ఓషో రజనీష్

రచన: శారదా ప్రసాద్

వాత్సాయనుడికి వారసుడుగా జనం చెప్పుకునే ఓషో జిడ్డు కృష్ణమూర్తిగారి అభిమాని. బుద్ధుడి బోధల వల్ల ప్రభావితుడయ్యాడు.
రజనీష్ చంద్రమోహన్ జైన్ 1960లలో ఆచార్య రజనీష్‌గా, 1970-1980లలో భగవాన్ శ్రీ రజినీష్‌ గా ఆ తరువాత ఓషోగా పిలువబడిన ప్రఖ్యాత భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు. ఇండియా, అమెరికా సంయుక్త రాష్ట్రాలతో సహా ఎన్నో దేశాలలో నివసించి ఓషో మూవ్‌మెంట్ అనే ఒక వివాదాస్పదమైన కొత్త ఆధ్యాత్మిక సంఘాన్ని తయారుచేశాడు. ఇతడు మధ్యప్రదేశ్‌ లో గల నర్సింగ్‌పూర్ జిల్లాలో ఉన్న కుచ్‌వాడాలో 11. 12. 1931న జన్మించాడు.
జీవితానికి సంబంధించిన గొప్ప విలువలు ఎరుక, ప్రేమ, ధ్యానం, సంతోషం, ప్రజ్ఞ, ఆనందం అని ఆయన బోధించాడు. జ్ఞానోదయం (ఎన్‌లైటెన్‌మెంట్) అన్నది ప్రతి ఒక్కరి సహజ స్థితి, కానీ అది తెలుసుకోలేకపోతున్నారు – మనిషి ఆలోచనా విధానం ముఖ్యకారణం కాగా, సామాజిక పరిస్థితులు, భయం వంటివి మరి కొన్ని కారణాలు అని ఆయన అన్నాడు. హిందీ, ఆంగ్ల భాషలలో ఆయన అనర్గళంగా ప్రవచించాడు. బుద్ధుడు, కృష్ణుడు, గురు నానక్, ఏసుక్రీస్తు,
సోక్రటీసు, జెన్ గురువులు, గురుజెఫ్, సంప్రదాయాలు, సూఫీ, హస్సిడిజమ్, తంత్ర వంటి బోధనలు మరియు ఆధ్యాత్మిక సంప్రదాయాలు ఎన్నింటిలోనో ఆయన ఆరితేరిన దిట్ట. ఏ తత్వమూ సత్యాన్ని పూర్తిగా గ్రహించలేదు అనే నమ్మకాన్ని కలిగి, ఏ “ఆలోచనా పద్ధతి”లో కూడా తనను ఎవరూ నిర్వచించలేరని ఆయన ప్రకటించాడు.
అరవైలలో తరుచుగా శృంగారానికి సంబంధించిన ప్రవచనాలను వెలువరించినందుకు ఆయన్ని”సెక్స్ గురువు” అని పిలిచేవారు. ఆ ప్రవచనాలన్నింటిని Sex to Super consciousness అనే ఆంగ్ల పుస్తకంగా ప్రచురించారు. ఈ పుస్తకం సంభోగం నుండి సమాధి వరకు అనే పేరుతో తెలుగులో అనువదించబడినది. ఆయన చెప్పినది, “తంత్ర పద్ధతిలో అనైతికం అనేది లేదు, అంతా నైతికమే” సెక్స్‌ను నైతికంగా అణగద్రొక్కడం లాభ రహితం, సంపూర్ణంగా చైతన్యసహితంగా అనుభవించనప్పుడు దాన్ని దాటి ముందుకు వెళ్ళలేరు అని. “ప్రేమ ఓ ప్రదేశం. స్వేచ్చగా మనస్పూర్తిగా అనుభవించు. జీవితంలో ఏ రహస్యం ఉండదు. దాచిపెట్టడమే ఉంటుంది. సెక్స్ వల్లనే మనం పుడతాము. అన్ కాన్షస్ నుండి సెక్స్ సూపర్ కాన్షస్ కు తీసుకు వెళుతుంది. సెక్స్ తోనే ముక్తి. జీవితం పక్షి. ప్రేమ, స్వేచ్చ రెండు రెక్కలు. అందరూ మనల్ని వదిలివేయటం ఒంటరితనం. అందర్నీ మనం వదిలి వేయటం ఏకాంతం.
“ప్రతి ఏటా 2, 00, 000 మంది పర్యాటకులతో, పూణే పట్టణములోని ఓషో అంతర్జాతీయ ధ్యాన విహారము (Osho International Meditation Resort) ప్రపంచంలోని అతి పెద్ద ఆధ్యాత్మిక ఆరామాలలో ఒకటి. నేడు 50 భాషలలో అనువాదం చెయ్యబడి ఓషో పుస్తకాలు మున్నెన్నడు లేనంతగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఆయన వ్యాఖ్యానాలు, పలుకులు గొప్ప వార్తాపత్రిక లెన్నింటిలోనో మనకు కనిపిస్తాయి.
భారతదేశ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రముఖ నవలాకారుడై విలేఖరి కుష్వంత్ సింగ్, సినిమా నటుడు మరియు రాజకీయనాయకుడు వినోద్ ఖన్నా, అమెరికా కవి రూమీ మరియు అనువాదకుడు కోల్‌మన్ బార్క్స్, అమెరికా నవలాకారుడు టామ్ రాబిన్స్ మొదలైన వారు ఈయన శిష్యులే! కొత్త ఢిల్లీలోని భారత పార్లమెంటు గ్రంధాలయంలో కేవలం ఇద్దరు ప్రముఖుల పూర్తి జీవితకాల రచనలను మాత్రమే పొందుపరిచారు, ఒకరు ఓషో కాగా మరొకరు మహాత్మా గాంధీ.
ఓషో బాల్యంలోనే హిప్నొసిస్ నేర్చుకున్నాడు. హిప్నొసిస్ తో పూర్వ జన్మల రహస్యాలు తెలుసుకున్నాడు. ఓషోను బాల్యంలో ప్రభావితం చేసింది, ఆయన మాతామహుడి మరణం. ఆయన మరణించే సమయంలో పక్కనే రజనీష్ ఉన్నాడు. మృత్యువును గురించి తెలుసుకోవాలనే చింతన ఆయనలో ప్రారంభం అయింది. అతనిని మరింత ప్రభావితం చేసిన సంఘటనలు రెండు! ఒకటి ఆయన ప్రేమించిన అమ్మాయి ‘శశి ‘ 16 వ ఏటనే మరణించటం! రెండవ సంఘటన మహాత్మాగాంధీ దారుణ హత్య!
1955 లో డిగ్రీ పూర్తిచేసాడు. 1957లో సాగర్ యూనివర్సిటీ నుంచి ఎం. ఎ డిగ్రీ తీసుకొని, కొంతకాలం జబల్ పూర్ లో లెక్చరర్ గా పనిచేసాడు. ఆ కాలంలో విద్యార్ధులకు సెక్స్ పాఠాలు చెప్పటంతో, ఆ ఉద్యోగం కాస్తా ఊడింది. అన్ని మతాలను తిట్టేవాడు!అతని సెక్స్ బోధనలు యువతను ఆకట్టుకున్నాయి. 1970 లో బొంబాయికి మకాం మార్చాడు. 1981 లో పూనాలో రజనీష్ ఒక ఆశ్రమాన్ని నిర్మించాడు. అక్కడికి విదేశీయులు ఎక్కువగా వచ్చేవారు. ఆ రోజుల్లోనే ఆయన సెక్స్ యోగిగా మార్పు చెందాడు. ఆయన ప్రసంగించినంత సేపు భక్తులు తన్మయత్వంతో ఊగిపోయేవారు. ఆయన కళ్ళలో అద్వితీయమైన శక్తి ఉంది. ఆయన్ను ఒక్కసారి చూస్తే చాలు, ఆయన వశమౌతాం!
పేరుకు బ్రహ్మచారి అయినా ఆయనకు చాలామంది స్త్రీలతో సంబంధాలు ఉండేవి. క్రాంతి, లక్ష్మి, క్రిష్టినీవుల్ఫ్ వారిలో ముఖ్యులు. జన్మత:జైనుడైనా ఆయనకు బౌద్ధం అంటే ఇష్టం! శ్రీ కృష్ణ తత్వాన్ని రజనీష్ అంత గొప్పగా చెప్పిన మరొకరు లేరు! ఓషో కృష్ణుడి దగ్గర నుంచి బుద్ధుడి వరకు, జీసస్‌, మహమ్మద్‌, మహావీర తత్వాల మీద వ్యాఖ్యానం చెప్పారు రజనీష్. ఎక్కడ బుద్ధుడు అంతమవుతాడో అక్కడ కృష్ణుడు మొదలవుతాడంటూ కృష్ణ తత్వం మీద ఆయన ఇచ్చిన ఉపన్యాసాల సంకలనాన్ని ఇందిర, గోపాలప్ప సామాన్యులకు కూడా అర్థమయ్యే భాషలో చక్కగా అనువదించారు.
మానవ చరిత్రలో కృష్ణుడు మాత్రమే అణచివేతలకు, దమనానికి వ్యతిరేకి అంటాడు ఓషో. సహజ ప్రవృత్తులను, భావావేశాలను అణచివేయడం ద్వారా మనిషి తనను తానే చంపుకున్నాడు అని చెప్పాడు ఓషో. కృష్ణుడే ప్రేమంటూ అతడి ప్రేమ తత్వాన్ని వివరించిన ఓషో కృష్ణుడికి, బుద్ధుడికి, మహావీరుడికి మధ్య ఉన్న తేడాలను కూడా చెప్పాడు. బుద్ధుడికి జ్ఞానోదయం అయిన తర్వాత, ఆయన నాకు కొత్తగా తెలిసింది ఏమీ లేదు. ‘తెలిసింది’ అక్కడ ఎప్పుడూ ఉంది. బుద్ధుడు చివర్లో చెప్పిందే కృష్ణుడు మొదట్లోనే చెప్పాడంటాడు ఓషో. కృష్ణుడు సర్వకాలాల్లోనూ జ్ఞానిగా ఉన్నాడు. ఆయన చేసిన కృష్ణ తత్వ విశ్లేషణ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. రజనీష్ ను కొంతమంది భావించి నట్లుగా తక్కువగా అంచనా వేయటానికి వీల్లేదు! ఆయన కళ్ళు పలకరిస్తాయి, బోధిస్తాయి! తనకు దీటైన వ్యక్తి ఒక్క జిడ్డు క్రిష్ణమూర్తే అని అంటాడు. అయితే జిడ్డు కృష్ణమూర్తి మాత్రం ఇతన్ని అసహ్యించుకునేవాడు.
రజనీష్ 1981లో అమెరికాలో రజనీష్ పురాన్ని కొన్ని కోట్ల ఖర్చుతో ప్రారంభించాడు. ఇమిగ్రేషన్ సమస్యలు వచ్చాయి. దానికి తోడూ ఆయన ప్రియ సఖి షీలా మొత్తం డబ్బుతో జర్మనీకి పారిపోయింది. రజనీష్ బికారీగా ఇండియాకు చేరుకున్నాడు. ప్రభుత్వం అనుమతించని కారణంగా మనాలిలో ఒక ఆశ్రమాన్ని నెలకొల్పి అక్కడే ఉన్నాడు.రజనీష్ ఆధ్యాత్మిక యాత్ర మొదలైంది,అంతమయింది మనాలీలోనే! రజనీష్ లో లోపాలున్నప్పటికే, అభినందించదగిన విషయాలు కూడా అనేకమున్నాయి! ఆయనకు తెలిసిన యోగ విషయాలు,ఆధ్యాత్మిక విషయాలు మరెవ్వరికీ తెలియవు. “ధ్యానానికి ఆలోచనలు పనికిరావు, ఎక్కడైతే ఆలోచనలు అంతమవుతాయో అక్కడ ‘ధ్యానం’ మొదలవుతుంది.”అని జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పిందే చివరికి ఈయన కూడా చెప్పాడు! వివాదాస్పదమైన ఈ యోగి 60 ఏళ్ల వయసు రాకముందే, 19-06-1990 న ‘కీర్తి’శేషుడయ్యాడు!
అన్నిటినీ ఆహ్వానించే నాకు ఈయన కూడా ఆరాధనీయుడే! ఆ మహనీయునికి నా స్మృత్యంజలి!

చార్వాకులు

రచన: శారదాప్రసాద్

2500 సంవత్సరాల క్రితం మనుషులకి ప్రకృతి గురించి తెలిసినది చాలా తక్కువ. ఆ రోజుల్లో కూడా భారతదేశంలోనూ, గ్రీస్ లోనూ కొందరు నాస్తికులు ఉండేవారు. ప్రాచీన భారతీయ నాస్తికులని చార్వాకులు లేదా లోకాయతులని అనే వారు. లోకాయతులు అంటే ఉన్న లోకాన్నే నమ్మేవారు. వీరు పరలోకాన్ని నమ్మరు. వీరు దేవుడు, ఆత్మ లాంటి ఊహాజనిత నమ్మకాల్ని, కర్మ సిధ్ధాంతాల్ని తిరస్కరించారు. చార్వాకము లేదా లోకాయతం లేదా బృహస్పత్యం భారతదేశపు ప్రాచీన భౌతికవాదం. ఈ వాదాన్ని బోధించిన వాడు చార్వాకుడు . ఇతను ఒక మహర్షి, బృహస్పతి శిష్యుడు. నాస్తిక మత వ్యాప్తి చేసినవాడు. లోకాయత సిద్ధాంత కర్త. చార్వాక, లోకాయత, బార్హస్పతి అని అనేక పేర్లు గలవు ఈ శాఖకు. ‘లోకేషు అయతాః లోకాయత’ ‘లోకాయత’ అంటే ప్రజల తత్వశాస్త్రం అనీ ప్రజల దృక్పధం అనీ అర్ధం చేసుకోవచ్చు.
లోకాయతకు మిగతా తత్వశాస్త్రాల లాగా ఒక మూల పురుషుడు లేడు. ఇది సామాన్య ప్రజల్లో పుట్టిన ‘అనుమాన’, ‘తర్కా’ ల ప్రభావమే. మనం భగవంతుడికి ప్రసాదం రోజూ పెడుతూనే ఉన్నాం కాని ఆయన ఎప్పుడన్నా దాన్ని తిన్నాడా?ఇలాంటి తర్కాలను లేవదీసి, చివరకు ఆనాటి అధ్యత్మిక వాదులచే తిరస్కరింపబడ్డారు ఈ లోకాయతులు. 14వ శతాబ్ధికి చెందిన మాధవాచార్య తన ‘సర్వదర్శక సంగ్రహం’ లో ఇలా వివరించాడు. “సంపదనూ, కోరికలనూ, మానవ లక్ష్యాలుగా భావించి, సంతోషాన్ని ధ్యేయంగా పెట్టుకున్న విధానాన్ని, సూత్రాలను అనుసరించుతూ, భవిష్యత్ ప్రపంచ వాస్తవికతను నిరాకరించే మానవ సమూహాన్ని చార్వాక సిద్దాంతాన్ని అనుసరించే వారిగా గుర్తించవచ్చు. వారి సిద్దాంతానికి మరోపేరు ‘లోకాయుత’. వస్తు రీత్యా ఇది సరైన పేరు. దేవుడు లేడు, ఆత్మలేదు, మరణానంతరం మిగిలేదేమీ లేదు అని నమ్మి ఇంద్రియసౌఖ్యాలకి ప్రాధాన్యత నిచ్చిన వీరిని చరిత్ర భౌతికవాదులుగా పేర్కొంది.
ఆనాటి సమాజంలో రాజకీయంగా, ఆర్ధికంగా బలవంతులైన వైదిక సంప్రదాయ వాదులచే అణగద్రొక్కబడిన లోకయతుల ప్రాచీన గ్రంథాలన్నీ క్రీ. పూర్వమే ధ్వంసం చేయబడ్డాయని అంటారు. చివరకు వీరి ఆచారాలు, సంప్రదాయాలను, వీరి ప్రత్యర్దుల గ్రంథాల నుండి, (వ్యంగ్య) వ్యాఖ్యల నుండి తీసుకోవలసి వచ్చింది. క్రీ. పూ. 300 కి చెందిన కాత్యాయనుడు వైయాకరిణి లోకాయతపై ‘భాగురి వ్యాఖ్యానం’ ఉదహరించాడు. అంటే ఆ కాలంలోనే లోకాయత గ్రంధమూ, దానిపై వ్యాఖ్యానమూ ఉన్నాయన్నమాట. ‘బ్రహ్మ సూత్రాల’ భాష్యంతో శంకరాచార్య వీరిని ‘ప్రకృతిజనాః’ (మూర్ఖజనులు) అంటే లోకాయతులనే చెప్పాడు. ‘షడ్ దర్శన సముచ్చయ’ రచయిత హరిభద్రుడు, లోకాయతులను వివేచన లేని గుంపుగా, ఆలోచన లేని సముదాయంగా వర్ణించాడు. ఆ కాలంలో దీని వ్యతిరేకతలోనే దీని ప్రభావం, శక్తి, ముఖ్యత గోచరిస్తాయి. సామాన్య బ్రాహ్మణుడినుండి, పాలకుల వరకు లోకాయత శాస్త్రాన్ని అభ్యసించే వారని అనేక ఆధారాలున్నాయి. బ్రాహ్మణుడైన జాబాలి, శ్రీరాముడికి మత విరోధ భావాలు బోధించాడు. బౌద్ధులు పిడి సూత్రాలలో, బ్రాహ్మణులు అభ్యసించే అనేక శాస్త్రాలలో లోకాయత ఒకటని పేర్కొన్నారు. ‘వినయపిటిక’ ప్రకారం, బుద్దుడు ఆపి ఉండకపోతే కొందరు బౌద్ధ సన్యాసులు కూడా లోకాయతను పఠించడానికి సిద్దపడ్డారట.
బుద్దఘోషుడు లోకాయతను “వితండవాద శాత్త” అని పిలిచాడు. (పాళీభాషలో శాత్త అంటే సంస్కృతంలో ‘శాస్త్రం’. ). మహాభారతంలో అరణ్యపర్వంలో ధర్మరాజుతో తన చిన్ననాటి విషయాలు ముచ్చటిస్తూ ద్రౌపది ఇలా అంది. తన చిన్ననాడు, తమతో ఉండటానికి ఒక బ్రాహ్మణుడ్ని తన తండ్రి ఆహ్వానించాడనీ, ఆ బ్రాహ్మణుడే తన తండ్రికి, తన సోదరులకు బార్హస్పత్య భావాలను బోధించాడనీ, తనూ వాటిని ఆసక్తితో వినేదాన్ననీ చెప్పింది. ద్రౌపది చెప్పిన విషయాలు విని ధర్మరాజు ఆమెను మత వ్యతిరేక భావాల ప్రభావంలో పడిపోయిందని నిందించాడు. కౌటిల్యుడు తన ‘అర్ధశాస్త్రం’ లో సాఖ్య, యోగశాస్త్రాలతో పాటు, లోకాయతను కూడా ఉదహరించి, దానిని ‘తర్కశాస్త్రం’ అన్నాడు. బాణుని ‘హర్షచరిత్ర’లో విచ్చేసిన ఋషుల జాబితాలో ‘లోకాయత’ పేరు కూడా ఉంది.
14వ శతాబ్ధపు జైన వ్యాఖ్యాత అయిన గుణరత్నుడు లోకాయతుల గురించి ఇలా చెప్పాడు. జీవితం బుద్బుదప్రాయం అని తలచి, మానవుడు చైతన్య సహితమైన శరీరం తప్ప ఇంక ఏమీలేదు అన్న అభిప్రాయంతో మద్యపానం, మాంసభక్షణ, అదుపులేని లైంగిక క్రియలలో పాల్గొనేవారు. కామానికతీతమైన దేన్నీ వారు గుర్తించరు. వారిని చార్వాకులనీ, లోకాయతులనీ అంటారు. పానం చేయుట, నములుట(భుజించుట) వారి నీతి. నములుతారు కనుక వారిని చార్వికులంటారు. (చర్వ్:నములుట). అంటే వివేచన లేకుండా భుజిస్తారట. వీరి సిద్దాంతం బృహస్పతి ప్రతిపాదించాడు కనుక వారిని బార్హస్పత్యులని కూడా అంటారు. వాస్తవ జగత్తును మినహా , అన్నింటినీ తిరస్కరించినందువల్లే ఈ తత్వశాస్త్రాన్ని ‘లోకాయత’ అంటారని పంచానన తర్కరత్న ఉవాచ. మొత్తానికి అనాటి వైదికసాంప్రదాయాలనూ, మూఢ నమ్మకాలనూ ఎండగట్టి తిరస్కరించినందువలనే, ఈ లోకాయతులు అణచివేయబడ్డారన్నది సుస్పష్టం.
‘మహాభారతం’ లో శాంతిపర్వంలో ఉన్న ప్రసిద్దమైన చార్వాక వధ కధ గురించి ఇప్పుడు తెలుసుకుందాం! కురుక్షేత్ర మహాసంగ్రామానంతరం, పాండవులు దిగ్విజయంగా తిరిగి వస్తున్న సందర్భంలో వేలకొలదీ బ్రాహ్మణులు నగర ద్వారం వద్ద యుధిష్టురుని ఆశీర్వదించడానికి ప్రోగయ్యారు. వారిలో చార్వాకుడు కూడా ఉన్నాడు. మిగతా బ్రాహ్మణుల అనుమతి తీసుకోకుండానే, ముందుకు వెళ్ళి ధర్మరాజునుద్దేశించి ఇలా అన్నాడు. “ఈ బ్రాహ్మణ సమూహం, నీ రక్త బంధువులను వధించిన నిన్ను శపిస్తోంది. నీ మనుషులనే, నీ పెద్దలనే సంహరించి నీవు సాధించిందేమిటి? నీవు చనిపోయి తీరాలి (నశించాలి)” హఠాత్తుగా జరిగిన చార్వాకుని మాటలకు, అక్కడ సమావేశమైన బ్రాహ్మణులు నిర్ఘాంతపోయారు. యధిష్టిరుడు నైతికంగా గాయపడి మరణించాలని నిశ్చయించుకున్నాడు. అప్పటికి మిగతా బ్రాహ్మణులు తెలివి తెచ్చుకుని, చార్వాకుడు తమ ప్రతినిధి కాదనీ, బ్రాహ్మణ వేషంలో ఉన్న రాక్షసుడనీ, రాజవిరోధి దుర్యోధనుని మిత్రుడనీ చెప్పారు. అలాగే తమకు రాజు చేసిన ఘనకార్యాల పట్ల మెచ్చుకోలు మాత్రమే కలదని హామీ ఇచ్చారు. నిరసన తెలిపిన చార్వాకుని నిలువునా దహించి వధించివేసారు.
‘మహాభారతం’ ప్రకారం పవిత్రులైన బ్రాహ్మణుల చేతిలో దగ్ధమైపోయిన “చార్వాకుడు అంతకు పూర్వం ఒక రాక్షసుడు. కఠోరమైన తపస్సులు చేసి విపరీతమైన శక్తులు సంపాదించాడు. ఆ తరువాత దేవతలను బాధించి అణచివేయటం ప్రారంభించాడు. ” అని ముద్రవేశారు . ఇది మామూలే, ఆ రోజుల్లో బ్రాహ్మణ సంప్రదాయాలను వ్యతిరేకించే వారిని రాక్షసులు, అసురులుగా ముద్రవేయటం పరిపాటి. చార్వాకుడు యధిష్టిరునికి ఆపాదించిన ఘోరనేరం, బంధువులను, పెద్దలను వధించడం. ఆలోచిస్తే, యుద్ధానికి ముందు అర్జునుడు కూడా ఈ సందిగ్ధంలోనే పడి విచారగ్రస్థుడై యుద్ధం చేయనని శ్రీకృష్ణుని ముందు మోకరిల్లాడు. భగవద్గీత జనించింది ఈ సందర్భంలోనే. సామాన్యుని అభిప్రాయాన్ని మతాతీతంగా, సాహసవంతంగా వెల్లడించి ఆ విధంగా సాంప్రదాయవాదుల చేతిలో బలైపోయాడు చార్వాకుడు. చార్వాకం ప్రత్యక్ష గ్రహణశక్తిని, అనుభవవాదాన్ని జ్ఞానము యొక్క సరైన మూలాలుగా పేర్కొంటుంది. తత్వపరమైన సంశయవాదాన్ని అక్కున చేర్చుకొని వేదాలను, వైదిక సాంప్రదాయాలను మరియు అతీంద్రియాలను ఇది ధిక్కరిస్తుంది.
చార్వాకము భారతీయ ఆధునిక తత్వాల క్రింద వర్గీకరించబడింది. ఇతర హైందవ నాస్తిక వాదాలకు ఇదే ఆద్యంగా పరిగణించబడినది. రామాయణంలోని అయోధ్యకాండలో 108 వ అధ్యాయంలో జాబలి రాముణ్ణి రాజ్యాధికారం చేపట్టమని నాస్తికవాదం చేస్తాడు. “ఓ జ్ఞానీ! నీవే నిర్ణయించుకో! ఈ సృష్టికి మించినది ఏదీ లేదు. కంటికి కనబడ్డదానికే ప్రాధ్యాన్యతనివ్వు. నీ జ్ఞానానికి మించినదాని గురించి ఆలోచించకు” ఇదీ జాబాలి చెప్పింది. చార్వాకము యొక్క మూలాలకు వివిధ సిద్ధాంతాలు కలవు. బృహస్పతి చార్వాకానికి ఆద్యుడని ఒక వాదన అయితే, బృహస్పతి సూత్రాలని రచించినది 6వ శతాబ్దానికి చెందిన చార్వాకుడు అని మరొక వాదన ఉన్నది. 12వ శతాబ్దం వరకూ చార్వాకము వెలుగొందగా ఆ తర్వాత అది నామరూపాలు లేకుండా పోయింది.
క్రీ. పూ. 6వ శతాబ్దంలో చార్వాకుడు బ్రహస్పతి సూత్రాలను పొందుపరచాడని ఒక వాదన కలదు. అయితే క్రీ. పూ 150 లో రచించబడిన గ్రంధాలలో కూడా చార్వాక ప్రస్తావనలు కలవు. బౌద్ధ సాహిత్యం ప్రకారం బౌద్ధ, జైన మతాలకు పూర్వమే క్రీ. పూ. 6వ శతాబ్దం నాటికి ఉన్న ఆరు వివిధ నాస్తిక వాదాలలో చార్వాకము, అజీవికము కూడా ఉన్నాయి. చార్వాకులు అధిభౌతిక భావాలైన–పునర్జన్మ, మరణానంతరం శరీరమును వీడే ఆత్మ, మతాచారాల సమర్థత, పరలోకముములు (స్వర్గం, నరకం వంటివి), విధి–లాంటి వాటిని తిరస్కరించారు. కొన్నింటిని చేయటం/ చేయకపోవటం వలన కలిగే సత్ఫలితాలు /దుష్ఫలితాలు వంటి వాటిని తిరస్కరించారు. సృష్టి ప్రక్రియ విశదీకరణకు మానవాతీత కారకాల వినియోగాన్ని కూడా తిరస్కరించారు. వారి ప్రకారం సృష్టి ప్రక్రియ యావత్తూ, ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు ప్రాకృతిక అంశాల అంతర్లీన స్వభావాన్ని బట్టి జరుగుతోంది. అగ్గిలోని వేడిమి, నీటిలోని చల్లదనం, ప్రొద్దుట వీచే పిల్లగాలిలో జవసత్వాలను అందించే చల్లదనం -ఈ వైవిధ్యం వాటికుండే సహజగుణాల నుండే వచ్చింది. చార్వాకులు వేదాలను, బౌద్ధ గ్రంథాలను తిరస్కరించారు. నాటినుండి నేటివరకూ భౌతికవాదం పాలకవర్గాల కక్షకు గురౌతూనే ఉంది. ఇది మన దేశంలోనే గాదు, ప్రపంచంలోని చాలా దేశాల్లో జరిగింది.
గ్రీకు భౌతికవాద తత్వవేత్త డెమాక్రిటస్‌ ప్రతిపాదించిన ‘అణువాదం’ ప్రభావాన్ని తట్టుకోలేక భావవాది అయిన ప్లేటో ఆ డెమాక్రిటస్‌ గ్రంథాల్ని తగులుబెట్టమని ఆదేశించాడు. తమ ప్రత్యర్థుల్ని తిట్టాలంటే ”వాడు నాస్తికుడు” అన్న పదాన్ని చాలామంది ఉపయోగించారు. ”అధికారంలో ఉన్న పార్టీచేత ‘వీరు కమ్యూనిస్టులు’ అనే తిట్టుతినని ప్రతిపక్ష పార్టీ ఎక్కడైనా ఉందా?” అని కమ్యూనిస్టు ప్రణాళికలో మార్క్స్‌, ఎంగెల్స్‌ ప్రస్తావించారు. ఇప్పటికీ అమెరికాలో ”కమ్యూనిస్టు” అంటే ఏవగింపుగానే చూసే పరిస్థితిని పాలకవర్గాలు కొనసాగిస్తున్నాయి. ప్రాచీన భారతంలో హైందవ ధర్మాన్ని, వేదాలను, వేదోక్త సంప్రదాయాలను ఖండించి, విమర్శించిన నాడే భౌతిక సిద్ధాంతాలను ప్రతిపాదించిన తత్వవేత్త చార్వాకుడు. ఆయన నాస్తికుడు. 1848లో కమ్యూనిస్ట్, మ్యానిఫెస్టో ప్రకటించిన కార్ల్‌ మార్క్స్‌ కు చార్వాకుడు సైద్ధాంతిక మూల పురుషుడని చెప్పవచ్చు. చార్వాకుని భౌతికవాద సిద్ధాంతాలను ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తన భగవద్గీత వ్యాఖ్యానంలో ప్రస్తావించారు. దేవుడికి మూలం ఏమిటి అనే ప్రశ్న వేయవద్దంటుంది మతం. దేవుడు స్వయంభువు కాబట్టి ఆ ప్రశ్న తప్పంటుంది. ఆ సమాధానం నచ్చక నాస్తికత్వం పుట్టుకొచ్చింది. తత్వశాస్త్రం రెండు శాఖలుగా చీలింది–భావవాదులుగా, భౌతికవాదులుగా. అప్పటి సమాజంలో ఆర్య సంప్రదాయాలన్నిటినీ నిరసించిన వారు భౌతికవాద శాఖలోకొస్తారు. ఈ కోవకు చెందినవారు చార్వాకుడు, మహావీరుడు, అజిత కేశకంబలి, మఖ్ఖలి గోశాలుడు, పూరణుడు, కాత్యాయనుడు, బుద్దుడు. వీళ్ళందరిలోకీ బుద్దుడే చరిత్రలో నిలిచి పోవడానికి గల కారణాలలో ఒకటి బుద్దుడు ఏ విషయం లోనూ ‘అతి ‘ కి పోకుండా మితం పాటించడం. చార్వాకుడిని గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి, ఈ చర్చను చార్వాకుడికే పరిమితం చేద్దాం!
సమసిపోయిన ఒక మహా తరంగం చార్వాక (దర్శనం)మతం. దీన్నే లోకాయత దర్శనం అని కూడా అంటారు. చార్వాకుడు చెప్పిన దర్శనం కావటం వల్ల దీన్ని చార్వాక దర్శనమన్నారు కొందరు. చారు+వాక్ = చార్వాక, అంటే చారు= సులభమైన లేక సరళమైన, మధురమైన; వాక్ = శబ్గం, మాటలు, అంటే మధురమైన మాటలు చెప్పే దర్శనమని కొంతమంది భావించారు. దేవతల గురువగు బృహస్పతి రాక్షసుల మీద ఉండే ద్వేషంకొద్దీ వారందరినీ ఇంద్రియలోలురుగా చేయడానికై ఈ దర్శనాన్ని రాశాడని కూడా ఒక కథ ఉంది. అందుకే దాన్ని బార్హస్పత్య దర్శనం అని కూడా అంటారు. ఇప్పుడా గ్రంథం లభించటం లేదు. కాని బౌధ్ధ గ్రంధాల్లో ఈ విషయం ఉటంకిస్తారు. వీరిని చార్వాకులని, పాషండులని, హౌతుకులని, నాస్తికులని, వితండవాదులని శుద్ద తార్కికులని , శుద్ద ప్రత్యక్షవాదులని, వేదబాహ్యులని పిలిచారు. యజ్ఙయాగాది క్రతువులు చేయడం నిరర్థకమనే వీరి వాదన ఉంది. బౌద్ద గ్రంధాలన్నీ దాదాపు లోకాయత మత సిద్దాంతాలను పేర్కొంటాయి.
చార్వాకుల వాదం ఇలా అంటుంది- ‘ఈ సమస్తమైన ప్రపంచంలో ఉన్నదంతా పంచభూతాత్మకం. అంటే భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశం. ఈ అయిదు భూతాలు పరస్పరం ఒకదానితో ఒకటి ఎప్పుడూ పెనవేసుకొని ఒకదాన్ని మరొకటి పరిగ్రహించి, ఒకటి మరొకదానితో సంసర్గాన్ని కలిగి ఉంటాయి. మానవుడు భుజించిన ఆహారం శరీరంలో జీర్ణమై అనేకమైన ధాతువులుగా మారిపోతుంది. రక్తంగానూ, వీర్యంగాను, శ్లేష్మంగానూ, లాలాజలం గాను లోపల ఉంటుంది. బయట చర్మం, గోళ్ళు వెంట్రుకలుగా మారుతుంది. స్త్రీపురుషుల సంభోగం వల్ల మానవుడు కాని, తదితర ప్రాణులుకాని జన్మిస్తాయి. శరీరం ఆవిర్భవించడంతోపాటే, శరీరంలో ఉండే చైతన్యం కూడ శరీరంతోపాటే వస్తుంది. శరీరం నశించిపోగానే చైతన్యం కూడ నశిస్తుంది(భావవాదులు దీనికి భిన్నంగా చెబుతారు. చైతన్యం ముందు, పదార్థం తరువాత అని, చైతన్యం శాశ్వతం అనీ) . చార్వాకులు దేహమే ఆత్మ అని చెబుతారు. ఆత్మ లేదని అంగీకరించిన వారికి భగవంతునితో నిమిత్తం లేదు. ప్రత్యక్షమే ప్రమాణంగా అంగీకరించిన చార్వాకుల వాదం దేవుడి అస్తిత్వాన్ని తిరస్కరిస్తుంది. ఏకాలంలో ఉన్న మానవుడికయినా తెలిసేది భూతకాలం, వర్తమాన కాలం మాత్రమే. జరుగబోయేది ఎవ్వరికీ తెలియదు. ఆత్మ లేనప్పుడు, శరీరం మరణానంతరం పిడికెడు బూడిదయై పోయినప్పుడు మోక్షం అనేది అర్థరహితమైన శబ్దం. పురోహితశ్రేణి వారి జీవనార్థం వారు కల్పించి నటువంటి తంతే మరణించిన వారికి ఏర్పాటుచేసే శ్రాద్ధాలు, తద్దినాల తంతు అంతా. మరణించిన వారి పేరిట చేసే అన్నదానం, పిండ పితృ యజ్ఙం ఇవన్నీ మానవ మూర్ఖత్వానికి, సంఘ నయవంచనకు నిదర్శనమన్నారు చార్వాకులు .
మన తండ్రో, తల్లో సోదరుడో గ్రామాంతరం వెళ్ళారనుకుందాం. వారి పోషణార్థంగా ఇక్కడ మనం విందుభోజనం చేస్తే అది వారికి అందుతుందా? వీరు వర్ణ వ్యవస్థను నిరసించారు. ఆత్మజ్ఞానం సంపాయించగలమనీ, అదే వాస్తవమైన జ్ఞానమనీ బోధించిన భావవాదుల ప్రతిపాదనను చార్వాక భౌతికవాదులు నిర్ద్వద్వంగా తిరస్కరించారు. ఇంద్రియ జ్ఞానమొక్కటే జ్ఞాన సముపార్జనకు మార్గమని వారు ఖచ్చితంగా చెప్పారు. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం- ఇవి పంచేంద్రియాలు. కంటితో చూసి, ముక్కుతో వాసనపట్టి, చెవితో విని, నాలుకతో రుచిచూసి, చర్మంతో తాకి, ప్రపంచాన్ని గురించి తెలుసుకుంటున్నాం. ఈ విధమైన ఇంద్రియ జ్ఞానమొక్కటే వాస్తవమైన జ్ఞానమని ప్రతిపాదించారు చార్వాకులు. మూఢ నమ్మకాలను, యజ్ఞ యాగాదులను, వర్ణ ధర్మాన్ని చార్వాకులు ప్రశ్నించారు. గౌతమ బుద్ధుడు, మహవీరుడు వీరి బోధనలతో ప్రభావితులైనారు. చార్వాకులంత తీవ్రంగా కాకపోయినా బౌద్ధులు కూడా వర్ణవ్యవస్థను, బ్రాహ్మణ కర్మకాండల్లోని మూఢత్వాన్ని ప్రశ్నించారు. మొదట వర్ణతత్వాన్ని ఎదిరించిన చార్వాకులు దాన్ని ఒక సాంఘిక ఉద్యమంగా నడపలేకపోయారు. వారి సిద్ధాంతాలను తెలుసుకోటానికి ప్రధానంగా తోడ్పడే గ్రంథం ” సర్వ దర్శన సంగ్రహం ”. చార్వాక సిద్ధాంత బీజాలు, ఉపనిషత్తులులో బృహస్పతి రాసినట్లుగా సూక్తాల్లోనే ఉన్నట్లు ” సర్వ దర్శన సంగ్రహ్ ” కర్త వర్ణించాడు. ” ‘నాస్తికో వేదనిందకః’ అన్నాడు మనువు. వేదాలను నిందించే వాళ్ళంతా నాస్తికులే అంటాడు. దానికి కారణం ఉంది. వేదాలు పూర్తిగా యజ్ఞయాగాలకు ప్రాముఖ్యం ఇచ్చాయి. ప్రకృతి శక్తులకు దైవత్వం ఆరోపించడం ద్వారా దేవుళ్ళు ఏర్పడ్డారు. అప్పుడే వర్ణవ్యవస్థ కూడా పుట్టింది. పదార్ధం వివిధ రూపాలుగా పరిణామం చెందుతూ వస్తోంది.
వాతావరణంలోని ఒక పదార్ధం ద్వారా సజీవ పదార్ధమైన జీవకణం “అమీబా” పుట్టింది. ఈ అమీబా నుండి అనేక పరిణామాల తర్వాత మనిషి జన్మించాడు. మనిషి మెదడులోంచి భావం ఉద్భవించింది– ఇది ఆధునిక భౌతికవాదం. కాని ఈ వాదాన్ని బుద్ధుడికి పూర్వమే చార్యాకులు ప్రచారం చేశారు. క్రీ. పూ. 600. . . అంటే బుద్ధుడి పుట్టుకకు యాభై సంవత్సరాలు పూర్వమే ఈ చార్వాక మతం తలెత్తింది. పరలోకం అనేది అసలు లేదు అన్నది వీళ్ళ వాదం. ఏ రకమైన దివ్యత్వాలు లేవనడం, ఇతర రూపాలపై అపనమ్మకం, దేవుడున్నాడని కాని, లేడనికానీ, అతీంద్రియ శక్తులను కానీ నమ్మక, కేవల నిర్ధారిత నిజాలనే నమ్మేవాడిని హేతువాది అంటారు. హేతువాదులు కూడా చార్వాక సిద్ధాంతాన్ని బలపరిచారు!”మరణం తర్వాత జీవితం లేదు. స్వర్గం అనేదొక కట్టుకథ. మరణం తర్వాత జీవితం, స్వర్గం , నరకం వంటివేమీ లేవు. ఇవన్నీ మృత్యువు అంటే భయపడేవారి కోసం అల్లిన కట్టుకథలు. మనిషి మెదడు కూడా కంప్యూటర్‌ వంటిదే. విడిభాగాలు పాడైన తర్వాత కంప్యూటర్‌ పనిచేయటం ఆగిపోయినట్టే మెదడు ఆగిపోతుంది. ఒక్కసారి మెదడు నిలిచిపోయిన తర్వాత ఏమీ ఉండదు. కన్నుమూసేలోపే మనకున్న శక్తిసామర్థ్యాలను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ మంచి జీవితం గడపాలి. మనం చేసే పనులు అత్యున్నతంగా ఉండటానికి కృషి చేయాలి. 49 ఏళ్లుగా మరణం నాకు అత్యంత సమీపంలోనే ఉంటోంది. అయినప్పటికీ నేను మృత్యువుకు భయపడటం లేదు. త్వరగా మరణించాలని నేను భావించటం లేదు. నేను కన్నుమూసేలోపు చేయాల్సిన పనులు ఎన్నెన్నో ఉన్నాయి” అని స్టీఫెన్ హాకింగ్ అభిప్రాయం. చార్వాక వాదనకు ఇతని సిద్ధాంతం దగ్గరగా ఉంది.


ఇంతకీ స్టీఫెన్ హాకింగ్ ఎవరని కదూ మీ సందేహం! అతనిని గురించి క్లుప్తంగా ఇక్కడ వివరిస్తాను. స్టీఫెన్ హాకింగ్ ఓ సుప్రసిద్ధ ఆంగ్లేయ సైద్డాంతిక భౌతిక శాస్త్రవేత్త. ఆయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ఆచార్యునిగా సేవలందిస్తున్నారు. 2009లో ఆ పోస్టు నుంచి వైదొలగారు. 1942 జనవరి 8వ తేదీన ఇంగ్లాండులోని ఆక్స్ ఫర్డ్ లో స్టీఫెన్ హాకింగ్ జన్మించాడు . ఆయన తండ్రి వృత్తి రీత్యా లండన్ లో వైద్య శాస్త్ర పరిశోధకుడు. భౌతిక శాస్త్రంలో స్పెషలైజేషన్ చేశాడు స్టీఫెన్. స్టీఫెన్ తన 17వ యేట, 1959 వ సంవత్సరం10వ నెలలొ ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలొ చేరాడు. 1985 లో కంప్యూటరు సాయంతో మాట్లాడగలిగే పరికరాన్ని స్టీఫెన్ తయారు చేసుకున్నాడు. దాని సాయంతోనే 1988లో పుస్తకాన్ని వెలువరించాడు. అది అమ్మకాల్లో సృష్టించిన రికార్డు అంతా ఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా 40 భాషల్లో ఆ పుస్తకం వెలువడింది. తెలుగులోనూ. . . ‘కాలం కథ’ పేరుతో వెలువడింది.
ప్రపంచ వ్యాప్తంగా ఏ బ్రీఫ్ హిస్టరీ ఆప్ టైమ్ అమ్మకాల్లో సృష్టించిన రికార్డు వల్ల అది 1998 అంటే వెలువడిన 10 సంవత్సరాల తరువాత గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది. కనీసం కదలడానికి సహకరించని శరీరం, చక్రాల కుర్చీకి అతుక్కుపోయిన మనిషి, మాట్లాడటానికీ కంప్యూటర్ సహాయం. . . ఇవి ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ను గుర్తించడానికి ఆనవాళ్లు. అన్నం తినాలన్నా. . . కనీసం బూట్ల లేసు కట్టుకుందామన్నా. . . స్టీఫెన్ శరీరం సహకరించేది కాదు. భోజనం చేయడానికి ఆయన పడుతున్న ఇబ్బంది. . . తల్లిని మధనపెట్టింది. ఆ సమయంలోనే ఆసుపత్రిలో చేసిన పరీక్షల్లో ఆయనకు మోటార్ న్యూరాన్ వ్యాధి (Motor Neuron Disease) అనే భయంకర వ్యాధి ఉన్నట్టు తెలిసింది. దీనినే Amyotrophic Lateral Sclerosis (ALS) వ్యాధి అని కూడా అంటారు. నాడీ మండలం పై అంటే నరాలు, వెన్నుపూసపై ఇది ప్రభావం చూపుతుంది. డాక్టరేట్ సంపాదించేలోపే స్టీఫెన్ మరణిస్తాడని అనుకున్నారంతా! కానీ ఆయన పట్టుదల, ఆత్మస్థైర్యం ముందు మృత్యువు ఓడిపోయింది. మోటార్ న్యూరాన్ వ్యాధి శరీరాన్ని కబళిస్తున్నా. . . చేస్తున్న పనికి శరేరం సహకరించక పోయినా. . . కృష్ణ బిలాలపై ఆయన పరిశోధనలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాన్ని చూపాయి. శాస్త్రవేత్తగానే కాక ఆయనపై ఆయనకున్న నమ్మకం, కలసిరాని విధిని తనకు అనుకూలంగా మార్చుకునే తత్వం నేటి యువతకు ఆదర్శం.
ప్రస్తుతం మనం హాకింగ్స్ రేడియేషన్ గా పిలుస్తున్న కృష్ణ బిలాల రేడియేషన్ ను ప్రతిపాదించింది స్టీఫెన్ హాకింగే! విశ్వవిద్యాలయంలో తనకు పరిచయమున్నమహిళను స్టీఫెన్ వివాహం చేసుకున్నాడు. ఆక్స్ ఫర్డ్ లో ఉన్నప్పుడు దగ్గరలోనే ఇల్లు తీసుకుని ఉండేవాడు. స్టీఫెన్ కు వ్యాధి బాగా ముదిరిన తరువాత విడాకులు తీసుకున్నాడు. అప్పటికే వారి వివాహ బంధానికి గుర్తుగా ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల కలిగారు. విడాకుల అనంతరం హాస్పటల్లో తనకు సేవలు చేస్తున్న ఓ నర్స్ తో స్టీఫెన్ సహజీవనం ప్రారంభించాడు. ఏది ఏమైనా చార్వాకులను ప్రథమ తాత్విక విప్లవకారులుగా భారతీయులు పరిగణిస్తారు!
(విన్నపం-నేను చార్వాకాన్ని ఆమోదించలేను, వ్యతిరేకించలేను! ఎందుకంటే , ‘సత్యం’ అంటే ఏమిటో నాకు తెలియదు కనుక ! సత్యం కోసమే నా అన్వేషణ! నేను అన్నీ చదువుతాను, కానీ ఏ సిద్ధాంతానికి, ఎవరి భావాలకు బానిసను మాత్రం కాను! “తెలియనిదానిని తెలుసుకోవటానికే ఈ నిరంతర ప్రయాణం, అన్వేషణ!” దయచేసి పాఠకులు, మిత్రులు ఈ విషయాన్ని గ్రహించవలసిందిగా మనవి చేసుకుంటున్నాను! )

బుద్ధుడు-బౌద్ధ మతం

రచన:  శారదా  ప్రసాద్

​బౌద్ధ మతం ప్రపంచంలోని ముఖ్యమైన మతాలలో ఒకటి. మొత్తం ప్రపంచంలో బౌద్ధ ధర్మాన్ని ఆచరించేవారు 23 కోట్లనుండి 50 కోట్ల వరకు ఉండవచ్చునని అంచనా.బౌద్ధంలో రెండు ప్రధాన విభాగాలున్నాయి – మహాయానము, థేరవాదము. తూర్పు ఆసియా, టిబెట్ ప్రాంతాలలో మహాయానం (వజ్రయానంతో కలిపి) అధికంగా ప్రాచుర్యంలో ఉంది.”బుద్ధుడు అట్టడుగువర్గాల విముక్తి ప్రధాత. రాజకీయ మార్గదర్శి’’ గౌతమ బుద్ధుని పైనా, ఆయన సామాజిక కార్యాచరణ పైనా విస్తృత పరిశోధన చేసిన సి.ఎఫ్. కొప్పన్ అన్నమాటలివి. దేశదేశాల సామాజిక పరిశోధకులు, శాస్త్రవేత్తలు వందలాదిగా పరిశోధనా గ్రంథాలను వెలువరించారు. మన దేశంలో దామోదర్ ధర్మానంద్ కోశాంబి, దేవీప్రసాద్ చటోపాధ్యాయ, రాహుల్ సాంకృత్యాయన్, బి.ఆర్. అంబేడ్కర్, రొమిల్లా థాపర్ లాంటి వాళ్లు వారిలో ముఖ్యులు.

క్రీ.పూ. 566లో సిద్ధార్థుడుగా జన్మించిన గౌతమ బుద్ధుడు క్రీ.పూ. 485 వరకు జీవించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. బుద్ధుడు అత్యంత నిర్మొహమాటంగా యజ్ఞ, యాగాలను నిరసించాడు. అవి ఆగిపోవడానికి ఆయన చాలా శ్రమించాడు. ఎవరి నుంచీ ఏ వస్తువునూ బలవంతంగా తీసుకోరాదాని చెప్పాడు.ఇది కూడా చాలా ముఖ్యమైనది. వైదిక వర్గం స్వర్గం, నరకం, పునర్జన్మ, పాపకర్మల పేరిట కానుకలను తీసుకోవడాన్నిఇది నిరోధించింది. బుద్ధుడు ప్రత్యామ్నాయ ఆచరణను రూపొందించారు. బౌద్ధాన్ని ఆచరించే భిక్షువులు ప్రజలు ఏది ఇస్తే అదే తినాలని, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఖరీదైన వస్తువులు, ఆభరణాలు, వస్త్రాలు తీసుకోరాదని నిబంధన విధించారు.వైదిక వర్గం పట్ల అయిష్టం కలిగిన ప్రజలకు సహజంగానే బౌద్ధం పట్ల గౌరవాదరాలు పెరిగాయి.లైంగిక అసభ్య కార్యకలాపాలకు పాల్పడకూడదని బుద్ధుడు ప్రబోధించారు.నాటి వైదిక వర్గం దేవుడి పేరుతో, మహిమల పేరుతో ప్రజల అజ్ఞానాన్ని సొమ్ముచేసుకొని తమ ఉనికిని సుస్థిరం చేసుకోవాలని చూసింది.బుద్ధుడు దీనిని తీవ్రంగా వ్యతిరేకించాడు.

ప్రజలు శక్తివంతులని, వాళ్ల భవిష్యత్తుని వాళ్లే నిర్మించుకుంటారని, అందుకు దేవుడి లాంటి అతీత శక్తులు కారకులు కాదని చాలా ఖరాఖండిగా చెప్పాడు.మద్యం లాంటి మత్తుపదార్థాలకు దూరంగా ఉండమని కూడా చెప్పాడు. కుల అసమానతలను కూడా బుద్ధుడు వ్యతిరేకించాడు.గౌతమ బుద్ధుడు బోధించిన ధర్మ సూత్రాలు బౌద్ధానికి మూలాధారం. త్రిపిటకములు అనే శాస్త్ర గ్రంథం బౌద్ధానికి ప్రధాన ఆధారమని అధికులు విశ్వసిస్తారు. ఇందుకు అదనంగా మహాయాన బౌద్ధులు “మహాయాన సూత్రాలు” అనే రచనను విశ్వసిస్తారు.

బుద్ధుడు సమాజాన్ని ఒక అవగాహనతో జీవించే సహజీవనాన్ని అందుకు సంబంధించిన సూత్రాలను, ఆచరణలను ప్రవచించాడు. ద్వేషం ద్వేషంతో చల్లారదు. అది ప్రేమతోనే సాధ్యం అన్నాడు. వ్యక్తి తన జీవితంలో నిరాడంబరంగా ఉండాలని, సంపద కూడబెట్టడం ద్వారా స్వార్థం పెరుగుతున్నదని, రేపటి గురించి కాకుండా నేటి గురించి ఆలోచించాలని చెబుతూ వచ్చాడు.బౌద్ధం భారతదేశంలో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. అనేక దేశాల్లో మొదటి మతంగా చాలా దేశాల్లో రెండు, మూడు స్థానాల్లో ఉంది.తత్వశాస్త్రానికి మౌలికసూత్రం మనిషికి మరో మనిషికి, మనిషికి – సంఘానికి, మనిషికి – ప్రకృతికి ఉండే అంతస్సంబధాలను పెంచుకోవడమే. ఈ అంశాలన్నిటి పట్ల బౌద్ధం చాలా తీవ్రంగా పనిచేసింది. ప్రతి చిన్న విషయాన్ని పరిశీలించే దృక్పథాన్ని రూపొందించింది.

హిందూమతం హింసతో జంతుబలులు చేస్తూ యజ్ఞయాగాదులు జరుపుతూ ఉన్న రోజులలో బౌద్ధం పుట్టింది. అహింసావాదం ప్రచారం చేసింది. సంఘంలో ఉన్న హెచ్చుతగ్గులు పోవాలన్నది, స్త్రీపురుషులు సమానం అనీ, మానవులంతా ఒకటేనని అన్నది బౌద్ధం బోధించింది. ప్రజలు బౌద్ధాన్ని ఆరాధించారు. ఆదరించారు. అనుసరించారు.తెలివిగా బుద్ధుడు కూడా దశావతారాల్లో ఒక్కడన్నారు.దేవుడు అనే భావనను దూరం పెట్టిన బుద్దుడినే దేవుడిగా మార్చారు . కాని బుద్ధుడి భావాలు అమలుపరచలేదు. సమానత్వం అనే మూలభావాన్ని ఆచరించలేదు. కాని బౌద్ధాన్ని పారద్రోలగలిగారు.క్రీ.పూ. 6 వ శతాబ్దంలో గౌతమ బుద్ధుడు, అంతకు కొంచం ముందుగా జైన మహావీరుడు, ఈ వర్ణ వ్యవస్థను వ్యతిరేకించి, అట్టడుగు వర్గాలకు ఈ వేదమత దోపిడీనుండి విముక్తిని చూపించారు. దానితో, వేద మతం దాదాపుగా కనుమరుగైపోయి, బౌద్ధ, జైనాలు పూర్తిగా భారత దేశం అంతటా విస్తరించాయి. బుద్ధుడు భౌతిక వాది. సృష్టికర్త అనేవాడు లేడనీ, దైవ ఆరాధన నిరుపయోగమనీ, కోరికలే అన్ని కష్టాలకూ కారణమనీ ఆయన బోధించాడు. అయితే బుద్ధుడు చనిపోయిన తరువాత దాదాపు 400 ఏళ్ళలో, మహాయాన బౌద్ధం ప్రాముఖ్యత సంతరించుకున్న తరువాత బుద్ధుని భగవత్‌ స్వరూపునిగా పూజించటం ప్రారంభం అయ్యింది.

బుద్ధుని జన్మస్థలం లుంబినీ వనం. క్రీ.పూ. 563వ సంవత్సరం, వైశాఖ పూర్ణిమ రోజున అతడు జన్మించాడు. తల్లిదండ్రులు అతనికి సిద్ధార్థుడు అని నామకరణం చేశారు. బుద్ధుడు జన్మించిన వెంటనే తల్లి మరణించడంతో సవతి తల్లి గౌతమి ప్రజాపతి అతడిని పెంచింది.దీనికి కృతజ్ఞతగానే సిద్ధార్థుడు గౌతముడిగా పిలుపించుకున్నాడు.చిన్న వయసులోనే యశోధరను వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుడే రాహులుడు. సిద్ధార్థుని సవతి తల్లి కుమారుడు దేవదత్తుడు. సిద్ధార్థుని జీవితంలో సంభవించిన నాలుగు సంఘటనలు అతడికి ప్రాపంచిక సుఖాల పట్ల విరక్తిని కలిగించాయి.ఒకసారి వృద్ధుడ్ని, రోగిని, శవాన్ని, యతిని చూచి భౌతిక జీవనం పట్ల విరక్తి కలిగింది . శాశ్వతమైన ఆధ్యాత్మికతకు సంబంధించిన పరమార్థాన్ని ఆకళింపు చేసుకోవడానికి ఇల్లు విడిచి పెట్టాడు.ఈ నేపధ్యంలోనే ప్రస్తుతం బుద్ధగయలో ఉన్న బోధి వృక్షం కింద తపస్సుచేసి జ్ఞానోదయాన్ని పొందాడు.ఈ క్రమంలో అతడు గౌతమ సిద్ధార్థుడు కాస్తా గౌతమ బుద్ధుడయ్యాడు. దీనినే ‘మహాసంబోధి’అని పిలవడం జరుగుతోంది. ఆ కారణంగా ప్రస్తుతమున్న రావివృక్షం (బోధి వృక్షం) బౌద్ధులందరికీ ఆరాధ్య వృక్షరాజమైంది.

బుద్ధుడు నాలుగు ఆర్యసత్యాలను ప్రవచించాడు.దుఃఖము, దుఃఖ సముదయము, దుఃఖనిరోధము, దుఃఖ నివారణోపాయం అనే నాలుగు ఆర్య సత్యాలను అష్టాంగ మార్గాల ద్వారా సాధించాలి. సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వచనము, సమ్యక్ కర్మ, సమ్యక్ జీవనం, సమ్యక్ వ్యాయామం, సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధి అనే ఈ ఎనిమిది అంశాలతో బౌద్ధ ధర్మం, మతం ఏర్పడింది. బుద్ధుని ఆశ్రయించిన వారు బౌద్ధులయ్యారు. బుద్ధుని ధర్మాచరణ – సమత అన్నివర్గాల వారిని ఆకర్షించింది. బుద్ధుడు కులవ్యవస్థను నిరాకరించాడు. ధర్మాన్ని, జ్ఞానాన్ని పొందడానికి అందరూ అర్హులేనని ప్రకటించాడు.అన్ని ప్రాంతాలకు పాదచారియై ప్రయాణిస్తూ చెట్లకింద నివాసం ఉంటూ, రోజూ భిక్షాటన చేసి, ఒక పూట మాత్రమే భోజనం చేసి, జీవితాన్ని, ధర్మాన్ని నియమబద్ధంగా నడిపాడు.

నిమ్నవర్గాలకు చెందిన ఉపాలి, సోపాకుడు, సుప్పియుడు, సుమంగలుడు, శకటాలుడు, డంకుడు, పృథక్కుడు తదితరులను తన శిష్యులుగా చేసుకున్నాడు. బుద్ధుడు అహింసను,శాంతిని బోధించాడు.ఒకరోజు ఒక వ్యక్తి  బుద్ధుడి వద్దకు వచ్చి ‘నాకు సంతోషం కావాలి’ అని కోరాడు. అప్పుడు బుద్ధుడు ,”నీ వాక్యంలోని ‘నాకు’ అనే మాటను తొలగించు, అది అహంకారానికి సంకేతం.అలాగే ‘కావాలి’ అనే మాటను తొలగించు. అది కోరికలకు చిహ్నం .అవి తొలగించిన తర్వాత నీకు (అందరికీ) మిగిలేది సంతోషం “అని చెప్పాడు .ఒక జీవిని చంపడమే కాదు, దాన్ని బంధించినా, పక్షుల్ని బోనులో పెట్టి  పెంచుకున్నా అది కూడా హింసే అన్నాడు బుద్ధుడు .చేతలతోనే కాదు, మాటల ద్వారా దూషించినా, బాధపెట్టినా దాన్ని కూడా ‘జీవహింస’ గానే  చెప్పాడు.బౌద్ధానికి ముందు మన సంప్రదాయంలో పౌర్ణమికి ప్రాధాన్యత లేదు. బుద్ధుని తర్వాత చాంద్రమానం ప్రాముఖ్యత హెచ్చింది. పౌర్ణమికి ప్రాధాన్యత పెరిగింది.

బౌద్ధానికీ, పౌర్ణమికీ అవినాభావ సంబంధం ఉంది. బుద్ధుడు జన్మించిందీ , ఇల్లు విడిచిందీ, జ్ఞానోదయం పొందిందీ, పరినిర్వాణం పొందిందీ వైశాఖ పూర్ణిమ రోజే. బుద్ధుడు తొలిగా పరివ్రాజకుడైనదీ, ధర్మప్రచారం ప్రారంభించిందీ, తొలి బౌద్ధసంఘం ప్రారంభించినదీ ఆషాఢ పూర్ణిమ నాడు. బుద్ధుడు తన తల్లికి భిక్షుణిగా దీక్ష ఇచ్చినది ఆశ్వయుజ పౌర్ణమి నాడు.ఫాల్గుణ పౌర్ణమి బుద్ధుడు తన ఏడేళ్ల కుమారుడు రాహులునికి భిక్షు దీక్ష ఇచ్చిన రోజు.ఇంకా బుద్ధుడు ఇలా చెప్పాడు–“ఒక గొప్ప వ్యక్తికంటే సంఘమే గొప్పది,ఉన్నతమైనది.వ్యక్తి సేవ కంటే సంఘ సేవ ఉన్నతమైనది.బుద్ధుడు నిరాడంబరమైన జీవితాన్ని గడిపాడు. మానవజీవితాన్ని అర్థం చేసుకోమనే అందరూ చెప్తారు. చెప్పే విధానాలు మాత్రమే వేరు. ‘దయగా ఉంటే మంచిది’ అని మిగతా సంప్రదాయాలు చెబితే, ‘దయతో ఎలా ఉండాలో’ బౌద్ధం చెబుతుంది. ఎవరి పట్ల ఎంత కృతజ్ఞతగా ఉండాలో నేర్పుతుంది.బుద్ధుడి కాలం నుంచే స్త్రీలకు ప్రాధాన్యత ఉంది. బుద్ధుడి బంధువైన మహాప్రజాపతి బౌద్ధమతాన్ని అవలంబించింది. అలాగే అశోకుడి కుమార్తె!లోకానికి మార్గదర్శకులుగా ఉండే మహనీయులందరూ నిరాడంబర జీవితాన్నే గడిపారు. స్వంత పనులకోసం మరొకరిపై ఆధారపడటం కూడా బుద్ధుడికి ఇష్టం ఉండేది కాదు. ఓపిక ఉన్నంత వరకు ఎవరి పని వారు చేసుకోవాలని చెప్పేవాడు. ఎనభైఏళ్ల వయసులో కూడా ఆయన పనులను ఆయనే చేసుకునేవాడు. ఆయన భోజనం చేసిన తర్వాత భిక్షాపాత్రను కడగటానికి ఆయన ప్రియశిష్యుడు ఆనందుడు ఎంత అడిగినా ఇచ్చేవాడు కాదు. నేను అన్నం తింటున్నాను గదా నా పాత్రను నేనే కడుక్కోవడం న్యాయం అనేవాడు. బుద్ధుడు స్వయంగా తాను ఆచరిస్తూ, నిరాడంబరత ప్రాముఖ్యాన్ని లోకానికి చాటి చెప్పాడు.

ఇతరుల గురించి ఈర్ష్య పడకుండా, తమను తాము మంచివారిగా మలచుకోవాలని, మనకు ఉన్న అతి పెద్ద సంపద అయిన మేధస్సును సక్రమంగా వాడుకోవాలని బౌద్ధం బోధిస్తుంది.అలాగే మానవ అభివృద్ధికి అవసరమైన ఆధ్యాత్మికతను వయసుతో సంబంధం లేకుండా అందరూ అలవరచుకోవాలని  చెబుతుంది.” ఒకసారి శుద్దోధనుడు బుద్ధుడిని కపిలవస్తుకు వచ్చి తన బోధలు వినివించవలసిందిగా కబురుపెట్టాడు.అలాగే బుద్ధుడు తన పరివారంతో కపిలవస్తుకు చేరాడు. తండ్రిని సమీపించి రాహులుడు తనను ఆయన కుమారుడిగా పరిచయం చేసుకొని,ఆయన వారసత్వ సంపదను తనకు అందచేయమని వేడుకున్నాడు.అందుకు బుద్ధుడు చిరునవ్వుతో అంగీకరించి, పక్కనే  ఉన్న ధర్మసేనాపతి సారిపుత్రుణ్ణి పిలిచి,రాహులునికి భిక్షు దీక్ష ఇవ్వమని చెప్పాడు. “ఇదొక ధర్మ సామ్రాజ్యం,ఇదే నా ఆస్తి”అంటూ రాహులుడికి ఒక భిక్షాపాత్రను అందించాడు బుద్ధుడు. అప్పుడు రాహులుడి వయసు ఏడు సంవత్సరాలు.రాహులుడు బౌద్ధమతంలో తొలి బాల బిక్షువుగా మారాడు.బౌద్ధమతంలో బాలభిక్షువుల్ని శ్రామణేరులు అంటారు.ఆ విషయం తెలిసిన  శుద్ధోధనుడు చాలా దు:ఖించాడు.ఆ దు:ఖంతోనే,”ఇక నాకు ఈ రాజ్యం ఎందుకు, నన్నుకూడా నీ సంఘంలో చేర్చుకో!” అని బుద్ధుడిని కోరి అతను కూడా బిక్షువుగా మారాడు . బుద్ధుని సవతి తల్లి గౌతమి, తండ్రి శుద్ధోధనుడు, భార్య యశోధర కూడా భిక్షు సంఘంలో చేరారు.

బౌద్ధ ధర్మంలో రాహులుడు ఎంతో నిష్ణాతుడయ్యాడు. బుద్ధుడు అతనికిచ్చిన ప్రబోధాలు బౌద్ధ సారస్వతంలో  ‘రాహులో వాద సుత్త’గా ప్రసిద్ధి చెందాయి . ఆయన ఎక్కువకాలం ఆమ్రరత్న వనంలో జీవించాడు. రాహులుడు ఎప్పుడు మరణించాడో తెలియదు. కానీ, చాలా చిన్నవయసులో యువకునిగా ఉన్నప్పుడే మరణించాడు. పూర్వజన్మలు,మరు జన్మలు లేవన్న బుద్ధుడిని గురించి బౌద్ధ గ్రంధాలలో విచిత్రంగా ‘బుద్ధుని జాతక కధలు’ఎలా వచ్చాయో అంతుబట్టదు.’బుద్ధుని జాతక కధలు’ ప్రకారంగా సిద్ధార్ధ గౌతముడు బుద్ధుడు కాకముందు ఐదువందల నలభై ఏడు జన్మలు ఎత్తినట్లు బౌద్ధగ్రంథాలు చెప్పాయి .అయితే ఈ కధలు– మనలో ఉండాల్సిన ప్రేమ, కరుణ, సహనం, మైత్రీభావాల గురించి స్పష్టంగా తెలియచేస్తాయి.

బుద్ధుడు ధర్మప్రచారంలో 80 ఏళ్ళవరకూ జీవించాడు. చివరికి కుశీనగరంలో బుద్ధుడు మహాపరినిర్వాణం చెందాడు. బుద్ధుని బోధనలు దేశ విదేశాల ప్రజలెందరినో ఆలోచింపచేసేలా చేశాయి. ఫలితంగా చాలామంది బౌద్ధం స్వీకరించే విధంగా ప్రేరేపించాయి.భారతదేశానికి బౌద్ధం ఇప్పుడు మరింత అవసరం. అదే విషయాన్ని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పదే పదే వివరించారు.పదిమందికి పంచేకొద్దీ తనలో ప్రావీణ్యతను పెంచేది విధ్య.పదిమందిలో మెలిగేకొద్దీ తనలో సంస్కారాన్ని పెంచేది శుద్ది.పదిమందితో తిరిగేకొద్దీ తనలో సమయస్ఫూర్తిని పెంచేది బుద్ది.ఇదంతా కూడా సజ్జనుల సాంగత్యం వలనే సాధ్యపడుతుంది.మీరే ఆలోచించండి!

 

బుద్ధుడి గురించి ప్రముఖులు—

బుద్ధుడు యోగుల్లో చక్రవర్తిలాంటివాడు– ఆది శంకరాచార్య

దాస్య విమోచన గురించి, దు:ఖ నిరోధం గురించి, సమ సమాజాన్ని గురించి బోధించి, మూఢ నమ్మకాలకు తావులేకుండా, మనిషిని మానవతా విలువలవైపు నడిపించే బౌద్ధం అన్ని మతాలకంటే ఉన్నతమైనది.– కారల్‌ మార్క్స్‌

ఈ భూమి మీద ఆచరణలో ఉన్న మతాలన్నింటిలోనూ, శాస్త్రీయ జ్ఞానానికి అనుగుణంగా తన బోదనలు చేసింది బౌద్ధమతమే. ఆధునిక, శాస్త్రీయ అవసరాలకు సరిపోయే మతం ఏదైనా ఉన్నదా అంటే అది బౌద్ధమతమే. ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌

ఈ ప్రపంచంలో ఇప్పటివరకు పుట్టిన అందరిలో అత్యంత గొప్పవాడు బుద్ధుడు.– రవీంద్రనాథ్‌ ఠాగోర్‌

శీలం, ప్రజ్ఞల్లో బుద్ధుడు క్రీస్తును కూడా మించిపోయాడు. బెట్రాండ్‌ రస్సెల్‌

ఏసుక్రీస్తు బోధనలలో నూటికి తొంభైశాతం బౌద్ధం నుంచి స్వీకరించినవే…ఆధునిక ప్రపంచానికి సరిపోయే మతం బౌద్ధమే.…ప్రపంచాన్ని రక్షించగల శక్తి ఒక్క బౌద్ధానికి మాత్రమే ఉంది…. సంస్కర్తలందరిలోనూ అత్యుత్తముడు గౌతమబుద్ధుడు…బుద్ధుడు నా గురువు. – అంబేద్కర్‌

ప్రాణం ఉన్నదేదీ ఏకాంతంగా జీవించదు… తన కోసమే జీవించదు!సంఘం కోసం జీవించేదాన్నే ‘ప్రాణి’అనొచ్చు!

 

బుద్ధం శరణం గచ్ఛామి

ధర్మం శరణం గచ్ఛామి

సంఘం శరణం గచ్ఛామి

పార్శీయులు

రచన: టీవీయస్.శాస్త్రి


(పార్శీల మత చిహ్నం)

2004 గణాకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జొరాస్త్రియన్ల సంఖ్య 1, 45, 000 నుండి 2, 10, 000 వరకూ ఉన్నది. 2001 భారత్ జనగణన ప్రకారం 69, 601 పార్శీలు భారత్ లో గలరు. క్రీస్తు శకం తరువాత జొరాస్త్రియన్లు కొన్ని వందల సంఖ్యలో భారతదేశంలో ఉన్న గుజరాత్ రాష్ట్రంలోకి అడుగుపెట్టారు. వీరినే పార్శీయులు అని అంటారు. కుస్తీ యజ్ఞోపవీతము(ఒడుగు / జంధ్యం) ధరించే ఆచారము వీరిలో కూడా ఉన్నది. భారత దేశంలో జోరాస్త్ర మతమునకు పార్శీ మతమని కూడా పేరు. హైదరాబాద్ నగరంలో పార్శీల సంఖ్య రెండు వేల లోపే! అయితేనేం! వ్యాపార రంగంలో మాత్రం వారి ప్రభావం అధికంగానే ఉంటుంది. ఇంతకీ పార్శీలు నగరానికి ఎప్పుడు వచ్చారన్న దానికి చారిత్రక ఆధారాలు లేనప్పటికీ, అప్పటి నిజాం సాలార్‌జంగ్‌ కోరిక మేరకు ఇక్కడ స్థిరపడ్డారన్నది ఒక కథనం. ఇక, నగరంలో ఉంటున్న వారిలో దాదాపు 90 శాతం సికింద్రాబాద్‌లోనే నివసిస్తున్నారు.

ఇటీవలి కాలంలో వీరి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. కారణం, తమ కమ్యూనిటీలోని వాళ్లను పెళ్లిచేసుకోవడానికి యువత అసక్తి చూపించడం లేదట! వీరు పూజించే దైవం అగ్ని. 111 ఏళ్ల నాటి అగ్ని దేవాలయం అత్యంత పవిత్రాలయం. అతి ముఖ్యమైన పండుగ నౌరోజ్‌. నూతన సంవత్సరాదిని వేడుకగా జరుపుకొంటారు. అవి కాకుండా జొరాస్ట్రి‌యన్‌ పుట్టినరోజునూ కర్టోడ్‌ సాల్‌గా జరుపుకొంటారు. ఏడాదిలో చివరి ఐదు రోజులను పటేలీగా చేసుకోవడం ఆనవాయితీ. నిజాం కాలంలో పరిపాలన వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించినా, ప్రస్తుతం రాజకీయాలకు వారు దూరం. నిజాం కాలంలో ఇరానీ దేశం నుంచి పార్శీలు వ్యాపార నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చారు . పార్శీలు ఆ రోజుల్లోనే ఉన్నత చదువులు చదువుకొని సంపన్నులు కావడంతో హైదరాబాద్‌ లో వ్యాపారం చేసుకునేందుకు నిజాం రాజులు వారిని ఆహ్వానించారని మతపెద్దలు చెబుతుంటారు. వీరు ప్రత్యేకమైన ఆచార, వ్యవహార పద్ధతులను పాటిస్తుంటారు. వీరు పూర్తి శాకాహారులు. భూమిలో పండే వాటిని కూడా తినరు. ఉదా-ఉల్లిగడ్డలు, వేరు శనగలు. . . ఇక వారి ఆచారాల్లో అతి ముఖ్యమైనది దోక్మా (టవర్‌ ఆఫ్‌ సైలెన్స్‌)! చనిపోయాక కూడా నలుగురికి ఉపయోగపడాలని భావించే పార్శీలు, గద్దలు, రాబందులకు ఆహారంగా వారి మృతదేహాలను దోక్మాపై వదిలేస్తారు. దోక్మాలు పార్శీగుట్ట, బోయగూడల్లో ఉన్నాయి. ఇటీవలి కాలంలో కరెంట్‌ ద్వారా దహనసంస్కారాలు నిర్వహిస్తున్నారు. ఒక వ్యక్తి చనిపోయాడంటే ఆ మృతదేహాన్ని కాల్చడమో పాతిపెడ్డడమో చేస్తుంటారు. కానీ పార్శీలు మాత్రం అందుకు విభిన్నంగా అంత్యక్రియలు చేసేవారు. చనిపోయిన వారి మృతదేహాలను పాతిపెట్టకుండా, కాల్చకుండా గద్దలు, ఇతర పక్షులు తినేలా ఏర్పాట్లు చేసేవారు. అలా చేస్తే చనిపోయిన వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని వారి నమ్మకం. చనిపోయాక కూడా పరోక్షంగా మృతదేహం ఉపయోగపడాలనే ఆనవాయితీ ఉండేదని ప్రతీతి.

నిజాంలకు పార్శీలు అత్యంత సన్ని హితులుగా ఉండడంతో వారి మృతదేహాలను పక్షులకు పడేసేందుకు ఒక బావిలాంటి గదిని సికింద్రాబాద్‌ నుంచి పద్మారావునగర్‌ వైపు వెళ్లే మార్గంలో ఎత్తైన ప్రదేశంలో నిర్మించారు. అక్కడ కేవలం పార్శీలకు మాత్రమే అంత్యక్రియలు చేస్తుండడంతో దానికి పార్శీగుట్ట అనే పేరు వచ్చింది. పార్శీగుట్ట 4 ఎకరాల స్థలంలో నిర్మితమై ఉంది. అందులో ఉద్యానవనాన్ని కూడా ఏర్పాటు చేశారు. కాలగమనంలో వస్తున్న మార్పులు, ఆ గుట్ట చుట్టుపక్కల కాలనీలు ఇళ్లు నిర్మించుకొని ఉండడంతో పార్శీలు కూడా వారి అంత్యక్రియ పద్ధతులను మార్చుకోవల్సివచ్చింది. మృతదేహాలను బావి దగ్గరకు తీసుకెళ్లి పడేస్తే గద్దలు వచ్చి స్థానికులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. దీంతో వారు మృతదేహాలను ఖననం చేసేందుకు సోలార్‌ సిస్టమ్‌ను వాడుతున్నారు. మృతదేహాలను నేరుగా బావిలా ఉండే గదిలో పడేయకుండా ఊచలతో తయారు చేసిన కమ్మీలపై ఉంచుతారు. ఆ తరువాత కమ్మీల ద్వారా విద్యుత్‌ ప్రవాహాన్ని జరపడంతో మృతదేహం కాలి బూడిదవుతుంది. ఈ ప్రాంతాన్ని చూడడానికి ఎవర్నీ అనుమతించరు. ఒక వేళ చూడాలనుకుంటే అక్కడ ఉన్నటువంటి మత పెద్ద ద్వారా అనుమతి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. నిజాం కాలంలో వలస వచ్చిన పార్శీల ఆచార వ్యవహారాలకు పార్శీగుట్ట అద్దంపడుతోంది. గుజరాత్ లో పార్శీల కోవెల ఉన్నది. వారి అర్చనా స్థలము ఈ “అగ్ని ఆలయము”. పార్శీల మతము జొరాష్ట్రియన్. జొరాష్ట్రియనులు ముష్కరుల దండయాత్రల వలన పర్షియా దేశాన్ని వదలి హిందూదేశానికి వలస వచ్చారు. వారి సాగర యానములో తుఫాను వచ్చింది. అప్పుడు “అగ్నిదేవ” ను నెలకొల్పి, కొలువవలెనని తలచారు. పార్శీల పూజలు అందుకునే నిప్పు దైవము ” ఆతాష్ బహ్రా మ్” హైదరాబాద్‌లోని ఒక ధార్మిక సంస్థ, ఒక్కర్ని కంటే రూ. ఐదు వేలు. . ఇద్దర్ని కంటే రూ. 10 వేలు. . ముగ్గుర్ని కంటే రూ. 20 వేలు. . ఈ బహుమతులను అందజేస్తోంది.

ఇరాన్‌లో పుట్టి శాఖోపశాఖలుగా విస్తరించిన పార్శీలు ఒకప్పుడు బలమైన ప్రభావిత సమూహం. ఇప్పుడు అత్యంత క్షీణదశను అనుభవిస్తోన్న పార్శీ సమాజం తన అస్తిత్వాన్ని, మనుగడను కాపాడుకొనేందుకు చేస్తోన్న ప్రయత్నం ఇది. నిజాం జమానా నుంచే భాగ్యనగర సంస్కృతిలో భాగమైన పార్శీ జాతి ప్రమాదంలో పడింది. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పార్శీ జనాభా క్రమంగా క్షీణిస్తోంది. అది హైదరాబాద్‌లో మరింత ఆందోళనకరంగా ఉంది. నిజాం పాలనలో తమ మేధోసంపత్తితో కీలక పదవులు అలంకరించిన పార్శీలు ఇప్పుడు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి తాపత్రయపడుతున్నారు. ఒకప్పుడు భాగ్యనగరంలో వేల సంఖ్యలో ఉన్న వీరి జనాభా ఇప్పుడు పదకొండు వందలకు పడిపోయింది. తమ జాతిని పునరుజ్జీవింపజేసేందుకు పార్శీ మత సంస్థలు, ధార్మిక సంస్థలు, పెద్దలు నడుం బిగించారు. ఈ తరం దంపతులు ఎక్కువ మంది పిల్లలను కనేవిధంగా ప్రోత్సహిస్తున్నారు. ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు. సంతానోత్పత్తికి నోచని దంపతులకు వైద్య సహాయాన్ని అందజేస్తున్నారు. మిరాసన్ ట్రస్టు రూ. 20 వేల నుంచి రూ. 40 వేల వరకు అందజేస్తోంది. కానీ ఈ రెండు సంస్థలు కలసి ఆరేళ్లలో 25 జంటలకు మాత్రమే ఇలాంటి సహాయాన్ని అందజేశాయి. అలాగే బాంబే పార్శీ పంచాయత్, కేంద్రప్రభుత్వ ‘జియో పార్శీ’ పథకం కింద లబ్ధ్ది పొందుతున్న వాళ్లూ తక్కువ మందే ఉన్నారు. చాలా మంది ఒక్క సంతానానికే పరిమితమవుతున్నారు. ఇద్దర్ని కనేవాళ్లు చాలా తక్కువ . ఇక హైదరాబాద్‌లో ముగ్గురు పిల్లలను కన్న జంటలు మూడంటే మూడే ఉన్నాయి. పార్శీ దంపతులు ఎదుర్కొంటున్న మరో సమస్య సంతానరాహిత్యం. రక్త సంబంధీకుల మధ్య జరిగే పెళ్లిళ్లు అబార్షన్‌లకు దారితీస్తున్నాయి. నగరంలో ఉన్న పార్శీల్లో 55 ఏళ్ల నుంచి 100 ఏళ్లలోపు పెద్దవారు 540 మంది ఉంటే 30 నుంచి 39 ఏళ్లలోపు వాళ్లు కేవలం 182 మంది ఉన్నారు. 2012 నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్‌లో 11 మంది పిల్లలు మాత్రమే పుట్టారు. కానీ ఇదే సమయంలో 46 మంది వయోధికులు కాలం చేశారు. ఏటా సగటున 18 మంది చనిపోతుంటే ఇద్దరు మాత్రమే జన్మిస్తున్నారు. అగ్నిని, నీటిని దైవంగా ఆరాధించే పార్శీ జాతి తనను తాను కాపాడుకొనేందుకు, మతాంతర వివాహాలను నియంత్రించేందుకు ‘చారిటబుల్ బ్లాక్'(మతపరమైన కట్టుబాటు)ను విధించింది.

అబిడ్స్, నాంపల్లి, సికింద్రాబాద్‌ల లోని విశాలమైన ఫైర్ టెంపుల్స్ ప్రాంగణాల్లోనే పార్శీ కుటుంబాలు సకల సదుపాయాలతో జీవించేందుకు ఏర్పాట్లు చేశారు. అతి తక్కువ ధరలకే విశాలమైన ఇళ్లను అద్దెకు ఇచ్చారు. అన్ని రకాల మతపరమైన కార్యక్రమాల్లో, ప్రార్థనల్లో పాల్గొనేవిధంగా ప్రోత్సహిస్తున్నారు. అయినా నేటి యువత మతపరమైన కట్టుబాట్లను అధిగమించి తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకొనేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. పార్శీ జాతి ఇప్పుడు పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. ఈ తరం అమ్మాయిలు, అబ్బాయిలు స్వతంత్రంగా ఆలోచించడం, ఆర్థిక స్వాతంత్య్రాన్ని కోరుకోవడం మంచిదే కానీ చారిత్రక బాధ్యతన విస్మరించొద్దు. ఇంతగా అభివృద్ధి చెందిన సమాజంలో కట్టుబాట్లలో బతకాలనడం కరెక్ట్ కాదు అని కొందరి అభిప్రాయం! వీరు చాలా నిజాయితీపరులు. భారత దేశంలో ప్రముఖులైన పార్శీలలో దాదాభాయి నౌరోజీ, జమ్సేట్జి టాటా, ఫిరోజ్ షా మెహతా, ఫిరోజ్ గాంధీ, జుబిన్ మెహతా, అర్దెషీర్ ఇరానీ, నానీ పాల్కీవాలా, పీలూ మోడీ, గోద్రెజ్ కుటుంబం, వాడియా కుటుంబం, టాటా కుటుంబం వగైరాలు.

దైవప్రీత్యర్థం విధ్యుక్త ధర్మాచరణం

రచన: జి.సందిత

మానవులు జన్మను సార్థకం చేసుకోవటం అంటే భగవంతుని మెప్పుపొందటమే!
అందుకోసం మనుషులకై నిర్దేశించిన అనుసరించవలసిన కర్మాచరణ విధివిధానశాస్త్రమే ధర్మము.
కర్మాచరణం కూడా త్రికరణశుద్ధిగా చేయవలసి వుంటుంది. అప్పుడే అది ధర్మమవుతుంది. త్రికరణ శుద్ధి అంటే మనసా వాచా కర్మణా వైరుధ్యం లేకపోవటమే!
ఆకలితో ఇంటికి వచ్చిన అతిథికి భోజనంపెట్టటం మన ధర్మం అనుకుందాం. అప్పుడు వండి సిద్ధం చేయటం, వడ్డించటం శరీరకర్మ.
అతిథిని భోజనానికి ఆహ్వానించటం తదుపరి ఏమేమి ఉన్నాయో తెలిపి కొసరికొసరి అడగటం వాచా కర్మ.
అలా చేస్తున్నందుకు తృప్తిపడుతూ ఆనందించటం మానసిక కర్మ.
అటువంటి పూర్ణ ధర్మాచరణమే దైవప్రీతమైన కార్యమన బడుతుంది. ఇలా త్రికరణ శుద్ధిగా చేసినప్పుడే కర్మాచరణంతో ముడివడిన ధర్మాచరణం సంపూర్ణసార్థక్యం చెందుతుంది.
ఇచ్చట మనసే ప్రధానమైనది. మనసులో అయిష్టత వైరుధ్యం వున్నప్పుడు, వండటంలోనూ, వడ్డించటంలోనూ భోజనానికి పిలవటంలోనూ, కొసరటంలోనూ, మాటల్లోనూ తృప్తిగా ఆనందించటంలో, మనసులోనూ భోజనం పరిమాణం, రుచులు, నాణ్యతలలోను ప్రభావం కనిపించవచ్చు.
అటువంటి ధర్మాచరణ మానవులదృష్టిలో ధర్మ కార్యమనబడవచ్చును కాని దైవం మెచ్చదు. దైవ ప్రీత్యర్హమైన ధర్మాచరణం ఒకచో — విధ్యుక్త ధర్మం- స్వీయకర్తవ్యం కావచ్చును. ఐనప్పటికిని అది పూజలు వ్రతాలకన్నను, జపతపాదికాలకన్నను, యజ్ఞహోమాదికాలకన్నను అత్యంతపవిత్రమైనదై దైవాన్ని మెప్పిస్తుంది.
ముఖ్యంగా వృత్తిరీత్యా దీనులను ఆదుకునే స్థానంలో కర్తవ్యాన్ని, విధ్యుక్తధర్మాలను నిర్వహించే వారైనా, ప్రభుత్వ ఉద్యోగులైనా లేదా ఇతరత్రా స్వయంగా అటువంటి బాధ్యతలు నిర్వహించే వారైనా తమకు ప్రాప్తించిన అధికారాన్ని, వృత్తినైపుణ్యాన్ని దేవుడు మనకు ఇచ్చిన వరంగా ప్రసాదించిన మహిమగా భావించాలి.
ఆ విధంగా మనకు తన మహిమల్ని మనకు ఇచ్చి — మనుషుల దైన్యాలను దూరం చేసే అవకాశాన్ని మనకు ఇచ్చాడని గ్రహించాలి.
ఆ విధంగా మనుషులకు సేవ చేస్తూ దేవునికి దేవుని కృపకు దీనులను మరింత చేరువచేస్తూ భగవంతుణ్ణి మనం మెప్పించ గలగాలి. అప్పుడే మన జన్మసార్థకమౌతుంది.
దీనులంటే రోగములచే గాని ఇతరత్రా కష్టములచే గాని పీడింపబడుతూ భగవంతుని శరణువాడే వారే కదా! వారు బాధలనుండి రక్షిస్తారన్న ఆశతో—వైద్యులవద్దకు కాని, సంబంధిత అధికారుల వద్దకు గాని వస్తూవుంటారు.
అలా బయలుదేరుతూ వారు–
“దేవుడా! మేము వెళ్ళిన చోట ఆ వైద్యులు లేదా అధికారులు సిద్ధంగా వుండేట్లు చూడు. వాళ్ళు వెంటనే మా బాధల్ని తొలగించేట్లు చూడు” అంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ వస్తారు. అలా కష్టాలు తీరితే–
” దేవుని దయవల్ల సులభంగా మాకు మేలు జరిగింది” అని దేవుణ్ణి తలుచుకుంటారు.
దేవుడు కూడా —
“ఫలానా వ్యక్తికి వైద్యునిగా లేదా అధికారిగా విధులునిర్వర్తించే అవకాశం శక్తి మహిమ ఇచ్చినందు వలన లోకానికి మంచి జరిగింది “అని భావిస్తాడు.
ఆ విధంగా విధ్యుక్తధర్మం, కర్తవ్యం సక్రమంగా నిర్వర్తించేవారికి మరో జన్మలో కాని అదే జన్మలో గాని ఇంకా మంచి వృత్తినైపుణ్యాలను, అధికారాలను ప్రసాదిస్తాడు దేవుడు.
దేవుడు అటువంటి వారికి అత్యున్నత స్థితులను కల్పిస్తూ ఇహలోక సంబంధమైనమైన అష్టైశ్వర్యాలను, స్వర్గసుఖాలను కల్పిస్తాడు. అటుపై ఏకంగా అటుపై మోక్షప్రాప్తినిస్తాడు.
అందుకు విరుద్ధంగా కర్తవ్యాలను విస్మరించే వారు దీనులకు తటస్థిస్తే దీనులు దిక్కుతోచక “దేవుడా నీవు దీనబాంధవునివని నిన్ను ప్రార్థించి బయలుదేరితిమే. ఎందుకు ఇలా చేసితివి తండ్రీ! నీ దయ మాపై చూపలేదేమి ”
అంటూ దేవునితో మొఱ పెట్టుకుంటారు.
దయతో ప్రసాదించిన విద్యావకాశములచే ఉద్యోగావకాశములచే దీనుల కష్టాలనుతీర్చే శక్తిని మహిమను అధికారములను పొందిన వారు –ధర్మాన్ని మరచిపోయిన ఫలితంగా మరుజన్మంటూ వుంటే వారికి దైవీయమైన పై నైపుణ్యాలను అధికారాలను ఎట్టి పరిస్థితులను ప్రసాదించడు.
దైన్యం అంటే ఏమిటో వారికి అర్థం అయ్యేలా అటువంటి కర్తవ్యద్రోహులకు దీనాతి దీనులుగా జన్మను ప్రసాదించి తనను ప్రార్థించి తనకు చేరువై దీనజన రక్షణావశ్యకతను గుర్తించేలా అనుగ్రహిస్తాడు.
మానవులమైన మనమైనా మనకు చెడ్డపేరు తెచ్చిపెట్టే కన్నబిడ్డలకైనా అధికారాలను బాధ్యతలను అప్పగించలేము కదా!
*** ** ***
దీనబాంధవుడైన భగవంతుని ప్రీత్యర్థం కర్తవ్యపాలనంలో భాగమైన విధ్యుక్త ధర్మాల్ని త్రికరణశుద్ధిగా నెరవేర్చటం మన ధర్మం. అదే మానవధర్మం కూడానూ.

భారతములో చెప్పబడ్డ కలియుగ ధర్మాలు

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు

ద్వాపరయుగము నాటివిషయము ఇది. మహాభారతములో పాండవులు కురుక్షేత్ర యుద్ధము అనంతరము వాన ప్రస్తాన పర్వంలో ఉండగా ధర్మరాజుకు కామ్యక వనములో మార్కండేయ మహాముని ఆశ్రమాన్ని దర్శించినప్పుడు, మార్కండేయ మహాముని
పాండవులకు ద్రౌపదికి, కృష్ణుడు సత్యభామల సమక్షములో రాబోయే కలియుగధర్మాలను సవివరముగా వివరిస్తాడు. కలి యుగములో సంభవించబోయే పరిణామాలను వివరిస్తాడు. ద్యాపర యుగము ముగిసి కలియుగము త్వరలోనే మొదలవుతుంది అని ముని వారికి వివరిస్తాడు.
కలియుగములో జనులు అలవోకగా ఏమాత్రము జంకు లేకుండా అబద్దాలు ఆడటం ప్రారంభిస్తారు. కర్మకాండలు, దానధర్మాలు వారే స్యయముగా జరపకుండా వారి ప్రతినిధులచే జరిపించుకుంటారు. ప్రస్తుతము మనము బ్రాహ్మణుడు జపతపాలు చేస్తుంటే మనము “మమ”అనుకుంటూ క్రతువులను పూర్తిచేస్తున్నాము.
బ్రాహ్మణులు శుద్రులు చేసే పనులు చేయటము ఆరంభిస్తారు. శుద్రులు ధనసంపాదనలో పడతారు. క్షత్రియులు క్షాత్ర ధర్మాన్ని విడిచి మతపరమైన కార్యక్రమాలలో నిమగ్నమవుతారు. బ్రాహ్మణులు వేదాలను అభ్యసించటం మాని సర్వభక్షకులుగా (మాంసాహారము, శాఖాహారము రెంటిని తింటూ) మారుతారు.
శుద్రులేమో పూజలుపునస్కారాలో నిమగ్న మవుతారు.
ఈ విధముగా ప్రపంచము అంతా తల్లక్రిందులుగా నడుస్తుంది. అంటే ఎవరు వర్ణ ధర్మాలు ఆచరించరు ఇవన్నీ వినాశనానికి గుర్తులు. అనేకమంది దుర్మార్గులు రాజ్యాలు ఏలుతారు. వారి తప్పుడు విధానాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారు. ప్రజలు ఏవైతే పనులు చేయకూడదో ఆ పనులు చేస్తారు.
చిన్న వయస్సులోనే మరణాలు సంభవిస్తాయి. శారీరకముగా బలహీనులుగా ఉండి శక్తివిహీనులుగా ఉంటారు.
నిజము చెప్పరు. మానవుల జనాభా క్రమముగా తగ్గుతుంది జంతువుల సంఖ్య పెరుగుతుంది. ప్రకృతి వైపరీత్యాలు తరచుగా సంభవిస్తాయి. జాతుల మధ్య వైరములు పెరుగుతాయి పనిపాటలు చేసుకునే వారు చదువుకున్న వారిని వారి పేర్లతో
సంభోదిస్తారు.
చదువుకున్నవారు పనివారిని “అయ్యా”అని సంభోదించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఆహారానికి సువాసన రుచి వంటి లక్షణాల గురించి పట్టించుకోరు. ఆడవారు మంచి నడవడిని కోల్పోతారు. కరువునాటకాలు ఎక్కువ అవుతాయి. కూడళ్లలో వ్యభిచారులు ఎక్కువ అవుతారు. ఆడవారు చాలా మటుకు అణుకువను కోల్పోతారు. పాలఉత్పత్తి తగ్గుతుంది, పూలు తక్కువగా పూస్తాయి విజ్ఞులను మేధావులను చంపిన వారిని అబద్దాలకోరులైన పాలకులు సత్కరిస్తారు ప్రజలు పన్నుల భారంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
బ్రాహ్మణులు వ్యాపారాలలో దిగి ఆస్తులు సంపాదించుకుంటారు. చాలామంది డబ్బుమీద ఆశతో దొంగ సాధువులు సన్యాసులుగా మారి చేయకూడని పనులను చేస్తారు. అంటే సురాపానం వేశ్యా సంపర్కము వంటి పనులలో నిమగ్నమై ఉంటారు.
ఆశ్రమాలు ఆశ్రమాలు అసాంఘిక శక్తులకు నిలయాలుగా మారతాయి. మనము ప్రస్తుతము చూస్తున్నది ఇవే. వర్షాలు సకాలములో పడక పంటల సరిగా పండవు.
మనుషులు క్రూరముగా ఆలోచిస్తూ క్రూరమైన పనులు చేస్తారు. పగప్రతీకారాలలో ఆనందాన్ని అనుభవిస్తారు. భూమి అంతా
పాపముతో నిండిపోతుంది. సత్పురుషులు ఎక్కువకాలం బ్రతకరు. చాలామంది ధనాన్ని అక్రమ మార్గాల్లో సంపాదిస్తారు.
మంచివాడు సుఖముగా బ్రతకలేడు దొంగలు మోసగాళ్లు దుర్మార్గులు హాయిగా బ్రతుకుతారు. ప్రజలు బహిరంగ ప్రదేశాలలో కూడా అసభ్యముగా సంచరిస్తారు. వారు అనుకున్నది సాధించటానికి తప్పుడు మార్గాలను అవలంభిస్తారు.
ఇతరుల ఆస్తులను ఆక్రమించుకోవటానికి ప్రజా ధనాన్ని దోచుకోవటానికి వెనుకాడరు. అడిగినా నిస్సుగ్గుగా తప్పేంటి అని ఎదురు
ప్రశ్నిస్తారు. జనసంచారాలలో దేవాలయాలలో జంతువులు పక్షులు, పాములు వంటివిదర్శనమిస్తాయి.
ఆడపిల్లలు చిన్నవయస్సులోనే గర్భవతులవుతారు, అలాగే చిన్నవయసు బాలురు తండ్రులవుతారు. యుక్త వయస్సు నాటికి జనులు బలహీనులవుతారు వారి ఆయుప్రమాణము తగ్గిపోతుంది.
యువకులు ముసలివారుగాను ముసలివారు యువకులుగా(కృత్రిమ వేష ధారణతో) ప్రవర్తిస్తారు.
భార్యలు నీతి తప్పి భర్తలు బ్రతికి ఉండగానే పరపురుషులతో సంభంధము పెట్టుకొని భర్తలను మోసగిస్తుంటారు.
ఈ విధముగా క్రమముగా నీతి సన్నగిలిపోవటము జరుగుతుంది అని మార్కండేయ మహాముని ధర్మరాజు మరియు ఇతరులకు వివరిస్తాడు.
మనము ప్రస్తుత సమాజాన్ని గమనిస్తే అవన్నీ నిజాలే, అక్షరాలా జరుగుతున్నాయని గమనించవచ్చు.
ప్రస్తుతము మనము కలియుగములోని ప్రధమ పాదములోనే వీటిని గమనిస్తున్నాము. యుగధర్మాన్ని అనుసరించి నైతిక విలువలకు అర్ధాలు మారుతున్నాయి
ద్వాపర యుగాంతానికి కురుక్షేత్ర యుద్ధము జరిగి ధర్మము రక్షింపబడింది. అలాగే కలియుగములో కూడాపాపము పెరిగి కలియుగములో నాలుగు పాదాలు పూర్తి ఆయేనాటికి భగవంతుడు మళ్లాఅవతారము ఎత్తి ధర్మాన్ని రక్షిస్తాడు అని హిందువుల ప్రగాఢ నమ్మకము
బ్రహ్మముగారి తత్వాలలో కలియుగ అంతానికి కొన్ని లక్షణాలు చెప్పారు. యాగంటిలోని బసవన్న(రాతి విగ్రహము) లేచి రంకె వేస్తుందని, కృష్ణా నది పొంగి కనకదుర్గమ్మ ముక్కు పూడకను తాకుతందని ఇలా కొన్ని లక్షణాలను తెలిపాడు ఇంకా ప్రధమ పాదములోనే ఉన్నాము కాబట్టి ఆ లక్షణాలు చూడటానికి చాలా కాలము ఎదురుచూడాలి.

యక్ష ప్రశ్నలు

రచన: అంబడిపూడి శ్యామసుందరరావు.


సాధారణముగా జవాబు చెప్పటానికి ఇబ్బందికరమైన ప్రశ్నలు ఎవరైనా వేస్తుంటే మనము “వీడి యక్ష ప్రశ్నలకు జవాబులు చెప్పటం కష్టము” లేదా యక్ష ప్రశ్నలతో విసిగిస్తున్నాడు” అని అంటాము అసలు ఈ యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎవరు ఎవరిని అడిగారు వాటికి సమాధానాలు ఏమిటి? అనే విషయము గురించి క్లుప్తముగా తెలుసుకుందాము.
దేవలోకములో ఉండే వారిని గంధర్వులు యక్షులు అని అంటారు. అటువంటి ఒక యక్షుడు అరణ్యవాసము చేస్తున్న పాండవులను ముఖ్యముగా ధర్మరాజును అడిగిన ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు ఈ యక్షప్రశ్నలాగా చెలామణి అవుతున్నాయి. వీటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు చాలా మటుకు ధర్మానికి సంబంధించినవి. అందువల్ల ఈ జవాబూల్లో ధర్మరాజు విజ్ఞతని ధర్మనిరతి తెలుస్తుంది.
పాండవులు అరణ్యవాసము చేసేటప్పుడు ప్రకృతి రమణీయమైన ద్వైతవనములో ఉంటారు. ఒక రోజు ఒక బ్రాహ్మణుడు వీరివద్దకు సహాయము కొరకు వస్తాడు. ఆ బ్రాహ్మణుడు తాను చేస్తున్న హోమానికి సంబంధించిన సమిధలను (చిన్న కట్టెపుల్లలను) ఒక జింక తన కొమ్ముల మధ్య ఇరికించుకుని ఆ బ్రాహ్మణుడికి దొరకకుండా పారిపోతుంది కాబట్టి ఆ బ్రాహ్మణుడు చేసే దైవకార్యము హోమము ఆగిపోతుంది. అందువల్ల పాండవులు ఆ జింక నుండి తన కట్టెలను ఇప్పించ వలసిందిగా వేడుకుంటాడు. పాండవులు ఐదుగురు ఆయుధాలతో జింక కోసము బయలుదేరుతారు. ఈ వేటలో పాండవులు అలిసిపోతారు కానీ వారికి జింక జాడ కనిపించదు. అలసిన పాండవులు దాహము తీర్చుకోవటానికి కొంచెముసేపు ఆగి, నకులుడిని మంచినీటి కోసము పంపుతారు. నకులుడు మంచినీటి సరస్సు కోసము వెతికి, చివరకు ఒక మంచి నీటి సరస్సును చూస్తాడు. తానూ మంచినీరు త్రాగి సోదరులకు మంచి నీరు తీసుకొనివెళదామని సరస్సు చెంతకు వెళతాడు.
నకులునికి ఆ నీరు త్రాగవద్దని అశరీరవాణి వినిపిస్తుంది కానీ నకులుడు ఆ మాటలను లెక్కచేయకుండా త్రాగటంవల్ల చనిపోతాడు.
ఒకరితరువాత ఒకరు నీటికోసము సరస్సు వద్దకు వచ్చి అశరీరవాణి మాటలను లెక్కచేయకుండా నీరు త్రాగి చచ్చి పడిపోతారు. చివరకు ధర్మరాజు సోదరులను వెతుక్కుంటూ వచ్చి చచ్చి పడివున్న సోదరులను చూసి ఆశ్చర్యపోతాడు. నీరు త్రాగటానికి ప్రయత్నించినప్పుడు ధర్మరాజుకు అశరీరవాణి వినిపిస్తుంది. ఆ వాణి ఒక యక్షుడిది. ఆ యక్షుడు ధర్మరాజును తన ప్రశ్నలకు జవాబులు చెపితే నీరు త్రాగి తన సోదరులను సజీవంగా తీసుకొని పోవచ్చని చెపుతాడు. ఆ యక్షుడు అడిగిన దాదాపు వంద ప్రశ్నలు ధర్మానికి నీతికి, సక్రమమైన నడవడికి సంబంధించినవి ధర్మాన్ని ఆచరించే ధర్మరాజులాంటి వాడు మాత్రమే ఆ ప్రశ్నలకు జవాబులు ఇవ్వగలిగాడు.
మనము అన్ని ప్రశ్నలు జవాబులు కాకపోయినా కొన్ని ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు తెలుసుకుందాము.
1.ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? జ:-అహింస
2.సుఖాల్లో గొప్పది ఏది? జ:-సంతోషము.
3.సుఖానికి ఆధారము ఏది ? జ:-శీలము.
4. ధర్మానికి ఆధారము ఏది? జ:-దయా దాక్షిణ్యము.
5. ఎవరు స్థితప్రజ్ఞుడు? జ:-కలిమిలేములలో సుఖ దుఃఖాలలో ఒకే రీతిగా ఉంటూ లభించిన దానితో సంతృప్తుడై అరిషద్ వర్గాలను జయించి స్థిరబుద్ధి కలవాడు స్థితప్రజ్ఞుడు .
6.ఆశ్చర్యాన్ని కలిగించేది ఏది? జ:-ప్రతిరోజూ మరణిస్తున్న ప్రాణులననేకము చూస్తూ కూడా మనిషి తానూ శాశ్వతముగా ఈ భూమి మీద ఉంటానని అనుకోవటం.
7. ధర్మము,అర్ధము,కామము ఎక్కడ కలియును? జ:-తన భార్యలో,తన భర్తలో.
8. నరకము అనుభవించేవారు ఎవరు? జ:-వేదాలను,ధర్మ శాస్త్రాలను,దేవతలను,తల్లిదండ్రులను ద్వేషించేవారు,దానములు చేయనివారు,ఆశ పెట్టి దానము చేయనివారు నరకము అనుభవిస్తారు.
9. ఎవరు సంతోషముగా ఉంటారు?-జ: తనకున్న దానితో తృప్తి చెందేవాడు,అప్పు లేనివాడు సంతోషముగా జీవించగలడు.
10. లోకములో ధనవంతుడెవరు ? జ;-సుఖము,దుఃఖము,ప్రియము అప్రియము మొదలైన వాటిని సమముగా చూసేవాడే ధనవంతుడు.
11. బ్రాహ్మణత్వము ఇచ్చేది ఏది ? జ;- వ్యక్తి యొక్క సత్ప్రవర్తన మాత్రమే బ్రాహ్మణత్వాన్ని ఇస్తుంది.
12. పండితు డని ఎవరిని అంటారు?. జ:- ధర్మమూ తెలిసిన వాడిని మాత్రమే పండితుడని అంటారు .
13.మూర్ఖుడు ఎవడు? జ:-ధర్మము తెలుసుకోకుండా అడ్డదిడ్డముగా వాదించేవాడు.
14.జీవన్ మృతుడు ఎవరు ? జ:-అతిధులకు, పితృ సేవాకాదులకు ,దేవతలకు పెట్టకుండా తానూ తినేవాడు జీవన్ మృతుడు
15. గాలి కంటే వేగముగా ప్రయాణించేది ఏది? జ:-మన మనస్సు,
16. బాటసారికి, రోగికి, గృహస్తుకు బంధువులెవరు? జ:-బాటసారికి స్వార్ధము , రోగికి వైద్యుడు,గృహస్తుకు అనుకూలవటి,శీలవతి అయిన భార్య,చనిపోయిన వారికి వారి సుకర్మ బంధువులు.
17. మానవునికి సజ్జనత్వము ఎలా వస్తుంది? జ:-ఇతరులు తన పట్ల ఏమి మాట్లాడితే ,ఏమి పనిచేస్తే తానూ శారీరకంగా మానసికముగా భాధ పడతాడో తానూ కూడా ఇతరులపట్ల అటువంటి పనులుచేయకుండా మాటలు మాట్లాడకుండా ఎవరు ఉంటారో నట్టివారికి సజ్జనత్వము వస్తుంది.
18. మానవునికి దుర్జనత్వము ఎలా వస్తుంది? జ:-శరణు జొచ్చిన వారిని రక్షించకపోవటము వలన.
19. దేవ లోకానికి దారి ఏది? జ;- సత్యము.
20. మనిషికి దైవిక బంధువులు ఎవరు? జ:-భార్య/భర్త..
21. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? జ:-తపస్సు వలన సాధుభావము శిష్టాచారా భ్రష్టతనము వల్ల .
22. మంచిగా మాట్లాడేవానికీ ఏమి దొరుకుతుంది? జ:-మైత్రి.
23.. అలోచించి పనిచేసేవారు ఏమి అవుతారు? జ:-అందరి ప్రశంసలు పొందిగొప్పవారు అవుతారు.
24.మానవునికి దుర్జనత్వము ఎలా వస్తుంది? జ:- శరణు జొచ్చిన వారిని రక్షించకపోవటం వలన
25. జన్మించియు ప్రాణము లేనిది ? జ:- గ్రుడ్డు
26. తృణము కంటే దట్టము అయినది ఏది? జ:- చింత
27. మానవుడు దేని వలన శ్రోత్రియుడు అగును? జ:- వేదము వలన.
28. మానవుడు దేనివలన మహత్తును పొందుతాడు ? జ:- తపస్సు వలన.
29. మానవుడు దేని వలన బుద్ధిమంతుడవుతాడు? జ::- పెద్దలను సేవించటం వలన.
30. రూపము ఉన్నా హృదయము లేనిది ఏది? జ:- రాయి.
31. తపస్సు అంటే ఏమిటి?జ:-తన వృత్తి, కుల ధర్మాలను ఆచరించటం.
32. సిగ్గు అంటే ఏమిటి? జ:- చేయరాని పనులు చేయటానికి సంకోచించటము.
33.సోమరితనం అంటే ఏమిటీ? జ:- ధర్మ కార్యాలు చేయకపోవటం.
34. ధైర్యము అంటే ఏమిటి? జ:-ఇంద్రియ నిగ్రహము.
35. లోకాన్ని కప్పిఉన్నది ఏది? జ:- అజ్ఞానము .

జైన మతము

రచన: శారదా ప్రసాద్

క్రీ. పూ. 6వ శతాబ్దంలో భారతదేశంలో అనేక మతాలు ఆవిర్భవించాయి. వీటిలో ముఖ్యమైనవి జైనమతం, బౌద్ధమతం. ఈ రెండు మతాలు భారతదేశ సంస్కృతిని గణనీయంగా ప్రభావితం చేశాయి. ముఖ్యంగా బౌద్ధం చైనా, జపాన్ లాంటి దేశాల్లో ఇప్పటికీ గొప్ప ఆదరణ పొందుతోంది. జైనమతం చాలా పురాతన కాలం నుంచి ఉందని తెలుస్తోంది. ఋగ్వేద మంత్రాల్లో జైన మత స్థాపకులైన మొదటి తీర్థంకరుడైన వృషభనాథుని గురించి స్పష్టమైన ప్రస్తావన ఉంది. జైన మతంలో 24 మంది తీర్థంకరులు ఉన్నారని, అందరూ క్షత్రియులేనని తెలుస్తోంది. వీరిలో మొదటి ఇరవై రెండు మంది పౌరాణిక వ్యక్తులు. కానీ 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు, 24వ తీర్థంకరుడైన మహావీరుడు చారిత్రక పురుషులు. చారిత్రకంగా మాత్రం జైనమత స్థాపకుడు 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు. ‘తీర్థంకరులంటే జీవ ప్రవాహాన్ని దాటడానికి వారధి నిర్మించినవారు’ అని అర్థం. ప్రాచీన మతాలలోని కర్మకాండల భారంతో జనం విసిగిపోయి ఉన్నారు. పూజారి వర్గం, అసమానతలు, సామాజిక స్తబ్దత, అధర్మం, బలులు, కులవ్యవస్థలతో సమాజం కుళ్ళిపోయింది. విప్లవం తప్పనిసరి అయింది. “వ్యక్తి ఆడగాని, మగగాని మానవ మాతృడుగా తన ముక్తిని తానే సాధించుకోవాలి. జీవితం లక్ష్యం కాదు.
ఆధ్యాత్మీకరణ మార్గంలో అది ఒక పరికరం మాత్రమే. అంతిమ లక్ష్యం”ఆధ్యాత్మీకరణం”. ఆధ్యాత్మీకరణం అన్నది నూతన విప్లవం. ఈ నేపథ్యంలో భారత దేశంలో రెండు మతాలు వెలిశాయి. అవి జైన, బౌద్ధ మతాలు. హిందూ మతానికి అవి వ్యతిరేకమే అయినా, మొత్తం మతాలు భారతదేశంలో ప్రక్క ప్రక్కనే నివాసం చేశాయి. జైన మతాన్ని జైన వృషభనాథుడు స్థాపించాడు. “జిన”(విజేత) అనే పదం నుంచి జైనం వచ్చింది. జైన మతము సాంప్రదాయికంగా
జైన ధర్మఅని పిలువబడుతుంది. ఈ మతము క్రీ. పూ. 9వ శతాబ్దంలో పుట్టింది. ఈ మత స్థాపకుడు మొదటి తీర్థంకరుడు అయిన వృషభనాథుడు. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. 24వ తీర్థంకరుడు వర్థమాన మహావీరుడు.
భారతదేశంలో జైనులు ఒక చిన్న సమూహము. వీరి జనాభా దాదాపు 42 లక్షలు ఉంటుంది. జైన మతమును శ్రమణ మతమని కూడ అంటారు. వీరు దేవతలు లేరన లేదు. కాకపోతే వారికి దివ్యత్వం లేదన్నారు . అందువల్ల మహావీరుడి మతం నాస్తికం. అతడి తత్వం ద్వైతం. అతడి ప్రకారం రెండు రకాల పదార్థాలున్నాయి. ఒకటి జీవులు, రెండు అజీవులు. అజీవులు పదార్థం. అజీవులు అణు నిర్మితాలు. జీవులు అమర్త్యాలు. అజీవులు మర్త్యాలు. మనిషి మూర్తిత్వం ఈ రెండింటితోనూ నిర్మితమవుతుంది. కర్మ కారణంగా ఆత్మ బంధిత స్థితిలో ఉంటుంది. పునర్జన్మ కర్మ మీద అధారపడి ఉంటుంది. పరివ్రాజకుడు, గృహస్తు – ఎలా నడుచుకోవాలో జైనం వివరించింది. నిర్వాణం లక్ష్యం కనుక, మనిషి దుష్కర్మలను పరిహరించాలి. అంతే కాక, క్రమంగా నూతన కర్మలు చేయకుండా ఉన్న కర్మలను వినాశం చేసుకోవాలి.
ఇలాంటి ప్రవర్తన త్రిరత్నాల ఆధారంగా జరగాలి. అవి సమ్యగ్విశ్వాసం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ప్రవర్తనలు, మంచి నడతకు ఐదు ప్రమాణాలున్నాయి. అవి-అహింస, సత్యం(అబద్దమాడకుండుట), అస్తేయం(దొంగతనం చేయకుండుట), బ్రహ్మచర్యం, అపరిగ్రహం (ఇతరుల ఆస్తిని కబళించకుండుట). సమ్యగ్విశ్వాసం అంటే జినుల మీద విశ్వాసం. సమ్యక్ జ్ఞానం అంటే అంతిమ ముక్తికి అన్ని వస్తువులలో ఉన్న జీవానికి సంబంధించిన జ్ఞానం. ఇదంతా, మామూలు గృహస్తు నిర్వాణం పొందాలంటే ఆచరింపవలసిన విధానం.
సన్యాసి అంతకంటే తీవ్రమైన క్రమశిక్షణతో మెలగాలి. సన్యాసి అయినవాడు అహింసను తప్పనిసరిగా పాటించాలి. శాకాహారాన్ని భుజించాలి. అహింసా విధానం ఎంతవరకు వెళ్ళిందంటే, భూమిలో ఉండే వానపాములు చనిపోతాయని, అసలు భూమినే దున్నవద్దన్నారు. ఆ కారణంగా జైనులు ఎక్కువ మంది నగరాలకు వలసపోయి, వ్యాపారాలలో స్థిరపడ్డారంటారు. ఆచరణసాధ్యం కానంత తీవ్ర స్థాయిలో అహింస ఉంటుంది. జైనమతం ప్రజాదరణ పొందలేకపోవడానికి ఇది ఒక కారణం.
గాలి పీలిస్తే గాల్లోని సూక్ష్మజీవులు చచ్చిపోతాయని మూతికి గుడ్డ కట్టుకుంటారు. నీళ్ళు వడగట్టుకుని తాగుతారు. అడుగు తీసి అడుగువేసేటప్పుడు కాలికింద పడి సూక్ష్మజీవులు చచ్చిపోతాయని నెమలీకలతో చేసిన పొరకతో నడిచినంతమేరా అడుగేసేముందు నేలను ఊడ్చుకుంటూ పోతారు. నేలను చీల్చి దున్నే వ్యవసాయం చేయరు. నేలకింద పండే దుంపకూరలు, ఉల్లి, వెల్లుల్లి, మసూర్ గింజల్లాంటివి కూడా తినరు. వడ్డీ వ్యాపారం చేస్తారు.
23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు–ఇతను కాశీ రాజైన అశ్వసేనుడు, రాణి వామలకు జన్మించాడు. 30 ఏళ్ల వయస్సు వరకు గృహస్థ జీవితాన్ని గడిపాడు. తర్వాత ఇహలోక సుఖాలను త్యజించి, 84 రోజులు తపస్సు చేసి జ్ఞానిగా మారాడు. అహింస, సత్యం, అస్తేయం (దొంగతనం చేయకూడదు), అపరిగ్రహం (ఆస్తి ఉండకూడదు) అనే నాలుగు సూత్రాలను బోధించాడు. అదనంగా ఐదో సూత్రమైన బ్రహ్మచర్యాన్ని మహావీరుడు జోడించాడు. పార్శ్వనాథుడు తన వందో ఏట బెంగాల్‌లో నిర్యాణం చెందాడు.
వర్థమాన మహావీరుడు (క్రీ. పూ. 540- 468) — మహావీరుని అసలుపేరు వర్ధమానుడు. జ్ఞానోదయమైన తరువాత ‘ మహావీరుడు ‘ అని పేరు పొందాడు. ఈయన భార్య పేరు యశోద. వీరికి ప్రియదర్శి అను పుత్రిక కలదు. ఈమె వర్థమానుని మేనల్లుడు జామాలిని వివాహమాడింది. వర్థమానుడు తన 30వ ఏట గృహస్థ్యాన్ని త్యజించి, కఠినమైన తపస్సు చేశాడు. ఆరు సంవత్సరాలు మక్కలిగోశాలుని శిష్యునిగా ఉన్నాడు. ఆ తరువాత రిజుపాలిక నదీ తీరంలోని జృంబిక గ్రామం దగ్గర కఠోర తపస్సు చేశాడు. తన 43వ ఏట సాలవృక్షం కింద తపోసిద్దిని పొందాడు.
తదనంతరం, వర్ధమానుడు అంగ, మిథిల, కోసల, మగధదేశాలలో తన తత్వాన్ని ప్రచారం చేశాడు. ఇతడిని చివరివాడని జైనులు నమ్మారు. వర్థమానుడు, సిద్ధార్థ, త్రిశాల దంపతులకు క్రీ. పూ. 540లో వైశాలి సమీపాన కుంద గ్రామంలో జ్ఞాత్రిక క్షత్రియ వంశంలో జన్మించాడు. వర్థమానుని తండ్రి జ్ఞాత్రిక తెగకు అధిపతి కాగా, తల్లి వైశాలిని పరిపాలించిన చేతకుడి సోదరి, లిచ్ఛవీ రాజకుమార్తె. మగధ రాజు బింబిసారుడు చేతకుడి కుమార్తె అయిన చెల్లనను పెళ్లి చేసుకున్నాడు. అందువల్ల మగధను పరిపాలించిన హర్యాంక రాజ వంశీకులకు మహావీరుడు బంధువు అవుతాడు. అతడి కూతురు భర్త, జామాలి అతడి మొదటి శిష్యుడయ్యాడు.
వర్థమాన మహావీరుడు ఒకసారి నలందను దర్శించినప్పుడు అతనికి గోశాల ముస్కరీ పుత్రుడనే ఒక సన్యాసితో పరిచయం అయింది. వర్థమానునితో ప్రభావితుడైన ఆ సన్యాసి ఆరేళ్ళు వర్థమానుని తత్వాన్ని ప్రభోధించాడు. ఆ తరువాత అతడు చీలిపోయి “ఆజీవక మతము” ను స్థాపించాడు. ఆరేళ్లు దిగంబర యోగిగా తపస్సు చేసి విఫలుడై మక్కలి గోసాలుని (అజీవక మతశాఖ స్థాపకుడు) వద్ద శిష్యత్వం స్వీకరించాడు. వర్థమానుడు పదమూడు సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు. శరీరం శుష్కించి పోయింది. ఆ తరువాత వైశాఖ మాసం పదమూడవ రోజున జృంభిక గ్రామం (పార్శ్వ నాధ పర్వతాల దగ్గర) లో అతనికి “అంతర్భుద్ధి” కలిగింది. తరువాత అతడు 42 వ యేట మహావీరుడు లేదా జినుడు అయ్యాడు. అతని అనుచరులను నిర్గ్రంధులు అన్నారు. నిర్గ్రంధులు అంటే బంధాలు లేనివారు. తరువాత ముప్పై సంవత్సరాలు అతడు కోసల, మగధలలోనే కాక ఇంకా తూర్పు వైపుకు వెళ్లి తన సిద్ధాంతాలను బోధించాడు.
బింబిసారుడు, అజాత శత్రువు మొదలైన రాజులను తరచు కలిసేవాడు. అతడు తన డెబ్బై రెండవ యేట పావా (పాట్నా) జిల్లాలో బి. సి. 527 లో మరణించాడు. కాని కొంతమంది పండితులు అతడిని బుద్ధుని కంటే చిన్నవానిగా భావించి బి. సి. 458 లో మరణించాడన్నారు. తన 42వ ఏట జ్ఞానోదయం (కైవల్య) పొంది జినుడయ్యాడు. ‘జినుడు అంటే పంచేంద్రియాలను జయించినవాడు’ అని అర్థం. ధైర్యసాహసాలతో తపస్సు సాగించినందున మహావీరుడు అని, మహాజ్ఞాని కావడం వల్ల కేవలి అని, సకల బంధాలు తెంచుకొన్నందున నిర్గ్రంధుడని వర్థమానుడు గుర్తింపు పొందాడు జ్ఞానోదయం పొందిన తర్వాత వర్థమాన మహావీరుడు ఏడాదిలో ఎనిమిది నెలలు దేశాటన చేస్తూ ప్రజలకు తన సిద్ధాంతాలను బోధించాడు. మిగిలిన నాలుగు నెలలు చంప, వైశాలి, రాజగృహ, మిథిల, శ్రావస్తి మొదలైన పట్టణాల్లో కాలం గడిపేవాడు. ఈ నగరాలు జైనమత వ్యాప్తినిసూచిస్తాయి.
మహావీరుడు 72వ ఏట క్రీ. పూ. 468లో పాటలీపుత్రం సమీపంలోని పావపురిలో హస్తిపాలుడనే రాజు గృహంలో దీపావళి రోజున నిర్యాణం చెందాడు. మహావీరుడు వేదాలు ప్రామాణిక గ్రంథాలు, యజ్ఞాలు మోక్ష సాధనాలు కాదని చెప్పాడు. జంతు బలులను, వర్ణ భేదాలను ఖండించాడు. బ్రాహ్మణుల ఆధిక్యతను ఖండించి, అన్ని వర్ణాలవారు మోక్షానికి అర్హులే అనే సమత్వ సూత్రాన్ని ఉద్భోదించాడు.
పవిత్ర జీవితం గడుపుతూ సన్యాసిగా తపస్సు చేసి నిర్యాణం పొందొచ్చని మహావీరుడు బోధించాడు. భగవంతుడే ఈ ప్రపంచాన్ని సృష్టించాడని విశ్వసించ లేదు. మానవుడు ముక్తి కోసం భగవంతుడి అనుగ్రహం పొందిన లేదా మరే ఇతర వ్యక్తిపైనా ఆధారపడకూడదని, తన భవిష్యత్తుకు తానే కర్తని బోధించాడు. వర్ణ వ్యవస్థలో ఒక వ్యక్తి స్థానాన్ని అతని పూర్వ జన్మలోని పాపపుణ్యాలు నిర్ణయిస్తాయని మహావీరుడు పేర్కొన్నాడు. మహావీరుడికి భగవంతుడిపై నమ్మకం లేకపోయినప్పటికీ కర్మ సిద్ధాంతాన్ని నమ్మాడు. ఆత్మ ఉందని, ఆత్మకు పునర్జన్మ ఉందని కూడా అంగీకరించాడు. మానవుల కర్మలే వారి భవిష్యత్తుని నిర్ణయిస్తాయని కర్మ సిద్ధాంతాన్ని చాటి చెప్పాడు. కామ, క్రోధ, లోభ, మోహం, అజ్ఞానం కర్మకు కారణమని, కర్మ ఫలితాలను అనుభవించడానికి మళ్లీ జన్మించాల్సి వస్తుందని అన్నాడు.
కర్మను అంతం చేసి మోక్షం పొందాలంటే ప్రతి ఒక్కరూ మూడు సూత్రాలను పాటించాలని బోధించాడు. వీటిని త్రిరత్నాలు అంటారు. అవి—సరైన విశ్వాసం అంటే మహావీరుడి భావనల్లో శ్రద్ధ, విశ్వాసం కలిగి ఉండటం. సరైన జ్ఞానం అంటే మహావీరుడి బోధనల్లోని సత్యాన్ని గ్రహించడం. సరైన నడవడి అంటే జైన పంచ వ్రతాలను ఆచరించడం. జైనుల మొదటి సమావేశం పాటలీపుత్రంలోక్రీ. పూ. 300లో జరిగింది. ఈ సమావేశ ఫలితంగా జైన తీర్థంకరులు బోధించిన సిద్ధాంతాలను 12 అంగాలుగా క్రోడీకరించారు. వీటిపై వ్యాఖ్యానాలు కూడా రాశారు. వాటిని నిర్యుక్తులు అని అంటారు.
క్రీ. పూ. 4వ శతాబ్ది చివరి కాలంలో బీహార్‌లో భయంకరమైన కరువు ఏర్పడింది. ఇది 12 ఏళ్లపాటు ఉంది. ఈ సమయంలో భద్రబాహు నాయకత్వంలో కొందరు జైనులు దక్షిణాదిలోని మైసూరు ప్రాంతానికి వెళ్లారు. వీరు దక్షిణాదిలో జైనమతం వ్యాపింప చేశారు. స్థూలభద్రుడి అనుచరులను శ్వేతాంబరులని, భద్రబాహు అనుచరులను దిగంబరులని అంటారు. ముందుగా చెప్పినట్లుగా ఆచరణకు సాధ్యం కాని అహింసా సిద్ధాంతం వల్ల ఈ మతం క్రమేణా క్షీణదశకు చేరింది.
మహావీరుడు మోక్షాన్ని పొందిన చోట నేడు జలమందిరం పేరుతో జైన మందిరం ఉంది. ఆయన నిజంగానే వీరుడు. అరిషడ్వర్గాలనీ జయించిన వీరుడు. ప్రపంచ చరిత్రలోనే అంతకుమునుపు కనీవినీ ఎరుగని రీతిలో అహింసాయుత పద్ధతిలో స్వేచ్ఛను పొందిన భారతదేశస్వాతంత్రోద్యమాన్ని నడిపించిన మహాత్మాగాంధీ గారి అహింస, శాంతి మార్గాలకు స్ఫూర్తి వర్ధమాన మహావీరుడు.

సామాజిక స్పృహ నేపధ్యం

రచన: డా. నాగపద్మిని పుట్టపర్తి

మానవుడు సంఘజీవి. అంతే కాదు మేధోజీవి కూడా. సమాజంలో ఇరుగుపొరుగు వారితోనే కాదు, జంతువులూ, మొక్కలతోనూ సహజీవనం చక్కగా చేయగల నేర్పు, ఓర్పూ గలవాడని, తరతరాల చరిత్ర చెబుతున్నది.తన హక్కులూ బాధ్యతలేకాక, ఇతరుల హక్కులూ బాధ్యతలను గౌరవించటమన్న సర్దుబాటును అలవరచుకోవటమే అంచెలంచెలుగా మానవేతిహాసమైంది.

అసలిలా మానవుడు తన చుట్టూ ఉన్న సమాజాన్ని గురించిన స్పృహతో జీవించటాన్నే సామాజిక స్పృహ అన్న పేరుతో పిలుస్తున్నారు ఇటీవలి కాలంలో. కానీ యీ స్పృహ చాలా పాతకాలంలోనే మనిషిలో ఉండేదనటనికి ఉదాహరణలు, అప్పట్లో వెలసిన సాహిత్యమేనని ఘంటాపథంగా చెప్పవచ్చును. ఈ క్రమ వికాసాన్ని, మనుస్మృతి మొదలు రామాయణ, మహాభారత కథాక్రమంలో చూడగలం. స్త్రీ పురుష బంధం, ప్రకృతితో మెలగాల్సిన పద్ధతీ, ప్రభుత్వంతో వ్యవహరించవలసిన తీరూ, భగవంతుని పట్ల విశ్వాసం. ఇవన్నీ వివరంగా కథల్లో జోడించి చెప్పిన తీరు అద్భుతం. ఇవన్నీ సక్రమంగా మనిషి ఆచరిస్తూ ఉంటేనే, సకల సృష్టీ సుఖ శాంతులతో విలసిల్లుతుందని అలనాటి ఋషులూ, ఋషులైన కావ్యకర్తలూ కూడా భావించినట్టు విశదమౌతున్నది. ఈ సామాజిక బాధ్యత అన్న స్పృహను మన ప్రాచీన గ్రంధాల్లో యెలా విశ్లేషించారో చూద్దామా !

గౌతమముని తన ధర్మ సూత్రాలలో, సర్వ భూతదయ, అసూయను నియంత్రించుకోవటం, మనోవాక్కాయ కర్మలలో పరిశుద్ధత, మన శక్తికి మించిన పనులజోలికి వెళ్ళక సంయమనం పాటించటం, మాటల్లోనూ, చేష్టల్లోనూ ఆలోచనల్లోనూ అమంగళకరమైనవి దరిచేరకుండా జాగ్రత్త పడటం, దైన్యం లేకుండా ధైర్యంగా ఉండటం, దురాశ నుంచీ దూరంగా ఉండటం – యీ యెనిమిది గుణాలనూ ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలని చెబుతూ, వీటినే ‘ఆత్మగుణాలు ‘ అన్నాడు. (గౌ. భ.సూ.23-26)

మను స్మృతిలో (6-92) స్థిర చిత్తం, క్షమ, దయ, ఇతరుల వస్తువులను అపహరించకపోవటం, మనో వాక్ కాయాల పరిశుద్ధత, ఇంద్రియ నిగ్రహం, బుద్ధి వికాసం, విద్య, సత్యం, కోపానికి దూరంగా ఉండటం ఇవన్నీ ధర్మస్వరూపమనబడతాయని చెప్పాడు. స్త్రీని గౌరవించవలసిన పద్ధతిని మనువు యెంతో బాగా విశ్లేషించాడు కూడా ! ప్రకృతిలోని జీవరాసులన్నింటితోనూ సమరస భావంతో ఉండాలనీ మనువన్నాడు. (మను 1-49) అంతే కాదు, గార్హస్త్యంలో చీపురు, రోలు, రోకలి,నీళ్ళ బిందె వంటివి ఉపయోగించే సమయాల్లో మనకు తెలియకుండానే కొన్నిజీవులను బాధపెడుతుంటాము. దానికి ప్రాయశ్చిత్తం కూడా మనువు సూచించాడు.

తైత్తరీయ బ్రాహ్మణంలో (3.7.5) వివాహమైన మరు క్షణం నుండే భార్యాభర్తలిరువురూ ధార్మిక కార్యాలు కలిసి ఆచరిస్తూ వాటి ఫలితాలనూ కలిసి అనుభవించవలెనని ఉంది. తన కుటుంబానికి అవసరమయ్యేంత ధనం ఉంచుకొని, తక్కినదంతా ఇతరులకూ, పశుపక్ష్యాదులకూ ఉపయోగపడేలా వెచ్చించాలనీ, బావులూ చెరువులూ తవ్వించాలనీ,ఆకలిగొన్నవాళ్ళకు అన్నదానం చేసే సత్రాలు కట్టించాలనీ అందరూ సామూహికంగా ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా దేవాలయాలు కట్టించాలనీ (తైత్త. 10.63) కూడా ఉంది. సుఖ దు:ఖాలు మనకెలా ఉంటాయో, ఇతరులకూ అలాగే ఉంటాయని గుర్తించి నడచుకునే వ్యక్తే యోగి అంటుంది గీత. (6/32) గృహస్థాశ్రమంలో సమాజంలో అన్ని వర్గాలకూ ఉపయోగపడుతూ, చివరికి కాకులకూ శునకాలకూ కూడా ఆహారం వేయమని హెచ్చరిస్తుంది పద్మపురాణం. యాజ్ఞవల్క్య ముని, రోగికి సేవచేస్తే గోదాన ఫలం అభిస్తుందంటే, గీతాకారుడు, తన పొట్టపోసుకోవటానికి అవసరమయ్యేంత ధనాన్ని మాత్రమే కాక, అంతకుమించి కూడబెట్టుకున్నవాడు, శిక్షార్హుడైన దొంగేనంటాడు. దుర్మార్గుడైన రాజు పట్ల క్రూరంగా వ్యవహరించే హక్కునిచ్చేశాడు మహాభారత కర్త. (61/32.33) ఇక 11వ శతాబ్దానికి చెందిన గోరఖ్నాథ్, మాంస భక్షణవల్ల దయ నశిస్తుందనీ, మదిరాపానం వల్ల నిరాశ పెరుగుతుందనీ, ఇంద్రియ నిగహం, సత్యభాషణం అతణ్ణి ఉత్తముణ్ణి చేస్తాయనీ హెచ్చరించారు. ( గోరఖ్ బానీ 165/166) హితోపదేశ సూత్రాలన్నీ, మానవ సమాజ సుఖ జీవనోపదేశాలే కదా మరి !!

ఆధునిక యుగంలో ఎటు విన్నా వినిపిస్తున్న సామాజిక స్పృహ అన్న అంశానికి పునాదులు ప్రాచీన కాలం నుంచే ఉన్నాయనేందుకు పై ఉదాహరణలన్నీ ఆధారాలేకదా !

మమ్మటుడు తన కావ్య ప్రకాశంలో కావ్య ప్రయోజనాలుగా ఈ క్రింది వానిని వివరించాడు.

కావ్యం యశసే అర్థకృతే వ్యవహారవిదే శివేతర క్షతయే
సద్యః పర నిర్వృతయే కాంతాసమ్మితయోపదేస యుజే.

కావ్యం యశస్సు కొరకు, ధనసంపాదన కొరకు, వ్యవహార ఙ్ఞానం కొరకు, అమంగళ పరిహరణం కొరకు, మోక్ష సాధనకొరకు, కాంతా సమ్మితమైన ప్రభోధం కొరకు అని మమ్మటుని అభిప్రాయము.

కావ్య రచన వెనుక ఇన్ని కాణాలుంటాయని ఆనాడే సూచించిన అంశాలలో, సమాజ శ్రేయస్సూ ప్రధానంగా ఉంది. దీన్నే ‘ కమిట్ మెంట్ టు సొసైటీ ‘ అంటున్నారీకాలంలో !

నిజానికీ సామాజిక స్పృహ అన్నది మౌఖిక సాహిత్యంగా వ్యాప్తి చెంది, ఇప్పుడు నగరీకరణలో మసకబారుతున్న జానపద కళల్లో యెలా వ్యక్తీకరింపబడిందో, దానివల్ల సమజానికి చేకూరిన లాభమేమిటో వివరించటానికీ ఉదాహరణ ఉపయోగపడుతుంది.

అది క్రీ.శ. 1502 నాటి మాట.విజయనగర రాజు వీర నరసింహరాయలవారి అంత:పురంలో యేర్పాటు చేయబడిన కూచిపూడి భాగవతుల ప్రదర్శన రసవత్తరంగా సాగుతోంది. (రాజు కూచిపూడి భాగవతులు చక్కటి విద్యావంతులని విని, అంత:పుర స్త్రీలు కూడా వారి ప్రదర్శనను చూసి ఆనందించాలనే ఉద్దేశం తో యేర్పాటు చేశాడిలా) ప్రదర్శనలోని ఒక ఘట్టం, ప్రేక్షకుల గుండెల్ని పిండేసింది. కథలో ఒక నటుడు, ప్రజలనుండీ పన్నులు రాబట్టే అధికారి వేషం వేశాడు. పాత్రననుసరించి చాలా క్రూరంగా నటిస్తూ, కొందరు స్త్రీ పాత్రధారిణుల స్తనాలకు చిడతలు బలవంతంగా తగిలించి, వాళ్ళు దయనీయంగా యేడుస్తుంటే చూడలేక కాళ్ళా వేళ్ళా పడుతున్న వాళ్ళ భర్తలను..’మీరు పన్నులు సకాలానికి చెల్లించక పోతే, పాలకులం మేము ఊరికే కూర్చుంటామనుకున్నారా? మీనుంచీ పన్నులు రాబట్టే మార్గం మాకు తెలుసు బాగా…’ అని మరింత వికటంగా నవ్వుతున్నాడు. ఈ దృశ్యం, చూస్తూ, వీర నరసింహరాయలు ఉడికిపోతున్నాడు. ‘ఆపండి మీ ప్రదర్శన.. ఇదెక్కడి న్యాయం? ఇదేమి కల్పన? ఇలా ప్రదర్సించి పాలకులను అవమానపరుస్తారా మీ భాగవతులు? మీరేదో బాగా చదువుకున్నారని, మా అంత:పురంలో ప్రదర్శన యేర్పాటు చేస్తే, మీరు మా రాజులనే అవమానపరచే కల్పనలిలా చేస్తూ, నా యెదుటే నిలబడిఉన్నారా ఇంకా? ‘ అని ఆవేశంగా మాట్లాడుతున్నాడు. ప్రదర్శన ఆగిపోయింది. కూచిపూడి భాగవతుల నాయకుడు ముకుళిత హస్తాలతో రాయలవారి ముందు నిల్చున్నాడు. ‘ప్రభూ ! మిమ్ములనవమానపరచే ఉద్దేశం లేదు మాకు..కనీ ఇది వాస్తవం. సిద్ధవటం (కడప జిల్లా) సీమలో సమ్మెట గురవరాజు అనే పరిపాలకుడున్నాడు మహారాజా! అతను ఇలాంటి క్రూర విధానాలతో ప్రజలను పీడిస్తూ, పన్నులు రాబడుతున్నాడు. మేము ఇక్కడికొచ్చేముందు అక్కడి ప్రజల ఇక్కట్లను చూసి ఎంతో బాధపడ్డాం. ఆ ప్రాంతంలోని అన్యాయాన్ని మీ దృష్టికి తెచ్చేందుకే, మ ప్రదర్శనలో ఆ అంశాన్ని చేర్చాము ప్రభూ..మాది నేరమైతే. మమ్మల్ని శిక్షించండి. కళలు కేవలం మనోరంజనానికెే కాక, సమజ హితవుకోసమని కూడా మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. అందుకే మీ యెదుట ఇలా అక్కడి పరిస్థితిని ప్రదర్శించాము. ఇక అక్కడి ప్రజలను ఆ దుష్ట పాలకుని కబంధ హస్తలనుంచీ యెల మీరు కాపాడుతారో, మీ ఇష్టం..’ అని చేతులు జోడించి నిలబడ్డాడు. ఇంకేముంది? కూచిపూడి భాగవతుల సమయస్ఫూతికి వీర నరసింహరాయలు మెచ్చుకుని, తగురీతిని గౌరవించి, వెంటనేసమ్మెట గురవరాజు మీద దండెత్తి, అతన్ని శిక్షించి, ప్రజలను రక్షించాడు. ఇది అలనాటి కైఫియత్తులోనూ ఉటంకించబడింది. (వాగ్గేయకారులు – పదకృతి సాహిత్యం.డా.పుట్టపర్తి నారాయణాచార్యులు – 63వ పుట)

కవులనేవారు, సమాజంలోనివారే! వేరెక్కడినుండో ఊడిపడరు కదా ! సమాజంలో తమ దృష్టిని ఆకర్షించినవాటికి కూడా చోటిస్తారు తమ నిశిత దృష్టిని ఋజువు చేసుకుంటూ!! ప్రాకృతసాహిత్యంలోని యీ ఉదాహరణ మచ్చుకు:

‘దుగ్గ అ అట్ఠీ కహణు మే ధో ఇ యేణ సోఢవ్వా

దసి ఓసరంత సలిలేణ ఉ అ హ దుణ్ణం వ పడయేణ ‘

ఒక బీద వ్యక్తి చిరిగి పీలికలైపోయిన పాత పంచెను చెరువు గట్టున ఉతుక్కుంటున్నాడు. అసలే చిరిగిపోయి ఉంది. మరీమరీ బండకేసి బాదుతున్నాడా వ్యక్తి. దానిలోంచీ నీళ్ళు కారుతున్నాయి. గట్టున నిల్చునివున్న ఒక ప్రాకృత కవికీ దృశ్యం కనిపించింది. వెంటనే ఓ కవిత స్ఫురించిందిలా ‘ఎన్నిమార్లు నన్ను బండకేసి ఉతుకుతావయ్యా బాబూ ! చిరిగి పీలికలైపోయాను కదా ! నన్నొదిలిపెట్టు మహాప్రభో ! ‘ అంటూ ఒక బీదవాని పాత పంచె యేడుస్తున్నదేమో అన్నట్టు,ఆ పాత పంచె నుంచీ నీళ్ళు కారుతున్నాయి ‘ అనేశాడు. యెంతటి సహజాలంకారం ! ఎంత వేదనాభరిత వర్ణన! ఎప్పటి హాలుడు? ఎప్పటి గాధాసప్తశతి ? ఆనాడూ కడు దారిద్ర్యాన్ని అనుభవించే వర్గాలవారున్నారనేందుకీ గాధే జీవంతమైన ఉదాహరణ కాదూ? అగ్గిపుల్లా, సబ్బుబిళ్ళాయే కాదు, పాత పంచె కూడా కవితావస్తువేనని రెండువేల ప్రాకృత కవో చెప్పేశాడిలా. హాలుడు సేకరించి కూర్చిన 200బీసీ నాటి ఆర్యా వృత్త రచనల్లో ఇలాంటి రచనలు కోకొల్లలు.

సాహిత్య చరిత్రలో కాస్త అడుగు ముందుకేద్దాం. తెలంగాణా ప్రాంతం గేయసాహిత్యానికి పునాది వేసింది. బానిసత్వం, వెట్టి చాకిరీ లాంటి దురాచారాలను తలంగాణావాడైన పాల్కురికి తన బసవపురాణంలో ఉటంకించాడు. (బసవ-పుట 309) బానిసలను కాపలా కుక్కల్లా చూసేవారనీ, వివిధ మతానుయాయుల మధ్య వాదోపవాదాలు నడిచేవనీ,అప్పట్లో దొంగతనాలు చేసేవారీ వస్తువులు వాడేవారనీ కూడా పాల్కురికి వర్ణించాడు. అంటే, పాల్కురికిలో సామాజిక దృష్టికోణం పుష్కలంగా ఉండేదన్నమాటే కదా !

‘పరబ్రహ్మమొక్కటే, మాది గొప్ప, మాది గొప్ప అని కొట్టుకు చావకండహో ‘ అన్న అన్నమయ్యా, ‘ఎప్పుడూ పాలూ, వెన్నముద్దలేకాదు, నలా రాగిసంగటినీ తిని చూడు, అప్పుడు చూస్తానీ నీల్గు ‘అని తన బీదరికాన్ని పదాల్లో పొదివిన సారంగపాణీ, సాలెవారి వృత్తిని తన స్వామికి సరదా పాటగా పరిచయం చేసిన రాకమచెర్లా…ఇంకా చాలామంది రచనల్లో సామాజిక స్పృహ, వర్షాకాల నదిలా పరవళ్ళు తొక్కుతూ దర్శనమిస్తుంది. వాళ్ళెవరూ, దండోరావేస్తూ చాటించుకోలేదు, ‘మా నిశితదృష్టి ఇలా ఉంది, గమనించండి ‘ అని. మాణీక్యాలూ, వజ్రాలను మనమే వాటి విలువ తెలిసి గుర్తించి గౌరవించాలి. లేదా నష్టం మనకేనని గుర్తించాలి. ఏమంటారు?

…………………..

ఆకుదొక కథ!

రచన:లక్ష్మీదేవి

నేనిక్కడికెప్పుడు వచ్చానో, ఇంత అందమైన ప్రపంచంలోకి ఎలా చేరానో మరి, చల్లగాలిలో అమ్మ కొమ్మ తాను ఊగుతూ నన్ను ఉయ్యాలలూపుతోంది. నా చుట్టూ నా తోబుట్టువులు సంతోషంగా కనిపిస్తున్నారు. అప్పుడే రాలిన చినుకులలో తడిసి మరింత కొత్తగా మెరిసి పోతున్నారు. ఎన్ని ముఖాలో, ఎన్ని ఆకారాలో, వాటిల్లో ఎన్ని వికారాలో! చుట్టూ జరిగేదాన్ని గమనిస్తూ , ఆలోచిస్తూ ఉండడమే నా స్వభావం.
ఆకాశపుటంచులనుండి నా స్నేహితులు మమ్మల్నంతా ఆనందతరంగాల్లో ముంచేయడానికి అప్పుడప్పుడూ వస్తుంటారు. వారికోసమే మా ఎదురుచూపులు. సంవత్సరమంతా ఎదురుచూసేది ఒక్క శలవుల పండగల కోసమే. వారికి శలవు దొరికినపుడు వచ్చేస్తారు. ఆ ఆనందం ఎంత గొప్పగా ఉంటుందంటే ఒక్కోసారి మేమంతా అందులో మునిగే పోతాము. ఇంకోసారి లోకాన్ని మరచి తేలే పోతాము.
ఏమైనా మా ఎదురుచూపులు ఆగవు. ఊపిరి ఆగేవరకూ ఆగవు. ఒక్కసారి వారు వస్తున్న బండ్ల దీపాలు, మ్రోతలు పైనుంచీ వినపడగానే, కనపడగానే మా గుండెలు మ్రోగుతాయి, ప్రతిస్పందనగా. అందరం చేతులూ ఆడిస్తూ, నాట్యాలాడుతూ స్వాగతం పలుకుతాము మా మిత్రులకు.
ఒక్కోసారి ఇంకెక్కడికో వెళుతూ చుట్టపుచూపుగా అలా చూసి వెళ్ళిపోతారు వాళ్ళు. అప్పుడు కూడా మేం వారిని నిందించము. ప్రతీసారీ సరిక్రొత్తగా అనిపించే మరిచిపోలేని పరిమళాలతో స్వాగతాలు పలుకుతాము.
మా స్నేహితులు ఒక్కొక్క సారి ఎన్ని రోజులో ఉంటారు మాతోపాటు. ఆడుతూ, పాడుతూ, దోబూచు లాడుతూ, నవ్విస్తూ, ఏడిపిస్తూ మాతో కలిసి చేసే అల్లర్ల కోసం లోకమే ఎదురుచూస్తుంది. నిజానికి మేముంటేనే వాళ్ళు, వాళ్ళుంటేనే మేము ఉండగలిగేది. వాళ్ళెప్పటికీ రానిచోట్ల మేం జీవించనేలేము. మా ఉనికే లేనిచోటకు వాళ్ళు రమ్మన్నా రారు. తెలుసా! అంత గొప్ప స్నేహబంధం మాది. అంతులేని దూరాలున్న నింగిని , నేలను కలిపే బాంధవ్యం మాది. ఆ కర్తవ్యమూ మాదే.
అరె, అదేమిటి ఆ చివరనున్న మా పెద్దన్న అలా పాలిపోయిన ముఖంతో దీనంగా కనిపిస్తున్నాడే? ఏమయిందో తనకు? చలేస్తుందేమో చినుకులలో తడిసి వీస్తున్న గాలివల్ల! అయ్యో , నేను చూస్తూ ఉండిపోతున్నానే ఏమీ చేయలేకపోతున్నానే, తన కెంత బాధగా ఉందో తనూ మాతో పాటు ఆటపాటలలో పాల్గొనలేకపోతున్నందుకు. నాకైతే తననూ చేయి పట్టుకొని లాక్కొని రావాలనుంది.
మా చిన్ని తమ్మునికివేమీ పట్టవు. తన లోకమే తనది. అక్కచెల్లెళ్ళతో దోబూచులాటలు, వాళ్ళకు కావలసినవి ఎండల్లో వానల్లో కూడా తెచ్చివ్వడం , అమ్మకొమ్మను మురిపించడమే వాడి ప్రపంచం.
అల్లంత దూరంలో ఉన్న మా అన్నకు నేనే సాయమూ చేయలేకపోతున్నాను. ఏమవుతుందో ! ఏమయిపోతాడో! ఎవరు నాకు సరైన సలహా ఇవ్వగలరు? నేనెవర్ని అడగగలను? ఎవర్ని నమ్మగలను? అయ్యో, సమయము మించిపోతున్నది. అల్లల్లాడి పోతుంటే చూడలేకపోతున్నాను.
అన్నా, నిన్ను చూసే నేను పెరిగాను. నీతోనే ఆటపాటలు నేర్చుకున్నాను. నాకే సందేహం వచ్చినా భయపడినా నా దిక్కు నీవేనని నీవైపు చూస్తుంటాను. మరి ఈ పొద్దు నీకే ఇంత కష్టం వచ్చిందే? నేనేమి చెయ్యాలి? నా వల్ల ఏమవుతుంది? ఈ రోజు నా స్నేహితుల పలకరింపులు కూడా నాకు ఉల్లాసం కలిగించలేకపోతున్నాయి. నా దృష్టి అంతా నీమీదే ఉంది.
ఆ..అయ్యయ్యో! అయ్యో! ఏమవుతోంది! అమ్మ కొమ్మను వీడి, మా అన్న ఎక్కడికి వెళ్తున్నాడు? అంతేనా, ఇలా రాలిపోవడమే జీవితానికి ముగింపా? ఇందుకోసమేనా ఇన్ని మురిపాలు, ముచ్చట్లు! ఒకనాడంతా ముగిసిపోతుందా? ఈ లోకమంతా నాదేనంటూ, నేను లేకపోతే లోకానికే ఉనికి లేకుండా పోతుందేమో నన్నంతగా ఈ లోకాన్ని ప్రేమించానే? చుట్టూ ఉన్నవాళ్ళంతా నాకోసమే, నేను వాళ్ళ కోసమే అనుకున్నానే. ఇదంతా నాటకం ముగిసినట్టు ఒకనాడు ముగిసిపోతుందా? ఇలాగే తెరపడిపోతుందా?
గాలిలో తేలుతూ రాలుతూన్న అన్న గొంతు గాలివాటుగా వినిపిస్తోంది.
“లేదు తమ్ముడూ! ఈ నాటకానికి ఆది, అంతూ ఉండవు. తెర పడడం మళ్ళీ లేవడానికే. లేచిన కెరటాలు పడక మానవు, పడిన కెరటాలు ఉవ్వెత్తున లేవకా మానవు. కేవలం ఒకరి తర్వాత ఒకరు పాత్రలుగా వచ్చి వారి వంతు నాటకం పోషించి తెరవెనక్కు వెళ్తుంటాము.
అంతేకాదు. నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నానని బాధపడకు. అమ్మ కొమ్మను వీడుతున్నానని బెంగపెట్టుకోకు. వీడితే ఎక్కడికెళతాను? అమ్మలనందరినీ గన్న అమ్మ ఈ భూమమ్మ ఒడిలోకే కదా చేరుతున్నాను. మళ్ళీ వస్తాను. ఈ భూమమ్మ నన్ను, నాలాంటి తన మనవళ్ళను,మనవరాళ్ళను అందరినీ చూడాలనిపించి పిలిపించుకుంటుంది. ఎప్పుడో అమ్మకు పురుడు పోసినపుడు కదా చూడడం! మరి చూడాలని ఉండదూ మనవలను?
మన అన్న దమ్ములను, అక్కచెల్లెండ్రను పిలిపించుకొని, ముద్దుమురిపాలతో తన దగ్గర ఉంచుకొని, మళ్ళీ సుష్ఠు గా మనలను తయారుచేసి మళ్ళీ ఇక్కడికే గదా పంపుతుంది? నీకు నాపై, నాకు నీపై మనకు మన లోకం అన్న మోహాలున్నంత వరకూ ఇలాగే వచ్చిపోతుంటాము.
ఈ సత్యాన్ని తెలుసుకోవడం కాక ఆకళింపు కూడా చేసుకొన్న రోజున ఇక భూమమ్మ తనలోనే కలిపేసుకుంటుంది. కొండలుగా, బండలుగా, మట్టిలో మట్టిగా కలిపేసుకుంటుంది. అప్పుడు నీవు, నేను అనే కాదు మొత్తం విశ్వమే మనము, మనమే విశ్వము అన్న పెద్ద మాటలు కూడా అర్థమౌతాయి. “
మాటలన్నీ ముగిసిన వేళ భూమమ్మ ఒడిలో గెంతులేస్తూ ఆడుతున్న అన్న కనిపించాడు.

—–అంతే——-

కథకుడు – పచ్చటి లేతాకు.

ఆకాశపుటంచు నుంచి వచ్చే స్నేహితులు—చినుకులు.
బండ్ల మ్రోతలు, దీపాలు- ఉరుములు, మెరుపులు.
మరిచిపోలేని పరిమళాలు- తొలకరిలో మట్టి పరిమళాలు.
పెద్దన్న—రాలబోయే పండుటాకు/ఎండుటాకు.
చిన్ని తమ్ముడు –చిగురుటాకు.
అక్కచెల్లెళ్ళు—పువ్వులు,మొగ్గలు.
కావలసినవన్నీ తెచ్చివ్వడం—పత్రహరితపు ఆహారం.
అమ్మ—కొమ్మ
అమ్మలందరినీ గన్న అమ్మ-భూమమ్మ- భూమి
*****