మేలుకొలుపు!

రచన:- నాగులవంచ వసంతరావు

జీవితమంటేనే కష్టసుఖముల పెనుగులాట
మర్మం తెలుసుకుంటే మనకది వెలుగుబాట

లక్ష్యనిష్ఠలో నీకు కలిగిన మరపు
చేస్తుంది జీవితానికి అంతులేని చెరుపు

గరిటెడంత కృషిచేసి గొప్పగా పొంగిపోకు
గంపెడంత ఫలితంరాలేదని దిగులుగా కృంగిపోకు

క్షణికోద్రేకంలో చేసిన తప్పు
తెస్తుంది జీవితానికెంతో ముప్పు

గతాన్ని మరువనంతకాలం ఉంటుంది పురోగతి
మరచిన మరుక్షణమే అవుతుంది అధోగతి

సహజ జీవనమే సద్గతికి రహదారి
విలాస జీవితమే వినాశనానికి వారధి

చదువు నేర్పిన చక్కని సంస్కారాన్ని
నిలువెత్తు స్వార్థం స్వాహా చేసింది

అదేమని ప్రశ్నించిన అంతరాత్మ
నోరునొక్కింది అంతులేని అహంకారం

తాత్కాలిక ఆనందాలకు తిలోదకాలిద్దాం
ఉత్తమ సంస్కారాలకు ఊపిరిపోద్దాం

ఉత్తుంగ తరంగమై ఉవ్వెత్తున లేద్దాం
జాతి ఔన్నత్యాన్ని జగతికి చాటుదాం!
***

ఇల్లాలు (భర్త అంతర్వీక్షణ )

రచన: మూలా వీరేశ్వరరావు

 

నీ కష్టాలను ఫిల్టర్ చేసి
నాకు ఫిల్టర్ కాఫీ ఇచ్చావు
ఇంటి ధూళినే
మధూళి గా ధరించి
ఉదయాన్ని మధోదయంగా
మార్చావు !

గిన్నెలు కూడా నీ కన్నులతో
మాట్లాడతాయని
వంటిల్లు వదిలి
పుట్టింటికి వెళ్ళినప్పుడే
అర్ధమైంది !
గుట్టలు గా పెరిగిన
నా బట్టలు
నీ చేతిలో ఏ మంత్రముందో
మల్లెల దొంతరలుగా
మారిపోతాయి !
వంటింట్లో సామానులన్నీ
నీ వుంటే
శిక్షణ పొందిన సైనికులై
నీ ఆజ్ఞతో అమృతానికి
నకళ్ళవు తాయి !
అలవోకగా
నా అలకను తీర్చగలవు !
పండగ కో చీర కొని
గీర పోయే నేను
ఎన్ని చీరలతో నీ  శ్రమని తూచగలను ?
నీ వలపు రాగాలతో
జీవన సారాన్ని నింపు కున్న
నాకు
నీ ప్రాయంలోకి పరకాయ
ప్రవేశం చేసినా
నీ ప్రేమ ఐస్ బెర్గ్ లా
కొంతే తెలుసు
తెలియనిది
వలపు సంద్రానికే తెలుసు !

 

‘పర’ వశం…

 

రచన, చిత్రం : కృష్ణ అశోక్

గోవులు కాచే వయసుకే

గోపెమ్మ చేతిలో చిక్కాను,

ఆమె కమ్మని కబుర్ల ముద్దలు

ప్రేమ పెదవుల ముద్దులు మొదలు..

 

వయసు తెలిసే వేళకే

ఓ అంకం మొదలయ్యింది…

ఒళ్ళంతా చిన్ని చిన్ని మోహాల మొలకలు

లేలేత చిగుళ్ళు వేసి పరువపు గుర్తులుగా కొంచెం కొంచెం ఎదుగుతూ…

‘పరవశం’ కి అర్ధం తెలియకుండానే

మనసు తనువు ‘పర’వశము…

 

తొలిరోజుల నాటిన ఆ ప్రేమమొక్క

నాతోపాటు ఎదుగుతూనే ఉంది..

ఏపుగా పెరిగిన ఆ అందాల కొమ్మల్ని

అందాలు చూపి, ఎక్కితొక్కివిరగ్గొట్టాలని కొందరు కామినుల ప్రయత్నం…

విరిగిన కొమ్మ స్థానే మరో చిగురు..

ప్రతి వసంతానా తొడిగే ఓ కొత్త చిగురు..

అనుభవాలు….

రచన, చిత్రం : కాంత గుమ్ములూరి

 

ఐపోయిన సెలవులు
మొదలైన బడులు
పిల్లల నిట్టూర్పులు
మండే ఎండలు

ఉక్క పోతలు
కొత్త పుస్తకాలు
అర్ధంకాని పాఠాలు
తెలియని భయాలు

ఉపాధ్యాయుల బెదిరింపులు
సహాధ్యాయుల వెక్కిరింతలు
తండ్రుల సవాళ్లు
తల్లుల ఓదార్పులు

కొత్త స్నేహాలు
విడువని కబుర్లు
ప్రాణ స్నేహితులు
కలిసి అల్లర్లు

ఎఱ్ఱ రిబ్బన్లు
రెండేసి జడలు
తురిమిన మల్లెలు
వేసవి గుబాళింపులు

తొలకరి వానలు
రంగుల గొడుగులు
తడిసిన సంచులు
పిల్లల కేరింతలు

ఎదిగే అందాలు
ఎగసే ఉద్వేగాలు
విరిసే హృదయాలు
అందరివీ ఈ అనుభవాలు!!!

*********

నా శివుడు

రచన: రాజన్

దిక్కుల చిక్కుల జటాజూటము
అందులొ హరిసుత నిత్యనర్తనము
కొప్పున దూరిన బాలచంద్రుడు
జటగానుండిన వీరభద్రుడు
.
గణపతి ఆడగ నెక్కిన భుజములు
మాత పార్వతిని చేపట్టిన కరములు
స్కందుడు కూర్చొను ఊరువు నెలవులు
సకల దేవతలు మ్రొక్కెడు పదములు
.
అజ్ఞానాంతపు ఫాలనేత్రము
శుభాలనిచ్చే మెరుపు హాసము
ఘోరవిషమును మింగిన గ్రీవము
సర్వలోక ఆవాసపు ఉదరము
.
మదమను గజముకు చర్మము ఒలిచి
ఒంటికి చుట్టిన తోలు వసనము
మృత్యుంజయుడను తత్వము తెలుపు
మెడలో వేసిన కాలసర్పము
.
పుట్టుక మూలము కామదేవుని
మట్టుబెట్టిన మహాదేవుడవు
ప్రాణము తీసెడి కాలయమునికి
మృత్యువునిచ్చిన కాలకాలుడవు
.
గ్రుక్కెడు పాలు అడిగినవానికి
పాలసంద్రమే ఇచ్చిన వాడవు
పదునారేండ్ల ఆయువు వానిని
చిరంజీవిగా చేసిన రేడువు
.
భక్తిప్రపత్తుల పూజించ యక్షునికి
దిక్పాల్కత్వము ఇచ్చినవాడవు
సనకసనందుల శంకలు తీర్చగ
ఆదిగురువుగా వెలసినవాడవు
.
చేతిలొ ఢమరుక ఢమఢమ మ్రోగగ
అక్షరంబులే గలగల జారగ
అందు పుట్టినవి నీదు సూత్రములు
సర్వ శాస్త్రములకాధారములు
.
మహావిష్ణువే మద్దెల కొట్టగ
చదువులతల్లి వీణ మీటగా
మహాశక్తియే లాస్యమాడగా
చతుర్ముఖుండు వేదముపాడగ
దేవగణంబులు పొగడగ పొగడగ
మునిజనంబులు మనసున కొలువగ
అసురసంధ్యలో ధవళనగముపై
తద్ధిమి తకధిమి నాట్యమాడెదవు
.
కాలికదలికలె కాలపు గతులు
సత్యధర్మములె అడుగుల గురుతులు
సకల సంపదలు సర్వభోగములు
ఒంటికినంటిన భస్మరాశులు
.
భక్తకోటులు కొలిచెడి వేల్పుల
మనములనుండెడి వేల్పుల వేలుపు
నా మానసగిరిపై నివాసముండి
అరిష్డ్వర్గము పారద్రోలుమా
నీ పదపద్మము పట్టివీడని
మహాభోగమును కటాక్షింపుమా
హరహర శివశివ శంభోశంకర
గానామృతమున ఓలలాడగా
నన్నుమరువగా నిన్ను చేరగా
శక్తి నొసగుమా భక్తి నొసగుమా
అనితరసాధ్యమౌ ముక్తినొసగుమా
.
…………..హరహర మహాదేవ శంభోశంకర నమః పార్వతీపతయే నమః

నిజాలు

రచన: పారనంది శాంతకుమారి.

అమ్మలాంటి చంద్రుడున్నా…
నాన్నలాంటి సూర్యుడులేని రాత్రిలో,
ఎంతటి భయమో మనని వాటేస్తుంది.
తెల్లవారితేమాత్రం…
అదేభయం ముఖం చాటేస్తుంది.
అమ్మ ప్రేమలాంటి వెన్నెల-
ఇవ్వలేని ధైర్యాన్ని,
నాన్నప్రేమలాంటి వెలుగు
ఆశ్చర్యంగా ఇవ్వగలుస్తుంది.
వెన్నెల ఇచ్చేఆహ్లాదం కన్నా
వెలుగు ఇచ్చే ఆరోగ్యమే
జీవితాన్ని సాఫీగా నడిపిస్తుంది.
వెన్నెలవల్ల కలిగే బ్రాంతులనుండి
వెలుగు మనని విడిపిస్తుంది,
వాస్తవంలోని విలువలను మనకి నేర్పిస్తుంది.
అనుభవిస్తే….వెన్నెల ఇచ్చే చల్లదనం కన్నా
వెలుగు ఇచ్చే వెచ్చదనం మిన్నఅనిపిస్తుంది.
ఆలోచిస్తే….వెన్నెల వెదజల్లే చల్లదనానికి
వెలుగు ఇచ్చే వెచ్చదనమే కారణమని తెలుస్తుంది.
నిశితంగా చుస్తే….
నాన్నకంటే వేరుగా కనబడని అమ్మలా
వెలుగులోని ఒకభాగమై వెన్నెల వికసిస్తోందని
అర్ధమవుతుంది.

అనిపించింది

రచన: భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు.

ఈ సృష్టిలో అమ్మ నాన్నకంటే ఎందుకు ఎక్కువో
మన దృష్టిలో నాన్న అమ్మకంటే ఎందుకు తక్కువో
ఆలోచిస్తేనే అర్ధమవుతుంది,
అవలోకిస్తేనే బోధపడుతుంది.
కలయికలోని సుఖాన్ని మాత్రమే ఆశించే
నాన్నలోని ఆవేశంవల్లే
ఈ సృష్టిలో నాన్నతక్కువయ్యాడని అర్ధమయింది.
కలయిక తరువాత కలిగే కష్టాలన్నిటినీ
అమ్మ ఆనందంతో ఆస్వాదించటంవల్లే
మన దృష్టిలో అమ్మ ఎక్కువయ్యిందని బోధపడింది.
కోపం ధూపమై నిలిచి ఉన్ననాన్న ప్రేమ,
శాంతం ఆసాంతం కలిగిఉన్న అమ్మ ప్రేమ,
కరిగి కన్నీరయ్యే మెత్తదనాన్ని కలిగి ఉన్న అమ్మ,
మరిగి కాగే కరుకుతనాన్ని కలిగి ఉన్న నాన్న,
ఇలా ఈ గుణాలలోని తేడాల వల్లే
అమ్మ అన్నిటికన్నా ఎక్కువ అవటం ,
నాన్న అమ్మకన్నా తక్కువగానే నిలవటం
సహజమే కదా అని అనిపించింది,
అసహజమేమీ లేదని కూడా అనిపించింది.

చెక్కిన చిత్ర శిల్పం..

రచన: కృష్ణ అశోక్.

నేనో రాతిని
చిత్రరచనలు చేసే ఓ రాతిని
పాలుగారే వయసునుండే,
అందుకేనేమో పాలరాతిని…

ఓ స్త్రీ మూర్తి నాలోని
సృజనాత్మక చిత్ర రసాన్ని
మనసు కంటితో వలచిందేమో
మలచడం మొదలెట్టింది…

కాలం కదిలిపోతుంది
నెలలో సంవత్సరాలో,
కళ్ళుతెరిచి చూస్తే
చుట్టూ భామల కోలాహలం…

పాలరాతి ప్రియుడిని
ఉలితో సుతిమెత్తగా వరించి
కృష్ణ మూర్తిగా తీర్చిదిద్ది
పూజలందుకొమ్మని దీవించి పోయింది…

మాయల కృష్ణుడి పేరు మహిమో,
రాతిని మూర్తిగ మలచిన రాధిక వరమో
నేను గీసే గీతలు రేఖలు, రంగులు సువర్ణాలు
మాటలురాని నేను, చిత్రకారుడ్ని ఈనాడు..

కవితా నీరాజనమైన నివేదన

రచన: సి.ఉమాదేవి

కవయిత్రి కవితా చక్ర పలికించిన నివేదన, రాగాలు పలికిన కవితాఝరి. అక్షర ఆర్తితో లిఖించిన ప్రతి పదము రచనాపూదోటలో కవితాసుమమై మధురిమలను వ్యాపింపచేస్తుంది. కలము, గళము యుగళగీతమై అందించిన కవితార్చనలోని తాత్వికత, తాదాత్మ్యతకు గురిచేస్తుంది. పుస్తకం శీర్షిక నివేదన, కాని ప్రతి వాక్యములో ఆరాధన, ఆవేదన సమ్మిళితమైన నివేదనగా రూపుదిద్దుకున్న రచన.
‘దోసిటనిండిన ఆశల పూలరెక్కలు మాయమై హృదయభారాన్ని మిగిల్చాయనడంతో’ నివేదన అక్షరానికి ఊపిరవుతుంది.
‘నేను నడిచే దారుల్లో నీమాటల పూవులు నన్ను తాకుతున్నాయి, నీకై వెదుకుతూ నడిచాను, దారి అంతు చిక్కలేదు, నీ ఆనవాలూ కనిపించలేదు’ అని అనడంలో మాటల పువ్వులతో కవయిత్రి అక్షరమాలలే అల్లారు. ‘నీటికుండతో గుమ్మంలో ఎదురు చూస్తూనే ఉన్నా! నీటికుండలో నీరు తొణకలేదు. . తడిసిన గుండెలో కన్నీరూ ఇంకలేదు. ’చక్కటి ప్రయోగం కన్నీరూ ఇంకలేదు అనడంలో పాఠకుడికి అందులో శ్లేషార్థం కూడా కనబడుతుంది. కన్నీరు గుండెనిండుగా ఉందనడమేకాదు, ఇక ఏడవడానికి కన్నీరు ఇక లేదనిపిస్తుంది. ‘నీ రాక జాడ తెలియలేదు కానీ స్పందన మాత్రం కంటిలో చెమ్మైంది!’అని చెప్పడంలో మనసు కురిసిన కన్నీటి చినుకులే కదా కంటిని తడిపింది అనిపిస్తుంది. ‘అక్షరాలవనంలో నీకోసం పూసిన పదదళాల్ని నీ పాదాలచెంత నివేదిస్తున్నాను. ’రచనా ఒరవడిలో వికసించిన పదాలన్నీ పూలరెక్కలై పరిమళిస్తాయి. ‘ఇంద్రధనస్సులో సప్తవర్ణాలేకాని మనసున ఎన్ని రాగవర్ణాలో అనడం రాగరంజితమే. మగత నా వేలు పట్టుకుని స్వప్నసీమలో నిన్ను చూపుతూ నీ దరి చేరుస్తున్నది. మేలుకుని చూసాను నీవు లేని శూన్యత కళ్లలో మాత్రం నీ రూపం నింపిన వెలుగు. ’ కలయో వైష్ణవమాయో అనే భావన మన మనసును లీలగా స్పృశిస్తుంది. ‘కనుల కాటుక కరిగీ గాజుల సవ్వడీ సద్దుమణిగి బాహ్యాలంకరణ వసివాడింది, నీ దర్శనార్థం వేచి ఉన్న హృదయాలంకరణ మాత్రం
-2-
తేజోవంతంగా కాంతులీనుతూనే ఉంది’ అంటారు. బాహ్యప్రపంచాన్ని మరచి అంతరాత్మలో అంతర్యామితో మమేకమైన భావన పొటమరిస్తుంది. ‘బంధాలే సమస్తమైన నాకు స్వేచ్ఛైక విశ్వజనీన ప్రేమను చవి చూపావు. . . నింపారమైన నీ చూపు కవచంలో బందీనే’ అని నివేదించడం కళ్లు చూపులతో బంధిస్తాయన్న నిజానికి చక్కని దృష్టాంతం. ‘ఏ దిక్కునుండి, ఏ సమయంలో వస్తావో తెలియక ఆకసాన్ని చూస్తూ పొద్దుపొడుపేదో, పొద్దుగూకేదో మరచి నీ కోసం అల్లుతున్న మనోమాలికలో ఎన్నో చిక్కుముడులు. ’ అని చెప్పడంలో మనసున ఉద్భవించే ఆలోచనల సుడిగుండాన్ని తలపుకు తెస్తుంది. ‘వాలిన నా కళ్లలో మాత్రం నీ పాదముద్రలు నిక్షిప్తమయ్యాయి. నువ్వు లేవు అలౌకిక భావపు అంచున నేను. ఇహపరముల సమ్మోహనమిది. నీ గమనంలో వేగం పెరిగిందని వాయువేగం సందేశం చేరవేసింది, నువ్వు చేరే గమ్యం నేనే అన్న ధీమా, అనంతమైన కాంతితో ప్రజ్వలిస్తోంది. ’ నివేదన చివరి రూపు సంతరించుకునే దిశగా ఆశ మొలకెత్తుతుంది.
‘నీ పాదాలను అలంకరించాలని ఒక్కో అశ్రుబిందువును మాలగా కూర్చాను పక్షుల కువకువలు నీ రాకకు స్వాగతం పలుకుతున్నాయి. ప్రభాతస్వప్నం సంధ్యాసమయంలో కరిగిపోతున్నా అలుపులేక నా గొంతు నీ గీతాలనాలపిస్తూనే ఉంది. ’ కల కనుమరుగైనా మనసుపలికే రాగాలను అడ్డుకోలేం కదా అనే భావం చదువరిని ఆకట్టుకుంటుంది. ‘నువ్వు మౌనం వహించావు. . . ఆ మౌనంలోనే భాషను వెతుక్కుని, నీతో సంభాషిస్తున్నాను. ’ మౌనభాష్యమెపుడు మనసుభాషే. ‘కాలచక్ర ప్రవాహ గమ్యమేమిటో తెలియదు గానీ ఈ కాల గమనంలో అడుగడుగునా నీ సందేశమే. ’మన మనసులో ఉత్పన్నమయే ఆరాధనా భావాలకు జవాబెపుడు కోరుకున్న సందేశమే అవుతుంది. ప్రతిపుటలోను అనురాగమాలికలు పేని కాలచక్ర పరిభ్రమణంలో ఆర్ద్రత నిండిన నివేదనతో అక్షరపుష్పాలను వికసింపచేసిన కవితా చక్రకు అభినందనలు.

దేనికి ..?

రచన: భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు.

మాటకా? మనసుకా?
దేనికి నీ ప్రాధాన్యత?
వయసా?వలపా?
దేనితో నీ అన్యోన్యత?
రూపానితోనా?గుణానితోనా?
దేనితో నీ సారుప్యత?
నిన్నటితోనా?నేటితోనా?
దేనితో నీ తాదాత్మ్యత?
జననంలోనా?మరణం లోనా?
దేనిలో నీ తాత్వికత?
సంపాదనతోనా?సత్యసంధత తోనా?
దేనితో నీ సామీప్యత?
మాయలకా?మహిమలకా?
దేనికి నీ ప్రాధాన్యత?
కరుణతోనా?కరుకుతనంతోనా?
దేనితో నీ పరిపక్వత?
శాంతికా?భ్రాంతికా?
దేనితో నీమనో పులకిత?
ద్వేషించటానికా?దీవించటానికా?
దేనికి నీ అస్వస్థత?
స్వార్ధమా?పరమార్ధమా?
ఏది నీకు అలభ్యత?