April 26, 2024

సత్రవాణి

రచన : సత్య

(ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన పరిభాషకు, ఒక తెలుగు‘మాట’అందించడానికే ఈ కథ)

ఆరోజు రమణమూర్తిగారు దేనికోసమో టేబిలు మీదా,సొరుగులోనూ వెదికారు.అది కనిపించలేదు. హడావుడిగా తనగదిలోనూ,వరండాలోనూ వెదికారు.దొరకలేదు.అలా వెదికి వెదికి విసుగెత్తి భార్యను పిలిచారు. ఆవిడ హడావుడిగా వచ్చారు.”ఏదీ?నా సత్రవాణి?ఎక్కడా కనిపించదేంటి?”అన్నారాయన.”ఎక్కడో మీరే ఎడమచేత్తో పెట్టి మర్చిపోయుంటారు అదెవరికావాలి? వెదుక్కోండి, కనిపిస్తుంది”అన్నారావిడ. “అన్నీ వెతికాకే నిన్నడగుతున్నాను. మీరే ఎక్కడో పెట్టేసుంటారు.వెతికి కాసేపట్లో నాకు తెచ్చివ్వాలి”అని ఆజ్ఞ జారీ చేసారు.

ఆవిడ విసుక్కుంటూ లోపలికి వెళ్ళి కూతుర్నిపిలిచారు.”మీనాన్న గారి సత్రవాణి కనిపించటం లేదంట.”

ఆయనే ఎక్కడో పెట్టిమర్చిపోయుంటారు.కాస్త వెతికి తెచ్చివ్వమ్మా”అన్నారు.

రమణమూర్తి గారు అచ్చమైన ఆంధ్రుడు. తెలుగుపంచెకట్టు, దాని మీద పొడుగుచేతుల తెల్లచొక్కా వేసుకుంటారు. భుజంమీదెపుడూ జరీఅంచు మడత కండువా వుంటుంది. పొలంవెళ్ళేటప్పుడు తలపాగా చుట్టుకుంటారు. ఆయనా వూరికి పెద్దరైతు.పెద్దమనిషి!అందుచేతాయనంటే వూళ్ళోవాళ్లందరికీ భయమూ.గౌరవము రెండూ వున్నాయి. అప్పుడెప్పుడో స్కూలుఫైనల్ చదివారంట, అందువల్ల  ఇంగ్లీషు కూడా బాగానే వచ్చాయనకు. అన్నీ బాగానే వున్నాయి కానీ ఆయనకు కాస్త ఆంధ్రాభిమానం, ఆవేగం ఎక్కువ!తనకి కావాల్సింది సమయానికి కుదరకపోతే,ఇంట్లోవాళ్ళమీద చిర్రుబుర్రులాడుతూవుంటారు.

++    +    ++  +   ++  +    ++

 

ఆయన సంగతి భార్యకు,కూతురికి బాగా తెలుసు. అందుకే, తల్లిచెప్పాక ఆ అమ్మాయి ఇల్లంతా వెతికింది. కానీ,అది కనిపించలేదు. ఇంటి పక్కనే వున్న దూళ్ళచావిడి దగ్గరకు అపుడపుడు వెళుతూవుంటారాయన. పాలేరునక్కడ కూడా వెతకమన్నారు. అతను చూసొచ్చాడు అక్కడ ‘సత్రవాని’లేదమ్మా సత్తుగిన్నెమాత్రం వుంది”అన్నాడు.

ఆరోజు పొద్దుట్నుంచీ వాళ్ళింటికి వచ్చినవాళ్లందర్నీ పిలిచి అడిగారు. వాళ్ళుతమకు తెలియదన్నారు.

ఆరోజు పొద్దుటే, తాను పొలం వెళ్ళిన సంగతి గుర్తొచ్చిందాయనకు. పాలేరును పిలిచారు.

“ప్రొద్దున్నే కాలవకింద పొలానికెళ్ళాను.అక్కడ ఆకుమడి చెరువుగట్టుమీద కాసేపు కూర్చున్నాను. అక్కడకాని మర్చిపోయానేమో, చూసిరా, తొందరగా రా”అన్నారు.

ఆయన మాటంటే ఆజ్ఞతో సమానం!పాలేరు పరుగులాంటి నడకతో పొలానికెళ్ళాడు.దారిలో సుబ్బారావు

కనిపించాడు.

“ఏమిట్రా పరుగెడుతున్నావ్?”అడిగాడు సుబ్బారావు.

“మా అయ్యగారి ‘సత్రవాని’పోయిందంట. పొలం కాడ మర్చిపోయారేమోనని చూడమన్నారు.వత్తానండి”అని కంగారుగా అనేసి వాడు వెళ్ళిపోయాడు.

సుబ్బారావు వూళ్ళోకొచ్చాక, అతనికి రామారావు కనిపించాడు.”రమణమూర్తిగారి సత్రవాణి పోయిందంట,కంగారు పడుతున్నారు”అని చెప్పాడు.

“అయ్యోపాపం పోయిందా? అసలు సత్రవాణి అంటే ఏమిట్రా?”అనడిగాడు రామారావు.”అదేంటో నాకుమాత్రమేం తెలుసు! వాళ్ళపాలేరు చెప్పాడు. ఏవిటని అడుగుదామంటే,వాడు కంగారుగా

వెళ్ళిపోయాడు”అన్నాడు “బంగారు కడియమేమో!”అన్నాడు రామారావు.

అపుడపుడూ ఆయన చేతికి బంగారు, వెండికడియాలు పెట్టుకుంటూ వుంటారు.

“బంగారం అయితే అయిదారుతులాలుంటది, దానిమీద ఖరీదైన రత్నాలు కూడాపొడిగించి వుంటారాయన. ఆయనకన్నీ

దర్జాగా వుండాలికదా!”అన్నాడు సుబ్బారావు.

ఆ తర్వాతి మాటల్ని సుబ్బారావు కొందరికీ, రామారావు కొందరికీ చెప్పారు. ఆకొందరందరికీ చెప్పారు.

అదసలే పల్లెటూరు. మాటలకు కల్పనలు కలిసాయి.

“ఆమద్దెనాయన బొంబాయి వెళ్ళారు కదా. అక్కడో మార్వాడీ చేత చేయించారండీ బంగారు కడియాన్ని. దానికి మాంచి ఖరీదైన రాళ్ళుకూడా వేయించారంట!”లాంటి కల్పనలతో ప్రయాణం చేసిందీ గాలికబురు. ఊరంతా

ఓ గంటలో ప్రయాణం చేసి స్థిరపడింది -“రమణమూర్తి గారి సత్రవాణి పోయిందంట “అనేకబురు.

 

+          ++        +          ++        +          ++

 

పొలానికెళ్ళిన పాలేరు తిరిగొచ్చి అక్కడ కూడా కనిపించలేదని చెప్పాడు. ఆ మధ్యాహ్నం వూరికెళ్ళవలసి వుండి విసుక్కుంటూనే, సత్రవాణి లేకుండానే వూరికెళ్ళారు.

ఆవూళ్ళో రెండుపత్రికలకు చెందినపార్ట్ టైం విలేఖర్లున్నారు. వారీ గాలికబుర్నిపోగు చేసారు. మరిన్ని వివరాలడిగి తెలుసుకుందామంటే, రమణమూర్తిగారు ఊరికెళ్ళారు గనుక, అందుబాటులో లేరు.అందువలన

పోగుచేసిన ‘గాలిపదార్థం’తోనే తమ పత్రికలకు వార్తపంపేసారా విలేఖర్లు.

ఆరోజు రాత్రి బాగా పొద్దుపోయాక,రమణమూర్తి గారు ఇంటికి తిరిగొచ్చారు.

“దొరికిందా?దొరికిందా అది ?”అంటూ భార్యను ఆతృతగా అడిగారు.

“దొరకలేదు”అనే సమాధానం విని నిరుత్శాహపడిపోయారు.భోజనం చేసి పెందలాడే పడుకుని,నిద్రపోయారు.

ఆ మర్నాటి ఉదయం పత్రికల్లో,జిల్లా ఎడిషన్సులో,వార్త-” రామాపురం అనేగ్రామంలో రమణమూర్తి

గారనే భూస్వామి గారి‘సత్యవాణి’అనే బంగారుకడియం పోయింది. అది చాలా ఖరీదైనదని భావిస్తున్నారు. దానికి రత్నాలు కూడా పొదిగివున్నాయంట! ఎవరైనా దాన్ని వ్యూహం ప్రకారం కాజేసారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేయ

వలసి వుంటుందని స్థానికులనులనుకుంటున్నారు”-ఇదీ ఆవార్త సారాంశం!  రమణమూర్తిగారు తన గురించా వార్తను పత్రికలో చదివారు.

+          ++        ++        +          ++

 

‘ఆ వార్తలో వున్నలాగా తానెవరికైనా చెప్పానా?,ఔరా ఎంతటి ఉత్సాహపరులు ప్ర్జజలు ! ఎంతటివారీ విలేఖర్లు!’ అనుకున్నారాయన. భార్యకు, కూతురికీ ఆవార్త చూయించారు.

వారు కూడా ఆశ్చర్యపడ్డారు.

ఇంతలో సుబ్బన్న అనే రైతు వాళ్ళింటికొచ్చారు.”బావగారూ!ఎక్కడ?లోనున్నారా?

రమణమూర్తి గారు కాస్త చిరాకుగానే బయటకొచ్చారు.”బావగారూ,నిన్న పొద్దున మీరు మా  యింటికొచ్చినప్పుడు, దీన్నక్కడ మర్చిపోయారు. మీకవసరముంటుందని తీసుకొచ్చాను”

అన్నాడాయన దాన్నతనికిస్తూ.

రమణమూర్తి గారిముఖం వికసించింది.సత్రవాణి దొరికినందుకు సంతోషపడిపోయారు.నిన్నపొద్దుట పొలం నుంచి తిరిగొచ్చేటప్పుడు, దారిలో సుబ్బన్న గారింటిదగ్గర కాసేపాగి సుబ్బన్నగారితో

మాట్లాడివచ్చారాయన. వారిద్దరు బంధువులు.

రమణమూర్తిగారు భార్యను పిలిచి చెప్పారు.”ఇదిగో సుబ్బన్న బావగారింటి దగ్గర నిన్న మర్చిపోయాను సత్రవాణి. పాపమాయాన తెచ్చిచ్చారు. మీ అన్నయ్య గారికి పెద్ద గ్లాసుడు కాఫీ

తెచ్చివ్వు”అన్నారు నవ్వుతూ. ఆవిడ కూడా సంతోషించారు-అది దొరికినందుకంటే ఆయన చివాట్లు తప్పినందుకు!

ఆవిడలోనికెళ్ళి కూతురితో సత్రవాణి దొరికిన సంగతి చెప్పారు.సుబ్బన్న గారికి కాఫీ తెచ్చిచారు.

రమణమూర్తిగారు,సుబ్బన్నగారు అరుగుమీద కూర్చుని మాట్లాడుకుంటూ వుండగా,ఆయన్ను

బాగా ఎరిగిన ఏడెనమండుగురు కలిసి వచ్చారక్కడకు.

“అందరూ కట్టకట్టుకుని ఒకేసారివచ్చారేంటి?ఏవిటి విశేషం?”అని రమణమూర్తిగారడిగారు వాళ్లను.

“మీసత్రవాణి పోయిందటగా! అదిమణిమయభూషితమైన చేతికంకణమటగా! ఎంతవిలువుంటుందో పాపం! మీతోమాట్లాడిపోదామని వచ్చాం”అన్నారు వారిలోని శాస్త్రి గారు సానుభూతిగానూ, గ్రాంథికంగానూ!

రమణమూర్తిగారాశ్చర్యంగాచూసారు.

“మీరు దాన్ని రత్నాలు పొదిగి బొంబాయిలో చేయించారటగా! ఊళ్ళో వాళ్లంతాఅనుకుంటున్నారు. ఈరోజు పత్రికల్లో కూడా వార్త వచ్చింది.అందరం బాధపడ్దాం. మిమ్మ్లల్నోసారి కలిసి వెళ్దామని వచ్చాం”అన్నారు తెలుగు మాస్టారు.

వారితో వచ్చిన మిగిలిన వాళ్లు కూడా అదేఅన్నారు.

వాళ్లంతా అలాగంటుంటే రమణమూర్తిగారికి చిరాకంతా పోయి నవ్వొచ్చింది.

“ఇదిగో సత్రవాణి,నిన్నటినుంచి కనిపించకుండావున్నదిదే! సుబ్బన్నబావగారింటి దగ్గరమర్చిపోయానంట. ఆయనిప్పుడు   తెచ్చిచ్చారు”అని చేతిలోని దాన్ని చూపించారాయన.

“అది సెల్ ఫోన్ కదా! సత్రవాణి అంటారేంటి? “అన్నారు మేష్టారు.

మేష్టారూ,మీరర్థం చేసుకుంటారు!‘ సెల్ ఫోన్ నే తెలుగులో ‘సత్రవాణి’అనాలి!‘సత్ర’అంటే ఇంగ్లీషులో ‘మొబైల్’అని అర్థం!‘వాణి’అంటే మాట్లాడేది , లేదా వినిపించేది అని అర్థం! అదే ఇంగ్లీషులో ‘ఫోన్’అన్నమాట!కనక తెలుగు లో ‘సత్రవాణ్’అంటే ఇంగ్లీషులో సెల్ ఫోన్ అని అర్థం!

తెలుగులో మనకు మాటలు లేవా? వస్తువులకు పేర్లు లేవా? ఒకవేళ కొత్తగా వచ్చిన వస్తువులకు పేర్లు లేకపోతే,తెలుగులో వాటికి సరిపడే పదబందాలను మనం కల్పించుకుని పెట్టుకోవాలి” అని వివరించి చెప్పారు రమణమూర్తిగారు.

“బావగారు చెప్పిందే బాగుంది.అలా తెలుగులో అనుకుంటేనే బావుంటుంది” అన్నారు చదువుకోని సుబ్బన్నగారు.

“మనూళ్ళోని వస్తువుకు బొంబాయి దాకా  కథలల్లారు, మనూరివాళ్ళు, ఎంతకల్పన!”అన్నారు వచ్చినవాళ్ళు.

“సరేలేండి,ఊళ్ళోవాళ్లకు చెప్పండి-కాసేపు కనిపించనిది సత్రవాణి. తర్వాత దొరికిందీ ఈ సత్రవాణే! సత్రవాణి అంటే సెల్ ఫోన్ అని చెప్పండి. తెలుగులో మాట్లాడుకుందాం. అవసరమొస్తే అనర్ఘళంగా ఇంగ్లీషు మాట్లాడ్డానికి మనకన్నా ఘనులెవరూ ఉండరు!”అన్నారు రమణమూర్తిగారు వాళ్లతో.

అప్పట్నుంచీ ఆవూరివారందరి నోటా ‘సత్రవాణి’ అన్నమాటే.

2 thoughts on “సత్రవాణి

  1. నేను ల్యాప్ టాపుని ని “ఒడిపైన” అనీ ,డెస్కు టాపుని “బల్లపైన” అనీ అంటుంటాను…ఇలా సత్రవాణి అని కూడా అనొచ్చన్నమాట. మరి సత్ర కాయ అంటే మొబైల్ ఫ్రూట్ అని అర్థమేమో…!!!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *