుచున్న అగ్నిపర్వతమువలె ఉండెనో, ఏ సీతాధ్యానమగ్నుడై తన శరీరముపై పాకుచున్న చీమలను,దోమలను, పురుగులను సైతము తొలగించుకొనలేదో, ఏ సీతావార్తకై కన్నులలో ప్రాణములు పెట్టుకుని ఎదురుతెన్నులు చూచెనో, ఏ సీతకొరకు మహాబలుడైన వాలిని వధించెనో, ఖరదూషణాదులతోగూడ రాక్షససేనను సంహరించెనో, ఏ సీతకై అపూర్వ సేతునిర్మాణము చేసి, సముద్రమునుదాటి, మహావీరులగు రాక్షసులను వధించెనో, ఆ చిరకాంక్షిత అయిన సీత ఇప్పుడు తనకు అత్యంత సమీపములో, ఏ అడ్డులేక హస్తగతయై ఉన్నను , ఆమెను వెంటనే స్వీకరించుటకు ధర్మప్రధానుడైన  రామునకు వీలులేకపోయినది.

 

సీతాహృదయ ప్రతిష్టితుడైన రామునకు ఆమె హృదయము తెలియును. సకల సుఖములను, బంధుమిత్రములను వదలి తనవెంట అరణ్యవాస కష్టములనుభవించుటకు, తనకు దుఃఖసహాయ అగుటకు సంతోషముతో స్వేచ్ఛతో అడవికి తనను అనుసరించిన సీతకు తనపైగల ప్రేమను, పాతివ్రత్యధర్మమందు ఆమెకుగల నిష్టను రాముడెఱుగును. తనను నమ్మివచ్చి, తన భాగ్యవిపర్యయము వలన తనకు దూరమై, రాక్షసచెఱలో దీనయై, దుఃఖితయై, భీతయై, ఘోరరాక్షసీ సంవృతయై, వారి మాటలచే పీడితయై రక్షణకొఱకు దిక్కులు చూచిన సీతపై ఆనృశంసాపరుడైన రామునకు జాలి ఉన్నది. రాముడులేని జీవితము వ్యర్థమని శరీరత్యాగమునకు సిద్ధపడియు, బ్రతికిఉంటే రామునిని దర్శింపవచ్చునను ఆశతో జీవితము నిల్పుకొనిన సీతాహృదయభావము నెఱిగిన రాముడు- “భాగ్యవశమున బ్రతికి ఉన్నావు”(దిష్ట్యా జీవసి ధర్మజ్ఞే – యుద్ధ.౧౧౬-౯) అనిన రామునకు సీతానురాగముపై విశ్వాసమున్నది. రావణవధ జరిగిన తర్వాత సీతకు హనుమంతునిద్వారా సందేశమునిట్లు పంపినాడు-” సీతా! భాగ్యవశమున బ్రతికి ఉన్నావు! నీకు ప్రియము చెప్పుచున్నాను. ఇంకా, సంతోషము కలిగించుచున్నాను. మనకు జయము లభించినది. రావణుడు వధింపబడినాడు. లంక ఇప్పుడు మన వశములో ఉన్నది. ఇక స్వగృహములో ఉన్నట్టుగా ఊరడిల్లుము”(యుద్ధ. ౧౧౬-౯,౧౦,౧౩). సీతావ్యసనమును తలచి తలచి దుఃఖితుడైన రామునకు- ఆమెకు ప్రియము చెప్పి సంతోషింపచేయు సమయము రాగా, తన మనస్సు ఆనందమయముకాగా క్షణకాలము పట్టుదప్పిన మనస్సునుండి అనురాగము, ఆనందము చిన్నచిన్నవాక్యములుగా రాముని నోటినుండి వెలువడినవి. రాముని ఈ స్థితినిబట్టి ఆయన సీతను సంతోషింపచేయుటకై ఎంత ఆతురతతో ఉన్నాడో, ఆమెపై ఆయనకెంత అనురాగమున్నదో వ్యక్తమగుచున్నది. అయినను అవిచారముగా వెనువెంటనే ఆమెను స్వీకరించుటకు రామునకు అవకాశము లేకపోయినది. సీతను స్వీకరించుటకు రామునకు రావణుని అడ్డుతొలగినను, ధర్మము అడ్డునిలచినది. రామునకు సీతయందున్న విశ్వాసముగాని, ప్రేమగాని, జాలిగాని, ఆమె పాతివ్రత్యనిష్టపై ఆయనకున్న మెప్పుగాని- ఇవి ఏవియు రాముడు వెంటనే అవిచారముగా సీతను స్వీకరించుటకు సహకారులు కావు. ఇవి అన్నియు రాముని వైయక్తికాభిప్రాయములు. ధర్మదీక్షాపరతంత్రుడైన రామునకు, వ్యక్తిగతాభిప్రాయములున్న రామునితో సంబంధము లేదు. ఈ రాముడు ధర్మాచరణములో కాఠిన్యమును పూనును, కోపమును తెచ్చుకొనును, నిష్టురముగా మాటాడును, హృదయము జాలితో ఆర్ద్రము కాకుండా జాగరూకుడగును. కావుననే తానున్న దీనదయనీయ స్థితిలోనే రామునిని చూడదలచిన సీతను, అట్లుగాక ” శిరఃస్నాతయు అలంకృతయు ” అయిన పిమ్మట చూడదలచినాడు.

 

ఇంతవరకు వానరరాక్షసులు సీతానిమిత్తమై మహాయుద్ధము చేసిరి కాని, ఆ యుద్ధమునకు కారణమైన సీతను వారు చూడలేదు. సహజ కుతూహలముతో వారు సీతను చూడ మార్గనిరోధము చేయుచుండగా, విభీషణుని ఆజ్ఞచే వేత్రధారులు వారిని తరిమివేయసాగిరి. కోపకారణముల నన్వేషించుచున్న రామునికిది ఉపకరించుచున్నది. విభీషణుని కోపించుచూ రాముడు-“ఈమె యుద్ధభూమిలో ఉన్నది. క్లిష్టస్థితిలో ఉన్నది.(సైషా యుద్ధగతా చైవ కృచ్ఛ్రే చ మహతి స్థితా- యుద్ధ. ౧౧౭-౨౮). అట్టి ఈమెను నా స్వజనమైన వీరు చూచుటలో దోషములేదు” అని తీవ్రముగా పలికినాడు. ఇట రాజసభకు దండనార్థము కొనితేబడిన దోషిస్థానము సీతకిచ్చినాడు. అందుకే నిరావరణముగా బాహాటముగా సీతను ప్రవేశింపచేసినాడు, అందరు ఆమెను చూచుటకు అనుమతించినాడు. సీత ఉన్న క్లిష్టస్థితి ఏమిటో రాముడింకను ప్రకటింపకున్నను, రాముని ఇప్పటిమాటలు, చూపులు, కోపము చూచిన హనుమల్లక్ష్మణసుగ్రీవాదులకు రాముడు సీతను స్వీకరించు స్థితిలో లేడని తలచిరి, అందరును భయభ్రాంతులయిరి.

 

రాముడు దోషిస్థానములో తనను నిలిపినను తనలో ఏ దోషము,మాలిన్యము లేకపోవుటవలన ఆమె మొగము నిర్మలమైన చంద్రబింబమువలెనున్నది-(“విమల శశాంకనిభాననా”). నిర్దోషిపై దోషారోపణము చేసిన కోపమాలిన్యము రామునిలో ఉండుటవలన ఆయన మోము ఎఱ్ఱబాఱి అప్పుడే ఉదయించిన చంద్రబింబమువలెనున్నది.(….ప్రియస్య, వదన ముదిత పూర్ణచంద్రకాంతం – యుద్ధ. ౧౧౪-౩౬) యుద్ధభూమిలో సర్వులముందు దోషిగా నిలిపిన సీతపై రాముడిట్లు దోషారోపణము చేయుచున్నాడు- “రావణుని గాత్రస్పర్శవలనను, వాని క్రూరదృష్టితో చూడబడుటవలనను, శత్రువునింట చాలకాలముండుటవలనను నీ చారిత్రము సందేహాస్పదమై ఉన్నది. తన ఇంటనున్న దివ్యరూపిణివైన నిన్ను చూచుచు రావణుడు సహించి ఉండలేడు. ఇట్టి స్థితిలో నీపై నాకెట్టి ఆసక్తియులేదు. నీవు నీ ఇష్టమైన చోటికి వెళ్ళవచ్చును, నీ ఇష్టమైనవారిని ఆశ్రయింపవచ్చును. అయితే ఇంత ప్రయాసపడి, ప్రాణసంశయమును పొందించు మహాయుద్ధము చేయుట ఎందుకనిన- పరకృత ప్రధర్షణమును సహింపని క్షాత్రధర్మమును కాపాడుకొనుటకు, సీతను రక్షింపకపోయిన రాముడు నిర్వీర్యుడు, నిరమక్రోశుడు అను అపవాదము రాకుండుటకు, ప్రఖ్యాతమైన రఘువంశమునకు కల్గిన అపకీర్తిని పోగొట్టుకొనుటకు- అందుకేగాని ఈ రణపరిశ్రమము నీ కొఱకుగాదు.నీవు యథేచ్ఛముగా వెళ్ళవచ్చును.నీయందు నాకాసక్తిలేదు(నాస్తిమేత్వయ్యభిషంగో- యుద్ధ. ౧౧౮-౨౧)”.

 

రాముడు సీతపై దోషారోపణముచేసి ఆమెను దోషిస్థానములో నిలిపినాడు. సీత తన నిర్దోషిత్వమును నిరూపించుకొనవలసి ఉన్నది. ఆమె ఇట్లనుచున్నది-“ప్రభో! మనమిరువురము చాలకాలము కలిసిపెరిగితిమి, కలిసి జీవించితిమి. అట్టిస్థితిలో నీవు నన్ను పరీక్షించియే ఉందువు. నా స్వభావము నీకు అర్థమయియే ఉండవలయును. అట్లు కానిచో నేను శాశ్వతముగా నశించినదాననగుదును. నాకు పరగాత్రస్పర్శ కలిగినదనగా, నా శరీరము పరాధీనమై ఉన్నది. కాని నా అధీనమందున్న మనస్సు నీయందే ఉన్నది. కేవలము నన్ను సామాన్యమైన ఆడుదానిగా మాత్రమే చూచితివిగాని నా శీలము, నా జన్మమును గూర్చి విచారింపవైతివి. చిన్నప్పుడే నా పాణిని గ్రహించితివి, అప్పటినుండి నా శీలము, నాకు నీపై ఉన్న భక్తి- అన్నింటిని వెనుకకు నెట్టి, వైవాహికబంధమును ప్రమాణముగా స్వీకరింపక, ఎవరో కొందర దురాచరణముచే స్త్రీజాతినంతను శంకించుచున్నావు. నా పాతివ్రత్యముపై శపథము చేతును, నన్ను విశ్వసింపుము.-(యుద్ధ. ౧౧౯-౬,౧౬). తనపై దోషారోపణము చేసిన రామునిని సీత తన శీలమునకు, నిర్దోషిత్వమునకు సాక్షిగా ఎన్నుకొనినది. ఈ సాక్ష్యము కేవలము రాముని విశ్వాసము మీద ఆధారపడి ఉన్నది. ఇప్పుడు రాముడు-“ఆమె చెప్పినది నిజము, ఆమె పతివ్రత,పవిత్రురాలు, ఆమె శీలముపై నాకు విశ్వాసమున్నది” అని చెప్పినచో లోకము రాముని ఈ మాటలను విశ్వసింపదలచినచో రామునకు ఆమెపై దోషారోపణము చేయవలసిన పనిలేదు. కావున ఇట తన సాక్ష్యమునకు, విశ్వాసమునకు ప్రసక్తిలేకపోవుట వలననే రాముడేమియి బదులు చెప్పక, తన నిశ్చయముపై(సీతా పరిత్యాగముకై) స్థిరముగా ఉన్నాడు.

 

హనుమంతుడు, రాముడు సీతకై వ్యథచెందుటకు నాలుగు కారణములూహించినాడు- స్త్రీ అను కారుణ్యము, ఆశ్రితురాలను జాలి, భార్య అను శోకము, ప్రియురాలు అను అనురాగము. ఇప్పుడు రాముడు, “యుద్ధ పరిశ్రమము నీ కొఱకుగాదు” అనుటలో పై నాలుగు హేతువులు వర్తించిన సీతకని అర్థము కాదు, నాల్గవది అయిన “ప్రియురాలు” అను భావము మనస్సులో పెట్టుకుని “యుద్ధము నీకొఱకు కాదు” అనినాడు. అనగా “కేవలము నీవలన వ్యామోహితుడనై యుద్ధము చేయలేదు” అని రాముని భావము. ఇక మిగిలిన మూడు భావములు రాముడు యుద్ధము చేయుటకు హేతువులే. రాముడు తన రణపరిశ్రమమునకు కారణములను చెప్పుచూ,” క్షత్రధర్మచరణమును, అపవాద నిరాసమును” అందులో చేర్చినాడు. “స్త్రీని, ఆశ్రితురాలను” రక్షింపజాలకపోయినాడను అపవాదము పోగొట్టుకొనుట, భార్యాప్రధర్షణమును సహింపని క్షత్రధర్మాచరణమును చేయుట – అను కారణముల వలన రాముడు సీతను చెర విడిపింపవలసి వచ్చినది. కావున రాముడు యుద్ధము చేయుటలో పై మూడు కారణములున్నవి. ఇక నాల్గవ కారణము కేవలము తన వ్యక్తిగత విషయము. సీత తనకు ప్రియురాలు అగుటవలన ఆమె వియోగమును సైపలేక, వ్యామోహముతో, ఆమెను తిరిగి పొందుటకు యుద్ధము చేయలేదని రాముని భావము. అనగా మొదటి మూడు కారణములలో రాముని వైయక్తిక విశేషమేమియు లేదు. అవి క్షత్రియులందరికీ వర్తించునవి, అందరును ఆచరింపవలసినవి. అందువలన వానిని ప్రమాణముగా తీసికొని రాముడు యుద్ధము చేసినాడు. నాల్గవ కారణము వ్యక్తిగతమగుటవలన, యుద్ధమున కది కారణము కాదని రాముని ఆశయము. ఇప్పుడు రాముడు స్వీకరించినచో మిగిలిన మూడు హేతువులకంటె నాల్గవది బలవంతమై, రూఢమై, లోకములో రాముడు కాముకుడై సాపవాదయైన సీతను(భార్యను) స్వీకరించినాడను హేతువు స్థిరపడును. “సాపవాదముతో కూడిన అర్థకామములను స్వీకరింప”నను రాముని ధర్మనిష్ఠకు భంగము కలుగును. కావున సాపవాదయైన భార్యను త్యజించినాడు.

 

అయితే సీతపై వ్యక్తిగత సదభిప్రాయము, ఆమె శీలముపై విశ్వాసమున్న రాముడు ములుకుల వంటి పలుకులు పలుకుచు, ఆమె ముఖములోకి నేరుగా చూడలేక “తిర్యక్ప్రేక్షిత లోచనుడై”నాడు(అడ్డచూపులు చూచినాడు. యుద్ధ -118 -12). హనుమంతుడు రామవిజయమును సీతకు నివేదించి “ఆమె తమను చూడగోరుచున్న”దని రామునికి సీతాసందేశమును చెప్పినపుడు రాముడు “తనలో ఏదో ధ్యానించుకొనుచు కన్నీరు పెట్టుకొనినాడు”, (అగచ్ఛత్ సహసాధ్యానమీషద్బాష్ప పరిప్లుతః.117-5). పిమ్మట వేడి నిట్టూర్పు విడిచి, నేలచూపులు చూచుచు “శిరస్స్నాతయు, అలంకృతయు” అయిన సీతను చూడకోరినాడు. విభీషణుడు సీతను తీసికొనివచ్చి “ఏదో స్మరించుకొనుచు పరాకుగా ఉన్న       ” రామునకు సీతా ఆగమనమును చెప్పినాడు. హనుమంతుని ద్వారా సీతకు సందేశము పంపిన తర్వాత సీతాపరిత్యాగమునకు రాముడు నిశ్చయించుకొనినాడు.. కావుననే యథాస్థితిలో ఉన్న సీతను చూడకోరలేదు. అట్లు నిర్ణయించుకొనినను సీత తనయందే మనసు నిల్పినదని, రావణుడామె దాపునకు పోజాలడని, అగ్నిశిఖవంటి ఆమెను రావణుడు మనస్సుతోనైనను స్పృశింపజాలడని రామునకు తెలియును.  ఇట్లు తెలిసియు ఆమెను స్వీకరింపలేక వైవాహిక బంధమును త్రెంచుకొనుటకు సిద్ధమైనాడు. సీత శీలము, అనురాగము, తత్సంబంధములైన అనేక విషయములను స్మరించుకొనుచు ధ్యాననిమగ్నుడైన  రాముడు కన్నీరు పెట్టుకొనినాడు. అట్లే, జనసభలో భర్తచే విడువబడిన తనకు మరణమే శరణమని తలచిన సీత, రాముని అనుమతితో లక్ష్మణుడు చితిపేర్చగా, రామునకు ప్రదక్షిణము చేసి అగ్నిలో ప్రవేశించిన సీతను చూచి రాముడు బాష్పపూరిత నయనుడైనాడు. ఈ పరిశీలనమును బట్టి రామునకు సీతపై విశ్వాసము, అనురాగము గలవనియు, వానిని ప్రకటించుటకు, లోకమును నమ్మించుటకు వీలులేని స్థితియందుండుటవలన సీతనట్లు కఠినములాడుట, ఆమెను పరిత్యజించుట, ఆమె అగ్నిప్రవేశమును ఉపేక్షించుట జరిగినదని తలంచవలెను.

 

రాముని అపూర్వమైన ఈ దృఢధార్మికనిష్ఠకు దేవతాప్రపంచమంతయు కదలి వచ్చినది. బ్రహ్మ, శంకరుడు, లోకపాలురు, దేవతలు, పితృదేవతలు వచ్చిరి. అగ్నిదేవుడు దివ్యమాల్యాంబర ధారిణియై, అక్షతయై, పావితయైన జానకిని రామునకు సమర్పించుచూ – “త్రికరణములతో ఈమె నిన్నెపుడు అతిచరించలేదు. రావణుని బెదిరింపులు, ప్రలోభములను లక్షింపక నీయందే మనసు నిల్పినది. ఏ పాపమెఱుగనిది. అట్టి ఈమెను మాఱుపలుకక స్వీకరింపుము, నిన్ను ఆజ్ఞాపించుచున్నాను”-(యుద్ధ -121-10)అని పలికినాడు.

 

సీతఎడ తన హృద్గతభావము తనయందే ఇముడ్చుకుని కన్నీరు పెట్టుకొను రామునకు తన విశ్వాసము దైవసాక్షిగా నిజముకాగా దానినిప్పుడు బహిర్గతము చేయుటకు అవకాశము లభించినది. కావున రాముడు సీతను గూర్చి – “ముల్లోకములలో సీతపై పాపమారోపించుట ఎంతమాత్రము తగదు. ఈమె త్రిలోకములలో అత్యంత పరిశుద్ధురాలు. సూర్యునకు తేజస్సువలె ఈమె నాకంటె వేరయినది కాదు. ఇట్టి ఈమెను త్యజించుట అశక్యము.(యుద్ధ. ౧౨౧-౧౩,౧౬,౨౦). అట్లయిన ఇంతకుముందు అట్లేల దోషారోపణము చేసి గర్హించి, త్యజించినాడనిన – ’అవి’ కాలాంతరముననైనను సీత శీలస్వభావము నెఱుగని లోకులు వాకొను నిందాలాపములు- వారు అట్లు నిందించుటకు వీలైన హేతువులను రాముడు తానుగా చూపినాడు. లోకదృష్టిని తనపై ఆరోపించుకొనిన రాముడు ఇట్లనుచున్నాడు -” నా ఎదుట నిల్చిన నీ ప్రవర్తనము సందేహాస్పదమై ఉన్నది. కావున నీ దర్శనము నేత్రరోగికి దీపదర్శనమువలె ప్రతికూలమై ఉన్నది.” రాముని ఈ మాటలలో దీపమునకువలె సీతలో దోషములేదని నేత్రరోగికివలె రామునియందు సందేహదోషమున్నదని విశదమగుచున్నది. ఇది లోకదృష్టిని తనపై నారోపించుకొనిన రాముని దృష్టిగాని, సీతాచరితముపై అచంచల విశ్వాసమున్న , సీతాహృద్గతభావము నెఱిగిన రాముని దృష్టి కాదు. అందుకే ముందుగా తన విశ్వాసమును ప్రకటింపక, లోకదృష్టితో సీతను సందేహించి, అగ్నిపూత అయిన పిమ్మట తన అభిప్రాయమును వ్యక్తము చేసినాడు. అపరీక్షితముగా తాను సీతను స్వీకరించినచో లోకదృష్టి ఎట్లుండునో రాముడిట్లు చెప్పుచున్నాడు -“ఈమె చిరకాలము రావణాంతఃపురమున ఉండుటచే అపవాదమునకు అవకాశమున్నది. ఈమెను నేను పరీక్షింపక పరిగ్రహించినచో ’రాముడు కాముకుడని,మూర్ఖుడని సజ్జనులు నిందింతురు.” ఇట్టి లోకాపవాదము తమకిద్దరకు లేకుండుటకే సీత అగ్నిప్రవేశమును రాముడు ఉపేక్షించినాడు.

 

ఇట్లు రాముడు సీతశీలముపై తన విశ్వాసముకంటె లోకాభిప్రాయమునకు ప్రాధాన్యమిచ్చినాడు. లోకప్రభువుగా పరిపాలనము చేయవలసిన రాముడు లోకమున కాదర్శప్రాయుడై మనవలసియున్నది. అట్టి స్థితిలో తన శీలము శుద్ధమై, సంశయ రహితమై, అపవాదమునకు దూరమై, స్పష్టమై, సర్వ విదితమై ఉండవలయును. అట్టి రాజశీలము ప్రజలకు అనుసరణీయమగును. సర్వవిదితమైన శీలపారిశుద్ధ్యమును అపేక్షించువాడు కావుననే సీతపై తనకున్న విశ్వాసమునకు ప్రాధాన్యమీయక. లోకసుఖము తన సుఖముకంటె విశాలమైనది అగుటవలన సీతపై తనకున్న అనురాగమును త్యజించి, సీత అగ్ని ప్రవేశమును ఉపేక్షించినాడు. చిత్రకూటమునకు ససైన్యముగా వచ్చుచున్న భరతుని చూచి, తమపై దండెత్తి వచ్చుచున్నాడని భ్రాంతిపడి ఉగ్రుడై ధనుస్సు ధరించుమని రామునిని ప్రేరణ చేయుచున్న లక్ష్మణునితో “తండ్రికి-(రాజ్యము భరతునకిత్తునని, పదునాలుగు వత్సరములు తానరణ్యవాసినగుదునని) మాట ఇచ్చి, ఇప్పుడు ఇటకు వచ్చుచున్న భరతుని చంపి, లోకాపవాదముతో కూడిన రాజ్యమును నేనేమి చేసికొందును?” అని సాపవాదమైన రాజ్యరూప అర్థమును త్యజించినాడు. ఇప్పుడు లోకాపవాదమునకు అవకాశమున్న సీతను పరిత్యజించినాడు, ఆమె అగ్నిప్రవేశమును ఉపేక్షించినాడు. భరతునికిచ్చిన మాట ప్రకారము భరతునిచే సభక్తికముగా తనకు నివేదింపబడిన రాజ్యమును స్వీకరించినాడు. అట్లే అగ్నిపూతయై, అపవాదరహితయైన సీతను స్వీకరించినాడు. దీనినిబట్టి రాముని అర్థకామములు ధర్మబద్ధమై, అపవాదరహితమై ఉన్నవని స్పష్టమగుచున్నది. ఇట్లు ధర్మార్థకామములలోని సూక్ష్మాంశముల నెఱిగినవాడు గనుకనే ఆయనను-“ధర్మకామార్థ తత్త్వజ్ఞః” అని ప్రశంసించిరి.

సాహిత్య “ఈ” ప్రస్థానం

రచన: మాచర్ల హనుమంతరావు

 

సుదీర్ఘ చరిత్రగల సాహిత్య ప్రస్థానం అనంతమైనది, నిరంతరమైనది. అందులో తెలుగు సాహిత్యం ఎంతో సుసంపన్నమైనది. ఆధ్యాత్మికమైనా, రసాత్మకమైనా, జనజాగృతిలోనైనా, మనమెంతో గర్వపడేంత విశేషమైనదై, విశిష్టమైనదై, విలక్షణమైనదై వెలుగొందుతోంది. స్త్రీల కోకిల కంఠములలో, కార్మిక, కర్షక, శ్రామిక స్వేదంలో, జానపదుల మోదంలో మొదలైన తెలుగు సాహిత్యం , విభిన్న భావజాలాలతో, భిన్న విభిన్న ప్రక్రియలతో కాలనుగతంగా పరిణితి చెందుతూ ఆయా దేశ కాల సామాజిక పరిస్థితులను, అవసరాలనూ, ఆవశ్యకతలనూ, ప్రతిబింబిస్తూ జనాకాంక్షలను ప్రతిధ్వనిస్తూ అనేకానేక రూపాలు సంతరించుకుంటు వస్తోంది. అనంతమైన సాహిత్య రూపాలను గమనిస్తే – జానపద సాహిత్యం, వచన కవిత, పదకవిత, పద్య కవిత, చంపూ సాహిత్యం, శతక సాహిత్యం, నవలా సాహిత్యం, కధలు, అవధానాలు, ఆశుకవితా, సినిమాసాహిత్యం, విప్లవ సాహిత్యం ఇత్యాది ముఖ్యమైన ప్రక్రియలు కనిపిస్తాయి.

స్థూలంగా గమనిస్తే సాహిత్యమనేది ప్రపంచానికి వెలుగునిచ్చే దీపంలాంటిదని భావించవచ్చు. సాహిత్యపు ఆలోచనలను, తత్వాలను ప్రతిఒక్కరూ తమ నిత్యజీవితంలో ఏదో ఒక రోజు, అనుభవిస్తూనే వుంటారు. సాహిత్యం ఒకమనిషిని నాగరికుడిగా, సంస్కార వంతుడిగా మలుస్తుంది. సాహిత్య ప్రభావంవల్ల గతంలో అనేక దురాచారాలను, మూఢనమ్మకాలను చాలవరకు పారద్రోల గలిగాము. భారత స్వతంత్ర సమరాంగణాన ప్రతిపౌరిని ఒక సైనికునిగా మలచి నిలబెట్టడంలో సాహిత్యం పాత్ర అనిర్వచనీయమైనది. కుల మత లింగ వివక్షతలను రూపుమాపడంలో అనేకమంది కవులు, రచయితలు సాహిత్యంద్వారా తమ వంతు కృషిని అందించారు.

 

మానవ జీవన విధానానికి క్రియాశీలతను, ఆశాభావాన్ని, సంక్షుభితం నుండి రక్షణను కల్పించడంలో ఇతర కళారూపాలతో పాటు సాహిత్యం కూడ ముఖ్యభూమిక పోషిస్తోంది. సామాజికత సాహిత్యపు ప్రధమ లక్ష్యము, లక్షణము అయినప్పటికి దానిని సాధించాలంటే సాహిత్యానికి సామాన్యుని చేరువయ్యె తత్వము, సామాన్యునికి సాహిత్య అభిలాష, దానిని ఆశ్వాదించి ఆనిందించే మానసిక స్థితి, సామాజిక పరిస్థితి అత్యంత ఆవశ్యకం. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రభలిన ఆర్థిక అసమానతలు కాలక్రమేణా శ్రమ జీవనానికి స్వస్తిపలికి భ్రమ జీవనా విధానంలో వినాశనకర శక్తులై విజృంభిస్తున్నాయి. వాణిజ్య వైపరీత్యాలు, విదేశీ సాంస్కృతిక వికృతులు గ్లోబలైజేషన్ ప్రభావంతో మన దేశంలో కూడ వేళ్లూనుకొని అట్టడుగు వర్గాల్నీ ఆర్థిక ప్రలోభాల వైపుకు విజయ వంతంగా మరల్చగలిగాయి. ఇప్పుడు సమాజంలో పెట్టుబడిదారీ వర్గాల దోపిడీని శ్రామిక వర్గాలు కూడా అనుకరిస్తున్నాయి. ఉన్నత వర్గాలు దోపిడీ ఆస్తులు కూడేసుకొని తరతరాలకు తరగని సంపదను దాచుకునేందుకైతే, శ్రామిక వర్గాల దోపిడీ, కుటుంబాల్ని పోషించటంలో ఉన్నత వర్గాల విలాసవంతమైన జీవితాల్ని అనుకరిస్తూ, వ్యసనాల్లో బలైపోతూ తీరని కోరికల్లో ఆశల పందిరికింద అర్థాకలితో కుమిలిపోతూ అందని మ్రాను పండ్లకోసం అర్రులు చాస్తూ ఉండడమే నేడు నవ జీవన విధానంగా భావిస్తున్నారు. ఈ నేపద్యం లో సాహిత్యాభిలాష అన్ని వర్గాల్లో క్రమేణా అడుగంటిపోవడం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. దీనికి తోడు ఉరుకులు పరుగుల యాంత్రిక జీవనం, అధిభౌతికత ఇత్యాదికారణాలతో సంప్రదాయ సహిత్యవాసనలు ఆధునిక మానవునికి చేరలేక పోతున్నాయి.

 

ఇలాంటి పరిస్థితులలో సాహిత్యం తన ఉనికిని కోల్పోకుండా, అస్థిత్వాని నిరుపించుకోవడంతో పాటు తన గమ్యాన్ని ధ్యేయాన్ని లక్ష్యాన్ని సాధించడానికి అంది వచ్చిన మాధ్యమం సాంకేతికవిప్లవం, ముఖ్యంగా “అంతర్జాలం” అనడంలో అతిశయోక్తిలేదు. తెలుగునాట విరివిగా వస్తున్న సాహిత్యం రాశిలోను, వాశిలోను, ప్రపంచ భాషలోని ఏ సాహిత్యానికి ఎంతమాత్రం తీసిపోనప్పటికి, ప్రపంచవ్యాప్తంగా దానికి రావలసిన గుర్తింపు రాకపోవడానికి కారణాలు అనేకం. వాటిలో ముఖ్యమైంది పుంఖాను ఫుంఖాలుగా ముందుకొస్తున్న సాహిత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన పాఠకులకు అందించేందుకు అవసరమైన సరైన వేదికలు లేకపోవడం. తెలుగునాట గల పత్రికలు తెలుగు సాహిత్యానికి సరైన స్థానం ఇవ్వడంలో చాలవరకు వెనుకబడే ఉన్నాయి. ఆందుచేత అంతర్జాతీయంగా పాఠకుల కోసం తెలుగు సాహిత్యానికి కొంగ్రొత్త జాగాలను సృష్టించవలసిన అవసరం ఎంతైనాఉంది. ఈనేపధ్యంలో అవతరిస్తున్న, అభివృధ్ధిచెందుతున్న జాల పత్రికలు, బ్లాగులు, బ్లాగు సంకలనాలు తమ వంతు కృషిని ప్రారంభించి, కొనసాగిస్తున్నాయి. అయితే వీటిలో చాలవరకు వ్యక్తిగతమైనవి, ఔత్సాహిక కూటములు నిర్వహించేవే కన్పిస్తున్నాయి, వీటి పరిధి, వనరులు, అవకాశాలు సహజంగానే చాల పరిమితంగా వుంటాయి.

 

సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా వస్తున్న వేగవంతమైన పరిణామాలను సాహిత్యం అందుకోవలసిన అవసరం ఎంతైనాఉంది. ఇంటర్నెట్, సమాచార విప్లవం సాహిత్య వ్యాప్తిలో గణనీయమైన మార్పు తెచ్చినప్పటికి సాహితీ విలువలు పునరుద్ధరించి అణగారి వున్న సాహితీ మేధస్సును సరైన లక్ష్యంతో రగిలించగలగాలి. అప్పుడే అత్యంత శక్తివంతమైన సాహిత్యం ఆవిర్భవిస్తుంది. భవిష్యత్ తరాలకు అది మార్గదర్శకమవుతుంది. ప్రస్థుత ప్రపంచీకరణ తరుణంలో దోపిడీ, పీడన, ఆణచివేత ఏకీకృతంగా దాడిచేస్తున్న సందర్భంలో దానికి వ్యతిరేకంగా వెల్లువెత్తే ప్రతిఘటనను పతిబింబించే సాహిత్యమూ ప్రపంచీకరించ బడితేనే ఒక బలమైన ప్రభావాన్ని కలిగిస్తుంది, సాహిత్యబలమూ పెరుగుతుంది. ప్రస్థుత సాహిత్యంలో లోపించిన సమిష్టి లక్షణమనే భావనను పునః ప్రతిష్టించి,  చీలికలు పేలికలుగా సాగుతున్న కృషిని ఏకీకృతపరచినప్పుడే  “ఈ” సాహిత్య ప్రస్థానం, మరో మహా ప్రస్థానమై మానవాళికి మహోపకారి కాగలుగుతుంది.

 

~ X ~

 

శివధనుస్సు

రచన : రసజ్ఞ

 

సీతా స్వయంవరం అప్పుడు శివధనస్సు ఎక్కుపెడితే ఎందుకు విరిగిపోతుంది? విరిగిపోతే అందఱూ (బాధపడాలి కానీ) ఎందుకు సంతోషిస్తారు?

 

రాముడు అవతారపురుషుడు అని అందరికీ తెలిసినదే కదా! ఆయన ఏమి చేసినా ఒక మానవుడు ఎలా బ్రతకాలి తద్వారా మోక్షాన్ని ఎలా పొందాలి అని చెప్పడానికే చేశాడు. ఆయన ప్రతీ కదలికకీ అంతరార్థం, పరమార్థం ఉన్నాయి. అలానే శివధనుస్సు విషయానికి వస్తే…..

అకార ఉకార మకారములు ప్రణవము, ప్రణవం
ధనుహు, శరోహ్యాత్మ, బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే
అప్రమత్తేన వేధ్ధవ్యం శరవత్ తన్మయో భవేత్

అన్నారు. అంటే….  అ, ఉ, మ కలిస్తేనే ప్రణవ నాదమయిన ఓం కారం వస్తుంది. ధనుస్సు (ప్రణవం) అంటే ఈ ఓంకారం అనమాట. శరము (బాణము) అంటే ఆత్మ. బాణముతో ధనుస్సును ఎక్కుపెట్టినప్పుడు కనిపించే లక్ష్యమే బ్రహ్మ. ఇక్కడ బ్రహ్మ అనగా పరబ్రహ్మ లేదా పరమాత్మ. బాణాన్ని ఎప్పుడూ అప్రమత్తంగా, చిత్త శుద్ధితో కొడితేనే లయమయ్యి లక్ష్యాన్ని చేరుతుంది. ఇది ధనుస్సు యొక్క అంతరార్థం.

 

ఇక్కడ శివధనుస్సు ఆవిర్భావం గురించి మరికొన్ని విషయాలను తెలుసుకోవాలి. ఈ శివధనుస్సును శివుడు త్రిపురాసురుని సంహరించడం కోసం సృష్టించాడు అన్నది అందరికీ తెలిసినదే! ఈ త్రిపురాసురుడు ఒక జీవుడుని ప్రతిబింబిస్తాడు అని అంతరార్థం ఉంది. అదెలా అంటే, త్రిపురాసురుడు పాలించే మూడు పురములు అయినటువంటి కంచు, వెండి, బంగారములు వరుసగా జీవి యొక్క స్థూల (విశ్వ), సూక్ష్మ (తైజస), కారణ (ప్రాజ్ఞ) శరీరములను ప్రతిబింబిస్తాయి.

స్థూల శరీరం అంటే బాహ్యముగా ఈ విశ్వానికి కనిపించే శరీరం. జీవుడు ఈ శరీరంలో ఉన్నప్పుడు విశ్వుడు అంటారు. ఈ దేహానికి కంచులాగా విలువ లేదు.

సూక్ష్మ శరీరం అంటే కలలో ఉన్నప్పుడు మనకి కనిపించే శరీరం. అది కేవలం ఆలోచన తప్ప అక్కడ ఒక కాయం అన్నది ప్రస్ఫుటముగా ఉండదు. జీవుడు ఈ శరీరంలో ఉన్నప్పుడు తైజసుడు అంటారు. ఈ శరీరం వెండిలాంటిది.

కారణ శరీరం అంటే నేను, నాది అనుకునేది లోపల ఏదయితే ఉందో అది. దీనినే అంతరాత్మ అంటారు. ఇది ఒక రూపం కోసం మాత్రమే పై రెండు రకాల శరీరాల మీద ఆధారపడుతుంది. జీవుడు ఈ శరీరంలో ఉన్నప్పుడు ప్రాజ్ఞుడు అంటారు. ఇది బంగారంలా చాలా విలువయినది.

శివుడు ప్రణవమనే ధనస్సుతో, ఈ మూడు పురములు అనబడే మూడు రకాల శరీరాలని ఒకేసారి ఛేదించాడు. అప్పుడే త్రిపురాసురుడు అనబడే ఈ జీవుని సంహారం జరిగి మరు జన్మ ఉండదు.
ఈ మూడే కాక, మహాకారణ శరీరం అని ఒకటి ఉంది. అది అందరూ గాఢ నిద్రలో అనుభవించే స్థితి. దీనినే తులీయావస్థ అంటారు. ఈ స్థితిని మనం గుర్తించ గలిగి ఆ పరమాత్మలో లయం అవటాన్నే మోక్షం అంటారు. జీవుడిని ఆ మోక్షానికి చేరువ చేసేదే ఓం కారం అయిన ధనుస్సు.

 

శివుడు ఈ శివధనుస్సుని త్రిపురాసుర సంహారానంతరం దేవరాతుడు అనబడే జనకుని వంశ పూర్వీకునికి ఇవ్వగా ఆ నాటి నుండి వారి వద్ద పూజలందుకుంటూ ఉంది. దీనినే శ్రీరాముడు స్వయంవరంలో విరిచి అప్పుడు సీతమ్మ చేయి అందుకుంటాడు. అనగా గృహస్థాశ్రమంలోకి అడుగుపెట్టే ముందు దీనిని విరిచాడు కదా! ఒక మగవాడికి ధర్మార్థ కామ మోక్షాలు పొందడానికి అనువయిన, ఉత్తమమయినది ఈ గృహస్థాశ్రమం. ఇందాకా చెప్పుకున్నట్టు ధనుస్సు అంటే ప్రణవ నాదమయిన ఓంకారం కనుక దానిని విరవటం అంటే ఓం కారాన్ని విడగొట్టడం. అలా విడగొడితే వచ్చేవి మళ్ళీ అ, ఉ, మ. వీటిల్లో
అ – అంటే బ్రహ్మం లేదా పరబ్రహ్మం అంటే పరమాత్మ అయిన శివుడు
ఉ – అంటే అమ్మవారు సాక్షాత్తు శివుని అర్థ భాగం
మ – అంటే జీవుడు అంటే నేను అనే మగవాడు

ఏ మగవాడయినా పరమాత్మలో చేరడానికి కావలసిన మాధ్యమం అర్థభాగమయిన, అర్థాంగి అయిన భార్య. మనకున్న ధర్మార్థకామ మోక్షాలలో….
ధర్మం – ధర్మానికి ప్రతిరూపం భార్య ఆవిడ లేకపోతే ఏ పూజలకీ, యాగాలకీ, జపాలకీ, తపస్సులకీ జీవుడు పనికిరాడు.
అర్థం – మగవానికి సంతాన ఉత్పత్తి కోసం భార్య కావాలి.
కామం – తనకు కావలసిన కోర్కెలు తీర్చుకోవడానికి భార్య కావాలి.
ఇలా ఎప్పుడయితే, ఏ మగవాడయితే ధర్మాన్నీ, అర్థాన్నీ పాటిస్తూ, ఈ రెండూ చెడకుండా కామాన్ని అనుభవిస్తాడో అతనే మోక్షాన్ని పొందే అర్హత సంపాదిస్తాడు.

రాముడు వీటన్నిటినీ ఆలంబిస్తూ ధనుస్సుని విరిచి తను ఈ గృహస్థాశ్రమంలోకి ప్రవేశించే అర్హతని పొందాడు. కనుకనే అతను సీతకి తగినవాడు, అన్నిటినీ జయించినవాడు కనుక అందరూ సంతోషిస్తారు.

శివ ధనుస్సు లాగానే విష్ణు ధనుస్సు కూడా ఉంది. అది పరశురాముని వద్ద ఉంటుంది. ఎప్పుడయితే రాముడు శివ ధనుస్సుని విరిచి సీతని పరిణయమాడతాడో, అప్పుడు అది తెలిసిన పరశురాముడు ఈ విష్ణుధనుస్సుని, ఆయన శక్తిని కూడా రామునికి ఇచ్చేసి హరిహరులని ఏకం చేస్తాడు.

 

 

 

 

 

“అమ్మగారికీ దండంపెట్టూ..”

రచన : జి.ఎస్.లక్ష్మి

“ఏంటే అక్కయ్యా… ఈ పెళ్ళి కైనా నువ్వు రాకపోతే ఇంక నీకు ఫోన్ చెయ్యనంతే..”

 

“అదికాదురా..” ఏదో చెప్పబోతున్న రేణుక మాటల్ని మధ్యలోనే ఆపేసి, “అసలు నువ్వే చెప్పవే.. ఎన్నాళ్ళైంది మనం కలిసి? పదేళ్ళు దాటటంలెదూ.. ఎప్పుడో పెద్దమావయ్యగారి పెద్దబావ పెళ్ళికి వచ్చేవ్. అంతే.. మళ్ళి మనం కలవందే. నా పెళ్ళిక్కూడా రాలేదు.  మా ఆవిణ్ణి చూడవూ?

 

“సరే.. చూస్తాలేరా..” అని ఫోన్ పెట్టేసింది రేణుక.

 

రేణుక వుండేది పూనాలో. రాజమండ్రీలో బుల్లిమావయ్య కూతురి పెళ్ళి. రాంబాబు ఈ విషయం గురించి అప్పుడే రెండోసారి ఫోన్ చేసేడు. ఈ ఉద్యోగాల్లో చుట్టాల పెళ్ళిళ్ళంటే సెలవులివ్వరుకదా. అదీకాక పిల్లలు రమ, సుమల చదువులోటి. ఇంకా పిల్లలు చిన్న క్లాసుల్లో ఉన్నప్పుడు సెలవు లిచ్చినప్పుడల్లా హైదరాబాదు అమ్మావాళ్ళింటికెళ్ళి పదిరోజులుండి వచ్చెయ్యడం తప్పితే చుట్టాలెవర్నీ కలవడం కుదిరేదికాదు. పిల్లలు కాస్త పెద్ద చదువుల కొచ్చేక ఆ వెళ్ళడం కూడా తగ్గిపోయింది. ఇంక ఈసారి పెళ్ళికెలాగైనా వెళ్ళాలనుకుంది.

 

రాంబాబు రేణుకకి చిన్నబాబాయ్ కొడుకు. వేసంకాలం వచ్చేసరికి మావయ్యలూ, పిన్నిలూ అందరూ పిల్లలతో సహా రాజమండ్రి అమ్మమ్మ గారింటికి చేరిపోయేవారు. ఆ సెలవులన్నీ ఎంత హాయిగా గడిచిపోయేవో. తల్చుకుంటే ఇప్పటికీ మనసులోంచి సంతోషం తన్నుకుంటూ పైకొచ్చేస్తుంది.

 

ఆ సంతోషం మళ్ళీ ఎవరితో పంచుకోగలం? కట్టుకున్న మొగుడితో చెబ్దావంటే ఆ చిన్నప్పటి పిల్లచేష్టలు విని తర్వాత సందర్భం దొరికినప్పుడల్లా వెటకారం చేస్తాడేమోనని రేణుక భర్త ముందు ఎప్పుడూ ఆ విషయాలే ఎత్తదు. పోనీ ఆ సరదా విషయాలు పిల్లలతో పంచుకోడానికి రేణుక ఎప్పుడైనా “మా పెద్దమావయ్య తెలుసా..” అని మొదలుపెట్టగానే వాళ్ళు “అబ్బా… అమ్మా… నువ్విప్పుడా ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళకు..వచ్చై.. వచ్చై..ప్రజంట్ కొచ్చై..”అని ఓ దండం పెట్టేస్తారు. అంతే.. మరింక ఆ మాట ఎత్తదు.

 

కాని రేణుక మనసు అప్పుడప్పుడు  చిన్నప్పటి కబుర్లు ఎవరి తోనైనా చెప్పుకుందుకు తహతహలాడిపోతోంది. అందుకే ఈ పెళ్ళి కబురు వినగానే ఈసారి  ఎలాగైనా సరే బుల్లిమావయ్య కూతురి పెళ్ళి కెళ్ళడానికి సిధ్ధమైపోయింది.

 

ప్రయాణం అనుకున్న దగ్గర్నుంచీ మనిషికన్న ముందు మనసు అక్కడికి చేరిపోయింది. ఎన్నాళ్ళయింది అందర్నీ కలిసి.. పెదబావ, శంకరన్నయ్య, పాపాయొదిన, బుజ్జక్క, సుబ్బిగాడు.. సుబ్బిగాడి మాట గుర్తు రాగానే ఆ రోజుల్లో కెళ్ళిపోయింది. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ పిల్లలందర్లోనూ చిన్నవాడు రాంబాబు. రేణుక కన్న ఏడాది చిన్న. అందుకే అస్తమానం రేణుక వెనకాలే తిరుగుతూండేవాడు. మహా చురుకైనవాడు. పెద్దబావ దగ్గర్నించి అందరికీ నిక్ నేమ్ లు పెట్టేసేవాడు.

 

చిన్నమామయ్య కొడుకు సుబ్బిగాడికి అమ్మమ్మ పొద్దున్నే పాలిస్తే అవి గ్లాసు నిండుగా కనిపించాలి. పాపం అమ్మమ్మ వాడి కోసం గ్లాసు అంచులదాకా పాలు పోసి, అవి తొణికిపోకుండా వాడు తాగడం మొదలుపెట్టేదాకా పక్కనే కూర్చునేది. వాడికి “సోలగ్లాసు” అని పేరెట్టాడు రాంబాబు . వాడి గురించి ఏదైనా చెప్పాలన్నప్పుడల్లా “మన సోలగ్లాసు ఉన్నాడు చూడూ..” అని మొదలుపెట్టేవాడు. వాడెంత ఉడుక్కునేవాడో.

 

రాజ్యం అత్తయ్య కయితే బుల్లిమామయ్య రోజూ వస్తూ పకోడీలపొట్లం తేవల్సిందే. అది ఇంట్లో అందరికీ తెలుసు. కాని అందరూ కూడా తెలీనట్లుండేవారు. కాని రాంబాబు మటుకు అత్తయ్యని యేడిపించడానికి సరిగ్గా అత్తయ్య లాగె తిప్పుకుంటూ,

 

“ఏవిటోనర్రా.. అసలందరూ ఆ పకోడీలు ఎలా తింటారో నూనె వాసన వేస్తూనూ..మీ మావయ్యేవిటో ఒద్దన్నా తెస్తూంటారు” అనేవాడు.

 

ఇంక రాజ్యం అత్తయ్య మొహం కందగడ్డలా అయిపోయేది. చాటుగా రాంబాబుని ఒక్కడినీ పిలిచి రెండే రెండు పకోడీముక్కలు చేతిలో పెట్టి అలా మాట్లాడొద్దని బతిమాలుకునేది. ఆ రెండుముక్కలూ రేణుక, రాంబాబు కలిసి ఎవరికీ కనపడకుండా దొంగతనంగా తినేవారు. అబ్బ.. ఎంత బాగుండేవో అవి. ఇప్పటికీ ఆ  పకోడీ రుచి తల్చుకుంటే రేణుకకి నోట్లో నీళ్ళూరిపోతాయి.

 

మరింక పాపాయొదినని పట్టుకుని ఎంత ఏడిపించేవాడో.. వాళ్ళాయన ఒదిన ఏం చెప్తే అది చేసేవాడు. కాఫీగ్లాస్ చేతిలో పట్టుకుని పాపాయొదినకేసి “తాగనా” అన్నట్టు చూసేవాడు. ఒదిన తాగమంటేనే తాగేవాడు. ఆయనకి “గంగిరెద్దు” అని పేరుపెట్టేడు రాంబాబు. ఆయన కనపడినప్పుడల్లా ఒదినవైపు చూసి, “అమ్మగారికీ దండం పెట్టూ” అని ఏడిపించేవాడు. బలే నవ్వొచ్చేసేది.

 

తల్చుకున్నకొద్దీ  గుర్తొచ్చేస్తున్నాయి రేణుకకి ఒకటొకటీను. అప్పుడు రేణుకకి పదేళ్ళు. రాంబాబుకి తొమ్మిది. అప్పుడే బుల్లిపిన్నిపెళ్ళైంది. మగపెళ్ళివారిలో ఎవరో చుట్టపాయన భోజనం చేస్తూ చేస్తూ విస్తట్లో జిలేబీలు జాగ్రత్తగా పక్కనే ఉంచుకున్న సంచిలో వేసుకోడం చూసేడు రాంబాబు. ఆయన మళ్ళీ మళ్ళీ జిలేబీలు అడిగి వడ్డించుకుంటూనే ఉన్నాడు. ఇది చూసిన రేణుక, రాంబాబు భోజనం అయ్యాక ఆయన వెనకాల నడుస్తూ జంటకవుల్లా పదాలు అందుకున్నారు.

 

“ఒక తాయిలారు సంచిలో ఏముందోయ్..”  “చెప్పకు చెప్పకు చిట్టి చిన్నాయ్”

“చెపితే జిలేబి జారుతుందోయ్”   “జారిన జిలేబి ఏమందోయ్”

“పట్టుకొ పెట్టుకో కడుపులో అందోయ్”  “కడుపులొ వేస్తే ఏమందోయ్”

“గుడగుడ గుడమని గొడవందోయ్”   “గుడగుడ గొడవగ ఏమందోయ్”

“డాక్టర్ డాక్టర్ అనమందోయ్”

 

ఇలా ఆయన వెనకాల పడి రేణుక, రాంబాబు చేసిన అల్లరికి పాపం ఆ పెద్దమనిషి జిలేబీలతో పాటు ఆ సంచిని కూడా అక్కడే పందిరి రాట దగ్గర పెట్టేసి పారిపోయాడు.

 

ఈ రాంబాబు తనని మటుకు వదిలేడేవిటీ..? తన పెళ్ళిలో ఆయనకి ఎన్ని రకాల పేర్లు పెట్టి తనని ఎన్ని రకాలుగా ఏడ్పించాడో అనుకుంటున్నకొద్దీ రేణుకకి ఎప్పుడెప్పుడెళ్ళి మళ్ళీ రాంబాబు కబుర్లు విని హాయిగా నవ్వుకుందామా అనిపించింది.

 

అసలదికూడా కాదు.. అందరికీ ఇన్ని పేర్లు పెట్టి ఏడిపించినవాడు ఇంక వాళ్ళావిడకి ఎన్ని పేర్లు పెట్టేడోనని తెలుసుకుందుకు మరీ కుతూహలంగా ఉంది.

 

వాడి పెళ్ళికి వెళ్ళలేకపోయినందుకు ఎంత బాధపడిందో.. సరిగ్గా ఆ టైమ్ కే రమకి, సుమకి పరీక్షలు. చాలా కోపం వచ్చింది రాంబాబుకి రేణుక మీద. ఎన్నోసార్లు ఫోన్ చేసి సారీలు చెప్పుకుంది. కాస్త మామూలుగా మాట్లాడ్డం మొదలుపెట్టేక అడిగింది వాళ్ళావిడ గురించి. వాళ్ళావిడ పేరు సూర్యకాంతం.

 

“ఏరా.. మీ ఆవిడ సూర్యుళ్ళా భగభగ మండిపోతుంటుందా..?” అనడిగింది. అదేంటో.. పెళ్ళాం పేరెత్తగానే వాడి గొంతు మృదువుగా మారిపోయింది.

 

“అబ్బే.. అది చాలా సాఫ్టే. ఎంత అమాయకురాలొ తెలుసా? అసలిప్పటిదాకా నా జీతవెంతో కూడా అడగలేదు. నాకు కొంచెం తలనొప్పొస్తే చాలు ఏడుస్తూ కూర్చుంటుంది. నేనేం తెస్తే అది బాగుందంటుంది. అన్నింటికీ మీ ఇష్టవండీ అంటుంది. నన్నడక్కుండా పక్కింటిక్కూడా వెళ్ళదు తెల్సా.. అన్నింటికీ నేను పక్కనుండాలనుకో..” అలా పొగుడుతూనే ఉన్నాడు.    మొదట విన్నప్పుడు కాస్త బాగానె అనిపించినా ఫోన్ చేసినప్పుడల్లా రాంబాబు తన భార్య ఎంత అమాయకురాలో, నోట్లో వేలు పెట్టినా కొరకలేదన్నట్టు చెప్తుంటే ఈ రోజుల్లో కూడా అలాంటి అమ్మాయిలుంటారా అనిపించింది రేణుకకి.

 

మొత్తానికి రేణుక బ్రహ్మప్రయత్నం మీద ఆఫీస్ లో వారంరోజులు సెలవు తీసుకుని ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంది. ప్రయాణం అనుకోగానే ఇదే మొదటిసారి చూడడంకదా అని పూనాలో ప్రసిధ్ధమైన చీర ఒకటి తీసుకుంది రాంబాబు భార్యకోసం. వాళ్ల ఇద్దరు పిల్లలకీ ఏం తీసుకుందామా అనుకుని, ఏమీ తేల్చుకోలేక సరే డబ్బులే వాళ్ల చేతిలో పెట్టేద్దావులే అనుకుంది.

 

అసలు మామూలుగానే రేణుక కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టు తిరుగుతూ పనులు చేసుకుంటుంటుంది. అఫీస్ పనులూ, ఇంట్లో వంటే కాకుండా పిల్లల చదువులూ, కట్టాల్సిన బిల్లులూ, బైట బజారుపనులూ అన్నీ రేణుకే చేసుకోవడం అలవాటు. రేణుక భర్త రమణ్రావు ఏవీ పట్టించుకోడు. అలాగని తెలివితేటలు లేవనికాదు. చురుగ్గా, తెలివిగా భార్య అన్ని పనులూ చక్కబెట్టుకుంటోంది కదా అని ఆఫీస్ నుంచొచ్చి విశ్రాంతి తీసుకుంటుంటాడు. అందుకని ఈ ప్రయాణం అనుకున్న దగ్గర్నుంచీ మళ్ళీ తను తిరిగి వచ్చేవరకూ ఇంట్లోవాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్నీ అమర్చుకుని, ఇంక ట్రైన్ టైమ్ అయిపోతుంటే ఆయాసపడుతూ వచ్చి ట్రైన్ ఎక్కింది రేణుక. హైద్రాబాద్ లో దిగి అమ్మావాళ్ళింట్లో ఒక్కపూట మటుకు కనిపించి, సాయంత్రానికి విజయవాడ రాంబాబు ఇంటికెళ్ళాలని రేణుక ప్లాన్. వాడింట్లో రెండురోజులుండి అక్కడ్నించి రాజమండ్రీ పెళ్ళికి వాడితో కలిసి వెళ్ళాలని అనుకుంది. అలాగే అందరికీ చెప్పింది కూడా.

 

 

అనుకున్నట్టుగానే విజయవాడ స్టేషన్ లో దిగేటప్పటికి రేణుక కోసం రాంబాబు వచ్చేడు. దాదాపు పదేళ్ళ తర్వాత రాంబాబుని చూస్తే చాలా సంతోషంగా అన్పించింది రేణుకకి. అతన్ని చూస్తూనే నవ్వుతూ అంది” కాస్త బొజ్జ వచ్చినట్టుందే. మీ ఆవిడ బాగా రుచిగా చేసిపెడుతోందనుకుంటాను. ”

 

“అదో పిచ్చిదే. దాని గురించి ఎందుకులే కానీ నీ సంగతి చెప్పు. నీకు అప్పుడే చెంపలు నెరిసినట్టున్నాయే.” ఎదురు వేళాకోళం చేసేడు. ఎప్పుడు భార్య మాటెత్తినా ఒట్టి అమాయకురాలన్నట్టు చెప్తున్న రాంబాబుని చూసి పాపం ఇంత చలాకీ అయిన కుర్రాడికి అలాంటి పెళ్ళాన్నెందుకిచ్చేవురా భగవంతుడా అనుకుంది రేణుక.

 

వీళ్ళు ఇంటికి చేరేసరికి రాత్రి ఎనిమిదవుతోంది. భార్యని పరిచయం చేసేడు రాంబాబు. పరిశీలనగా చూసింది. ఫరవాలేదు. అందగత్తె అనీ చెప్పలేం అలాగని అనాకారీ అని చెప్పలేం. మొత్తానికి రాంబాబు భార్య కనక బాగుందనే అనిపించింది రేణుకకి.

 

“మీగురించి ఈయన అస్తమానం చెప్తుంటారు” అంది సూర్యకాంతం.

 

రాంబాబు బాత్ రూమ్ చూపించి, “అక్కయ్య, నువ్వు కాస్త ఫ్రెష్ అయిరావే ” అన్నాడు.

 

రేణుక లోపలికి వెళ్ళి కాస్త కాళ్ళూ. చేతులూ, మొహం కడుక్కు వస్తుంటే వాళ్ల మాటలు వినపడ్డాయి.

“అక్కయ్యకి కాస్త కాఫీ కలుపుతావా..?” అనడుగుతున్నాడు.

 

“పాలెక్కడివి? సాయంత్రం తోడు పెట్టేసేకదా. మీరు వెళ్ళి పాలు తెస్తే కాఫీ కలపడానికేం.” అదోరకంగా  మాటవిరుపుతో అంది కాంతం.

 

రేణుకని చూడగానే,”రావే అక్కయ్యా. కాసేపట్లో భోంచేసేద్దాం.” అన్నాడు.

 

ఈ లోపల “డాడీ, హోమ్ వర్క్” అంటూ పుస్తకాలు పట్టుకొచ్చేడు పెద్దకొడుకు ఏడేళ్ళవాడు. రెండోక్లాసు చదువుతున్నాడుట. వాణ్ణి కూర్చోబెట్టుకుని హోమ్ వర్క్ చేయించడంలో మునిగిపోయేడు రాంబాబు. రేణుక కాంతంతో నెమ్మదిగా వాళ్ళ పుట్టింటి వివరాలూ గట్రా అడుగుతూ మాటలు కలిపింది.

 

రేణుకతో మాట్లాడుతూ రాంబాబుని చూస్తున్న కాంతం చెప్పింది.

“మా వాడు వాళ్ల నాన్న పక్కన కూర్చుంటే తప్ప హోమ్ వర్క్ చెయ్యడు” అంటూ.

 

తర్వాతి పిల్ల అయిదేళ్ళది. వాళ్ళ అమ్మ దగ్గర కొచ్చి,”ఆకలీ” అంటూ రాగం మొదలుపెట్టింది.

“ముందు చంటిపిల్లకి అన్నం పెట్టై. వాడి హోమ్ వర్క్ అయ్యేక అందరం కలిసి తిందాం.” అని పెద్దరికంగా చెప్పింది రేణుక.

 

“అయ్యో.. అది తిందు కదండీ. వాళ్ళ నాన్న పెడితే తప్ప మెతుకు ముట్టదు.” అంది.

 

మరి కాసేపటికి పెద్దవాడి హోమ్ వర్క్ పూర్తిచేసి, పాపకి ముద్దలు చేసి అన్నం తినిపించి రాంబాబు రేణుకతో అన్నాడు.
“రావే అక్కయ్యా,  నీకు ఆకలేస్తోందో ఏంటో.. భోంచేద్దాం..” అని.

 

ఈ లోపల చంటిది ఏడుపు మొదలుపెట్టింది. ఏవిటా అనుకుంటుంటే రాంబాబు ఆ పిల్లని ఎత్తుకుని భుజం మీద వేసుకుని జోకొడుతూ పచార్లు మొదలుపెట్టేడు. ఇంకో పావుగంటకి కాని అది పడుకోలేదు.

 

కాంతం ఎంతో సంబరంతో చెప్పింది రేణుకకి..”బుల్లిముండ.. వాళ్ళ నాన్న జోకొడితేకాని పడుకోదు..” అని.

సరే.. చంటిది పడుకున్నాక, పెద్దపిల్లాణ్ణి టివీ ముందు కూర్చోబెట్టి ముగ్గురూ భోజనానికి కూర్చున్నారు.

 

“ఇదేవిటీ, పాఠోళీ చేస్తానన్నావ్. ఉట్టి పచ్చడొకటే చేసేవేంటీ..?” అడిగేడు భార్యని.

 

“చేద్దావనే అనుకున్నానండీ. కాని ఎదురింటి వదినగారు పేరంటం పిలవడానికొచ్చి, కాసేపు ఆమాటా. ఈమాటా మాట్లాడేటప్పటికి ఇంక టైమ్ లేకపోయింది.”

 

ఇంకేం మాట్లాడలేదు రాంబాబు. భోంచేస్తూ చుట్టాలందరూ ఎవరెక్కడున్నారో, వాళ్ల పిల్లలు ఏం చదువుతున్నారో మాట్లాడుకుంటూ భోజనం ముగించేరు.

 

భోజనం అయ్యేక రాంబాబూ, తనూ కూర్చుని చిన్నప్పుడు ఎవరెవర్ని ఎలా ఏడిపించేవారో మళ్ళీ మళ్ళి చెప్పుకుని నవ్వుకుందామని ఆశపడింది రేణుక. కాని భోజనాలయిన ఐదు నిమిషాలకే కాంతానికి పాపం తలనెప్పి విపరీతంగా వచ్చేసింది. ఇంక రాంబాబు ఖంగారు చెప్పక్కర్లేదు. పిల్లలిద్దర్నీ తీసుకొచ్చి ముందుగదిలో దివాన్ మీద పడుకోబెట్టేసేడు. బెడ్రూమ్ అంతా లైట్ లేకుండా చీకటి చేసేసేడు. టీవీ ఆపేసేడు. అంతా నిశ్శబ్దం. భార్యకి తలనెప్పి తగ్గడానికి టేబ్లెట్ ఇచ్చి, వేడి వేడిగా టీ పెట్టి ఇచ్చేడు. ఇదంతా చేస్తూ రేణుకతో నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టేడు.

అప్పుడప్పుడు కాంతానికి ఇలా విపరీతమైన తలనెప్పి వచ్చేస్తుందనీ, అలాంటప్పుడు ఇంక ఎవరితోనూ మాట్లాడకుండ పడుకుంటేకాని తగ్గదనీ చెప్పేడు.

 

రేణుక పాపం చాలా బాధపడింది. “ఒరే.. అలాంటప్పుడు ఎవరైనా స్పెషలిస్ట్ కి చూపించలేకపోయేవురా.. మైగ్రేన్ యేమో.. ” అంది.

 

“చూపించేనే. అలాంటిదేవీ లేదన్నారు. బహుశా సైకలాజికల్ ఏదైనా నేమో అన్నారు”

“అదేంట్రా..అంత మనసు బాధపడే విషయం ఏవైయుంటుందీ?”

“అబ్బే.. బాధేం లేదే.. ఈ ఊళ్ళో చాలా యేళ్ళనుంచీ ఉంటున్నాను కదా.. ఎవరి దగ్గరి కెళ్ళినా చాలా జాగ్రత్తగా చూసి ఏమీ ప్రోబ్లమ్ లేదని చెబుతుంటే అది అనుకుందీ..నాకు తెలిసినవాళ్ళున్నారు కనక నేను అలా జబ్బేవీ లేదని చెప్పిస్తున్నాననుకుంటోంది. తనకి నిజంగానే ఏదో పెద్ద జబ్బుఉందని దాని ఫీలింగ్. చెప్పేనుకదే ఒట్టి పిచ్చిది.”

 

రేణుకకి ఏవనడానికీ తోచలేదు. “ఇంక పడుకోవే. ఇంకా మనం మాట్లాడుకుంటుంటే పాపం దానికి డిస్టర్బెన్స్..” అంటూ లైట్ ఆఫ్ చేసేసేడు రాంబాబు.

 

రేణుకకి పడుకుంటే ఏంటో అసంతృప్తిగా అనిపించింది.

మర్నాడు ఉదయం రేణుక లేచేసరికి రాంబాబు కనిపించలేదు. కాంతం పిల్లలిద్దర్నీ పక్కన కూర్చోబెట్టుకుని సోఫాలో కూర్చుని భక్తి టీవీ చూస్తోంది. లేవగానే రేణుక కాంతాన్ని అడిగింది.

 

“ఎలా ఉందిప్పుడు నీకు..?” అంటూ.

 

“కాస్త నయవేనండీ. మీరు బ్రష్ చేసుకురండి.” అంది బరువైన గొంతుతో. ఇంకో మాట మాట్లాడితే ఆవిడ ఎక్కడ సైకలాజికల్ గా ఫీల్ అయిపోతుందోనని రేణుక వెళ్ళి బ్రష్ చేసుకొచ్చింది.

 

రేణుక వచ్చేటప్పటికి రాంబాబు ఎక్కడినుంచో కేన్ తొ పాలు పట్టుకొచ్చేడు. కాంతం ఆ పాలు తీసుకుని పిల్లలకి పాలూ, తమకి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. రేణుకకి ఏవీ అర్ధం కాలేదు. పొద్దున్నే రాంబాబు వెళ్ళాలా పాలకి.. ఇంటికి ఎవరూ తేరా..? అదే అడిగింది.

 

“ఆ పాలపేకట్లు నిలవగా ఉంటాయంటుందే మా ఆవిడ. తను ఆ పాలతో కాఫీ తాగలేదు. అందుకే కాస్త దూరంలో అప్పటికప్పుడు గేదెల పాలు పిండించి తెస్తుంటాను. నువ్వే చూడు. కాఫీ ఎంత బాగుంటుందో..”అన్నాడు. రేణుక నోటమాట రాలేదు.

 

“ఇవాళ మీ అక్కయ్యగారొచ్చేరు కదా.. టిఫిన్ పూరీ, కూరా చేస్తానండీ..” అంది కాంతం కాఫీ తాగుతూ. రాంబాబు మొహం వెలిగిపోయింది.
“నీకు ఓపికుందా.. చెయ్యగలవా..” అని మళ్ళీ మళ్ళీ అడిగేడు.

 

కాంతం నవ్వుతూ లోపలికెళ్ళి పిండి కలపడం మొదలుపెట్టింది. ఈ లోపల రాంబాబు పెద్దవాణ్ణి స్కూల్ లో దింపి వచ్చేడు. సాయం ఏమైనా కావాలేమోనని వంటింట్లో కెళ్ళింది రేణుక. అక్కడి దృశ్యం చూసి ఆశ్చర్యపోయింది. కాంతం ఒక్కొక్క పూరీని నెమ్మదిగా ఒత్తుతూ, పక్కనే ఒక వారపత్రికని పెట్టుకుని ఆ పుస్తకంలో ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క వత్తిన పూరీ పెడుతూ, ఆ పూరీలు ఒకదానికొకటి అంటుకోకుండా పెడుతోంది.

 

“నేను ఒత్తియ్యనా..?” అనడిగింది రేణుక.

 

“ఒద్దండీ. రాకరాక ఒచ్చేరు. మీచేత పని చేయిస్తానా..?” అంది నవ్వుతూ.

 

సరేననుకుంటూ రేణుక స్నానం చేసి వచ్చేసరికి ఇంకా స్టవ్ దగ్గరే ఉన్న కాంతాన్ని చూసింది. ఇంకా ఏం చెస్తోందా అని చూస్తే, నూనె పెట్టి, జాగ్రత్తగా ఒక్కొక్క పూరీని వేయించి ఒక బేసిన్ లో పెట్టి పక్కన పెట్టింది.

 

ఇదేంటి.. అప్పుడే తొమ్మిదవుతోంది. ఇంకా టిఫిన్ పెట్టకుండా మూత పెడుతోందేవిటి అనుకుంటుంటే, అప్పుడు తీరుబడిగా బుట్టలోంచి బంగాళాదుంపలు తీసి, నీళ్ళలో వేసి, ఆ గిన్నె స్టవ్ మీద పెట్టింది.

 

ఒక అరగంటకి అవి ఉడికేక , చిల్లుల పళ్ళెంలో చల్లార్చి, నెమ్మదిగా తొక్క తీసి మరో గిన్నెలో వేసి మూత పెట్టి, అప్పుడు కత్తిపీట ముందు కూర్చుని ఉల్లిపాయలు తరగడం మొదలుపెట్టింది. అవి తరిగి, అల్లం, పచ్చిమిరపకాయలు తరిగి, ఈ లోపల రాంబాబుని కరివేపాకు కోసం మార్కెట్ కి పంపించి, అది వచ్చేక, కూర పోపు వేసి, ఉడికించిన బంగాళాదుంపలు వేసి మొత్తానికి కూర అయిందనిపించేటప్పటికి పదిగంటలైంది. ఇదంతా చూస్తున్న రేణుకకి నీరసం వచ్చేసింది.

 

ఇదేవిటి.. ఆ కూర అంత సేపు చేసేదాకా ఆ పూరీల బేసిన్ చూస్తూ నోట్లో వేలు పెట్టుకుని కూర్చోవాలా.. అనుకుంటుంటే రాంబాబు అన్నాడు. “మా ఆవిడ పూరీ, కూరా బాగా చేస్తుందే.. .. నువ్వే మెచ్చుకుంటావ్ చూడు..” అంటూ.

 

కూర ముందుగా చేసి రెడీగా పెట్టుకుని, పూరీలు వేడి వేడిగా వేసి పెట్టేసే అరగంట పట్టే పనికి, ఏదో చాలా కష్టపడిపోతున్నట్టు అంత బిల్డప్ ఇస్తున్న కాంతం తెలివితేటలకి తెల్లబోయింది రేణుక.

 

మొత్తానికి ఆ చల్లారిపోయి గట్టిగా అయిపోయిన పూరీలు, నీళ్ళుగారిపోతున్న కూర తినేటప్పటికి పదకొండుగంటలై పోయింది. సరే..తనేవైనా పిండివంటలు తినడానికి రాలేదు కదా అనుకుంటూ, “ఇంకేవిట్రా కబుర్లూ..?” అంది. ఎందుకంటే రేణుక వస్తోందని రాంబాబు సెలవు పెట్టేసేడు ఆఫీస్ కి. కాస్త కబుర్లు చెప్పుకోవచ్చు ననుకుంటుంటే ఫోన్ వచ్చింది. కాంతం వాళ్ళ అక్కయ్య చేసింది ఫోన్. ఆ మధ్యాన్నానికి గుంటూరు వాళ్ల చెల్లెలింటికి వస్తోందనీ, కాంతాన్ని కూడా రమ్మనీ ఆ ఫోన్ సారాంశం.

 

“అయ్యో.. రాక రాక ఒదినగారు ఒచ్చేరు. ఇప్పుడు నేను వెడితే బాగుండదు. వెళ్ళను లెండీ..” అంది రాంబాబుతో.

రాంబాబు “అవున్నిజవే. ఇప్పుడెలా వెడతావ్. అందులోనూ రేపందరం కలిసి ఇక్కడినుంచే పెళ్ళి కెడదావనుకుంటున్నాం కదా..” అన్నాడు. కాసేపయేక మళ్ళి కాంతవే “ఇప్పుడు నేను ఎలాగూ వెళ్ళననుకోండి. పోనీలెండి.. వాళ్ళు ఏదైనా అనుకుంటే నన్నే అనుకుంటారు లెండి” అంది.

 

రాంబాబు మాట్లాడలేదు. ఇంకో నివిషవయ్యేక “ఏంటో.. మా చెల్లెల్ని చూసి అప్పుడే నెల దాటిందని చూడ్డాని కొస్తోందేమో మా అక్క.” అంది. అప్పుడూ రాంబాబు మాట్లాడలేదు.

 

“పోన్లెండి. మీరు మటుకు ఏం చేస్తారు. పరిస్థితులు అలా వచ్చేయి..”

 

ఇంకాస్సేపయేక ” అయినా పెళ్ళై ఓ మొగుడు దగ్గర కెళ్ళిపోయేక ఇంకా అక్కా, చెల్లీ అనుకుంటే ఎలా కుదుర్తుంది లెండి..” అంది.

 

వింటున్న కొద్దీ రేణుకకి తనవల్లే కాంతం వాళ్ళ చెల్లెలింటికి వెళ్ళట్లేదేమో నన్నంత అభిప్రాయం వచ్చేసేంతగా అలా ఏదో ఓటి మాట్లాడుతూనే ఉంది.

 

ఈ లోపల రాంబాబే అన్నాడు. “నువ్వలా ఫీలవకు కాంతం. మళ్ళీ తలనెప్పి వచ్చేస్తే చాలా బాధపడతావ్. పోన్లే.. అక్కయ్యా, నేనూ ఉంటాంలే గాని నువ్వెళ్ళిరా..” అన్నాడు.

 

తనవల్లే వాళ్ల చెల్లెలింటికి వెళ్ళడానికి కాంతం మొహమాట పడుతోందనుకున్న రేణుక “హమ్మయ్యా” అనుకుని ఆ గిల్టీ ఫీలింగ్ నుంచి బైట పడింది.

 

కాని తనొక్కతే వెడితే మరి పిల్లల్ని పట్టుకోడం మాటలుకాదుకదా. దానికి మొగుడు పక్కనుండాలి. అందుకని మళ్ళీ అయిదు నిమిషాలకి మళ్ళీ మొదలెట్టింది కాంతం.

 

“చంటిది మీకోసం బెంగెట్టుకుంటుందేమోనండీ. పెద్దాడు మిమ్మల్ని వదిలి ఒక్క పూటేనా ఉండడయ్యె. పోనీ.. మానేస్తాలెండి” అంటూ, నెమ్మదిగా బెడ్ రూమ్ లో కెళ్ళిపోయి పడుకుండిపోయింది.

 

ఇంక అప్పుడు చూడాలి రాంబాబు విన్యాసాలు. ఓ నిమిషానికి బెడ్ రూమ్ లో కెళ్ళి, “కాఫీ ఏమైనా తాగుతావా?” అనడుగుతాడు పెళ్ళాన్ని. ఇంకో నిమిషానికి హాల్లో కొచ్చి,”ఇంకేంటే అక్కయ్యా విశేషాలూ..?” అంటాడు.

 

కాసేపు ఏడుస్తున్న చంటిపిల్లని ఎత్తుకుని తిప్పుతాడు. టైమ్ అవగానే వెళ్ళి స్కూల్ నుంచి కొడుకుని తెచ్చుకున్నాడు. ఇలా అష్టావధానం చేస్తున్న రాంబాబుతో ఎప్పుడేం మాట్లాడాలో తెలీక రేణుక ఆ రోజు పేపర్ మొత్తం చివరి పబ్లిషింగ్ తో సహా చదివేసింది.

 

స్కూల్ నుంచి కొడుకుని తీసుకొచ్చేక రాంబాబు రేణుక దగ్గరకొచ్చి అన్నాడు.

 

“ఒసే అక్కయ్యా.. కాంతం పాపం ఫీలవుతోందే. మేం ఇవాళ గుంటూరు వెళ్ళి, ఎల్లుండి అక్కణ్ణించే పెళ్ళి కొచ్చేస్తాం. మరి నువ్వు ఒక్కదానివీ రాజమండ్రీ వెళ్ళగలవా..?” అని మొహమాటపడిపోతూ అడిగేడు.

 

రేణుక వెంటనే, “ఫరవాలేదురా. పూనా నుంచి ఒక్కదాన్నీ ఒచ్చినదాన్ని, ట్రైన్ ఎక్కిస్తే ఇక్కడ్నించి రాజమండ్రీ వెళ్ళలేనా? నువ్వేం బెంగెట్టుకోకు. మీ ఆవిణ్ణి తీసుకుని గుంటూరు వెళ్ళు.” అంది.

 

రాంబాబు మొహం చేటంత అయ్యింది.

 

“అదేనే.. నువ్వు చురుకైనదానివి, తెలివైనదానివి. నువ్వు వెళ్ళగలవ్. అది ఒట్టి అమాయకురాలు. సాయంత్రం ట్రైన్ ఎక్కిస్తానేం.” అన్నాడు.

 

రాంబాబు చాలా తెలివైనవాడని, ఎదుటిమనిషిని ఇట్టే చదివేస్తాడనీ అనుకున్న రేణుక, అంతకన్న తెలివిగా, పైపైన చల్లచల్లగా మాటలు చెపుతూనే తనకి కావల్సినది భర్త దగ్గర సాధించుకుంటున్న కాంతాన్ని చూసి ఆమె జాణతనానికి ఆశ్చర్యపడకుండా ఉండలేకపోయింది రేణుక .

 

సాయంత్రం తనని స్టేషన్ లో దింపి వెడుతున్న రాంబాబుని చూసి “అమ్మగారికీ దండం పెట్టూ..” అంటూ తన నోట్లోంచి రాబోయిన మాటని చేతితో నోరు మూసేసుకుని బలవంతంగా ఆపుకుంది రేణుక.

 

—————————————————————————————-

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

గృహస్థాశ్రమ ధర్మములు.

రచన : శ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రి

 

గృహస్థుడు భగవద్భక్తుడై యుండవలెను.

భగవద్ఙ్ఞానమే అతని జీవిత పరమావధి.

సదా కర్మ నిరతుడై తన విద్యుక్త ధర్మములను నిర్వహించుచు కర్మఫలముల నీశ్వరార్పణ మొనర్ప వలయును.

జీవనోపాధి నార్జించుట గృహస్థునికి మహా విద్యుక్త ధర్మము. కాని తత్కార్యమును కల్లలాడుటచేతనూ, పరులను మోసగించుటచేతనూ, పరద్రవ్యాదుల నపహరించుటచేతనూ మాత్రము చేయతగదు. మరియు ఈశ్వరసేవయూ  దీనజనసేవయూ తన జీవిత ధర్మములని యాతడు గుర్తింపవలయును.

తల్లిదండ్రులు సాక్షాద్భగవత్స్వరూపులని గ్రహించి గృహస్థుడు సదా సర్వవిధములను వారల సంతుష్టుల నొనర్పవలయును. ఎవ్వని తల్లిదండ్రులు సంతుష్టులో వానిచే భగవంతుడు సంతుష్టుడగును.

తల్లిదండ్రులతో పరుషవాక్యములాడని నందనుడు నిజముగా నందనుడు. తల్లిదండ్రుల యెదుట నెన్నడును పరిహాసము చేయరాదు. ఔధ్ధత్యమునుగాని, కోపమునుగాని, క్రోధమునుగాని చూపరాదు. తల్లిదండ్రుల యెదుట అవనతుడై నిలువవలయును. కూర్చుండ నాఙ్ఞాపితుడగువరకు కూర్చుండరాదు.

తల్లికిని, తండ్రికిని, బిడ్డలకును, భార్యకును, పేదలకునూ పెట్టనిదే గృహస్థుడు భుజింపరాదు. అటుల భుజించుట పాపకార్యము. ఈ శరీరమునకు తల్లిదండ్రులే కారణభూతులు కావున వారలకు హితమొనర్చుటకై మానవుడెన్ని కష్టములనైన అనుభవించుట కర్తవ్యము.

తన భార్య యెడలను ఆతని విధ్యుక్తధర్మ మిట్టిదే. భార్య నాతడు దూషింపరాదు. కేవలము తల్లిగా భావించి యామెను పోషింపవలెను. తానెంతటి మహా కష్టము లనుభవించినను భార్యపై కోపింపరాదు.

పరస్త్రీని గురించి చింతించువాడు__కేవలము మానసికంగా పరస్త్రీని స్పృశించిననూ__ఘోర నరకము పొందును.

స్త్రీల యెదుట అసభ్య సంభాషణ చేయరాదు. తన శక్తిసామర్ధ్యములను గూర్చి ప్రగల్భము లాడరాదు.

ధనముచే, వస్త్రములచే, ప్రేమచే, నమ్మికచే, మధుర వాక్కులచే గృహస్థుడు తన భార్యను సంతుష్ట నొనర్పవలయును. ఆమె మానసము క్షోభించు కార్య మెన్నడును చేయరాదు. పతివ్రతయగు భార్య యొక్క ప్రేమను బొందగల్గినవాడు సమస్త ధర్మములందును కృతకృత్యుడగుచున్నాడు. సమస్త సద్గుణముల నార్జించుచున్నాడు.

బిడ్డలయెడ గృహస్థు డవలంబింపవలసిన ధర్మము లేవన…

నాలుగేండ్లప్రాయము వచ్చువరకూ పుత్రుని ప్రేమానురాగాలతో పెంచుచూ, పదునారేండ్లవరకూ విద్యాబుధ్ధులను గరపవలెను. ఇరువదియేండ్లప్రాయమున నాతని నేదియో యొక యుద్యోగమున లేక కృషి యందు నియోగింపవలయును. తండ్రి యతని నప్పుడు ప్రేమతో తన సమానునిగా జూడవలయును. సరిగా నిదే విధముగా కుమార్తెను బెంచి విశేషశ్రధ్ధతో నామెకు విద్యాబుధ్ధులను గరపవలయును. వివాహసమయమున తండ్రి యామెకు నగలను ధనము నొసగవలెను.

ఇక నాతనికి తన అన్నదమ్ములయెడ అక్కసెల్లెండ్రయెడ పేదలైయున్నయెడ వారి బిడ్డలయెడ, మిగిలిన తన బంధువర్గమునెడ, స్నేహితులయెడ, సేవకులయెడ విధ్యుక్తధర్మములు కలవు. పిమ్మట తన గ్రామవాసుల యెడలను, బీదలయెడను, యెవరైన కానిండు- తన సాయము నర్ధించువారలయెడనూ గృహస్థునకు ధర్మము లేర్పడినవి.

తగినంత స్థితి నందుండియు గృహస్థుడు తన బందుగులకును పేదలకును బెట్టనియెడల నట్టివాడు మానవమాత్రుడు గాడనియూ, వట్టి పశువనియూ గ్రహింపుడు.

వస్త్రాహారములందు, శరీరపోషణమునందు, తలదువ్వుకొనుటయందు వ్యామోహము కూడదు. గృహస్థుడు పవిత్ర హృదయుడై పరిశుధ్ధ శరీరుడైయుండుటయేగాక కర్మపరాయణుడై యుండవలయును. మితాహారీ, మితభాషణుడూ, తగిన నిద్రకలవాడూ అయియుండవలెను.

శత్రువులయెడ గృహస్థుడు వీరుడై వర్తింప వలెను.శత్రువుల కతడు ప్రతీకారము చేయుట అతడి విధిగా గుర్తింపవలెను.

గురువులయెడను, బందుగులయెడను అతడు శాంతమూర్తియై మెలగవలెను.

దుర్మార్గులను గౌరవింపరాదు. మరియు గౌరవార్హులగు సజ్జనుల నవఙ్ఞ చేసిననూ తప్పు చేసినవాడగును.

స్నేహ మొనర్చుటలో మైమరిచి సంచరింపరాదు. తాను స్నేహము చేయదలచినవారి చర్యలను, పరులతో వారి వ్యవహార ధర్మములను కనిపెట్టి, వారిని గూర్చి పర్యాలోచించి మరీ వారితో స్నేహము చేయవలయును.

తన పేరుప్రఖ్యాతులను గురించి నలువురి యెదుటను సంభాషింపరాదు. తన శక్తిసామర్ధ్యముల గురించియు, సంపదను గూర్చియూ లేక తనకు రహస్యముగా దెలుపబడిన విషయముల గురించియూ ప్రసంగింపరాదు. ఈ మూడు విషయములని గురించియు గృహస్థుడు మాట్లాడరాదు.

తాను దరిద్రుడనని కాని భాగ్యవంతుడనని కాని చెప్పరాదు. తన సిరిసంపదలగూర్చి ప్రగల్భములు పలుకరాదు. ఇది యాతని పరమ ధర్మము. ఇటు లొనర్పనియెడల  ప్రజలాతని నధర్మవర్తనుడందురు.

అతడేదైన పొరపాటు చేసినప్పుడు కాని, దౌర్బల్యమున కధీనుడైనప్పుడు కాని నలువురి యెదుట తన గుట్టును వెల్లడించుకోరాదు. నేదేని యుద్యమము నారంభించినప్పుడు తన కందు జయము లభింపదని నిశ్చయముగా నెరిగినుండియూ దానిని వెల్లడింపరాదు.

విద్యాధనముల  నార్జించుటకై శక్తివంచన లేక ప్రయత్నించుట విద్యుక్తధర్మము. తన విధిని నెరవేర్పనిచో అతడు గృహస్థు డనిపించుకోజాలడు.

లోకులు తరచు తాను నెరవేర్ప సాధన సంపదలు లేని కార్యములలో దిగుచు స్వలాభమునకై పరులను వంచించుచుందురు. సర్వవిషయముల సాఫల్యమునకును కాలమనునది యొకటి యున్నది కదా! ఒక సమయమున అపజయముగా పరిణమించునదే వేరొక సమయమున దిగ్విజయమై పరిణమింపవచ్చును.

జనహితము నొనగూర్చినవియు, జనులకు ప్రీతికరములగు మాటలనుపయోగించుచు గృహస్థుడు మృదులమగురీతిని సత్య సంభాషణ మొనర్పవలెను. పరుల వ్యాపారముల గురించి అతడు పలుకరాదు.

చెరువులను త్రవ్వించుచూ, బాటల కిరువైపులా చెట్లు నాటించుచూ మానవులకునూ, జంతువులకునూ విశ్రాంతిమందిరములను నిర్మించుచూ, బాటలను వేయించుచు వంతెనలను గట్టించుచు గృహస్థుడు యోగింద్ర లభ్యమగు నుత్తమోత్తమగతిని బొందుచున్నాడు.

స్వదేశము కొరకుగాని, స్వధర్మము కొరకుగాని యుధ్ధరంగమున ప్రాణములనుబాయు గృహస్థుడు ధ్యానముచే యోగి పొందు పరమపదమునే పొందుచున్నాడు.

 

_   మహానిర్వాణతంత్రము

అష్టమోల్లాసము.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

చివరకు మిగిలేది…. బుచ్చిబాబు

రచన : మానస చామర్తి
వందేళ్ళ జీవితాన్ని చవిచూచిన వృద్ధులైనా, విద్యా సాగర సంచితాన్ని ఔపాసన పట్టిన అగస్త్యులైనా, సన్యాసులైనా, సంసారులైనా సమాధానం చెప్పే ముందు పునరాలోచించుకోదలచే ప్రశ్న ఒకటుంది . అది “చివరకు మిగిలేది”  ఏమిటన్నది. సరిగ్గా దీనినే నాందీ వాక్యంగా ఎన్నుకుని, తెలుగు సాహితీ చరిత్రలో తొలి మనో వైజ్ఞానిక నవల గానూ, తెలుగు తల్లి కీర్తి కిరీటంలో వెలుగులీనే మరకతమణి గానూ నిలువగల నవలగానూ పేరొందిన రచన చేశారు బుచ్చిబాబు.
 
సందిగ్ద్థ స్థితుల్లో సద్వివేకాన్ని సాయమడిగి, సరైన సమయంలో జీవితాన్ని అల్లకల్లోలాల నుండి బయట పడవేయగల నిర్ణయం తీసుకోలేకపోవడమే మానవ జీవితానికి సంబంధించిన అతి పెద్ద విషాదం. దయానిథి జీవితమంతా అటువంటి విషాదమే నిండి ఉన్నట్టు నాకనిపించింది. కథ మొత్తం చెప్పను కానీ – వ్యాసం నిడివిని దృష్టిలో ఉంచుకుని కథలోని పాత్రలను కొద్దిగా పరిచయం చేస్తాను.
కోమలి, ఇందిర, అమృత ఈ పుస్తకంలో ప్రముఖంగా కనపడే స్త్రీ పాత్రలు. దయానిథి, “చివరకి మిగిలేది” నాయకుడు. తన తల్లి నైతికత మీద బాల్యం నుండీ ఎన్నో మాటలు వింటూ పెరగడం చేత, అతని మనస్సులో ఒక విథమైన అల్లకల్లోల స్థితి నెలకొని ఉంటుంది. సంఘంలో కలివిడిగా తిరగలేని, అందరికీ దగ్గరవ్వలేని అంతర్ముఖుడి వంటి మనస్తత్వంతో పెరుగుతూంటాడు. ఇతనికి కోమలి అనే పల్లె పిల్లపై వాంచో ప్రేమో తేల్చుకోరాని అభిమానం. పరిస్థితుల వల్ల ఇతనికి ఇందిర అనే ఆమెతో పెళ్ళవుతుంది. ఆ పెళ్ళి మూణ్ణాళ్ళ ముచ్చటై ఇందిర అతన్ని వదిలి వెళ్ళిపోతుంది; ఆరోగ్య సంబంధిత కారణాల వల్ల కొన్నాళ్ళకి కన్ను మూస్తుంది. అమృతం దయానిథికి మరదలి వరుస. తల్లి తరువాత దయానిథి పట్ల అంత దయతోనూ, అనురాగంతోనూ ఉన్న వ్యక్తి కనుక, ఆమె అంటే అవ్యక్తానురాగం ఉంటుంది . అయితే, అనుకోని సందర్భంలో, వీళ్ళిద్దరి మధ్యా శారీరక సంబంధం ఏర్పడి, అది అతన్ని మానసికంగా దెబ్బ తీస్తుంది; అతనిలోని నైతికతను ప్రశ్నిస్తుంది.  తన తల్లి చేసిందని చెప్పబడే అదే తప్పు, తానూ చేసి, మరొక స్త్రీని, తద్వారా ఆమె కుటుంబాన్ని మళ్ళి సంక్షోభంలోకి నెట్టానా అన్న మథన ఉదయిస్తుంది.  అయితే, అమృతం గుండె దిటవు కల్గిన మహిళ. చేసిన దానికి వగచడం, గతాన్ని చూసి విలపించి పశ్చాత్తాపపడడం, ఆమె నైజం కాదు. దయానిథి ద్వారా బిడ్డను పొందినా, అతను ఇంటికి వచ్చినప్పుడు ఏమీ ఎఱుగనట్టే, అసలేమీ జరగనట్టే నింపాదిగా కబుర్లు చెప్పి అతన్ని సాగనంపుతుంది. ఇది, దయానిథికి కాస్త ఊరట నిచ్చిందనే చెప్పవచ్చు. ఈ కథ మొత్తంలో, ప్రతీ సారీ తన అద్భుతమైన సంభాషణలతో, నచ్చింది నచ్చినట్టు చేయగల తెగువతో, “ఈ క్షణం”లో బ్రతకగల తాత్విక నైజంతో నన్ను వలలో వేసుకున్న జాణ నిస్సందేహంగా అమృతం పాత్రే!
తల్లి బలవంతం చేత, డబ్బుకు లోబడి ఒక ధనవంతునితో వెళ్ళిపోతుంది కోమలి. అయితే, అక్కడ ఇమడలేక, తిరిగి దయానిథి చెంతకే చేరుతుంది. కోమలి పట్ల ఎంత మమకారం ఉన్నా, ఆమెను పెళ్ళి చేసుకోడు, పరిథులు దాటి వారిరువురూ ఒక్కటవ్వాలనుకోడు. దానికి కారణాలు, కోమలితో అతని అనుబంధం ఆఖరుగా చేరిన తీరం,  “చివరకు మిగిలేది” ఏమిటన్న అతన్ని వెంటాడిన ప్రశ్నకు, చిట్టచివరకు దొరికిన సమాధానం, ఇవన్నీ ఆఖరు అధ్యాయంలో చదవగలం.
ఇదీ, పొడి పొడి మాటల్లో, నా మాటల్లో, ఈ నవల కథ.
*****************************************************
 భార్యా భర్తల మధ్య పొరపచ్చాలు, జీవితాన్ని ప్రేమించగల పడతి కోసం కుటుంబ కట్టుబాట్లను ధిక్కరించైనా సరే, ముందడుగు వేయాలనుకోవడం, తదనంతర ఘర్షణలూ – ఇవి కాలాలకతీతంగా రచయితలను ఆకర్షించే కథా వస్తువులు.
నిజానికి మనం చదివి వదిలేసిన పుస్తకాల్లోని పాత్రలు, మన గతంలో కలిసిపోయిన వ్యక్తుల జ్ఞాపకాలను తట్టి లేపడం అనేది తఱచుగా జరిగే ప్రక్రియే. అలాగే ఒక రచనలోని పాత్రల చిత్రీకరణ, మరొక రచనను/పాత్రను గుర్తు తేవడము కూడా అసహజమైన విషయమేమీ కాదు.
“చివరకు మిగిలేది”లోని కొన్ని పాత్రలను, బహుళ ప్రాచుర్యం పొందిన కొన్ని రచనల్లోని పాత్రలతో పోల్చి చూడడం రెండు దశాబ్దాల క్రితమే
జరిగింది. ముఖ్యంగా విశ్వనాథ వేయి పడగలతోనూ, చలం రచనల్లోని స్త్రీ పాత్రలతోనూ,  షేక్స్‌పియర్ హామ్లెట్ నాటకంతోనూ, “చివరకు మిగిలేది” త్రలను దగ్గరగా పరిశీలించి చూసిన వారున్నారు.  ఈ మాటలను ఇంతకు ముందే సాహితీ మిత్రుల వద్దా, ఆత్మీయుల దగ్గరా విని ఉండడటం, దాదాపు ఒకే కాలంలో, చివరకు మిగిలేది – అమీనా – వేయి పడగలు చదివే అవకాశం రావడం, ఈ పాత్రల్లోని
సారూప్యాలను  పైపైన స్పృశిస్తూ ఈ వ్యాసం రాసేందుకు నాకు ప్రోద్బలాన్ని అందించాయి.
**********************************************
“నా కొరకు చెమ్మగిల నయనమ్ము లేదు..” అని “కృష్ణపక్షం”లో వేదన పడతారు
దేవులపల్లి. ఈ ప్రేమించలేకపోవడమే, “చివరకు మిగిలేది”లో ఆసాంతమూ ప్రథానంగా
కనపడుతుంది. బుచ్చిబాబు మాటల్లోనే చెప్పాలంటే, ” ప్రేమించలేకపోవడం ఒక్కటే
ఈ నవలలో వస్తువు కాదు. జీవితంలో “చెడుగు” -ముఖ్యంగా పెద్దవారి తప్పిదాలు,
చిన్నవాళ్ళ జీవితాలను ఏ విధంగా వికసించనీయకుండా, పాడు చేసింది..ఇది కూడా
ఒక ప్రథానమైన అంశమే!”  అలాగే ముందుమాటను బట్టి, వ్యక్తిగతమైన విముక్తి ఈ నవలకి ప్రేరణగా
పాఠకులకు అర్థమవుతుంది.
వివాహాలు సాఫల్యతనూ సంపూర్ణత్వాన్నీ పొందడానికి, ఇద్దరు వ్యక్తుల మధ్య
పరస్పర ప్రేమభావం, సడలని నమ్మకం, వ్యక్తావ్యక్త అనురాగాలూ ఆవశ్యకాలు.
అయితే వీటితో బాటు, ఇరు కుటుంబాల మధ్య సహృద్భావాలు, దంపతుల మధ్య సాంఘిక
ఆర్థిక తారతమ్యాలను గుర్తు చేసి పొరపొచ్చాలను సృష్టించని తల్లిదండ్రులు,
బంధువుల పాత్ర, ఆ కాలంలోనూ – ఈ కాలంలోనూ కూడా తీసిపారేయలేనివిగా
కనపడుతున్నాయి. వివాహం పట్ల మొదటి నుండీ విముఖత కలిగినవాడు దయానిథి. తన
తల్లి ద్వారానైతేనేమి, తాను చూసిన లోకపు పోకడల వల్ల నైతేనేమి, అతనెన్నడూ
పెళ్ళి అనే పంజరంలో చిక్కుకోదలచినట్లుగా కనపడడు. తన తండ్రి పదే పదే తల్లి
ప్రస్తావన తెచ్చి, కోమలి విషయమై నిగ్గదీస్తూ, “నీకెందుకు పెళ్ళి సంబంధాలు
రావడం లేదో తెలుసుకున్నావా?” అని ప్రశ్నించినప్పుడు, దయానిథి ” నాకేమీ
బెంగ లేద”ని నిర్వికారంగా  చెప్పగల్గుతాడు.
చిట్టచివరికి కేవలం తండ్రి నిర్ణయానికి తలొగ్గి ఇందిరను పెళ్ళిచేసుకున్నా, వారిద్దరి మధ్యా ప్రేమ చిగురులు తొడగగల అవకాశాలు కానఁగరావు. తండ్రి మాట పట్టుకుని ఇందిర వెళ్ళిపోతుంది. దయానిథి తిరిగి ఆమెను తన వద్దకు తెచ్చుకునే ప్రయత్నాలేమీ చేయడు. మళ్ళీ ఆమెను చూసింది ఆఖరు నిముషాల్లోనే!  ఇందిర – వివాహ వ్యవస్థను పూర్తిగా తృణీకరించిందని అనుకోలేం! ఆమె అటువంటిదే అయితే, కేవలం వివాహ బంధాన్ని నమ్ముకుని దయానిథికి చేరువ కాదు. ఆమెలోని ఈ అర్పణ బావం దయానిథికి అర్థమయ్యేసరికి ఆలశ్యమైపోయిందని కఠోర వాస్తవం. నిజానికి వాళ్ళిద్దరి మధ్యా అపురూపమైన బంధమన్నది ఏ నాడూలేదు. ఇందిర మరణించే ముందు క్షణాల్లో దయానిథి ఆమెను చూడడానికి వెళ్ళినప్పుడు, ఇందిర బయల్పరచిన ప్రేమ, ఎదురుచూపులు ఫలించినందుకు ఆమెలో కలిగిన ఆనందం, ఇవన్నీ దయానిథిని అణువంతైనా కదిలించవు.
ఇది బుచ్చి బాబు మాటల్లో చదవడం ఇంకా బాగుంటుంది – ” దయానిథి ఇందిరతో కలిసి ఉన్నప్పుడు గుండెలూ గుండెలూ విశ్వగానంతో మేళవించి కలిసి కొట్టుకోలేదు. అన్ని నదులూ కలిసిపొయ్యే మహాసముద్రంలాంటి ప్రేమ ప్రవాహంలో వారి రక్తాలు వేరువేరుగానే ప్రవహించాయి. <….> పాటలు, పద్యాలు, యజ్ఞాలు. యాగాలు. క్రతువులు – ఎన్ని చేసినా, చందమామ అంతకంటే ఎక్కువగా ప్రకాశించదు. గాలి అంతకంటే జోరుగా వీయదు. కెరటాల సంఖ్య
పెంచుకోలేదు సముద్రం. ప్రేమించదు మానవ హృదయం” – అక్షర సత్యాలే కదూ! ప్రేమ పుట్టాలంటే హృదయం కరగాలి కానీ, వేరే ఏ మార్గమూ ఫలించదు కదా!
విశ్వనాథ వారి వేయిపడగలులో, అరుంధతి సైతం మొదట్లో భర్త పట్ల వ్యతిరేక భావాలను కలిగి ఉంటుంది. అక్కడ అరుంధతికీ, ఇక్కడ ఇందిరకూ, ఈ విధమైన భావాలు కలుగజేయడంలో పుట్టింటి వారి పాత్ర కాదనలేనిది. అయితే, అరుంధతికి, మనసు మార్చేందుకు, మగని ఆదరణలో స్త్రీ పొందగలిగిన ఐశ్వర్యాన్ని అర్థమయ్యేలా చెప్పేందుకు, రాజేశ్వరి పాత్ర ఉంది. అటువంటి తోడు దొరక్కపోవడం, దయానిథి -ఇందిరల ప్రేమకథను విఫల ప్రణయంగా మార్చివేసింది.  “హృదయములో సముద్ర మథన వేళ క్షీరసాగర గర్భగత తరంగముల నుండి చంద్రుడావిర్భవించినట్లు ఒక మహదానంద రేఖ పొడసూపెను. అతడామె వంకనే చూచుచుండెను. ఆమె తల ఎత్తి యతనిని చూచెను. “వ్యాకరణ దోషము లెఱుగని యా కన్నులలోని భాష యేమో, అపండితులగు వా రిద్దఱకు చక్కగా నర్థమై..” అంటూ సాగే “వేయిపడగలు” కథనంలో, ధర్మారావు- అరుంధతిల మధ్య మెల్లగా వెలుగుజూసిన సౌహార్దము, వీగుతున్న అవిశ్వాశాల మధ్య వైదొలగుతున్న అనుమానాలూ – వెల్లివిరుస్తున్న వలపు భావనలూ మనలో కూడా హర్షాతిరేకాన్ని కలిగిస్తాయి. దురదృష్టవశాత్తూ, “ఓసి పిచ్చి పిల్లా! మగడేమున్నదే? నీ వెట్లు చెప్పిన అట్లు వినెడి వాడు. చెప్పెడి నేర్పులో నున్నది కాని;” అంటూ సుద్దులతో మనసు మార్చగల రాజ్యలక్ష్మి లాంటి పాత్ర లేని లోటే, ఇందిరనూ -అరుంధతినూ భిన్న నాయికలను చేశాయని తోస్తుంది.
******************
తీవ్రమైన భావేశం, తనకు తప్ప వేరెవ్వరికీ అర్థం కానీ ఆరాటాలూ – మనస్సాక్షి ననుసరించి ఏదైనా చేయగల్గిన స్వేచ్ఛ – దానికై తపన – ఇవన్నీ బుచ్చిబాబు కంటే ముందే సాహిత్యంలో పొందుపరిచిన రచయితలు మనకున్నారు. సారూప్యాల రీత్యా చూస్తే, “చివరకు మిగిలేది”లోని కోమలి పాత్ర, నేను ఇటీవలే చదివిన చలం “అమీనా”ను పదే పదే నాకు గుర్తు తెచ్చింది. కోమలీ, అమీనా ఇద్దరూ ప్రకృతి ఒడిలో హాయిగా ఆడుతూ పాడుతూ స్వేచ్ఛగా మసలే
పల్లె జీవులు. ఇద్దరికీ సమస్యలూ, సందేహాలూ లేవు. బాధ్యతల పట్ల భయం లేదు. జీవితాన్ని ఆస్వాదించే గుణాన్ని, వారి చుట్టూ ముసురుకున్న క్లిష్ట పరిస్థితుల పట్ల ఒక విధమైన నిర్లక్ష్యాన్నీ – ఈ రెండు పాత్రల చిత్రీకరణల్లోనూ స్పష్టంగా చూడగలం.
“అట్లా గడ్డిపోచల మధ్య గంతులేస్తూ ఆకాశాన్నీ, భూమినీ బుజ్జగిస్తూ స్నేహం చేసుకుంటూ ఉండవలసిన వ్యక్తి కోమలి. ఆమె నిజస్థానం అది. పుట్టినిల్లు పచ్చగడ్డి. అత్తిల్లు ఆకాశం. సర్వీ చెట్లు వానాకాలంలో పీల్చుకున్న వర్షం నీటిని ఈనాడు మెల్లమెల్లగా వదులుతూ కోమలిని మధ్య కూచోబెట్టి తలంటుపోస్తుంది. గాలి సిగ్గులేని పిచ్చి పువ్వుని బలవంతంగా తలలో అమరుస్తుంది. ఎర్రపువ్వులను బంధించుతున్న గడ్డిపోచలు గాలికి ఎండలో మెరుస్తూ లయగా ఆరబెట్టిన ఆకుపచ్చ పట్టుచీరలా, ఎండుకుని, కోమలిని చుట్టుకుంటాయి, ఆకలి దాహాలు లేని అయోమయపు ఆశదారుణాలు, ఎరగని దైవత్వం, హద్దులు లేని అనుభవం ఆమె”  — అంటాడు కోమలి గురించి బుచ్చిబాబు.
అమీనా చలానికి ఒక చింకిరి తుంటరి, బంధనాలు లేని చేపలు పట్టుకునే ముసల్‌మాన్ బాలికగా పరిచయం. కోమలీ అలాంటిదే! కోమలికి దయానిథికీ మధ్య వారిరువురనూ చేరువ కానీయకుండా ఆమె తల్లి ఉంటుంది.  ఇక్కడ అమీనాను చలానికి దూరం చేసి ఒక  ముసలి వ్యక్తితో పెళ్ళి చేస్తుంది ఆమె తల్లి కూడా..! కానైతే, చివరికి సమాజానికి భయపడి, అయిష్టంగానే అమీనాతో కఠినంగా వ్యవహరించి ఆమెను దూరం చేసుకుని వగచే చలాన్ని చూస్తాం. కోమలి కూడా ఒక ధనవతుండితో వెళ్ళిపోయినా, అది తాత్కాలికమై, మళ్ళీ దయానిథిని చేరుకోగలగడం  ఈ రెండు కథల మధ్యా ఉన్న వైరుధ్యం.
*****************************
“To be without some of the things you want is an indispensable part of happiness”  అన్న రస్సెల్ మాటలను దయానిథి పాత్ర సంపూర్ణంగా వంటబట్టించుకున్నట్లు కొన్ని కొన్ని సన్నివేశాలు నిరూపిస్తాయి.
కోమలి పట్ల తనకున్న అపారమైన ప్రేమను, ఆకర్షణను, వ్యామోహాన్ని, శారీరక సంబంధంతో తుడిచిపెట్టుకోకుండా ఉండేందుకు అతడు పడే ప్రయాస ఈ విషయాన్నితేల్చి చెప్తుంది. అందని చందమామలా కోమలి అతని జీవితంలో ఒక
అత్యున్నత స్థానంలో నిలబడాలని తపించిపోతాడు. అందుకు గానూ, కోమలి సహాయం తప్పనిసరి కనుక, ఆమెకు అతని ఆశ విడమరచి చెప్పే ప్రయత్నాలెన్నో చేస్తాడు. మొదటి అధ్యాయంలో తలుపు మాటు నుండి ఆమెను చూసి, వెనుతిరిగి వెళ్ళిపోవడం మొదలుకుని, కథలో చాలా చోట్ల ఈ తాపత్రయం కనపడుతుంది. ఆ రాత్రి ఆమెను చూసి, “ఏదో కాంతి కిరణం అతని చీకటి హృదయాన్ని మెరుపులా వెలిగించింది. కోమలి అతనిలోకి ప్రవేశించి అన్ని తలుపులూ మూసేసినట్లనిపించింది.ఎక్కడ తాకినా అన్ని రేకులూ ఊడిపోయే పుష్పం. వేలుతో తాకితే, అంతా  వొడిలిపోతుంది, రంగులన్నీ పోతాయి. నశింపైపోతుంది. గొప్ప సౌందర్యం అనుభవం కాదు. గొప్ప సౌందర్యం అంటే అయిపోవడం కాదు. ఎల్లప్పుడూ “అవుతూండడం”. హద్దులు లేనిది అనుభవం. గొప్ప సౌందర్యానికీ హద్దులు లేవు. రెండిటికీ శరీరం హద్దు కాదు  కాకూడదేమో!”
ఇలా తలచి, శరీరం ఉన్న మనుస్యులందరూ పిచ్చివాళ్ళేనేమోనని నవ్వుకుంటూ, కోమలిని కదిలించకుండా తలుపులు దగ్గరగా మూసి వెళ్ళిపోతాడు దయానిథి. అటుపైన “కాత్యాయని సంతతి” అధ్యాయం చివర్లో “జీవిత రహస్యం” విప్పి చెబుతున్నానంటూ దయానిథి కోమలితో సాగించే ఈ క్రింది సంభాషణలోనూ అవే ఛాయలు.
“నువ్వెందుకూ ప్రేమించడం..?”
“ప్రేమ పవిత్రమైనది..-“
“ఓస్!!”
“నిజం.”
” మరి నా మీద కోరికెందుకు?”
“అది మనస్సుకి – ఇది శరీరానికి -అదైనా మీరు కాబట్టి.”
“అలా వద్దు -అసలు కోర్కెలే వద్దు – ఇద్దరం ఇలాగే స్నేహంగా ఉందాం.ఏం?
శరీరాల స్నేహం ద్వేషంగా మారుతుంది. ఆత్మలని చంపేస్తుంది-; అట్లా చేస్తే మనం అందర్లానే ఐపోతాం. అట్లా చేయకపోవడంలోనే ఉంది అందం. జీవితం  వింతగా ఉంటుంది. బ్రతుకు మీద విసుగు పుట్టదు. గొప్ప గొప్ప పనులు చెయ్యొచ్చు”
***************
 ఈ పుస్తకం ఎందుకు చదవాలి ?
నవలా సాహిత్యం మీద “చివరకు మిగిలేది” నెరపిన ప్రభావం తక్కువదేమీ కాదు. ఇది తెలుగులో తొలి మనో వైజ్ఞానిక నవల. దాని తాలూకు గాఢమైన శైలి ఈ పుస్తకంలో ఒక కొత్తదనాన్ని చూపెడుతుంది. బుచ్చిబాబు రచనలో జలపాతపు వేగమున్న కవిత్వ ధోరణి ఉంటుంది. ఆ ప్రవాహం క్రింద నిల్చుని దోసిళ్ళతో పట్టుకోగలిగే అనుభవమేదైనా కావాలనుకుంటే, రచనను ఓపిగ్గా చివరికంటా చదవాలి. నవలల్లో ఈ స్థాయిలో వర్ణనలు గుప్పించిన పుస్తకాలు లేవని అనలేం కానీ, సంఖ్యాపరంగా తక్కువ.
“రాతి శిథిలాల మధ్య ఉండవలసినది అమృతం. ఎక్కడో ఏ హంపీలోనో – అన్నీ రాళ్ళు-భగ్న ప్రతిమలు. ఒంటరిగా నిల్చిపోయిన స్థంభాలు ప్రేమ కోసం గుండె రాయిచేసుకున్న రాకుమారిలా విగ్రహాలు అన్ని శిథిలమైపోయి, ఏ అర్థరాత్రో అడుగుల చప్పుడూ, నిట్టూర్పు వినపడితే కదులుతాయేమో ననిపించే ప్రమాద స్థితిలో పడి ఉంటే వాటి మధ్య అమృతం కూచుని విషాదంలో నవ్వుతుంది. గడచిపోయిన అనుభవపు వైభవాలని తల్చుకుని, ఏడ్చి ఏడ్చి, అతీతం ఐనప్పుడు కన్నీరు చుక్కలు చుక్కలుగా రొమ్ముల మధ్య నుండి జారి ఈనాటి నదిగా ప్రవహిస్తోంది. తన దుఃఖం నదులై పొంగి పొంగి దేహాన్ని ముంచి వేస్తుంది -తప్పు! తను ఏడ్వకూడదు -విషాదంతో నవ్వుతుంది. ఆనాడు సౌందర్యం తన యాత్ర ముగించుకుని ఆమెను శిలగా మార్చివేస్తుంది. ఏ రాతిని నిట్టూర్పుతో కదిల్చినా అమృతం కలలో కార్చిన కన్నీరల్లే నీరైపోతుంది. “
ఈ వర్ణన గమనించారా, ఇది, అమృతాన్ని పాఠకులకు తొలిసారిగా పరిచయం చేస్తూ రాసినది కాదు. వేరొక పాత్రకి ఆమె వ్యక్తిత్వాన్ని వివరిస్తూ చెప్పిన కబుర్లు కావు. తనలో తాను ఏకాంతంలో సంభాషించుకుంటూ, తన జీవితంలోని
స్త్రీలను విశ్లేషించుకునే ప్రయత్నంలో జారిపడ్డ పదాలివి. “ఎంతందంగా చెప్పాడు!” అనుకోకుండా , రెండో సారి చదవకుండా, నేను ముందుకు సాగలేకపోయిన మాట నిజం. ఇదే కవిత్వ ధోరణి, కథనంలో చాలా చోట్ల ఇబ్బంది పెడుతుందన్న వాస్తవాన్నిమరొక్కసారి గుర్తు చెయ్యకపోతే, ఈ వ్యాసం సంపూర్ణం కాదేమో! ఈ కథ, కథనం వ్యక్తి స్వేచ్చ కోసం వెంపర్లాడే మనస్తత్వాన్ని చూపెడతాయి. ఆ క్రమంలో ఎన్నో దృశ్యాలు, ఎన్నో వచ్చిపోయే పాత్రలు, వాటి చిత్రీకరణలూ. జీవంతో సంబంధం లేకుండా, కంటికి కనపడ్డ ప్రతి దృశ్యానికి కామాన్ని ఆపాదించడం, నాకు వెగటు పుట్టించిన అంశం. మనుష్యుల్లో ప్రకృతిని దర్శించడానికి నేను వ్యతిరేకిని కాను కానీ, ఇతని వర్ణనల్లో అక్కడక్కడా ఏదో అసహజత్వం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. అది మామూలు వ్యక్తులు అభినందించలేని, ఆహ్వానించలేని కవిత్వ ధోరణి. నక్షత్రాల చూపుల్లో, మెరుపుల్లో, వర్ణనల్లో కామం…, “గడ్డిపోచలు కామంతో మసలడం”, “విశ్వాన్ని ఆవులింతలో ఇముడ్చుకున్న విముఖత” తదితరాలు మచ్చుకు కొన్ని  మాత్రమే! (ఇలాంటి “ఆవులింతలు వర్ణనల్లో కోకొల్లలు! )
అత్యంత సున్నితమైన భావాలని, రసరమ్యమైన పదాలతో కూర్చి పాఠకులను కొత్త లోకాలకు తీసుకుపోయే సంభాషణలున్నట్టే ( కోమలి నిద్రిస్తుండగా చూసిన క్షణాల్లో, దయానిథిని మనసులో కలిగిన భావావేశాలకి ఎంచక్కని అక్షర రూపముందో చూడండి క్రింద), చూసిన ప్రతి సన్నివేశానికి, ప్రతి వస్తువుకీ, వ్యక్తికీ ఒక ఉపమానాన్ని జోడించి తప్ప పరిచయం చేయలేని రచయిత నిస్సహాయత చదువరులను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది పూర్తిగా ఒక బలహీనతగా బయటపడిపోయిందే తప్ప, కథనానికి ఒక ప్రత్యేక విలువను ఆపాదించలేకపోయినట్టు నాకనిపించింది.
“ఇంటి కప్పు మీద నుండి జారిన వెన్నెల వెలుగు ఆమె నుదుటి మీద గీతలా పడుతోంది. ఆనాడు సౌందర్యం తన యాత్ర ముగించుకుని పవ్వళిస్తోంది. పరిమళం బరువుకీ రంగు ఒత్తిడికీ తట్టుకోలేక ఊడి పడిపోయిన అడవి పువ్వు.
పర్వత శిఖరాన్నుంచి జారి పడిపోయిన మంచుముద్దలోని నిర్మలత్వం; నిశీధిలో సృష్టి వేసుకున్న మంటలో నడిజ్వాల అర్థరాత్రి జీవులు కన్న స్వప్నంలోని మూగబాధ”
******************************
వ్యక్తిగత ఇష్టానిష్టాల్లో లీలా మాత్రంగా తొణికిసలాడే బేధాలే, ఒక్కోసారి పుస్తకాల పట్ల మన మౌలిక అభిప్రాయాలు వెలిబుచ్చడంలో కీలక పాత్ర వహిస్తాయని బలంగా నమ్మే వాళ్ళల్లో నేనొకతెను. బహుశా, అలాంటి అంచనాలేవో సరితూగని కారణం చేత, నేను ఈ పుస్తకాన్ని మొదటి చూపులో పూర్తిగా ప్రేమించలేకపోయాను. కొన్ని పుస్తకాలను పూర్తిగా అవలోకనం చేసుకునేందుకు, కథలోని ఆత్మను పట్టుకునేందుకు ఒకటికి రెండు సార్లు చదవడమే మంచి పద్ధతేమో!
ఈ పుస్తకానికి సంబంధించి నా తొలి పఠనానుభవాలను నిజాయితీగా చెప్పాలంటే, మొదటి పేజీ మొదలుకుని, ఆఖరు పేజీ వరకు, సహనాన్ని బ్రతిమాలి వెంట ఉంచుకుని మరీ చదివాను. కథ ఎటు పోతుందో మనకర్థం కాదు, విడిపోతున్న అధ్యాయాలు ఏ విషయాన్ని చెప్పదలిచాయో నన్న సందిగ్ధమూ, వాటిని నేను అందుకోగలిగామో లేదో నన్న సంశయమూ పదే పదే ఇబ్బంది పెట్టాయి. అయినప్పటికీ,  కథనంలో చాలచోట్ల కనపడే నెమ్మదితనం, కథను ఎటూ పోనివ్వని జడత్వమూ, కొన్ని కృతకంగా తోచే వర్ణనలూ వదిలేస్తే, “చివరకు మిగిలేది”, వస్తు రీత్యా ప్రయత్నించి చూడాల్సిన పుస్తకమనే భావిస్తున్నాను. మలి పఠనాలు ఈ నమ్మకాన్ని మరి కాస్త బలపరిచాయి.
అనైతికాన్ని సమర్ధించలేక, నైతికత ఒడిలో సంపూర్ణంగా ఒదగలేక, ఒంటరితనం ముసుగులు తీయలేక విసుగు చెంది, క్షణికావేశంలో చేసిన తప్పులతో మధనపడి, తాత్వికతను నింపుకుని మనసును అల్లకల్లోలం చేసుకుని “చివరకు మిగిలేది” ఏమిటన్న ప్రశ్నకు సరైన సమాధానాన్ని ఇవ్వకుండానే ముగిసే ఈ నవల, నాయక పాత్రను, జీవితాన్నీ నిజాయితీగా అర్థం చేసుకోదలచిన వారికీ, కాల్పనికాల్లో కొత్త తరహా రచనను చూసేందుకు తపించే వారికీ నచ్చే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. అలాగే, రచన పరమావథి ప్రతిసారీ ఒక పాఠాన్ని నేర్పడమే కానవసరం లేదని పునరుధ్ఘాటించే నవలగా, సర్వ స్వతంత్రంగా నిలబడగలదీ రచన.
బుచ్చిబాబు విడిగా ఏదైనా కవిత్వం రాసి ఉంటే, అది తప్పక చదవాలన్న కుతూహలం కలిగించిన పుస్తకం -“చివరకు మిగిలేది”.  ప్రయోగాత్మక రచనలకు పెద్ద పీట వేసే సహృదయత కలిగిన తెలుగు సాహితీ అభిమానులు, ఒక్కసారైనా ఓపిగ్గా చదివి సంతృప్తి పడవలసిన పుస్తకం.
***********************************************

తెలుగు సంవత్సరాది

రచన : శైలజ మిత్రా

నిజం

ఈ వనంలో మొక్కలెప్పుడు సజీవంగా ఉంటాయి

నిత్య వసంతం వాటి చిరునామా

ఆరుబయట సందిగ్ధంగా

నిలబడిన శిశిరాన్ని తలచుకుని

గజ గజ వణుకుతోంది

వయసు మళ్ళిన ఒక వృక్షం

కోకిల నిత్య యవ్వనంతో

వర్తమానాన్ని తన గళంలో వినిపిస్తోంది

వేప చిగురులు భుతకాలపు అన్వేషణలో

మామిడి కొమ్మ చారిత్రక దృక్పధంతో

చేదు తీపి కలయికల రధాన్ని నడిపిస్తున్నాయి

ఇది అలనాటి సంప్రదాయపు పదగామి

అప్పుడప్పుడు చినుకుల కలనేత వస్త్రాన్ని ధరిస్తున్న ధరిత్రి

చిరు సిగ్గుల పూలను అలంకరిస్తుంది

షడ్రుచుల సమ్మేళనంలో సందేహం వదిలి

నా కళ్ళల్లోకి నిస్సంకోచకంగా

వర్ష సంధ్యను దర్శించుకుంటోంది

తేనెల తీయదనం

ఒక వెన్నెల బిందువు

కొబ్బరి మువ్వలోకి జారిపడినట్లు

వినబడీ వినబడనట్లున్న సవ్వడి

తెలుగు గుండెను తాకితే

అదే ఉగాది…!

అత్మీయతలను స్వాగతిస్తున్న

తెలుగు సంవత్సరాది !

ప్రథమాచార్యుడు

రచన  –  కొంపెల్ల రామకృష్ణమూర్తి.

“శ్రీవాణీ గిరిజాశ్చిరాయ” యనుచున్ శ్రీకారముం జుట్టి -వా

గ్దేవీ మంజుల కచ్ఛపీరవళి కాంధ్రీకంఠ మాధుర్యమున్

నీవే కూర్పక యుండిపోయిన మహాంధీభూత హృద్రంగమై

యేవో గాలుల తేలిపోయెడిది కాదే  తెల్గు ముమ్మాటికిన్.

 

“దేశ్యమనగ నొక్క దివ్యప్రవాహము

కదలుచుండు నద్ది కాలము వలె ”

అనుచు నాడె పలికి యాగామి  సాహిత్య

రీతి దలచినావు ఋషి సముడవు !

 

స్వస్థాన వేషభాషలయందు తులలేని

రక్తి కల్గించు సూత్రము ఘటించి,

పామర వ్యవహార భాషా మహాంభోధి

లో నున్న రత్నాలు సానబట్టి,

తత్సమ,దేశ్య,తద్భవ శబ్దములకెల్ల

అక్షర రమ్యతనందజేసి ,

గీర్వాణవాణి కంకితమైన వ్యాసర్షి

కవితాత్మ నాంధ్రలోకమున నిలిపి,

 

భారతాఖ్యము భవ్య సౌభాగ్యమొకటి

తరతరాలుగ జాతికి దక్కునట్లు

చేసినాడవు “తెల్గు ప్రాచేతసుడవు ”

శత నమస్సులు నన్నయాచార్య! నీకు.

 

 

 

మనం మరచిన మన మహాకవి డాక్టర్‌ ఉమర్‌ అలీ షా

 

 

 రచన : సయ్యద్ నసీర్ అహ్మద్

మౌల్వీ ఉమర్‌ అలీషా మాతృభాష తెలుగు కాదు. తెలుగులో అద్భుత సాహిత్య సంపదలను సృజియించి మహాకవిగా  ఆయన ఖ్యాతిగాంచారు. స్వాతంత్య్ర సమరయోధునిగా జాతీయోద్యమంలో ఆవిశ్రాంతంగా పాల్గొన్నారు. భారత శాసన సభలో ప్రజాప్రతినిధిగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. అభ్యుదయ రచయితగా, ప్రగతి పథ నిర్దేశకునిగా, మంచి వక్తగా, మానవతావాద ప్రవక్తగా ఉమర్‌ అలీషా గణుతికెక్కారు.  అజ్ఞానం, మూఢనమ్మకాలు, పేదరికం, బానిసత్వం, అవిద్య లాంటి  సాంఘిక రుగ్మతలతో కొట్టుమిట్టాడుతున్న సమాజాన్ని సంస్కరించేందుకు అనన్యసామాన్య”మైన కృషి సాగించి ధన్యులైన తెలుగు గడ్డకు చెందిన మొదటి వరుస కవులు, రచయితల వరుసలో ఉమర్‌ అలీషాది విశిష్ట స్థానం.

 

సమాజ గతిని మార్చి మానవుల్లో మానవతా గుణాలను మరింతగా వికసింపచేయాలన్న లక్ష్యంతో అక్షరాన్ని అయుధంగా ఎందచుని శరపరంపరగా సాహిత్య సంపద సృష్టించిన ఈ ముస్లిం కవికి తెలుగు సాహిత్య చరిత్ర పుటలలో తగినంత స్థానం లభించలేదు. తెలుగులో రాసిన కవుల చరిత్రలను గ్రంథంస్తం చేసిన మహా రచయితలు, మహామహా పరిశోధకులు కూడా డాక్టర్‌ ఉమర్‌ అలీషాను మరచిపోవడమో లేకపోతే ఒకటి రెండు వాక్యాతలో ఆయన పరిచయవాక్యాలను సరిపెట్టడమో చేశారు. బహుభాషాకోవిదుడైన ఆయన రాసిన గ్రంథాలలో ఇప్పటికి కూడా ఎన్నో గ్రంథాలు అందుబాటులో ఉన్నా, ఆయన సృజనాత్మకతను  వెల్లడి చేస్తున్న వ్యాసాలు, పరిచయాలు ఆంధ్ర పత్రిక, భారతి లాంటి పత్రికలలో నిక్షిప్తం మైఉన్నా  ఆంధ్ర సాహిత్య చరిత్రను రచించిన మన పరిశోధకులకు డాక్టర్‌ ఉమర్‌ అలీషా కన్పించకపోవడం విచిత్రం. తెలుగు సాహిత్యంలోని ప్రతి ప్రక్రియను ఎంతో గొప్పగా పరామర్శించి ఆయన ప్రక్రియలలో అలవోకగా సామిత్య సృష్టి చేసి సుమారు వందకు పైగా గ్రంథాలను వెలువరించిన కవి-రచయితగా తెలుగు సాహిత్య ప్రపంచంలో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న డాక్టర్‌ ఉమర్‌అలీషా సాహిత్య చరిత్రలను సృష్టించిన పరిశోధకులకు ఎలా అందకుండపోయారో అర్థం కాని విషయం.

 

మౌల్వీ ఉమర్‌ అలీషా పూర్వీకులు శతాబ్దాల క్రితం పర్షియా (ఇరాన్‌) నుండి ఢిల్లీ వచ్చి, అటునుండి హైదరాబాద్‌ చేరి, చివరకు పీఠాపురంలో స్థిరపడ్డారు. ఈ విషయాన్ని  ఉమర్‌ అలీషా ఈ విధంగా తన ఒక గ్రంథంలో  ప్రకటించారు.

 

”… … … మహా ప్రభాత

గరిమగాంచిన మా వంశమరయ పార

సీకమును బాసి ఢిల్లీకి చేరి హైద్ర

బాదు నుండి పిఠాపురి వచ్చి నిలచె ”

 

డాక్టర్‌ ఉమర్‌ అలీషా 1885 ఫిబ్రవరి 28న, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జన్మించారు. తండ్రి మౌల్వీ మొహిద్దీన్‌ బాద్షా. తల్లి పేరు చాంద్‌బీబి. సాహిత్య, సారస్వత, ధార్మిక సేవా కార్యక్రమాలలో తల్లితండ్రులు నిమగ్నమైయున్న ప్రత్యేక వాతావరణం నడుమ జన్మించిన ఉమర్‌ అలీషా ఎనిమిదవ ఏటనే అశువుగా కవిత్వం చెప్పి పండితులను, గురువులను అక్టుకున్నారు. పిఠాపురంలోని ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన తరువాత ప్రముఖ సంస్కృతాంధ్ర భాషా పండితుల వద్ద ఆయన శిష్యరికం చేశారు. తెలుగు, సంస్కృత భాషలతో మంచి ప్రావీణ్యత సంపాదిచిన ఆయన అరబ్బీ, పర్షియన్‌, ఉర్దూ భాషలను కూడా నేర్చుకున్నారు.

 

ఉమర్‌ అలీషా తన  పద్నాల్గవ ఏట నుండి చంధోబద్ధంగా చక్కని తెలుగులో పద్యాలు రాయటం, ధారాళంగా కవిత్వం చెప్పటం ప్రారంభించి, తమ వంశ గురువైన శ్రీ అఖైలలీషాను స్తుతిస్తూ, ” బ్రహ్మవిద్యా విలాసం ” అను శతకాన్ని రచించారు. ఆతరువాత పద్దెనిమిదవ ఏట నాటకాలు రాయటం ఆరంభించిన ఆయన 1905 ప్రాంతంలో గద్య, పద్యాత్మకమైన ” మణిమాల ” నాటకాన్ని రాసారు. ఆ క్రమంలో  అసమాన ప్రతిభను చూపుతూ  తెలుగు సాహిత్యంలోని అన్ని సాహితీ ప్రక్రియలలో అపూర్వమైన సారస్వత సంపదను సృష్టించారు.  ఈ విషయాలను ఆయన స్వయంగా ఒక పద్యంలో  ఈ విధంగా  సృష్టీకరించారు.

 

” రచియించినాడ విభ్రాజితదివ్య ప్ర

బంధముల్‌ పది కావ్య బంధములుగ

వ్రాసినాడను కల్పనాసక్త మతిపది

నాటకంబులను కర్నాటఫక్కి

కూర్పినాడను కళాకోవిదుల్‌ కొనియాడ

నవలలు పది నవ నవలల లనగ

తెలిగించినాడ సుద్ధీపితాఖండ పా

రసికావ్యములు పది రసికులలర

రసము పెంపార నవధానక్రమములందు

ఆశువులయందు పాటలయందు కవిత

చెప్పినాడ నుపన్యాస సీమలెక్కి

యవని ”ఉమ్రాలిషాకవి” యనగ నేను.”

 

ఈ విధంగా రచనా వ్యాసంగంలో పూర్తిగా నిమగ్నమైన ఉమర్‌ అలీషా మొత్తం విూద 50 పుస్తకాలు రాశారు. 1926-28లలో ఉమర్‌ అలీషా తెలుగులోకి అనువదించిన ప్రముఖ పారశీక కవి ఉమర్‌ ఖయ్యాం రుబాయీల విూద ‘ఉమర్‌ ఖయ్యాం రుబాయీల విూద అనుశీలన’ అను అంశం విూద 1980లో నాగార్జున విశ్వవిద్యాలయంలో సిద్దాంత వ్యాసం సమర్పించిన డాక్టర్‌ షేక్‌ మహమ్మద్‌ ముస్తఫా (కడప)  ” అరవై ఎళ్ళల్లో దాదాపు 50 కృతులు…రచించార ” ని వెల్లడించారు.

 

ఈ విషయంలో కొంత భిన్నాభిప్రాయం ఉంది. డాక్టర్‌ ఉమర్‌ అలీషా మొత్తం 108 గ్రంథాలు రాశారని ఆయన విూద 1970 లో పరిశోధనా పత్రాన్ని సమర్పించిన  ఆంధ్ర విశ్వవిద్యాయలం హిందీ విభాగం ఆచార్యలు యస్‌.యం ఇక్బాల్‌ ప్రకటించినా ప్రస్తుతానికి ఆయన రాసిన గ్రంథాలలలో 23 గ్రంథాలు మాత్రమే లభ్యమౌతున్నాయి.

 

ఉమర్‌ అలీషా ఏ సాహితీ ప్రక్రియలో ఎటువంటి రచన చేసినా ప్రతి రచన ద్వారా  ఏదోక సామాజిక ప్రయోజనాన్ని ఆశించి, ఆ లక్ష్యసాధనా దృష్టితో ఆయన సాహితీ వ్యవసాయం సాగింది. జాతీయ భావం, సమానత్వం, సర్వమానవ సౌభ్రాతృత్వం, సర్వమత సమభావనలతో పాటుగా అంటరాని తనం, కుల వ్యవస్థ తదితర పలు సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా, మహిళాభ్యుదయాన్ని ప్రగాఢంగా వాంచిస్తూ,  ప్రజలలో ప్రధానంగా మహిళలలో చైతన్యాన్ని కాంక్షిస్తూ  రచనలు చేశారు.  బాల్య వివాహాలు, సతీ సహగమనం, కన్యాశుల్కం, వరకట్నం లాంటి దురాచారాలను తునుమాడాలన్నారు. స్త్రీ విద్యను ప్రోత్సహించారు. స్త్రీ విద్యకోసం, స్త్రీ గౌరవం కోసం స్త్రీలు స్వయంగా పాటుపడాలని తన గ్రంథాలలోని పాత్రల చేత, తన అభిమతాన్ని చాలా బలంగా చెప్పించారు.

 

మౌల్వీ ఉమర్‌ అలీసా  రాసిన ” కళ ” అను నాటకంలో  స్త్రీ స్వాతంత్య్రం గురించి చాలా స్పష్టంగా మాట్లాతూ లింగభేదం లేకుండా  అర్హతలు, యోగ్యతను బట్టి స్థానం కల్పించాలంటారు. ఆనాడు స్త్రీ విద్య మీద విధించబడియన్న ఆంక్షల మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ‘ తరుణీ వివేకమన్‌ జదవ ధర్మము జ్ఞానముతత్వ దీక్షలన్‌-గురువుల చెంగటన్‌ బడయ గోరిన వారల మాన్పువారునూ-సూకరులై పుట్టు చుంద్రు..’ అని శపించారు.

 

సంసారిక జీవనంలో పడతులు పడుచున్న బాధల గాథలను గమనించిన ఆయన ”అనసూయ”  నాటకంలో దేవతాలోకం నుండి భూలోకం విచ్చేసిన ‘నర్మద’ పాత్ర చేత భర్తకు సేవలు చేయడం ద్వారా మాత్రమే భార్యకు స్వర్గం ప్రాప్తిస్తుందన్న ప్రచారాన్ని ఖండిస్తాస్తూ, స్త్రీ అబలకాదు సబలని, యాచన ద్వారా లభించే స్వర్గం తనకు అక్కరలేదని ప్రకటింప చేస్తాడు. నర్మద చేత ‘… నేను సర్వతంత్ర స్వతంత్రను గానా, నా యంతరాత్మ మహా తపశ్శక్తిచే మార్తాండ మండలమువల తేజో విరాజితమై ప్రదీపించుట లేదా!  నేను మహా వీరాధివీరులవలె స్వర్గ ద్వారము బ్రద్దలు చేసికొని వెళ్ళలేనా ? సరే! ఇంక నాకు యాచింపగ వచ్చెడు తుచ్చ స్వర్గము నా కాలి గోరునకైనా వలదు..”, అని ప్రకటింప చేస్తారు.

 

డాక్టర్‌ అలీషా  ”విచిత్ర బిల్హణీయం” నాటకంలో బాల్య వివాహాలను, కన్యాశుల్కం లాంటి దురాచారాలను ఖండిస్తూ, ఆనాటి విపత్కర పరిస్థితుల నుండి స్త్రీలే స్వయంగా విముక్తి పొందడానికి తీసుకోవాల్సిన చర్యలకు నాటకంలోని, యామిని పూర్ణ తిలక, బిల్హణీయుడు అను పాత్రల చేత సూచించారు. మహిళల  సమస్యలకు పరిష్కారానికి  స్త్రీలు చైతన్యవంతులు కావటమే మార్గం తప్ప సమాజానికి భయపడి భూమి తల్లి వడిలో చేరటం ఎంత మాత్రం కాదంటుంది. స్త్రీ లోకాన్ని చైతన్య వంతులను చేయాలంటే, స్త్రీలలో అక్షరాస్యత పెంచాలని, ఆ తరువాత లోకజ్ఞానం కోసం గ్రంథాలు, వార్తా పత్రికలు, చదవాలని ప్రకటిస్తుంది.  మహిళల సమస్యలకు ప్రధానంగా విద్యావిహీనత కారణంగా భావించిన యామిని పూర్ణ తిలక . ”.. మననారీ లోకంబున విద్య యొక్కటి కడు కొఱంతగానున్నది. అందేచేతనే యిన్ని దురాగతములు తటస్థించినవి …”  ప్రకటిస్తుంది.

 

ఈ నాటకంలోని మరో పాత్ర బిల్హణుడు పలు స్త్రీ జనసంక్షేమ కార్యక్రమాలను చేపడతాడు. ”… స్త్రీ విద్యలేని దేశమునకు క్షేమము రానేరాడు..” అంటూ  స్త్రీ విద్యకు అతడు అత్యంత ప్రాధాన్యతనిస్తాడు. స్త్రీ విద్యను ఆచరణాత్మకంగా సాధించేందుకు ప్రయత్నాలు ఆరంభిస్తాడు.అతడు యామిని పూర్ణతిలకతో కలసి  స్త్రీ విద్యావ్యాప్తి కోసం మహిళా విద్యాలయాలు, అనాథ శరణాలయాలు ప్రారంభించి మహిళాభ్యుదయానికి కృషి చేస్తాడు. ఈ దిశగా డాక్టర్‌ ఉమర్‌ అలీషా గ్రంథాలలోని  స్త్రీ జన బాంధవులు తమ కాలం కంటే చాలా ముందుగా ఆలోచిస్తూ, అదిశగా నిర్మాణాత్మక ఆలోచనలను సమాజం ఎదుట పెడతారు. ఈ క్రమంలో ఆరాధనాలయాల కంటే బాలికా పాఠశాలలు అత్యవసరం అంటారు. సత్రముల కంటే అనాథ శరణాలయాలు కావాలంటారు. వనాలు తటకాల కంటె మహిళలకు సర్వ విద్యలు గరిపె కళాశాలను స్థాపించాలని ఆ పాత్రల ద్వారా  మహిళల సమస్యలకు, మహిళలో చైతన్యాభివృద్ధికి ఉమర్‌ అలీషా  ఆచరణాత్మక పరిష్కారాన్ని సూచిస్తారు. ఆనాడు బాల్య వివాహాల వలన స్త్రీ జాతికి కలుగుతున్న కడగండ్లను వివరిస్తూ, ”.. కడు దరిద్రతచేత నిడుములు బడయవచ్చు బాలవైధవ్యంబు బడయరాదు – హాలాహలము ద్రావియగ్ని గూలగవచ్చు బాలుధ్యంబు పడయరాదు – దాస్య సజీవనము దగుల మొందగవచ్చు బాల వైధవ్యంబు పడయరాదు…” అని అంటారు.

 

స్త్రీ విద్య, బాల వైధవ్య బాధలు, కుటుంబ సమస్యల వరకు మాత్రమే ఆయన పరిమితం కాకుండా ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం, అగ్రహారాలను నిచ్చేకంటే ఒకవైపున దేశ సంపదను పెంచుతూ, పదిమంది ఆర్థిక ఉపాధిని కలిగించే యంత్ర కర్మాగారాలను స్థాపించాలని డాక్టర్‌ ఉమర్‌ అలీషా అంటారు. ఈ విషయాన్ని ఓ పద్యంలో ఈ విధంగా ప్రస్తావించారు. ”..ప్రథిత సత్రంబుల బదులనాథ శరనాలయంబులు నల్పి జాలికొల్పి, మహిని దేవళముల మాఱుగా బాలికా పాఠశాలలు కట్టి వన్నె బెట్టి, వన తటాకంబుల బదులుగా సర్వ కళాళాలలుంచి లీలల రచించి, బహుళాగ్రహరాళి బదులుగా యంత్ర కర్మాగారములు పెంచి ఖ్యాతి గాంచి, నతపురాణ కధావిధానముల బదులుతొంటి నిర్భంవైధవ్య దు:ఖ జలధి సమయజేయనుపన్యాస సభలు దీర్చి యామిని పూర్ణతిలక బిల్హణునియట్లే…”, యని తన నాటకంలోని పాత్రలు చేసిన కృషి వివరిస్తూ, ఆ ప్రయత్నాలకు బలం చేకూర్చేందుకు నాకటంలోని  మరొక పాత్ర చేత ప్రశంసింప చేస్తారు.

 

మనం నిష్పాక్షికంగా ఆలోచిస్తే, స్త్రీలు పురుషులకంటే యోగ్యులని ఖచ్చితంగా  తీర్మానిస్తూ, తనను స్త్రీజన పక్షపాతిగా ఏమాత్రం సంశయం లేకుండా డాక్టర్‌ ఉమర్‌ అలీసా ప్రకటించుకున్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ , ‘నిష్పాక్షిక బుద్ధితో నూహించినచో పురుషుల కన్న స్త్రీలత్యంత యోగ్యులని చెప్పవలెనని’ అపి చాలా స్పష్టంగా ప్రకటించారు. ఈ నాటకంలోని ఒక పాత్ర మహిళలకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఆ పాత్ర ద్వారా ఆనాడు సమాజంలో మహిళలకు వ్యతిరేకంగా ప్రజలి ఉన్న అహేతుక అభిప్రాయాలను వివరిస్తూ, ఆ వాదనలను ఉమర్‌ అలీషా చాలా బలంగా పూర్వపక్షం చేస్తారు. ఈ నాటకంలో, మహిళలు అవినీతి పరులంటూ, శాస్త్రజ్ఞులు చెప్పారు కదా?.. శాస్త్రజ్ఞులు పొరపడ్డారా? అంటూ ఒక పాత్ర చేత ప్రశ్నింపచేస్తారు. అనంతరం  ఆ ప్రశ్నకు ప్రతిస్పందనగా  ”.. సతుల వినీతలంచు దమశాస్త్రము లందుకు లిఖించవరలా సతులకు బుట్టరోసతుల-సంగతి గూడి సుఖింపరో సమున్నతి! తమ సోదరీసుతలు నారులు గారో! ప్రసన్న బుద్ధిలే కితరుల నింద సేయదమకే యదిలజ్జా యటంచెఱంగరో..” అంటూ  మరొక పాత్ర చేత  అలనాడు సమాజంలోని కొందరిలో ఉన్న అహేతుక  అభిప్రాయాల విూద  డాక్టర్‌ ఉమర్‌ అలీసా స్వయంగా విరుచుకు పడతారు.

 

మహిళా సంక్షేమ-అభివృద్థి కార్యక్రమాలను సదా విమర్శించే ఓ పాత్ర ద్వారా, ”..ఓహో! ఇదియా! భరత ఖండము నుద్దరించుటకు యనగా మావంటి బ్రహ్మణోత్తములకు నన్నదాన భూదాన కన్యాదానములు సమర్పించి ఆగ్రహారములిచ్చి లెస్సగా బిండివంటలతో భోజనము పెట్టించడమను కున్నాము. అట్లు గాదట! స్త్రీ విద్యట! భరత ఖండబునకు కొరతంట!.. తగినట్లు బుద్ధి చెప్పి గోబ్రాహ్మణ సమారాధనము మోక్షదాయకమని యొప్పించవలయును..” అని చెప్పించి, ఆనాటి ప్రతీపశక్తుల కుయుక్తులను, పరాన్నభుక్కుల కుళ్ళు బుద్ధులను ఉమర్‌ అలీషా బట్ట బయలు చేస్తారు. చదువుకున్న స్త్రీ మగని నెత్తికెక్కి పెత్తనం చేస్తుందని వచ్చిన వాదనలను దృష్టిలో వుంచుకుని, ఒక పాత్ర, విద్యా బుద్ధులు నేర్చిన స్త్రీలు అధిపత్యం కోసం పాకులాడుతారని, పెనిమిటిని గౌరవించరని, మాట వినరని ఆరోపించగా ”…విద్యచే వివేకము వచ్చును గావున వివేకవంతు దాధిపత్యమునకు నర్హుడైయ్యే యుండును..” అంటూ ఆ వాదనను ఆయన పూర్వపక్షం చేస్తారు.

 

కులం కాదు ప్రధానం గుణం ప్రధానమంటూ, బ్రహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన ఎవ్వరూ బ్రహ్మగారని, ”.. బ్రహ్మణుండైన గడజాతి – శ్వపచుడైనా విద్యయున్న మహాబ్రహ్మ…” యగునని  సాధికారంగా ప్రకటిస్తారు. ఉమర్‌ అలీషా కాలం నాటి సమాజ స్థితి, అభిప్రాయాలు, అభిమతాలతో బేరీజు వేసుకుని, ఆయన రచనలను పరిశీలిస్తే ఆయన విప్లవాత్మక దృష్టి విదితమౌతుంది.  సమాజంలో నెలకొనియున్న సామాజిక అంతరాల పట్ల ఉమర్‌ అలీషా తన అభ్యంతరాలను చాలా స్పష్టంగా వ్యక్తం చేశారు. అంటరానితనం, అసృశ్యత, సామాజిక వెలివేతల మీద ఆయన అక్షరాయుధంతో దండయాత్ర సాగించారు. మానవులలో జన్మతా : ఉచ్ఛనిచాలను నిర్ణయించడాన్ని విమర్శించారు. 1921 మార్చి మాసం 18వ తేదీన ఏలూరులో ” అదిమాంద్ర అంటుదోష నివారణ సభ ” జరిగింది. ఆ సభలో ఉమర్‌ అలీషా ప్రసంగిస్తూ, అంటరానితనం నిర్మూలనకు తగు సూచనలు చేశారు. కులాధిపత్యాన్ని  విమర్శించారు. ఏకులం వారైనా తమ శక్తి సామర్థ్యాలను పెంచుకోవడం ద్వారా, విద్యా బుద్ధుల ద్వారా అగ్ర స్థానాలను అలంకరించవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ ఆ విధంగా మేధా సంపత్తిని సంతరించుకోవాలని సూచించారు. ”..పందిని, కుక్కను, నక్కను, పిల్లిని గూడా ముట్టుకొను వారలకు మనిషిని ముట్టుకొనుట దోషములోనిది కాదు కావున, యీ యీషద్భేదములను సరకుచేయక వెంటనే దానిని (అంటరానితనం) సంస్కరించుటకు అందరు తోడుపడవలెను..”, అని డాక్టర్‌ ఉమర్‌ అలీషా ఉద్బోధించారు.

 

1928వ సంవత్సరంలో ఉమర్‌ అలీషా తండ్రి శ్రీ మొహిద్దీన్‌ బాద్షా కన్నుమూయటంతో కుటుంబంలోని తొలి సంతానంగా ఆయన నిర్వహిస్తున్న అథ్యాత్మిక పీఠం బాధ్యతలను స్వీకరించారు.   శ్రీ విశ్వ విజ్ఞాన విద్యాధాత్మిక పీఠాచార్యునిగా అసంఖ్యాకులైన శిష్యుల మనస్సులను చూరగొన్నారు. ఆయన స్వయంగా బహళ సంస్కృతి-సభ్యతల సమ్ళేళనమయ్యారు.  సర్వమత సమభావనా కేంద్రంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్యాధాత్మిక  పీఠాన్ని తీర్చిదిద్దారు. ఆయన బోధించిన వేదాంత తత్వం ఆయనకు అసంఖ్యాక శిష్యగణాన్ని సమకూర్చి పెట్టింది. ఆయన మతపరంగా ముస్లిం అయినప్పటికి, అయనలో మతాభిమానం ఉన్నా ఎవ్వరీలనూ మత దురహంకారం మాత్రం తగదన్నారు. సర్వ మత సామరస్యం బోధించారు. ”..ఆదర్శ గురువుగా అంతేవాసుల ఆరాధ్యదైవంగా… ఆయన గౌరవ మర్యాదలందుకున్నారు ”. మతాల ప్రసక్తి లేకుండా, మతాచారాలతో సంబంధం లేకుండా ఉమర్‌ అలీషా పీఠాధిపత్యం లోని ‘ జ్ఞానసభ ‘ అందర్ని ఆహ్వానించింది. ఈ జ్ఞాన సభలో కులమత జాతి భేదాలు లేవు. జ్ఞానార్జనే ఇక్కడ ప్రధానం. ఈ విషయాన్ని ” సభామందిర ద్వారమెపుడు తెఱిచి యుండు పూత చరిత్రులై యుండు వారు వచ్చి జ్ఞానంబు నేర్చుకోవచ్చు సతము మంచి నీళ్ళను కలశాల ముంచినట్లు ” అని ఆయన స్వయంగా ప్రకటించారు. ఆ మేరకు ఆచరించిన చూపారు. ఆ కారణంగా అన్ని మతాలకు చెందిన ప్రజలు ఆయనను గురువుగా స్వీకరించారు. డాక్టర్‌ ఉమర్‌ అలీషా  ప్రతీ ఏడాది శిష్యులకు వేదాంత బోధ చేసేందుకు పర్యటనలు చేయటం అనవాయితీ. శిష్యగణమే ఆయన సర్వస్వమని భావించి, ప్రేమించే వేదాంతి మనసులోని తన మాటకు ఆయనలోని కవి ఈ విధంగా అక్షర రూపం కల్పించాడు.

 

” అతి పవిత్రతతో మహాప్రేమ గరిమతో

గ్రాలెడు వీరె చుట్టాలు మాకు

ప్రాణార్థములనైన ప్రాభవంబులనైన

నిచ్చెడు వీరె స్నేహితులు మాకు

జ్ఞాన సాధనచేత ధ్యాన నిష్టలచేత

దనరెడు వీరె సోదరులు మాకు

వీరె చేదోడు వాదోడు వీరె మాకు

వీరె భక్తులు బిడ్డలు వీరె మాకు

మా మహాజ్ఞానసభ జగన్మందిరముగ ”

 

బ్రహ్మరుషి ఉమర్‌ అలీషా  మిధ్యా భావనకు బహుదూరం. ప్రాంపంచిక జీవిత చర్యలు పరలోక జీవితానికి పునాది కాగలుగుతాయని ఆయన ప్రభోధం. ఇహలోక జీవనాన్ని ఏమాత్రం విస్మరించరాదన్నారు. భక్త జనుల ఆరాధనా మార్గాలు వేరైనప్పటికీ, అన్ని మతాలు భగవంతుని సాన్నిధ్యాన్ని చేరుకునేందుకు మార్గం చూపుతాయన్నారు. సర్వజనుల సర్వేశ్వరుడు ఒక్కడేనన్న భావన ద్వారా వసుదైక కుటుంబం ఏర్పడుతుందని ఆయన ప్రవచించారు. ఈ విషయాన్ని ” మానవుని మానవునిగా మార్చుటయే యీ ధర్మము యొక్క లక్ష్యమ ” ని  ఉమర్‌ అలీషా  ప్రకటించారు. ఆయన సర్వమత సమభావన ఆధ్యాత్మి-వేదాంత భావాలు ప్రముఖ పండితుడు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను కూడా ప్రభావితం చేసాయి. ఉమర్‌ అలీషా ధార్మిక చింతనా ధోరణులను శ్రీ రాధాకృష్ణన్‌ బహుదా కొనియాడారు. ఈ రకమైన ధార్మిక తత్వ చింతన కారణంగానే ఈనాటికి పిఠాపురంలోని ” శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాధ్యాత్మిక పీఠం ” ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా అలరారుతోంది.

 

ఆనాటి సంస్థానాధీశులు, సంపన్న కుటుంబీకులు ఉమర్‌ అలీషాను సత్కరించటమే మహా భాగ్యంగా  భావించారు. విశ్వ విద్యాలయాలు ఆయనకు గౌరవ బిరుదులను ఇవ్వడానికి ఉత్సాహ పడ్డాయి. 1924 లో జుజిజి |దీఖిరిబి ంజీరిలిదీశిబిజి ్పుళిదీతీలిజీలిదీబీలి లో ” పండిట్‌  ” బిరుదుతో ఆయనను సత్కరించింది. ఈ సందర్భంగావ ఓరిజీరీశి ఖతిరీజిరిళీ ఊలిజితివీతి ఆళిలిశి రిదీ జుదీఖినీజీబి ఆజీబిఖిలిరీనీ శిళి నీబిఖీలి జిలిబిజీదీశి ఐబిదీరీదిజీరిశి, ఆలిజీరీరిబిదీ, జుజీబిలీరిబీ బిదీఖి జూదీవీజిరిరీనీవ అని ఆ సంస్థ ప్రకటించింది.(జూదీబీగిబీజిళిచీబిలిఖిరిబి ళితీ  ఖతిరీజిరిళీ ఔరిళివీజీబిచీనీగి జూఖి. ఖజీ. శ్రీబివీలిదీఖిజీబి చజీ. ఐరిదీవీనీ, జు.ఆ. కఆ్పు, 2001) అలీఘర్‌ విశ్వ విద్యాలయం ఆయనకు ” మౌల్వీ ” బిరుదునిచ్చి గౌరవించింది. ఫ్రాన్స్‌ దేశానికి చెందిన ఆర్యన్‌ విశ్వ విద్యాలయం(జుజీగిబిదీ ఏదీరిఖీలిజీరీరిశిగి ళితీ ఓజీబిదీబీలి) అను అవార్డును ప్రసాదించి గౌరవించింది. 1933లో ఖతిరీజిరిళీ ఔళిబిజీఖి ళితీ ఐశితిఖిరిలిరీ తీళిజీ ఊలిజితివీతి లో సభ్యుడిగా కార్యక్రమాలకు మార్గదర్శకత్వం నెరపమని ఆయనను ఆంధ్ర విశ్వ విద్యాలయం ఆహ్వానించింది. కాశీలోని హిందూ విశ్వ విద్యాలయం కూడా ఆయనను విద్యాభివృద్ధి కమిటీలో సభ్యునిగా నియమించుకుంది. ఉమర్‌ అలీషా విద్వత్తును గుర్తించి 1936లో జుబీబిఖిలిళీరిబి |దీశిలిజీదీబిశిరిళిదీబిజి జుళీలిజీరిబీబిదీబి లో ఆయనను ఖిళిబీశిళిజీ జిరిశిరిలిజీబిజీతిళీ (ఖిళిబీశిళిజీ ళితీ జిరిశిలిజీబిశితిజీలి) తో గౌరవించింది. ఏ విశ్వ విద్యాలయం నుండి ఎటువంటి కనీస డిగ్రీ లేని వ్యక్తికి, అంతర్జాతీయ స్థాయి విశ్వ విద్యాలయం డాక్టరేట్‌ను ప్రకటించడం చాలా అరుదైన సంఘటన. ఉమర్‌ అలీషా తన సాహిత్య సంపదతో,  ఆంగ్లేయులకు షేక్‌ స్పియర్‌, ఇటాలియన్‌లకు డాంటే, ఉర్దూ మాట్లాడే ప్రజలకు డాక్టర్‌ ఇక్బాల్‌ ఎలాగో తెలుగు మాట్లాడే ప్రజలకు డాక్టర్‌ ఉమర్‌ అలీషా అటువంటి వారని ప్రముఖ పండితుల చేత బహువిధాల కీర్తించబడ్డారు. ఉమర్‌ అలీషాకు బహు సత్కారాలు, సన్మానాలు జరిగాయి. మౌల్వీ, బ్రహ్మరుషి, అశుకవి, మహాకవి లాంటి పలు బిరుదులే కాకుండా, పూల కిరీటాలు, సింహతలాటాలు, గజారోహణలు, కనకాభిషేకాలు తదితర గౌరవాలతో ఉమర్‌ అలీషా సాహిత్యవేత్తగా జయభేరిని మ్రోగించారు.

 

” మహా కవిగా, విద్యా వేత్తగా, రాజనీతి జ్ఞుడిగా, జాతీయవాదిగా, బహుభాషా విశారదుడుగా, బహుముఖ ప్రజ్ఞాదురీణుడుగా, దయార్ధ్ర హృదయుడుగా, ఆధ్యాత్మక విద్యా పీఠాధిపతిగా సమత-మమత-మానవతలకు ప్రతీక…” గా వెలుగొందిన డాక్టర్‌ ఉమర్‌ అలీషా తన జీవితకాలంలో పలు గ్రంథాలను రాశారు. అందులో 1.అనసూయాదేవి, 2.కళ, 3.చంద్రగుప్త 4.ప్రహ్లాద లేక దానవవధ, 5. మణిమాల, 6,మహాభారత కౌరవరంగము, 7.విచిత్ర బిల్హణీయము, 8.విషాద సౌందర్యము అను నాటకాలున్నాయి.1. నరకుని కాంతాపహరణ, 2. బాగ్దాదు మధువీధి, 3. విశ్వామిత్ర (అసంపూర్ణము) అను ఏకాంకిలు, 1.వరాన్వేషన్‌ అను ప్రహసనం, 1. ఖండకావ్యములు, 2.తత్త్వ సందేశము, 3.బర్హిణి దేవి, 4. బ్రహ్మ విద్యావిలాసము, 5.మహమ్మద్‌ రసూల్‌ వారి చరిత్ర, 6.సూఫీ వేదాంత దర్శనము, 7. స్వర్గమాత, 8.హాలీలాంటి పద్య గ్రంధాలు రచించారు. 1.ఈశ్వరుడు, 2. మహమ్మద్‌ వారి చరిత్ర, 3. సాధన పథము అను గద్యములు, 1.తారామతి, 2. పద్మావతి, 3. శాంత అనునవలలు, 1. ప్రభాత కథావళి అను కథల సంగ్రహము 1. ఉమర్‌ఖయ్యమ్‌, 2.ఖురాన్‌ – ఏ – షరీఫ్‌, 3.గులిస్తా అను అనువాదాలు 1. ఇలాజుల్‌ గుర్‌భా అను వైద్య గ్రంధాలను ఆయన సృజించారు. ఈ గ్రంథాలలో అన్ని ప్రస్తుతం లభ్యం కావటంలేదు.

 

ఈ రచనలే కాకుండా వందకు పైగా వ్యాసాలు గల సంపుటి, హిందీ-ఆంగ్ల ఉపన్యాసాల సంగ్రహం వేర్వేరుగా ఉన్నాయని, ఇవికాక మదాల, మనద్ధాస్‌ అలీ, ఉరుమత్తూరు చక్రవర్తి, శ్రీ మద్వాల్మీకి రామాయణము కూడా ఆయన రచించినట్టు డాక్టర్‌ మహమ్మద్‌ ముస్తఫా, డాక్టర్‌ యస్‌.యం ఇక్బాల్‌ లాంటి పరిశోధకులు పేర్కొంటున్నారు. ఆయన సృష్టించిన సాహిత్య సంపదలో 34 గ్రంథాలు మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉండగా 23 రచనలు ముద్రితమయ్యాయి. ప్రఖ్యాతి చెందిన ఆయన రచనలు విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థుల పాఠ్య గ్రంథాల స్థానాన్ని పొందాయి. ఆనాడు అలీషా రచనల గురించి చర్చించని సాహితీ సభగానీ, ఆయన రచనలేని గ్రంథాలయం గాని ఉండేది కాదట. మాతృభాష తెలుగు కానప్పటికీ, ” తెలుగులో ఛందోబద్ధమైన సాంప్రదాయ కవిత్వం చెప్పి ఆంధ్ర భారతిని ఆరాధించిన తొలి, తుది కవి ఈయనే కావచ్చు,” నని పండిత ప్రముఖులు ఆయనకు కితాబునిచ్చారు.

ఆయన తెలుగు భాషకు మాత్రమే పరిమితం కాకుండా బహుభాషలలో కవిత్వం రచించగల ప్రతిభావంతుడిగా, తత్త్వవేత్తగా, వేదాంతిగా, విజ్ఞాన గనిగా ప్రజలు-పండితులు గౌరవించారు.  ఆయన సాహిత్యం  పరిశోధనలు జరిపి పలురువు డాక్టరేట్లు తీసుకున్నారు. పలువురు పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో  ఉంచుకుని,  డాక్టర్‌ ఉమర్‌ అలీషా ముని మనుమడు, నవమ పిఠాధిపతి డాక్టర్‌ ఉమర్‌ అలీషా, తమ తాతగారి సాహిత్య సంపదను సేకరించి పుస్తకాలను ప్రచురించి ప్రజలకు, పరిశోధకులు, పాఠకులకు అందుబాటులో ఉంచాలని ప్రయత్నిస్తున్నారు. ఉమర్‌ అలీషా సాహిత్య-ఆధ్యాత్మిక సంభాషణలు, రచనలను మాత్రమే కాకుండా, ఆయన రాజకీయ అభిప్రాయాలు, స్వాతంత్య్ర సమరయోధునిగా పలు ప్రాంతాలలో ఆయన చేసిన ప్రసంగాలు, సమాజ సంస్కరణలకు ఆయన అనుసరించి విధానాలు, చేసిన సూచనలు ఆయన అభిప్రాయాలు, భారత శాసనసభలో ప్రజా ప్రతినిధిగా పది సంవత్సరాల పాటు పనిచేసినప్పుడు చర్చకు వచ్చిన వివిధాంశాల మీద ఆయన చేసిన ఉపన్యాసాలను సేకరించి ఉమర్‌ అలీషా వ్యక్తిత్వాన్ని, మేథో సంపత్తిని సమగ్రంగా ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈకృషిని మరింత వేగవంతం చేసేందుకు ఆయన మునిమనుమడు డాక్టర్‌ ఉమర్‌ అలీషా, ఆయన అనుచరులు కలసి  ” శ్రీ ఉమర్‌ అలీషా గ్రంథ మండలి ”  అను సంస్థను ప్రారంభించారు. ఈ  సంస్థ  ద్వారా అందరికి అందుబాటులోకి వచ్చేలాగా ఆయన గ్రంథాలను పునర్ముద్రణ గావిస్తున్నారు. ఆ సంస్థ  కృషి ఫలించి డాక్టర్‌ ఉమర్‌ అలీషా రాసిన రచనలన్నీ ప్రజలకు, సాహిత్యాభిలాషులకు,  పరిశోధకులకు అందుబాటులోకి వచ్చినట్టుయితే, మహాకవి సంపూర్ణ వ్యక్తిత్వాన్ని దర్శించేందుకు ప్రతి ఒక్కరికి అవకాశం లభిస్తుంది.

 

భారత స్వాతంత్య్ర సగ్రామయోధునిగా, భారత ప్రభుత్వం శాసన సభలో ప్రజా ప్రతినిధిగా  (1935-45)  బాధ్యతలను నిర్వహిస్తూ, సమాజంలో రావాల్సిన మార్పులను ఆకాంక్షిస్తూ ఆదిశగా కృషిచేసిన సంఘసంస్కర్తగానూ,  ఆధ్యాత్మిక రంగాన శిష్యకోటికి ధార్మిక జ్ఞానబోధ చేయు పీఠాధిపతిగాను, బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహితీవేత్తగా, వేదాంతిగా చిరస్మరణీయమైన ఖ్యాతి గడించిన డాక్టర్‌ అలీషా జీవిత పరిసమాప్తి వరకు  పర్యటనలు చేశారు. సమకాలీన సాహిత్య సౌరభాలను అఘ్రాణించుటకు, శిష్యపరంపరకు అధ్యాత్మిక మార్గదర్శకం చేయుటకు ప్రతి క్షణాన్ని వినియోగించిన ఆయన అవిశ్రాంతంగా భారతదేశమంతా పర్యటించినా అలసిపోవడం ఎరుగరు. 1945 జనవరి మాసంలో ఢిల్లీ నుండి స్వస్థలానికి విచ్చేస్తూ, శిష్యుల ఆహ్వానం మేరకు ఆచార్య ఉమర్‌ అలీషా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వెళ్ళారు. శిష్యుల మధ్యన  కొంతకాలం గడిపాక  తిరిగి పిఠాపురం చేరుకో సంకల్పించి, ఆ ప్రయత్నంలో వుండగా జనవరి 23వ తేది సాయం సమయం 5 గంటల ప్రాంతంలో మహాకవి కన్నుమూశారు.

 

రచయిత గురించి :

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌  వృత్తిరీత్యా న్యాయవాది. ప్రవృత్తిరీత్యా పాత్రికేయుడు, పరిశోధకుడు, రచయిత, చరిత్రకారుడు, చిత్రకారుడు.భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లింల పాత్రను వివరిస్తూ ఇప్పటి వరకు తొమ్మిది గ్రంథాలను వెలువరించిన ఆయన  ముస్లిం స్వాతంత్య్రసమరయోధుల చరిత్రలను వెలికితీసి తెలుగు పాఠకులకు అందిస్తున్న తొలి చరిత్రకారుడిగా ఖ్యాతి గడించారు. 1999 నుండి చరిత్ర గ్రంథాలను వెలువరించడం ఆరంభించిన సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 1. భారత స్వాతంత్య్రోద్యమం : ముస్లింలు 2 భారత స్వాతంత్య్రోద్యమం : ముస్లిం మహిళలు 3. భారత స్వాతంత్య్రోద్యమం : ముస్లిం ప్రజాపోరాటాలు 4. భారత స్వాతంత్య్రోద్యమం : ఆంధ్ర ప్రదేశ్‌ ముస్లింలు 5. భారత స్వాతంత్య్రసంగ్రామం : ముస్లిం యోధులు (ప్రధమభాగం) 6. షహీద్‌-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్‌ 7. మైసూరు పులి టీపూ సుల్తాన్‌ 8. చిరస్మరణీయులు, 9. 1857:ముస్లింలు, 10. అక్షరశిల్పులు. అను గ్రంథాలు వెలువరించారు. ఈ గ్రంథాలలో ఐదు గ్రంథాలు మూడుసార్లు, నాలుగు   గ్రంథాలు రెండుసార్లు పునర్ముద్రితం అయ్యాయి. ఆయన రాసిన  1. భారత స్వాతంత్య్రోద్యమం : ముస్లింలు     2. షహీద్‌-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్‌ గ్రంథాలు ఉర్దూ భాషలో తర్జుమా చేయబడి ప్రచురితమయ్యాయి.

 

ప్రస్తుతం ఆయన షఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ ముస్లిం పోరాట యోధులు అను గ్రంథాన్ని, 1757 నుండి 1947 వరకు బ్రిటీష్‌ వ్యతిరేకపోరాటాల్లో పాల్లొన్న 150 మంది ముస్లిం యోధుల చిత్రాలతో షఆల్బమ్‌ తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ఆల్బమ్‌లో ప్రతి యోధుని గురించి తెలుగు, ఆంగ్ల భాషల్లో సంక్షిప్త సమాచారం ఉంటుంది.

 

భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లింల పాత్రను, భారతీయ ముస్లింల స్థితిగతులను వివరిస్తూ  తెలుగు, ఆంగ్ల భాషలలో పలు వ్యాసాలను రాసి ప్రచురించిన ఆయన ఈ అంశం విూద పలు ప్రాంతీయ, జాతీయ స్థాయి వేదికల నుండి, సభలు, సదస్సులలో ప్రసంగాలు చేస్తూ మంచి వక్తగా పేర్గాంచిన  నశీర్‌  భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లింల పాత్రను, ముస్లింల స్థితిగతులను సాధికారికంగా  విడమర్చి తెలుపున్నారు. నిత్య అధ్యయనశీలి అయినటుంటి సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ పలు గ్రంథాల ప్రచురణకు ప్రణాళికలు సిద్ధం ఆ కృషిలో దేశమంతటా పర్యటిస్తూ, విషయ సేకరణగావిస్తూ, విశ్లేషిస్తూ పలు గ్రంథాల ప్రచురణకు   కృషిచేస్తున్నారు.