|| కవితా! ఓ కవితా! ||

 

రచన: కొసరాజు కృష్ణప్రసాద్

 

కవితా! ఓ కవితా!

నా మదిలో మెదలినపుడు,

మస్తిష్కపు నాడులలో

మోసితి నిను తొలిసారిగ

తల్లియు తండ్రియు నేనై.

ఎన్నెన్నో ఊహాలతో,

మరియెన్నో కలలతోటి,

పులకించితి నీ తలపుతొ

ఏ రూపున ఉంటావోనని.

 

కలం నుంచి జాలువాఱి

వెలువడగా నిన్నుఁజూచి,

సుఖప్రసవమై నిన్నుఁగన్న

ఆనందపు అనుభూతితొ,

మురిసి మురిసి ముద్దాడిన

మధుర క్షణం అతిమధురం.

 

అక్షరాలే పువ్వులుగా

ఏరి ఏరి కూరుస్తూ,

నీ భావానికి మెరుగులద్ది

తీర్చిదిద్ది సంతసించ,

మురిపెంలో పాలుగోరి

నా చుట్టూ చేరి చేరి,

నీ తోబుట్టులు పడ్డ తపన

నా కనుసన్నలు దాటలేదు.

 

దిన దినముగ పెరుగుచు

నువు ప్రచురితమై వెలువడగా,

పట్టమును పొందితివని మురిసితి

నే మరల మరల.

జనులందరు నిన్నుఁజూచి

కొనియాడుతు ఉంటుంటే,

జననీజనకులు నేనై

పొంగిపోతి గర్వముగా,

కవితా! ఓ కవితా!

 

|| కొసరాజు కృష్ణప్రసాద్ ||

ఒక ప్రాతః వేళ

రచన: రామా చంద్రమౌళి

ఒక సీతాకోక చిలుక వచ్చి భుజంపై వాలినట్టనిపించి
చటుక్కున మెలకువ వస్తుంది
నిజానికి ప్రతిరాత్రీ నిద్రపోవడం ఎంత చిత్రమో
మర్నాడు మనిషి మేల్కొనడం అంతకన్నా విచిత్రం
జీవించీ జీవించీ అలసి రాతిశరీరాలతో
తిరిగొచ్చిన తర్వాత
ఏమి కనిపిస్తాయి .. అన్నీ ఖండిత స్వప్నాలు .. రక్త రేకులు తప్పితే
ఎవరో తరుముతున్నట్టు
ఎవరో ప్రశ్నిస్తున్నట్టు
ఎవరో లోపల నిలబడి గునపంతో తవ్వుతున్నట్టనిపిస్తున్నపుడు
కళ్ళుమూసుకుని మాంసవిగ్రహమై నిద్ర మోసుకొచ్చే రాత్రికోసం నిరీక్షణ
తనకోసం తను బతకడం మరిచిపోయి
ఎవరికోసమో జీవించడం.. నిజంగా మోకాలిపై సలిపే పుండే –
నగరాలు ఏ అర్థ రాత్రో రెక్కలను ముడుచుకుంటున్నపుడు
ఎక్కడివాళ్ళక్కడ కలుగుల్లో ఎలుకలు
ఖాళీ రోడ్లపై
‘ పహరా హుషార్ ‘ కంకకట్టె టక్ టక్ .. పోలీస్ చప్పుళ్ళు
నిజానికి ప్రతి అర్థ రాత్రీ ఒక కాలుతున్న కాష్ఠమే
ఎవరికి వారు శరీరాలను కోల్పోయి
ఒడ్డున తలుగుతో కట్టేసిన చీకిపోయిన పాత పడవలు
అంతా అలల చప్పుడే.. నిర్విరామంగా
* * *
ఉదయం నాలుగున్నరవుతుందా
ఒక ‘ నో హావ్స్ ‘ ప్రపంచం మేల్కొంటుంది
నెత్తులపై గంపలను బోర్లించుకుని
కొందరు స్త్రీలు నడిచొస్తూంటారు రోడ్లపై
ఎర్రని రేడియం మెరుపుల దుస్తులతో
మరి కొందరు స్త్రీలు దేవదూతల్లా రోడ్లూడుస్తుంటారు
రోడ్ల ప్రక్కన స్టవ్ ను వెలిగిస్తున్న చీమిడి ముక్కు నిక్కర్లు
‘ చాయ్ చాయ్ ‘ అని అరుస్తూంటే
ఆగి ఉన్న ఆటోల ఆగని చప్పుళ్ళు
ఆర్టీసీ తో యుద్ధం చేస్తూంటాయి
పేపర్ బాయ్స్ దినపత్రికల కట్టలను సైకిళ్ళపై సర్దుకుంటూ
ప్రతి ఒక్కడూ ఇక ఎగురబోయే పావురమే
ఒక గంట క్రితమే నిద్రకుపక్రమించిన బార్ ముందు
చెత్తకుండీ దగ్గర సగం మిగిలిని బిర్యానీ పొట్లాలు
కుక్కలూ, మనుషుల కొట్లాటలో మట్టిపాలౌతూంటే
రాత్రంతా నలిగిపోయిన ‘ కాంట్రాక్ట్ సెక్స్ ‘
ఇక జాకెట్టు హుక్స్ ను సర్దుకుంటూంటుంది
ప్రతి ప్రాతః కాల ఉదయం
రోడ్లన్నీ వీళ్ళతోనే
కూలీలు, లేబర్, కూరగాయల మనుషులు, పాలవాళ్ళు
పేపర్ బోయ్స్, ఆటోలు, అడుక్కునేవాళ్ళు, అన్నీ అమ్ముకునే వాళ్ళు
అప్పుడే నిద్రలేస్తున్న వీధి కుక్కలు –
* * *
సరిగ్గా అదే సమయానికి
పోర్టర్ రాజయ్య బిడ్డ పదవ తరగతి లక్ష్మి
ఉరికి ఉరికి క్రీడా శిక్షణా శిబిరానికొస్తుంది మొసపోస్తూ
ఎప్పటికైనా ఒలంపిక్ పతక సాధనే లక్ష్యంగా.. ఎక్కుపెట్టిన బాణమై
గురిపెట్టిన అమ్ము కసుక్కున లక్ష్యం గుండెలోకి దిగుతుందికదా నిశ్శబ్ద ధ్వనితో
అప్పుడామె గ్రహిస్తుంది
గాయమైన ప్రతిసారీ రక్తం రాదని –

అప్పుడు – ఇప్పుడు

రచన: భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు.

అప్పుడు-ఇప్పుడు అమ్మ
అప్పుడు అంతర్యామిగా అమ్మ,
ఇప్పుడు అంత్యదశలో అమ్మ.
అప్పుడు ఆదిశక్తిలా అమ్మ,
ఇప్పుడు అత్యల్పప్రాణిలా అమ్మ.
అప్పుడు దీనార్తపరాయణియై అమ్మ,
ఇప్పుడు దీనాతిదీనంగా చూస్తూ ఆమ్మ.
అప్పుడు అందరినీ ఘనంగా చూసిన అమ్మ,
ఇప్పుడు అందరితో హీనంగా చూడబడుతున్నఅమ్మ.
అప్పుడు కంటికిరెప్పలా మనని కాపాడిన అమ్మ,
ఇప్పుడు కంటికి మింటికి ధాటిగా ఏడుస్తూ అమ్మ.
అప్పుడు జడలో పువ్వులతో అమ్మ,
ఇప్పుడు కంటిలో పువ్వులతో అమ్మ.
అప్పుడు తన చూపులతో మనని కాపాడిన అమ్మ,
ఇప్పుడు చూపు తగ్గి ఏమీ చూడలేకపోతూ అమ్మ.
అప్పుడు ఎందరినో నడిపించిన అమ్మ,
ఇప్పుడు ఎదుటివారితో నడిపించబడుతున్నఅమ్మ.
అప్పుడు అభయ హస్తంతో అమ్మ,
ఇప్పుడు భయ విహ్వాలయై అమ్మ.
అప్పుడు అమ్మ మనసునిండా దీవెనలు,
ఇప్పుడు అమ్మ మనసునిండా వేదనలు.
అప్పుడు అమ్మ నడుస్తుంటే
కాలికున్నమువ్వలు ఘల్లుమనేవి,
ఇప్పుడు అమ్మ నడవలేకపోతుంటే
అమ్మ కాలినరాలు గొల్లుమంటున్నాయి.
అప్పుడు హుందాతనం జాలువారుతూ అమ్మ,
ఇప్పుడు నిందలప్రవాహంలో మునిగిపోతూ అమ్మ.
అప్పుడు అందరి అవసరాలకు ఆధారమై అమ్మ,
ఇప్పుడు అందరి ప్రశంసలకు దూరమై అమ్మ.
అప్పుడు సందడికి మారుపేరు అమ్మ,
ఇప్పుడు ఒంటరితనానికి మారురూపు అమ్మ.
సృష్టిలోని వింతలా అమ్మ,మాయని ఒక చింతగా అమ్మ.

మత్తు వదలరా

రచన: కొసరాజు కృష్ణప్రసాద్

పరుచుకున్న చీకటి,
ప్రయాసతో గర్భిణి,
పర్లాంగులో ఆసుపత్రి,
మధ్యలో మద్యం షాపు!

మత్తులో మందు బాబులు,
వళ్లు తెలియని కామాంధులు,
మఱ్ఱెల మధ్య మానభంగం,
ఆక్రందనాల అమావాస!

మద్యం షాపులో కాసుల గలగల,
మానభంగమై బాధిత విలవిల,
మద్యం డబ్బుతో నిండెను ఖజానా,
బాధితకందెను పరిహార నజరానా!

మారే ప్రభుత్వాలు, మారని ఆలోచనలు,
ఖజానాపై దృష్టి జాస్తి, గోడుపై మాత్రం నాస్తి.
మద్యంతో వచ్చిన డబ్బుతో ఆరోగ్య, సంక్షేమ పథకాలా?!
ఇది కొనితెచ్చుకున్న దౌర్భాగ్యం.

మార్పు కోరు, మార్పుకై చెయ్యి పోరు,
కానీ, ముందు నువ్వూ మారు!

స్వాగతం

రచన: ములుగు లక్ష్మీ మైథిలి

ప్రత్యూష కాంత నీలి వస్త్రం ధరించి
మేలి పొద్దును స్వాగతిస్తోంది
చైత్ర మాసపు గానరవళులతో
తెలుగుతనపు మధురభావనలతో
తొలిపండగ తెలుగువారి
ముంగిట్లో శ్రీకారం చుట్టింది.

ఏ చిత్రకారునికి అందని మనోహరదృశ్యం ..
పచ్చ పచ్చని లేమావి చివురులు
అరవిచ్చిన మల్లెల గుబాళింపులు
ఆమని రాకతో ప్రకృతిశోభ
ద్విగుణికృతమైంది
మనుగడలో మకరందాన్ని నింపి
షడ్రుచుల పరమార్ధం తెలిసేలా
జీవితంలో వసంతమై రావమ్మా..

తెలుగు తల్లిని వేనోళ్ళ కీర్తిస్తూ
మాతృభాష కు అక్షర హారతులతో
యుగాలకు ఆదివై, నవ్య ఉగాది వై
చేజారుతున్న సంస్కృతి సంప్రదాయాలను..నిలుపరావమ్మా

నీరాక తో ప్రతిఇల్లు మావిళ్ళతోరణాలతో
నవ్యశోభల సంతరించుకుంది
యువత వెన్నుతట్టే చైతన్యమూర్తివై
సజ్జలను సంరక్షించి
దుర్జనులను శిక్షించ ..
రావమ్మా..శ్రీవిళంబినామ వత్సరమా
స్వాగతం..సుస్వాగతం..!

******************

పాతది .. కొత్తది

రచన: రామా చంద్రమౌళి

శీతాకాలపు ఆ ఆదివారం ఉదయం
అతను ఆలస్యంగా నిద్రలేచాడు
కిటికీ తెరిచి , తలుపు తెరిచి .. వాకిట్లోకి అడుగు పెడ్తే
పల్చగా, చల్లగా, గాజుతెరలా మంచుపొర
మెట్ల దగ్గర .. మల్లెపాదు మొదట్లో కుక్కపిల్ల పడుకునుంది ముడుచుకుని
గేట్ దగ్గర పాల ప్యాకెట్ , రెండు దినపత్రికలు
లోపలికొస్తూ ‘ ష్ ‘ అని విదిలిస్తే .. కుక్క కళ్ళు తెరిచి .. చూచి.. లేచి
నాలుగడుగులు వెనుకనే నడచి వచ్చి
మళ్ళీ వెళ్ళి అక్కడే మల్లెపాదు మొదట్లోనే పడుకుంది బద్దకంగా
తర్వాత అతను చుట్టూ చూశాడు కాఫీ తాగుతూ
అదే పాత గది .. పాత ఇల్లు .. పాతదే వాకిలి
పాతవే పూల మొక్కలు
పాతదే కుక్కపిల్ల .. పాతదే గాలి .. పాతదే ఆకాశం
పాత సూర్యుడే.,
ఒక కొత్తదనం కోసం .. అతను బయటికి బయల్దేరాడు కార్లో
కొత్త వీధులు , కొత్త రోడ్లు .. కొత్త మనుషులు
కొత్త పొలాలు .. కొత్త అడవులు .. కొత్త గుట్టలు
చాలా దూరమే వెళ్ళాడతను .. చాలాసేపు
అప్పటికి అన్నీ పాతబడ్డాయి
తిరిగి వస్తున్నపుడు
అన్నీ పాత పొలాలు.. పాత అడవులు .. పాత గుట్టలు
పాతవే పాదాలు .. పాతదే శరీరం
ఏదో అర్థమౌతున్నట్టనిపించి
తిరిగి తిరిగి అతను మళ్ళీ ఇంటికొచ్చాడు –

గేట్ తెరవగానే
మల్లెపాదు మొదట్లోని కుక్కపిల్ల కోసం వెదికాడు
అది లేదక్కడ
చూస్తూండగానే తన కారు వెనుక సీట్లోనుండి దూకింది చటుక్కున
ఎందుకో అతను దాన్ని ప్రేమగా పొదివి పట్టుకుని
తాళం తెరిచి ఇంట్లోపలికి అడుగుపెట్టగానే
పాత గదే కొత్తగా .. పాత ఇల్లే మళ్ళీ కొత్తగా
పాతదే గాలి .. పాతదే ఆకాశం.. పాత సూర్యుడే అతి కొత్తగా
అనిపిస్తూండగా .. అతనికర్థమైంది
‘ బయట ఉన్నదంతా అతిపురాతనమైన పాతదే ,
ఎవరికివారు
కొత్తదనమంతా ‘ లోపలే ‘ వెదుక్కోవాలి ఎప్పటికప్పుడు..’ అని
నిశ్చలంగా అతను చూస్తూనే ఉన్నాడు బయటికి .. కిటికీలోనుండి
అవతల సన్నగా పాతదే మంచు కొత్తగా కురుస్తూనే ఉంది –

జవాబులు …?

రచన: ఉమాదేవి కల్వకోట

ఎవరినడగాలి సంజాయిషీలు?
కన్నవారినా, కట్టుకున్నవారినా, సమాజాన్నా, సాంప్రదాయాన్నా?
ఎక్కడా దొరకదు ఈ ప్రశ్నలకు సమాధానం.
ఎందుకోతెలుసా?
ఈ ప్రశ్నలు సంధించేది ఒక నారి.
అందుకే ఈ ప్రశ్నలకు సమాధానం దొరకదు మరి.
ఆడపిల్లకు ప్రతిదశలో, ప్రతిదిశలో సమస్యల సుడిగుండాలకు ఎదురీతే.
పిండదశలో బ్రూణహత్యలూ..శిశుదశలో నిర్లక్ష్యవైఖరులు
శైశవదశలో ఆంక్షలూ, యవ్వనంలో అఘాయిత్యాలు,
వివాహితలకు కట్నాల ఆరళ్ళు, వృద్ధాప్యంలో నిరాదరణలు.
ఒక ఆడదైవుండి మరోఆడపిల్లకు జన్మనివ్వడానికి
అయిష్టత ఎందుకోతెలుసా?
మరో ఆడపిల్ల తనలా బాధలూ, కష్టాలు పడకూడదనే తాపత్రయం.
చీదరింపులూ, ఛీత్కారాలు ఎదుర్కోకూడదనే ఆరాటం
అయితే ఆడవాళ్ళ సమస్యలకు కాదిది పరిష్కారం.
ఆడవాళ్ళూ!ముందు మీ విలువ మీరు తెలుసుకొండి.
స్త్రీలు బలహీనులు కాదు..స్రృష్టికర్త బ్రహ్మకి సాటిగా,
మరో ప్రాణిని సృష్టించగలిగే మరో సృష్టికర్తలు.
మహిళలే లేకుంటే ఈ జగత్తంతా శూన్యం.
ఇంటినే కాదు ఈ ప్రపంచాన్నేస్వర్గసీమ చేయగలిగే మూలకర్తలు.
అతివలులేనిదే అభ్యుదయం లేదు…అంతా అంధకారబంధురమే.
అందుకే అతివలూ! ముందు మనని మనం ప్రేమించుకుందాం.
మన జన్మని మనం ఇష్టపడదాం…అన్నింటా ముందుందాం.
అభివృద్ధిని సాధిద్దాం…అబలలనే పదాన్నే నిఘంటువు నుండి తొలగిద్దాం.
చక్కగా చదువుకుందాం.. మంచిగా ఎదుగుదాం.
అప్పుడు ప్రతివారూ అనక తప్పదు ఆడపిల్లే ముద్దనీ,
ఆమెను వద్దనవద్దని, ఆమె అభివృద్ధికి హద్దులు వద్దని.
అందరం కలిసి నినదిద్దాం…ఆడవాళ్ళమై పుట్టినందుకు గర్విద్దాం.

పల్లె సద్దు

రచన: కొసరాజు కృష్ణప్రసాద్

తూరుపున దినకరుడు పొద్దుపొడవకముందె,
చిరునవ్వి నా పల్లె నిదురలేచింది.

తల్లి వెనకాలెల్లు కోడిపిల్లల ధ్వనము,
దూడ దరిజేరగా పాలనిచ్చే ఎనుము –
చుట్టాలు వేంచేయు వార్త మోసుకొచ్చి,
నల్ల కాకులు చేయు కావు కావుల రవము!

కళ్లాపి స్నానంతొ వాకిళ్ళు తడవగా,
వికసించె ముంగిట్లో ముత్యాల ముగ్గులు –
సంకురాతిరి శోభ సంతరించుకోగ,
రంగవల్లుల మధ్య మెరిసేటి గొబ్బిళ్ళు!

అరుగుపైనజేరి పత్రికలు తిరగేస్తు
పెద్దమనుషులుజేయు చర్చ సద్దు –
సద్దిమూటనుగట్టి, హాలము బండిలొబెట్టి,
పొలము బయలెల్లేటి రైతుబిడ్డల సద్దు!

జడివాన జల్లులకు నల్లరేగడి తడవ,
మట్టితో చేసిన బొమ్మలాటల సద్దు –
చూరు గడ్డిని తడిపి జాలువాఱుతున్న
ముత్యాల సరళిలో బిందువుల సద్దు!

నాటులేసేకాడ అమ్మలక్కల నోట
పల్లె పాటలుజేయు మధురమైన సద్దు –
పైరుగాలికి పైరు పైటెగురుతుంటేను,
నాట్యమాడే ఎడ్ల అందె రవళుల సద్దు!

చిననాడు సెలవల్లొ నేనాడుకున్నట్టి
తాటిబుర్రల బండి పరుగుజేసిన సద్దు –
అందంగా ముస్తాబై ట్రింగు ట్రింగూ అంటు,
బంధుమిత్రులజేర్చు సైకిల్ రిక్షా సద్దు!

పాలైసు బండికై ఎదురుజూసిన కళ్లు,
గడ్డివాములొ దాచి పండించిన పళ్లు –
లొట్టలేసుకు తిన్న ఈత, నెరేళ్ళు,
సపోటా, బొప్పాయి, ముంజు, మామిళ్ళు!

పొద్దుపోయేదాక అలుపుసోలుపూ లేక
పిల్లలందరు కలిసి ఆటలాడిన సద్దు –
సాయంత్ర సంధ్యలో వడి వడిగ వస్తున్న,
రైతు బండి ఎడ్ల మువ్వ సవ్వడి సద్దు!

అక్కచెల్లెళ్ళతో, అన్నదమ్ముళ్ళతో,
నే పంచుకున్నట్టి అందాల పొదరిల్లు,
అలపుతో ఆనంద కలపుతో అలరారె
నా పల్లె రైతింట విరియాలి హరివిల్లు!

తోడు

రచన: గవిడి శ్రీనివాస్

ప్రయాణాలు కొన్ని సార్లు
ఒంటరిగానే తలుపులు తెరుచుకుంటాయి .
కాలం కొన్ని చీకటి రాత్రుల్ని మోస్తుంది .

విసిగిన చోట నక్షత్రాల్ని బంతిలా కుట్టి
కాసింత వెలుగుని రాజుకుంటే బాగుణ్ణు

దారిపొడుగునా రుతువులు
పరిచయాలుగా పూస్తే బాగుణ్ణు

ఊపిరి ఊగిసలాట
ముంగిట నిలిచే ఆరాటమైతే బాగుణ్ణు

కురిసే నక్షత్రాలు అలసిన సంద్రాలు
జీవితానికి ముడిపడుతుంటాయి .

పసిడి వెన్నెల ముద్దలు ముద్దలుగా
మబ్బుల నుంచీ జారినపుడు
కాళ్ళ ముందు ముచ్చట తోరణాల్ని
తొడిగినపుడు
నిలువునా దేహం
కొత్త అనుభూతుల్ని
తోడుగా నిలుపుకుంటుంది .

అలసిన దేహానికి
తోడు భరోసాగా నిలుస్తుంది .

దయా మరణం !-కవిత

రచన: ఎమ్.వీరేశ్వరరావు

దిగులు మొసలికి
చిక్కిన ముసలి !

మది గదిలో
చుట్టలు చుట్టుకొని
విషాదం చిమ్ముతోంది
వార్ధక్యం పాము !

ప్రాణం అంచున వేలాడేది
దేహం !
సాక్షి గేహం !
నిత్యం మరణ స్మరణం !

రానిది మరణం
దొరకనిది కారణం
అంతరంగం లో ఎప్పడు అవయవాలతో
నిత్యం రణం !
జ్ఞాపకాలు పత్ర రహిత
శిశిర పత్రాలు !
బంధాలు
తృష్ణ జనించని
మృగ తృష్ణలు !
తీతువు కూత
ఉన్నా రానిది రానిది
మృత్యు ఋతువు !

ఒక చూపు శున్యాన్ని
నింపుకొని విడుదల కొరకు !
“దయా మరణం ” (మెర్సీ కిల్లింగ్ )
శరణం !
అదే చివరి పిలుపు
తెలియని లోకం వైపు మలుపు